నారాయణీయము/పంచమ స్కంధము/20వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||

పంచమ స్కంధము[మార్చు]

20వ దశకము - ఋషభుని చరితము వర్ణనం

20-1-శ్లో.
ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతాదాగ్నీధ్రరాజా దుదితో హి నాభిః।
త్వాం దృష్టవానిష్టదమిష్టిమధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞకర్మా।।
1వ భావము
స్వాయంభువుమనువు కుమారుడైన ప్రియవ్రతుని ప్రియపుత్రుడు అగ్నీధ్రుడు. ఈ అగ్నీధ్రుని పుత్రుడు ‘నాభి‘. ప్రభూ! ‘నాభి‘ నీ అనుగ్రహము కొరకు (పుత్రార్థియై) యజ్ఞము నాచరించెను. అప్పుడు - నీవు ప్రసన్నుడవై శ్రీమహావిష్ణువుగా ‘నాభికి‘ యజ్ఞవాటిక నడుమ సాక్షాత్కరి౦చితివి.

20-2-శ్లో.
అభిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞః స్వతుల్యం సుతమర్థ్యమానః।
స్వయం జనిష్యే౾హమితి బ్రువణాస్తిరోదధా బర్హిషి విశ్వమూర్తే!।।
2వ భావము
అట్లు నీవు సాక్షత్కరించగా మునీశ్వరులు నిన్ను స్తుతించిరి. తమ రాజైన ‘నాభి‘కి ' తగిన పుత్రుని ప్రసాదించమని – ప్రభూ! నారాయణమూర్తీ! వారు నిన్ను ప్రార్థించిరి. అంతట నీవు- “నేనే ‘నాభి‘కి పుత్రునిగా జన్మింతునని" పలికి అంతర్ధానమైతివి.

20-3-శ్లో.
నాభిప్రియాయామథ మేరుదేవ్యాం త్వమంశతో౾ భూః ఋషభాభిదానః।
అలోకసామాన్యగుణ ప్రభావ ప్రభావితాశేషజనప్రమోదః
3వ భావము
‘నాభి‘ ప్రియపత్ని ‘మేరుదేవి‘. ‘ఋషభుడు‘ అను నామముతో, అలౌకిక గుణసంపన్నుడిగా నీవు వారికి పుత్రునిగా జన్మించితివి. నీ గుణ ప్రభావముతో - సకల జనులకు ఆనందము కలిగించితివి.

20-4-శ్లో.
త్వయి త్రిలోకీభృతి రాజ్యభారం నిధాయ నాభిః సహ మేరుదేవ్యా।
తపోవనం ప్రాప్య భవన్నిషేవీ గతః కిలానందపదం తే।।
4వ భావము
ముల్లోకములను రక్షించు నారాయణమూర్తీ! ‘ఋషభ‘ నామముతో నీవు జన్మించి, నీ తండ్రియైన ‘నాభి‘కి, ఆనందము కలిగించితివి. సంతృప్తుడైన ‘నాభి‘ , ఋషభుడుని రాజ్యపాలకుని గావించి, పత్నీ సమేతముగా తపోవనమున కేగెను. అచట తన శేషజీవితమును భగవత్సేవలో గడిపి శాశ్వతమయిన పరమపదమును పొందెను.

20-5-శ్లో.
ఇంద్రస్త్వదుత్కర్షకృతాదమర్షాత్ వవర్ష నాస్మిన్నజనాభవర్షే।
యదా తదా త్వం నిజయోగశక్త్యా స్వర్షమేనద్వ్యదధాః సువ్షమ్।।
5వ భావము
‘ఋషభుడు‘ తన సుగుణములచే కీర్తివంతుడగుటను చూచి ఇంద్రుడు సహించలేకపోయెను. ఇంద్రుడు (అసూయతో) - ‘ఋషభుని‘ రాజ్యమగు ‘అజనాభ వర్షమున‘ - వర్షాభావ పరిస్థితిని కల్పించెను. అప్పుడు ప్రభూ! ‘ఋషభుని ‘ రూపముననున్న నీవు నీయోగశక్తితో వర్షము కురిపించి ‘అజనాభ వర్షమును‘ సస్యశ్యామలము గావించితివి.

20-6-శ్లో.
జితేంద్రదత్తాం కమనీం జయంతీమథోద్వహన్నాత్మరతాశయో౾పి।
అజీజనత్ తత్ర శతం తనూజాన్ యేషాం క్షితీశో భరతో౾గ్రజన్మా।
6వ భావము
తన తప్పెరిగిన దేవేంద్రుడు (వినమ్రుడై), సౌందర్యవతి యగు తనకుమార్తె, 'జయంతిని' నీకు (ఋషభునకు) ఇచ్చి వివాహము చేసెను. " ప్రభూ! భగవదర్పితమైన ఆత్మలతో లయము పొందు ఆత్మారాముడివి నీవు". అట్టి నీవు, 'జయంతిని' వివాహమాడగా; మీకు నూరుగురు పుత్రులు కలిగిరి. వారిలో అగ్రజుడు 'భరతుడు'; నీ తదనంతరము 'అజనాభ వర్ష' రాజ్య పాలకుడయ్యెను. ఆ'భరతుని' నామముననే 'అజనాభ వర్షము' కాలక్రమమున 'భరత వర్షమని' పేరొందెను.

20-7-శ్లో.
 నవాభవన్ యోగివరా నవాన్యే త్వపాలయన్ భారతవర్షఖండాన్।
సైకాత్వశీతిస్తవ శేషపుత్రాస్తపో బలాత్ భూసుర భూయమీయుః।।
7వ భావము
ఋషభుని పుత్రులలో తొమ్మండుగురు యోగీశ్వరులైరి; తొమ్మిదిమంది 'భరత వర్షము' లోని, రాజ్యభాగములను పరిపాలించిరి. మిగిలిన ఎనుబదిఒక్క మంది తపోబలమున బ్రాహ్మణత్వమును పొందిరి.

20-8-శ్లో.
ఉక్త్వా సుతేభ్యో౾థ మునీంద్రమధ్యే విరక్తిభక్త్యన్వితముక్తిమార్గమ్।
స్వయంగతః పారమహంస్యవృత్తిమధా జడోన్మత్తపిశాచచర్యామ్।।
8వ భావము
'భరతునికి' రాజ్యభారము నొసగిన పిదప - నీవు మునీశ్వరుల నడుమ జీవనము గడుపుచూ, నీ పుత్రులకు - భక్తి, వైరాగ్య, జ్ఞాన సమన్వితమగు ముక్తి మార్గమును ఉపదేశించితివి. ప్రభూ! నీవు స్వయముగా 'పరమహంస స్థితిని' పొంది - జడునివలె, ఉన్మత్తునివలె, పిశాచగ్రస్థునివలె సంచరించితివి.

20-9-శ్లో.
పరాత్మ భూతో౾పి పరోపదేశం కుర్వన్ భవాన్ సర్వనిరస్యమానః।
వికారహీనో విచచార కృత్స్నాం మహీమహీనాత్మరసాభిలీనః।।
9వ భావము
ప్రభూ! స్వయముగా 'ఋషభుని' రూపమును ధరించిన పరమాత్మవు నీవు. ( పరమాత్మవే) అయిననూ, పరమహంస స్థితిని పొంది, నీవు - పరతత్వమును బోధించితివి. ఇతరులు( పామరులు) నిన్ను నిరాదరించినను, పరాభవించినను ఎట్టి మనోవికారమునకూ లోనవక, పరమోన్నతమగు పరతత్వ విచారణ యందు ఆనందము ననుభవించుచూ భూతలమున సంచరించితివి.

20-10-శ్లో.
శయువ్రతం గోమృగకాకచర్యాం చిరం చరన్నాప్యపరం స్వరూపం।
దవాహృతాంగః కుటకాచలే త్వం తాపాన్మ మాపాకురు వాతనాథః।।
10వ భావము
'ఋషభుడు', దేహభ్రాంతిని వీడి - కొంతకాలము కొండచిలువ వలెను, మరికొంతకాలము గోవువలెను, మృగము(లేడి)వలెను, ఇంకొంతకాలము వాయసము(కాకి)వలెను గడుపుచూ- పరతత్వములోని ఆనందానుభూతిని అనుభవించుచు సంచరించి, 'కుటక' పర్వతమున రగులు మంటలలో శరీరమును త్యజించెను. గురవాయూరుపురాధీశా! - ఓ పరమాత్మా! నా రోగ తాపమును హరించమని నిన్ను ప్రార్ధించుచున్నాను.



పంచమ స్కంధము
20వ దశకము సమాప్తము.

-x-

Lalitha53 (చర్చ) 16:03, 9 మార్చి 2018 (UTC)