చిన్ననాటి ముచ్చట్లు/సంగీత పాటకుల పోషణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

24

సంగీత పాటకుల పోషణ

నేను మద్రాసులో స్థిరవాసరమేర్పరచుకొని ఎగ్మూరులో స్వగృహమును నిర్మించుకొనిన పిమ్మట నా స్నేహితులు గుంటూరు పబ్లిక్ ప్రాసిక్యూటరు రావు బహదూర్ కామరాజమన్నారు క్రిష్టరావుగారి వద్దనుండి ఒక సిఫారసుజాబును తీసుకొని ఇద్దరు బాలురు నావద్దకు వచ్చిరి. వీరి తండ్రి కొండలరావుగారు వీరికూడయుండిరి. వీరు నాకు దెచ్చిన జాబులో - ఈ పిల్లవాండ్రు విజయనగర ప్రాంతమునకు చేరినవారనిన్ని, కొంతకాలము ద్వారం వెంకటస్వామిగారివద్ద గాన విద్యాభ్యాసమును చేసినవారనిన్ని, మిక్కిలి పేదవారనిన్ని మద్రాసులో నా సహాయమును కోరివచ్చుచున్న వారనిన్ని వ్రాసియుండెను. మద్రాసుకు వచ్చుటకు రైలుచార్జిలేక మా వద్దవున్న హార్మోనియమును అమ్ముకొని ఇక్కడికి రాగలిగితిమని పిల్లవాండ్ల తండ్రి కొండలరావుగారు చెప్పిరి.

వీరి విద్యాభ్యాసమునకై తల్లిలేని పిల్లలను వెంటబెట్టుకొని తండ్రి కష్టపడుట చూచి నాకు వాళ్లమీద జాలి కలిగినది. వారు వచ్చినప్పడు సుమారు పగలు 10 గంటల కాలము. వాళ్లను వెంటనే స్నానమును చేయుడని, నాతో కూడ భోజనమును చేయమంటిని, భోజనానంతరము పిల్లకాయలను పిలిచి పాటను వినగోరితిని. చిన్నపిల్లవాడు (కామేశ్వరశర్మ) వీణ, గాత్రము సాధకమును చేసినవాడు. పెద్దవాడు గోపాలరాయశర్మకు ఫిడియలు సాధకము. వీరిరువురి కచ్చేరియు అరగంట కాలము వింటిని. చిన్నవాని గాత్రము వీణానాదము యేకమైనప్పడు గాంధర్వగానమనిన నిదియేయేమోనని నాకు తోచినది. చిన్నవాని ప్రాయమప్పడు సుమారు 12 సం|| ఉండవచ్చును. బాలప్రాయముగనుక వాని కంఠము కిన్నెరస్వరమును బోలియుండెను. రెండవ వాని ఫిడియలు వయసుకుమించిన సాధకముగ కనుబడెను. ఈ బాలురపాట వినిన పిమ్మట వీర్లకు నాచేతనైన సహాయమును చేయుటకు నిశ్చయించుకొని నాయింటనే ఉంచుకొంటిని.

పిల్లవాండ్లకు శర్మసోదరులని (Sarma Bros) పేరుపెట్టి గోక్లే హాలునందు, విక్టోరియా పబ్లీకుహాలునందును గొప్పవారి యాజమాన్యముతో పాట కచ్చేరీలు యేర్పాటు చేసితిని. ఆ సమయమున మద్రాసు ప్రముఖులలో కొందరు పిల్లవాండ్ల గానమును గురించి ఉపన్యసించిరి. మరునాడు వీరి కచేరీలను గురించిన ఉపన్యాసములు వార్తాపత్రికలవారు ప్రచురించిరి. అప్పటినుండి మద్రాసులో వీరిపాటకు పేరువచ్చి సంగీత సమాజములవారు వీర్లను ఆదరించుచుండిరి.

మైసూరు ఆస్థాన సంగీత విద్వాంసులగు బిడారం క్రిష్టప్పగారిని శర్మ సోదరులకు పరిచయపరచితిని. క్రిష్ణప్పగారు పిల్లకాయల గానమునువిని చాలా సంతోషించి వీర్లను మైసూరు దర్బారులోకి ప్రవేశమును కలుగచేసిరి. శర్మసోదరుల గానమును మహారాజులవారు (గతించినవారు) విని చాలా సంతృప్తులయి గాయకులకు గొప్ప బహుమానముల నొసంగిరి. ఒకటి రెండు కచ్చేరులు దర్బారునందు జరిగిన పిమ్మట ఈ పిల్లకాయలను క్రిష్టప్పగారికి వప్పగించి వీర్లను మీరు చక్కగ తరిఫీదు చేయవలయునని ఆజ్ఞాపించిరి. వీరు దర్బారు అతిథులుగ యుండుటకు తగుమైన యేర్పాట్లను చేయించిరి.

బ్రహ్మశ్రీ గాయక శిఖామణి హరినాగభూషణముగారు ఆంధ్రదేశమునకు చిరపరిచితులు. వీరు ప్లీడరు వృత్తిలోనుండి ఫిడియలును అభ్యసించి ప్రసిద్ద పురుషులైరి. అందరికీ సులభముగ అందరివలె అందుబాటులో లేకపోయినను దొరికినప్పడు సభ్యులను ఆనందింప చేయు పండితులు. బ్రహ్మవర్చస్సుగల వైదిక శిఖామణి, రామభక్తులు. సంగీతముతో కూడ సాహిత్యమును అభ్యసించిన పుణ్యపురుషులు. ఈ కాలమున ఆంధ్రదేశమునకు వన్నెదెచ్చిన వాగ్గేయకారులు.

వారణాశి సుబ్బయ్య, ఘంటయ్య అని సోదరులు, ఒకరు గాత్రమున ఒకరు మృదంగమున నిధులు. వీరు మద్రాసుకు వచ్చి నన్నాశ్రయించినప్పుడు వీర్ల సంగీత సభను గోక్లేహాలులో యేర్పాటుచేసి జోడుతోడాలను ఇరువురకు తొడిగితిని. వీరిది బందరు కాపురస్థలము.

యజ్ఞనారాయణశాస్త్రిగారు అని యొకరు 1942లో కాబోలు నావద్దకు వచ్చిరి. వారు ఫిడేలును ద్వారం వెంకటస్వామిగారి వద్ద నేర్చితిమనిరి. వీరిని సంగీత శాస్త్రమున పేర్గాంచిన శ్రీ వెంకట్రామయ్యర్ గారివద్దకు తీసుకొనివెళ్లి వినిపించితిని. వారు ఆయనకు సంస్కారమును సాధనయు కలదని మెచ్చిరి. ఆ పిదప నాయింటనే యొకకచ్చేరీ గావింపించి అందు ఆయనను బంగారుపతకమును గొలుసుతో చేర్చి కంఠమున అలంకరింపజేసి సత్కరించితిని.

మద్రాసుకు వచ్చిన పిమ్మట అరవల సాంగత్యమువలన నాకున్ను క్రమముగ గానకళాభిమానము ఇనుమడించినది. మద్రాసులో జరుగు సంగీత కచ్చేరీలకు నేను తప్పక హాజరగుచుండెడివాడను. ఆ కాలమున మద్రాసులో నేటివలె సంగీత సమాజములుండినట్లు నాకు జ్ఞాపకము లేదు. ఎవరి ఇండ్లలోనైనను అగు వివాహ కార్యముల సందర్భములలో జరుగు పాటకచ్చేరీలకు పోవుచుంటిని, అప్పుడు పురుషుల కచేరీల కంటే స్త్రీల కచ్చేరీలే విశేషముగ జరుగుచుండెను. బెంగుళూరు నాగరత్నం, కోయంబత్తూరు తాయి, ధనకోటి, గోదావరి, సేలం చెల్లెండ్రు, రాజాయి మొదలగువారి కచ్చేరీలు విశేషముగ జరుగుచుండెను. వీణె ధనము గొప్ప విద్వాంసురాలైనను వివాహ కార్యములలో వీణికచ్చేరిని పెట్టించువారు చాలా కొద్ది. అయితే ఈమె ప్రతి శుక్రవారమునాడు తన యింటిలో వీణి కచ్చేరిని జరుపుచుండెడిది. అప్పడు అభిమానులు ఆమె యింటికిపోయి వీణపాటను వినేవారు.

వేణుగాన గాయకులలో ప్రథమమున మద్రాసుకువచ్చి అసమాన పాండిత్యమును చూపిన మహానుభావుడు శరభశాస్త్రిగారు. వీరు పుట్టినది మొదలు ఈ పాడులోకమును చూడక జ్ఞానేంద్రియములతోనే వేణుగాన మభ్యసించి కీర్తిని బడసిన పుణ్యపురుషుడు. వీరి తర్వాత వేణుగానములో ప్రసిద్ధి చెందినవారు నాగరాజరావుగారు, పల్లడం సంజీవరావుగారు.

ఆ కాలమున శరభశాస్త్రిగారు వేణుగానము, గోవిందస్వామి ఫిడియలు, అళగనంబి మృదంగము గొప్ప పాటకచ్చేరిగ నుండెను. ఈ ముగ్గురికచ్చేరి ఒకనాడు జార్జిటవున్లో యొక శెట్టిగారింట జరుగుతుందని దెలిసి నేనును నాతో కూడ నెల్లూరి కాపురస్తుడు విస్సా రామారావుగారును వెళ్లితిమి. అప్పడు విస్సా రామారావుగారు మద్రాసులో లా కాలేజీలో చదువుచుండిరి. గానప్రియులు. ఈ కచ్చేరీకి రావలసిన విద్వాంసులలో శరభశాస్త్రివారును గోవిందసామి ఇరువురు వచ్చిరిగాని మృదంగమును వాయించు అళగనంబి యింకను రాకయుండెను. వచ్చిన పాటకులు కొంతవరకు వేచియుండి మృదంగమునకు మరియొకని యేర్పాటుచేసి సభను సాగించిరిగాని శరభశాస్త్రిగారికి మృదంగమంతగ సహించలేదు. అళగనంబిగారు వచ్చు రైలు ఆలస్యముగ వచ్చినందున వారు అరగంట ఆలస్యముగ సభకువచ్చి శాస్త్రిగారి ప్రక్కన మెల్లగ కూర్చుండి తిన్నగ మద్దెలమీద దెబ్బవేసిరి. ఆ సుశబ్దమును శాస్త్రిగారు విని ఆనందముతో 'అణ్ణా వందియా' (అన్నా వచ్చావా) అని అళగనంబిని చేతితో తడిమి సంతోషించెను. అప్పడు సభ్యులందరు గొల్లున నవ్విరి. ఈ పుట్టంధుడు అళగనంబిని చూడకనే సుశబ్దమును వినినవెంటనే గుర్తించగలిగెను. ఈ విషయమును యిప్పటికిని చెప్పుచుందును.

ఆ కాలమున మద్రాసులో జరుగు వివాహకార్యముల సందర్భములలో జరుగు సంగీత కచేరీలకు స్త్రీలు వచ్చెడివారుగాని బహిరంగముగ జరుగు గానసభలకు స్త్రీలు అంతగ వచ్చెడివారుకారు. కొద్దిమంది సంగీతజ్ఞానముగలవారు వచ్చినను చాటున కూర్చుండి పాటను విని పోవుచుండిరి. ఇప్పటివలె అప్పుడు స్త్రీలలో గానకళాభ్యాసము వ్యాప్తిచెంది యుండలేదు. ఆ కాలమున దాశీలుతప్ప తక్కినవారు గానమభ్యసించుట మర్యాదగ నుండెడిది కాదు.

జార్జిటవున్ గోవిందప్పనాయుని వీధిలో యుండు గొప్ప శెట్టిగారింటిలో వివాహము జరిగెను. ఆ వివాహమునకు ఆటకచ్చేరీని యేర్పాటుచేసిరి. అప్పడు మద్రాసులో షణ్ముఖవడివేలను నాట్యకోవిదురాలుండెను. ఈమె నాట్యమును అప్పుడు జనులు హెచ్చుగ మెచ్చుకొను చుండిరి. ఈమె స్థూలకాయమును గలిగిన నల్లటి నటకురాలు. పొట్టిగనుండును. ఇట్లుండినను ఈమె నాట్యము మెచ్చుకొనదగినది. జనులు గుంపులుగ వచ్చుచుందురు. నేనుకూడ ఆనాడు అక్కడ ముందున కూర్చుండగలిగితిని.

సాధారణముగ పెండ్లిండ్లలో పెండ్లి పెద్ద ముందు కూర్చుండును. ఈ యింటిశెట్టి వీరవైష్ణవ సాంప్రదాయకుడు. దట్టముగ నామమును ధరించి ముందు కూర్చుండెను.

ఈ నటకురాలు 'శివదీక్షాపరురాలను రా' అను పాటను పాడుచు శెట్టిగారి ముందు కూర్చుని ఆనాడు బిల్వదళముల అర్చనచేయ అభినయము ఇప్పటికిని నాకు మరుపురాని దృశ్యము. అటుపిమ్మట ఈమె తాండవనృత్యము సల్పినప్పుడు సభ్యుల ఆనందమునకు మేరలేకుండెను. ఆ స్థూలకాయముతో ఆమె అంత చులకనగ చువ్వవలె యెగురుచు చేసిన నృత్యమున బల్ల కూర్పు ఈమె పాదతాళము ప్రతిధ్వనినిచ్చుచుండెను. అప్పటికే నడివయసురాలు - వడ్యాణమును ధరించుటకు వీలులేకపోయినను నాడాతో బిగించిన నడుమును విల్లనంబువలె వంచగలిగెను. ఈమె పాడిన 'శివదీక్షాపరురాలను రా' అను కీర్తనకు గ్రామఫోను ప్లేట్లున్నవి.

సుప్రసిద్ద లాయరుగ నుండిన పనప్పాకం ఆనందాచార్యులుగారు గొప్ప గానకళాపోషకులుగ నుండిరి. వీరు ఆంధ్రులు. ఆంధ్రభాషాభిమానులు. వీరప్పుప్పుడు తెలుగుపత్రికను కూడ నడుపుచుండిరి. కాంగ్రెసు ప్రెసిడెంటు పీఠమును అలంకరించిన దేశభక్తులు. సంగీతజ్ఞానము గలవారగుటచే వీరింట అప్పుడప్పుడు గానసభలు జరుగుచుండెను. నేను పోవుచుంటిని.

మద్రాసు గోవిందప్పనాయుని వీధిలో తచ్చూరు శింగరాచార్యులు గారుండిరి. వీరు సంగీత విద్వాంసులు. ఫిడియలును చక్కగ సాధకమును చేసినవారు. వీరింటిలోనే శ్రీరామమందిరమును యేర్పాటుచేసి అప్పుడప్పుడు గానసభలను చేయుచుండిరి. ఆ కాలమున విద్యార్థులకు ఉచితముగ వీరు విద్యను నేర్చుచుండిరి. ధర్మబుద్ధి గలిగినవారు 'సంగీతకళానిధి'యను గ్రంథము వీరు వ్రాసినదే. తెలుగుదేశమున 'సరిగమ పదనిసలు' నేర్చినవారికెల్ల ఇదియే పాఠ్యగ్రంథము.

Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf