Jump to content

దశరథరాజనందనచరిత్ర/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీమతేరామానుజాయనమః

దశరథరాజనందన చరిత్ర

(ప్రథమాశ్వాసము - కృత్యాది)

సీ.

[1][2]సిరివరించినమేలు గిరిధరించినకేలు
             దనరువాఁడు శుభోక్తి [3]నొనరువాఁడు,
చిలువరాయనిపాన్పు నలువపాయనికాన్పు
             [4]గలుఁగువాఁ డసురుల కలుఁగువాఁడు,
పులుఁగు తత్తడిపోక జిలుఁగు పుత్తడికోక
             గట్టువాఁ డమరుల పట్టువాఁడు,
తెలిదిన్నెపైఱచ్చ మెలిగొన్నయెదమచ్చ
             [5]మెఱయువాఁడు కృపాబ్ధి నెఱయువాఁడు,


గీ.

హాటకనిశాటవక్షఃకవాట వాట
[6]పాటనోచ్ఛట శతకోటి పటలచటుల
శితనఖంబులవాఁడు లక్ష్మీనృసింహుఁ
డెలమి మాయిలవేలుపై నిలుచుఁగాక.

1


గీ.

శ్రీసుకర్పకథాముఁడౌ శ్రీనృసింహు
సిరుల వక్షస్స్థలంబున శ్రీయనంగ
వెలయు శ్రీరాజ్యలక్ష్మి సేవించి దినము
మదిని భావించి నుతియింతు మమత నెలమి.

2

చ.

[7]తనయనురాగవృద్ధి విదితంబుగ వెన్నుఁడు చూపుపోల్కిఁ జ
క్కనియురమందు భాసిలెడు కౌస్తుభరత్నము [8]చేతఁ జూడఁగాఁ
జనువుపసిండిబొమ్మక్రియ సంతస మొప్ప వసించునట్టి యా
ననవిలుకాని తల్లియగు [9]నాతుక మాగృహసీమ [10]నుండుతన్.

3


చ.

హరికిఁ బయోధిపుత్రికి నుదంచితతల్పకమై, సహస్రభో
గరుచిరరత్నదీపకళికాప్రకరప్రభవత్ప్రకాశవి
స్ఫురణల లోకనిర్మలత బూనఁగఁ జేయుచు సర్వదాస్యవై
ఖరి రచియించు శేషఫణికాంతుఁడు మాకు శుభోక్తు లీవుతన్.

4


సీ.

[11]ఊతచే నెగయంగ నూర్ధ్వదేశంబుల
             బ్రహ్మాండభాండ కర్పరమునంట,
వాలంబు పురివిప్ప జాల దిక్పాలుర
             పట్టణంబులు పరవంజికప్పఁ
బక్షముల్ విసరెడి పవనవేగంబున
             గిరులు గృధ్రంబులకరణి నాడ,
నుంకించి త్రొక్కంగ నుర్వీతలంబెల్ల
             నహిలోకపర్యంత మడఁగిపోవ,


గీ.

దనరి విశ్వప్రపంచమంతయు దానె
యగు విరాడ్రూపసంపత్తి నచ్యుతునకు
వాహనంబై నిశాటుల వడి జయించు
గరుఁడుని భజింతు క్షేమంబు గ్రందుకొనఁగ.

5


మ.

వనజాతప్రభవాండ దుష్టదనుజవ్రాతంబు శిక్షింప సం
జనితంబైన ప్రతాపరేఖ యనఁగా సౌవర్ణక్షేత్రంబుఁ గై
కొని లక్ష్మీపతిచెంతఁ చేరి భయభక్తు ల్మీర వర్తించు శో
భనసంశీలి, సువర్చలాసుతు మదిన్ భావింతు నశ్రాంతమున్.

6


ఉ.

శ్రీకరరామ భారతవిశేషకథాజలరాశిఁ దేలి య
స్తోకపదార్థరత్నములఁ దోరముగా బుధకోటి కిచ్చి సు

శ్లోకరుచుల్ దిగంతముల లోకములన్ బ్రసరింపఁజేయు వా
ల్మీకి బరాశరాత్మజు నమేయకవీంద్రుల బ్రస్తుతించెదన్.

7


గీ.

రాజపూజితు వేదశాస్త్రప్రవీణు,
సరససాహిత్యలక్షణచక్రవర్తి,
నుభయభాషాకవిత్వధుర్యుని మదగ్ర
జన్ము మఱిఁగంటి యప్పలాచార్యు నెంతు.

8


సీ.

జలజాక్ష పరికరాంశప్రభూతాత్ముల
             బన్నిద్దరాళ్వార్లఁ బ్రణుతి సేసి,
పంచనంబుల శాస్త్రపారీణుల భజించి
             యామునాచార్యుల నభినుతించి,
రామమిశ్రుల నతిప్రేమచే గీర్తించి
             ఘనుల శ్రీమన్నాథమునుల బొగడి,
పెరియజీయరు శిష్యసురకల్పకము నెన్ని
             సూరిదూప్పిల్ పిళ్లగారి దలఁచి


గీ.

వాసి డెబ్బదినాల్గుసింహాసనముల
గురువుల సమగ్రవైభవాకరులఁ గొలిచి
[12]సిరుల మాతలిదండ్రుల వరదమాంబ
వేంగళార్యుల హృద్వీథి వేడ్క నిలిపి.

9


ఉ.

ఆరయ శబ్దహీనమగునట్టి పదస్థితి గల్గి పై నలం
కారము [13]లెవ్వి చేకుఱక క్రమ్మినశయ్యల సంధి [14]దేలుచున్,
గౌరవవృత్తి నర్ధముల గానని [15]యాకవిచోరకోటి ని
స్సారము సేయఁగావలె వెసన్ ద్విజరాజకళాసమృద్ధిచేన్.

10


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును, బూర్వాచార్యసంకీర్తనంబును, గుకవి
దూషణంబును గావించి మదీయవంశావతారం బభివర్ణించెద -

కవి వంశావతారవర్ణనము

సీ.

తనతపస్సామర్థ్యమున జరఠత్వంబు
             విడి వయశ్శాలియై విస్తరిల్లె
ధనవంశజు లనేకధనపుత్రరూపవి
             ద్యాశీలురై మీర నతిశయిల్లెఁ
దనధర్మపత్ని యుత్తమసాధువర్తన
             కనసూయ కెనయన వినుతి గాంచెఁ
దనసత్యనిష్ఠ మాధవశంకరసరోరు
             హాసనుల్ తలలూఁచ నత్తమిల్లెఁ
దనదు సాహాయ్యమునకు గౌతమవశిష్ఠ
కౌశికాత్రిభరర్వాజకణ్వజామ
[16]దగ్న్యపాత్రముఖార్యులు దలఁప నలరె
దానసౌశీల్యధాని మౌద్గల్యమౌని.

12


క.

ధరనిట్టి మునివరాన్వయ
శరధికి గౌస్తుభముపోలె సద్గుణకార్యా
భరణస్ఫురణంబులతో
బరఁగిన యాసూరి సాధుభట్టరుఁ డలరెన్.

13


తే.

అనఘుఁ డాసాధుభట్టారకాహ్వయుండుఁ
గూరనాయకదేశికకుంజరంబు,
ముదిలియాండానుఁ, డీఘనుల్ ముగురుఁ గొల్వ
నవని విలసిల్లె లక్ష్మణయతివరుండు.

14


సీ.

శ్రీలొప్ప బండ్రెండువేలత్రిదండిస
             న్న్యాసులు సప్తసహస్రసంఖ్యు
లేకాంతి జనపర మైకాంతివరులు డె
             బ్బదినాల్గుపేరులఁ బరగినట్టి

గురుచంద్రు లొకలక్ష తిరునామధారులు
             [17]నలమ దిగ్విజయార్థమై గమించి
యనుకూలుర గ్రహించి యన్యుల బోధించి
             చెనఁటుల శిక్షించి శ్రీమతంబుఁ
బూని శేషాంశసంభవులైన లక్ష్మ
ణార్యు లష్టదిశల్ గలయంగ నిలిపి
తిరిగి శ్రీరంగధాముని ధృతిభజించి
చేరవచ్చిన, నాస్వామిఁ జెంగలించి.

15


క.

కంటిన్, లక్ష్మణమునివరుఁ
గంటిన్ గూరేశ దేశికస్వామి మరిం
గంటి నదెవ్వరన, మరిం
గంటి [18]మహాన్వయము దనరె గణ్యం బగుచున్.

16


గీ.

సలలితాసూరికుడిచే బ్రశస్తిఁ గన్న
సాధుభట్టారకుఁడు రంగశాయి వలన
నిల మరింగంటివా రన్నయింటిపేరు
గురుశిఖామణు లెన్నఁగా బరిఢవిల్లె.

17


సీ.

ఆసాధుభట్టార కాత్మజుఁడై దయా
             కలితశీలుఁడు పిళ్లగారు పుట్టె,
నతనికిఁ బెరియ పిళ్లాఖ్యుఁ డాఘనునకు
             శ్రీరంగనాథదేశికుఁడు వొడమె,
నతనికి దీర్థచారయ్య యాసూరికిఁ
             జీయగారలు జనించిరి ప్రసిద్ధి
నతనికి యామునుఁ డాభవ్యమూర్తికి
             మాధవగురుఁడు సమ్మతిగఁ గల్గె
నతనికి ఫలించె సకలరాజాధిరాజ
రాజమకుటాగ్రఘటితచిరత్నరత్న

బహుళనీరాజనాతివిభ్రాజితాంఘ్ర
సరసిజుఁడు చెన్నయాచార్య చక్రవర్తి.

18


క.

తనజననీగర్భంబున
జనియించెడివేళ నొకభుజంగమకవయై
కనుపట్టి యనంతాళ్వా
రను పేరన్ బరఁగి చెన్నయార్యుం డలరెన్.

19


చ.

చెలిమి గజేంద్రవల్లభునిచేత సపర్యలుఁ గొంటఁ, గాన బె
బ్బులిరదనంబు లూడ్చి వడిఁ బో నిడుటల్, తళిహప్రసాదమున్
పెలుచగు బ్రహ్మదైత్యునకుఁ బెట్టుటలున్, బెనుబాము ముక్తి కిం
పలరఁగఁ బంపుటల్ గలమహాత్ముఁడు చెన్నగురుండు భాసిలెన్.

20


ఉ.

చెన్నుగ బ్రహ్మరాజపురి చెన్నుఁడు తా నిలవేల్పు గాఁగ నా
చెన్నుని [19]పేరుబూని సిరి [20]జెందుచు దేవరకొండసీమలో
సన్నుత పణ్కరాజు పలిశైలమునన్ మరిఁగంటి చెన్నుఁడై
[21]యెన్నిక మించె భూజపము లింటను దొడ్డను మందపేరిడన్.

21


సీ.

వేదశాస్త్రపురాణవిద్యల [22]నలరారు
             చక్రవర్తుల [23]గెల్చి విక్రమించె
నవని బందొమ్మండ్రయన్నలతోఁ బుట్టి
             హరులీల పాలాక్షుఁ డగుచు నలరె
శ్రీమతంబుఁ బ్రసిద్ధి జేసెడి మణవాళ
             యతికి [24]సమానుఁడై యతిశయిల్లె
సూరి నలంతిగళ్ నారాయణస్వామి
             భాగినేయత గీర్తి బరిఢవిల్లె
బాచిపైకంబు ముడుచు లుబ్ధకులకెల్ల
నింట [25]బోజుగ విలసిల్లె, నిట్టిచెన్న

దేశికునకు దనూజులై తిరుమలయ్య
భట్టరుఁడు సింగరప్పఁడు ప్రబలి రందు.

22


చ.

విరివిగ భట్టరార్యునకు వేంగళనాథుఁడు పుట్టె వానికిన్
బరమతభేది తిర్మలయ భట్టరుఁడున్ బ్రభవించె నందులన్
దిరుమలసూరికిన్ గలిఁగెఁ దేజున మించిన వేంగళప్పఁడున్
సరసగురుం డనంతుఁడు ఘనప్రతిభాడ్యుఁడు సింగరప్పఁడున్.

23


వ.

అందగ్రజన్ముండు.

24


చ.

కలిమికి రాజరాజు, బలుకాంతులఁ జుక్కలరాజు, రూపురే
ఖల వలరాజు, వైభవవికాసమునన్ సురరాజు, సత్యపుం
బలుకుల ధర్మరాజు, ఘనభాగ్యమునన్ వసురాజు నా దగెన్
బలియుఁడు వెంగళార్యగురు పట్టపురాజు జగత్ప్రసిద్ధుఁడై.

25


క.

సరసుఁడు వేంగళగురుమణి
వరదాంబన్ బెండ్లియాఁడె వనజాక్షుం డా
శరనిధికన్యారత్నము
వరియించినపోల్కి నధికవైభవ మెసఁగన్.

26


వ.

అట్టివరదాంబ యెట్టిదంటేని -

27


చ.

విడిముడి గల్గి బంధువులు వేడ్క గృహంబున నిండియుండ నె
ప్పుడు ధనధాన్యముల్, మణులు, బుట్టములున్, బశువుల్, తురంగముల్
తొడవులుఁ, జేత లక్ష్మి తులఁదూగుచుఁ బట్టిన దెల్లఁ బైడియై
పుడమి బ్రసిద్ధి కెక్కె హరిపూర్ణకృపన్ వరదాంబ యెంతయున్.

28


తే.

అట్టి మరిఁగంటి తిరువేంగళార్యువలనఁ
వరదయాగుణ నికురుంబవరదమాంబ
[26]శీలసౌందర్యవిద్యావిశేషకళల
బలియులైనట్టి యష్టపుత్త్రులను గనియె.

29

సీ.

ముగురు రాజులచేత మ్రొక్కులు గొన్నట్టి
             భగవత్సమానుఁ డప్పలగురుండు
వేదవేదాంగాదివివిధార్థసంపత్తి
             నతిశయిల్లిన వేంకటార్యమౌళి
కలితసౌందర్యరేఖావిలాసంబులఁ
             జెంగలించెడి శ్రీనృసింహఘనుఁడు
కుపితమాయావాది గురుశాస్త్రహరణపా
             రగుఁడైన కోనేటిరాయశౌరి
సరసశతపద్యలేఖనీవిరచనోక్తి
గలజగన్నాథసూరి యగ్రజులు గాఁగ
నలర రంగప్ప, నరసింగరప్ప తమ్ము
[27]లై వెలయువాఁడ భువి సింగరాహ్వయుండ.

30


మ.

సముదీర్ణస్థితి వేంకటేశ్వరుఁడు నాస్వప్నంబునన్ షోడశా
బ్దములన్ [28]మాణవకాకృతి న్నిలిచి ‘వత్సా యాంధ్రభాషానిరో
ష్ఠ్యమహాకావ్య మొనర్పుమీ' యనిన నత్యారూఢి మేల్కాంచి మో
దమునన్ జెప్పితి భూమిపైఁ గవిజనాధ్యక్షు ల్ప్రశంసింపఁగన్.

31


మ.

మును రామాయణము న్నిరోష్ఠ్యముగ నింపుల్ మీద శాకల్లె మ
ల్లన, తా సంస్కృతభాషఁ జేసెనన నాలాగున్ జెవుల్ నిండఁగా
వినుటేగాని ధరిత్రిలో నిజముగా వీక్షింపలే దట్టి దేఁ
దెనుఁగున్ జేసెద నెల్లెడన్ గవులకున్ దృష్టాంతమై యేర్పడన్.

32


మ.

వరవందారుజనావళీహృదయసద్వాంఛార్థకృద్వేంకటే
శ్వరసంపూర్ణ[29]కృపాసుధామిళితవీక్షామాధురీమార్గవి
స్ఫురితైకైకదినప్రబంధరచనాస్ఫూర్జద్వచశ్రీకుఁడన్
నరనాగాశ్వనృపాలసభ్యగణితుండన్ సింగరాచార్యుఁడన్.

33

షష్ఠ్యంతములు

క.

ఏతాదృశగుణశాలికి,
ధాతృముఖాదిత్యగణితదానాతిశయ
ఖ్యాతికళాభూతికళా
నీతికళాన్వితునకున్ మునిప్రీతునకున్.

34


క.

సురసేవితచరణావిత
హరజీవితునకు నిలింపయతివినుతునకున్
సురరక్షా౽సురశిక్షా
వరదీక్షాదక్షునకుఁ, గృపావీక్షునకున్.

35


క.

బలతారాచలతారా
కులమారాహితవళక్షగురుయశున, కిలా
బలధీరాచలవారా
నలఘోరాకారునకు గుణస్ఫారునకున్.

36


క.

వననిధికన్యాకుచనత
ఘననఖరత్రుటితదితిజకఠినోదరసం
జనితాసృగ్జనదూరిత
కనదాగ్రహదహనునకు జగద్వహనునకున్.

37


క.

హీరఘటీ తారపుటీ
హీరపటీరారి మకుటహరిసామజ[30] కం
జారి పుటీభూరినటీ
హారిసుహృద్భక్తునకు దయాసక్తునకున్.

38


క.

చక్రాహత వక్రాహిత
నక్రాధిపమస్తకునకు నగకన్యారా
ట్చక్రద్రుహిణక్రౌంచజి
దక్రూరప్రణితఘృణికి నరిగజసృణికిన్.

39

క.

కరలసదరికిన్ బదభవ
ఝరికిన్ ధృతగిరికి నవితజలగతకరికిన్
జిరతరకర్పరపురనర
హరికిన్ నుతహరికి రుచిరహరికిన్ హరికిన్.

40


వ.

సమర్పణంబుగా నాయొనర్పంబూనిన దశరథరాజనందనచరిత్రయను
నిరోష్ఠ్యప్రబంధంబునకుం గథాక్రమం బెట్టిదనిన -

41

కథాప్రారంభము

క.

శ్రీకి గృహస్థలియై ధా
త్రీకన్యాచరణజలజదీధితిరత్నా
నీకాంచితకటకాకృతి
సాకేతాఖ్యాకనగరి చాలరహిల్లున్.

42


సీ.

జలధరాధికసితచ్ఛాయలఁ దనరిన
             గంధగంధిలగంధిఘటలచేత,
ననిలచిత్తాతీతఘనరయక్రియలచేఁ
             జాలరంజిలిన తేజీలచేత,
రణధాత్రినంగజారాతి నాధిక్యాన
             గేలిఁ జేసెడియక్కటీలచేతఁ
గనకాద్రిశృంగరేఖల నీసడించిన
             దండినిండిన యరదాలచేతఁ
గణన కెక్కి ధరాఖగక్షత్రియార్య
చరణజాఖిలధనధాన్యసాలఖేయ
చందనాగతటాకరాజగృహకంజ
రాగసంస్థాని సాకేతరాజధాని.

43


క.

శతధృతినగరికి, నచలా
హితనగరికి ధనదనగరి కెన యనఁగా నా
యతధనధాన్యశ్రీసం
తతిచే సాకేతనగరి ధర రంజిల్లున్.

44

క.

ఆరాజధాని కేలిక
యై రాజిలె దశరథాఖ్య నలరిన ధరణీ
దారకళానిధి హరిచర
ణారాధన జనిత శస్తతా౽నుచరగతిన్.

45


ఉ.

నించె ధరిత్రినిండ నతినిష్ఠ ఘటిల్లఁగ గీర్తిచంద్రికల్
గాంచె దిగంతరాజతతి కాన్క లిడన్ సకలార్థసిద్ధి ని
ర్జించె రణాంగనస్థలి నశేషబలాహితనేతలన్ దితి
క్షాంచితచాంతిసాహసదయాజయసత్యకళాతిశాయియై.

46


క.

అతఁ డచలానాయకసం
హతిచే నాస్థానిఁ గాంచ నాసనధర దా
నతిశయిలెఁ దారకాంత
స్స్థితరాకాసితకరాకృతిన్ గళ లెసఁగన్.

47


వ.

ఇ ట్లాదిగంతరాజసంతతి యాచ్ఛాదించ సింహాసనస్థాయియై
రంజిల్లెనంత.

48


మ.

సకలశ్రీనిధియైన యా దశరథజ్యాకర్త తానర్థి ని
ష్టకథాసంగతి ధాతృనందనజటిన్ షట్ఛాస్త్రసంశీలి న
త్యకలంకాహిశయాన కంజచరణధ్యానైకహృచ్ఛాలి దే
శికహోళిన్ గని స్రష్టలెల్ల గణనల్ సేయంగ నాడెం దగన్.

49


గీ.

తరణి సంతతి రాజసంతతికి నెల్ల
జింతఁ దొలఁగించ నిష్టార్థసిద్ధిఁ జేయ
ధాతగతి తల్లితండ్రి నాత్రాతరీతి
నింతగా గడతేర్చినా రింక నెట్లు.

50


ఉ.

కేల ధరించితిన్ ధరణిఁ గిట్యగశేషగజాళి కాశగాఁ
గేలఁ జయించితిన్ దిశలఁ గీర్తన సేయ నరాధినేతలన్
జాల గ్రహించితిన్ సకలశాస్త్రకథల్ ధృతిపై ననాయెదన్
జాల దనర్చె దీని నడఁచంగల శక్తి ఘటిల్లఁజేయరే.

51

క.

సంతతి లేదని చాలా
చింతించెడి దానికతన క్షితి సకలశ్రీ
లెంతొ తృణాకృతి జేసితి
నంతిం తనరానియార్తి నగలితి ననఘా.

52


చ.

కరిఘట లేల, జిత్రగణికాచ్ఛట లేల, హిరణ్యశాటికా
హరిధనధాన్యరత్నఘటికాచ్ఛదలంక్రియ లేల, నల్దిశల్
స్థిరగతి నేలఁగాఁదగిన తే జది యేల, ననేకచర్యలున్
సిరిగలయట్టి సంతతిని జెందిన యాయెడ లెస్స లన్నియున్.

53


క.

అన నాలకించి యాయజ
తనయాగ్రణి కాంక్ష దెలిసి దరహాసదృఢా
ననుఁడై [31]తా నెరతేనెల్
చినుకఁగఁ జటినేత యాడె సిరి సంధిల్లన్.

54


సీ.

ఆలించితి నిశాచరికథాశ్రేణిఁ
             గర్ణరంధ్రానందకారి గాఁగ
దేలించితి ధరాదితేయాగ్రణిచ్ఛట
             లిష్టార్థసంసిద్ధి హెచ్చరించ
నేలించితి ఖచరస్త్రీల శాతాసిచే
             రణధాత్రి నరిరాజరాజిచేత
గాలించితి దిగంతఖలజనసంతతి
             దిశియించనీక క్రిందికి దిగంగ
శరశరచ్ఛరదానంత చంద్ర చంద్ర
హార నీహారతారకా తారహార
సితయశ[32]స్థగితా చక్రశిఖరిదేశ!
తతదయాసాంద్ర! దశరథక్షితితలేంద్ర

55


[ఉ.

[33]ఐనను సూనహీనుఁడగునట్టిడు ధారుణిలోన "సూనుఁడా
సూనుఁడ” యంచుఁ జింతఁ గనుచున్ జరియించును నించుకేనియున్

నూనఁడు తుష్టి నెంతయును నుండినశ్రీలను జూచికొంచు దా
గాన సుతుండె శ్రీల కిలఁ గర్తయు సంశ్రయుఁడైన యాతఁడున్.

56


శా.

కానన్ నేనిడు నాజ్ఞ నింకను దలన్ గైకొంచు సంతుష్టి నో
జ్యానాథా! తగు [34]నిష్టిఁ జేయ నెదలో సంధించి సూతీచ్ఛ, నా
గా నాఱేఁ డది యాలకించి యటులం గానిండు ధన్యుండ
నైనాఁడన్, యతిచంద్ర! యంచు ననఁగా నారాజుతో సూతుఁడున్.

57


సీ.

అను నిట్లు నరనాథ! యంగదేశుండు
             తనధారుణిని జలధరునిరాక
లేక సస్యాళులుఁ గాకుండ జనులకు
             దారిద్ర్యదశయును దనరజూచి
ఛాతీసురేంద్రులఁ దా గాంచి యయ్యలా
             రా! యిట్టులయ్యెనే నరయ నెద్ది
సేయంగఁ జెల్లునో జెచ్చెర నానతిం
             డని యడుగంగ నాయార్యులెల్లఁ
దగిన సరణిని నెదలఁ జింత యొనరించి
యనిరి "కానను ఋష్యశృంగాఖ్యయోగి
నిష్టనూనెను నొకకొండి నెగడు నుదుట
నతని, కాతని గొనిదేర నగు నిచటకు."

58


మ.

అతనిన్ దోడ్కొని తెచ్చి యిచ్చటకు రాజా! నీసుతన్ శాంతఁ ద
త్సతిగాఁ జేసిన లోలుఁడై చెలఁగు నాతం డాతనిం దేరగా
క్షితిలో నేరికిఁ జేతఁగాదు గణికాస్త్రీల్ దేగలారన్న నా
నతి గైకొంచు నరేంద్రుఁ డాసతులఁ దా నంచెన్ జటిన్ దేరగాన్.

59


ఆయోగీంద్రుని దోడితెచ్చి నరనాథాగ్రేసరుం డంత నా
శ్రీయుక్తుం గడునర్చఁ జేసి, తనయన్ జేకూర్చి సంతుష్టిఁ ద
జ్జాయంగా నిజధాత్రి నార్తి క్షతిఁ జెందన్ రాజిలెన్ గాన ధా
త్రీయోషేశ! యతండు రాఁగఁ దగునర్థిం జేయు నీయిష్టికిన్.

60

మ.

అనఁగా నట్ల యటంచు నంగధరకీజ్యానాయకుం డేఁగి త
జ్జననాథున్ గని యాజ్ఞ గొంచుఁ జటిఁ తజ్జాయన్ నిజక్షోణికిన్
గొనియేతెంచి నిజార్యునాజ్ఞను దలన్ గొంచున్ ధరానిర్జరుల్
చనుదెంచంగను జేసె నిష్టిని సురల్ సంతుష్టితో నుండఁగన్.

61


వ.

ఇట్లు సేయుచుండ.

62


మ.

సరసీజానను చెంత కేఁగి సకలాశానాయకాదుల్ సురల్
ధర లంకానగరీశుఁడైన దనుకోద్దండుండుఁ దాఁ గ్రూరుఁడై
ధరియించంగను నేరనట్టి ఘనచింతల్ గూర్చుచున్నాఁడు నీ
కరుణం జేసి యటంచు దుఃఖితులుగాఁ గాఁ జూచి యాధాతయున్.

63


చ.

సురలను దోడుకొంచు నరిసూదనుఁడై దనరారు నిందిరా
ధరుఁడుఁ జెలంగు నీరనిధితట్టున కేఁగి నుతించుచుండఁగా
నెఱిఁగి సరోజలోచనుఁడు నీసుర లుండినచెంత కేఁగుదెం
చి రహిని నిల్చినన్ నతిని జేసిరి నిర్జరులెల్ల నంతటన్.

64


సీ.

క్షీరనీరధియందు శేషాహిరాజు నం
             దుననుండి నిదురించు ఘనగుణాఢ్య
నిత్యసూరులు నుతి న్సేయుచుండఁగ 'హాయి
             హాయం'చు నిదురించు ననఘచరిత
యాదితేయులకెల్ల నరుదెంచునార్తుల
             నడఁచుచు నిదురించు నఖిలనాథ
జటినాయకుల చిత్తజలజాల నలరుచు
             నందందు నిదురించు నార్యశరణ
సరసిజాసనసందత్తశక్తి, కఠిన
దశగళాసురరాద్రచితార్తి దుఃఖి
తాఖిలాదితేయులు నిన్ను నర్థితోడఁ
గొలుఁచుచున్నారు రక్షించు కలితదయను.

65


మ.

సరసీజాయతనేత్ర! యా దశగళాశానాయకారాతి, ని
ష్ఠ రజోనేతను నర్చఁజేయ నరఁడున్ సంతుష్టి నేతెంచి యా

దురితాచారుఁడు కోరు కోరికల నెంతో శీఘ్రతం దీర్చిఁ ద
త్కరుణ న్నిర్జరు లార్తిఁ చెందునటులన్ దాఁ జేసెనో [35]యీశితా.

66


వ.

కాన.

67


చ.

ధరణి గుణాఢ్యుడౌ దశరథక్షితినాధునకున్ దనూజుఁడై
హరిహయకంటకుండగు దశాస్యునిఁ ద్రుంచకయున్న నింక నే
కరణిని నుందు రీసురులు గ్రక్కునఁ జచ్చెదరంచు నన్న, నా
సరసిజలోచనుండు సురసంతతిఁ గన్గొని యిట్లనెన్ దయన్.

68


శా.

ఆశానాయకులార చింతఁగననేలా యిట్టు లాలించుఁడీ
నే శీఘ్రాన ధరిత్రిలోఁ గలిఁగి యానీచున్ దళాస్యాఖ్య దై
త్యేశున్ సంగరధాత్రిఁ గూల్చెదను, నాకేశాదులన్ గాఁచెదన్
ఆశల్ దీర్చెద యోగినేతలకటం చంతర్హితుండై చనెన్.

69


మ.

చనఁగా నంతట నిర్జరుల్ కడుఁగడున్ సంతుష్టులం జెందుచున్
జనుచుండంగ, సరోరుహోదరుఁడు నాశానాథులారా! ధరి
త్రిని శ్రీకాంతుఁడు దైత్యుఁ గూల్చ దృఢశక్తిన్ సేనలై యీరలుం
డనగు న్నాగను శైలచారు లయిరా నాకాధినాథుల్ దగన్.

70


క.

ఈలీల నిర్జరుల యం
శాలన్ ధరలో జనించి చక్కఁదనరు నా
శైలచరతనూజులు శౌ
ర్యాలంకృతు లగుచు నలరి రతిసంతుష్టిన్.

71


ఆ.

అందు నింద్రసుతుఁడు నర్కతనూజుండు
ననిలజుండు, ననిలతనయుఁ డధికు
లైరి, సరసిజోదరాంశాన జనియించె
తొల్లి ఋక్షరాజతులయశుండు.

72


ఆ.

ఇట్టి కీశులెల్ల రిందిరానాథుని
యధికకరుణచేత నలరి రంత

శుద్ధతిథులయందు సూర్యసఖుండు తాఁ
దరుఁగకున్నయట్టి సరణి దోఁచ.

73


వ.

అంత నిక్కడ దశరథక్షితినాథుండు హయేష్టినించి ఋశ్యశృంగాజ్ఞచే
సుతేచ్ఛేష్టి జేయుచుండ నారాయణుం డయ్యగ్న్యంతరాననుండి.

74


క.

కేలన్ క్షీరాన్నఘన
స్థాలిన్ ధరియించి తెచ్చి దరినిల్చిన ధా
త్రీలలన హోళి కిచ్చిన
నాళీకేక్షణలఁ జేరి నయగతి దేరెన్.

75


ఆ.

అగ్రసతికిఁ గైక కది సరిగా నిచ్చి
దాని నింతనింతఁ దనరఁ దిగిచి
కడనెలంతకేల నిడ నారగించిన
జరఠచిహ్న లధికసరణి గనిరి.

76


వ.

అంత నానాఁట నెలలునిండిన.

77


క.

శ్రీ నెరయ గ్రహాళి జయ
స్థానస్థితి నలర ఖచరసంతతి చెలఁగం
గా నెలఁతల్ గాంచిరి లే
రా నెలఁతలతెగలు తెగల రహి నిండంగన్.

78


వ.

ఇట్లు గేహినీత్రయి రాచిన్నెలంగన్న వాజినరనేత యగ్రజశ్రేణి హిరణ్య
కన్యాదానక్రియల నలరించి దశదినసాన్నిధ్యసరణి నంత.

79


ఉ.

ధీనిధియైన యాజిజగతీతలరక్షిత యగ్రదారకా
శా నరనాథకీర్తనల సందడి నిండఁగఁ గంధికన్యకా
జాని కళల్ - సితజ్ఞశశిచారణ దేశికరాజి - యంచిత
స్థానగతిన్ దిశించ ఘనతారజనించినయట్టి దానిచేన్.

80


క.

ఆరాచిన్నం జటి తా
నారసి దశరథనృనేత యానతిచే నిం

డారంజిల్కలఁ జీఱెడి
చేరిక రెండక్కరాలజీరఁగ నయ్యెన్.

81


గీ.

చిన్నకన్నియలిద్దఱఁ గన్నయట్టి
నందనత్రయి కాశతానందజాత
యతి, నరేంద్రాజ్ఞ దశరథజ్యాధినేత
యందఱల్ సంతనిల్ల నర్హాఖ్య లిడియె.

82


వ.

అంత.

83


క.

[36]కందింత లేని లేనెల
చందానన్, నాఁట నాఁట జక్కదనాలన్
జెంది కళాయితచర్యల
సందడి రా చిన్న లెదుఁగసాగిరి ధరణిన్.

84


శా.

ఆరాలేనెల లంతకంత రతిరాజాకారలేఖాకళా
సారాచారశరాసనాస్త్రకలనాసారస్యలాక్షణ్యశృం
గారజ్ఞానదయాంచితస్థితి తితిక్షా సత్యధైర్యక్రియా
శ్రీ రంజిల్లఁ జరించసాగిరి జయశ్రీ హెచ్చ నానాఁటికిన్.

85


వ.

ఇట్లు దేరినట్టియెడ.

86


సీ.

రంజితగాంగేయకంజ[37]కింజల్కాళి
             దండిగా జడల నీరెండ గాయ
నన్యచింతాహరణాదినారాయణ
             కీర్తన లంతంత నర్తిలింగ
సకలతరంగిణీసలిల గ్రహయౌ క
             రాంచితకరశాఖయర్ధిఁ దనర
నంగయష్టి నలందినట్టి నీఱెల్లడ
             నకలంకచంద్రచంద్రికల నీన
అష్టదిగధీశ కిన్నర యక్షసిద్ధ
దితిజఖచరస్థిరస్థలాయతకిరీట

కాంతి [38]సంరాజితాంఘ్రియై గాధినంద
నర్షి యేతెంచె సంతతానందసక్తి.

87


క.

తనకడ కేతెంచిన జటిఁ
గని దశరథ ధరణినేత కాళ్ల కెఱఁగి చ
క్కని కాంచనాసనస్థలి
దనర నధిష్టించఁజేసి దాక్షిణ్యగతిన్.

88


ఉ.

శ్రీకర సత్యశీల యతిశేఖర సారదయానిధాన నీ
రాకడచేత నెల్లనఘరాశి యడంగె ననేకసత్క్రియా
నీకరతిన్ దనర్చితి ననిందితకీర్తి ఘటిల్లె సంతత
శ్రీకిల డెంకి నైతి జయసిద్ధి గ్రహించితినయ్య చక్కఁగాన్.

89


క.

హరిగంధగజస్యందన
హరిహయధనధాన్యరత్నహాటకశాటీ
హరిచందనాదికాంక్షల్
సిరి నిచ్చెద నడుగరాదె శ్రేయస్సిద్ధిన్.

90


ఆ.

అనిన సంతసిల్లి యాజటిలాగ్రణి
దశరథక్షితీశ తరణిఁ గాంచి
సరసదంతకాంతిదరహాసచంద్రికల్
జెల్ల గణన జేసి చెల్లనాడె.

91


క.

లేదా ధరిత్రిరానెల
లీరా! సకలార్థకాంత లెన్నకఁ జిహ్నల్
దేరా! యన్నిఁట జాణల్
గారా! నీసరణి నడకఁ గనరై రనఘా.

92


చ.

సలలితకీర్తి నిండ నినసంతతి గల్గిన రాజరాజి తా
నలయిక చేతనైన గడ హాస్యరసస్థితినైన నిద్రలన్
గలఁగనియైన నాడినది కల్లన నేరనీయట్టి సత్యని
ష్ఠలఁ దనరాఁరెగాదె త్రిజగజ్జనకీర్తన లర్థి హెచ్చఁగాన్.

93

వ.

అని గణించి.

94


క.

అనఘా! తాటక యనఁగా
ఘనరజనీచరలతాంగి కల, దద్దానిన్
గని దిగధినేతలైనను
జనఁగా లేరచటికైన జడయికచేతన్.

95


క.

చెన్నటి నడఁకలఁ దాటక
గన్నట్టి నిశాచరాధికర్త లు గలరే
నెన్నిక చేసిన యిష్టిన్
సన్నక సన్నజని చేరసాగిరి యల్కన్.

96


వ.

అది [39]గాన నీతనయాగ్రగణిని నతనిదాయిని నాకిచ్చిన దాటకేయ
నిశాటకర్తల జయించజేసి యాగదీక్షఁ గడఁదేరించెద నాచెంత ననంత
కల్యాణసిద్ధి కాఁగలదనిన.

97


క.

తనహృస్థలి యదురఁగ దృ
గ్జనితసలిలధార లెదిగి జారఁగ నజనం
దనరాజ హేళి యాజటిఁ
గని దైన్యరసాతిశయత గ్రాలఁగనాడెన్.

98


ఉ.

కానక కన్న చిన్న, లదిగాక దృఢక్రియఁ దండ్రి రాక యే
కానల కేఁగ నేరిచిరె, కానల కేఁగిన దండి నిల్చి యా
శానరనాథచిత్త శితశల్య నిశాచర నేతలన్ రణ
స్థాని [40]నెదిర్చగాఁగలఁరె శంకిలకే తెగియాడ నేలయా.

99


సీ.

రణధాత్రి నంగజారాతి యేతెంచిన
             [41]గేలి జేసెడి యక్కటిలచేత
నాకాశకషణ దీర్ఘాకార చర్యల
             గట్ల గేరెడి కరిఘటలచేత
త్రిదశ ధరాధరశృంగతేజి క్రియల్
             తేగటించెడి దండి తేర్లచేత

ధృతి సదాగతినైన ధిక్కరించెడి శీఘ్ర
             తరశక్తి గన్న తత్తళ్లచేత
శరశరాసననిస్త్రింశశక్తిఖేట
కాదిఘనసాధనస్థితి యతిశయిలఁగ
నేనె చనియెద నేజాడనైనగాని
యకట! నాచిన్నరాజిత ననచలేను.

100


క.

ఏ నీ కెదిర్చి యాడం
గా నెంతటి దండిచక్రిగానే గిరిజా
జానింగానే స్రష్టం
గానే నన్గానికరాన గడతేర్చఁగదే.

101


క.

అని చింతించఁగ దశరథ
జననాయకహేళిఁ గాంచి జటిలాగ్రణి తా
ఘనజలధరగర్జాత
ర్జనకృన్నయసరణి నాడె సరసస్థితిచేన్.

102


చ.

ఇలఖలరాజ శిక్ష రచియించఁగ నాశ్రితరాజసంతతిన్
గలితదయారసక్రియల గాఁచిన రాఁ గడతేర్చ నన్నిఁటన్
గలిగిన శేషశాయి క్షితికాంత నరాకృతి గాఁగ గట్టెదన్
దలఁచఁగ నేటి కీస్థితి యథాస్థితిగా నరయంగరాదటే.

103


క.

తెలియక నీరాచనెలల్
కలన నరిచ్ఛటలనెల్లఁ గండ్రించిన యా
తల నధికతరజయశ్రీ
లలరఁగఁ దిరిగిచనఁగలరయా! యజతనయా.

104


ఆ.

అనిన నెట్టకేల కంగీకరించి తా
దాశరథిని నతని దాయి నీయఁ
కలిసి రాజధాని గాధేయఋషియును
గదలె నాఁటనాఁట గానఁ జేరి.

105

చ.

హరికిరి గంధనాగశలలాండ సృగాల హరీశఖడ్గ కా
సర హరిణీరటద్గహన సంహతిఁ గాంచి యగాధనీర ని
స్తరతటి నీతతిం గడంచి చండధరాధరరాజి దాటి దా
శరథి చనంగసాగె జటిచంద్ర సహాయతచేత నయ్యెడన్.

106


క.

ఈరీతి గాధిజర్షిని
నారా [42]నెలసర్ల గాంచి యాగ్రహశిఖి కీ
లారటితగాత్రి తాటక
దారుణ లేచి హితదైత్యతతి గలసి ధృతిన్.

107


చ.

ఘనచరణాగ్రఘట్టనల గ్రచ్చఱకంధి కలంగ నీరద
స్తనితహృదట్టహాసనినదక్రియ నష్టదిశల్ చలించ దృ
గ్జనితదృఢాగ్రహానలశిఖాకణసంహతి రాల నానరా
శనసతి తా నెదిర్చి ధృతి సంధిల ఖేటకఖడ్గహస్తయై.

108


ఆ.

అంత గాధితనయు డతిరయక్రియ దేర
దాశరథిని నతనిదాయి నరసి
దండ జేరనేఁగి తాటక యని సేయ
గదినె నాలసించఁగా నదేల?

109


క.

స్త్రీయని దాని తిరస్కృతి
జేయంగాఁ దగదు నడఁగఁ జేసిన ధరణీ
నాయక! సకలజనాళికి
రాయిడి గనకే హరించరాదే యనినన్.

110


చ.

హరిహయహస్తకీలితదృఢాశనిదారితశైలశృంగసం
సరణి, తదాజి దాశరథి చండశరాసనశస్త్రధారచే
ధర చలియించ నేసెఁ దెగఁ దాటక జాలకృతైక నాటకన్
హరిదిన దత్తహాటక నిరంతరఖేటక నిస్సహాటకన్.

111


వ.

ఇట్లు తాటక త్రెళ్లిన.

112

క.

రణసన్నద్ధక్రియచే
గణియించక గదియఁ దాటకాతనయ ఖలా
గ్రణి యనిలసాయకాహతిఁ
దృణలీలం గడలినేసెఁ దేలి చనంగన్.

113


గీ.

అతనిచాయి యెదిర్చిన నస్త్రకలన
జెక్కలై నేల ద్రెళ్లంగఁ జేయఁగాంచి
కాకఁ గదిసిన రాక్షసఘటలనెల్ల
నర్కనందననగరికి ననిచె నంత.

114


క.

ఇక్కరణి కార్యసిద్ధిగ
నక్కఱ గాధేయజటి నయక్రియ నతనిన్
జక్కఁగఁ గౌఁగిటఁ జేర్చెన్
జక్కఁగఁ ద్రిదశగణగణన సంధిల్లంగన్.

115


వ.

ఇట్లరణ్యాని నిష్కంటకాకృతిగాఁ జేసి తన యజ్ఞదీక్షఁ గడతేర్చినదానికి
గాధిజర్షి సంతసిల్లి దాశరథి కైంద్రాగ్నేయాదిసకలశస్త్రాస్త్ర
జ్ఞానసిద్ధిగా నానతిచ్చి తగిననా ళ్లక్కడ నధిష్టించి రయ్యెడ.

116

ఆశ్వాసాంతము

క.

అతులప్రతాపతపన
ప్రతిభా! ధావద్విపక్షబల! కౌశికసం
శ్రితవలయ! వసుమతీధర!
సతతకృపాభ్యంతరాళ సాంద్రధ్వాంతా.

117


మ.

అతులాంభోనిధిధామ! ధామజితకోట్యాదిత్య! దిత్యంగనా
పతిహృద్వారిజవాస! వాసవనుతప్రాబల్య! బల్యాగ్రహ
[43]ప్రతతిచ్ఛేదనసత్త్వ! సత్త్వయుతశోభాకాంత! కాంతామణీ
రతిరాజప్రతిమాన! మాననయధైర్యస్థైర్యశౌర్యోన్నతా.

118

తరల.

కరధృతగోత్రా - కమ్రచరిత్రా
పరమపవిత్రా – పంకజనేత్రా
గరధరమిత్రా - ఘనశుభగాత్రా
ధరణికళత్రా - దాసజనత్రా.

119

గద్య
ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వరప్రసాదలబ్ధ సకలై
శ్వర్యధురీణ శారదాప్రశ్నవివరణ శతఘంటావధాన వినయధునీ
తరంగ విజృంభణాజృంభిత సలలితమృదుమధుర వాగ్వైఖరీ
ఝరీధురీణ - స్థాపితాశేష-విశేషప్రసిద్ధ సాహిత్యసారస్వతాశు
కవితాష్టభాషావిశేష సంస్కృతాంధ్రనిరోష్ఠ్యోష్ట్యాది వింశతి
ప్రబంధనిర్మాణధురీణ మౌద్గల్యమహర్షి గోత్రపవిత్ర
తిరుమలదేశికేంద్ర పౌత్ర తిరువేంగళాచార్య పుత్ర
మఱింగంటి సింగరాచార్య కవిరాజప్రణీతంబయిన
దశరథరాజనందనచరిత్రయను నిరోష్ఠ్య
మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము.

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.

 
  1. శ్రీరామాయణియాసనాంబుజముపై శృంగారము ల్గుల్కఁ గ
    స్తూరీబిందుమరందవాసనలకున్ సొంపారు భృంగమ్ములో
    నా రంజిల్లెడు చూడ్కులం దన ప్రియానందాబ్థి నోలాడు మా
    వీర శ్రీ నరసింహుఁ డెల్లపుడు నుర్విన్ మమ్ము రక్షించుతన్.
    (సారస్వతసర్వస్వమున ప్రథమాశ్వాసము ఈపద్యములో ప్రారంభము)
  2. సిరిధరించిన (సా)
  3. దనరువాఁడు (సా)
  4. గలుగువాఁడును సిరుల్ గలుగువాఁడు (సా)
  5. నెరయు (సా)
  6. పాటనోద్యమ(ము)
  7. తనయనుకాశ (సా)
  8. చెంత (సా)
  9. నాడుత (వ్రా)
  10. నెప్పుడున్ (వ్రా)
  11. ఊకచే (శి)
  12. సరళి (సా)
  13. దెల్పి చేకొనక (సా)
  14. దెల్పుచున్ (సా)
  15. కాకవిజారకోటి (సా)
  16. దగ్నిహోత్ర? (సా)
  17. నలరి (సా)
  18. మహాన్వయు నగణ్యుఁ గౌతుకి నగుచున్ (సా)
  19. పేరఁబూని (వ్రా)
  20. జెండెడు (వ్రా)
  21. యెన్నిక కెక్కె భూజనము లెన్నఁగ నింటను దొడ్డిపేరిడన్ (వ్రా)
  22. నటనచే (సా)
  23. కొల్వు లాక్రమించె (సా)
  24. సహాయుఁడై (సా)
  25. బొట్టుగ (సా)
  26. సిరులసౌందర్య (వ్రా), లలితసౌందర్యవిద్యావిలాసములను (సా)
  27. లై మెఱయువాఁడ (ము)
  28. మానవునాకృతి (సా)
  29. కటాక్షమిళితక్ష్మామాధురీ (సా)
  30. కుంజార (ము)
  31. తే నెరతేనెల్ (ము)
  32. స్థదితా (ము)
  33. 55 నెం. పద్యమునుండి 75 పద్యమువరకు 'ము'లో కుండలీకరణ ముంచి యథస్సూచిక నిట్లు వ్రాసిరి -
    "[ ] ఈగుఱుతుల మధ్యనున్న పద్యము లక్కడికథ శిథిలమైపోవుటచే దిరుగవ్రాయబడియె నిందలి తప్పులొప్పులు పరిగ్రహింపవేడెద - ఇట్లు లేఖనకర్త”
  34. నిష్ట (ము)
  35. 'యీశ్వరా' (ము) 'శ్వ' ఓష్ఠ్యము. (ఈశిత = ప్రభువు - శ.ర).
  36. కందందనియా తేనెల (వ్రా)
  37. కింజల్కాది (ము)
  38. నద్రాజి(వ్రా)
  39. గనుక (ము)
  40. నెదుర (ము)
  41. గేళి (ము)
  42. నెలసరుల (వ్రా)
  43. ప్రతిత (ము)