Jump to content

చిన్ననాటి ముచ్చట్లు/నాటి విద్యార్ధులు

వికీసోర్స్ నుండి

25

నాటి విద్యార్ధులు

మద్రాసులో నేను కొంత ప్రయోజకత్వమును సంపాదించిన పిదప పచ్చయప్ప కాలేజీకి ప్రక్కనయుండిన బందరువీధి 9 నెంబరు యింటికి కాపురమును మార్చితిని. అక్కడనే వైద్యశాల కూడ యుండెను. ఈ బాడుగ యిల్లు పెద్దదగుటవలన మిద్దెమీద యొక భాగమును ఆంధ్రవిద్యార్థులకు బాడుగకు యిచ్చితిని. ఈ యింటి యెదురుగనే వైశ్య విద్యార్థుల వసతిగృహముండెను. ఈ మూడవ యింటిలో పచ్చయప్ప కాలేజి హాస్టలును అప్పడే పెట్టిరి. అరవ, తెలుగు విద్యార్థులతో మంచి పరిచయ ముండినది. వైద్య సహాయమునకు, చేబదులుకు నావద్దకు వచ్చుచుండిరి. ఈ పరిచయమువలన విద్యార్డుల విషయములను వ్రాయగలిగితిని.

అరవ విద్యార్థులు చదువుకొనుటకు మద్రాసుకు వచ్చునపుడు తమతోకూడ రెండు చొక్కాలను, రెండు తుండుగుడ్డలను, రెండు చుట్టుపంచలను, రెండు పై పంచలను, రెండు గోచులను తెచ్చుకొందురు. మద్రాసుకువచ్చిన వెంటనే చౌకగ భోజనమునుపెట్టు హోటలులో చేరుదురు. ఇద్దరు ముగ్గురు చేరి ఒక రూమును బాడుగకు తీసుకొని చదువుకొనుచుండిరి. అప్పుడప్పుడు వారు కాలేజి లైబ్రెరికిపోయి చదువుకొనుచుండిరి. వారి గుడ్డలను వారే వుతుకుకొనుచుండిరి. చాకలివానికి బట్టలను వేయరు. తెల్లవారగనే కొళాయివద్ద స్నానముచేసి, ఉతికిన బట్టలను కట్టుకొని భోజనమువేళకు హోటలుకుపోయి, అక్కడనుండి కాలేజికి పోవుచుండిరి. ఆ కాలమున కాలేజివిద్యార్థులు తలగుడ్డలను ధరించుచుండిరి. గనుక వీరు తెచ్చుకొనిన పైపంచను తలకు చుట్టుకొని పోవుచుండిరి. హోటలులో భుజించు భోజనము తప్ప చిరుతిండ్లకు ఆశపడరు. గదిని విడచి షికార్లు పోరు. ఒకే రూములో యిద్దరు ముగ్గురుండినను సకృతుగ సంభాషించు కొనుచుందురు. మంచి స్నేహముతో మెలగుచుందురు. ఒకరుకొన్న పుస్తకమును మరియొకరు కొనక సర్డుకొనుచుందురు. ఇంటినుండి వచ్చిన డబ్బును దుబారాచేయక మిగుల్చుకొనుచుందురు. ఆటపాటలకు పోరు. తాంబూలమును ముట్టరు. ఒక విద్యార్థికి జబ్బు చేసినప్పుడు మరియొకడు హోటలుకుపోయి అన్నమును తెచ్చిపెట్టును. మరియొకడు ధర్మవైద్యశాలకుపోయి మందులను తెచ్చి యిచ్చును. ఆ కాలమున అనిబెసెంటు, గోక్లే, వివేకానంద మొదలగు గొప్పవారి ఉపన్యాసములు జరుగుచుండినందున, వాటికి వీరు తప్పక పోవుచుండిరి. ఈవిధముగ అరవ విద్యార్థులు పలు ప్రాంతముల నుండి పైపంచలతో వచ్చి పరీక్షలను గొప్పగ నిచ్చి హైకోర్టునందును, రెవిన్యూబోర్డునందును, కలెక్టరు ఆఫీసునందునేగాక విద్యాలయములందును వైద్యాలయములందును మరి అనేక సర్కారు సంస్థలందును కూడ నిండియున్నారు. ఆంధ్రదేశమున అరవ ఆఫీసరులేని జిల్లా లేదు.

ఆంధ్రవిద్యార్థులు అరవ విద్యార్థులవలెనే ఆ కాలమున మద్రాసుకు వచ్చి కాలేజి చదువును చదువుకొనుచుండిరి. ఈ వచ్చినవారిలో బ్రహ్మచారులు, గృహస్టులు, బిడ్డల తండ్రులు వుండిరి. నాకు తెలిసిన విద్యార్థులలో ఒక తాత కూడ యుండెను. ఈ తాత బి.ఏ.లో యొక పార్టును పూర్తిచేయుటకు 10 సంవత్సరములగ పరీక్షకు డబ్బు కట్టుచుండెను. తెలుగు విద్యార్థులు మద్రాసుకు వచ్చునప్పుడు మూడు నాలుగు ట్రంకుల నిండుగ సామానులను తెచ్చుకొనుచుండిరి. ఆ కాలమున హోల్డాల్ లేనందున పెద్ద పరుపులో కొంత సామాను నిమిడ్చి మోకుతోగాని మంచపు నవారుతోగాని గట్టిగకట్టి రైలులో తూకమువేయకుండ ట్రంకులతోకూడ తెచ్చుకొనుచుండిరి. వారు తెచ్చుకొనిన ట్రంకులలో ఒకదాని నిండుగ గుడ్డలు, మరియొక దానిలో పుస్తకములు, మూడవ ట్రంకు నిండుగ ఆవకాయ, మెంతికాయ, బెల్లపు మాగాయ మొదలగు వూరగాయలను, నిలవయుండు చిరుతిండ్లను తెచ్చుకొనుచుండిరి. నెల్లూరు, గుంటూరు ప్రాంతములనుండి దిగిన ట్రంకులలో గుడ్డలు, పుస్తకములతోకూడ అన్నములో పొడి, ధనియాల పొడి, ఎండుచింతాకు పొడి, తెల్లగడ్డల పాడి, కొరవికారము, నీళ్లు పోయకుండ నూరిన గోంగూర, చింతకాయ, మినుముల చింతపండు పచ్చళ్లు వుండెడివి. నిలవఉండు గారెలను, అరిశెలను, మణుగుబూరెను తెచ్చుకొనుచుండిరి. కొందరి పెట్టెలలో చుట్ట పొగాకు, పొడి బుర్రలు నుండెడివి. ఒక శివభక్తుడు లింగార్చనకు తనతో కూడ నల్లరేగడి మన్నును బుట్టనిండుగ తెచ్చుకొనెను. వీరు మద్రాసుకు వచ్చిన వెంటనే మంచి హోటలు యొక్కడున్నదాయని వెతుకుదురు. ఎక్కడైతే వేపుడు కూరలు, పచ్చళ్ళు, చాలినంత నెయ్యి వడ్డించెదరో అక్కడ ప్రవేశించెదురు. అయితే అక్కడ బాగా డబ్బు యిచ్చుకొనవలయును. వీరు యింటినుండి తెచ్చుకొనిన పచ్చళ్లను, వూరగాయలను హోటలుకు తీసుకొనిపోవుచుండిరి. వారి యిండ్లనుండి అప్పుడప్పుడు ఫలహారములు, పచ్చళ్ళు పార్మిల్సు వచ్చుచుండెను. అయితే ఆదివారమునాడు హోటలులో చేసిన వల్లిగడ్డల సాంబారును అరవవారితో కూడ వీరును జర్రుకొనుచుండిరి. ఆనాడు చేసిన ఉర్లగడ్డలకూర వీర్లకు చాలకుండెడిది.

ఒక నెల్లూరి విద్యార్థి వంటరిగ నుండజాలక భార్యను రప్పించి మాయింటిలోనే ఒక భాగమును అద్దెకు తీసుకొని కాపురమును పెట్టెను. మరియొక విశాఖపట్టణపు విద్యార్థి కూడ అటులనే చేసెను. వంగవోలునుండి వచ్చిన విద్యార్థి యొకరు వేదం వెంక్రటాయశాస్త్రిగారి బొబ్బిలినాటకములోని పాటలను, బిల్హణీయములోని పద్యములను తరుచుగ పాడుచుండిరి. మరియొకరు తేలుకుట్టినవారికి పోతన భాగవతమునందలి పద్యములను పాడుచు, మంత్రించుచుండెను. ఇందువలన క్రమముగ వీరిని మేము మంత్రవేత్తయని పిలుచుచుంటిమి. ఒక అబ్బాయికి భార్యవద్దనుండి వచ్చిన జాబులో, మీరు మద్రాసుకు వెళ్ళిన పిమ్మట పెద్దబ్బాయి బెంగపెట్టుకొని అన్నమును సరీగా తినడములేదని వ్రాసియుండెను. అప్పడు ఆ అబ్బాయి ఆ సాయంత్రము బండికే రైలెక్కి వూరికి పోయి నెలదినముల పిమ్మట తిరిగి వచ్చెను. ఈ నెలదినములు లాకాలేజీక్లాసులో మరియొక అబ్బాయి వీరిపేరును పిలిచినప్పుడు హాజరు చెప్పచుండెను. ఆ కాలమున ఒకరికొకరు ఇట్లు సహాయమును చేసుకొనుచుండిరి. క్రొత్తగ పెండ్లి చేసుకొనివచ్చినవారు పండగలకు పలుమారు అత్తవారిండ్లకు పోయి వచ్చుచుండిరి. బందరు వీధికి 'లా' కాలేజి దగ్గరనుండినను నడిచిపోవుటకు బద్దగించి బండ్లమీద కాలేజికి పోవుచుండిరి. కొంతకాలము వుద్యోగమును చేసివచ్చి, బి.యల్. క్లాసులో చదువుకొనుచున్నవారు లాంగ్ కోటులు తలగుడ్డలను ధరించుకొని కాలేజికి పోవుచుండిరి. వారమునకొకసారి చాకలి యిస్తిరి బట్టలను తెచ్చుచుండెను. ఆ కాలమున స్వంత క్షౌరం అలవాటు లేదుగనుక తెలుగు మంగలి ప్రతిదినము వచ్చుచుండెను. ప్రతి శనివారము జట్టివాడువచ్చి సుగంధ తైలములతో తలంటిపోసి పోవుచుండెను. దినమునకు మూడు పర్యాయములు రవేసి తమలపాకులను, సుగంధపుపీటిన్ వక్కపొడిని, జింతాను మాత్రలను వాడుకొనుచుండిరి. చదువుకొనుచుండిన ఒక అబ్బాయి వున్నట్లుండి కనుపడకపోయెను. ఆ అబ్బాయి నాకు చాలా ఆప్తుడగుటవలన వూరంతయు వెతికి వేసారి కడపట ఒక అమ్మాయి యింఠిలో చూడగలిగితిని. సాయంత్ర సమయమున అందరు కలసి హైకోర్టు వద్ద యుండు బీచికిపోయి, 7 గంటలకు బైలుదేరి దోవలో యుండు హోటలుకుపోయి వచ్చునపుడు గుజరాతి మిఠాయి అంగడిలో రెండు తీపి, రెండు కారము పొట్లములను కొనుక్కొని యింటికి వచ్చులోపల దోవలోనే ముగించి వచ్చుచుండిరి. అప్పుడందరు తాంబూలములను జాడించి పక్కలను పరచుకొని పండుకొని తలప్రక్కన మగినపు వత్తుల దీపములను పెట్టుకొని చదువుకొనుచు నిద్రించుచుండిరి. వీరికి పగలుకూడ పండుకొని చదువుకొనుటకు అలవాటుగా నుండెను.

ఆ కాలమున మద్రాసులో పార్శినాటక కంపెనీవారువచ్చి లా కాలేజీకి ప్రక్కన నాటకశాలను నిర్మించి నాటకములను ఆడుచుండిరి. ప్రతి శనివారము, ఆదివారము అందరము కలిసి వెళ్ళుచుండెడివారము. కందస్వామి గుడి కైలాస పర్వతోత్సవమునకును, పార్థసారధిస్వామి అద్దాలపల్లకి మహోత్సవమునకు కూడ అందరము కలసి పోవుచుంటిమి. ఆ కాలమున జట్టు కత్తిరింపులు లేవు గనుక కొందరు జట్టుకు కేశరంజన్ తైలమున పూసుకొని మల్లెపూలను చుట్టుకొనుచుండిరి. వన భోజనములకు తిరువత్తియూరును, మైలాపూరు తిరునాళ్ళకును పోవుచుంటిమి. ఈ ప్రకారము ఆంధ్ర విద్యార్థులు ఆ కాలమున కాలమును కులాసగ గడుపుచుండిరి. ఇంటినుండి వచ్చు డబ్బు చాలక అప్పుపెట్టుచుండిరి. వివాహమైన విద్యార్థులు త్వరగ పరీక్షలను ముగించుకొని స్వస్థానములను చేరుటకు కష్టపడి చదువుచుండిరి. కాని బ్రహ్మచారులు పరీక్షలను బేస్తు పెట్టుచుండిరి. 'ఏలనంటే పరీక్షలను ప్యాసుచేసి ఆ పాడు పల్లెటూళ్లకు పోయిన మన సుఖమును చూచువారెవరునుండరు. మద్రాసులోనే యుండి కాలేజి చదువుచుండిన మనకు మంచిమనువులు వచ్చి లావైన వరకట్నములు లభించును' అని చెప్పుచుండిరి. 'రాత్రింబవళ్లు చదివి చచ్చి చెడిసున్నమైతే మనము మాత్రము ప్యాసు కాలేమట్రా" అని అనుకొనుచుందురు.