Jump to content

దశరథరాజనందనచరిత్ర/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

దశరథరాజనందనచరిత్ర

తృతీయాశ్వాసము

క.

శ్రీతరుణీమణికుచనత
శాతనఖత్రుటితదితిజజఠరాస్రజలో
ద్ధూతక్రోధధనంజయ
యాతతగుణయూథ! కర్పరాద్రినృసింహా.

1


వ.

ఆతఱిఁ గథాసరణి యెట్లంటేని.

2


సీ.

అట్టి చెంగట రాక్షసారాతి గిరి డిగ్గి
             దండకకాంతారధరణిసరణి
నత్రియర్చనలచే నలర జానకి నిగ్ర
             హించి తారాస్థలి కెగసి చన్న
ఖచరారి ఖండించి కాంతాసహాయత
             నచలారి తిరుగంగ ననిచినట్టి
జటి సంతసిలఁజేసి, శరణన్నయగ్రజ
             కర్తలకై దైత్యఘటల నాజి
సంహరించఁగ దృఢశక్తి సందలాడి
ఘటజ దత్తా౽క్షయాస్త్రసంకలితశరధి
సాయకాసనఖడ్గాతిశయతచేతఁ
జెంత దక్షిణగంగ దాఁ జేరి యంత.

3


క.

[1]శరజాస్త్రశస్త్రసంఖ్యా
సరసక్షీరధరణీశశాఖాకలితాం
తరధాత్రీదళశాలల
సిరి సంధిల్లంగ డెంకి జేసిన యంతన్.

4

చ.

అనయ దశాసనాఖ్య గలయట్టి నిశాచరనేత చెల్లె లా
ఘనతరకాననస్థలికి గ్రచ్చఱ దాఁ జని దీర్ఘదేహి న
త్యనతకళానిధిన్ శతసహస్రలతాంతశరాకృతిం దయా
ఖని ధృతిశాలి దాశరథిఁ గాంచి గణించఁగసాగె నయ్యెడన్.

5


క.

ఆనడ లాచక్కదనా
లానీ టాతేట లానయక్రియ యాలా
గా నిల్కడఁ గనికని య
[2]త్యానందైకజలరాశి నల్లన దేరెన్.

6


చ.

జలచరకేతనాచ్ఛకరచండశరాసనశాతశస్త్రికా
దళితహృదంతరాళ యయి దైత్యగిరిస్తని రాక్షసారిచెం
తలఁ దరలంగ లేక సహితక్రియ సంధిలఁ గాంచసాగె దా
గలితళరీరసంజనితకాంతి యరణ్యధరిత్రి నిండఁగన్.

7[3]


వ.

ఇట్లు చేరి నిలచి.

8[4]


క.

అనఘా నీయాకృతి నే
గని దక్కితిఁ గనుక సరసకాండజకేళిన్
దనియించరాదె కలియక
యనిచిన నే దాళజాలనయ్య నరేంద్రా.

9


క.

ఇల నే నెఱిఁగిన కాయజ
కలితరహస్య క్రియల్ ఖగస్త్రీలయినన్
తెలియంగనేర రాయెడ
గలిసిన దృష్టాంతసరణి గాదే యనఘా.

10


ఆ.

అనిన దానిఁ గాంచి యఖిలచర్యలఁ దేల
నాడఁ జెండిచేత నీడగిలిన
యల్క కృథయు ధాత్రి జిల్క నేత్రాంచల
(?)రక్త నేత్ర లదరి రాయడిల్ల.

11

ఉ.

అల్లన రాక్షసారి తనయండ జరించెడి దాయిరానెలల్
సల్లలితేక్షణాంచలజ సంజ్ఞ రచించిన నాతఁ డల్కచేఁ
గల్లడియైన రాత్రిచరకన్యక యంచితకర్ణనాసికల్
చల్లని నెఱ్ఱనీ రడర జక్కఁగఁ జెక్కె ఖగాళి రంజిలన్.

12


వ.

ఇక్కరణిఁ రక్కసియైన రక్కసి రక్కెసకర్ణనాసికలు చెక్కిన రక్తజల
సిక్తాంగియై యాహాకారనాదసంచలీకృతాండజఖండయై హర్షితయక్ష
కిన్నరసాధ్యచారణసారణయై యనిలతిరస్కారశీఘ్రగతియై జనస్థాన
నగరి కరిగి ఖరఖచరారికాళ్ల కెరఁగి యాక్రందించి లేచి జానకీసహాయత
నేతెంచిన దాశరథి యాద్యంతక్రియల్ తెలియఁజేసిన నాగ్రహించి.

13


త.

కలఁగక తనయాస్థానిన్
నిలిచిన ఖచరారి సకలనేతల నెల్లన్
కలితా గ్రహహృత్స్థలియై
కలయఁగ దర్శించి నీతికార్యస్థితిచేన్.

14


క.

నరఖాదనకర్తన్ నా
సరణిఁ దెలిసి తెలియలేక సాహసగతిచే
నరకీటనేత యహా
యరయక చేసెనని చాల యాగ్రహదృష్టిన్.

15


చ.

ఖరఖచరారి హృజ్జనితగాఢతరాగ్రహకీల నిండఁగా
సరయగతిన్ గజేంద్రహయసైనికకర్తల నెంచినంతనే
ఖరకిరణాదితీవ్రసితఖడ్గధఛాధళదీధితిచ్చటల్
ధర నఖిలాశలన్ నెరయ దారసిలం జని రర్థి నయ్యెడన్.

16


ఆ.

ఆజి కేగినంత నందఱి నన్నిచం
దాల నడఁచినట్టి లీల లరసి
యరసి చిత్రసరణి హతశేషకలరాజి
కనలి ఖరనిశాటకర్త జేరి.

17


క.

ఏరీతిఁ జనిన సేనల
నారీతి హరించి తాటకారాతి జయ

శ్రీ రంజిల నని జేసెన్
జారణయక్షాహిసిద్ధసంహతి చెలఁగన్.

18


ఆ.

ఇట్టి సరణిచేత నెల్ల రక్కసిఱేండ్ల
నాజి నడఁగజేసె నన్నఁ దెలిసి
ఖరనిశాటనేత గాఢాగ్రహక్రియ
సేన లఖిలదిశల నానఁ గదిలె.

19


సీ.

కరటి దేహాక్రాంతఘంటికాసంజాత
             సతతఘణంఘణల్ సందడిల్ల
ననిలచిత్తాతీతఘనరాయకంఖాణ
             హేష లష్టదిశల హెచ్చరించ
నాదిత్యనందనాహంకారహరణాది
             గాధకింకర కహకహ లెసంగ
నిర్జలాచలశృంగనీకాశగాంగేయ
             రథచక్రజర్ఘరల్ రాయడిల్లఁ
గదలె ఖరఖచరారాతికర్త శృంగ
కాహళానకనిస్సాణకంజతాళ
ఝల్లరీజాలసంజాతచండనాద
సంచలీకృతహరిదంతజగతి గాఁగ.

20


వ.

ఇట్లు చేర.

21


క.

ఖరరాత్రించరనాయక
కరిసైనికకాంచనరథకాండతతికి దా
శరథి గనఁగ దనరారెన్
గరిసై నిక కాంచనరథకాండక్రియలన్.

22


వ.

అంత.

23


చ.

సరగున రాక్షసారి కరచండశరాసనయష్టిశింజినీ
శరతతి నేసె నేసిన దిశానరనాయకకర్త లెన్నఁగా

గరటిశతాంగరాత్రిచరకాండనికాయత నంత తద్ధరన్
ఖరఖచరారి ద్రెళ్లె సితకంధరదత్తకళల్ తలంచగాన్.

24


వ.

ఇట్లు ఖరాదిరాక్షసశ్రేణి ద్రెళ్లిన జెల్లెలయినరక్కసి యతిరయగతి నాకాశ
సరణి లంకానగరి కరిఁగి దశకంఠలేఖారికాళ్ల కెరఁగి యాద్యంతస్థితి
దెలియంజేసిన జ్ఞాతిసంతతి యడంగినదానికి గాసిల్లి నిలచి యయ్యెడ.

25


తే.

అన్ననీకయి సీత నే నర్థి దేగఁ
దేటఁగాఁ దాటకేయారి దృష్టిసంజ్ఞ
సేయ నాతనిదాయి తాఁ జేరి కర్ణ
నాసికల్ చెక్కి న న్నల్క నీసడించె.

26


చ.

నరఖచరాహిదేశనరనాయకకన్యల నెల్లఁ జక్కఁగా
నరసితి గాని యాలలన యంగజలేశకళాచ్ఛశక్తికిన్
సరి యనరాదె కా చరణసారససన్నఖరేఖ కైన ని
ద్ధర నెనయన్న నాల్క తెగదా! దశకంఠ! నిశాటశేఖరా!

27


చ.

అని తనచెల్లె లాడ హృదయస్థలి రంజిలఁ జెంతఁ దాటకా
తనయ నిశాటనేతఁ గని ధారణ జేరఁగ చీఱి కాంచనా
సన ధరఁ జేర్చి నీతిదృఢసాహసధైర్యకళాజయక్రియల్
తనర గణించి దాశరథి దారి యెరుంగఁగ జేసి యెడ్తెరన్.

28


క.

జానకిఁ గలసి యనేక
శ్రీ నెరయఁగఁ దాటకారి దృఢసాహసచ
ర్యానిరతి దండకార
ణ్యాని న్నిలిచె నఁట నతని నరయఁగరాదే.

29


ఉ.

నీనయశక్తి నీనటన నీధృఢసాహసధైర్యచర్యలన్
గానఁగ నింక దాశరథి గాఢగతిం గడ కేఁగజేయ నె
య్యాన ధరాదితేయకలికాకృతి దాల్చెదఁ జైంత నిల్చెదన్
జానకిఁ దెచ్చెదన్ ఘనరసస్థితి హెచ్చెద గాంక్ష లిచ్చెదన్.

30


ఆ.

అనిన నతనిగాథ లాలించి యాలించి
యాగ్రహాగ్నిశిఖల నడఁచి యడఁచి

సకలనీతిశాస్త్రసరణి నాతాటకా
జాతనిర్జరారినేత యాడె.

31


ఉ.

నెట్టన ధాతృసంతతి జనించి యనేకకళానయక్రియల్
గట్టిఁగ గాంచి సత్సరణి గల్గి జగజ్జనయిత్రి సీతనే
కట్టడి దే దలంచితిరి కట్టడిచేతలఁ దెచ్చినంతనే
తిట్టరె సిద్ధసాధ్యఖగదిగ్ధరణీశితలెల్ల గేరికన్.

32


ఉ.

తాటకఁ గీటడంచె శశిధారిశరాసనయష్టి లీల స
య్యాటనె గండ్రచేసె గహనాంతరధాత్రిధరాధితేయని
ర్ఘాటకశక్తి జారిచె ఖరత్రిదశారి హరించె నిట్ల నా
నాటికి హెచ్చినట్టి జననాయకహేళిఁ దలంచఁ జిన్నయే.

34


క.

తనదాయిచేత నీచ
క్కనిచెల్లెలి కర్ణనాసికల్ శస్త్రికచేఁ
దునియఁగ జేయించిన యా
జననాయజహేళిసాటి జగతిం గలరే.

35


చ.

అలజడి నగ్రజార్యఘట లంచితదండకకాననాంతర
స్థలి ఖరహంతఁ జేరి సరసస్థితిచే గణియించఁగా దయా
జలనిధిగాన రాత్రిచరసంతతిఁ గీటఁడగించఁజాల ని
శ్చలగతి సంధి జేసినది సాగక రిత్త చనంగ నేర్చునే.

36


క.

ఖరశస్త్రిక నాదాయిన్
ధరణిం ద్రెళ్లంగజేసి దయచే న న్నీ
కరణిన్ రక్షించిన యెడఁ
దిరుఁగఁగ నెద్ది గతి యింకఁ దెలియ దశాస్యా.

37


ఆ.

అనిన నాగ్రహించి యాదశాస్యనిశాట
కర్త చంద్రహాసఖడ్గధార
నతని నేసె నేయ నల్లంత నెడఁ గల్గి
నిలచి ధిక్కరించి తెలియ నాడె.

38

చ.

హితగతి నీతిచర్య గణియించిన గానఁగలేక యాగ్రహిం
చితి చెడుగంతయ య్యకట! చెన్నటి నీయసి ద్రెళ్ల నేటి కే
నతనిశరాహతిం దెగి నయక్రియ నేరికి నందరాని స
ద్గతి జరియించెదన్ ధృతి నఖండితకీర్తి ధరిత్రి నిండఁగన్.

39


చ.

అని తృణలీలఁగా తెలియనాడి తదాజ్ఞ ధరించి తాటకా
తనయనిశాచరాగ్రణి సచాగతిధిక్కరణాచ్ఛశీఘ్రన
ర్తన ఘటియిల్లఁగాఁ గదలి దండకకాననధాత్రి జేరఁగా
జని ఖరహంత గాంచి దృఢసాహసహర్షరసాతిశాయియై.

40


చ.

తనహృదయస్థలిన్ గలఁక దాల్చఁగ నిశ్చయదృష్టిఁ దాటకా
తనయనిశాటనేత సహితస్తితి ధారుణిజాతచెంతఁ గాం
చనహరిణాకృతి న్నిలచి సారనటిల్లతికాచ్ఛలీలలన్
దనరి చనంగసాగె గహనస్థలియెల్ల నలంకరించఁగన్.

41


క.

తనచెంగట దాశరథిన్
గని చేరఁగ నేఁగి చిత్రకనకాకృతిచే
దనరారె నిఱ్ఱి యల్లదె!
చని దాని గ్రహించి తెచ్చి చక్కఁగ నీరే!

42


చ.

అని జలజాక్షి యాడ నతిహర్షగతిన్ ఖరరాక్షసారి చ
క్కనిజఠరాస్యదృక్చరణకర్ణశరీరనిగన్నిగత్కళల్
గనికని దానిఁ జేరఁ జనఁగా నది యందకయంది సాగఁగా
దనహృదయస్థలిన్ గలఁక చాల్చి నయక్రియ జ్ఞానదృష్టిచేన్.

43


క.

దానిగతి దెలిసి సీతా
జాని దృఢశరీరయష్టి సంధించి ఘన
జ్యానాదలీల లదర న
హీనతరకళాస్త్రధార ననిఁ ద్రెళ్లించెన్.

44


వ.

అంత.

45

క.

ఆయిఱ్ఱి దిశలు నిండఁగ
హా! యహిరాడంశ[5]జస్థరాజాగ్రణి! యన నా
ఛాయన్ దశరథనందన
[6]నాయిక యాలించి యార్తి నలినలిసేయన్.

46


ఉ.

అన్నలినాయతాక్షి తనయండఁ జరించెడి దిట్టఁ గాంచి, నీ
యన్న ఖరారి చండగహనాండజసంతతి సంచలించఁగా
ని న్నధికార్తిచే దలఁచే నెట్టన నాతని కిట్టి జాడయే
చెన్నటిజేసినా డరయ శీఘ్రగతిం జనరయ్య! యియ్యెడన్.

47


ఆ.

అనఁగ దరలనట్టియారాచనెలఁ గాంచి
యాడరాని జాడ యాడె గాన
జలజనయన హర్షసరణి రక్షగఁ జేసి
దైత్యహంతదారిదాయి చనఁగ.

48


వ.

అంతనిట దశకంఠలేఖారి [7]చదుర యగ్రజక్రియ నేతెంచి నిజలీల దెలియఁ
జేసిన.

49


చ.

జనకజ యాతగాని గని జాలి ఘటిల్లఁగ నేలజారినన్
గనికని నేలగడ్డఁగరకాండ దృఢక్రియ సంగ్రహించి కాం
చనరథధాత్రి జేర్చియతిసాహసచర్యల లంకజాడగా
జనియె నిశాటకర్త నరచారణనాగఘటల్ చలించఁగన్.

50


క.

ఈరీతి జనిన దినకర
సారథిజాతఖగనేత జాలిన దితిజా
తారాతి నడ్డగించఁగ
చారనఁగరదండశక్తి దాని హరించెన్.

51


ఆ.

దాని ద్రెళ్ల నడఁచి దశకంధరాదితే
యారి లంకఁ జేరనరిగి సకల
హితనిశాటనేతలెల్ల నిరీక్షించి
యర్థిగణన సేయ నలరె నంత.

52

క.

జనకజ నేకాంతస్థలిఁ
దనరిన శృంగారగహనధరణిన్ దితిజాం
గన లరికట్టఁగ దోలిం
చ నితాంతస్నేహచర్య శాసించె దగన్.

53


వ.

అంత నక్కడ.

54


క.

తనదాయి నగ్రధాత్రిన్
గని జనకజ డిగ్గనాడి గ్రచ్చఱ నేతెం
చిన జాడ నరసి యాగ్రహ
జనితార్తిని రాక్షసారి జడయికచేతన్.

55


తే.

తిరగి నిజదళశాల కేతెంచి ధరణి
జాత నీక్షించఁగాలేని సరణి కెంతె
చెదరి రాక్షసచర్యగా హృదయధాత్రి
గాంచి యత్యంతకఠినార్తిఁ గాగికాగి.

56


క.

ధృతిచే నాకాంతార
క్షితిధరకంధరల చెట్లచెంతల నేలా
లతికాగృహశాలల నా
తతగతిచేఁ దిరిఁగితిరిఁగి ధైర్యస్థితిచేన్.

57


ఉ.

హా కలకంఠి! హా కిసలయాధర! హా యలినీలకేశ! యా
హా కరియాన! హా సీతకరాసన! హా జలజాయతాక్షి! యా
హా కనకాంగి! హా కలికి! హా కఠినస్తని! చేరరాక న
న్నీక్రియ నేఁచ దాళఁగలనే లలనా! కలనై న రాగదే.

58


వ.

అని చింతించి.

59


సీ.

తరణికంజారాతి తారకాసరణి స
             న్నధాత్రిరాజసంతతి తరించి

యహిఖడ్గకిటిదంతిహర్యక్షగంధసా
             రంగచండారణ్యరాజి దాటి
యగణితరత్నాకరాతీతసాతత
             చిరతరహ్రాదినీశ్రేణి గడఁచి
కఠినరాత్రించరాకారకీచక[8]సార్జి
             నాగారసకలదేశాళి యరసి
చనుచు సీతాంగనాజాని చందనాగ
సంచరన్నిర్ఘరీఘనస్థగితఘనల
తాంతగంధానిలాహతాత్యంతదేహ
యష్టిసంజనితగ్లానియై కడంగి.

60


చ.

అలజడి రాక్షసారి చన నాసరణిన్ ధరణీధరాంగణ
స్థలి నని ద్రెళ్ళినట్టి హరిసారథిసంతతి గ్రద్దఁగాంచి చెం
తల కరుగంగ కన్దెరచి ధైర్యరసస్థితిచే ననేకచ
ర్యలఁ గణియించి సీతతెఱఁ గార్తి నెరుంగఁగజేసి యయ్యెడన్.

61


చ.

అనఘచరిత్ర! సత్యనిధి! యార్తశరణ్య! దయానిధాన! య
త్యనత దశాననాఖ్య గలయట్టి నిశాచరనేత చక్కఁగా
జనకనరేంద్రజన్ రథరథాస్థలి జేరిచి లంక కేడ్తెరన్
జనఁగని యడ్డగించి దృఢసంధి ఘటిల్లఁగ నాజి జేసితిన్.

62


క.

అరికట్టి సాగనీయక
చరణనఖరశస్త్రికల నిశాచరనేతన్
జిరతరగతిఁ దన్న[9]నసృ
క్చరధారల్ గాత్రయష్టి జారఁగ డస్సెన్.

63


క.

ఇతరేతరకరదళితా
తతగాత్రజరక్తసలిలధారాసిక్త
క్షితి యయ్యె న్నిర్జరసం
తతి తారాసరణి నిల్చి దర్శించంగన్.

64

క.

నీతండ్రికి నా కధికహి
తాతిశయత గలిగెగాన ననిఁ దెగి నే నా
సీతతెఱం గెఱిఁగించఁగ
నీతఱిఁగా నిలిచితి న్నరేంద్రశశాంకా.

65


క.

అని యీల్గిన యాగ్రద్దన్
గని యర్హక్రియ రచించి కడతేర్చె ధరా
తనయాధినేత నడకల
కెన గల్గెదరే జగత్త్రయిన్ తెలియంగన్.

66


సీ.

ఆగ్రద్ద యెఱిఁగించి నట్టిజాడల్ నిద
             ర్శన సిద్ధి జక్కనఁ జరిగి జరిగి
ఘనదీర్ఘహస్తరాక్షసకర్త దెగటార్చి
             కాననాంతస్స్థలిఁ గడచికడచి
జేరి యర్చించిన చెంచెత నిజదాసి
             గా దయాదృష్టిచేఁ గాఁచికాఁచి
యధరసంఘట్టన నైన రెండక్కరాల్
             గల సరస్స్థలి నీట నలరి యలరి
తాళహింతాళకదళీరసాలకంద
రాలసంతాన కేతకీసాలకరక
జాలశాఖల నీడలఁ జాల నలసి
చింతచే రాచనెల లధిష్టించిరంత.

67


వ.

ఇట్లుచేరి యధిజ్యశరాసనశస్త్రికల్ దాల్చి తరణికళాధరలీలఁ దేజరిల్లెడి
రాచనెలలజాడఁ జారసంతతిచే నార్కి యాలించి జడిసి యాంజనేయ
హరి ననిచిన.

68


క.

ఇనతనయాగచరాజ్ఞం
జనిచని కాసారతీరజగతి నధిష్టిం
చినయట్టి రాచనెలలం
గని యానతి జేసి నిల్చి కలనాదగతిన్.

69

ఆ.

ఎచటి కెట్టియాత్ర యెట్టికార్యస్థితి
దాని నెఱుకసేయ దగదె యన్న
ననిలతనయ నగచరాగ్రణిఁ గాంచి ఖ
రారి తెలియనాడె నాదరించి.

70


సీ.

నాతండ్రి దశరథనరనేత చినతల్లి
             కిచ్చినకాంక్ష దా నీయలేక
యలగంగ నాగాథ నాలించి యాలించి
             సంథిసంధిల యతిసరణిఁ దాల్చి
తగరాజధాని నేఁ దరలి దండకచండ
             కాననాంతస్స్థలి గదియఁ దెలిసి
తస్కరక్రియచేత దశగళలేఖారి
             జనకజాంగన జేరి సంగ్రహించి
తీక్ష్ణగతి లంకజాడల దెచ్చినట్టి
కట్టడలెఱింగ తృష్ణ నాకండ్ల నలసి
సరసగంధానిలాంతకాసారతీర
సైకతస్థలి నిలచితి జాలి ననఘ!

71


క.

అని యాద్యంతక్రియ లా
యనిలజహరి కెరుఁగఁజేయ నాలించి నరా
శనహంత యాననస్థలి
గని యలజడి యడఁచి నీతికార్యస్థితిచేన్.

72


ఆ.

ఇట్టి కార్యసరణి కేటికి చింతించ
దశరథక్షితీశతనయ! రయత
నార్కిఁ గలిసితేని యఖిలకార్యార్థసం
ఘటన గాదె యర్ధఘటికయందె.

73


చ.

హరిశిజహేళినందన నరాశననాథ నదీశనార్థ రా
డ్గిరిశదిగంతకేశతతికిం గణియించఁగ నార్కికర్త తా
నరయఁగ నీసహాయత నయక్రియ సంధిల నిచ్చెనేని ని
ర్జరఘటలైన నాజిఁ గడసాగఁగ నిల్చెదరే జగత్త్రయిన్.

74

క.

అని యతనియాజ్ఞ నొద్దికిఁ
జని యర్కజహరికి సకలచర్య లెఱుఁగఁజే
సిన సంతసిలి దశరథ
తనయాగ్రణిఁ దేగననిచెఁ దహతహ లెసఁగన్.

75


వ.

ఇట్లాంజనేయహరి యార్కియానతిఁ దిరిగిచని దాశరథిం గాంచి.

76


క.

[10]ఇక్కడికార్కికి రారా
దక్కడి కేతెంచితేని నఖిలాకాంక్షల్
చక్కఁగ నీడేరును నా
నక్కఱచే లేచి యధికహర్షాసక్తిన్.

77


మ.

అలధాత్రీశిత యంజనాతనయ సాహాయ్యక్రియల్ రా గిరి
స్థలిఁ గీశక్షితినేత గాంచి యతికాంక్షల్ దీరఁగా డిగ్గి తా
రలయాహ్లాదరసస్థితిన్ గదసి గాఢాలింగనాద్యర్హచ
ర్యలచేతన్ నటించి నిల్చిరి రహస్యక్రీడచే నయ్యెడన్.

78


క.

ఆదాశరథిని గని య
త్యాదరగతి నర్కతనయ హరితాహృదయా
హ్లాదరసస్థితిచేఁ గల
నాదక్రియ నాడె నీతి వర్తిల్లంగన్.

79


చ.

అనఘచరిత్ర! నీనడక లాహరిచేత నెఱింగినాడఁ జ
క్కని చరణాగ్రఘట్టనలఁ గంనిధి లంక యడంగ దన్ని య
త్యనతదశాస్యరాత్రిచరదంతి నహంక్రియ జార్చి తెచ్చి న
ర్తనగతి నగ్రధాత్రి నిడెదన్ జరియించఁగనీక కట్టెదన్.

80


సీ.

అదిగాక నే నిట్టియద్రిఁ గీశసహాయ
             తాస్థితిఁ జరియించ, దైత్యనేత
కాంచనస్యందనాగ్రస్థలి నిడియు జిం
             తాతీతరయగతి నరుగసాగ

జనకకన్యాకాంత తనచీరగండ్ర చే
             ఘనతరాలంక్రియల్ గట్టి యిచట
నేసె నేసినయది యిన్నాళ్లదనుక నీ
             చరిసంది దాచితిఁ జాడ దెలియ
నని తరలి దాని దెచ్చి ఖరారిచెంత
నిడిన గన్నీటిజడిచేత నెల్లయంగ
యష్టి తడియంగ నిలజారి లేచి తక్కి
చెంత తనదాయి లాలించ శాంతిఁ జెందె.

81


వ.

ఇట్లు శాంతిఁ జెందిన దాశరథిం గాంచి యార్కి యిట్లనియె.

82


ఆ.

ఇంత చింతఁ గలఁగ నేటికి నాకాంక్ష
జేరి సంఘటిల్లఁజేసితేని
యర్ధఘటిక నీహితార్థక్రియల్ [11]సేయ
గలనయా ఖరాంతకక్షితీశ!

83


క.

తారాసతి నాకడ కే
తేరంగాఁ గాంచి శాక్రి దృఢగతి గిష్కిం
ధారాజ్యకర్తయై తన
రారె నతనిసాటిసేయ జగతిం గలరే.

84


తే.

ఆవకాఖ్య గలిగినట్టిఖగారాతి
సంహరించి యంఘ్రి సంహరించి
నికటశిఖరి దాటనేసె నాశాక్రిచే
శక్తి గణనసేయఁజాల ననఘ.

85


క.

ఈడనరాని దృఢక్రియ
దశరథ రాజనందన చరిత్ర
నేడింటన్ దాడిచెట్ల నేకాకృతిగా
క్రీడతలల్ కరశాఖల్
గేడించి గ్రహించె శాక్రికిన్ సరిగలరే.

86

క.

అనినం దరహాసయుతా
నన కంజారాతికిన్ ఘనశ్రీ లెచ్చం
దిననాథజ హరి నేతన్
గని తేనెల్ జిల్క నాడె గాదిలిసేతన్.

87


చ.

అనఘా! నీయెదఁ జింతసేయఁ దగదే నా నిర్జరాధీశనం
దనకీశాగ్రణి [12]గాలకాశనటనన్ నారాచధారాహతిన్
గనెలై త్రెళ్లఁగ నేన యేసినకడన్ గారాన నీతార నీ
కనతఖ్యాతి ఘటిల్లనిచ్చి హరిరాజ్యశ్రీల నేలించెదన్.

88


ఆ.

అంగజారియైన నచలాధరారాతి
యైన స్రష్టయైన నడ్డగించ
సాగిరేని శాక్రి జక్కాడకే చన
నిట్టి సందగాన నెరుఁగరాదె.

89


క.

అని యార్కి చెంతరాగా
జని త్రెళ్లిన నిర్ణరారిచరణనఖరసం
జ్ఞ నెగురగీటెన్ హరినం
దనహరికన్నాన క్షాత్రతరనయశక్తిన్.

90


వ.

అది గడచి.

91


ఉ.

ఎన్నికఁ దాడిచెట్లకడ కేఁగి ధరాతనయాధినేత య
చ్ఛిన్నశరాసయష్టి నరిఁ జేరిచి కీలికరాళశస్త్రిచే
నన్నిఁట గండ్రలై ధరణి నంటఁగ నేసె దిశల్ చలించఁగా
గిన్నరసిద్ధసాధ్యఖగఖేచరకీర్తన లెచ్చ నయ్యెడన్.

92


క.

తనకట్టిదె నాదశరథ
తనయాగ్రణి నడక సాటి దాకిన నిననం
దనహరి యలరి తదాజ్ఞం
జని శాక్రిన్ జేరి యుద్ధసన్నద్ధగతిన్.

93

ఉ.

చేరి దినేశజాతహరిఁ జీఱిన [13]నంతట నాలకించి నిం
డారిన యాగ్రహాగ్నశిఖ లాశల నిండఁగ దాక నేఁగి శై
లారిజకీశనేత గదియన్ గఠినక్రియ నాజియయ్యె నా
చారణసిద్ధసాధ్యఖగచారణసంతతి తల్లడిల్లఁగన్.

94


క.

సాలాసాలి శిలాశిలి
తాళాతాళిం గరాశదంతాదంతిన్
శైలాశైలి కచాకచి
హేళిం గలయించసాగి రిద్దఱ లంతన్.

95


చ.

చని ఖరహంత చెంతఁగల శాఖయె యండగ నిల్చి సాయకా
సన దృఢశింజినిన్ గఠినశస్త్రికఁ జేరిచి లేఖరాజనం
దనహరిఁ గాంచికాంచి ధర తల్లడిలంగ ఝలీనదాక నే
సినఁ దెగి త్రెళ్లె దా నశనిచే నలియైన ధరాధరాకృతిన్.

96


క.

ఈరీతి శాక్రి ద్రెళ్లిన
దారాసతి నార్కి కిచ్చి దయచేఁ గిష్కిం
ధారాజ్యకర్తఁ జేసెన్
శ్రీ రంజిల నతనిగణన సేయంగలరే!

97


వ.

అంత.

98


శా.

తారాకాంత దినేశజాతహరి నిత్యశ్రీల శృంగారకాం
తారాజ్యస్థలిఁ జందనాచలదరీధాత్రీఘనహ్రాదినీ
తీరాగ్రక్షితిరాజగేయగుహలన్ దీరాన హృజ్ఞాతకే
ళీరాగస్థితి దేలియాడిరి హితాళీజాలసంక్రాంతిచేన్.

99


క.

ఏతఱిఁ దెలియఁగ నేరక
యాతారాకాంతఁ గాంచి యత్యంచితరా
జ్యాతిశయశ్రీచైతన్
సీతాజానిఁ గనలేక క్షితిఁ జరియించన్.

100

వ.

అయ్యెడ నాషాఢాదిదినచర్యల్ నడచె నయ్యెడ.

101


క.

క్షితి గగనస్థలి యేకా
కృతి దాల్చినయట్టిజాడ దృఢదంతికర
స్థితి నంచితజలధారా
తతి జారెన్ జలదగర్జితక్రియ లెసఁగన్.

102


మ.

కరచాచ్ఛిన్నదిగంతశాఖియయి నిర్ఘాతాహతా[14]గారయై
హరినాగేంద్రకరాతిచండశతధారాశ్లేషశేషాహిశే
ఖరగండస్థలియై ఘనాఘనతటిద్గర్జాతిరేకస్థితిన్
ధరయెల్లం జడి నిండసాగె జనచింతాకారణస్థానియై.

103


తే.

అట్టిజడినాళ్ల నాదైత్యహంతచింతఁ
గైకసీజనకాగ్రజాఖ్యాకశిఖరి
నర్థి నిల్చెను నధికహితార్తిచేతఁ
దాళఁజాలక తనచిన్నదాయిఁ జేరి.

104


క.

చేసిన [15]శరతికి రాకే
యాసారసహితజహరి యహంక్రియచేతన్
నాసాలసనాహృత్స్థలిఁ
గాసిలఁ జేయంతసాగెఁగా నిర్దయతన్.

105


క.

తేలిన తనకార్యస్థితి
లీలన్ ఘటియించె గనుక లెక్కించక తాఁ
జాలానాళ్లయ్యెన్ రాఁ
డేలా నే నింక నార్కి కేలా తెలియన్.

106


క.

తన రాజ్యశ్రీచేతన్
దనసాహసచర్యచేతఁ దారాస్థితికిం
దనదేహయష్టిఁ దెలియక
సనయత నేతేరడాయెఁ జంచలదృష్టిన్.

107

ఉ.

చక్కఁగ ధాత్రి నద్రిచరజాలసహాయత గల్గి యార్కి తా
నిక్కడ కేఁగ లెస్స యతఁ డేగక సాహసశక్తి నిల్చె నా
నిక్కనయట్టి శాక్రి దెగనేసిన శస్త్రిక యగ్నికీలలం
గ్రక్కగసాగె దీని కిక గానఁగనేయ నదేల ధీనిధీ.

108


క.

అని యాడి యన్న యిచ్చిన
ఘనశస్త్రికఁ దాల్చి తీక్షకరరయగతిచేఁ
గనదాగ్రహహృత్స్థలియై
చనియెన్ గిష్కింధదారిఁ జనతతి కలఁగన్.

109


క.

అనలాకృతిచే దశరథ
తనయక్షితిజాని రాగఁ దగఁ గిష్కింధా
జనసంతతి హృదయస్థలిఁ
గని యార్తిం గదలిసాగెఁ గన్నటికార్తిన్.

110


క.

సరగ సదనాంతరస్థలి
కరిఁగిన రాచనెలఁ గాంచి యలజడి దారా
హరినేత లెద్ది తెలియక
తిరుగంగాసాగి రార్తి తీండ్రించంగన్.

111


వ.

అంత శేషాంశసంజాతధరణిజాని యంతఃస్స్థలికిం జని.

112


చ.

ఇనతనయాగచారిఁ గని యిద్దతరాగ్రహదృష్టిఁ జీఱి చే
సినగెరి దాట నేటి కిఁక జేరని దెంతకడింది శక్రనం
దనహరి ద్రెళ్లనేసిన ధనంజయహేతి కరాళశస్త్రి చ
క్కన గనరాదె ని న్నడఁచఁగాగల దీఘటియందె కానరా.

113


వ.

అని దాశరథిదాయి యనినఁ దారాసహాయత దినకరనందన
హరికర్త చలించి.

114


ఉ.

దారనఛాత్రి సాగిలి హితస్థితిచేఁ గణియించి డగ్గరాఁ
జేరి యనేకసత్ర్కియలచే నలరించినఁ గాక డిగ్గి నిం
డారిన శాంతి రాచనెల యాహరిలాలనచేత జిక్కి నే
తేరఁగజేసి తాఁ దిరిగె దిగ్ధరణీశిత లెన్న నయ్యెడన్.

115

ఉ.

ఆ నలినీశాజాచలచరాగ్రణి రంజిలి యద్రికన్యకా
జాని నగారికీలి హరిజాత నిశాచరనాథకందిరా
జానిల యక్షనాయకదిశాగతకీశసహాయతాస్థితిన్
శ్రీనిధియైన దాశరథి జేరఁగ నేఁగి గణించ నయ్యెడన్.

116


క.

దిననాథజాతహరి శా
సనగతిచే రాక్షసారి జనకక్షితిరా
ట్తనయకయి యనఁచ గిరిచర
జనసేనల నాశలెల్లఁ జదియఁగ నంతన్.

117


ఉ.

అనిచిన గీశసేన లఖిలాశల కేఁగి యనేకచర్యలన్
ఘనతరశైలకందరలఁ గానలఁ దిన్నెల నేటిజాడలన్
గనికని జానకీలలనఁ గానఁగ నేరక లజ్జచేత జ
క్కన ఖరహంత జేరి తిరుగంజని రార్తి ఘటిల్ల నయ్యెడన్.

118


ఉ.

అనగచారిసంతతి దృణాకృతిగా (నిరసించి చాలక)
న్నానిన యాంజనేయహరి యంచితశక్తి నెఱింగి జానకీ
జాని దయార్ద్రదృష్టిఁ దనసన్నిధిఁ కేరఁగఁజీఱి సాహస
శ్రీనయకార్యధైర్యజయచిత్రకళల్ గణియించి నిల్కడన్.

119


క.

తనచేతియలంక్రియ నా
యనిలజహరిచేతి కీయ నది చాలిచి చ
య్యన దక్షిణజలనిధి చా
య నరిఁగె గిరిచరఘటాసహాయతచేతన్.

120


వ.

ఇట్లు చనిచని.

121


ఉ.

కానల నేటిచాళికల గట్లయదాటికిఁ గందరాంతర
స్థానలతాగృహాచ్ఛటల చర్లకడన్ గడలేని దిన్నెలన్
జానకి దైత్యహంతసతిఁ జక్కనిజాడఁ గనంగనేర కే
గ్లాని జరించి కీశతతి కందఁగ సాగె ననేకచర్యలన్.

122

క.

ఆహారనిద్ర లెఱుఁగక
యాహాకారగతిచేత నాశలు గలఁగన్
ఆహరిసేనల్ దిరిగిరి
సాహసదృఢనీతి ధైర్యచర్యలచేతన్.

123


క.

అలయికచే నీరీతిం
దెలియక నల్దిశలఁ గలయఁ దిరిగి తిరిగి తృ
ష్ణలచే [16]నాకండ్లెంతే
నలజడి సేయంగ నిలిచి రార్తిక్రియలన్.

124


వ.

అంత.

125


సీ.

అంజనానందనహరికర్త సంగడి
             కాండ్లనందఱి జతగలసి చెంత
సలిలాండజాతసంజాతయాతాయాత
             కందరాంతస్స్ధలి గదిసిసాగఁ
గడలేని గాఢాంధకారసంహతిఁ దాటి
             నిశ్చేతనక్రియ నెగడినట్టి
రత్నసాలహిరణ్యరాజిగేహాంగణరం
             జితరాజధాని దర్శించి యచటఁ
జక్కనినెలంతఁ గని యట్టిచానకతన
దృష్ణ యాకండ్ల నడఁగించి దేజరిల్లి
యది గడచి ఢాక నెగసి యింద్రాద్రిఁ జేరి
సంచరించిరి [17]యంతంత జగతి యగల.

126


వ.

ఇట్లు సంచరించి యలయిక నందఱల్ జంగిలిగట్టి దాశరథి
కథ లిష్టగాథల నాడసాగి రెట్లంటేని.

127


సీ.

జనయిత్రియాజ్ఞ దాశరథి దండకకాన
             నాంతరస్థలికి దా నరుఁగ నేల?

ఖరఖరాదినిశాటకర్తల నందర
             శితశస్త్రికలచేతఁ జెండనేల?
తస్కరక్రియలచే దశగళత్రిదశారి
             క్షితిజ లంకాస్థలి జేర్చనేల?
యతని దండాహతి నర్కసారథిజాండ
             జాగ్రణి నలిదెగటార్చనేల?
యట్టి రానెల కీయార్కి కాంజనేయ
శిఖరిచరనేత సఖ్యత సేయనేలఁ?
దృష్ణ నాకండ్లచే గడ దెలియలేక
గట్లఁగానల జరియించఁగా నదేల?

128


క.

అని హరిసేనల్ జాలిం
గనలఁగ నాయింద్రశిఖరి కందఱ శయనిం
చిన దినకరసారథినం
దననీడజనేత తెలిసి తహతహచేతన్.

129


సీ.

దశరథరాజనందన కథాకర్ణన
             క్రియచేత రెక్క లిగిర్చినట్టి
గ్రద్ధ తానింద్రాద్రికందరాంతస్స్థలిం
             గడఁచి చెంగట కీశఘటల గాంచి
కలయ నందఱఁ జేరఁగాఁ జీఱి చక్కఁగ
             గణియించి హర్షసంగతిఁ దనర్చి
తనచర్యలన్నింటిఁ దాచక యెఱిఁగించి
             జడయక తారకాసరణి కెగసి
కైకసేయనిశాచరకర్తనగరి
సరసశృంగారకాననస్థలి కృశాంగి
యైన జనకజగట్టిగా నరసియరసి
జగతి కతిశీఘ్రతరగతిఁ జారి నిలిచి.

130


ఉ.

కానక నల్దిశల్ గలయఁగాఁ జరియించఁగ నేల నిస్సహా
గ్లాని జరించి చండదశకంఠనిశాచరశాసితాచ్ఛలం

కానగరస్థలిన్ సరసకాననఛాత్రి గృశాంగియైన యా
జానకి గంటి నం చరిగె జక్కఁగ గ్రద్ద నిజేచ్ఛ నయ్యెడన్.

131


క.

దిననాయకసారథినం
దననీడజచేత [18]ధరణి కన్యా
ఘనసరణిఁ దెలిసి చక్కఁగ
ననిలజహరి సంగడీల యాజ్ఞారతిచేన్.

132


సీ.

నింగికిఁ జక్కగా నెగిరి నిశ్చలత లం
             కారాజధానిఁ గదలికదలి
జలరాశి దేలిన శైలకన్యాసహ
             జాద్రియం దొకకేల నానియాని
యట్టకట్టిన యనిలాశనీజనని య
             త్యంతసత్కారాల నందియంది
యల్క సింహిక జఠరాంతస్స్థలి నిల్చి
             చెలఁగి గండ్రల్ గాఁగ జీరిచీరి
యంచితశ్రీలచే హెచ్చినట్టి యాత్రి
శృంగధరణీధరస్థలి జేరి చేరి
నంతనే చండదీధితి యస్తశిఖరి
గదిసె నెరసంజకెంజాయ లెదుఁగసాగె.

133


తే.

అంత గాఢాంధకారసంహతి యజాండ
కలశినిండిన గిరిచరకర్త ఋక్ష
సరణి కెగసి దశాననవారణారి
నగరి నతగాత్రయష్టియై నాచి కదిసి.

134


క.

తెలియక నదృశ్యగతిచే
గలయఁగ రాజగృహశాలఁ గరిహయరథశా
లల నగళల్ నింటింటన్
లలితక్రియఁ దిరిఁగితిరిఁగి లజ్జ ఘటిల్లన్.

135

శా.

ఆలంకాస్థలియంతటన్ దెలిసి దేహగ్లానిచే చెంగటన్
శ్రీ లానంగ ననంతనాకనగ నచ్ఛృంగారకాంతారధా
త్రీలేఖాహితగేహినీచలితరీతిన్ నాతి నీక్షించి తాఁ
జాలా రంజిలి సీతగా నరసి తత్సాన్నిధ్యసంస్థాయియై.

136


క.

తనచేతియలంక్రియ నా
జనకతనయచేతి కిచ్చి జనకతనయచే
ఘనరత్నకలిక దాలిచి
యనిలజహరినేత సాహసాతిశయతచేన్.

137


సీ.

అనతశృంగారకాననశాఖిరేఖల
             ధరణీస్థలిని ద్రెళ్ల తన్నితన్ని
చెనట నిశాచరాంగనల కర్ణాస్య నా
             సిక లెల్ల నిలియంగ సెలఁగి సెలఁగి
యాజి కేతెంచిన యక్షకాదినిశాట
             శేఖరసంహతిఁ జెండిచెండి
శక్రజిచ్ఛరధాతృశస్త్రికఁ జిక్కి రై
             త్యేశితచెంగటి కేఁగియేఁగి
లంక కాలాగ్నిశిఖలఁ గలంచి తిరిగి
సీతయానతిఁ జని రక్కసిని హరించి
కడలి లంఘించి హరిసేనఁ గలసి రాక్ష
సారి దర్శించి నతిఁ జేసి యండనిలచి.

138


క.

కంటిన్ సాక్షాదిందిర
గంటిన్ జనకక్షితీశకన్యన్ ధన్యన్
గంటిన్ సత్యగ్రేసర
గంటి జగజ్జనని సీతఁగంటిన్ గంటిన్.

139


వ.

అనిన సంతసిల్లి దాశరథి యిట్లనియె.

140


క.

నాతండ్రి దశరథక్షితి
నేత సరణిగాదె యనఘ! నీఋణగతి నే

నేతఱినైనం గానిక
నాతతగతి దీర్చఁగలనె యందఱ లెరుఁగన్.

141


క.

అన సంతసిల్లి దశరథ
తనయక్షితిజాని గాంచి దండ కరిగి యా
యనిలజహరి యంఘ్రిస్థలి
కెనయఁగ నానతి రచించె హితగతి నెరయన్.

142


చ.

క్షితితనయాలతాంగి దయచేసినయట్టి దినాధినాయకా
యతఘృణికంజరాగశిల నాహరియిచ్చినఁ గేల నంటి యం
చితనయనాగ్రజాతజల చేసి శరీరయష్టియై
ధృతిచెడి నేలఁ జారి యతిదీనత లేచి ఖరారి యయ్యెడన్.

143


ఆ.

కదియఁ జింతఁ జేసి కట్టెద దెలసి దా
శరథి రాజహేళి సకలకీశ
సేనలెల్ల నిండిరా నీరనిథిచెంతఁ
జేరి ఖచరరాజి చెలఁగ నంత.

144


క.

ధీనిధి ఖరారి యగచర
సేనలచేఁ జలధిచెంతఁ జేరినజాడల్
రానాలకించి కెరలి ద
శాననఖచరారి లేచి యాగ్రహదృష్టిన్.

145


క.

ఘనరత్నఖచితసింహా
సనధరణిన్ నిలిచి సకలశాస్త్రజ్ఞనరా
శనకర్తల హితసరణిం
గని చేరఁగఁ జీరి చాలకాక ఘటిల్లన్.

146


చ.

కటకట తాటకారి తనకాంతఁ దలంచఁగలేక యష్టది
క్తటహరిసేనలన్ గలసి కంనిధి చెంగటి కేఁగి నిల్చినా
డట గిరిజాగిరీశసహితాద్రి నహీనకరాళసారసం
ఘటితకరాగ్రశ క్తి సిరిగందఁగ నెత్తిన న న్నెఱుంగఁడే!

147

వ.

అని యాస్థాని గ్రక్కటిల్లఁ గ్రీగంట రక్తజలధారల్ జార జండనిర్ఘాత
నాదతిరస్కారదంతసంతానసంఘటితకిటగిటల్ నెఱయ దీర్ఘనాసిరంధ్ర
నిర్గతానిలాహతి నంగయష్టి కంద దశశీర్షచిరతరత్నకిరీటనిగనిగచ్ఛాయల్
జదలంట సితశాఖకంటకారకేశచ్ఛట లల్లలనాడ నాతతజఘనఘనా
ఘననిర్జాడ్యగర్జాగాధతర్జనలం జెంగలించ నగ్రస్థలి నీతికార్యదక్షదండ
నాయక సంహతిఁ గాంచి శరశరాసనఖడ్గచేలాంగలగదల్ దెండవ సదృశ
కంఖాణగంధగంధిలకరటికాంచనశతాంగసైనికతతి కర్హక్రియ లలంకరిం
చిన యదిగండనిస్సహణనిస్సాణఢక్కానకఝల్లరీఘంటాశంఖకా
హళ రం తదరఁజేయ నిఖిలహితనిశాచరకర్తలకందఱికి లేఖ ల్లిఖియించిన
నది లెస్సయని నెయ్యి [19]చిలికించిన కాలాగ్ని నాఁ గెరలి యహంకరించి
గద్దించి యంతటం గలయ నధిష్టించి.

148


క.

తనయాసానధరిత్రిన్
ఘనరాక్షసకర్త నీతికార్యనిధి దశా
ననరాత్రించరనేతన్
గని దానక్షాత్రసరణిఁ గణియించెఁ గృతిన్.

149


క.

అరనీటకకర్తధృతిన్
హరిసేనలఁ గలసి చన్న నకటా! యెదని
(?)ర్జరకంజన జరియించన్
శరణియె హరికర్తలైన సరి యనగలరే.

150


అరచేత నే నింగినాన శేషాహి
             తలలడంగ ధరిత్రిఁ దన్నలేనె
కలఁచనే జలరాశి గడలెల్ల జారంగ
             నలయంగ గాలాగ్ని నడచలేనె
గట్లన్ని యచ్ఛనగండ్లగాఁ గీటనే
             యార్కిదంష్ట్రలు రాల [20]నణఁచలేనె
శక్రాది నిర్జరసంహతిఁ ద్రాళ్లచే
             గట్టి యంగడియడ్డ గట్టలేనె

తెలియ నీయాజ్ఞ యెంతైనఁ గలిగెనేని
యెంతటికినైన నిలిచెదఁ జింత యేల
యశనిసంకాశ కఠినాట్టహాస సంచ
లీకృతారాతిరాట్కేయ! కైకసేయ!

151


క.

[21]న న్నచటికి శాసించిన
దిన్నఁగ రానేల దెచ్చి తృణగతిగా నీ
సన్నిధి నిడియెద నాయెడఁ
గన్న ననర్హగతి గల్లఁ గాంచెద నిచటన్.

152


క.

అని యాడినట్టి గాథల
ననతానందజలరాశి నలరిన దశకం
ఠనిశాచరక్షితీశితఁ
గని హితజనరేఖ లెల్లఁ గణియించి రటన్.

153

ఆశ్వాసాంతము

క.

పురుహూతాదిదిశాధీ
శ్వరసముదయమస్తకాగ్రసంస్థితమకుటీ
నరమణినీరాజనవి
స్ఫురితపదాంభోజయుగళ సురుచిరనఖరా!

154

ముక్తపదగ్రస్తము

చ.

వనథినిశాంత శాంతమునివర్గహృదామరభూజ భూజభం
జనదృఢచక్ర చక్రసఖసారసవిద్విషదక్ష దక్షజా
తనురిపువంద్య వంద్యభినుతప్రతిభాగుణజాల జాలవ
ర్తనకృతలోక లోకహితధర్మవిచార యుదారవైభవా!

155


(?)

కలశనారథికన్యకాకృతి[22]కామ్రసుకృతిఫలోదయా
లలిత[23]యాగహుతారితనుకీలాలపూర్ణసరిచ్చయా
మలహరాదిగిరీశసేవితమంజులాంఘ్రికుశేశయా
జలజచక్రగదాసికార్ముకసంగ్రహాచ్ఛచతుశ్శయా.

156[24]

గద్య
ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై
శ్వర్య ధురీణ శారదాప్రశ్నవివరణ శతఘంటావధాన వినయధునీ
తరంగవిజృంభణాజృంభిత సలలితమృదుమధురవాగ్వైఖరీఝరీధురీణ
స్థాపితాశేష విశేషప్రసిద్ధ సాహిత్య సారస్వతాశుకవితాష్ట
భాషావిశేష సంస్కృతాంధ్ర నిరోష్ఠ్యోష్ఠ్యాది వింశతి
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్ర పవిత్ర
తిరుమలదేశికేంద్ర పౌత్ర తిరువేంగళాచార్య పుత్ర
మఱింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన
దశరథరాజనందనచరిత్రయను నిరోష్ఠ్య
మహాప్రబంధంబునందు తృతీయాశ్వాసము.

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. కరజాస్త్ర (శి)
  2. త్యానందోజ్జలజరాశి నల్లన తేలెన్ (వ్రా)
  3. 7 నెం. పద్యము తరువాత 'శి'లో- "ఈరీతి దాశరథి గని.... శ్రీరంజిల గణన జేసి చిత్రక్రియచేన్-” అనుపద్యము గలదు. ప్రతి శిథిలము. పద్యము పూర్తిగా లేదు.
  4. 8 నెం. వచనము 'శి'లో లేదు.
  5. జాస్థరాగ్రణి (ము)
  6. నాయకి (ము)
  7. జదర (ము)
  8. రార్జ (ము)
  9. గ నృ (ము)
  10. ఇక్కడికి + అర్కికి = ఇక్కడి కార్కికి
  11. సేతు (ము)
  12. కాలక + ఆశ - 'క' స్వార్థము
  13. రంతట (ము)
  14. గాళియై (ము) (హతాంగాళియై!)
  15. శరతి = శరత్కాలార్థము
  16. ఆకళ్లచే
  17. యంతట జగతిగలయ (వ్రా)
  18. ధరణికన్యా (ము)
  19. చెలికించిన (ము)
  20. నలచ (ము)
  21. అన్నచటికి (ము)
  22. కమ్ర (శి)
  23. పరశు (ము)
  24. 156 సంఖ్యగల పద్యము ‘ము’లో ‘మత్తకోకిల' యని గలదు కాని లక్షణము సరిగా లేదు.