Jump to content

నారాయణీయము/చతుర్థ స్కంధము/19వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
చతుర్ధ స్కంధము

19వ దశకము - ప్రాచేతసుల కథ వర్ణనం<

19-1-శ్లో.
పృథోస్తు నప్తా పృథుధర్మకర్మఠః ప్రాచీనబర్హిర్యువతౌ శతద్రుతౌ।
ప్రచేతసో నామ సుచేతసః సుతానజీజనత్ త్వత్కరుణాంకురానివ।।
1వ భావము
‘ప్రాచీన బర్హి‘ పృథు చక్రవర్తి మునిమనుమడు. ఇతడు కూడా పృథు చక్రవర్తివలె ధర్మకార్యనిరతుడు. యజ్ఞయాగాది క్రతువులను నిష్ఠగా ఆచరించువాడు. ఇతని భార్య ‘శతద్రుతి‘. వారికి ‘ ప్రచేతసులు‘ అను పదిమంది పుత్రులు కలిగిరి. ప్రభూ! నీ (నారాయణ) కరుణ అను బీజమునుండి అంకురించిన వీరు ధర్మవర్తనులు, ఉత్తములు.

19-2-శ్లో.
పితుస్సిసృక్షానిరతస్య శాసనాత్ భవత్తపస్యాభిరతా దశా౾ పితే।
పయోనిధిం పశ్చిమేత్య తత్తటే సరోవరం సందదృశుర్మనోహరమ్।।
2వ భావము
సృష్టిరచనయందు గల ఆసక్తితో ‘ప్రాచీన బర్హి‘ తనకుమారులగు ప్రచేతసులను - మనుజులను సృష్టించవలసినదిగా ఆదేశించెను. అప్పుడు ‘ప్రచేతసులు‘ తమ తండ్రి ఆజ్ఞానుసారము నీ (నారాయణుని) కొరకై తపస్సాచరించుటకు పశ్చిమ సముద్రతీరమును చేరి అచట మనోహరమైన ఒక సరోవరమును చూచిరి.

19-3-శ్లో.
తదాభవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేవకదర్శనాదృతః।
ప్రకాశమాసాద్య పురః ప్రచేతసాముపాదిశద్భక్తతమస్తవ స్తవమ్।।
3వ భావము
ఆ మనోహరమైన సరోవరమును చేరిన, నీ భక్తులగు ‘ప్రచేతసులును' చూడవలెనని ‘శంకరుడు‘ వారికి సాక్షత్కరించెను - వారికి నీ స్త్రోత్రమును ఉపదేశించెను. వాసుదేవా! ఆ శంకరుడు నీకు ప్రియమైనవాడు (నీ భక్తుడు).

19-4-శ్లో.
స్తవం జపంతస్తమమీ జలాంతరే భవంతమాసేవిషతాయుతాం సమాః
భవత్సుఖాస్వాదర సాదమీష్వియాన్ బభూవ కాలో ధ్రువవన్న శీఘ్రతా।।
4వ భావము
'ప్రచేతసులు' ఆ సరోవరమున నారాయణ స్తవమును పఠించుచు , నీ ఆరాధనలోఆనందానుభూతిని పొందుచూ, పదివేల సంవత్సరములు తపమాచరించిరి. ధ్రువుని వలె వీరి తపస్సు శీఘ్రమే ముగియలేదు.

19-5-శ్లో.
తపోభిరేషామతిమాత్రవర్ణభిః స యజ్ఞహింసానిరతో౾పి పావితః।
పితా౾పి తేషాం గృహయాతనారద ప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ।।
5వ భావము
అట్లు ‘ప్రచేతసులచే‘ దీర్ఘకాలము ఆచరింపబడిన వారి తపఃప్రభావము క్రమముగా వృద్ధినొంది, వారి తండ్రియగు ‘ప్రాచీన బర్హి‘ యజ్ఞయాగాదులలో జరిపిన హింసాత్మక జంతుబలుల కారణముగా ప్రాప్తించిన అతని పాపమును కూడా హరించివేసెను. అప్పుడు, నారదుడు ‘ప్రాచీన బర్హి‘ గృహమునకేతించి అతనికి ఆత్మజ్ఞానమును భోదించెను. ఆత్మజ్ఞానమును పొందిన ‘ప్రాచీనబర్హి‘ ప్రభూ! నీలో ఐక్యమయ్యెను.

19-6-శ్లో.
కృపాబలేనైవ పురః ప్రచేతసాం ప్రకాశమాగాః పతగేంద్రవాహనః।
విరాజిచక్రాదివరాయుధాంశుభిః భుజాభిరష్టాభిరుదంచితద్యుతిః
6వ భావము
దేవా! ‘ప్రచేతసులు‘ అట్లు పదివేల సంవత్సరములు తపము చేసిరి. నీవు వారిని కరుణించి, గరుడవాహనుడవై, అష్టభుజములతో ప్రకాశించుచూ, చక్రము తదితర ఆయుధములము ధరించిన - మిక్కిలి కాంతివంతమైన నీ రూపమును (శ్రీ మహావిష్ణువు గా) వారి ఎదుట సాక్షాత్కరింపజేసితివి.

19-7-శ్లో.
ప్రచేతసాం తావదయాచతామపి త్వమేవ కారుణ్య భరాద్వరానదాః।
భవద్విచింతా౾పి శివాయ దేహినాం భవత్వసౌ రుద్రమతిశ్చ కామదా।।
7వ భావము
దేవా! ‘ప్రచేతసులును' కరుణించిన నీవు, వారు ఏమియూ కోరుకొనకక పూర్వమే వారికి వరమును ప్రసాదించితివి. ‘వారిని (ప్రచేతసులను) తలచినంత మాత్రముననే జీవులకు శుభము కలుగుననియు; మరియు శివుని రూపమున ప్రచేతసులకు (నీచే) ఉపదేశింపబడిన “రుద్రస్తుతి“ సకలాభీష్టదాయకము కాగలదనియు వారికి వరమునొసంగితివి.
.
19-8-శ్లో.
అవాప్య కాంతాం తనయాం మహీరుహాం తయా రమధ్వం దశలక్షవత్సరీమ్।
సుతో౾స్తు దక్షో నను తత్క్షణాచ్చ మాం ప్రయాసస్యథేతి న్యగదో ముదైవతాన్।।
8వ భావము
అంతియేకాక - ‘వారు (‘ప్రచేతసులు‘ ) వృక్షముల పుత్రికను పత్నిగా పొందుదురనియు, పది లక్షల సంవత్సరములు సుఖముగా జీవించుదురనియు , ప్రభూ! నీవు వారిని దీవించితివి. ‘దక్షుడు‘ వారికి పుత్రుడుగా కలుగుననియూ, ఆ పిమ్మట వారు నిన్ను (శ్రీ మన్నారాయణుని) చేరగలరనియు పలికి వారికి ఆనందమును కలిగించితివి.

19-9-శ్లో.
తతశ్చ తే భూతలరోధినస్తరూన్ క్రుధా దహంతో ద్రుహిణేన వారితాః।
ద్రుమైశ్చ దత్తాం తనయామవాప్య తాం త్వదుక్తకాలాం సుఖినో౾భిరేమిరే।।
9వ భావము
ఆ సమయమున వృక్షములు భూతలమునంతనూ ఆక్రమించుండెను. అది చూచిన - ‘ప్రచేతసులు‘ ఆగ్రహించి, ఆ వృక్షములను తునుమాడసాగిరి. అదిచూచిన బ్రహ్మదేముడు వారిని వారించెను. అప్పడు ఆ వృక్షములు వారి పుత్రికను ‘ప్రచేతసులకు‘ పత్నిగా ఇచ్చెను. ‘ప్రచేతసులు‘ ఆ వృక్షముల పుత్రికను భార్యగా స్వీకరించి నీవు నిర్దేశించినంతకాలము సుఖముగా జీవించిరి.

19-10-శ్లో.
అవాప్య దక్షం చ సుతం కృతాధ్వరాః ప్రచేతసో నారదలబ్దయా ధియా।
అవాపురానందపదం తథావిధస్త్వమీశః వాతాలయనాథ! పాహిమామ్।।
10వ భావము
కాలక్రమమున ‘ప్రచేతసులకు‘ దక్షుడు జన్మించెను. ప్రచేతసులు - అనేకయాగములను ఆచరించి, నారదుని ఉపదేశముతో ఆత్మజ్ఞానులై పరమపదమును పొందిరి. భక్తులను అనుగ్రహించు - ఓ గురవాయూరు పురాధీశా! నన్ను రక్షింపుము.


చతుర్థ స్కంధము పరిపూర్ణం
19వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 16:01, 9 మార్చి 2018 (UTC)