Jump to content

దశరథరాజనందనచరిత్ర/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

దశరథరాజనందనచరిత్ర

పంచమాశ్వాసము

క.

శ్రీనీళాస్తనకలశా
నూనపటీరాతిరంజిలోరస్స్థల! స
మ్మానితనామస్మరణగు
ణానర్దజనాంహ! కర్పరాద్రినృసింహా!

1


వ.

అత్తఱిని గథాసరణి యెట్లంటేని.

2


ఆ.

అన్నచేతహాటకాలంక్రియల్ శాటి
కల్ గ్రహించి హర్షకంధిఁ దేలి
కలశకర్ణదితిజకర్త దిశల్ సంచ
లించ నాగ్రహించి లేచి నిలిచె.

3


చ.

తనతలఁ దాకి నింగి గ్రహతారక లట్టిటుఁ దూలరాల హె
చ్చిన చరణాగ్రఘట్టనలచే ధర యల్లలవాడ హస్తచా
లనగతిచే దిశల్ చిదికిలన్ లయకాలదినాధినాథనం
దన కఠినాకృతిన్ నిలిచె దాక నిశాచరకర్త యయ్యెడన్.

4


క.

ఇనకషణరత్నకీలిత
ఘననాతిశ్రేణి నేడగడ్త ల్గని చెం
గన జంగదాటె దాటిన
జననాయకసేనలెల్ల జాలం గదిలెన్.

5


ఆ.

అంతకంత శతసహస్రలక్షానంత
సంఖ్యలైన యద్రిచారిరేఖ
లెల్ల చెట్లచేత [1]ఱాలచే నేయంగ
[2]సాగి రాశలెల్ల సంచలించ.

6

వ.

అంత.

7


మ.

గద కేలన్ ధరియించి చండతరనిర్ఘాతాట్టహాసక్రియల్
చదలంటన్ జరణాగ్రమట్టనల నాశల్ దల్లడిల్లంగఁ దీ
క్ష్ణదిశల్ దీర్ఘదృగంచలాగ్నికణసంక్రాంతిన్ జరించంగ నా
త్రిదశారిం గని కీశసేన లధికార్తిన్ డాగె నాయాయెడన్.

8


క.

ఆతరణితనయ గిరిచర
నేత కఠిన[3]శిలలఁ దెచ్చి నెట్టన ఖచరా
రాతి శిరస్స్థలి నేసిన
ఘాత నెడం దెలియలేక గడ దెలిసి ధృతిన్.

9


తే.

కలశకర్ణనిశాచరకర్త కెరలి
త్రిశిఖసాధనధారియై తీక్ష్ణసరణి
హేళినందన హరికర్త నేసెఁ దాని
కి దితిజశ్రేణి గాంచి చెల్లాడి చనఁగ.

10


మ.

తనదారిన్ లయకాలచండశిఖినా దాకంగరాఁ దానిఁదాఁ
గని లీలం గరశాఖ నంది హరిరేఖల్ కీర్తనల్ సేయఁగా
దినరాణ్ణందనకీశకర్త యది యర్థిం గాళ్లచే నాని చ
య్యన గండ్రించె నిశాటసైన్యతతి యాహాకారతన్ జెందఁగన్.

11


క.

తనచేత నిరర్థకగతిఁ
గని దానికి కలశకర్ణఖచరారి ఘనా
ఘనగర్జలచే నిననం
దన హరి కేలం గ్రహించి తరలని దండిన్.

12


చ.

ఘనతరశక్తిచేఁ గలశకర్ణనిశాచరనేత యర్కనం
దనహరిచేఁ గ్రహించి యరతన్ ధరియించి చనంగఁ గాక నా
తని దృఢకర్ణనాసిక లధఃక్రియచే దెగనేసి యార్చి చ
క్కనెగికెఁ దారకాసరణిఁ గాంచి హరిత్తలకర్త లెన్నఁగన్.

13

క.

తనచెల్లెలినాసిక గీ
సినదానికి లజ్జ గన్న చెన్నటి యాహా!
తన [4]యాసలేని చెంగట
జననేర్చెనె యన్నఁ జేర జలియించకటా!

14


చ.

అనతదృగగ్నికీల లఖిలాశల నిండఁగ నిర్జరారి దా
రన దృఢనాసికాగళితరక్తజలార్ధశరీరయష్టియై
కనలి నయక్రియం దిరుగఁగా హరినాయకసేన లార్చి చె
ట్ల నచలశృంగగండశిలలన్ దెగనేయఁగసాగి రయ్యెడన్.

15


చ.

అలయక రాక్షసారి కలహాంగణధాత్రి ననేకశస్త్రఢా
కల ఘటకర్ణరాత్రిచరకర్త గదాంచితదీర్ఘహస్తశా
ఖలఁ దృణలీలలన్ బెరకి కాళ్ల దరట్టగ ద్రెంచి యానన
స్థలిం జితికించి నాల్కఁ దెగఁజాచిన గండ్రికఁ జేసి యల్కచేన్.

16


తే.

దాశరథి చండసాయకధారచేత
కలశకర్ణాదితేయాదికంఠనాళ
సంహరించిన హరికరాళనిహతాద్రి
సరణి ద్రెళ్లె దిగీశితల్ సంతసిల్లి.

17


క.

తల గెంటి సాగరాంత
స్స్థలి ద్రెళ్లిన యాస్యరంధ్రసరణిన్ జన[5]నీ
రలరంగ నిండ నల్గడ
లిలఁగన రాఁగ గదియసాగె నెన్నఁగ నంతన్.

18


తే.

అచ్చరల నర్తనక్రియ లతిశయిల్లె
నింగి నిస్సాణధణఢణల్ నిండె ఖగల
తాంతసంతతి జెడి తనరారె నష్ట
దిశల చీఁక ట్లడంగె నెంతేని గనఁగ.

19


క.

ఈరీతి దాయి దెగ లం
కారా జత్యార్తిఁ గలసి గాఢాగ్రహకీ

లారటితదేహియై త్రిద
శారాతిశ్రేణిఁ గలసి హళహళిచేతన్.

20


క.

అతికాయాదినిశాచర
తతి ననిచిన నేఁగి కలన దశరథతనయా
యతకాండాసనకాండా
హతిఁ ద్రెళ్లి దిశాధికర్త లలరఁగ నంతన్.

21


చ.

ఘనదశకంధరాజ్ఞ నతిగాఢరతిన్ హరిజిత్ఖరారి చ
య్యన హయదంతిసైనికశతాంగహళాహళికల్ నిశాటనా
ధనికరసాట్టహాసనినదక్రియ లెల్లెడ నిండిరాగ రా
చనెలలఁ దాకినంతటనె చండరణస్థలి యయ్యె నయ్యెడన్.

22


క.

ధృతి దాశరథి సదాగతి
హితదత్తశరాసనాస్త్రహృద్యతరరథ
క్షితి నిలిచి నింగి జలధర
తతి యండగ నెరసి చాల తహతహ లెసఁగన్.

23


ఆ.

కలయనాటిరేయి కటికిచీఁకటిఁ జేసి
జలధరాళియండ చక్క నిలిచి
కానరాక చండకాండధారలచేత
హరి నిశాటఘటల యరటడంచె.

24


చ.

అసదృశదాసకంఠఘనహస్తశరాసనశస్త్ర(ధారచే)[6]రాజిచే
నెసఁగఁగ చిత్తజ ల్లనఁగ [7]నేసినదానికి తాళలేక రా
క్షసతతి లంకదారిఁ జనసాగె హరీశిత లెన్న కానకే
నసి జెడి దైత్యహంతకడఁ జక్కఁగఁ డాగిరి జాలి నయ్యెడన్.

25


వ.

[8]అది గాక.

26


చ.

కలన నగారి [9]జిద్దితిజకర్త శనైశ్చరధారచేత రా
నెలల నశేషకీశతతి నెట్టన నిద్రలఁ జెందినట్టిలా

స్థలి నొరగంగ నేసిన యథాయథలై' గిరిశాసనాదిది
క్తలధరణీశితల్ చనిరి తారక లెల్లెడ జారె నయ్యెడన్.

27


క.

గిరిచరసేనల యారా
నెరసర్ల నిజాస్త్రధార నిశ్చలగతిచే
ధర ద్రెళ్లనేసి దశకం
ధరతనయఖరారి యార్చె దశదిశ [10]లదరన్.

28


వ.

అంత.

29


తే.

తిరిగి నిజరాజధానికి నఱిఁగి తండ్రి
కా జయక్రియ లెరుక సేయంగ నలరి
శక్రజిత్ఖచరారికి సరసకనక
శాటిక లలంక్రియల్ దెచ్చి చాల నిచ్చె.

30


వ.

అంత నిక్కడ.

31


సీ.

కన దస్త్రధార ద్రెళ్లిన యందఱఁ గాంచి
             యార్తిచే ఋక్షస్థిరాధినేత
తారాతనయకీశ దశకంఠదాయి రా
             క్షసకర్త యనసి నల్టాడ లరసి
యంజనానందనహరిఁ జేరి కీర్తించి
             ధనదాశ కేఁగి యాదారి కలశ
జలరాశి చెంగటఁ జంద్రాద్రిఁ గని దాని
             సంగడి గిరి గాంచి సారశక్తి
దనరఁగా శల్యకరణి సంధానకరణి
యాదియైన క్రియల్ దెచ్చి యఖిలశైల
చారిరేఖల రానెలసర్ల లెస్స
గాఁచి రక్షించరాదె యగణ్యచరిత!

32

వ.

ఈరీతి కార్యసరణిఁగాఁ జేయ నీచేతనేగాని యన్యసాథ్యచికిత్స గాదని
యనేకచర్యలఁ గీర్తించిన సంతసిల్లి దాని కంగీకరించి.

33


క.

ఆఋక్షనగాగ్రణి యా
జ్ఞారతిచే ననిలజాద్రిచారి ధనదధి
క్షీరజలరాశిదారిం
దారాస్థలి కెగసి చనియె ధైర్యస్థితిచేన్.

34


క.

అగచారికర్త నింగికి
నెగసి సరగజలధిరేఖలెల్లఁ గడఁచి చం
ద్రగిరిం గని యాచెంగటి
తగిన శిఖరిఁ జేరనేఁగెఁ దహతహచేతన్.

35


క.

ఏదారి శల్యసంధా
నాదికరణఘటనగాక యనిలజహరి యా
హ్లాదక్రియచే గిరిని య
నాదరగతి [11]కేలఁ దిగిచి యందినయంతన్.

36


చ.

కని ధృతి నడ్డగట్టిన ఖగచ్ఛటల న్నలిఁ జేసి యేఁగి చ
య్యన గిరి కేల దాలిచి నయక్రియ సంధిల నాజి ధిక్కరిం
చిన రజనీచరేశితల చండదిగంతనరేంద్రజాతకీ
ర్తన లలరంగ దెచ్చె దృఢధైర్యజయాతిశయస్థితిం దగన్.

37


వ.

అంత.

38


ఆ.

దాశరథిని యతనిదాయిహరిశ్రేణి
నహహ తెచ్చినట్టి యద్రిచేత
దీక్షఁ జేసి లెస్స రక్షించె నంజనా
జాతకీశనేత సాటి గలరె.

39


వ.

అయ్యెడ.

40

క.

అక్కడ దెచ్చినగిరిఁ దా
నక్కడనే యాంజనేయహరి దించి ధృతిన్
జక్కఁగ దిరిగి నరేశిత
చక్కఁగ నిలచె త్రిదశగణన సంధిల్లంగన్.

41


వ.

అయ్యెడ నింద్రదశఁదరణి కానఁగనైనఁ జారణశ్రేణిచే దాశరథి యతని
దాయి హరికర్తల్ దేరినజడ లాలించి శక్రజిత్ఖచరారిని నిందించి లంకా
నేత యాగ్రహించి.

42


ఆ.

కలశకర్ణతనయ ఖరనందనాదిని
శాటరాజి నాదశాస్యదితిజ
కర్త యాజి సేయఁగా నంచినంతనె
దాశరథి యరీంద్రతతి హరించె.

43


క.

తనసేనలెల్ల దశరథ
తనయాగ్రణిచేతఁ దెగిన దానికి గిరిశా
సనజిత్ఖగారి యాగ్రహ
జనితానలరటితహృదయజలజస్థలియై.

44


ఉ.

ఆనినకాకచే క్షితిధరాహితధిక్ఖచరారికర్త తాఁ
గాననధాత్రి కేఁగి యరిగంజనయజ్ఞరతి న్నటించ లం
కానరనేతదాయి యది గాంచి ధరాంతకరాజహేళికిన్
గానఁగఁ జేయఁజాల నతికాయనిశాచరహంత నంచినన్.

45


క.

అనిచిన యారాచనెలల్
గని హయరథశక్తిచేత గగనస్థలి క
ల్లన నెగసి యంచితాగ్రహ
జనితానలకీల లెసఁగ సాహసదృష్టిన్.

46


చ.

కలితనయాతిశాలి యతికాయనిశానరహంత చక్కఁగా
నలరిన యాంజనేయహరి యంనధరాస్థలి నింగి నంటఁగా
నిలిచి కరాళశస్త్రికల నేయ నగాహితజిత్ఖగారి రె
క్కలెడలినట్టియద్రియన గ్రచ్చఱఁ ద్రెళ్లె దిశల్ చలించఁగన్.

47

వ.

అయ్యెడ.

48


తే.

అష్టదిగ్రాజకీర్తన లతిశయిల్లెఁ
జారణానకదంధణల్ సందడిల్లె
నచ్ఛరల నర్తనక్రియ లలరె దాశ
కంఠి రణధాత్రి ద్రెళ్లినకతన నంత.

49


క.

ఘననాదరాక్షసాగ్రణి
యని ద్రెళ్ళినయట్టిజాడ యాలించి దశా
ననదైత్యకర్త యాగ్రహ
కనదాకృతి [12]లంక జెదఱఁగా ధర యదరన్.

50


సీ.

ఘనతరనిస్సాణగణధణంధణలచే
             జలరాశి నీరెల్ల గలయసాగ
నసిశాతనిస్త్రింశశతతళత్తళలచే
             గగనరత్నాకృతి గాసి గాఁగ
గంధరాధికనీలకదటిఘీంక్రియలచే
             దశదిశ లంతంత తల్లడిల్ల
ననతకంఖాణరింఖాగ్రఘట్టనలచే
             శేషాహిదృఢశిరశ్రేణి యగల
నఖలనిర్ఘాతధిక్కారి నిస్సహాట్ట
హాసలీలల [13]నచలాచూరి తలక
సంగరాంగణధాత్రి నేశంక లేక
కైకసేయనిశాచరకర్త నిలిచె.

51


తే.

నిలిచి తనదాయి రాకాసికలన గాంచి
యాచఁగాలేక చేశక్తి నార్చి యేసె
దాని నతికాయహంత యత్యంతదీక్ష
గండ్రికల్ జేసె జేసిన కలఁక రేగి.

52

క.

తనగృహిణితండ్రి దయ ని
చ్చిన ద్రిజగజ్జైత్రశక్తి చేదాలిచి స
య్యన నేసెన్ హరి రాక్షస
జననేతల్ చేష్ట లడఁగి జడియఁగ నంతన్.

53


ఉ.

కాలధనంజయాకృతి నఖండితచండశిఖాకణచ్ఛటల్
గ్రాలఁగ రాక్షసాగచరకర్తల కన్జెదరంగ నింగి జే
జే లెదఁ దల్లడిల్ల నతిశీఘ్రగతిం జని శక్తిఁ దాకినన్
దాళఁగలేక దాశరథిదాయి ధరాస్థలి ద్రెళ్లె నయ్యెడన్.

54


క.

ఇల ద్రెళ్లిన దాయిం గని
కలకం దాశరథి శస్త్రకలన నతనిహృ
త్స్థలి నాటఁగ రథహయతతి
నలిగా గండ్రించి యాచ్చె నల్దిశ లగలన్.

55


చ.

క్షితితనయాధికర్త తనచేతిశరాసనశస్త్రధారలన్
ధృతి దశకంఠదైత్యకరి తే రిల ద్రెళ్లఁగ నేయఁ గాకచే
నతఁ డెదఁ దాళజాలక రయక్రియచే నిజరాజధాని కా
యతగతి నేఁగసాగె హరిదంతనరేశిత లెన్న నయ్యెడన్.

56


సీ.

ఘనదేహయష్టిని గంట్ల నాటినజాడ
             రక్తకీలాలజాడల దిగంగ
దశశిరఃకీలితతతికిరీటశ్రేణి
             క్షితి జారి యెంతయుఁ జికిలి సేయఁ
దగనద్ది నట్టి నిద్దాలెనశాటికల్
             గండ్రలై యంతంత గాలినగరఁ
గరదండకాండనిర్గళితకాండాసన
             తీక్ష్ణశస్త్రిక లష్టదిశల కరఁగ
దిగధినాయకకిన్నరత్రిదశసిద్ధ
సాధ్యనాగాండజచ్ఛటల్ సంతసిల్ల

జెదరి దద్దర్లి లంకఁ జేరంగ నేఁగి
నిజగృహాంతరసంస్థితి నిలిచె నంత.

57


క.

చని యలయిక దేరఁగఁ జ
క్కన దశగళనిర్జరారి కాంచనసింహా
సనధరణి నిలిచి నిజగే
హిని జేరఁగ జీఱి కాక లెసఁగఁగ ననియెన్.

58


క.

ఎక్కడనైన న్గాంచిన
నక్కడనే తాటకారి యాకారకళల్
చక్కఁగ గానఁగ నయ్యెన్
జిక్కతి నా కెద్దినీతి సితజలజాక్షీ.

59


క.

నాకడదాయి సనీతి న
నేకక్రియలన్ తరించ నెఱిఁగించిన నే
నాకర్ణించఁగనేరక
చీకా కైనాఁడ నెద్దిఁ జేసెద లలనా.

60


క.

హరిదినసాధనసంహతి
నరయఁ దృణాకృతిఁగ జేసి రతనికి నా కీ
నరకీటకశరధారల్
సరయగతిం దాకి తెరలసాగెన్ గాంతా.

61


మ.

హరి నిర్జించి శిఖన్ హసించి ఖగయక్షాధ్యక్షకాళీశసా
గరనాథార్కజదైత్యకర్తల యహంకారక్రియ ల్జార సం
గరధాత్రి న్నలిజేసి తేలిచిన, నాగాఢస్థితిం గానకే
నరకీటాగ్రణి యెంతఁ జేసె నతిదైన్యగ్లానిచే డస్సితిన్.

62


ఉ.

అక్కట తెల్లగట్టిల జయక్రియ నెత్తినయట్టిశక్తి నేఁ
డెక్కడ దాగె? ఢాక దిగధీశితలం దెగటార్చినట్టి లా
గెక్కడి కేఁగె! ధాత దయ నిచ్చిన యంచితకాంక్షలెల్ల హా!
యెక్కడ డాగె? దీని కిక నెయ్యది జాడ నిశాకరాననా!

63

సీ.

దక్షారిఁ ద్రిశిఖసాధనలీల హరియించి
             యచలాధరారాతి యశని దెగడి
యగ్నిచేశక్తి దృణాకృతి నిరసించి
             యర్కనందన దండహతి హరించి
దై తేయనాయకహేతి తీ రడఁగించి
             నారథీశితత్రాడ నాదరించి
తగ సదాగతి శీఘ్రతరగతిఁ గారించి
             ధననాథఘనగదాధారఁ జెరచి
నట్టి నాయంతరాక్షసాధ్యక్షహేళి
నిట్టి నరకీటనేత దా నేసినట్టి
చిన్నగీసినకట్టె లచ్ఛిన్నసరణి
గాడి హృత్స్థలి యెంతెంతఁ గందసాగె.

64


క.

ఐనట్టి తెరంగెల్లన్
గానీ నాతండ్రి నఖిలకర్త న్గిరిజా
జాని నియతి నర్చించెద
నానాఁటం గాంక్షలెల్ల నడఁచఁగ నింతీ.

65


వ.

అది గాక.

66


క.

నాకలగానక్రియ దా
నాకర్ణన జేసి యాది హర్షస్థితిచే
నాకాయజారి యనె నెద
నాకలితకటాక్షసరణి యది యెట్లన్నన్.

67


చ.

కలన జయించరాని యరిఁగాంచిన నన్నధికారిఁజేసి ని
శ్చలతరదీక్ష నిష్టికడసాగ రచించినయట్టియగ్నియం
దలర శరాసనాస్త్రహయహాటకకంకటశక్తిశాలితే
రలర జయించఁగాఁగల దజాండఘటస్థలి తేజరిల్లఁగన్.

68


క.

ఆతే రెక్కి యరాతి ధ
రాతల కీర్తన లడంచరాదే యన స్నే

హాతిశయత కాశీళిత
యాతతగతి నానతిచ్చె నందఱ లెన్నన్.

69


వ.

అని యాద్యంతసరణిఁ దెలియఁజేసి జలస్నాయియై హాటకశాటికా
స్రక్చందనాలంక్రియ లార్చి యంధకారాతి నారాధించి యజ్ఞదీక్ష నిలిచిన
నింద్రజిజ్జనని చేరనరిఁగి లంకాకర్తం గాంచి.

70


క.

కానంగలేని నీచే
నై నట్లల్ల రచియించి యనయక్రియ లం
కానాయక! యాసాసల
చే నింకన్ దిరుగ నేల చెన్నటినడకన్.

71


ఉ.

ఆరయ నీశధాతల దృఢార్చన చేసిన యట్టిదానిచే
నేరి రణాంగనస్థలి జయించితి శక్రజిదాదినాకగే
హారితతిన్ ఖరాహితకరాంతశరాసనశాతశస్త్రికా
ధారల ద్రెళ్ల నేసరణిఁ దాళితినయ్య నిశాటశేఖరా!

72


ఉ.

ఎక్కడి సృష్టికర్త దయ యెక్కడి యంధకహంతశక్తి, నేఁ
డెక్కడలేని కాక సృజియించఁగ నేటికి యట్టియందఱల్
చక్కఁగ నిల్చినట్టె కడసాగెనె నీఘనసాహసక్రియల్
చిక్కఁగ నాఖరారియెడఁ జెల్లఁగనేరదయా దశాననా!

73


క.

జనకజ ఖరనఖధారలఁ
కెనకిన కాక ఖచరారి చెడిచేరిన దాఁ
గని దయచే రక్షించెన్
గనక యతని నెన్నరాదె కడతేరంగన్.

74


ఉ.

ఎంచగ ధాతృశై లతనయేశితలన్ దృఢశక్తిచేత న
ర్చించి హితార్ధసిద్ధిగల చెన్నటిరక్కసిఱేండ్ల నెల్ల న
త్యంచితజన్యధాత్రి దెగటార్చె నెరాగడతేర దెచ్చటన్
గాంచితె రిత్తయాసలట గట్టఁగరాదె నిశాటశేఖరా!

75

వ.

అని యాడిన గేహినిగాథ లాలాలించిన కట్టెదఱ నత్తెఱం గెల్ల సరిదాకిన
యజ్ఞదీక్షఁ జాలించి యాయంగన న్గలిసి యంతస్స్థలికిం జనియె నంత
నక్కడ.

76


చ.

అని దనదాయి ద్రెళ్లిన ఖరారి నరేశితదీర్ఘనేత్రసం
జనితజలార్ద్రదేహి యయి జాలిఁ జలించఁగ గాంచి కైకసీ
తనయ కనిష్టరాత్రిచరదంతి నయక్రియఁ జేరనేఁగి లా
లన రచియించి కట్టెద కలంక యడంచి నిజేచ్ఛ సంధిలన్.

77


తే.

దశగళత్రిదశారాతిదాయి తార
తండ్రి ఋషస్థిరాధినేత జతగలసి
యాంజనేయాద్రిచరకర్త నాదరించి
యనిచి రతికాయజిద్రక్షణైకదీక్ష.

78


వ.

ఇట్ల నిలచిన యాంజనేయహరి ధనదదిశ కరిఁగె నంత.

79


ఉ.

ఆతఱి రాజరాజదిశ కద్రిచరేశిత సాగియేఁగఁగా
నాతలఁ జంద్రహాసి సనయక్రియతోఁ గని తాటకేయసం
జాతనిశాటనాయక నిశాంతధరిత్రికిఁ జేరినట్టి లా
గాతఁ డెఱింగి యంఘ్రిజలజార్చనలం దనరించి జాలిచేన్.

80


క.

ఈనడిరేయి దశానన
రానేటికి రాననిచిన రయగతి నేనే
రానే! యేకార్యస్థితి
యైనన్ గాఁ జేయలేనె యాదరశక్తిన్.

81


వ.

అనిన యతనిం గాంచి నంతసిల్లం జేసి శేషాంశసంజాతరాజ
కర్త రక్షించ నాంజనేయహరి ధనదదిశ కేఁగసాగె నేకరణి
నైన యతనిం దెగటార్చరాదే యని యాద్యంతక్రియ తెలియఁ
చేసిన నతం డతని కిట్లనియె.

82

ఆ.

తండ్రి! జననియైన తాటకఁ దెగటార్చె
చిన్నతండ్రి నల్కచే హరించె
కన్నతండ్రి చండకాండధారలఁ జెండె
నెనయ నంగ[14]గలదె యిద్ధచరిత.

83


చ.

హరి నిరసించెదన్ శిఖి జయక్రియ డించెద గాలిఁ గేరెదన్
శరనిధినేఁ దనర్చెద నిశాచరకర్త నదల్చెదన్ కళా
ధరదిననాథజాతధనదత్రయి గిట్టెద గాని యట్టిదా
శరథియ దాట నానడక సాగకనేరదయా దశాననా.

84


చ.

అనయత సీతఁ దెచ్చినదియాదిగ, రక్కసిఱేండ్ల తాటకా
హననకరాగ్రకీలితశరాసనచండతరాస్త్రకీలిచేఁ
దినఁదినజేసి దాని గడదేరకఁ దక్కినయట్టి యందఱన్
దినఁగ దలంచితే యకట! తెక్కలి నీతెఱఁ గెన్ననేటికిన్.

85


చ.

ఇలగలరాక్షసచ్ఛటల నెల్ల ననిం దెగటార్చి గట్లచే
జలనిధి గట్టి, యద్రిచరజాలసహాయత లంకచెంగటన్
గలయఁగనిండె నాకలశకర్ణనగారిజిదాదిదైత్యరే
ఖల హరియించఁగాఁ దెలిసి గట్టెద లజ్జ ఘటించనేరదే!

86


ఆ.

అనిన నాలకించి యల్కచే లంకాధి
నేత హేతిధార నేయ ననిచి
నట్టిసంజ్ఞ దెలిసి యాకార్యసరణి నం
గీకరించి కదలెఁ గృతకసరణి.

87


వ.

ఇ ట్లాతాటకాతనయనిశాటకర్త చనిచని యాంజనేయహరికంటె యతి
శీఘ్రతఁ గదలి తదగ్రస్థలి సకలచేతనగ్రాహియైన నక్రాగ్రణిగల సరసి[15]కడ
కృతకశృంగారకాంతారధరణి జట్యాకృతి నధిష్టించె నంత.

88


సీ.

అంజనానందనహరికర్త చనిచని
             యలయికచేఁ దృష్ణ యైన కృతక

శృంగారకాననక్షితి గాంచి దిగజారి
             యందలి సరసినీరాన గరచి
నట్టినక్రాగ్రణి హరియించి స్త్రీయైన
             దాని నిర్జరరాజధాని కనిచి
నిష్ఠత జట్యాకృతి నిలిచిన తాటకా
             జాతజాతనిశాటనేతఁ గదిసి
కంధరస్థలిఁ గరశాఖ గట్టి యాస్య
కర్ణనాసికలం దసృక్కాండధార
లడర నలినలిగా రాచి యచలనేసి
నిగిడి యక్షయగతి నింగి కెనసి యంత.

89


చ.

అనిలజ[16]కీశనేత సనయక్రియచేతనదానక్షీర కాం
డనిధియ దాట చంద్రగిరి డాసిన నద్రి గ్రహించి యడ్డగిం
చిన ఖగసేనలం గెలిచి శీఘ్రతగాఁ జని దారిలో నెది
ర్చిన రజనీచరేశితలఁ జెండి జలస్థలి నేసె నయ్యెడన్.

90


చ.

అనిలసఖాకృతిం గలసి యంచితశక్తి ధరించి కైకసీ
జనయిత యన్నతోఁ గదియసాగిన యాతని కేల గట్టి నీ
రనిధి జరీననేయనహిరాజజగత్స్థలి జారి నిల్చెనా
యనిలజకీశకర్త కహాహా! సరి గల్గెదరే జగత్రయిన్.

91


ఆ.

అంత నాంజనేయహరి దెచ్చినట్టి యాయద్రిచేత ఖరనిశాటహంత
దాయి లేచినిలచెఁ ధరణి యాఖండల
దిగ్ధరిత్రి కొంత తేజరిల్ల.

92


వ.

అయ్యెడ.

93


క.

కని దాశరథి సదాగతి
తనయ హరిం జేరనేఁగి దయచే నాలిం
గనరచనఁ దేల్చె నిర్జర
జనకీర్తన లష్టదిశల సంధిల నచటన్.

94

ఉ.

ఆనగచారి తాఁ దిరుగ నది యథాస్థలి డించనేఁగ లం
కానరనేత యాజ్ఞ నతిగాఢనిశాచరకర్త లార్చి క
య్యాన నెదిర్చినం గడఁగి యందఱలన్ జలరాశి నేసె లే
ఖానకదంధణల్ చెలఁగ నష్టదిగీశిత లెల్ల నెన్నఁగన్.

95


క.

అలయ కరశక్తి నగ్గిరి
నలయక తానాంజనేయవారి యేఁగి యథా
స్థలి డించి తిరిగిరా నెల
కేలన నిలిచెఁ ద్రిదశరాజి కీర్తించగన్.

96


వ.

అంత నక్కడ.

97


తే.

ఆదశాననరాక్షసాధ్యక్షహేళి
చింతఁ దనదేశికాగ్రణిఁ జేరవేఁగి
యానతి రచించి యర్హసింహాసనాగ్ర
ధర నధిష్ఠించి యాడె [17]నాదరణసరణి.

98


క.

ఏ యెడఁ గీటంటంగా
నీయక జయకార్యచర్య లీడేర్చంగా
నీయాజ్ఞ నేటిదనుకన్
ఆయతగతి నలరినాడ ననఘచరిత్రా!

99


చ.

కలనఖరారిచండకరకాండశరాసనశాతశస్త్రధా
రల ఘటకర్ణనాకగృహరాజజిదాదిహిత క్షితీశరే
ఖల ఘనగంధనాగరదకాండ నిశాటసహాయతన్ ధరా
స్థలిఁ దెగటార్చె నీసరణి దాచఁగ నేటికి దేశికాగ్రణీ!

100


వ.

అని యాడిన లంకానేతం గాంచి.

101


క.

ఇన్నాళ్లదనక [18]చింతా
కన్నెరగఁగలేక యార్తిగాసాగె నహా!

న న్నడగఁగ నేతెంచితె
చెన్నటి నీకెద్ది నడక చెడతఱి యయ్యెన్.

102


చ.

గిరిచరసేనలం గలసి క్రీడ ఖరత్రిదశారిహంత రాఁ
శరనిధి దాటి నీనగరి జుట్టిగనాగిన దింతెగాక య
క్షరతరశస్త్రధారల నిశాచరకర్తల నందఱిన్ [19]రణ
స్థిర హరియించెనన్న గడతేర్చఁగ నేరనయా దశాననా!

103


ఉ.

ఏయెడఁ గింకరక్రియలహెచ్చరికం గిరిశాసనాది ది
ఙ్నాయకయక్షసిద్ధఖగనాగనిశాచరకర్త లర్చనల్
సేయఁగ హంసయానశశిశేఖరదత్తజయార్థసిద్ధిచే
హా! యఘకారి ని న్నెఱఁగ కాఱడిఁ జెందితె యందఱల్ గనన్.

104


క.

ఐనట్టిదాని కలజడి
యానంగా నేటి కిక నరాశననాథా!
నేనెఱిఁగించినగతి నె
య్యాన జనిన కార్యసిద్ధి యది యెట్లన్నన్.

105


క.

[20]క్షితిజానాయకహరిసం
హతి గానఁగనీక యహితహరిణేష్ఠి నయ
స్థితి గడసాగఁగ జేసిన
హితగతి నీకాంక్షలెల్ల నీడేరుఁ దగన్.

106


చ.

అని యతఁ డానతిచ్చిన దశాననరాక్షసకర్త హర్షియై
తనగృహధాత్రి కేఁగి సహితస్థితి సంధిల నేకతానఁ జ
య్యన నరిగంజనేష్ఠి దనరార రచించెడిదానఁ జేసి యా
యనలశిఖాచ్ఛటల్ గలయ నాశల నిండఁగసాగె నయ్యెడన్.

107


వ.

అంతఁ గైకసీకనిష్ఠతనయనిశాటనేత దెలిసి.

108


క.

తనయన్నయజ్ఞచర్యల్
గని సీతాజాని కెరుకగాఁ జేసిన యా

తనిదాయి నెన్నిదినకర
తనయాద్యగచారిఘటల దగ ననిచె నటన్.

109


క.

చని యజ్ఞదీక్షచే ని
ల్చిన లంకాకర్తఁ జేరి చిత్రక్రియలన్
గని గాసినేయ దరలక
కనకాచలసదృశధైర్యగతి దనరె నటన్.

110


సీ.

కరశాఖల గ్రహించి గండశిల ల్దెచ్చి
             యెత్తి శిరశ్శ్రేణి నేసియేసి
కట్టిన తగటద్దినట్టి శాటిక లెల్ల
             చించి గండ్రల్గాగఁ జేసిచేసి
ఘనతరకఠినాంఘ్రిఘట్టనక్రియలచే
             ధాక కట్టెదయంట దన్నితన్ని
నిర్ఘాతసంకాశనిస్సహచండాట్ట
             హాస[21]లీలలఁ దెగటార్చియార్చి
[22]జదకఁగా యాజ్యకలశికల్ చరచిచరచి
నీళ్ల యాగాగ్నిశిఖ లార [23]గేళ్ల జల్లి
నట్టిదానఁ జలించక యాదశాస్య
చారణారాతి కనకాద్రిసరణి నిలచె.

111


తే.

సకలహరిఘట లీరీతి చంద్రహాసి
డాసి యెంతెంత దెలిసియుఁ గాసి చేసి
తరలక హిరణ్యశిఖరి చందాన దనర
కలక నిశ్చలచర్యల నిలిచి రంత.

112


వ.

అయ్యెడ.

113[24]


చ.

అనిలజశాసనక్రియ నయస్థితి సంధిల శక్రజాతనం
దనహరి కెకసీతనయదారయదాటల కేడియార్తిచే

గనలగ నీడ్చి తెచ్చి తెగ గాసిలఁజేయఁగ యాగదీక్ష చ
క్కనఁ జెడి లేచి నిల్చె లయకాలనిశాకరశేఖరాకృతిన్.

114


క.

నిలిచిన గిరిచరఘట లి
చ్ఛల కన్నదెగాతిగాగ జని కేరఁగ నా
జలజాక్షి లజ్జచే దశ
గరఖచరారాతి గాంచి కందఁగనాడెన్.

115


సీ.

కాకచే నగ్రజకర్తల హింసించి
             యగ్రహారస్థిర లాగడించి
కలికి యచ్చరకన్నియల దెచ్చి [25]చెఱఁ దాచి
             యజ్ఞాదిసత్క్రియ లడ్డగించి
సరసిజాక్షస్థానశాలలన్ని హరించి
             కాసారదీర్ఘికల్ గాసిఁ జేసి
అతిథిజనార్చన లడఁగించి శతఖడ్గ
             ధారలచే నాలఁ దరిగితరిగి
[26]శాంతిదాంతి దయానయజ్ఞాన దాన
సంతతాచార నిష్ఠాతిశయత లార్చి
నట్టియఘకారి నీచేతలట్టె నీకె
[27]సాటిదాకెగదయ్య నిశాటనాథ!

116


క.

నారాయణ సత్కళచే
[28]నారాజచ్ఛట జనించె నఖిలాశాలే
ఖారాతిఘటలనందఱ
నారసి గండ్రించె సంశయక్రియలేలా.

117


చ.

అని ఘటకర్ణ[29]శైలజితలాదినిశాచరనేతలందఱల్
చనిరి హయచ్చటల్ నలిసె సైనికకర్త లడంగి రచ్ఛకాం

చనరథరేఖ లీడిగిలె జండగజేంద్రఘటల్ నశించె నిం
కనయిన నీర్ష్యడించి నయకార్యగతిం గనరాదె చక్కఁగన్.

118


ఉ.

ఆతతకీర్తి సంస్థలి దయారసకంనిధి యార్తచేతన
త్రాత ధరాధరేంద్రధృతి దాశరథక్షితినాథహేళికిన్
[30]నీత సనీతి నిచ్చి నతిఁజేసి గణించిన నీహృదిష్టకాం
క్షాతిశయక్రియ ల్ఘటనయయ్యెడి చిల్లరగాథ లేటికిన్.

119


శా.

హేలాసంగతి నాంజనేయహరి తా నేకాకియై చేరి తా
నీలంకాస్థలి నెంత చేసె నది నాఁ డీక్షించరే యన్నిఁటన్
యాలాగంతటికన్నధైర్యనయచర్య ల్గన్నకీశచ్ఛటల్
నేల న్నల్దిశ లంతరిక్షసరణిన్ నిండారినా రారయన్.

120


ఆ.

ఈనెలంత నతని కిచ్చి లంకాస్థలి
దాయి కిచ్చి గహనఛాత్రి కేఁగి
తేని లెస్స యట్ల లేనినాటికి దాశ
రథికరాగ్ని ద్రెళ్లరాదె యాజి.

121


క.

అని తేర్గడ నెదిరించిన
దనగేహిని జేరఁ జీఱి దశకంఠనరా
శనకర్త యాగ్రహస్థితి
గననీయక యాడె నీతికార్యాసక్తిన్.

122


క.

జానకి యేసరి ధరణీ
జానియె దృష్టాంతశేషశాయిగ యాహా
యే నెఱుఁగనె నెలతా! య
జ్ఞానినె నీయంత శాస్త్రసరణిఁ దెలియనే.

123


చ.

కనికని నేరకే యనృతగాథల నాడ నతేటి కాజి నా
యనశరధారలం దెగి దిగంతనరేశితలెల్ల నెన్నఁగా
సనకసనందాదియతిసంతతి నందఁగరాని టెంకికిన్
జనియెద గాన దీనికి శంకిల నేటికి నీరజాననా!

124

క.

ఈలంక యేల ధనధా
న్యాలంక్రియ లేల కరటిహయరథరాజ్య
శ్రీ లేల నీసహాయత
జాలించఁగరాదె నీరజాతదళాక్షీ!

125


ఆ.

ఎల్లదిగధికర్త లిట దాస్యచర్యల
జనశతార్ధలక్షసంఖ్యలైన
యేండ్లదనక ధరణి యేలి నే నతనికి
శరణనంగ నేల హరిణనయన.

126


చ.

సతి! యచలాహితాద్యఖలచారణరేఖల నేల నేసి రా
చితి సరియెన్న నేల సరిచేయ జగత్త్రయి నేర రెన్న, హా!
యతనికి నేనె సాటి యతఁ డారయ నా కిట సాటి సాహసా
యతధృతి సాయకాసనదృఢాగ్రహనిగ్రహకార్యచర్యలన్.

127


చ.

అని రజనీకరాననగృహంతరసంస్థలికన్య చక్కఁగాఁ
దనయెద కాంక్ష లెల్ల సహితస్థితి సాగనియట్టిదాని క
త్యనత గిరీశధాతలఁ దృణాకృతిఁగా హసియించె నాదికా
శనసదృశాచ్ఛతారకరసారససంస్థితి ఖడ్గశాలియై.

128


సీ.

శాంకరీశంకరస్థలియైన రజతాద్రి
             హత్తంగ గెంగేల నెత్తినాఁడ
నచలాహితాదిదేశాధినేతలచేత
             నానతిఁ గని కాన్క లందినాఁడ
లలితసాహసధైర్య[31]లక్షణం దనరార
             సిద్ధిచే సత్కీర్తిఁ జెందినాఁడ
సాధ్యసిద్ధాండజసారణాహిశ్రేణి
             దాస్యక్రియ జరించఁ దనరినాఁడ
నట్టియంత నారాక్షసాధ్యక్షహేళి
నిట్టినరకీటకాగ్రణి యెంత జేసె

సృష్టిరక్షణకర్త యాస్రష్టకైన
కాలగతిఁ దాటరా దింక కలఁగ నేల.

129


తే.

ఐనదానికి చింత సేయంగ నేటి
కధికసారంగసైనికహయశతాంగ
సంతతి ఘటిల్ల నరకీశసంతతికిని
జడిసినను నీసడించరే సకలదిశల.

130


వ.

అని యహంకరించి గద్దించి నల్దిశ ల్గలయనీక్షించి కరధృతచంద్రహాసలత
యల్లార్చి జగజ్జననాంశకరణదండధారి కెరలిలేచి జలస్నాయియై
హాటకశాటికల్ దాల్చి యష్టదిశాకర్తల లిఖియించిన యందియ నెలకాలఁ
గీలించి హితరాక్షససంగతి సరసాన్నహారసంసిద్ధి నలరి యానందకందళిత
హృదయస్థలియై సదాగతి తిరస్కారరాయగతిఁ గంఖాణసంతతి ఘననీ
లాచలసదృశగంధగంధిలసారంగసంహతి నిర్జరగిరిశృంగసంకాశగాం
గేయశతాంగాళి యసదృశసాహససైనికరాజి రంజిల్ల శంఖకాహళతా
ళానకఢక్కానిస్సాణఘంటానాదక్రియల జేజే ల్తల్లడిల్ల శరశరాసనకఠార
శక్తిహలచక్రఖడ్గగదాదిసాధనచ్చటల్ కరశాఖల సంధించి హళహళి
గేలం జెంగలించెడి దండనాయకఘటలం దనరిన రాజసదనాంగణధాత్రి
కేతెంచి దశకంఠలేఖారి నిలచి.

131


సీ.

శశికళాసంఖ్యాతియై చక్రసంహతి
             గా నల్దిశలనైన గానదాని
ఋక్షాజినచ్ఛన్నదృఢసహస్రహయాళి
             చే నటక్రీడ గర్జిలెడిదాని
గాందకాండాసనఖడ్గాదినిఖిలసా
             ధనరాజిచే సిరిఁ దగినదాని
ఘనతరశతలక్షగలఘంటికాశ్రేణి
             చే నంతకంత రంజిలినదాని
జారణాహి నరాధీశజైత్రలాంఛ
నాచ్ఛతరకేతనత్రయి నలరినట్టి

దానిఁ గనకాద్రిజాడ హెచ్చైనదాని
దేరదన నెక్కి నిలిచె నాదితిజకర్త.

132


క.

నిలిచి హితదండనాయక
హళహళికలచే నిశాచరాగ్రణి లంకా
స్థలిఁ గడచి హరిహయాశా
చలకందరనగరిహేళి సరణిం జనియెన్.

133


క.

లయకాల కాలదండ
క్రియచే రణధరణి దైత్యకేసరి చాలా
జయకాంక్ష నిలిచె నిర్జర
చయచిత్తతచే [32]ఘనాతిశాతాసి యనన్.

134


సీ.

ఖచరారినాయకకాసారసారంగ
             దహననీరజకాండధార్తరాష్ట్ర
దినకరనందనధృతిలతికాధాశ్ర
             [33]చారణాహితశాతచండకిరణ
జలధిధాత్రీనాథజగతిధరాశని
             యనిలాంధకారరాకాద్రితనయ
యక్షరాజానిలాహారకేకశ్రేష్ఠ
             చంద్రశేఖర తటీ సాంద్రతటిని
యని కళాధరదితిజసంహతి గడంగి
రెండెదలఁ జేరి ఘనఘనాఖండనాద
కఠినగద్యాదిగాథల గణన సేయ
నిలిచె ననిదారి దశకంఠనిర్జరారి.

135


వ.

ఇట్లు లయకాలచండకరాకృతి చంద్రహాసధారియై తేజరిల్లె నయ్యెడ.

136


క.

రెండెడల దితిజకర్త ల
జాండస్థలియగల ఢక్క లఖిలక్రియలన్

జండతరహస్తశాఖల
నిండఁగఁ జరచిరి దిశాధినేత ల్గలఁగన్.

137


తే.

అసదృశస్యందనాధ్యాసియై దశాస్య
[34]నిర్జరారాతి గననయ్యె నింగిచాక
దాశరథి యంఘ్రిచారియై ధరణి నిలచె
దానికిని లేఖసంతతి తలఁకనంత.

138


చ.

అనికడదండి నిల్చిన దశాననరాక్షసకర్త సాహసా
త్యవతకళ ల్గణించి హృదయస్థలిఁ [35]గంధిధరాధరారి తా
పనిచె నిశాతసాయకశరాసనకీలికరాళశక్తిసా
ధనహయశాలి తేర ధనధాత్రికి సారథిచేత నయ్యెడన్.

139


క.

ఈరీతిం దెచ్చిన తే
రారసి చేరఁజని రాక్షసారాతి జయ
శ్రీ రంజిల్లఁగ నెక్కెన్
ధార నసదృశాచ్ఛదృష్టిఁ దనరఁగ నంతన్.

140


చ.

అలయక రాక్షసాహిత దశాస్యనిశాచర కర్త లిద్దఱల్
గలసి యహీనసారకరకాండశరాసనదీర్ఘశింజినీ
గళితకరాళశస్త్రికలఖండితచర్యల గాడగా నసృ
గ్జలకణధార లెల్లెడల జారఁగ నాజి రచించి రయ్యెడన్.

141


క.

నింగిన్ నిర్జరకర్తల్
జంగిలియై గణన సేయ సాహసగతిచే
జెంగక యాగ్రహదృష్టిన్
దంగక కలహించి రధికతర సంధిలచేన్.

142


ఉ.

ఆతఱిఁ దా నగస్త్యజటిలాగ్రణి రాఁ గని సంతసిల్లి య
త్యాతతశక్రనీలరచనాచ్ఛరథస్థలి డిగ్గి జానకీ
నేత ధరిత్రి సాగిలి గణించిన యాతని యంగయష్టికా
ఘాత లడంగరాచి హితకార్యరసస్థితి నాడెఁ జక్కఁగన్.

143

క.

అనఘ దిననాథసంతతి
జనియించితి గనక యతనిఁ జక్కఁగఁ గీర్తిం
చినఁ దన తేజది నీక
ల్లన హితగతి నీయఁగాఁగలండని దయచేన్.

144


తే.

ఆఖరారాతిచెంత డాయంగఁ జీఱి
కార్యసిద్ధిగ నందఱ ల్గణన సేయ
దినకరాకర్షణస్థితిఁ దెలియఁజేసి
ఘటజజటికర్త తనయిచ్ఛఁ గదిలె నంత.

145


వ.

ఇట్లధికతేజస్థిఁ గాననైన దాశరథిం గిరిచరసంతతియార్కి నిలిచిన యతని
హృదయస్థలి యెఱింగి.

146


క.

తనసేనలచే నిననం
దనహరి రణకార్యచర్య దాలిచి ఖరగం?
జన(?) నికట ధరణి నిల్చిన
గని యాతనిదృష్టి దెలిసి గ్రచ్చఱ ననియెన్.

147


క.

ఇల హరిసేనలచే దశ
గళఖచరారాతిఁ జేరి కలహించంగా
దలచితి నర్కజ! యాహా
నిలిచిన నేగాక దృష్టి నిలిచేద రేరల్.

148


ఆ.

ధాతచేత కాయజాతారిచేతఁ దా
నందరానికాంక్ష లందెఁ గాన,
నచల నాకెకాని యన్యసాధ్యచికిత్స
గాదయా హరీంద్ర గణన సేయ.

149


క.

అది గనక చంద్రహాసిం
గదనస్థలి నే నెదిర్చి కలహించంగా
హృదయాహ్లాద స్థితిగా
గదలక దృష్టించరాదె ఖరకరతనయా.

150

క.

అన నాలకించి యగచర
జనకర్త ల్గగనసరణి సకలాశలశృం
గనగాగ్రశాఖలన్ ధృతి
గనసాగిరి నిలిచి చిత్రగతి నయ్యెడలన్.

151


తే.

దృఢతరసహస్రకరసృష్టి తేజరిల్ల
జానకీజాని నీక్షించి చంద్రహాస
ధారి యాగ్రహశిఖశిఖల్ ధరణి నిండ
ఖేచరనిశాటతతి యాలకించ నాడె.

152


చ.

అనఘ! జగత్రయిం గలఁచియాడితి నా కెదిరించనేరలం
గనినదిలేదెకా! యయిన గాంచితి ని న్నతిసాహసక్రియా
ఖని, నికతేలకే నిలిచి కాలహరీంద్రకరాళసాయకా
సనశరలేఖలం గలన స్రగ్గఁగఁ జేసిన లెస్స యన్నిటన్.

153


క.

నాయెడ రాక్షససేనల్
నీయెడ నాదిత్యఘట లనిందితగణనల్
సేయఁగఁ జండతరాజిం
జేయఁగ హృత్కాంక్షలెల్ల సిద్ధించు గనన్.

154


వ.

అనిన యతనిగాథ లాలించి దరహసితాననస్థలియై దాశరథి యంగీకరించిన
దానికిఁ జంద్రహాసి యాగ్రహదృగ్జనితదహనకీలాకణచ్ఛట లెగయ నశని
సదృశాట్టహాసనాదక్రియల కజాండస్థలి కలసి చలించ కెల్లార్చి గద్దించి
నల్దిశల్ గలయ నిరీక్షించి.

155


సీ.

కాంచనస్యందనఖరచక్రహతిచేత
             శేషాహితలలెల్లఁ జితికిలంగ
సాయకాసనఘనజ్యాటంక్రియలచేత
             జలరాశి యెంతంత కలకసాగ
గాఢకేతనదండఘర్షణస్థితిచేత
             గగనతారాశ్రేణి కంధిరాల
కంఖాణనిశితరింఖాఘట్టనలచేత
             నచలారి నలినలియైచెలంగ

నశనిసంకాశకఠినాట్టహాససరణి
దశహరిత్కర్త లలజడి దద్దరిల్లఁ
దరలి దశకంఠలేఖారి ధాక చాకి
తాటకేయారి నలదండధారి దారి.

156


ఉ.

అన్నరకర్త తేర దితిజారి రధస్థలిఁ దాకెఁ దాక న
క్లిన్నగతిం ధరిత్రి దిరిఁగెన్ హతిచే దిశలెల్లఁ గాసిలెన్
కన్నిధి నల్గడల్ చెదరె ఖస్థలి తారకలన్ని రాలె నా
కిన్నెరసిద్ధసాధ్యఖగఖేచరసంతతి దద్దరిల్లగన్.

157


క.

అనలకణచ్ఛట లెగయఁగ
ననిలరయక్రియలచే ధరాధీశనరా
శనకర్తల యరచాలం
టనదాక నజాండ [36]గలసినట్టయ్యె నటన్.

158


క.

హరిహరిగలసిన జాడల
కరటికరటి దారసిలినకరణిం జాలా
గిరిగిరి నెనసినగతి దా
శరధి ఖగారాతి యెదరి జగడించి రటన్.

159


క.

ఇతరేతరకరగళితాం
చితచండశరాసనాతిశితకరధారా
క్షతశాస్త్రశస్త్రి కదన
క్షితి యయ్యెం త్రిదశరాజి గీర్తించంగన్.

160


ఉ.

ఆనరఖాదనాగ్రణి నయక్రియ సంధిల నంధకార నా
గానలకాండధారల జయస్థితి నేయఁగ గాంచి జానకీ
జాని దినేశతార్ఘ్యఘనశస్త్రికలం దెగనేసి యార్చె లే
ఖానకదంధణల్ చెలఁగ యష్టదిగీశతనెల్ల నెన్నఁగన్.

161


క.

ఆనిర్జరారిఁ జేసిన
దానికి నన్నిఁటికి నన్ని తగఁజేయంగా

దీనాకృతిచే నేదియు
గానక దశకంఠదైత్యకర్త కలంగెన్.

162


తే.

[37]అజతనయనందనాగ్రణియంగయష్టి
చింతగింజంత యెడలేక చిత్రసరణి
తగల నెసఁగించె దశకంఠదైత్యకర్త
సరగ నీరీతి గలహించసాగి రంత.

163


క.

ఖరరాక్షసగంజనసిత (?)
శరధారల్ కైకసేయశక్రాహితకం
ధర లెఱిఁగించఁగ నాతీ
రరసి గణించంగసాగి రందర లంతన్.

164


ఉ.

ఆనరనాథకేసరిశరాహతి నిండఁగ నాట నిస్సహ
గ్లాని ధరించి రాత్రిచరకర్త యహంక్రియ సంధిలంగ[38]గా
(?)ళీనదయాంతసంత్రిశిఖహేతి గదల్చి తెరల్చి యేసె ఘం
టానినదక్రియల్ గిరిఘటల్ నటియించఁగ నింగి గాసిలెన్.

165


చ.

అది కడగాకరాఁ గని ఖరారి నగాహితదత్తశక్తి న
ష్టదిశల నిస్సహాగ్నికణసంహతి రాలఁగ నేసె నేయఁగా
నెదిరి సహస్రఘృష్టిని గ్రహించి నరాశనకర్త లీలచే
నెదగ హరించే నాత్రిశిఖహేతి నిరాకృతి గాగ నయ్యెడన్.

166


తే.

ఏసి యంతటఁ జాలక యీర్ష్య రేగి
దాశరథి శస్త్రికలచేత ధాక నేయ
దాని కలిగి నిశాచరధరణి దాని
తలకి గద్దించి నిరసించి తత్తరించి.

167


చ.

ఇనశశితారక ల్చెదర నెల్ల దిశ ల్చలియించ శాక్రహ్రా
దిని కెనయైనశస్త్రికధృతిన్ ధరణీతనయాధిరాట్చరా

ననఘనయష్టి గండ్రలయి జారఁగనేసె నిశాటసేన ల
ల్లన చెలగంగ నిర్జరకళల్ దరుగన్ హరిరాజి గాసిలన్.

168


వ.

అంత.

169


ఆ.

కలశజర్షిదత్తఘనశరాసనయష్టి
సంగ్రహించి నారి శస్త్రిఁ జేర్చి
జనకధరణినాథజాజాని యత్యంత
చిత్రసరణి నాజిఁ జేయసాగె.

170


వ.

ఇట్ల నిశా౽హఃకాలచర్య లెడతెగక షష్టదినసంఖ్యల్ దాటిన నాటి
చెంత.

171


క.

అని యతని శిరఃకరతతి
గనియల్ సేయఁగ నిగిర్చగా దాశరథిం
గని కలశకర్ణసహజా
తనిశాచరక ర్త నయహితస్థితి దేరన్.

173


వ.

ఇట్లనియె.


క.

క్షితినాథ! సంశయించక
యతని జఠరధాత్రిచారణాహారరస
స్థితి తనరె న్దనక సదా
గతిహితశరధార నేయఁగ లెస్స యనన్.

174


ఉ.

అన్నరనాథకేసరి శరాసనసంఘటితాగ్నిశస్త్రి న
చ్ఛిన్నదశాననత్రిదశజిజ్జఠరాంతరసంస్థితాదితే
యాన్న[39]రసగ్రహక్రియ నయస్థితి సంధిలఁజేయ నార్తినా
చెన్నటి రిత్తయై నిలిచెఁ జెంగటి కీశఘటల్ హసించఁగన్.

175


వ.

ఇట్లు నిలిచిన చంద్రహాసిం గాంచి.

176


క.

ఇన్నాళ్ల దనుక నే నిఁట
చిన్నెలకై తెగక యాలసించితి నింకన్

ని న్నని గీటణఁచఁగ చన
దిన్నఁగ దృష్టించరాదె ధృతియని యల్కన్.

177


మ.

జననాథాగ్రణి కార్యసిద్ధి గన సచ్ఛస్త్రాహతిన్ కైకసీ
తనయేంద్రాహితకర్త నేసినయెడం ధాత్రీస్థలిం ద్రెళ్లె ధా
రననింగి న్గ్రహరాజి తల్లడిల తారల్ రాల దిగ్దంతి దీ
ర్ఘనినాదక్రియ లెచ్చ కంధి కలఁగన్ గట్టెల్ల నల్లాడఁగన్.


వ.

ఇట్ల ధరణీస్థలిం ద్రెళ్లిన.

179


సీ.

సనకాదియతిరేఖ లెనసిన యానంద
             జలరాశిఁ దేలిరి శైలహాగ్ని
తరణి నందనదైత్య సరిదీశకారాజ
             రాజకాళీకకీర్తన లెసంగె
తాళానకనినాదకీలల కచ్చర
             చానల నృత్తసంసరణి నలరె
ఖచరనిస్సాణసంఘాతధణంధణల్
             గ్రాలె నల్గడల చీఁక ట్లడంగె
జల్లనై గాలి నిండఁగ జల్లె ఖగల
తాంతసంతతి జెడి హెచ్చె యదితిజర్షి
శ్రీధరాంకితగీతికల్ జేయసాగె
యద్దితిజకర్త ద్రెళ్లినయట్టి కతన.

180


వ.

అత్తఱి సనకాదియతిసంతతి శతానందాదినిర్జరశ్రేణి శక్రాదిదిగీశసంహతి
యక్షకిన్నరసిద్ధసాధ్యనాగచారణాండజరాజి యంత స్థలి డిగ్గి దాశరథికి
సాష్టాంగదండక్రియ లాచరించి లేచి నిలచి.

181


సీ.

జయజయ శ్రీకాంత జలజాండకకరండ
             సంతానకలితదేహాంతరాళ
జయజయ నిఖిలేశ జనకకన్యానన
             జలజాతసంచరచ్చంచరీక

జయజయ సాయకాసననిర్గళితచండ
             కాండఖండితదశకంఠకంఠ
జయజయ శేషాహిశయన కాంచనచేల
             రత్నకిరీటహారగణశాలి
జయ హృషీకేశ! జలజాక్ష! జయ యనంత!
జయ జనార్థన! జయ శార్ఙి! జయ గదాంక!
జయజయ హిరణ్యరాక్షసజఠరదళన!
నర్తితహ్రాదినీశాతనఖరశిఖర!

182


తే.

ఆదిగాథల్ గ్రహించి లేఖారియైన
తస్కరాగ్రణికంనిధి దాగఁ దెలిసి
జలచరాకృతి నాతని సంహరించి
ఛాత కన్నింట నిచ్చితి దయ యనంత!

183


తే.

[40]శైలహారికఁ గీడైనలీలఁ దెలిసి
క్షీరనిధిఁ ద్రచ్చ గిరిఁ దాల్చి కీర్తి హెచ్చ
సరగఁ దలదాచినట్టి యాసరణి నిల్చి
చెడనిక్రియ చెలఁగఁజేసితి శ్రీసనాథ!

184


తే.

ధరణి హరించదలచిన దైత్యనేత
నంటి కిటిరీతి హరియించి హర్షగతిని
యచల నిజగతి నెత్తినయాఖ్య లెన్న
నేర్చగలరయ్య యేరైన నీరజాక్ష!

185


ఉ.

రేగినయట్టి కాంచనశరీరనిశాచరకర్త యీర్ష్యచే
సాగిట ధిక్కరించి తనసంతతి చిన్నననంచదల్చఁగా

నాగడియందె శ్రీనృహరి యాతని నాకృతి జెందినట్టి నీ
లా గెడ జేర్చిలెస్సఁగ దలంచఁగ గల్గిరె యెందరే నటన్.

186


చ.

కడఁగి సహస్రహస్తఘనకాయఖగాహితనేతతండ్రి నా
గడగతి కాంక్షచేఁ దిరియగా జని ధాత్రి త్రిరీతి కాళ్లచే
నడిఁగి గ్రహించి యాదితిజజాగ్రణి కిచ్చినయట్టి నాటి నీ
నడక గణించఁగాగలరె నాకధరాతలనాగసంస్థలిన్.

187


చ.

నిలిచి సహస్రహస్తనర నేత యడాటల కాక నిద్దరన్
గల నరనాథసంతతిని గండ్రికలై తెగవేసి తండ్రికిన్
గలఁగక రక్తధారలనె కార్యగతిన్ రచియించినట్టి నీ
కిల సరిసేయఁగాగలరె యెన్నిక లెందఱలైన శ్రీహరీ.

188


చ.

ఇట దశకంఠదైత్యకరి యెన్నికగా ఘనకాంక్ష లంది తో
గటికితనాన నందఱల గారియచే నలియంగఁ జేయఁగా
నటయిట జేరనీ కతనియాననహస్తతతిన్ దృఢస్థితిన్
నటననె శస్త్రసంహతిని నాటగద్రెంచితి తాటకాంతకా!

189


చ.

అలరగ నింకిటన్ హలధరాకృతి నాగడరీతి కాంతలం
గలఁచెడి యాకృతిన్ గలిఁగి గాఁగలచర్యలెటన్ననన్నయా
జలజజశక్రలేఖతతి జక్కనిదృష్టిని దేరి కాంచి దా
గలకలగేరె దాశరథి కాంతి దనర్చి శశాంకరీతిగాన్.

190


వ.

అంత.

191


సీ.

తారకాఖ్యఖగారి దండించి జయగతి
             కీర్తి హెచ్చిన కార్తికేయలీల
యంధకాఖ్యనరాశనాగ్రణి నణఁగించి
             ఘనత కెక్కిన కాలకంఠలీల
యశనిధార దెరల్చి హంకారలేఖారి
             జండినయట్టి యాశక్రులీల
గాంగేయగేహసంగరగరిష్ఠనిశాట
             దక్షఖండన నృహర్యక్షలీల

దశగళత్రిదశారి నీ ధరణి జార్చి
తనజయఖ్యాతి యలరంగ దశరథేశ
నందనాగ్రణిదాయిని నండజీఱి
శింజిన వెరల్చి శరయష్టి చేతి కిచ్చె.

192


వ.

అయ్యెడ.

193


సీ.

చిరగతి నిర్జరశ్రేణి యానందించె
             యహిరాజసంతతి యలరి తలఁచెఁ
జారణతతియంత సంతసించి గణించె
             సిద్ధసాధ్యఖగాళి జేరియాడ
నినశశిగ్రహతార లెంతయేని దిశించె
             నాకనారీజననటన లెచ్చెఁ
గీశసంతతి జాల గీర్తించిఁ జలరేగె
             దిఙ్నరేశితలెల్లఁ దేజరిల్లె
దైత్యనాయక కరళంఠదళన రాజ
తిలక యని యెన్ని నతిఁ జేసి దీనరక్ష
సరగ జేయంగదలఁచిన చక్రి యీతఁ
డే కదా యని హర్షించి రెల్ల రంత.

194


శా.

ఈలీలన్ దశకంథరాఖ్యగల యాహీనాగ్రణిం జెండినన్
జాలానార్తి ఘటిల్ల యగ్రసతి తన్ చానల్ తగన్నంటిరా
నాలంకాస్థలి దాటి కాంచి యహహా! హా! నాథ! నేఁ డిట్లు
నేలం ద్రెళ్లితె రాజహేళి యకటా ని న్నిట్ల ఖండించెనే.

195


తే.

రాక్షసాధీశ నీసతిరాజి యడల
దయఁ జిగిర్చంగ కట్టెదఁ దార్చకేల
ధరణి నింతింత గండ్రలై తలఁగి చనితె
కటకటా! యేది దిక్కని కలగి చీఱ.

196


క.

అందఱ లన్నియడాటల
దందడి నేడ్చంగ నతనిదాయి కలంకన్

గంది యరచె నది దశరథ
నందన నరనేత నీతినయగతి నణఁచెన్.

197


ఉ.

అంతటఁ దాటకారి తనయండనె నిల్చిన దైత్యకేసరిన్
జంతదలంగఁ జేసి యతిశీఘ్రత దేరఁగ నగ్నిసంస్క్రియల్
సంతసిలంగ నన్నకిటసాగఁగఁ జేయగరాదె యన్న తా
రంతట తాళిశాస్త్రగతి రాక్షసనేత రచించె తత్క్రియల్.

198


తే.

అగ్నిసంస్కారసత్క్రియయాది గాఁగ
నెల్ల క్రియలు నెసగించి చిత్తసరణి
తిరిగియేతెంచినట్టి దైతేయనేత
గాంచి తనదాయిరానెలఁ గడఁగి చీఱ.

199


తే.

దాశరథి యెంతొ హర్షించి దాయి గాంచి
దశగళకనిష్ఠఖచరారి ధరణినేతఁ
గలసి చని లంక కేలిక గాగఁ జేయ
ననఘ యేతేరరాదె యటంచు నాడె.

200


సీ.

అర్కనిశాకరు లష్ట[41]దిక్కుల గ్రహ
             తారకాతతి యెంతదాక నిలచు
నజహరిహరదిగీశాకాశధరకంధి
             ధరణీంద్రగతి యెంతదాక నిలచు
నిలయాదిగా జగా లీరెంటినిలతన
             తలలు దాల్చిన నెంతఁదాక నిలచు
నాచర్యలెల్ల యిన్నరనాగఖగతతి
             దలఁచంగ కథల నెందాక నిలచు
నంతదాక ననేకఘనాతిశయత
లంక నీతని కిచ్చి యలంకరించి
చాయి రారాదె యన నాజ్ఞఁ దలధరించి
కదలి యతనిని దద్రాజ్యకర్తఁ జేసె.

201

వ.

ఇట్లు దాశరథియాజ్ఞ నింద్రజిద్దితిజారాతీయగచరసేన లాచ్ఛాదించ దశకంఠ
సహజునిం గలిసి చని లంకారాజధాని చేరి ఝల్లరికాహళనిస్సాణశంఖానక
ఢక్కానాదక్రియల్ జెలంగ గేహినీసంగతి నతని సింహాసనస్థాయిగా రచి
యించిన కాంచనరచితచేలకంఖాణసారంగశతాంగసైనిక [42]దాసదాసీ
సకలార్థిసంతతికిం గర్తయై హితరాక్షసరేఖల్ నిండ హర్షస్థితిం జెంద నిట్ల
న్నిశాచరనేతకనిష్ఠదాయిని నధిష్టాతం జేసిన నత్యంతసంతతాతిశయతఁ జెలంగి
యా చిన్నరానెల ననేకయలంక్రియల నలంకరించిన నటఁ గదలి తదగ్రస్థలి
నంగదహరి నెక్కి యేతేర తా నతనిదండనే చని రాజశశింగాంచి కాళ్ల కెరఁగి
లేచి నిలిచి యిట్లనియె.

202


ఉ.

రాక్షసహారి! నీచరణరక్షల దాల్చితి నాహృదంతరిన్
దీక్ష ఘటిల్ల ధన్యగతి తేజితగాంచితి రాజ్యకర్తనై
యీక్షణకాంతి చాలదయ యేచి కలంగదసాగఁగంటి కం
జాక్ష! యహీశయాన! యన సాదరలీలలఁ దేల్చె నాతనిన్.

203


వ.

అంత.

204


ఆ.

దైత్యహంతయాజ్ఞ దాల్చి యనిలజుండు
జనకరాజతనయ సరస కేఁగి
హర్షసిద్ధి సీత కరాస్యలఁ గైసేయ
యనచి నంత జేరి యాశ్రయించి.

205


క.

తల యంటి యటక లిడి చె
న్నలరఁగ నీ రార్చి చిన్నియలదేర్చిన ఛా
యల చెంగట్టఁగ నిచ్చిరి
కలయఁగ జిగియైన తేటకై సందడఁగన్.

206


సీ.

ఘనఘనాంతస్థలాగతతటిల్లత లెల్లఁ
             దనర నాకాకృతి దాల్చె ననఁగ
స్రష్టధాత్రీస్థలి జక్కదనాలన్ని
             యేర్చి టెంకిగ రచియించె ననఁగ

గణన కెక్కినయట్టి కలితరత్నశ్రేణి
             సిరినిండరాశిగా జేసిరనఁగ
నంధకారాతి నాఁడైన తియ్యనికాయ
             జాంచితసచ్ఛాయల ల్లనంగ
సారణాదితినందనసాధ్యసిద్ధ
నాగయక్షాండజాతకిన్నరనిశాచ
రాంగనాసంచయాఖ్యాదితాతిశయత
జనకకన్యక రంజిల్లై సాంద్రకళల.

207


తే.

తెలియకర లేనియట్టి లేఁనెల యనంగ
సానదీర్చిన యగ్గజశస్త్రిజాడ
కంటి [43]కంకిరియై చాలఁ గాన నయ్యె
జనకనందన తా జగజ్జనని యనఁగ.

208


వ.

ఇ ట్లలంకరించి నిర్జరశ్రీ లాచ్ఛాదించఁ దే రెక్కించి దాశరథి యగ్రస్థలి
నిల్కడఁ జేసిన.

209


ఉ.

అంతట సీత గాంచి యతఁ డాగ్రహదృష్టి నిరాకరించినన్
జింతిలనేల యగ్ని [44]యతచెచ్చెఱఁ జేరెద నందె నాయెడన్
యెంత కలంకయైన శిఖియే కనియాడెడినన్న గ్రక్కునన్
జెంతనె గాకగా ననలచిహ్నల రాజగ జేసినం దరిన్.

210


తే.

నిలిచి నతిజేసి “దహన! నానిల్కడయిల
దాశరథిగాక యన్యునిఁ దలచినట్టి
దేని నాయంగలతిక దహించరాదె
యితర గతిలేని యెడ సీత గతియె సాక్షి."

211


క.

అని కీలిఁ జేరి నిలిచిన
కనకనయని యనలశిఖ లెగందిగ నెగురన్
దన లసదాకారస్థితి
జననాయకహేళిదండ సరగ నయగతిన్.

212

వ.

నిలిచి శిఖ యారాజశశిం గాంచి యిట్లనియె.

213


క.

జానకి యిదె యీసనుసతి
గాన నరాధీశ యక్షఖగనాగనర
స్థానస్త్రీలందైనన్
యీనిల్కడ లేదయనిన నెంతే నలరెన్.

214


క.

ఆగతి గని ఖగదిక్చరు
నాగదితిజయక్షసిద్ధనాయకతతి యీ
శ్రీ గద యిందిర యిక సరి
యేగతి లేదనినఁ జెలఁగి లెల్లర నంతన్.

215


ఆ.

తండ్రియైనదశరథక్షితిరక్షిత
ఖచరతతిని గలసి ఖగతి నిల్చి
తనయసత్యనిష్ఠ ధన్యత గాంచితె
యని యనేక చెలగె హర్షసరణి.

216


వ.

అంతట.

217


సీ.

కఠినదారిద్య్రసంగతి దనర్చినయతఁ
             డెన్నఁ జెంగట నిధి గన్నసరణి
దిననాథచండదీధితి స్రుక్కినయతఁ
             డెన్న శాఖచ్ఛాయఁ గన్నదారి
కటికయాకటి చింత కాక జెందినయతం
             డెన్న నన్నస్థితిఁ గన్నజాడ
కరిఖడ్గకిటిరాజికాన జిక్కినయతఁ
             డెన్న తత్సరణిఁ దా గన్నసరణి


తే.

జనకజాకాంత ఘనకళాజాతికాంత
యగ్రధర నిల్కడగఁ జేయ హర్షజలధిఁ
దేలి తేలి దృగంచలతృష్ణ రీతి
గాంచికాంచి నయక్రియగణన జేసె.

218

తే.

కాక జల్లారఁ దనయంత గాననైన
సీత నందఱియానతిచేత నేల
ఘనత ఖగతతి యిచ్చినకాంక్షలెల్లఁ
గీశసంతతి నీడేర్చి కీర్తి హెచ్చె.

219


వ.

ఇట్లు సీతం గాంచి దాశరథి లేచి కౌఁగిలించి యాజగజ్జనయిత్రిం దనచెంగట
నధిష్టం జేసి యనేకచర్య లాచరించి.

220


క.

నాచేత గానినడకల్
నీచే నీడేరె గనుక నీదృఢచర్యల్
నాచర్యల్ ధరణీస్థలి
నాచంద్రార్కతన నిల్చె నక్కఱఁ దేరన్.

221


సీ.

నీకయి యద్రిజానేతకాండాసన
             యష్టి గండ్రించితి యంద రెఱుఁగ
నీకయి గట్లచే నీరధి హరిసేన
             చేత గట్టించితిఁ జిత్రసరణి
నీకయి దశకంఠనిర్జరారాతిసం
             తితి గీటడంచితి సతతశక్తి
నీకయి శక్రాదినాకజనశ్రేణిఁ
             జాల రక్షించితి జగతి యలర
నీకయి చిరంతనఖ్యాతి నిఖిలదిశల
శ్రీల నెన్నిక నెక్కంగఁ జేసినాఁడ
గనుక నీచేత యిట్లెకా కథ జనించె
సరసలాక్షణ్యజాజాత ధరణిజాత.

222


క.

తతకాలస్థితి దశగళ
దితిజాగ్రణి గాంచ నల్క దృఢసంధి రచిం
చితి యదె సత్యక్రియయై
క్షితి నిలిచె న్నీచరిత్ర సిరి సంధిల్లన్.

223

ఆ.

తండ్రికంటె ధరణిఁదల్లికిఁ దనయ సం
తతియ దాట నధికదయ దలంచి
యిట్టిసరణి ననక హెచ్చయ్య నాశక్తి
నీకె కల్గినయది నీరజాక్షి.

224


మ.

అదిగాకే దశకంఠదాయికయి యాశాధీశకంజానన
త్రిదశశ్రేణి తరంగిణీశతటి నర్థి న్నిల్చి కీర్తించఁగా
నెదచే నిందఱకైన నేటి చెఱఁగా యేనేగి దాసాళి గా
చెదనం చాడినజాడ జేసితిగదా సీతా జగన్నాయికా.

225


క.

అని సీత నెన్ని చాలా
యని నలసిన కీశఘటల నందర రక్షిం
చిన లేచి సంతసిల్లిరి
గని జేజే ల్గణన సేయఁగా నాయెడలన్.

226


క.

జానకిని గలసి ధరణీ
జాని తరచి చనదలచి సరగ నిశాట
స్థానాధినేత జీఱినఁ
దా ననియెం దాశరథి యెదన్ సంతసిలన్.

227


సీ.

ధనదయానస్థితి దరలితా రా నేఁడె
             సాకేతనగరికిఁ జరిగిరాదె
దశకంఠలేఖారి తన యన్నె దండించి
             యది తెచ్చి చరియించె నఖిలదిశల
నెందక్ష లెక్కిన నేనింట కెద గల్గి
             గాలికంటెను శీఘ్రగతిని దనరి
కాంచనరత్నసంఘటితరచనలచేత
             యెంత యేని దనర్చె నిదియె దీని
నెక్కి చనరయ్య యని తెచ్చియీయ నలరి
రాత్రిచరకీశసంతతి రాగఁ జేసి
యందఱల నెక్కఁగా నన్చి హర్షసరణి
దా నధిష్ఠించె నంటెయాధరణిజాని.

228

క.

జననాయకహరి సీతం
దనదాయిని నెక్కఁజేసి తగినట్టియెడన్
జనఁదలఁచి యనర సరణిన్
దనరఁగ నాకాశగతిని దరలిన యంతన్.

229


మ.

రణధాత్రిం గనజేసి సీత యిచటన్ రాత్రించరాగ్రేశితన్
గణనాతీతశరాశి నేసి తలలన్ గండ్రించితిన్ గంటె కం
కణకాంతింగల తత్కరాలి దెగియన్ గంజాతనాళక్రియ
న్నణఁగంజేసితి నిచ్చటన్ గలశకర్ణాఖ్యాకదైత్యాగ్రణిన్.

230


సీ.

అతికాయఘననాథహననసంస్థలి యిదే!
             యదె యగ్నికేశసంహరణధాత్రి!
సకలరాత్రించరుల్ జచ్చిరి యిచ్చట
             జలరాశిఁ గట్టిరి సరగ నిచట!
నీరధి గననయ్యె నిజరీతి నిచ్చట
             గలసె రాత్రించరకర్త యిచట!
ఖగకర్తచే జాడ గాంచిరి యిచ్చట
             సేనలఁ గలసితి చాన యిచట
నెలలనాల్గింటి జడగట్టి నీరధార
లడర నీగిరి నిలిచితి నధికచింత
[45]నర్కి కిచ్చితి కిష్కింధ నదియె దాని
కాంతి యెంతేని తెలియంగఁ గానరాదె.

231


మ.

అనిన న్నక్కడ నిల్చి కీశతతి సాహాయ్యక్రియన్ దాల్చినన్
జననాథాగ్రణి యట్లరా ననిచినన్ జాలాయెదల్ రంజిలన్
గనకాలంక్రియలెల్ల సీత యలరన్ గాన్కల్ తగన్నిచ్చి యా
యినజాతాగ్రతీసహాయ్య చెలియన్ నేతెంచె యం దెక్కినన్.

232


వ.

అయ్యెడఁ దరలి దనసతికి యారాజశశి యిట్లనియె.

233

సీ.

శక్రనందనహరి సంహరించితి నిటఁ
             జెట్లందె దాగితిఁ జెలియ యిచట
ద్రాళ్ల నేడింటిని దరిగితి నిచ్చట
             గెడసిన రక్కసి గీటితి నిట
నర్కిసంగతి గంటి నరయంగ నిచ్చట
             నీయలంక్రియ లెచ్చె నెలఁత యిచట
యనిలజనగచారి నలరి కాంచితి నిట
             జెంచెత సత్క్రియల్ జేసి తిచట
దీర్ఘకరరాత్రిచరనేత ద్రెళ్లె నిచట
నర్కసారథితనయ ఖగాధినాథ
సంగరస్థలి యిది కంటె జలజనయన
కానఁగానయ్యె దళశాల కాంత! యిచట.

234


క.

తాటకతనయఖగారిన్
గీటఁడఁచితి నిచట నిఱ్ఱిక్రియ నేతేరన్
నెట్టించి యతఁడ చీఱిన
నాటినదయ [46]గల్గి దాయి నాకై రాగన్.

235


ఆ.

జరశరీర యైన జటిలీల నేతెంచి
కదసి కల్లలరసి దండనిలచి
తస్కరాన నిన్నె తనరధస్థలి నిడి
చనియె దితిజకర్త చాన యిచట.

236


క.

ఖరదైత్యాదినిశాచర
హరణక్రియచేత దండకారణ్యానన్
సరగనె నిష్కంటకగతి
జరుగఁగ జేసితిని యిట్టిచాయం జాయా!

237


క.

అల్లన దైతేయాగ్రణి
చెల్లెల్ నిన్నేచ దాయి శీఘ్రత గీసెన్

గల్లరి [47]నాసిక కర్ణా
లెల్లెడలన్ రక్తధార లెగయఁగ నిచటన్.

238


ఉత్సాహ.

కలశజాతజటిలనేత గాంచి యిచ్చ నిచ్చటన్
అలశరాసయష్టి నందినట్టి జాడఁగట్టి గా
నలర నత్రికాంత యిడిన యంగరాగసంగతిన్
జెలఁగి హెచ్చినట్టిలీల చెలియ యిందె దెలియఁగన్.

239


స్రగ్విణి.

దండకారణ్యసంస్థాని కేతెంచి యా
చండదైత్యాగ్రిణిన్ జక్కఁగాఁ జెక్కితిన్
అండగాఁ జిత్రశృంగాద్రి కేతెంచి నే
గండడంగించితిన్ గాకి రా నీకడన్.

240


స్రగ్వణి.

చక్రసంజాతరాకన్యసైన్యాల దై
న్యక్రియన్ గానరానంత నాతండ్రి దా
శక్రసంస్థానికిం జన్నదిం దెల్సి శా
స్త్రక్రియం జేసితిన్ దత్క్రియల్ యిక్కడన్.

241


క.

అని యాద్యంతస్థితి దాఁ
జనకజ కెఱిఁగించి యిట్ల చనఁజన నంతన్
గని యండజాక్షజటికా
ననసంస్థలిఁ జేరి నిల్చి నరకర్త దగన్.

242


సీ.

కేసరినందనకీశాగ్రణిని గాంచి
             యీరాత్రి నిచ్చెద నిట్టిచింత
కాన శీఘ్రత నేగి కని కిరాతాగ్రణి
             యలరంగ నారాక దెలియఁజేసి
సాకేతనగరికిఁ జని జననీత్రయి
             కెఱిఁగించి నతిఁ జేసి యెద జిగిర్చ
నగ్రదాయినిఁ గాచి యతనికి నీచర్య
             కర్ణరంధ్రానందగతిగఁ దేల

తే.

సకలసన్నాహసంగతి జత దనర్చి
రాయగతిని యెల్లి యిచటికి రాగఁ జేసి
తిరిగి రారాదె యని యన్చ సరగనట్ల
చనియె హరికర్తలందఱల్ సంతసిల్ల.

243


క.

అగచారినేత యటఁ జని
నగశాననతతినిఁ గడచి నయగతినంతన్
దగఁ గంగదండ గ్రక్కున
నిగిడిన దయగల కిరాతనేతన్ గాంచెన్.

244


క.

కని దశరథతనయాగ్రణి
యెనయఁగఁ గానన జరించి యేతెంచి తగన్
ఘనత నిటకెల్ల రాఁగలఁ
డని తెలియఁగఁ జేసి చనియె నతిశీఘ్రగతిన్.

245


ఆ.

తరలి గంగ దాటి తా నంత సాకేత
రాజధాని గడచి రాగ నచట
సకలనరశరీరచర్యల గని యింక
నేనిటైన నగరె నిజతఁ తెలియ.

246


క.

అని నరదేహక్రియ దా
నెనయంగాఁ దాల్చి నగరి [48]కేఁగఁగ ఖరజి
జ్జననీత్రయి యలరంగా
సనయగతిం దెలియఁజేసి సాగిలి యంతన్.

247


తే.

జానకీజాని యిచ్చట సరగ నెల్లి
రాగలఁడటన్న నందఱల్ రంజిలంగ
నటఁ దరలి నందినగరిఁ జక్రాంశజాత
శశిని గని హర్షియై చక్కఁ జాగి నిల్చి.

248


ఉ.

తాటకహంత యిచ్చటికి దానని చెందఁగ దెల్యఁజేయఁగా
నేటికి [49]నండజాక్షజటినేత సహాయత నాశ్రయస్థలిన్

దాటగ నిల్చెగాన తనదాయికి సీత కనేక లెస్సలే
గీటడఁగించే రాత్రిచరకేసరి కైకసనందనాగ్రణిన్.

249


వ.

అది యెట్లంటేని.

250


సీ.

నిన్నిట కంచి నీయన్న దండకకానఁ
             జేరి దైత్యాగ్రణిఁ జెండి హెచ్చె
దశకంఠలేఖారి దయగల చెల్లెలి
             నాసిక కర్ణాలి గీసిచెలఁగె
దానికై కెరలిన దైత్యాలి గెడయించె
             యఘచింత గలయిఱ్ఱి నణఁగఁజేసె
తస్కరగతి సీత దనయింటఁ జేర్చిన
             నానిశాచరకర్త నరయదలఁచి
కడఁగి ఖగకర్తచే జాడగాననై న
నార్కి రక్షించి యాతనియన్న నేసి
యెనయఁ గిష్కింధ హరికర్త కిచ్చి సరగ
ధరణికంజాత నరయంగ దలఁచినంత.

251


క.

నన్నాదిగఁ గీశతతిన్
యెన్నికగా నెల్లయెడల కేఁగఁగ జేయన్
దిన్నని దక్షిణదిశగల
కన్నిధి లంఘించి సీత గాంచితి నచటన్.

252


మ.

కని నే నంతట రాక్షసాలి నణఁచన్ గట్టెం దగం ద్రాళ్ల చే
ఘననాదాఖ్య ఖగారి యట్టియెడ లంకం గాలఁగా జేసితిం
జని యాజానకియాజ్ఞఁ గంధి తిరుగన్ జంగం ధృతిం దాటి యా
జననాథాగ్రణి కెర్క సేయ నడచెన్ సైన్యచ్ఛటల్ దండరాన్.

253


ఆ.

తరలి సేనలెల్ల దనచెంత నేతేర
నెరయ జలధిదండ నిలిచినంత
తలఁగి సఖ్యగతికి దశకంఠదాయి రా
లంకకర్తగా నలంకరించె.

254

ఆ.

అట్ల నిల్చి కడలి గట్లచే గట్టించి
దానిదారి లంక దండఁ జేరి
రాక్షసారి సంగరస్థలి కేతేర
కీశఘట లెదిర్చి గీటఁ డంచె.

255


వ.

అంతట.

256


సీ.

కలశకర్ణలతికాఘననాథదశకంధ
             రాఖ్యరాక్షసతతియాదిఁగాగ
నెఱిఁజండి కైకసియిష్టనందన దంతి
             కెంతేని దయ లంక యిచ్చి యంత
సీత యేతెంచిన శిఖిఁ జేరఁగాఁ జేసి
             కందక నిలచినగతికి నలరి
తగ నేలి యంతట ధనదయానస్థితి
             దరలి రాక్షసకీశతతిని గలసి
చెలఁగి యేతెంచి నిలిచె నీచెంత నండ
జాఖ్యజటినేత సత్క్రియ లంది నేటి
రాత్రియదిగాన యదిరికి రాగఁదగదె
యని తెలియజేసి తిరిగిరానంత నిచట.

257


క.

ఆయండజాఖ్యజటి జన
నాయకశశిఁ గాంచి యింక నాచేఁ కాంక్షల్
యేయేగతి గన నడగగ
దేయన నంగీకరించి తెలియఁగజేయన్.

258


తే.

కీశసంతతి కాహారక్రియలకెల్ల
సరయ సాకేతనగరికి నన్నిదిశలఁ
జెట్ల కాయల తేనెల జెందనిచ్చె
నంత నాజటియానతి నచటఁ దరల.

259


వ.

అంత.

260

మ.

అట జక్రాంశజరాజకర్త సరగన్ హర్షాతిహృచ్ఛాలియై
కటకాలంక్రియలెల్ల జేసి [50]కణవత్ఖంఖాణదంతీరథ
చ్ఛటలన్ శానలకాహళావకఘటాఝంకారఢక్కాదిగా
రట దత్యంతధణంధణల్ నలుదిశల్ [51]రంజిల్లఁగా దా నటన్.

261


చ.

చని ఖరహంత యాదికృతసంధిలనిచ్చినదాశ కైకయీ
తనయ దరాధినేత లసదాగతి ధిక్కరణాతిశీఘ్రన
ర్తన దినచర్యలం గలసె ధాత్రిదిగంతహితక్షితీశతల్
గని ధనరత్నదంతిరథకాండఘటల్ సిరికాన్క లియఁగన్.

262


ఆ.

ఇట్లు దలరి యెదిరి కేతెంచి దశరథయగ్రతనయశశికి నతనిసతికి
కాళ్ల కెరిఁగి లేచి గణియించి దాయిచే
గడఁగి యతనిఁ గాంచి కౌఁగిలించె.

263


తే.

అహితహరణాఖ్యగలదాయి యట్టిచెంత
జరణకంజాల కెరగిన జక్కనెత్తి
కదిసి జననీత్రయిని గాంచి కాళ్ల కెరిఁగి
ఘనతనీయ తదాశిషల్ గాంచి రచట.

264


క.

అంత కిరాతాగ్రణిఁ గని
సంతసగతి నతనిపతికి సహజస్నేహా
త్యంతదయాజనితనిజహృ
దంతరియై తాటకారి యలరించె దయన్.

265


క.

ఆదైత్యాగ్రణి వారిని
సాదరగతి కౌఁగిలించి సంతసిలెఁ దగన్
యేదెసఁ గాంచిన జయజయ
నాదక్రియ లెసఁగ గీతి[52]నర్తన లలరెన్.

266


వ.

అట్టి యెడ.

267

క.

నగరిజనగణన లెచ్చఁగ
జగతి యదరఁగా హళాదిఝర్ఝర లెసఁగన్
అగణితఢక్కాధణధణ
ఖగసంతతి దద్దరిల్ల గ్రక్కన గదలెన్.

268


ఆ.

కదలి గంగ గడచి కాంక్షచే యక్షేశ
యాన ధాత్రి డిగ్గి హర్షలీల
సరగదాని ధనదసంగతికై యంచి
రాష్ట్రదంతి నెక్కె రాజకర్త.

269


క.

చక్రాంశజాతదాయిన్
చక్రీశాంశగలదాయి సరగ రయగతిన్
చక్రికి నీకడ నాకడ
చక్రీచక్రియలఛత్రశర్ఙధృతిగతిన్.

270


తే.

ఏనిగల నెక్కి తగఁ దాల్చి యిద్ద ఱరుగ
చరణరక్షల కడదాయి చేత దాల్చి
కరటికంఖాణరథరాజి ఘనత నెక్కి
గీశరాత్రించరేశితల్ కెలన రాగ.

271


ఆ.

అందలాలయంద యట జననీత్రయి
ధరణితనయఁ గదిసి తరలిరంత
రాజధానిఁ జేరరా నట్టిశృంగార
కాంతి యన్నిదిశల గాననయ్యె.

272


తే.

నిర్జరాధీశ శిఖికాల[53]నిర్జరారి
కంనిధీనేత యని యక్షాధినాథ
శంకరాదిదిగేశితల్ సరసలీల
గణన లెచ్చంగ రెండెడ గలసి రాగ.

273


తే.

అఖిలదేశనరేశిత లచట గదిసి
సందడి దనర్చి యేతేర సరగనంది

నగరికడ నిల్చి యాయజనందనజటి
యాదిధరణీఖగచ్చట లంది కనిన.

274


మ.

కరకంజాలనె రెంటినంటిలఁగ జక్కంజాలి యల్కస్థితిన్
నెరయం జేరిచి నిల్చినంగని యెదల్ నిండార హర్షస్థితిన్
సరగన్నందరలీయ నాశిషల హెచ్చంగాంచి హర్షాసనా
లడయం జేర్చిన నెంతయే నలరి యయ్యాసీనత న్నిల్చినన్.

275


క.

ఆజటినేతల యానతి
రాజకళలఁ చెందినట్టి రాజశశియటన్
రాజిసగతి గద్దియకడం
దేజితసంస్థాని యయ్యె దిగ్గన నంతన్.

276


తే.

కైకనందనరా నేలగదిసి చరణ
కంజరక్షలఁ దలదాల్చి కడన నిల్చి
యన్న! నీయాజ్ఞ నాశిరస్సందె దాల్చి
నేర్చిన ట్లధినేతనై నిలిచినాడ.

277


ఆ.

రాజనీతిచేత రాష్ట్రజనాళికి
శ్రీ లెసంగ రక్షఁ జేసినాఁడ
నిట్టి చరణరక్ష లిన్నిదినాల్దాక
గద్దెయందె జేర్చి కడనలిచ్చి.

278


ఉ.

రాజశశాంక నీచరణరక్షల హృత్స్థలి దాల్చి దండినై
రాజితరాష్ట్రసంస్థలి నరాతిజనాళికి దేరికాంచనెం
తే జడియంగ నాజ్ఞ జగతీస్థలిఁ జల్లఁగ నింతదాక నే
నీజనరకు దాలిచితి నిల్చెద నీకడ దాససంతతిన్.

279


సీ.

కలశజజటిగాక కంధినీ రరగించి
             తక్కిన ఋషితతి ద్రాగఁగలరె!
హరకంఠసంస్థితహాలాహలక్రియ
             దైత్యఖగచ్చటల్ దాల్చఁగలరె!

శేషాహి తనదృఢస్థితిని దాల్చిన ధాత్రి
             నితరయహిశ్రేణి యెత్తఁగలదె!
కనకాద్రి శ్రీహరి గదిసి దాల్చినయట్ల
             నన్యనిర్జరతతి యానఁగలదె!
కాన ఛాత్రిని రక్షించగాను టెంకి
నీకె తగెఁగాక నే నెంత నిల్చి దాల్చి
దశరథాగ్రజతరణిసంతతికి నెల్ల
హర్షగతిగా నధిష్టాత యైన లెస్స.

280


ఉ.

కాన నరాగ్రగణ్య! యిక గ్రక్కన నిచ్చట దర్లి రాజసం
స్థానికి నేఁగి యచ్చటనె సంగతి నిల్చిన లెస్స యన్న శీ
ఘ్రాననె తర్లి రత్నకనకాంచితచిత్రరథస్థలిం దగన్
దా నట కెక్కి దాశరథి తన్నగరిస్థలిఁ జేరరా నటన్.

281


శా.

శ్రీకంఠాదిఖగార్చితాంఘ్రినిధి యాసీతాంగనానేత తా
సాకేతస్థలిఁ జేరరాఁ దెలిసి రాజన్యచ్ఛట ల్దార ల
త్యాకాంక్షల్ రథకాండసైనికగజేంద్రశ్రీ నెదిర్చం గన
ద్రాకాసీత కరాకృతిన్ దనరె నత్యానందసంసిద్దిచేన్.

282


వ.

ఇట్లు సాకేతరాజధానిఁ జేరంజనియె.

283


సీ.

రథచక్రజఝ్ఝరల్ రయగ తిన్నడిచెడి
             ఘనఢక్కధణధణల్ గలసి చెలఁగ
గాహళఝఝ్ఝరల్ ఘంటాఘణంఘణల్
             సకలాశలందును సరగనిండ
రాయిడిఁ గరిహయరాజిఘట్టనలచే
             సరగరజశ్రేణి చదల నెగయ
సాలాంతకాంచనచ్చాయలఁ దనరిన
             కేతనదీధితుల్ గ్రిక్కిరియఁగ
గణికనారీరచితనాట్యగతి చెలంగ
రెండెడలఁ జంద్రశాలల దండ నిలిచి

[54]నగరసతితతి యక్షతల్ తగిన లాజ
లాదిగా జల్ల నత్యంతహర్షలీల.

284


క.

చని రాజనగరి డగ్గరి
తనర రథస్థలిని డిగ్గి తత్సదనాంత
ర్ఘనకాంచనశాలలకడ
జనకర్త చరించె నధికసంతసగతిచేన్.

285


వ.

ఇట్టు లారాజశశి హర్షగతి నిజగృహాంతరస్థలిని నిలిచి తనదండ కేతెంచిన
కీళశరాత్రించరతతి కర్హస్థలి నిల్కడ సేయనిచ్చియిష్టాహారక్రియల సంతసిలం
జేసి యనేకక్రియల లాలించి యంతట తీర్థస్నాతయై చందనాక్షతాద్యలంక
రణలం దనరి శతధృతినందనాది ధరణిఖగచ్ఛటలహితజనసంతతిని దాయిత్ర
యిని దండ నధిష్టించజేసి క్షీరాన్నదధ్యాన్నక్రియల షడ్రసకలితాహారతతి
యాజ్యాదిదధ్యంతగతిగా నారగించి దక్షిణల ననంతక్రియల ధాత్రీఖగ
తతి నలరించె నంతట సంధ్యాకాలగతి యయ్యె నెట్లనిన.

286


తే.

ఆదిదిక్కాంత గలిసినయట్టి సంత
సాన నాకాశగతి యంది సరగ నేగి
నీరవాయక దిక్తతి జేరనలరె
ననఁ దరణి జారె నంతట నడచె సంధ్య.

287


క.

చీఁకటి దిక్తటి నెల్లెడ
లేకక్రియ నిండినట్టియెడ నక్షత్రా
లాకీర్ణస్థితి దనరెన్
రాక చెలఁగి శశి దనర్చి రహి గననయ్యెన్.

288


క.

చంద్రికలు దిశలఁ గలయన్
సాంద్రక్రియ నిండెనంత సరఁగ ననంగన్
ఇంద్రకిరీటజఘృణి యన
నింద్రాశన్ దార దనరె యెన్నిక నంతన్.

289

క.

చీఁకటి యెడనెడ జారఁగ
కేకలచే చరణశస్త్రి కిల రంతడరం
ఢాక చెదరి శశిధారన్
ఏకడలను నెఱ్ఱసంజ లెనసిన నడఁగెన్.

290


వ.

అంత.

291


సీ.

ఘనతరకఠినాంధకారదిక్కరి రక్త
             శరధి నీరాడిన హరి యనంగ
నగ్రదిగ్జలనిధియండ గాదని తర్లి
             చెలఁగి యేతెంచిన శిఖి యనంగ
నాకాశశరదైత్యహరణక్రియల హరి
             యించనిల్చిన చక్రహేతి యనఁగ
నింద్రదిఙ్నగరంధ్రహేలాజనితశేష
             కాలాహిచిరరత్నకాంతి యనఁగ
జీఁకటి యడంగ జలజనిశి చెలంగ
జనతతి దగంగ యర్ఘ్యాళి సరి నిడంగ
గాంతి యడగంగ కలహారకళదరంగ
తరణి గననయ్యె దశశతకిరణజాలి.

292


తే.

తనర దశరథనందన తరణియంత
కాల్యకరణీయక్రియలెల్లఁ గడఁగిఁజేయ
నట్టితఱి జలజనందన జలజనేత
సన్నిధి దనర్చి నతిఁజేసి సంతసాన.

293


క.

అయ్యెడ రాజటిలాగ్రణి
చయ్యన కీశాధినేత జని తగ ననిచెన్
దియ్యన నాతని నతిగని
యయ్యెడ కే సాగరాల నన్నిటినీళ్లన్.

294


తే.

గ్రక్క నే తెచ్చినది లెస్సగాదె యనిన
నగచరశ్రేణి నేయించి దలఁచి కేల
ఘటతతిని దెచ్చియిచ్చిన గాంక్ష నలరి
యతనియాజ్ఞ కెంతే లెస్స యని చెలంగి.

295

ఉత్సాహ.

సాగరాల నాలిఁగింట జనదనర్చి కొండలన్
దేగలట్టి నగచరాలి దిగ్గనించినంతనే
యేఁగి శీఘ్రయానసరణి నిచ్చలం దలంచఁగా
నాగడియనె సంతసాన నట్ల తెచ్చియిచ్చినన్.

296


సీ.

అతిధృతిఘటరాజి నత్యంతసంతోష
             గతి రాజనిలయసంగతి నిడించి
శతధృతినందనశాంతహృదయజటి
             కల్యాణదినలగ్నఘటికఁ దెలిసి
ఘనత ననేకర్షిగణసంగతి దనర్చె
             హితశాస్త్రసరణిని యిచ్ఛ నలరి
దశరథాగ్రజరాజితరణిని తగఁ జీఱి
             తనర సింహాసనస్థాయిఁ జేసి
సరగ సాకేతరాజిసంస్థాని కింకఁ
గర్త యీతండె యని శంఖకలితతీర్థ
స్నాయిగాఁ జేయ నెదలందు సంతసించి
కణఁగి నరదైత్యహరిఘటల్ కాంక్ష నిలచె.

297


సీ.

కైకనందనదాయి యిద్దఱ (లంతట)
             గాలికఱ్ఱలచేత ఘటన దాల్చి (?)
యర్కజాంగదరాక్షసాధీశుల నిజా
             ద్యఖిలనాయకతతి యలరి తలఁచ
శేషాంశజాతుఁడౌ చిన్నిరానెల దాస
             గతిఁ గార్యసరణిఁ దా గడఁగి తీర్చ
శతధృతినందనజటిలాగ్రణి యనేక
             గణన నాశిష లీయఁ గాంక్ష లెచ్చి
ధరణి కధికర్తయై సిరి దనర నిల్చెఁ
గనకసింహాసనధరిత్రిఁ గళల నిండి
శశిగ్రహాళికి నది చక్కి నెగసినట్ల
దాశరథి యష్టహరిదీశతతి జెలంగ.

298

చ.

జలచరకేతనాస్త్రతతిఁ జిక్క ఖగాలి జెలంగి చక్కఁగా
నిలిచి యనేకఢక్క లట నింగి ధణంధణ లానఁజేయఁగా
సలలితగాననర్తనల సంతసిలె న్నిక నారదర్షి గీ
తల నెసగించ రాజశశి తా నలరెన్ సకలార్థసిద్ధిచేన్.

299


సీ.

ధనధాన్యసంగతి దనరి హెచ్చె ధరిత్రి
             లక్షిరాల్గని యంగఁ జారె (?)
జెట్లెల్లఁ జికిలించె సిరి యలర్చఁగఁ గాసెఁ
             దస్కరక్రియ దహదహలడంగెఁ
జిన్నల కేయెడ జే టెన్నఁ డెరుఁగరే
             శ్రీలిక నాథతలీల దేరె
ఘనరసాల్ నెలకె ద్రికాలా ల్గలకసాగె
             జనతతి యందంద సంతసించెఁ
గనకరత్నాద్యనేకశ్రీకరతచేత
రాష్టృజనరాజియాఖ్యగా రాజికళల
నీతిచే దానదాక్షిణ్యనిరతి గనియె
దాశరథిరాజ్యసంస్థలి దనరె నంత.

300


ఆ.

ఇట్ల రాజధాని కేలిక యై యంత
గీశదైత్యఘటల క్రీడ లరసి
యందఱికిని రత్నహాటకశాటిక
లలరఁ దనియ నిచ్చి యనిచెఁ దిరగ.

301


ఉ.

ఈగతి నందఱిం దిరగ నెన్నిక నన్చె యధేష్టలీలలన్
రాగిలి జానకిం గలసి రత్నగృహాళి జరించి ఖ్యాతిగా
సాగి హయేష్టి జేసి సరసస్థితి నేలె ననేకకీర్తిచే
ధీగణనల్ జెలంగ నగధీరత రానెల ఛాత్రి లెస్సఁగాన్.

302


క.

తనరాజధాని దశరథ
తనయాగ్రణి నిలిచె సహజధరణీతలరా

డ్జనతాహితజనసంతతి
[55]యనతానందాన జెలిఁగి యతిశయిలంగన్.

303


క.

ఎల్లదిశల జనతతికిం
దల్లిందండ్రి యన నధికధనధాన్యశ్రీ
సల్లలితస్థితి నుండఁగ
జల్లగ ధర యేలె జనకజాజాని తగన్.

304


క.

దిశల జనులెల్లఁ బొగడఁగ
దశరథనందనచరిత్ర ధాత్రి వెలయఁగా
నిశితమతిఁ జేసె నసదృశ
యశుఁడగు మఱిఁగంటి సింగరాచార్యుఁ డిలన్.

305


క.

శతధృతకర[56]కంజక్షా
ళితచరణసరోరుహాంగుళీజనరిత్వా
పితనేత్రాయుధశేఖర
దితిజాధిపవైరిదళన దృఢతరనఖరా.

306


[57]చ.

ఘనఘనసార సారసమృగప్రభుకుంభవతార తారకా
వననిధిరాజ రాజహరవాఘృణితాధిమనాగ నాగరా
ణ్ముఖునిపతీజవజ్రబృథనోకహచండునకుండ కుండవా
హనముఖకీర్తి కీర్తితనయప్రతిభాగుణవిక్రమోన్నతా.

307

నాగబంధము

చ.

నరహరి ధీరసూరివర నారదవర్ణితగానలోల శ్రీ
వరకరుణావిచార కరివైరిహర స్థిరభోగపావనా!
నిరతనవీనహారధర నీరజ[58]సద్మవిహార భూరతా
హరి[59]నగజాతసారసుత యాతతలంఘనచారువాససా.

308

ఖడ్గబంధము

ఉత్సాహ.

శౌరిశౌరి సూరి వంద్య శాప తాప [60]కోపనా
సూరిభూరివైరిహంస సోమసోమలోచనా
నారిదుర్విచారికర్ణనాసికా[61]విఖండనా
[62]వారితోగ్రదైత్యగర్వవన[63]కృశాను! పావనా.

309


మాలిని.

జనకలుషవిదూరా సర్వలోకైకవీరా
ఘనతరశుభగాత్రా కంధికన్యాకళత్రా
కనకరచితహేలా కద్రుగోపాలబాలా
ఘనతగుణవికీర్ణా కాండభాండప్రపూర్ణా.

310

గద్య
ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై
శ్వర్యధురీణ శారదాప్రశ్నవివరణ శతఘంటావధాన వినయధునీ
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధురవాగ్వైఖరీఝరీధురీణ
స్థాపితాశేష విశేషప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్ఠ్యాష్ఠ్యాది వింశతి
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్రపవిత్ర
తిరుమలదేశికేంద్ర పౌత్ర తిరువేంగళాచార్య పుత్ర
మఱింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన
దశరథరాజనందనచరిత్రయను మహాప్రబం
ధంబునందు పంచమాశ్వాసము
సర్వంబును సంపూర్ణము311

శ్రీశ్రీశ్రీ

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. రాళ్ల (ము)
  2. సాగి రాసలెల్ల (ము)
  3. శిఖర (ము)
  4. యాశ లేనిచంగట (ము)
  5. నీళలరంగ (ము)
  6. 'శి' యందును గలదు.
  7. జేసిన (ము)
  8. 'శి' లో లేదు.
  9. జద్దితిజ (ము)
  10. లగలన్ (ము)
  11. జేల(ము)
  12. కచరాధరారి (ము)
  13. కచరాధరారి (ము)
  14. నెనంత (ము)
  15. కడగిలి (ము)
  16. కేళనేన (ము)
  17. సాదరణ (శి)
  18. నింతా (శి)
  19. రణస్థలి (శి)
  20. క్షితిధరచరఖేచర సం....(శి. గ.)
  21. లీలను (ము) లీలలఁ దెగనార్చియార్చి (శి)
  22. జడకగా యద్యకలశిఖల్ (ము)
  23. నిలిచిచల్లి (ము)
  24. 113 నెం. వచనము (శి)లో లేదు.
  25. చరనాగి (ము)
  26. శాంతిచేదాంతి (ము) శాంతిదాంతిదయానయ (శి)
  27. సాటి దాకించెగాని నిశాచరేంద్ర (శి.గ.)
  28. నారాజచలంజనించె (శి)
  29. శైలదజిదాది (శి)
  30. సీతను నీతి నిచ్చి నుతి జేసి (శి. గ)
  31. లక్షనందనజాల (ము)
  32. ధనాతి (ము)
  33. శారణాహితశాదచండకిరణ (ము)
  34. నిర్జరాహతి (ము)
  35. గంధిధరారితా(ము)
  36. గలసెటట్టయ్యె (ము)
  37. అదితనయనంగ (ము)
  38. పాఠ మన్వేషణీయము
  39. రసంగ్రహ (ము)
  40. 184 పద్యమునకే 'పాఠాంతరముగా' ఈ పద్యము 'ము'లో గలదు.
    చ. “దితితనయాదితేయతతి దెచ్చి గిరిన్ ఘనచక్రితాటనా
        యతగతి గట్టి రెండెడల యక్కఱ దీర్చఁగజాలినంతనే
        యతిరయశక్తిచే జలచరాకృతిలీల ధరించి దాని యా
        తతకఠినాంసధాత్రికడఁ దాల్చిన నీతెఱఁ గెన్న నేటికిన్."
  41. దిక్కెరి (ము)
  42. దాసీదాస (ము)
  43. కంకిలియై (ము)
  44. నదె (వ్రా)
  45. లర్కి కిచ్చితి కిష్కింధలదియ (ము)
  46. కనె (ము)
  47. నాశా (ము)
  48. కేగట (ము)
  49. (నండజాఖ్య ?)
  50. కణకక్కంఖాణ (ము)
  51. రంజిల్ల గందరెన్ దగన్ (ము)
  52. గీర్తనర్తన (ము)
  53. నిరజతీశ (ము)
  54. సగర (ము)
  55. యనతానందజెలన డాసి నతిశయిలంగన్ (ము)
  56. కంజాక్షా! (ము)
  57. సంశయములతో అర్థరహితముగా గల పద్యము
  58. పద్మ (ము)
  59. నఘజాత (ము)
  60. కోపనీ (ము)
  61. విదారినీ (ము)
  62. ర్వారితోగ్ర (ము)
  63. కృశాస (ము)