Jump to content

చిన్ననాటి ముచ్చట్లు/నెల్లూరి నాటక సమాజములు

వికీసోర్స్ నుండి

23

నెల్లూరి నాటక సమాజములు

నెల్లూరి వర్ధమాన సమాజమునకు ముఖ్య పురుషులు శ్రీమాన్ కే.ఏ. వీరరాఘవాచార్యులుగారు. ఈ సమాజమునకు వీరు తండ్రి. నాటకముల శాఖ నలంకరించుచుండినవారిలో శ్రీకాసుఖేల కపాలి రామచంద్రరావుగారు, వరదాచారిగారు, ముంగమూరి వెంకటసుబ్బారావుగారు, నందగిరి హనుమంతరావుగారు, రామానుజాచారిగారు, వవ్వేటి విశ్వనాథరావుగారు, సింగరాచార్యులుగారు, ముత్తరాజు శివకామయ్యగారు మున్నగువారు నాకు బాగుగ జ్ఞాపకమున్నవారు.

వీరందరు ఉద్యోగస్తులు; పెద్ద మనుష్యులు, చక్కని నటులు. అయితే నాటకములు వేయవలెననే కుతూహలమున్నంతగా అందుకు తయారుకావలయుననే శ్రద్దయుండెదికాదు. వీరికి ఆంధ్రభాషాభిమానిసమాజమునకువలె గురుత్వముతో శిక్షించి ఒద్దికల దిద్దగల వెంకటరాయశాస్త్రిగారివంటి ప్రతిభాశాలురు లేరు.

శ్రీ నందగిరి హనుమంతరావుగారు స్త్రీవేషమున 'స్త్రీయేనా' అని భ్రమింపజేసేవారు. దసరా ఉత్సవములలో - లఘు ప్రదర్శనములు, ప్రహసనములు వేయుచుండిరి. అందు ముఖ్యముగా నాటకములకు సంబంధించినంతవరకు 'టాబ్లో' (Tableau) అనే పాశ్చాత్యపద్దతి ననుసరించి ఒక్కొక్క ఘట్టమును ప్రదర్శించేవారు. అనగా ఆ ఘట్టమున కవసరమైన - (విశ్వామిత్రునకు హరిశ్చంద్రుడు రాజ్యమునొసంగుట, దమయంతిని నలుడు విడిచి చనుట, ఇత్యాదులు) వేషముల ధరించుకొని ఆయా అభినయమున కదలక మెదలక రంగమున నిల్చియుండేవారు. వర్ధమాన సమాజమువారు నాటకములు వేయురాత్రి నేను మద్రాసునుండి వారికి కావలసిన వస్తువులను తీసుకొనిపోవుచుండేవాడను.

ఈ సమాజమువారు తిక్కన పఠనమందిరము నొకటిని, పుస్తకభాండారము నొకటిని నడుపుచున్నారు. దానిలోనే యొకశాఖను వేదము వేంకట్రాయశాస్త్రిగారి పేర నొక గ్రంథాలయముగ నేర్పరచి యున్నారు. ఈ సమాజము తరపున చిరకాలమునుండి ఏటేటా తిక్కన జయంత్యుత్సవమును చాల వైభవముగ జరుపుచున్నారు. శ్రీ వేదము వేంకట్రాయశాస్త్రిగారి వర్ధంతియు ఏటేటా జరుపుచున్నారు.

శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారి శిష్యత్వముకోరినవారు వేరై - 'ఆంధ్ర భాషాభిమాని సమాజము'గా నేర్పడిరి.

శ్రీ శాస్త్రిగారు గొప్ప పండితులు, కవులునేగాక గొప్ప ఉపాధ్యాయులు. ఆంగ్ల నాటకముల సాంప్రదాయముల నెరింగినవారు. కావున రంగస్థల, నిర్వహణ మర్మములన్నియు తెలిసినవారు. క్రిస్టియన్ కాలేజీలో సంస్కృతాధ్యాపకులుగా చేరినపిదప ప్రతి సంవత్సరమును ఏదోనొక సంస్కృతనాటకమును వారికి బోధింపవలసియుండెను. ఆ బోధించుటతో తృప్తిపడక, తమ శిష్యులలో చురుకైనవారి నేరి వారివారికి తగిన పాత్రలనొసంగి నాటకమును నేర్చేవారు. భవభూతికృత 'ఉత్తర రామచరితము' అను నాటకము, కేవలము చదివి ఆనందించవలసినదేగాని ఆడి, చూడదగినదికాదని పలువురి అభిప్రాయము. అందుచే ఎల్లరు దానివంకచూడక వదలివేసిరి. అట్టిదాని నొకసారి శ్రీశాస్తులవారు తమ శిష్యులకు నేర్చి ప్రదర్శింపించి అందరిచే మెప్పుబడసిరి. "ఆంధ్రభాషాభిమాని సమాజము" 13 గురితో నేర్పాటైనది. దీనికి శ్రీ శాస్త్రిగారే శాశ్వతాధ్యక్షులు. శాస్త్రులవారి నాటకములు తప్ప ఇతర నాటకములాడరాదు; శాస్త్రులవారివద్ద శిక్షణపొంది వారి అనుమతిపైగాని నాటకము వేయరాదు... అని నియమము లేర్పరచుకొనిరి.

శ్రీ శాస్త్రులవారి యాజమాన్యమున ఆంధ్రభాషాభిమాని సమాజము దినదిన ప్రవర్థమానమై చిరకాలము నడచినది. 1925లో రత్నావళీ నాటకముతో సరి మరి నాటకము వేయలేదు.

దొరసామి పేరు కందాడై శ్రీనివాసన్. ఈయన ఆంగ్లమున బి.ఏ.యల్.టి. కొన్నాళ్లు పచ్చయప్ప హైస్కూలు ప్రధానోపాధ్యాయులుగా నుండిరి. పిదప నెల్లూరిలో వెంకటగిరి రాజాగారి హైస్కూలు నందుపాధ్యాయులుగా నుండిరి. సంస్కృతమున పండితులు. సంగీతశాస్త్ర విశారదులు. భరతశాస్త్రనిధులు. మంచి శారీరము; సుందరమైన గంభీరవిగ్రహము, రాజఠీవి ఉట్టిపడుతుండేది. రాజవేషమున కాయనను చెప్పి మరి ఇంకొకరిని చెప్పవలయును. దుష్యంతుడుగా తుమ్మెదచే బాధపడుచున్న శకుంతల ఆర్తిని విని - 'ఎవడురవాడు?' అని ముందుకు దుముకునప్పుడు, ప్రతాపరుద్రుడుగా - 'మేము రాము' అని తురక సిపాయిలతో నిరాకరించి పలుకునప్పడు, ఉష శయ్యాగారమున అనిరుద్దుడుగా బాణాసురునితో నిర్లక్ష్యమున 'నీ అల్లుడను' అని చెప్పి - లాఘవమునలేచి అతనితో కలియబడునప్పడు - ఆ పొంకము చూడదగినదే గాని వర్ణింపతరముగాదు.

దొరసామి నాటక రంగస్థలము వీడక స్వంతముగా నొక నాటక సంఘమేర్పరచి తాముగా కల్పించిన హరిశ్చంద్ర నాటకము, కృష్ణలీలలు, బళ్లారివారి ప్రహ్లాద, శ్రీజయపురం మహారాజా విక్రమదేవవర్మగారి శ్రీనివాస కల్యాణము ఇత్యాది నాటకములను కొన్నిటినాడిరి. అందువరుసగా హరిశ్చంద్ర, యశోద, హిరణ్యకశ్యప, శ్రీనివాసాదిపాత్రల ధరించేవారు. సహాయనిరాకరణోద్యమమున ప్రవేశించి, కారాగారవాసమనుభవించి జబ్బుపడిరి. శాస్త్రిగారికిని వీరికిని పరస్పరానురాగ భక్తితాత్పర్యములు నశించలేదుగావున - జైలునుండి వచ్చిన యనంతరము ఉభయులు తిరిగి కలుసుకొనజొచ్చిరి.

ముమ్మడమ్మ వేషము మొదలు యుగంధరుని వేషమువరకు అన్ని వేషములు వేసినారు రంగసామి. ముఖ్యముగా స్త్రీపాత్రలను మొదట ధరించుచుండేవారు. శాకుంతల, మల్లమదేవి, చిత్రరేఖ - మున్నగు వేషములను ధరించేవారు. శకుంతల వేషమున ఆరణ్యకుల అమాయకత్వము, యావనప్రాయపు ముగ్ధతనము, భర్త తిరస్కృతయై, 'అనార్యా' అని అతని నిందించునప్పటి రోషావేశము - కణ్వశిష్యులు రాజాస్థానమున నీ కర్మమని విడిచిపోవునప్పడు దుఃఖాతిశయమున ఏమితోచమి పరవళ్లు త్రొక్కుచుపడు చిడిముడిపాటు - మారీచాశ్రమమున భర్తృపునస్సమాగమమున గాంభీర్యముద్ర, - వీనినన్నిటిని - అసదృశ్యముగా నటించేవారు.

నెల్లూరిలో ఆ రోజులలో వెంకటచలం గారిని పేరు చెప్పకుండా ఊరక ‘పంతులు' అంటే వీరికే అన్వయం అయ్యేది. నెల్లూరి రంగనాయకుల గాలిగోపురం కట్టించినది వీరి తాత వెంకటచలం పంతులుగారు. పంతులుగారు మంచి దర్పం గలవారు, ఆజానుబాహులు; ఒడ్డుపాడుగు; స్ఫురద్రూపులు. ఏ సభలో కూర్చున్నా 'సభాపతి' పదవి వహించవలసినదే. వారి సొమ్మైనది, ఢిల్లీ సుల్తాన్ వేషము. ఆ డాబు, ఆ దర్పము, ఆ డౌలత్ వారే చూపవలయును; తమకు తెలియకయే, అర్ధరాత్రమున వర్తకుల సరుకుల యోడలో బందీ కృతులై - వరంగల్కు తరలిపోవుచున్న సీను - అర్ధరాత్రమునకు తటస్థించును. ఆ సన్నివేశము గంభీరమును విషాదకరమునైనది. యానాదిశాస్త్రి అనే పేరు చెప్పితే 'ఓహో! చాకలిపేరయ్య వేషం వేసేవారా' అంటారు. ఈయన మొదట్లో అమెచ్యూర్సు కంపెనీలోనుండి చిత్రనళీయమున పాత్ర ధరించినవారు. పిదప ఆంధ్రభాషాభిమాని సమాజమునచేరగా శ్రీ శాస్త్రులవారు ఈ సాటి పుదూరిద్రావిడ శ్రోత్రియని - కొలది కాలములోనే చాకలిపేరిగానిని గావించినారు. ఆ కట్టు, ఆ నడక, ఆ అమాయకత్వము, ఆ మాటలో యాస మూడు మూర్తులా చాకలి పేరయ్యయే.

నేలటూరి తిరువేంగడాచార్యులుగారు యుగంధర పాత్ర, ఢిల్లీలో పిచ్చివాడుగ సహా, నటించేవారు. ఆ పాత్ర ధారణము వీరికి ఒప్పినట్టు మరియొకరికి ఒప్పెడిదికాదు.

దొరసామి మేనల్లుడు సుందరరాజంగారు విద్యానాధుడు, బొబ్బిలి రంగరావు పాత్రల ధరించేవారు. విగ్రహపుష్టి; చక్కని కంఠస్వరము గలవారు. అభినయమునను నేర్పరి. వలీఖాన్ పాత్ర ధరించిన రామానుజాచారి, రామదాసయ్యంగార్లును ఎన్నదగినవారే. శాస్త్రులవారు వ్రాసిన 'తురక తెలుగు' వీరి నోట పుట్టినట్లుండేదిగాని, నేర్చినట్లుండేది కాదు. ఉప పాత్రను కోవూరి గోపాలకృష్ణయ్యగారు ధరించేవారు. పురుషుడు స్త్రీవేషము వేసినాడనేమాట అనిపించేదికాదు సరికదా; ఆ వేషమునందు అతని అందచందములు - ఆ 'ఉషా' కన్యకయేనా అనిపించేవి. రంగసామి చిత్రలేఖ వేషము వేయుటకు ముందు గుంటూరు శివకామయ్యగారు ఆ వేషమును ధరించేవారట. వారును చాలా గొప్పగా నటించేవారందరు.

వర్ధమాన సమాజమున చేరగల, ఉద్యోగఫాయీగాని, ఆంధ్రభాషాభిమాని సమాజమున చేరగల పాండిత్య ప్రకర్షలుగాని, లేకున్నను, నాట్యకళయందు అభిమానముగల కొందరు యువకులుచేరి జ్ఞానోదయ సమాజముగా నేర్పడిరి. ఈ సమాజమున వృద్ధికి వచ్చినవారు శ్రీ నెల్లూరి నగరాజారావుగారు.

ఉత్తరాది నాటక సమాజములు కొన్ని చెన్నపట్టణమునకు వచ్చి అప్పడప్పడు నాటకములు వేయుచుండువారు.

వీరికిని నెల్లూరివారికిని చాలా భేదమున్నది. ఏనల్గురైదుగురు సుప్రసిద్ద నటులో తప్ప మిగత అందరిది ఒకటే ధోరణి. నెల్లూరువారు పద్యములు చదువునప్పడు తగుమాత్రము సంగీతమునే ఉపయోగింతురు. పద్యమును విడమరచి చదువుటచే సులభగ్రాహ్యమై, వారికిని అభినయానుకూలమై, ప్రేక్షకుల కానందదాయకమై యుండెడిది. ఉత్తరాది వారట్లుగాక పద్యమెత్తుకొనుటలోనే తారకములో నెత్తుకొని, కొంపలు మునిగిపోవుచున్నట్టు వడివడిగా పద్యమంతయు అక్షరములు కొన్నికొన్ని మ్రింగుచు వల్లించి - తుట్టతుదక గిరికీలు త్రిప్పుచు 'తెర న న న' అన్నట్లుగా రాగము విసిరేవారు. దీనివల్ల వారికి అభినయమున కవకాశము కల్గేదికాదు; విసరురాగములలో రాగసాంకర్యము లేకుండా పాడగలిగిన వారు కడుకొద్దిమంది అయితే రానురాను, గోవిందరాజుల సుబ్బారావు, స్థానం నర్సింహారావు ప్రభృతులు ఆ ధోరణిని చాలావరకు మార్చినారు.

యడవల్లి సూర్యనారాయణరావుగారు వస్తుతః స్ఫురద్రూపులు; ఒడ్డు పొడుగుగల ఉన్నతమైన మూర్తిగలవారు. సంస్కృత శ్లోకములను గాని, పద్యములనుగాని, సుష్ఠుగా చదువనేర్చినవారు. చక్కని సంగీతము, మంచి అభినయము; వీరు మైలవరం కంపెనీలో తొలుత సత్యవంతుని పాత్ర ధరించుచుండిరి. అందే వీరికి పేరు ప్రఖ్యాతులు కల్గినది. పిదప శ్రీ కృష్ణ తులాభారమున కృష్ణుడుగాను, పాండవవిజయమున దుర్యోధనుడుగాను రాణించిరి. వీరు కందుకూరి వీరేశలింగంగారిచే తర్జుమా అయిన శాకుంతలమున దుష్యంతపాత్ర ధరించిరి. శ్రీ సూర్యనారాయణగారు హఠాన్మరణము చెందుటచే నాట్యకళకు గొప్ప లోటైనది.

స్థానం నరసింహారావుగారిని ఆంధ్రదేశమున ఎరుగని వారుండరు. వారు చిత్రాంగి, సత్యభామ, దేవదేవి, మధురవాణి, చింతామణి మున్నగు వేషములు వేయగా చూచియున్నాను. ఈ వేషములన్నింటియందును వారు చాలా విశేషముగ నటించగల్గి నవారు. చిత్రాంగిగావారు బహు నేర్పుతో నటింతురు. ఈర్ష్య అంతయు రూపెత్తినట్లు సత్యభామ వేషమున వ్యవహరింతురు. 'కుత్తుక ఖండించి' అన్న పద్యభాగమును చదువునప్పడు విషాదము, రోషము, ఈర్ష్య అన్నియు ఉట్టిపడుచుండును. దేవదేవిగా ఏ మాత్రమును భూషణముల ధరింపకయే, విప్రనారాయణుని ఆశ్రమ కుటీరముకడ సపర్యలు చేయుచు చూపు కపట భక్తిభావము, క్రమముగా నిజభక్తి భావముగా మారిపోవుట ఆయనయే అభినయింపవలయును. నిజముగా విప్రనారాయణ సేవాపరతంత్రయైయున్న దేవదేవి ముగ్ధ స్వరూపమున నతనిని మరువ సాధ్యముకాదు. మధురవాణిని పాత్రగా సృష్టించిన గురుజాడ అప్పారావు పంతులుగారు వీరి 'మధురవాణి' పాత్రాభినయమునుగాంచి యున్నచో తన పాత్రపోషణమున కీయన మెరుగు పెట్టెనని తలంచుననుటకు సందేహములేదు.

ఇంకను ఎంతోమందిని ఉత్తరాదినటులను చూచియున్నాను. వారందరును సామాన్యులు. విప్రనారాయణుడుగా కస్తూరి నరసింహారావు గారు బాగుగా మెప్పుపడసిరి. వైష్ణవభాగవతోత్తముని వేషమునకు తగిన స్థూలదేహము, ఊర్ధ్వపుండ్రములను గాత్రముగా ధరించుటకు వలయు విశాలమగు నుదురు, రొమ్ము, శ్రోత్రియ పాత్రకవసరమగు శిరోముండన మొనర్చుకొనుటకు దురభిమానము అడ్డురాని మనస్తత్వము, చక్కని శారీరము ద్రావిడమునను చక్కని ఉచ్చారణ - ఇవన్నియు - ఆ వేషము ధరించి మెప్పించుటకాయనకు అమరియున్నవి. ఆయనతోపాటు శిష్యుడు శ్రీనివాసుని వేషము వేయుచుండిన దెందులూరి సుబ్రహ్మణ్యశాస్త్రియు గొప్ప నటుడన చెల్లును. ఆయన పిదప నా పాత్ర ధరించుచున్న వంగర వెంకటసుబ్బయ్యగారును ఆ వేషమున ఒప్పించుచుండిరి. ఈ వెంకట సుబ్బయ్యగారే వేశ్యమాతగాకూడ నటించుచుందురు.

బళ్లారి రాఘవాచార్యులుగారిని ఆంధ్రనటులనుట కన్నను భారతీయ నటులని యందును. 'చిత్రనళీయము'న నలుడు, బాహుకుడనై నటించినారు. 'తప్పెవరిది?'లో సబ్రిజిస్టారు పాత్ర నిర్వహించినారు. విజయనగర సామ్రాజ్యపతనమున పఠాన్రుస్తుం పాత్రను, ప్రహ్లాద నాటకమున హిరణ్యకశ్యప పాత్రను, చంద్రగుప్తయందు చాణక్యపాత్రను, రామదాసునందు రామదాసు పాత్రను ధరించి మెప్పుబడసినారు. తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్లనాటకములన్నిట నొక్క రీతిగా నటించి ఉత్తమనటుడు అనిపించుకున్నాడు. రవీంద్రనాథ ఠాగూరు అంతవారు 'ఉత్తమ భారతీయనటుడు' అని ప్రశంసించినారు.