చిన్ననాటి ముచ్చట్లు/వీధులు - కట్టడాలు

వికీసోర్స్ నుండి

9

వీధులు - కట్టడాలు

పూర్వము చైనాదేశమునుండి వచ్చుచుండిన తెల్లకాగితములను చైనాకాగితములనుచుండిరి. ఆ కాగితములను విక్రయించు అంగళ్లవీధికి చైనాబజారు అనే పేరు ఇప్పటికిని వాడుకలోనున్నది. ఇటీవల నేతాజీ సుభాషచంద్రబోసు పేరట పిలుచుచున్నారు. ఎ స్ప్లనేడు ఈ వీధిలో నొకభాగము.

బందరునుండి కొందరు అద్దకపు చీరలను తెప్పించి అమ్ముచుండిరి. ఈ వ్యాపారము చేయువారుకూడా బందరు, నెల్లూరు, కరేడ, ఇనమన మెళ్ళూరు మొదలైన ఊళ్లనుండి వచ్చిన రంగిరీజులు; తెలుగువారు. అందుచేతనే దీనిని బందరు వీధి అనిరి. ఆకాలమున పాలచంగావి ధోవతులు, చీరలు నాజూకు గనుక స్త్రీలు పురుషులు వాటిని ధరించు చుండిరి.

పూర్వము మద్రాసులో నాణెములను తయారుచేయుచుండిరి; గనుక ఆ పని జరుగుచుండిన వీధిని టంకశాల వీధి అని పిలువసాగిరి. 1692లో మొగలాయి పాదుషా ఆంగ్లేయులకు పాదుషాబొమ్మతో స్వయముగా నాణేములను అచ్చుపోసుకొనే హక్కునిచ్చెను. నాటినుండియు నిచ్చట చిరకాలము ఆ పని జరిగియుండెను. ప్రస్తుతము నిలిచిపోయినను ఆ వీధి కాపేరుమాత్రము పోలేదు. ఈ వీధి చాలా పొడవు.

పూర్వము మద్రాసులో దేశవాళీ, ఓడవర్తకము జరుగుచుండెను. ఈ ఓడ వర్తకమున పూర్వము సుప్రసిద్దులు సూరంవారు, అవధానంవారు, గుర్రంవారు మొదలైన నెలూరుజిల్లా బ్రహ్మణులు, తుమ్మగంట ద్రావిడులు. వీరు ముత్యాల వర్తకమున, పగడాల వర్తకమున చాలా పేరుపొందినవారు. ఈ ఓడ వర్తకమున ముఖ్యముగా క్రొత్తపట్నం, ఓడరేవు, బందరు, శ్రీకాకుళం, కాకినాడ మొదలగు రేవులనుండి మద్రాసుకు సరుకు దిగుమతి అగుచుండెను; మద్రాసునుండి కూడ సరుకు ఆయా రేవులకు ఎగుమతి జరుగుచుండెను. ఆ కాలమున మద్రాసు సముద్రతీరమునకు సమీపమున నొక వీధిలో ఓడ స్తంభములు (ఓడకాళ్లు) వగైరా ఓడసామానులు తెచ్చి ఉంచుచుండిరి. అప్పడా వీధికి ఓడకాలు వీధి అని పేరు వచ్చినది. ఈ ఓడ వ్యాపారము క్రమముగా నిలిచిపోయినది.

మద్రాసులో కొళాయినీరు లేనప్పుడు నగరమునకు నీటి సప్లయికి మూలమైన ఏడుబావులున్న వీధియగుట చేత నీవీధికి ఏడుబావులవీధియన్న పేరు వచ్చినది.

ఐన్ హౌస్ రోడ్డు వీధి మొదట వితంతు శరణాలయం (Widows Home) అను గుండ్రటి కట్టడము ఐస్ హౌస్ అను పేరుతో నున్నది. దీని ప్రక్కననే వెల్లింగ్టన్ బాలికా పాఠశాల గలదు. పూర్వము మద్రాసులో మంచుగడ్డ యుత్పత్తి చేయుట లేదు. అప్పడు దొరలు ఉపయోగార్థము విదేశములనుండి మంచుగడ్డలను ఓడలలో తెప్పించి ఈ కట్టడములో నిలువయుంచేవారు. అప్పుడందుచే ఈ కట్టడమునకు ఐస్ హౌస్ (Ice House) అనే పేరు గలిగినది. మంచుగడ్డను నిలువచేయుటకు ఈ కట్టడములో గచ్చుతో గుంటను కట్టియుండిరి. ఇచ్చటనే మంచుగడ్డ తయారుచేయుట కవకాశమేర్పడగానే దాని అవసరము తప్పిపోయినది. అంతనది అమ్మకమునకు రాగా మొట్టమొదట బిళిగిరి అయ్యంగారు అను అడ్వొకేటు కొనెను. ఆ తరువాత గవర్నమెంటువారు దానిని కొని బాగు చేయించి అందు వితంతు శరణాలయము నుంచిరి. ఎన్ని చేతులు మారినను ఆ బిల్డింగునకు ఆ పేరు మారలేదు; ఆ రోడ్డునకు నాపేరే ఏర్పడినది. వైకుంఠవాత్యాయర్ వీధి జార్జిటౌనులో యున్నది. ఇందు ముందు నివసించుచుండిన వారందరు వైష్ణవులు. వీరలలో ముఖ్యముగ వంటచేయు వారు, అయ్యంగార్లు అమ్మంగార్లు నుండిరి. వెండ్లి పేరంటములను చేయించు వైష్ణవ పురోహితులునుండిరి. ఈవూరిలో కర్మాంతరములలో బ్రాహ్మణులకు శయ్యాదానమును చేయు ఆచారము కలదు. ఈ శయ్యా దానమునకై సాధారణముగ చనిపోయినవాడు పండుకొనుచుండిన మంచమునే ఇచ్చుట వాడుక. ఈ శయ్యాదానము పట్టు పౌరోహితుడును వాని భార్యయ శయ్యపై, అనగా నామంచముపై కూర్చుండి, పాదపూజను చేయించుకొని దానమును తీసుకోవలయును. ఏ ఊరినుండో పొట్ట ఆత్రమునకై వచ్చిన పేదపౌరోహితుడు భార్యనుకూడా చంకబెట్టుకొని వచ్చినాడా? భార్య హాజరులో లేనివాడేమి చేయును? అట్టివారికి దానసమయమున సహధర్మచారిణి యగుటకు బాడుగ తీసుకొనివచ్చు భార్యలు ఈ వీధిలో సులభముగా దొరుకుచుండిరి. ఆమె యేజాతియో తెలియకున్నను, అవసరము కొలది స్మార్తవేషమునుగాని వైష్ణవ వేషముగాని ధరించి ఎబ్బెరికము లేకుండా పౌరోహితుని ప్రక్కన కూర్చుండి, ఏనాటి సుకృతము వల్లనో, క్రతువులుచేయు యజమానిచే పాదపూజ చేయించుకొని శయ్యాదానమును ఆ తత్కాల భర్తతోపాటు స్వీకరించెడిది. ఈ ఊరిలో మరియొక చిత్రము గలదు. మరణించినవారికి బంధు బలగము లేనప్పడు కూలిదీసికొని ఏడ్చిపోవువారున్నూ ఉండిరి.

పాతచాకలపేట చాలా ముఖ్యమైన స్థలము. ఇది తిరువత్తియూరు హైరోడ్డును ఆనుకొనియున్నది. ప్రథమములో ఇక్కడ ఈస్టిండియా కంపెనీవారు ఈ చుట్టుప్రక్కల వస్త్రములను నేయించి, చలవ చేయించి, రంగు లద్దించి విదేశములకు ఎగుమతి చేయువారుగదా. ఆయా వృత్తుల వారంతయు ఇక్కడ తరతరములుగా కాపురముంటున్నారు. అందు ముఖ్యముగా తానులు చలవచేయువారు విస్తారమగుటచే దీనికి చాకలిపేట అని పేరు వచ్చెను. అయితే ఆ వరక్తము ననుసరించి ఇతర జాతులవారున్నూ ఇచ్చట చేరిరి. క్రమముగా నిది పట్నమందలి సంపన్నగృహస్థుల నిలయమైపోయినది. నాడు దీనిని అందచందములుగల ప్రదేశము (Fashionable Quarters) అనే వారు. ఇచ్చటనే శ్రీపిట్టి త్యాగరాయశెట్టిగారు నివసించుచుండిరి. వారు నేతవృత్తిగల దేవాంగ కులములో పెద్దలు; పిదప బ్రాహ్మణేతరోద్యమమునకు నాయకులు. మద్రాసు కార్పోరేషన్ కు మొట్టమొదటిసారిగా అధ్యక్షులుగా ఎన్నుకోబడినవారు. వారిని 'మద్రాసునకు మకుటము లేని రాజు' (The Uncrowned King of Madras) అనేవారు. గవర్నరులను కూడా లక్ష్యపెట్టేవారుకారు. కొల్లా వెంకటకన్నయ్య శ్రేష్ఠిగారు కూడా ఇక్కడనే నివసించేవారు. వీరు వైశ్యకులమునకు పెద్ద శెట్లు. వావిళ్ల రామస్వామిశాస్త్రులుగారున్నూ సుమారు ఇచ్చటనే తమ ఆదిసరస్వతీ ముద్రాక్షరశాలను, గ్రంథనిలయమును నెలకొల్పి నడిపిరి; దానిని వారి కుమారులు శ్రీ వేంకటేశ్వర్లుగారు విడువక వృద్ధిచేశారు. లాయరు కృష్ణ స్వామి శెట్టిగారున్నూ ఇచ్చట కాపురముండినవారే. ముట్నూరి ఆదినారాయణయ్యగారును ఈప్రాంతముననుండినవారే. వారు రెవిన్యూ శాఖలో గొప్ప గొప్ప ఉద్యోగములను నిర్వహించిరి. చల్లపల్లి జమీందారుల బంధువులును ఈప్రాంతములోనే గొప్ప బంగళాలలో నివసించు చుండేవారు. పురాతనకాలమున తంజావూరు రామానాయుడుగారును వారి కుమారులు రంగయ్యనాయుడుగారును ఇచ్చటనే యుండిరి. కొల్లావారున్నూ రామానాయుడుగారున్ను ఇచ్చట తమ తమ పేరట అగ్రహారములు నెలకొల్పిరి. కొల్లావారి అగ్రహారమునందే ముట్నూరి ఆదినారాయణయ్య గారు నివసించుచుండినది. ఇచ్చటనే ఆంధ్రవైష్ణవ పండితోత్తములునుండిరి. ఆ రోజులలో ఇచ్చట విద్వద్గోష్టులు హెచ్పుగ జరుగుచుండెడివి. ఆంధ్రేతరులలో గొప్పవారును ఇచ్చట నివసించుచుండిరి. సర్ ఉస్మాన్గారు గొప్ప యునానీవైద్య కుటుంబమునకు చెందినవారు. వారి కుటుంబమును ఇచ్చటనే నివసించుచుండెను. సర్ సి.పి. రామస్వామి అయ్యర్ తండ్రి పట్టాభిరామయ్యర్గారును, సుప్రసిద్దులు సి.వి. రంగనాధశాస్త్రి వారి కుమారులు కుమారస్వామిశాస్త్రిగార్లును ఇచ్చటనే నివసించుచుండిరి. దాక్షిణాత్య వైష్ణవులు మద్రాసునకు పెద్ద ఉద్యోగస్తులుగాను, వకీళ్లుగాను వచ్చి మైలాపూరున నివాసమేర్పరచుకొనిన పిదప, ట్రాము, బస్సు సౌకర్యము లిటు హెచ్చిన పిదప చెన్ననగర సౌభాగ్యలక్ష్మి. ఉత్తరమునుండి దక్షిణమునకు మ్రొగ్గినది.

మద్రాసులో గొప్ప కట్టడములై రాణించుచున్నవి చాలవరకు, నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత నేచూచుచుండగా, కట్టబడినవే.

నేను కొన్ని దినములు పచ్చయప్ప కాలేజికి సంబంధించిన గోవిందప్పనాయకరు హైస్కూలునందు చదువుచుంటిని. అక్కడ చదువుచుండిన కాలముననే ఇప్పటి క్రొత్త హైకోర్టు భవనమును కట్టుచుండిరి. తాటికొండ నంబెరుమాళ్ల శెట్టిగారు కంట్రాక్టుకు తీసుకొని కట్టుచుండిరి. ఆ కట్టడమునకు విశేషముగ మలిచిన నల్లరాళ్లను ఉపయోగించుచుండిరి. ఆ రాళ్లను సులభముగ పైకి తీసుకొని పోవుటకు కొన్ని యంత్రములను (Lifts) వాడుచుండిరి. ఆ యంత్రములను చూచుటకు స్కూలు నుండి కొందరు పిల్లకాయలు అక్కడికి పోవుచుండిరి. నేనును బడికి పోవుటకు ఇష్టము లేనినాడు, పాఠములను చదువనినాడు కానీ బటానీలను కొని జేబులో పోసుకొని కట్టుచుండు కట్టడము వద్దకుపోయి కాలమును గడుపుచుంటిని. గనుక ఈ కొత్త హైకోర్టు నా తనిఖీ మీదనే (Supervision) కట్టబడినదని చెప్పవచ్చును. పాత హైకోర్టు యిప్పటి కలెక్టరు ఆఫీసు నందుండెను. Esplanade లో యున్న క్రొత్త Y.M.C.A భవనము కూడా నా కళ్లయెదుట కట్టబడినదే. ఈ భవనమును కట్టకముందు ఈ సంస్థ హైకోర్టు యెదుట ఒక చిన్నమేడలో ఉండినది. అక్కడ బుక్కీపింగ్, టైప్ రైటింగ్ షార్ట్ హాండు(Book-keeping, Typewriting, Shorthand) మొదలగు విద్యలను నేర్చించుచుండిరి. నేను కూడ ఆ క్లాసులో చేరి షార్ట్ హాండు టైప్ రైటింగ్(Shorthand & Typewriting) విద్యలను నేర్చుకొనుచు ఆ సంస్థలో సభ్యుడనైతిని. పిమ్మట క్రొత్తగ కట్టిన భవనమునకు సంస్థ చేరగనే నేనుకూడ అక్కడచేరి శాండో యక్సరసైజు (Sandow Exercises) మొదలగు (Indoor Games) వ్యాయామములను నేర్చుకొనుచుంటిని. ఈ Y.M.C.A. తో అప్పటినుండి నాకు సంబంధము గలదు.

సెంట్రల్ స్టేషనుకు ప్రక్కన కట్టియున్న (M.S.M) మదరాస్ అండు సదరన్ మహారాష్ట్ర రైల్వే ఆడిట్ ఆఫీసుకట్టడము ఇతర కట్టడములు కట్టినదికూడ నాకు తెలుసును. ఈ ప్రదేశమున ముందు పార్కు (తోట) యుండినది. ఆ కారణము వల్లనే ఈ ప్రాంతమునకు పార్కుటువున (Park Town) అని పేరు వచ్చినది. ఈ కట్టడము ప్రక్కననే పార్కుటవున్ పోస్టాఫీసు కట్టడము కలదు. ఈ రైల్వే ఆడిట్ ఆఫీసుకూడ తాటికొండ నంబెరుమాళ్ల శెట్టిగారే కంట్రూక్టుకు తీసుకొని కట్టించిరి. సెంట్రల్ స్టేషన్ ఆరంభమున కట్టినది నాకు తెలియక పోయినను పిమ్మట క్రమముగ దానికి చేర్చికట్టిన ప్లాటుఫారములు వగైరాలు నాకు దెలియును. ముందు పాతస్టేషన్ రాయపురమున నుండినది.

మద్రాసు కార్పోరేషను (రిప్సన్) భవనమును కట్టుచుండినప్పుడు, నేను సుగుణ విలాస సభ మెంబరుగ నుండి దానిని కట్టిన విధమును చూచుచుంటిని. అప్పడు సుగుణ విలాస సభ విక్టోరియా పబ్లిక్ హాలు (V.P. Hall) నందుండెను. పాత మునిసిపలు ఆఫీసు జార్జిటవున్ యర్రబాలుశెట్టి వీధిలో యుండెను. ఇప్పడు బీచిలో యున్న కొత్త నేషనల్ బ్యాంకి కట్టడముండు స్థలమున (Singler School) ఉండెను. ఈ నేషనల్ బ్యాంకిని, ఇంపీరియల్ బ్యాంకిని (ముందు మద్రాసు బ్యాంకి) కట్టినది కూడ నాకు తెలుసును. పాత నేషనల్ బ్యాంకి ఆర్మీనియన్ స్ట్రీటులోను మద్రాసు బ్యాంకి బ్రాడ్వేలోను వుండినవి. పోర్టు ఆఫీసుకు సంబంధించిన క్రొత్త కట్టడము లన్నియు కట్టినది నాకు తెలుసు. పాత హార్బరును మార్చి, ఇప్పడు కట్టిన నూతన హార్బరును కట్టినదియు తెలుసును. పాత హార్బరు మీద శనివారము ఆదివారము కొందరము చేరి పికారుకు వెళ్ళుచుంటిమి. దీనినే అప్పడు యినుపవారధి అని పిలుచు చుండిరి. మౌంటురోడ్డులో యుండిన T.R. Tawker & Sons న స్పెన్సరు కంపెనీ కట్టడమును కట్టినది నాకు తెలియును. పాత యస్.ఐ.ఆర్. స్టేషన్ (S.I.R. Station)ను మార్చి ఇప్పటి కట్టడమును కట్టినది, బీచి స్టేషన్ కట్టినది, మూరు మార్కెట్టును కట్టినది దెలియును. మద్రాసులో ముందుండిన పాతమార్కెట్టు ఇప్పుడు శ్రీరాముల పార్కు అను స్థలమున బ్రాడ్వేలో నుండెను. ఇప్పటి 'లా' కాలేజి నేను చూచుచుండగ కట్టినదే. ఈ 'లా' కాలేజీని కట్టకముందు, B.L. క్లాసులు హైకోర్టు భవనమునందే జరుగుచుండెను. ఆ క్లాసులు ఉదయము 10 గంటల లోపుగనే జరుగుచుండెను. అప్పడా క్లాసులకు ప్రొఫెసర్లుగ ప్రసిద్దులగు రామచంద్రరావు సాహేబు, టి.వి. శేషగిరి అయ్యరు, మొరిశెట్టి వెంకట్రామశెట్టిగారు, సుబ్రహ్మణ్యయ్యరు మొదలగు వారుండిరి.