దశరథరాజనందనచరిత్ర/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

దశరథరాజనందనచరిత్ర

ద్వితీయాశ్వాసము

క.

శ్రీలలనాపీనస్తన
పాళిజఘనభర[1]చికురబంధాగ్రసదా
[2]లోలకర నఖర శిఖరద
యాలక్షణ సీమ కర్పరాద్రి నృసింహ.

1


వ.

ఆతఱిఁ గథాసరణి యెట్లంటేని.

2


చ.

జనకధరాధినేత సరసస్ధితి యజ్ఞకరేచ్ఛఁ దా ధరా
జనతతి రా దిశల్ గలయఁజాటఁగఁ జేసిన [3]నాలకించి కాం
చనరథగంధనాగహయసైనిక[4]సంతతిచే హళాహళిన్
దననగరాంతరస్థలి హితక్రియ నిండఁగ సాగి రయ్యెడన్.

3


ఉ.

ఈగతి యజ్ఞదీక్షఁ గన నెల్లధరాతల[5]నేత లేగరా
నాగతి గాధిజాత జటిలాగ్రణి యారసి, రాక్షసారికిన్
శ్రీగల యట్టి యర్ధ జయసిద్ధి గదాయని నిశ్చయించి తా
రాగరసస్థితిన్ గదలె రాచనెలల్ తన చెంత నంటఁగన్.

4


వ.

[6]ఇట్లు నానాటికి యాత్రాసరణి గాధేయజటిం గాంచి దాశరథి
యిట్లనియె.

5


క.

ఇదియే జటిరాజస్థలి
యది గంగాతటిని [7]దాని యాగతి యంతా
చెదరఁగ దెలియఁగ జేయఁగ
గదె యన రాక్షసారిఁ గని నయసరణిన్.

6

వ.

ఆజటి యిట్లనియె.

7


క.

గంగానది దీనిక్రియన్
సంగతి శేషాహికైన శతధృతికైనన్
యంగజహారికినైనన్
యంగద గాదే గణించ నాశ్చర్యగతిన్.

8


వ.

అట్టి గంగా[8]జననసరణి యెట్లంటేని.

9


చ.

అదయసహస్రహస్తఖచరాహితతాత [9]కృతార్థిఁ గన్న యా
త్రిదశధరాధినేత యతిదీనత నారసి తల్లిగాన నా
యదితి సహించలేక జలజాసననందనశాసనక్రియన్
జెదరక కాన కేఁగి హరిచింతన జేయఁగ సాగె నిష్ఠచేన్.

10


చ.

తలఁచిన నగ్రధాత్రి నుచితక్రియ నిల్చిన శేషశాయినా
జలజదళాయతాక్షిఁ గని సాగిలి[10]తా నతిఁ జేసి లేచి [11]కే
లలికతటిన్ ఘటించి యతి హర్షరసస్థితిచే ననేకచ
ర్యల గణియించి యాడెఁ దనయండ జటిచ్ఛటలెల్ల నారయన్.

11


వ.

అట్టియెడ హరి యిట్లనియె.

12[12]


క.

కనకాంగీ దశశతహ
స్తనిశాచరనేత తండ్రి సాహసగతి నీ
తనయాగ్రణి [13]గలచఁగ నిటు
చనిన తెఱంగయ్యె నింత జడియఁగ నేలా.

13


చ.

[14]సలలితు నీతగానిజయశక్తి జయించఁగ రానిదానిచే
నెలఁత చలించ నేటి కెద నీజఠరస్థలి నే జనించెదన్
[15]ఖలఖచరారి నేత సిరి గాఢతరక్రియ సంగ్రహించి ది
క్తల నరకర్త లెన్నఁగ హితస్థితిచే నచలారి కిచ్చెదన్.

14

క.

అని యనిచిన నచలాహిత
జననియు నిజకార్య[16]సరణి జటికది యెఱిఁగిం
చిన సంతసిల్లి సతిఁ గల
సినయెడ నానాఁటఁ జీర చిక్కెం దెలియన్.

15


మ.

దినచర్య న్నెలలెల్ల నిండిన ధరిత్రీజాని యంశస్థితిన్
గనియెన్ నందననేత నాజటిల రాట్కంజాక్షి యాదిత్యకీ
ర్తన లర్థిం దనరంగ నచ్చరల నృత్యక్రీడ లెచ్చంగఁ గాం
చననిస్సాణధణంధణల్ చెలఁగ నాశల్ తేజరిల్లం దగన్.

16


క.

ఈలీల నిఖిల[17]లక్షణ
శాలిహరి యతీంద్రసతికి జనియించి జయ
శ్రీ లెసఁగ నాటినాటికిఁ
జాలా యీడేరసాగెఁ జక్కఁగ నంతన్.

17


చ.

దశశరహస్తదైత్యకరి తండ్రి యహంక్రియ సంధిలంగ న
ల్దిశలనృనేతలన్ గెలిచి తెచ్చిన కాంచనశక్తి నిష్ఠ దా
నిశితగతిన్ రచించ ధరణీఖగసంహతిరాగహర్షకృ
ద్దశనచలారి దాయి సహితస్థితిచే జనియెన్ కళారతిన్.

18


వ.

ఇట్లు చని సకలదిగంతాయాతహితజనాగ్రజసంతతి తేజరిల్ల సహస్ర
హస్తలేఖారాతి తండ్రి యజ్ఞశాలం జేరి యందఱల సందడి నిలిచె నంత.

19


క.

తారాంతస్స్థలి లేనెల
దారిన్ లాక్షణ్యకళల దనరారిన శై
లారాతి దాయిఁ గని ఖచ
రారి కదియనేగి నిలిచి యానందగతిన్.

20


ఆ.

అతని రాజధాని నాఖ్యఁ దల్లిని తండ్రి
నడిగి కాంచనాసనాగ్ర్య ధాత్రి
[18]నర్థితోడఁ జేర్చి యఖిలార్చనలచేత
సంతసిలఁగ జేసి చక్కనిలిచి.

21

చ.

అనఘచరిత్ర! నిన్గని జయక్రియఁ జెందితి గానదాచకే
కనకకిరీటహారకరకంకణచిత్రకరత్నచేలచం
దననటచేటికారజితదంతిశతాంగహయాదికాంక్ష లె
ల్ల నడిగినంతనే తనయ లాలన నిచ్చెదఁ గీర్తి హెచ్చెదన్.

22


వ.

అనిన సంతసిల్లి.

23


క.

అన్నరఖాదాగ్రణి గని
చిన్నన్ నా కిట్టికాంక్ష సేయఁగ నేలా
నిన్నడిగిన నీరాదే
తిన్నఁగ జరణత్రయక్షితిన్ హర్షగతిన్.

24


వ.

[19]అని యడిగి.

25


ఉ.

ఎన్న నిశాటకర్త ధృతి నిచ్చితి నీ హృదయాచ్ఛకాండ నేఁ
డన్న ధరాంతరిక్ష[20]నిఖలాశనిశాచరశైలరాణ్ణదీ
కన్నిధికాననత్రిదశ[21]కంధిజనీడజకీలతారలం
దన్నిట దానయై నళినజాండఘటస్థలి నిండె నయ్యెడన్.

26


ఆ.

జగతి నిండ యంఘ్రి సత్యజగత్ స్థలి
[22]కంట జూచినంత హర్షగతిని
యరసి చక్రయంఘ్రియని ధాత యేతెంచి
కదిపి దాని కెఱఁగి గణనఁ జేసి.

27


మ.

కరకాంతర్గత నీరధారల దృఢాకాంక్షన్ జగత్కర్త శ్రీ
చరణాగ్రస్థలిఁ గేల నంటి కడుఁగన్ జాలై ధరన్ జారఁగా
శరజాస్త్రారి [23]రయక్రియం జని శిరస్స్థానిన్ ధరించె న్సదా
హరిదీశత్రిదశాహియక్షఖగసాధ్యశ్రేణి కీర్తించఁగన్.

28


తే.

అంధకారాతి దాల్చిన యట్టిగంగ
యర్కసంతాననరనాథ యత్నసరణి

ధరణి జారినయది గాన దశరథేశ
నందనాగ్రణి! లెస్స గానంగరాదె.

29


క.

ఆ గంగాహ్రాదిని తా
సాగరసంగతి [24]నొనర్చె జనసంచయచం
డాగస్స్థితి నడగించఁగ
శ్రీగతి సద్గతి ఘటిల్లఁజేయఁగ ధరణిన్.

30


క.

అని గాధిజాతజటి చ
క్కన గంగాతటిని జననగతి దెలియఁగజే
సిన నాలకించి దశరథ
తనయాగ్రణి సంతసిల్లి దారిఁ జనంగన్.

31


చ.

ఇలహరధాతలైన గణియించఁగరాని నిశాచరారిస
జ్జలజఘటాండజాతసృణిసారసచక్రదృఢాంఘ్రిఁ చాకినన్
శిల నళినాయతాక్షి యయి [25]చిత్రకథాతిశయాచ్ఛలీలలన్
నిలిచెఁ దదగ్రధాత్రి జటి నేత లటం గని సంశయించగన్.

32


సీ.

అచలారి నిరసించినట్టి రాక్షసనేత
             నచలక్రిందికి దన్నినట్టి యంఘ్ర
[26]సత్యజగత్ స్థలి చక్కికై సాచిన
             నలశత ధృతికడ్గినట్టి యంఘ్రి
సకలఋషిశ్రేణి సంతతాసక్తిచే
             సరసి హృత్కలి దాల్చినట్టి యంఘ్రి
కలశనీరధికన్యకాస్తనఘట్టన
             నతిశయిల్లఁగ జేసినట్టి యంఘ్రి
[27]యనఁగ సనకసనందనాద్యఖిలఖచర
యతితతికినైన గనరాని యట్టియంఘ్రి

తాకినంత [28]ధరాధినేతలు గణించ
శిల నళిననేత్రయై నిల్చె జిత్రకళల.

33


చ.

నిలిచిన యాయహల్య, ధరణీతనయేశితకాళ్ళచెంత సా
గిలి, నతిఁ జేసి, లేచి తనకేల్ నిటలస్థలి నంటఁ జేర్చఁగా
దెలియక గాధిజాతజటి దిక్కటుగాంచినఁ జేరనేగి తాఁ
గలిగిన గాథ దృష్టగతిగా నెఱిఁగించఁగసాగె నయ్యెడన్.

34


క.

ఇక్కాననాంతరస్థలి
జక్కన నరికాలికంటిజడదారికి దీ
రెక్కిన గేహిని యయి ధర
నక్కఱ గననయ్యె దా నహల్యాఖ్య తగన్.

35


ఉ.

చక్కఁదనాలటెంకి, నెరజాణ నహల్యఁ గళానయక్రియన్
జిక్కఁగ నందఱల్ గణనసేయ నెఱింగి ధరాధరారి తా
నక్కఱదేర నంగజకరాగ్రలతాంతశరాగ్రకీలలన్
జిక్కి తదాశ్రయస్థలికిఁ జేరఁగ నేగి రహస్యచర్యచేన్.

36


ఆ.

అక్షచరణజటి[29]గ, నాకృతిఁ దాల్చి య
హల్యఁ గదియ జనిన నానగారి
చిహ్న లరసి సంతసిల్లి యంగీకార
సరణి దిరిగి సదన జగతి నిలిచె.

37


వ.

అంత.

38


చ.

తనలతికాగృహస్థలి హితస్థితి నిల్చిన నీరజాననన్
గని యచలాచలారి నెఱకాకలఁ దాళఁగలేక చేరఁగాఁ
జని జిగిఁ కౌఁగిలించి, రతిసారతరక్రియ దాల్చె స్రక్చర
స్తనజలధార లేర్లగతి జారఁగ హర్షితచేత దేలఁగాన్.

39


వ.

ఇ ట్లహల్య నంగజకేళి సంతసిల్లఁ జేసి చన నంత.

40

క.

దారిన నేతెంచిన శై
లారిం గని యక్షచరణయతి దృగ్జాంతా
గారకతతి రాలఁ దృణా
కారక్రియఁ దెరల జలదగర్జలచేతన్.

41


ఉ.

 ఏ నిఁటలేని చెంగట నహీనతరక్రియచేత నేఁగి నా
చాన నహల్య జేరి యతిసాహసశక్తి ననంగకేళికిన్
గాన నడంచినట్టి కతనం గడ నీ కిక లింగహానియై
గ్లానియు నింక రాదె యన గ్రచ్చఱ జారె దిశల్ చలించగన్.

42


వ.

అంత నక్షచరణ జటి యతినిం గాంచి.

43


చ.

అలజడి చెందనేలఁ ద్రిదశాలయనాయక! నాహృదంతర
స్థలి దయ సంఘటిల్లె దినచర్యల నీ కిక కార్యసిద్ధి కాఁ
గలదని యాడి దాటి చని గ్రచ్చఱఁ జెంగట నిల్చినట్టియా
జలజదళాయతాక్షిఁ గని చండతరాగ్రహదృష్టి దేరఁగన్.

44


క.

చానా! హృత్ స్థలిఁ దలఁచగ
రానినడక నడిచితే యరాళగతి నర
దశరథరాజనందన చరిత్ర
ణ్యానన్ కఠినశిలాకృతి
చే నిలకడ సేయరాదె శీఘ్రత ననినన్.

45


క.

తనచెంగట జడచారిం
గని యార్తిం జడిసి యతనికాళ్ల కెఱఁగ న
ల్లన హృదయస్థలి జనియిం
చినదయచే నాయహల్య జేరిక నాడెన్.

46


చ.

నళినదళాయతాక్షి! యెదనాటిన చండతరార్తి రేచఁగా
గలఁగగనేల దాశరథి కార్యహితస్థితి నిట్టిదారి రాఁ
గలఁ డదిగానఁ దచ్చరణఘర్షణలీల ఘటిల్ల నాటితీ
రలరఁగ దాల్చె న న్నెరసి యర్థిఁ జరించఁగరాదె లెస్సగన్.

47


వ.

అనినంత.

48

ఆ.

అట్టి జటిలనేత తట్టినయంతనే
యంగలతిక సడలి యార్తిచేతఁ
నెలఁత చిత్రగతిని శిలయయ్యె నై చండ
గహనధాత్రి నిలిచెఁ గదలలేక.

49


క.

అనఘ యది గనుక నీచ
క్కనిచరణహతిన్ దిగీశగణనల్ నిండన్
దనయాద్యాకారస్థితి
సనయక్రియ దాల్చి నిల్చె సారస్యగతిన్.

50


చ.

అనిన యదాట తజ్జటి, యహల్య నిజాకృతిచేత దాదన
ర్చిన యది యాలకించఁ జని శ్రీనిధి దాశరథిన్ గణించి చ
క్కని తనగేహినిన్ గలిసి కడ్డడగంగఁ జరించెఁ [30]గానలం
దెనసి యతీంద్రరాజి యెదనెన్నఁగ హర్షతఁ దేర నయ్యెడన్.

51


క.

అంతంతటఁ దక్కిన జటి
కాంతస్థలచర్య లెల్లఁ గని కనియెద న
త్యంతానందస్థితిఁ జనఁ
జెంతన్ సకలజనఘటల చేఱంతయ్యెన్.

52


చ.

జనకధరాధినేత సరసస్థితి యజ్ఞకరేచ్ఛగాంక్ష రా
ననచఁగ నేగినట్టి హరిదంతరసాతలనాథరాజి కాం
చనరథగంధనాగహయసైన్యహళాహళికాజయక్రియన్
గని కని గాధిజాతజటికర్త నిరంతరహర్షశాలియై.

53


క.

తనజ్ఞానదృష్టిచే చ
క్కని రాక్షసహంత కధికకల్యాణశ్రీ
లెనయఁగఁ గలదని దృఢగతి
జనియెన్ సకలజనఘటలసంద ళ్లదరన్.

54


చ.

చని యగ్రస్థలిఁ గాంచె నంత జనకజ్యాకర్త రాడ్ధాని దా
గనకాలంకృతచిత్రరాజి సదనాగ్రస్థానసంధానకే

తనచేలాంచలనిర్గతానలశిఖాత్యంతాహతాకాశ ర
త్ననిశానాయక నాకదేశతటినీధారాధరారిన్ దగన్.

55


వ.

ఇట్లు జనకరాజధాని జేరనరిఁగి యా చక్రధరణీధరాంతరసకలదేశనర
నాథచ్ఛటలు, హరిశిఖికృతాంతనైరృతజలధీశా౽నిలచంద్రికానేతలు,
సిద్ధసాధ్యనాగచారణయక్షకిన్నరకర్తలు, గంధగజకంఖాణశితాంగ
సైనికసన్నాహచర్యలు నిండ శంఖకాహళఝల్లరీతాళానీకనిస్సాణ
ఘంటానాదలీలలు, దశదిశలఁ తెలంగ స్రక్చందనశాటికాచిరత్నరత్నా
లంకారక్రియలు రంజిల్లం దాల్చి సింహాసనస్థిరల నధిష్టించి రయ్యెడ.

56


క.

తనచెంత రానెలల్ సిరి
దనరఁగ నాగాధిరాజతనయాగ్రణి చ
క్కని నెఱసిరి గద్దెలకడ
నెనసి యధిష్ఠించె నంద ఱెన్నగ నంతన్.

57


చ.

కలితనయాతిశాలి, జనకక్షితినాయకహేళి చక్కఁగా
లలితహిరణ్యశాటిక లలంక్రియ లంచితగంధసేచనల్
గలిఁగి దిగంతరాజతతి గాంచి గణించఁగ లెక్కలేని చా
యల నలరార గద్దెకడ నక్కఱ సంధిల నిల్చె నయ్యెడన్.

58


క.

తనయంకస్థలి సీతాం
గన దిశలన్ నిండినట్టికళల నధిష్ఠిం
చిన సకలధరణినేతల్
గనిరి జగజ్జనని చాళికన్ దనరారన్.

59


తే.

అచట నీరితి జనకధరాధినేత
సకలసన్నాహచర్యల సంతసిల్లి
నిజగృహాంతరసంస్థితినీలకంఠ
ఘనశరాసనయష్టిఁ దే ననిచె నంత.

60


చ.

[31]కనకనగాకృతి న్నిగిడి, కానగనైన గిరీశసాయకా
సనదృఢయష్టిఁ జేరి, యతిసాహసశక్తి నిశాచరచ్ఛటల్

గని తలలన్ ధరించి, జనకక్షితిరక్షిత యగ్ర ధాత్రికిన్
జనిచని చక్కడించిరి, దిశల్ చలియించఁగ నట్టిచెంగటన్.

61


ఆ.

జనకధరణినేత సకలరాజచ్ఛట
నరసి హరశరాసయష్టిఁ దీని
జేరి యేరలైనఁ నారి యెక్కిడిరేనిఁ
గన్నె నీయఁగల నటన్న దెలిసి.

62


సీ.

చేర నేటికిఁ దీనిఁ జేగాని చెంగట
             గలగంగఁ గలదని నిలిచి నిలిచి
యక్కించి జట్ల నాయధికసాహసశక్తి
             దరలఁ జేయఁగలేక తగ్గితగ్గి
ఘనతరహస్తశాఖల నాడఁగ ధరించి
             గాసియై కదలంగఁ జేసిచేసి
జంకించి గద్దించి సాఁచి యాజేనెల
             కెడగాఁగ నింతింత నెత్తియెత్తి
చక్రశైలాంతరస్థలసకలదేశ
రాజహరిదీశచారణరాజి చాల
చెదఱి లజ్జించి కృశియించి చింతగనలి
కదియలేరయ్యెఁ గడలేనికాక నంత.

63


క.

తారలసందడి నెల
దారిన్ రాజాంతరస్థ దాశరథి జయ
శ్రీ రంజిలఁగా జటి యా
జ్ఞారతిచే సకలదేశజనతతి గనఁగన్.

64


ఆ.

లేచి కదియనేఁగి లేఖాద్రి చందాన
నలరినట్టి హరి శరసయష్టి
నంఘ్రినఖరేఖనాని తృణాకృతి
నెగురఁ జేసి లెస్సనంత యాచి.

65

ఉ.

కేల ధరించి దాశరథి క్రీడ గిరీశ శరాసయష్టి యా
శాలలనాదిలేఖఖగసాధ్యనిశాచరసారణాహియ
క్షాళి గణించ నెక్కిడి నయక్రియ చే దిగియంగ సాగినన్
జాలఁగ గండ్రలై ధరణి జారె జగత్త్రయి సంచలించఁగన్.

66


వ.

అంత.

67


సీ.

అచలాదితేయానలాచ్ఛకీలల [32]గంధి
             నగరాజె చిట్లికళ్లెగ ననఁగ
హరిదంత దంతి సంహతి యాగ్రహస్థితి
             జేరిక ఘీంక్రియల్ చేసె ననఁగ
నలినసంజాతాండకలశి యిట్టి ట్టయి
             యడలి చెల్లా[33]చెదరయ్యె ననఁగ
గగననిర్గళితనిర్ఘాతసంతతి చాలఁ
             దెగి ధాత్రిఁ గలయంగఁ ద్రెళ్లెననఁగ
దశరథక్షితినాథనందనకరాగ్ర
ఘటితగిరిశశరాసనగాఢయష్టి
దీర్ఘశింజిని తెగియంగఁ దిగిచినంతఁ
గఠిననాదాతిశయశీల గండ్రలయ్యె.

68


శా.

నింగి న్నల్దిశలెల్ల నిండఁ జెలఁగ న్నిస్సాణరాడ్ధంధనల్
కంగారయ్యె దశాననాదిఖలరక్షశ్రేణి కంఖాణసా
రంగస్యందనరాజశేఖరఘటల్ రంజిల్లె నాకాంగనా
సంగీతక్రియ హెచ్చె, నృత్యకళలన్ సంధిల్లె హర్షస్థితిన్.

69


ఆ.

దానిఁ గాంచి జనకధరణీశకేసరి
చాలహర్షజలధిఁ దేలి తేలి
సీతఁ గేల సంజ్ఞ చేసిన రాక్షసా
రాతిఁ జేర జనియె రహి దనర్చ.

70

సీ.

అఖిలరత్నస్థగితాలంక్రియల కెల్ల
             సిరియన గాంతి రంజిలఁగజేయఁ
గాయజసాయకాకారనేత్రాంచల
             శ్రీ లెంతొ చెక్కిళ్ల చెంగలించఁ
జరణకంజన్యాససంసర్గ చే ధాత్రి
             చిత్రలాజారసస్థితి గ్రహించ
రాజితతారహారచ్ఛటల్ కలితస్త
             నాగ్రసంసరణి నృత్యగతి గదల
తండ్రియానతి లేచి చెంతల నెలంత
లెచ్చరించఁగఁ జేరంగ నేగి యతని
దండ [34]డగ్గరి తెలిజాజిదండఁ గేల
నెత్తి కంధరఁ దగిలించ నేసె నంత.

71


వ.

ఇట్లేసిన ఝల్లరీకాహళనిస్సాణఘంటికాతాళనాదక్రియల్ దిశలం
జెలంగె, దిగీశయక్షకిన్నరసాధ్యచారణనాగాండజగణనల్ నిండె,
గంధగంధిలదంతికంఖాణస్యందనసైనికరాజహళాహళిక నెరసె, సకల
రాక్షసాననకళల్ తఱఁగె, నాయెడ జనకధరణిజాని దాశరథి సహాయత
నిజనగరాంతరస్థలికిఁ జని యర్హశాలల నిల్కడ జేయించె నంత.

72


తే.

అందుఁ దా నిల్చి యాగాధినందన జటి
కాఁగలిగినట్టి కల్యాణకార్యసిద్ధి
కలర లేఖ ల్లిఖించి ధరా౽౽దితేయ
ఘటలచే నంచె నాయాజి కదలిరాగ.

73


వ.

అయ్యెడ.

74


క.

హరిగండఖడ్గకాసర
కరికిరిసారంగనికరకాసనధరణీ
ధరరాజిఁ దాటి చని చని
చిరతరసాకేతనగరిఁ జేరి కడంకన్.

75

శా.

నానాదేశనరేశితల్ సకలయత్నశ్రీల గాంగేయశా
టీనాగేంద్రహారీంద్రజాలనటచేటీనాటకశ్రేణి క
న్నానంగా కని డగ్గరం జెలంగు నాయాజిన్ నిరీక్షించి ధా
త్రీనాకాలయనేత లిట్లనిరి యర్థిన్ దేనియల్ జారఁగన్.

76


సీ.

ఆకాశకషణదీర్ఘాకృతి నేతేరు
             దిట్టతాటకఁ గెల్చినట్టి సరణి
యఖిలయత్నక్రియ లలరిన జటియష్టి
             నర్థి రక్షించిన యట్టిజాడ
యైంద్రాదిసకలశస్త్రాస్త్రసాధనశ క్తి
             నాశ్చర్యగతి గాంచినట్టి ఘనత
యంధకారాతిశరాసనదృఢయష్టి
             నర్థి గండ్రించినయట్టి దారి
యజతనయరాజహేళి కత్యంత చర్య
[35]నెఱుఁగఁజేసిన నగ్రజాధీశఘటల
కంచితాలంక్రియాదంతిహయశతాంగ
చేల సంసిద్ధఁ దనరించెఁ జాలనంత.

77


మ.

సకలశ్రీనిధియైన యాదశరథజ్యాకర్త తాఁ జక్రశ్రం
ఖకళాజాతనరాధినాథకరిసాంగత్యక్రియన్ నిస్సహా
నకసంజాతధణంధణల్ దిశల నిండన్ జేరఁగానేగె న
త్యకలంకస్థితి సంధిలన్ జనకరాడ్ధానిన్ సదానందియై.

78


క.

జనకనరనేత దశరథ
జనరాణ్ణిధిరాక నెఱిఁగి సహితస్థితిఁ జ
క్క నెదిర్చి కలసి దగిన
ట్టి నగళ్లన్ నించె సంగడీ లెన్నంగన్.

79


వ.

అంత.

80

ఆ.

దాశరథికి సీతఁ దక్కిన నందన
త్రయికి సహజధరణితలనరేంద్ర
కన్యలన్ గళాతిధన్యల నిచ్చె నా
జనకరాజహేళి సంతసిలఁగ.

81


వ.

ఇక్కరణిఁ గల్యాణస్థితియైన చెంగట శతాంగసారంగకంఖాణదాస
దాసీహాటకశాటికారత్నరత్నాలంక్రియల్ [36]ననయగతిఁ దనయ నిచ్చి,
తనయల ననిచినం దశరథనేత నందనసహాయత సాకేతరాజధానికిం
దిరిగి చనియెడునెడ.

82


సీ.

సేనానిగల శిఖాళీనేతసన్నిధి
             నఖిలశాస్త్రక్రియ లబ్ధి నేర్చె
దిననాథసంతతి [37]జననాథసంతతి
             హరికి సాధన ధార గలయనరికె
నార్తసజ్జనరక్షకై ఖలశిక్షకై
             కంధికన్యాజాని కళ జనించె
చక్రాచలాంతస్స్థజగతి నగ్రజరాజి
             కరసి నిరాంతక సరణి నిచ్చె


తే.

జనకశాసనధారియై జనని గాంచి
నిశ్చలాగ్రహశక్తిచే నిగ్రహించె
నట్టి క్షత్రియహంత దిగంతరాజ
గణన లెచ్చంగ నేతెంచె గాఢచర్య.

83


క.

[38]అనతాగ్రహకీలిశిఖా
కనదాకృతిఁ గదలినట్టి క్షత్రియహంతన్
గని సకలరాజసంతతి
జనితార్తిం గదిలె నల్దిశల్ నిండంగన్.

84


చ.

అలజడిచేత నల్దిశల [39]కందరదాటుగ జారినంతనే
తలకని దండి నాదశరథక్షితి[40]రక్షితృహేళి కన్న రా

నెలల శరీరరక్షకయి నెట్టన నగ్ర ధరిత్రిఁ జక్కగా
నిలిచి నరేంద్రహంత ధరణీఖచరాగ్రణి గాంచి యంతటన్.

85


క.

క్షితి సాష్టాంగక్రియ యా
సతిచేతన్ గణన చేసినన్ దానిఁ దృణా
కృతిఁ గాంచి దృగంచలని
ర్గతశిఖికణరాజి రాలఁగా నిట్లనియెన్.

86


క.

అకటా! నాయేలిక యం
ధకహంతశరాసయష్టి ధైర్యస్థితి గం
డ్రిక జేసిన యతఁ డేడీ
తెకతెక నాదేహయష్టి తెరలఁగ సాగెన్.

87


ఉ.

ఆరయ కాంచనాద్రియె శరాసనయష్టిగ శేషచక్రియే
నారిగ, నంచతేజిగల నాయఁడె సారథిగా, ధరిత్రియే
తేరయి హెచ్చ, రాక్షసతతిం దెగటార్చినయట్టి కాయజా
తారిఁ దిరస్కరించిన గయాళి యతండిట యేడి కాంచెదన్.

88


తే.

ఖచరసంతతి యంతంత గణనఁ జేయ
క్షత్రియశ్రేణి నాయడ్డకత్తిచేత
గండ్రికలు చేసినట్టి నాగాఢశక్తి
గాంచినది లేనియెడ నాలకించరాదె.

89


వ.

అని క్షత్రియహంత యాడిన దానికి జడిసి దశరథనృనేత చిన్నరానెలల
కడ్డకట్టయై నిలిచి.

90


ఉ.

కానక కన్నయట్టి కసికం దితఁ డారయ, నద్రికన్యకా
జాని శరాసయష్టిఁ గని చక్క నెఱుంగక కేల నెక్కిడం
గా నది గండ్రలయ్యె జనకక్షితిరాణ్ణిధి సీత నిచ్చినన్
దానికి లేనికాక దయదాల్చక యేటికి నయ్య యియ్యెడన్.

91


క.

శైలారి నన్నిలాస్థలి
జాలా కీర్తించ, రాజసంతతి నడఁచన్

జాలించిన యాచక్కని
శీలత నేఁ డధికనిష్ఠఁ జెల్లించఁగదే.

92


క.

ఈ నాతనయాగ్రణి క
య్యాన నెదర్బంగ నంధకారాతీయె! గి
ర్జానియె! యచలారియె! యా
హా నిండిన గాక సేయ నదియే గతియే.

93


వ.

అనిన తండ్రియాడినతెఱం గాలకించనేరక కేల నాక్షత్రహంతఁ గాంచి,
జానకీజాని యాగ్రహించి.

94


క.

నాతండ్రి దశరథక్షితి
నేత హితక్రియ గణించ నీతి తెలియ కే
ఘాత్య జెడనాడంగా
నీతియె చెలరేగ ధరణినిర్జరనాథా.

96


క.

ఆనెలతలదిట్టది యనఁ
గా నేరక జనకధరణికర్త యనంగా
నే నెఱుఁగనంటి నంతనె
కానంగ శరాసయష్టి గండ్రిక లయ్యెన్.

97


క.

ఆలయెడన్ ధరణీఖచ
రాలియెడన్ నల్గనేర నలిగితినేనిన్
లీలన్ నాదృష్టికి నా
హలాహలధారియైన నాగఁగఁ గలఁడే.

98


క.

అని యాడిన దాశరథిన్
గని క్షత్రియహంత హృదయకంజస్థలి సం
జనితాగ్రహశిఖిహృతసం
హననస్థితిఁ గెరలి తెగి యనాదరసరణిన్.

99


సీ.

అంచలేజీదిట్ట కంధకారాతికి
             దీటైన యతఁడని తెలియరాదె!

యఖిలధాత్రీస్థలి నగ్రజనేతల
             కలరనిచ్చినచారి దెలియరాదె!
లీలచే క్షత్రియాళి ననేకచర్యల
             దెగటార్చిన కడంక దెలియరాదె!
సరసకాండాసనసరణి కేదైన నా
             దృష్టి కాననిజాడ దెలియరాదె!
తెలియకే కాక నన్నిట్లు తేఁగటిల్ల
నాడి, నీరాచసిరిఁ దెగియాడ నేల
కఠిన నిద్దఱి చక్కట కలిగినట్టి
ధృతి గదిసినంతనే తేటతెల్లగాదె.

99


మ.

ఘనకైలాసధరిత్రి శక్తిధరసాంగత్యస్థితిన్ సాయకా
సనసంజాతకలాచ్ఛటల్ కిసలయాస్త్రచ్ఛేదిచే నేరఁగా
చన గండస్థలి తల్లడిల్లఁగ సహస్రారస్థలిన్ శస్త్రచం
డననాదక్రియ నాలకించి చనినాడన్ దానిఛాయం గనన్.

100


తే.

అంధకారి శరాసనయష్టిఁ గనక,
యకట! యెక్కిడరాయన నతనినాల్క
యేకరణి నాడెగాక యెక్కిడఁగ నట్టి
కే లదె ట్లాడెరా రాజకీటకేశ.

101


క.

నానిననలినట్టియ యా
హావలినాస్త్రారి దనియ హంక్రియచేతన్
లేనిసడి చేసి గెలిచెద
కానీ క్షత్రియకనిష్ఠ కడచి చనియెదే!

102


క.

క్షత్రియసంతతినెల్లన్
ధాత్రీశాద్యఖిలఖచరతతి గనఁగా ని
క్షత్రక్రియఁ జేసిన నా
క్షాత్రస్థితిఁ దెలియరాదె సంఘర్షణచేన్.

103

క.

ఆటది యనకే కాకన్
దాటక గాఢాసనాస్త్రధారలచేతం
గీటడగఁగఁ జేసిన నీ
సాటి గలరె సకలదిశల జనతతి దెగడన్.

104


వ.

అని యగ్రజాగ్రణి యాడిన నిందాత్రయికి దాశరథి యాగ్రహించి.

105


తే.

క్షత్రియకనిష్ఠ యని న న్నసారదృష్టి
నాడఁగా నీతిగతియె యహంకరించి
తెలియ! నీచే శరాస్త్రశస్త్రికలకతన
నగ్రజక్రియ కానంగనయ్యె నిచట.

106


ఆ.

ధాత్రిఁ గలిగినట్టి క్షత్రియఘటల ని
శ్శేషగతి నడంగఁ జేసినాఁడ
ననఁగ నేటి కిట్టు లందఱు గానరా
నకట! యనృతగాథ లాడ నేల.

107


క.

అని నెదిరించిన తాటకఁ
గని శస్త్రిక నేసినాడగాక ధరిత్రీ
జనతతి గన నీసరణివ్
జననిని హింసించినట్టి సాహసి నేఁ గాన్.

108


వ.

అనిన క్షత్రియహంత కనలి.

109


క.

కనదశనిసదృశహలసా
ధనదారితసకలదేశధరణిశితృసం
హననాస్రసలిలతటినీ
ఘనకంధి న్నాచరిత్రఁ గానఁగరాదే.

110


క.

అనఘా! నీతెఱఁ గే నెఱుఁ
గనిదే కరశక్తి లెస్సఁ గననయ్యెడి నా
ఘనకాండాసనయష్టిన్
సనయక్రియ నెక్కిడంగఁ జాలిన యెడలన్.

111

క.

అని తనకెంగేలిశరా
సనయష్టి నరేంద్రహంత జనకక్షితిరా
ట్తనయాజానికి నంది
చ్చిన దాలిచి యెక్కిడన్ సచిత్రగతిఁ గనన్.

112


క.

తిన్నఁగా గేల శింజని దీఁడితీఁడి
యధికటాంకారనాదక్రియలు సెలంగ
నశవి కెనయైనయట్టి యల్లంటఁ దాల్చి
నగి యనాయాసగతిచేతఁ దిగిచి తిగిచి.

113


క.

నీచే నీశస్త్రిక '[41]యిం
తై చనఁగా నేర డదితిజాళి కలంగన్
నీచరణక్షతి చేసెద
గాచిన నా కింక నింద గాదే యనినన్.

114


ఆ.

ఆర్తిచేత నగ్రజాగ్రణి దశరథ
తనయధరణిజానిఁ గని కలంగి
'చేరి తీర్థయాత్ర జేయంగ గా ళ్లిచ్చి
యనచ లెస్సగాదె' యనఘచరిత!

115


మ.

సకలజ్యాచరఖేచరాళి గణియించన్ నింగికిం జిక్కి క్రిం
దికి రానేగఁగఁ గాండసంఘటనఁ దంతెల్ గట్టితిం గాన న
త్యకలంకారత శస్త్రిచేత నది యాహా త్రెళ్లనేయంగఁ గీ
ర్తికథల్ నల్దిశలందు నిండెడి దయాదృష్టిం గటాక్షించరే.

116


క.

అన నాలకించి దశరథ
తనయాగ్రణి శస్త్రినట్టి తంతెల్ తెగనే
సిన, ధరణిం ద్రెళ్లె నిశా
జననాయకగణన లెంత సందడి నిండెన్.

117


క.

తనకట్టినట్టితంతెల్
మనశితశతధార ద్రెళ్లఁగా నేసిన న

ల్లన నగి జానకీశితఁ
గని, కీర్తన జేసి చనియెఁ గాతరచర్యన్.

118


వ.

అంత.

119


ఉ.

శ్రీనిధి రాక్షసారి జయసిద్ధికి నాయజనందనాదిధా
త్రీనరనేత లంచితగతిన్ గణియించగ, నింగి నాదితే
యానకదంధనల్ చెలఁగ, నక్కఱ దా నిజరాజధానిఁ దే
రానఁగఁ జేరి నిల్చి యఖిలాగ్రజసంతతి సంతసిల్లఁగాన్.

120


వ.

అయ్యెడ.

121


సీ.

సరసాలినీజాతఝంకారసంకాశ
             సంగీతసాహిత్యసరణిచేత
గంధినాగరథకంఖాణరాజశ్రేణి
             గననైన సాదీలగణనచేతఁ
జలజాకరతటాకసంతానకాంతార
             కేళికాసంచారకేళిచేత
లాలితనాటకాలంకారశాస్త్రార్థ
             నిఖిలసారజ్ఞాననియతిచేత
నన్నిటను హెచ్చయిన రాక్షసారి గాంచి
చేయఁదలఁచె సింహాసనస్థాయి గాగ
నజతనయ జటిలాగ్రణి యాజ్ఞచేత
దశరధక్షితినాయక దంతి యలరి.

122


వ.

అంత.

123


మ.

జయలగ్నస్థితి రాక్షసారి కధికస్రక్చందనాలంక్రియా
చయసంరాజితగాత్ర యష్టిగ రచించెన్, దేశికాజ్ఞ న్నయ
క్రియ సింహాసనధాత్రికిం గదియ నర్జిన్ దాసిచే నేగి కే
కయ కన్యాసతి యాజిఁ గాంచి యనియెన్ గాఢాగ్రహక్లిన్నయై.

124

తే.

అనఘ సంగరధాత్రి సేనాజిఁ జేసి
నట్టి జయకార్యసిద్ధికి నతిశయిల్లి
కాంక్ష లిచ్చెదనంటి యాకాంక్ష లిట్టి
దాకఁ దయసేయఁగదె కల్లలేక లెస్స.

125


క.

ధీనిధి నాతనయాగ్రణి
చే నేకచ్ఛత్రలీల క్షితి నేలించం
గా నిష్ఠ దలఁచితిని నె
య్యానం గాదేనిఁ గల్ల లాడితి ననరే!

126


తే.

రెట్టి యేడేండ్ల దనుక నీదిట్టరాక్ష
సారి గానల కనిచిన యదియ నీతి
యన్నినాళ్లైనఁ దిరిగి ధరణి
జక్కగా నేలరాదె యేశంక లేక.

127


చ.

అని తనతండ్రి గాంచి తెగనాడిన కైకతెఱం గెఱింగి స
జ్జననిధియైన దాశరథి సాగక నిల్చి హితక్షితీశితల్
గని గణియించి దాన సరగన్ గడతేర్చఁగ దీక్ష దాల్చి చ
క్కనఁ దిరిగెన్ గృహస్థలికి గాఁగలచర్య దలంచి యయ్యెడన్.

128


తే.

తనయలంక్రియలన్నిటిఁ దాచి నార
చీర లంగీకరించి యాసీతఁ గలసి
దాయి చెంగటనరా రాజధానిఁనదరలె
దాశరథి యందఱల్ గని తలఁక నంత.

129


చ.

అనఁచఁగలేక చిత్తజనితాయతచింత జలించినట్టియా
జననికి దండ్రి కెల్లహితసంతతి నారసి యర్హకృత్యవ
ర్తన నలరించి కాంచనరథస్థలి నెక్కి సతీసహాయతన్
జనియె నిశాచరారి సరసస్థితి సంధిం దాయి యంటిరాన్.

130


క.

ఈరీతిని గంగానది
జేరి రథధరిత్రి డిగ్గి శీఘ్రక్రియచే

సారథి నిజనగరస్థలి
కారయఁ దిరుగంగ ననిచె నాయెడ నంతన్.

131


ఉ.

శ్రీనిధియైన దాశరథి చేరఁగ నేగిన, గందరాఖ్యచే
గానఁగనైన దాసజనకర్త దృఢార్చన లాచరించి గం
గానది దాటఁజేసి హితకాండ సహాయత సాగనిచ్చినన్
దానికి సంతసిల్లె దనదాసజనాగ్రణి గాగ రాజిలెన్.

132


చ.

చనిచని కాంచె చెంగట నిశాచరహంత, సతీసహాయతన్
ఘనతరకేతకీకదళికాహరిచందనకందరాళకాం
చనఘనసారతాళగణసంచితకాననధాత్రి నండజా
ఖ్య నతిశయిల్లి నట్టి జటి నంచితశిష్యజనచ్ఛటాతతిన్.

133


ఉ.

ఆయతిచేత నంత నిఖిలార్చన చర్చ లెసంగఁగా, ధరా
నాయకహేళి, తాఁ దగిననా ళ్లచటన్ లతికా[42]గృహచ్ఛటా
చ్ఛాయల సంచరించి, క్షితిజాసహితస్థితి దాయి రాగ [43]
త్యాయత చిత్రశృంగగిరి దారి దగం జనసాగె నయ్యెడన్.

134


శా.

నానా డేఁగ నఖండఖడ్గహరిణీనాగాండ[44]జాహ్యాద్యర
ణ్యానిం గాంచి యగాధనీరధరనచ్యాళిన్ దగం దాటి తా
నానారత్నతటాకహాటకదరీనాకాంగనాదిత్యసం
తానాచ్ఛాదితచిత్రశృంగగిరిచెంతం జేరి రా జయ్యెడన్.

135


తే.

అక్కడి యతీంద్రసంతతి యర్థి నాద
రించఁగా దళశాలలన్ రచించఁ దాట
కేయదైత్యారి నిలిచె నాక్షితజ గలసి
సరసగాథల హర్షాతిశయత నంత.

136


క.

డాక జయంతఖరాగ్రణి
కాకాకృతిఁ దాల్చి చరణకరనఖతతి, ధా
త్రీకన్యయంగలత, న
త్యాకాంక్షను జీరి నింగి కల్లన నెగసెన్.

137

చ.

చెనకి రయక్రియన్ చెగసి చెంగట నిల్చినయట్టి హంతఁ దాఁ
గిన నలి నేసె, నేయ నది గ్రచ్చఱ నీఱయి, నాయడంచ జా
లనికతనన్ వడిం దిరిగిరా నల రానెల యంఘ్రి సాగినన్
గినియక కాఁచెగా యతనికిన్ సరిగాఁ గలరే జగత్త్రయిన్.

138


శా.

సీతాసంగతి రాక్షసారి హరిణీసింహాహిసారంగసం
ఘాతాచ్ఛాదితకాననక్షితికి నేగన్ దాళ కత్యంతచిం
తాతీక్ష్ణాగ్నిఁ గరంగి యాజి ధరణీధాతృచ్ఛటల్ గంధసం
ఖ్యాతీతత్రిదశస్థలి౯ నిలిచె నాహాకారతల్ తేలఁగాన్.

139


వ.

[45]ఇక్కరణి (గానియాదికేకయరాజనందన కాంక్ష నేగిన) జక్రాంశ
సంజాతనరనేత రాజ్యాధికారిం జేయందలంచి, కైక రాననచినఁ దిరిగి
సాకేతనగరి కరిగి యయ్యెడ.

140


చ.

తనజనయిత్రియాజ్ఞ దలఁదాల్చి ధరాతనయాధినేత కా
ననధర కేగి నంగనలినాకగృహస్థలి జేరినట్టి
జనయిత కట్టడల్ డెలిపి చక్రతళాజనిరాజహేళి తా
నెనయఁగ నన్నఁ జేరఁ జనియెన్ జనితార్తి ఘటిల్ల నయ్యెడన్.

141


ఆ.

గంగ దాసకర్తకతనఁ జక్కగ దాటి
యండజాఖ్యఁ గన్న యతనియాజ్ఞ
సేన లఖిలదిశలఁ జేరసాగె ననేక
సేన లఖిలదిశలఁ జెలఁగె నంత.

142


క.

ఆకలకలనాదక్రియ
నాకర్ణించి హరినాయకాంశజనితధా
త్రీకర్త యాగ్రహస్థితి
గైకేయాయాతసరణిఁగా తెలిసి ధృతిన్.

143


క.

తనయన్న జానకీశిత
నెనయంగా నేగి కెకయీకాంతానం

దనధరణిజానని సా
దిన నత్తెఱఁ గెఱిఁగి చాలకెరలికఁ దేరన్.

144


చ.

ఘనగజసంతతిం దిరిగి కాండతతిన్ నలియంగ దంచి కాం
చనరథరాజి జెక్కి దృఢసైనికకర్తలఁ గెల్చి కైకయీ
తనయ నరాశితన్ గదనధాత్రి జయించెద కీర్తి నించెదన్
దినకరతేజ నీకడకు తెచ్చెడఁ జెచ్చెఱ నన్న హర్షియై.

145


తే.

కాటకేయారి తనచెంత దాయిఁ గాంచి
కాంచి, యతఁ డిష్టసరణి యేతెంచెఁ గాని
యని రచించఁగ గదిసినయట్టిసరణి
గాదని యడంచె నందఱల్ గనఁగ నంత.

146


ఉ.

సేనల వెల్లడించి యతిశీఘ్రగతిన్ జని, దాయి జానకీ
జానకిఁ జక్కఁగా ధరణి సాగిలి యాజిధరాధినేత చిం
తానలకీలలం గరఁగి యంచితనిర్జరరాజధాని దీ
రానఁగఁ జేరినట్టితెఱఁ గార్తి నెరుంగఁగఁ జేసి నయ్యెడన్.

147


క.

తనకండ్రి నాకనగరికి
జనినసరణి దాయచేత జక్కఁ దెలిసి, చ
య్యన ధరణిజాని దశరథ
తనయాగ్రణి లేచి చింత తహతహజేయన్.

148


క.

తనకరశాఖల దాయిన్
గని తిన్నఁగ నెగురనెత్తి ఘనశాస్త్రగతిన్
జనయిత కితరక్రియ జ
క్కనఁ జేయఁగఁ దలఁచె శీఘ్రగతి దీరంగాన్.

149


వ.

ఇట్లు తలంచినయెడఁ దజ్జననీసహాయిత శతానందనందనజటి చిత్రశృం
గాద్రి కేతెంచినం గలిసి, దాశరథి యర్హక్రియం జేసి యందరలఁ దిరుగ
సాకేతనగరి కనిచె నంత.

150

తే.

కైకయీనందననృనేత గాంచి, రాక్ష
సారి యత్యంతహితశక్తి నాదరించి
తిరిగి సాకేతనగరికి సకల
సంరక్ష సేయంగ రాదె యనఘ.

151


క.

అనినట్టి దైత్యహంతం
గని దృగ్జలజాతనికరకణ నేచిన సా
హననస్థలియై యతిదై
వ్యనినాదక్రియ ఘటిల్ల నాడెం దెలియన్.

152


ఉ.

ఏల శతాంగకాండతతి? యేల యలంక్రియ? లేల రత్నశా
టీలలనాఘనాఘననటీనటచేటిక? లేల చంద్రకాం
తాలయగంధసారసరసాన్నహితస్థితి యట్టిజాడ నీ
[46]శ్రీలలితాంఘ్రియర్చనయె చెల్లదె నిర్జరశాఖి యన్నిటన్.

153


క.

ని న్నరఘడియందైనను
నన్నా! దర్శించలేక యాగంగలనే
యన్న దయఁ దాయిఁ గౌఁగిటఁ
దిన్నంగా చేర్చియాడెఁ దెల్లడి గాఁగన్.

154


ఉ.

ఎంచఁగ దండ్రి రాజననికిచ్చిన సత్యగరిష్ఠనిష్ఠ జె
ల్లించఁగ దీక్ష దాలిచితి లేక తిరస్క్రియ జారనాడినన్
గాంచిన యందఱల్ నగరె, కల్గిన కీర్తి యడంగదే నిదా
నించఁగ నర్కసంతతికి నిష్ఠ ఘటిల్లదె రాజనందనా.

155


ఆ.

ఇన్నియేండ్లచెంత నేల నీవాట
నిట్టిల్నసరణి నిట్టి[47]ఘటిక
దిరిగి చనఁగ గల సతిసహాయతచేత
నడ్డగించనేర యనఘచరిత!

156

క.

అని యంత చరణరక్షల
ననిచిన దయ నీయ నంది నతిఁ జేసి ఘనా
ననకాంతి హెచ్చ నిలచిన
తనదాయిం గాంచి యాడెఁ దాఁ జిగురించన్.

157[48]


క.

అనినట్టి దాశరథి శా
సనగతి సాకేతనగరిజాడ జనక చ
క్కన జెంత రాజధానికి
సనయక్రియ నేఁగి నిలచె జటిలాకృతిచేన్.

158


మ.

తనదానస్థితి నర్థిసంతతికి నిత్యశ్రీల నందించఁగా
దనయత్యంచితకీర్తి దాన దిశలన్ దండించి కేల్ సేయఁగా
[49]దనహస్తస్థితిచేత నిట్టిధరయంతన్ నీతిచే నేలెఁ జ
క్కన ధాత్రీతనయాధిరాట్చరణరక్షాలగ్నహృచ్ఛాలియై.

159

ఆశ్వాసాంతము

క.

అనిమిషపతి శాసనసం
జనితావర్తక[50]ముఖాభ్రచయగళిత[51]శిలా
శనిజకణహద్గోవ
ర్ధనగిరిధరణ ప్రచండతర[52]నఖశిఖరా.

160


చ.

యువతివసంత, సంతతసముజ్జ్వలనీతివిధాన, దానవై
భవగుణదక్ష, దక్షరిపుభావసరోరుహసంగ, సంగర
ప్రవిమలసత్వ, సత్వరితపక్షినృపాలక కాండ, కాండస
ద్భువననివాస, వాసవసభోగమునిస్తుతవిక్రమక్రమా.

161


కలహంస.

నిరుపమకరుణాన్వితసదపాంగా
కరయుగసంభృతకంజరథాంగా
చరణాంభోరుహసంభవగంగా
హరశతధృతిహృదయాంతరసంగా.

162

గద్య
ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై
శ్వర్యధురీణ శారదాప్రశ్నవివరణ శతఘంటావధాన వినయధునీ
తరంగనిజృంభణాజృంభిత సలలితమృదుమధురవాగ్వైఖరీఝరీధురీణ
స్థాపితాశేష విశేషప్రసిద్ధసాహిత్యసారస్వతాశుకవితాష్ట
భాషావిశేష సంస్కృతాంధ్రనిరోష్ఠ్యోష్ఠ్యాది వింశతి
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షిగోత్రపవిత్ర
తిరుమలదేశికేంద్రపౌత్ర తిరువేంగళాచార్యపుత్ర
మఱింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన
దశరథరాజనందనచరిత్రయను నిరోష్ఠ్య
మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. చికుల (ము)
  2. లాల (ము)
  3. నాలకించు (ము)
  4. సంగతి (శి)
  5. నేత లేగగా (శి)
  6. అట్ల నానాటికి (శి)
  7. దీని (శి)
  8. జలసరణి (శి)
  9. కృతార్థి (శి)
  10. యానతి (శి)
  11. కేలలితము (శి)
  12. 12వ నెం. వచనము శి- లోలేదు.
  13. గలచెంగట (శి)
  14. సలలితనీతిగాని (శి)
  15. ఖరఖచరారి (శి.గ.)
  16. ధరణి (శి.గ)
  17. రక్షణ (ము)
  18. అర్ధి చేర్చి (శి.గ.)
  19. అనిన యాలించి(శి)
  20. హరిదక్క (శి.గ)
  21. కంధరనీరజ
  22. యంఘ్రి నతని నెత్తి నంఘ్రి నిడిన (శి.గ)
  23. దయంజనించి (శి.గ)
  24. దనర్చె
  25. చిత్రకళాతి (శి)
  26. 33వ పద్యములో 2,3 చరణములు (శి. లో)
    చక్కగా నింగికిఁజాచి నాధత చేత నారాధనల్ గాంచినట్టి యంఘ్రి; .... ఘనఘనాశ్రేణి చెండాడగా గంగ నక్కఱచే గన్నయట్టి యంఘ్రి
  27. అనఘ (శి)
  28. నిశాధి (శి)
  29. ఘనాకృతి (ము)
  30. (కానలం దెనయ యతీంద్రరాజి యెద నెన్నఁగ హర్షముతోడ నయ్యెడన్)
  31. కనఁగ నకాకృతి (ము)
  32. కంది నగరాజె (వ్రా)
  33. చెదర్లయ్యె (ము)
  34. (దగ్గణ)
  35. నెరుక (ము)
  36. ననయు (ము)
  37. శి.గలోలేదు
  38. అనలాగ్రహ (శి)
  39. కందరలాటగ (ము)
  40. వాయకహేళి (శి. గ) నాయక (శి. గ)
  41. కణిన్ రై చనఁగా (ము)
  42. గృహచ్ఛలన్, ఛాయల (ము)
  43. నధ్యాయత (ము)
  44. జాహోదర
  45. ఇక్కరణి (గాని యాదికేకయరాజనందన కాంక్షనేఁగిన) (ము) లోగలదు. కుండలీకృతభాగము ఇతరప్రతులలో లేదు.
  46. శ్రీలలి.... లె.... చాలును (ము)
  47. ఘనత
  48. 157 నెం. పద్యము (శి)లో లేదు.
  49. 'తనహస్తస్థితిహేతిచేత ధరయంతా నీతిచే నేలె' (శి)
  50. ముఖాద్ర (శి)
  51. శిలాజనహృజ్జలకణహృ (శి)
  52. సఖ (శి)