చిన్ననాటి ముచ్చట్లు/ఆనాటి చెన్నపట్నం

వికీసోర్స్ నుండి

8

ఆనాటి చెన్నపట్నం

నేను చిన్ననాడిక్కడికి వచ్చినప్పుడు చెన్నపట్నము ఈ స్థితిలో లేదు. ఎన్నియో మార్పులు నాకండ్ల యెదుటనే జరిగిపోయినవి.

ఆ రోజులలో సముద్రమునకు కోటకు మధ్య ఇంతదూరము కాళీస్థలము లేదు. సముద్రపు అలలు దాదాపు కోటగోడల వరకు వచ్చి కొట్టుకొనుచుండేవి. కోటచుట్టు ఉండే అగడ్తలనిండా నీరుండేది. ఇప్పడు స్వరాజ్య పతాకము ఎగురుచుండు స్తంభముననే అప్పుడు ఆంగ్లేయుల యూనియన్ జాక్ ఎగురుచుండెడిది. కోటయొక్క అన్ని ముఖద్వారము లందును యూరపియన్ సిపాయీలు విచ్చుకత్తులతో పహరాలిచ్చేవారు. అప్పుడప్పుడు కోట మైదానమునందు సోల్జర్ల కవాతు జరుగుచుండెడిది. ఈ కవాతును చూచుటకు పురజనులు గుంపులు గుంపులుగా పరుగిడుచుండిరి. నేను వచ్చుటకు కొంచము ముందుగానే 1884 ప్రాంతమున ప్రస్తుతము 'మెరినా' అని పిలువబడు అందమైన 'బీచి' కట్టబడినది. అయితే నాటిరోజులలో పురుషులేతప్ప స్త్రీలు బీచి షికారులకు నిర్భయముగా వెళ్లగలిగే వారు కారు. ఏలననగా అవివాహితులైన యూరపియనులు, చిన్నవయసువారు వంటరిగా నీదేశమునకు సోల్జర్లుగ వచ్చేవారు; వారిని చూచి మనదేశీయులు జంకేవారు. వారెప్పుడైన జట్లు జట్లుగా పట్నపువీధులలో తిరుగునప్పుడు నగరవాసులు పలువురు తమ ఇండ్లవాకిళ్లు మూసికొని లోపల కూర్చుండి, వారు వెళ్లిపోయిన తర్వాత తీసేవారు.

అప్పుడప్పుడే మద్రాసు హార్బరును కట్టుట ప్రారంభమైనది. నాడు సముద్రపు ప్రయాణీకులు స్టీమరు నెక్కుటకు నేడున్న సౌకర్యములు లేవు. పాత ఇనుపవారధి నుండి క్రిందనీళ్లలోనికి నిచ్చెన ఉండేది. దానిమీది నుంచి చిన్నలు పెద్దలు గడగడలాడుచు క్రిందనుండు చిన్నబోట్లలోనికి దిగేవారు. ఆ బోట్లు అలలతో కొట్టుకొనుచుండగా, కొంతదూరమున నున్న పెద్ద స్టీమరువద్దకు వెళ్లి దానిలోనికెక్కేవారు. శని ఆదివారములందు బడిపిల్లలము ఆ యినుపవారధి మీదికి షికారువెళ్లి ఈ తమాషా అంతయుచూచి ఆనందించేవారము. సముద్రుడు అనుగ్రహించి క్రమముగా వెనుకకు జరుగుచు పురజనులకు కాళీస్థలము నిచ్చుచున్నాడు. ఏమో, ఎప్పడు ఆగ్రహించి మరల ముందుకురుకునో, అప్పడేమేమి మార్పులు కలుగునో?

నేను ఈ పట్టణమునకు వచ్చినపుడు ఇక్కడి వీధులు గుంటమిట్టలుగా నుండెను. వర్షము కురిసినప్పుడు వీధుల నుండి నీరుపోవుటకు సరియైన సైడు కాలువలు లేవు; అవి పిదప సం||ములలో కట్టబడినవి. వాననీరు నడివీధులలో నున్న గుంటలలో నిండెడిది; సూర్యరశ్మికే ఆరిపోవలయును. ఆలోపల దోమలుచేరి జుమ్మని తిరుగు చుండెడివి. ఎప్పడైనా మునిసిపాలిటీవారు దోవలనుచేసి ఈ వర్షపు నిలువ నీటిని ఆవల పోవుటుక మార్గము చూపేవారు. ఇండ్లలోని మురికినీరు పోవుటకు మునిసిపాలిటీవారు పెద్దకాలువలను నడివీధులలో త్రవ్వించి గారచేయించి, పైన నల్లబండలువేసి మూసేవారు. వానకాలమున ఈరోడ్డు అడుగుకాలువలు నీటితో నిండి పైకుబికి రోడ్డంతయు నీటిమయమై తెప్పతిరునాళ్లగా నుండెడిది. ఇండ్లలో ఊడ్చిన చెత్తచెదారము వేయుటకు నాడు వీధులలో కుప్పతొట్లు లేవు. మునిసిపాలిటీవారు కుప్పబండ్లను తీసుకొనివచ్చి, గృహస్థులు వీధులలో పారబోయించు కుప్పలను వానిలోకి ఎత్తుకొని వెళ్లేవారు. ఇండ్లలో ఊడ్చిన కుప్పను, మరుగుదొడ్లలోని మలమును కూడ ఒకేబండిలోనే తీసికొని వెళ్లేవారు. గుంట మిట్టలుగల రోడ్డున ఆ బండి ఎగిరెగిరిపడుచు పోవునప్పడు దానినుండి వెంట వీధుల వెంట చింది, అసహ్యముగా నుండెడిది.

నాకు తెలిసి వీధులలొ కిరసనాయిలు దీపములను వెలిగించుట జరుగుచుండెను. ఆ దీపస్తంభములు దూరదూరముగనే యుండెను. దీపములను వెలిగించువారు ముసిసిపాలిటీ వారిచ్చిన నూనెను పూర్తిగా ఉపయోగించని కారణమున ఆ గుడ్డిదీపములు త్వరగానే ఆరిపోయేవి. పట్నం త్వరగా చీకటిపడుచుండెను. పిదప గ్యాసులైట్లు వచ్చినవి. 1910 వరకున్నూ గ్యాసులైట్లే వెల్గినవి. అప్పడు ఈ విద్యుచ్ఛక్తి దీపములు వెలిసినవి.

ఆ కాలమున చెన్నపట్నములో పాతకాలపుశెట్లు, నాయుళ్లు, మొదలియార్లు మొదలగువారందరు ఒకవిధమగు తలపాగాలను ధరించుచుండిరి. ఆ తలపాగా గుడ్డ జానెడు వెడల్పును కల్గి సుమారు 30 లేక 40 మూరల పొడవు ఉండెడిది. ఈ పాగాలు వివిధ రంగులలో యుండును. ఈ తలపాగా గుడ్డను ఆ కాలమునందు ప్రత్యేకముగ అంగళ్ల యందు అమ్ముచుండిరి. ఈ తలపాగాను చుట్టు మనిషి యింటింటికి వచ్చి తలకు వంకర పాగాను చుట్టి పోవుచుండెను. ఈ వంకరపాగా చుట్టినందుకు వీనికి ఒక అణా మొదలు రెండు అణాల వరకు కూలి ఇవ్వవలెను.

కొన్ని సంవత్సరములకు మునుపు జార్జిటవున్ గోవిందప్పనాయుని వీధిలో పట్టపగలు యిండ్లలో దొంగలు జోరబడుటకు ప్రారంభించిరి. గోవిందప్పనాయుని వీధిలో యున్న ఇండ్లు ఒకదానికొకటి ఆనుకొని వుండుటవలన ఒక ఇంటి మిద్దెమీద నుండి ఆ వీధిన నుండు మిద్దెలన్నిటిమీద సులభముగ నడవవచ్చును. ఇందువలన ఒక చోటుపడ్డ దొంగలు పక్కయిండ్లకు పోవుచు ఇండ్లలో వంటరిగనున్న స్త్రీలమెళ్లలో యుండిన నగలను కత్తిరించుకొని పోవుచుండిరి. అప్పటినుండి గోవిందప్ప నాయుని వీధిలోనేగాక యితర యిండ్లలో యుండు ముంగిళ్లకును ఇనుపపట్టాల పందిళ్లను వేయవలసి వచ్చెను. అప్పటినుండి మద్రాసులో కట్టు ప్రతి యింటి ముంగిలికి ఇనుపపట్టాల బందోబస్తున్నది. ఇప్పడు మద్రాసులో కిటికీ కమ్ములను వూడలాగి దొంగలు యింట ప్రవేశించు చున్నారు. వాననీళ్ల గొట్టముల నెక్కి యింట ప్రవేశించి దొంగతనములను చేయుచున్నారు. తలుపు తాళం వేసిన ఇండ్లలో దూరి దోచుకొని పోవుటకూడ విస్తారముగ నున్నది. ఈ దోపిళ్లు రాత్రిళ్లే గాక పగలున్నూ జరుగుచున్నవి. ముఖ్యముగా 11-5 గం||లకు మధ్య జరుగునట. ఇట్టివి జరుగకుండా నౌకర్లను కాపలాయుంచుడనియు, కానిచో ప్రక్క ఇంటివారితో చెప్పి వెళ్ళుడనియు పోలీసు అధికారులు ఉపాయము చెప్పుచున్నారు. ఆరోజులలో జార్జిటౌనునందు తలంటి స్నానము చేయించు జెట్టివాడొకడుండెను. అతని పేరు రామదాసు. ఇతడు లావుపాటి భారీమనిషి, నల్లగా పోతవిగ్రహమువలె నుండువాడు. నుదుట వెడల్పాటి నామమును ధరించి రామనామస్మరణ జేయుచు వరదాముత్తియప్పన్ వీధి (వరదాముత్తియప్ప అనే తెలుగు వైశ్యుని పేర నీ వీధి వెలిసినది. ఇతడు 18వ శతాబ్దములో నొక వర్తకుడు. తెలుగులోనే రికార్డులలో దస్కతు చేసి యున్నాడు) యందు కూర్చుండి యుండువాడు. అతడు వచ్చి తలంటిన ఆ కాలమున గొప్ప గౌరవము. వాడు చక్కగా వళ్లుపట్టి రామదాసు కీర్తనలను శ్రావ్యముగా పాడుచు దరువుతో తలంటేవాడు. ఇతడందరికి సులభముగా దొరికేవాడు కాడు. ఇతనికి చార్జి రూ. 0-4-0 మాత్రమే. ఆ రోజులలో తలంటి వళ్లుపట్టు జెట్టీలు అనేకులుండిరి గాని ఈ రామదాసుకుండిన పేరు, గిరాకి వారికి లేదు.

మరియొకడు చెవిలో గుబిలిని తీసి మందువేసిపోయేవాడు. వీడు రెండుచెవులపైనను గుబిలి కడ్డీలను, దూదిచుట్టిన పుల్లలను పెట్టుకొని వీధి వీధికి తిరుగుచుండేవాడు. చెవులలో వేయు మందుకూడ వీనివద్దనే యుండేది. ఇట్టివారిని నేడును మనము చూడవచ్చును. వీరిలో కొందరు రాళ్లను కూడ తీసి హెచ్చురేటు పుచ్చుకొనువారు. అసలు చెవులో రాళ్లు ఉండవనియు, వీరే హస్తలాఘమున గుబిలి తీయునపుడే చిన్నరాళ్లను చెవులలో వేసి పిదప తీసి చూపుచుందురనియు అందురు.

మద్రాసులో ముందు సోమరివారు అనునొక జట్టు యుండెడిది. పనిలేనివారు, పోకిరివారు, తల్లిదండ్రలు లేనివారు, ఇండ్లనుండి వెళ్లకొట్టబడిన వారు వీరందరు యీ సోమరి జట్టులో చేరుచుండిరి. మద్రాసులో పెండ్లి పేరంటములు జరుగు ఇండ్లకుపోయి పుల్లాకుల (ఎంగిలాకులు)లోని అన్నాదులను తినుచుందురు. వారి వాకిట ముందర గుంపుగచేరి డబ్బు యిచ్చు వరకు కేకలు వేయుచుందురు. రాత్రిళ్లు యిండ్ల పంచలలోను మూసివేసిన అంగళ్లముందరను పండుకొనెదరు. పట్టణం కోమట్లకు వీరిని చూచిన భయము. కోమట్లు వీర్లకు నెలజీతములిచ్చి తమ యిండ్ల ముందరను రాత్రిళ్లు పండుకొనునట్టు యేర్పాటు చేసుకొనెదరు. ఈ సోమర్లు పెండ్లి వూరేగింపులకు దివిటీలను పట్టెదరు. వెదురుబద్దల తోను, రంగు కాగితములతోను 20 అడుగుల పొడవు కల్గిన రాజు, రాణిబొమ్మలను భీకరాకారముగ తయారుచేసి లోపలదూరి వూరేగింపుల ముందర పోవుచుందురు. విరోధులుగ నుండువారిని కొట్టుటకు డబ్బిచ్చినచో వార్లను చావగొట్టి వచ్చెదరు. వీరలు కల్లుసారాయిని త్రాగకపోయినను గుంపులుగుంపులుగ చేరి గంజాయిని త్రాగుచుందురు. వీర్లలో స్త్రీలుకూడ గలరు. ఈ తెగ పురుషులందరు మొదటి ప్రపంచ యుద్ధములో ఖర్చు అయినారు. ఇప్పడువారు మద్రాసులో కనబడుట లేదు.

మద్రాసులో నాటినుండి నేటివరకు, పలువిధములగు బిచ్చగాండ్రు కన్పించుచున్నారు. వీరిలో న్యాయముగ పరుల దానధర్మములపై తప్పనిసరిగా బ్రతుకవలసిన దౌర్భాగ్యులేగాక, కృత్రిమ సంపాద్యపరులు పలువురున్నారు. ఆరోజులలోను మరకాళ్లను పట్టుకొని బిచ్చమెత్తే వారుండిరి. లక్కబొమ్మలను చేతికి తగిలించుకొని ఆడించుచు వినోదము కల్పించి బిచ్చమడిగే ఆడువారున్నూ తిరిగేవారు. కొజ్జాలనే నపుంసకులు, మద్దెల తాళములతో ఆటపాటల ప్రదర్శించుచు ఇండ్లకువచ్చి, బిచ్చెమెత్తు కునేవారు. కొజ్జాలనగ మగవారైయుండిన్నీ ఆడువారివలె వేషభాషలననుకరించే యొక విధమగు నపుంసకులు. వీరు నవాబుల అంతఃపురములలో ఘోషాస్త్రీలకు పరిచారకులుగా నుండెడివారు. వీరి ఆటపాటలు కొంత వెక్కసముగనున్నను పలువురు సామాన్యల కానందదాయకమై యుండెడివి. కండ్లుకు సుర్మా, పండ్లకు దాసిన, కొప్పున పూలు ధరించి, నడుమునకు పావడ గట్టుకొని కులుకుచు, నవ్వుచు పురుషులతో సరసము లాడుచు, మొగమొక్కట్లు, ఆడుచందములుగల వీరు హాస్యనిలయములై యుందురు. ఇద్దరు ఎరుకల స్త్రీలు తాటాకు గిలకలను అమ్ముకొనుచు, వీధులలో మూతులు పొడుచుకొనుచు సవతులు జగడమాడు దృశ్యమును చూపి చూపరుల వినోదపరచి బియ్య మడుగుకొనేవారు. గారడి విద్యలను, దొమ్మరి ఆటలను మద్రాసు నడివీధులలో చూపి బిచ్చమెత్తువారు కొందరు వచ్చుచుండిరి. పగటివేషములు వేసుకొని మోటహాస్యమును చెప్పుచు బిచ్చమునకు వచ్చువారును కన్పించుచుండిరి. అప్పుడప్పుడు ఆంధ్రదేశము నుండి మరుగుజ్ఞు వస్తాదులు కొందరువచ్చి కఱ్ఱలు, కత్తులు త్రిప్పుచు సాముగరడీలను చేసిచూపి బిచ్చము అడిగేవారు. ఒక జంగం భద్రప్ప పెద్దగంటను చేతపట్టుకొని, మరియొక చేత ఆ గంట అంచును పుల్లతో చుట్టుచుండగా గంట నాలుక గణగణకొట్టుకొను దృశ్యము చూడ చిత్రముగా నుండెడిది. ఒక తెలుగు బిచ్చగాడు బొద్దికూర అమ్ముచు - "బొద్దికూర తిన్నవారు బుద్ధిమంతులు అగుదురు; చక్కిలాలు తిన్నవారు చచ్చిపోదురు" - అనే పాట పాడుకొంటూ తిరిగేవాడు. అతడు యతి కొరకట్లన్నాడేగాని ఇది వాస్తవము కాదు. కాలిమీద మాంసం తునకను పెట్టి కట్టుకట్టుకొని పరుండి లేవలేనట్లుగ అభినయించు బూటకపు బిచ్చగాండ్లను మరి అనేక కృత్రిమ బిచ్చగాండ్లను అప్పటినుండి యిప్పటివరకు ముక్కోటియేకాదాశినాడు మద్రాసు దేవాలయములలొ చూచుచునే యున్నాను.

మద్రాసులో పీనుగలను మోయు వృత్తి నవలంబించిన వారి జట్టులు గలవు. అందరికి వలెనే వారికిని ఒక సమితి గలదు. ఈ సమాజము వారందరు యెందుకు పనికిరాక కడపట పీనుగలమోయు వృత్తిలో చేరినవారు. వీరు మద్రాసులో అక్కడక్కడ నిర్ణయ స్థలములలో నిలుచుకొని పిలుపులకు నిరీక్షించుచుందురు. కర్మకాండను జరిపించు పౌరోహితుడు పోయి ఒక జట్టును చచ్చినవారింటికి పిలుచుకొనివచ్చును. ఈ పౌరోహితునకు వీరందరు పరిచయస్తులే, వచ్చిన వాహకులు చచ్చినవారిని చూచి బేరము పెట్టెదరు. ధనవంతుడై లావుగనుండిన వాహకుల పంట పండినదే. ఒక జట్టు వచ్చినచోటికి మరియొక జట్టు రాకూడదను కట్టుబాటు వీరికి గలదు. ఈ వాహకులు అడిగినంత డబ్బు యివ్వలేక పోయినను వారిని పిలుచుకవచ్చిన పౌరోహితుడు తీర్మానించిన ప్రకారము వారు సమ్మతించి శవమును లేవదీసుకొనిపోయెదరు. ఈ పౌరోహితుని దయ వీరికి కావలసియుండును. వీరికిందులో కమీషన్ కూడ నున్నది.

ఈ దేశమునయున్న మిగత అన్ని పద్ధతులకంటె శవమును దహనము చేయుటయే మంచిపద్దతియని ఇప్పడు పాశ్చాత్యులు, నాజూకైన పద్దతి నొకదానిని కనిపెట్టిరి. ఒక పెట్టెలో శవమునుంచి తలుపును మూసి ఎలక్రిక్ స్విచ్చిని వేసిన నిమిషములో శవము భస్మమైపోవునట.

ఆ కాలమున చెన్నపట్నమున గుర్రములను కట్టు పెట్టెబండ్లు ఉండేవి. ఇవి కూర్చుండుటకు చాలా అసౌకర్యముగా ఉండేవి. ఆ పెట్టె జట్కాలు క్రమంగా మారి నేటి గూడజట్కాలు అయినవి. వీటిని వేలూరు జట్కాలు అని అప్పుడు అనేవారు. ఆకాలపు జట్కాలలో కూర్చుండిన ముందువారు వెనుకవారిమీద పడునట్లు ఏటవాలుగా నుండెడివి. ఈ పెట్టెబండ్లు, రెండెద్దులబండ్లున్నూ ఉండేవి.

నాటికి నేటికి మారనివి వంటెద్దు గూడుబండి, రేఖలాబండి. రేఖలా అనగా రెండు తేలికైన చిన్న చక్రములు కలిగియుండును. ఇరుసుపైన ఒక్కరు కూర్చుండుటకు తగిన ఆసనము అమర్చబడి యుండును. ఒక్కొక్కప్పడు ఆ చిన్నసీటుమీదనే, ముందువైపు తిరిగి కూర్చుండి బండి తోలువాని వీపునకు వీపునానించి పిల్లకాయలు కూర్చుండేవారు. దీనికి అందమైన పుంగనూరు పొట్టిఎద్దును కట్టుదురు. బండి తేలిక, ఎద్దు చురుకైనది. తోలేవాని చలాకీకొద్ది ఈ బండి అతివేగముగా పోవును. అప్పడు తరచు రేఖలా బండ్ల పందెములు జరుగుచుండేవి.

ఇవిగాక ఆరోజులలో మూడుచక్రముల వింతబండ్లుండేవి. వానిని మూడు చక్రముల త్రోపుడుబండ్లు అనేవారు. ఈబండ్లు ఆరోజులలో విస్తారముగ మధ్యతరగతివారి వద్ద ఉండేవి. గుర్రపుబండ్ల నుంచుకోగలిగిన పెద్ద గృహస్తులు కూడ చిన్న సవారీలకు ఈ బండ్ల నుంచుకొనేవారు; మార్కెట్ల సవారీకి, రాత్రి సవారికీ ఈ బండ్లనుపయోగించేవారు. ఈ బండి ముందుండు మూడవ చిన్న చక్రమునకు పడవ చుక్కానివంటిదొకటి అమర్చబడియుండును. బండిలోకూర్చున్న పెద్దమనిషి ఆ చుక్కాని చేబట్టి ఆ ముందు చక్రమును త్రిప్పుకొనుచుండును. బండిసాగుటకు వెనుకనుండి బోయీయొకడు బండి నెట్టును. సవారిచేయు పెద్దమనిషి భారీ అయినవాడైన ఇద్దరు తోసేవాండ్రుందురు. ధనవంతులు చేతికి బంగారు పెట్టుకొనే. బంగారు మురుగులు గొలుసులు నలుగురికి కనబడుటకై చొక్కాయి చేతులను పొట్టిగా కుట్టించుకొనేవారు. ఇవి ఎంతలావుగ నుండిన అంత ధనవంతుడని గొప్ప. ఆ కాలమున చెన్నపట్నములో సమీపస్థమగు ఆరణి, పొన్నేరి గ్రామముల చలవయన్న ప్రసిద్ది. ఆరోజులలో విస్తారము వాడుకలోనుండిన చాకులెట్ బొద్దంచు పంచలను ఆరణి చాకళ్ళు అంచుముడత పడకుండ నేర్పుగా చలవ చేసేవారు. మరియు నాకాలపు పురుషులును తెల్లరాళ్ల అంటుజోళ్లు, కమ్మలంతేసివి, పెట్టుకొనేవారు. ఆనాటి చెన్నపట్నపు తెలుగునాయుళ్లు, శెట్లు, ఆరణిచలవ చాకొలెట్ బొద్దంచుపంచ గట్టి, మురుగులు గొలుసులు కన్పించునట్లు పొట్టిచొక్కా తొడిగి, తెల్లరాళ్ల అంటుజోళ్లు పెట్టుకొని, ముఖమున గాత్రముగా తిరుమణి శ్రీచూర్ణములు ధరించి ఆ మూడుచక్రాల త్రోపుడు బండిలో సవారి చేయుచున్న నాటి దృశ్యమును నేనెన్నటికిని మరువజాలను.

ఇట్లుండగా మొట్టమొదట వచ్చిన కొత్తరకపు బండి మద్రాసు కోచి (Madras Coach) దాని తరువాత బ్రూహామ్ అనే పెట్టెబండి వచ్చినది. దాని వెంట బొంబాయి కోచి (Bombay Coach), ఫీటన్ (Pheaton) లాండో, లాండోలెట్, డాక్కార్ట్ అనే మరికొన్ని రెండు చక్రములు 4 చక్రములుగల గుర్రపుబండ్లు వరుసగా రాసాగినవి. ఆ పిదప ట్రాము, మోటారుకారు వచ్చినవి.

నేను మొట్టమొదట మద్రాసు కోచిని వాడుచుంటిని. ఆ పిదప బొంబాయి కోచిని వాడితిని, ఆ తర్వాత క్రమముగా ఫీటన్, లాండోలెట్, లాండో బండ్లను వాడియుంటిని. ఆమధ్యకాలమందు వేలూరుజట్కాను ఉపయోగించితిని. కొన్నాళ్లు జోడుగుర్రముల బండిలో సవారి చేయు చుంటిని. మద్రాసునకు అప్పుడప్పుడు వచ్చుచుండిన ఆస్ట్రేలియన్ గుర్రములను, పెగు పోనీలను మంచి లక్షణములుగల వానినిగా కొని కొంతకాలము నావద్దయుంచుకొని పిమ్మట మంచి ధరచూచి అమ్ముచుంటిని.

1949 ఫిబ్రవరి 1వ తేదినుండి 160 లక్షల గాలన్లనీళ్లను మాత్రమే ప్రతిరోజు కార్పొరేషన్ వారు సప్లయి చేయగలిగిరి. అనగా తల 1 కి 10 గాలన్లు లేక 2 1/2 కిర్సనాయల్ డబ్బాల నీరు మాత్రమే. మద్రాసులో ఎక్కడ చూచినను నీటిఎద్దడి కబుర్లే. అయితే ఈస్థితి ఇటీవల జనము హెచ్చుటచేత కలిగిన కొత్తసమస్య కాదు. ఇది మద్రాసు పుట్టిననాట నుండియు ఉన్నదే. 1718లోనే 'కోటకు మైలులోపల త్రాగుటకు నీరు దొరకదు' - అని యొక పాశ్చాత్యుడు వ్రాసియున్నాడు. ఆ రోజులలో పెద్దినాయుని పేట ఉత్తరభాగముననున్న బావులనీటిని ఎద్దులపై సిద్దెలతో తెచ్చి అమ్మేవారు. 2 దుడ్డులకు ఒక్కబిందెడు నీళ్లు అమ్మేవారు. దుడ్డు అనగా 5 రాగికాసులు లేక 2పైసలు. సెయింట్ థామస్ మౌంట్లో దొరుకు నీరువలె చల్లగాను, హితువుగాను ఉండేవని ఆ రోజులలో వాటికి ప్రతీతి.

1770 ప్రాంతంలో నీటి ఎద్దడివల్ల ఊరిలో కలరా జాడ్యము చెలరేగినది. 1772లో పెద్దినాయకుని పేటలో ఉండే 7 బావులనుండి రెండుమైళ్ల దూరముననున్న కోటకు (సముద్రమున కొక్క మైలు దూరము) మంచినీరు సప్లయిచేసే స్కీము నేర్పాటు చేసిరి.

నిజమునకివి 10 బావులు. ఈ బావులన్నియు 16 అ||ల మధ్య కొలత గలవి. 23 మొు 29 అడుగులలోతు. పికోటాలతో నీరుపైకి తెచ్చి ఎత్తునగట్టిన తొట్టలో నిలువచేసి, యంత్ర సాధనమున వడియగట్టుట కేర్పాటు. అట్టు వడియగట్టిన నీటిని పెద్ద గొట్టములద్వారా కోటలోను వెలుపలను ఉన్న మిలిటరీవారికి నీటి సప్లయి చేయుచుండిరి. ఈ బావులలో నీరు ఎప్పడూ సమృద్దే. మరి ఒక్క శతాబ్దమునకుగాని ఎర్రకొండలచెరువు (Red Hills Tank) ఏర్పాటు జరుగలేదు. ఆ శతాబ్ద కాలములో నిరంతరం ఈ బావులు నీటిని సప్లయి చేసినా నీరు తరుగలేదు. 1885లో గాలివానవచ్చి ఎర్ర కొండల చెరువు వద్ద యంత్రములు చెడిపోయినప్పుడు 10 రోజులు నగరమున చాలామందికి ఈ నీరు సప్లయి అయినది.

1783-87 సం||ల మధ్య ఈ ఏడుబావుల నీటినే కొళాయిలద్వారా కోటలోను వెలుపలను మిలిటరీకానివారి ఇండ్లకును సప్లయిచేసిరికాని దీనిని యూరపియనులు, హైందవులునుకూడా ఇష్టపడలేదు. యూరపియనులు బహుశా తమకు నీరు తగ్గునని తలచి యుందురు. హైందవులు, యంత్రములలో సప్లయి అయ్యే నీరు వాడుట అనాచారమని ఇష్టపడ కుండిరట. పురాతనముగా, దూరమైనా, తాము తెప్పించుకొనే మంచినీరే తెప్పించుకొని త్రాగుట, తమ దొడ్లలోనుండు బావులలోని నీరే వాడుకొనుట విడువకుండిరి.

నేను మద్రాసునకు వచ్చుటకు ముందు ఉన్న పరిస్థితులు దుర్భరముగా ఉండేవట. పట్నం విస్తారంగా పెరిగినది. పరిసరములగల 16 గ్రామములు కలిసి పట్నమైనది. 1871 జనాభా లెక్కలలో (అదియే వాస్తవమైన మొదటి జనాభాలెక్క) 4 లక్షల దాకా జనాభా కన్పించుచున్నది. జనాభా ఎక్కువగ పెరిగినప్పటికిని శతాబ్దము నాడున్న నీటి వసతేగాని చిరకాలము క్రొత్తవసతి యేమియు యేర్పడలేదు. పూండీ చెరువు స్కీమున్నూ పట్నమున గల జనాభా నీటికరువును తీర్చజాలకున్నది.

దూరాభారమునుండి నీరు తెచ్చుకోలేనివారు, స్వంతబావులు లేనివారు అయిన పేదసాదలేగాక, అగ్రజాతులవారుకూడా ఆచారమునకై దేవాలయములనంటిన చెరువులలోను కోనేళ్లలోను నీరు వాడుకొనేవారు.

నీటి యొద్దడి తీర్చుటకున్నూ, పరిశుభ్రమైన నీటిని సప్లయి చేయుటకున్నూ, ప్రభుత్వమువారు 1861 నుండి ఆలోచన లారంభించిరి. స్కీములు వేసిరి. ఏడుబావుల నీరున్నూ పరీక్ష చేయించి, అందులో కూడ అపరిశుభ్రతయున్నదని అనుమానించిరి. కడకు ఎర్రకొండల చెరువు, చోళవరం పంటచెరువులు కలిపిన స్కీము 1866లో అంగీకృతమై ఆరేండ్లలో ముగిసినది. ఆ చెరువునుండి శాస్త్ర పద్దతిని నీరు తెచ్చి కీలుపాకులో సముద్రమట్టమునకు 44 అడుగుల ఎత్తున ట్యాంకులు కట్టి, నీరు నిల్వచేసి వడియగట్టి, ఊరికి సప్లయి చేయ నారంభించిరి. ఇది 13-5-1872న గవర్నరు నేపియర్చే ప్రారంభింపబడినది.

అనగా నాపుటుకలతో ప్రారంభమైన కొళాయినీరు నేను మద్రాసు వచ్చేటప్పటికి బాగా వ్యాప్తిలోనికి వచ్చినది. కాని కొళాయీలలో వచ్చే నీరు పరిశుభ్రముగా నుండేది కావు. చిన్నపురుగులు చేపలు వగైరా జీవములు వచ్చుచుండెను. ఆ కారణమున మద్రాసులోయున్న ధనికులు కొందరు పేరుపొందిన కొండూరు బావి నీరును (విల్లివాకం), టాకరు సత్రమున నుండు బావి నీరును తెప్పించుకొని త్రాగేవారు. ఈ రెండు స్థలములనుండు నీరు చాలా ఆరోగ్యకరమని ఆ కాలపు డాక్టర్లు చెప్పుచుండిరి. ఈ బావుల నీటిని బ్రాహ్మణులు పీపాయిలలో తీసుకొనివచ్చి కావలసిన వారికి బిందె 1కి అణావంతున ఇంటింటికి ఇచ్చి పోవుచుండిరి.

1940-41లలో మద్రాసులో నీటి సప్లయి వృద్ధిచేయుటకై ఎర్రరాళ్ల చెరువునకు తోడు పూండి చెరువును చేర్చిరి. కాని ఈలోపల జనము రెండు రెట్లకు మించి పోయినది. కావున ఎండాకాలమున మనిషి 1 కి ఒక్కకిరసనాయిలు డబ్పాడు నీళ్లు దొరుకుట దుర్లభమైనది.

నేను ఇచ్చటికి వచ్చినది మొదలు ఎన్నియో మార్పులు చెందినవి. కాని ఏ మాత్రము మార్పు చెందనివి మూడు : కొళాయిలలో అపరిశుభ్రమైన నీరు; కూవమునది దుర్గంధము; దేవాలయపు కోనేళ్లలో పేరుకొన్న పాచి.