చిన్ననాటి ముచ్చట్లు/కొందరు వ్యక్తులు

వికీసోర్స్ నుండి

1O

కొందరు వ్యక్తులు

ఆ కాలమున బ్రాహ్మణులలో ప్రసిద్ధికెక్కిన భాగ్యవంతుడు ధర్మాత్ముడు మందపాటి రామకృష్ణయ్యగారు. వీరికి మద్రాసులో అనేక కట్టడము లుండెడివి. అమంజికరెలో ఒక వుద్యానవనమును అందులో దివ్యమైన భవనము నుండెడివి. అప్పుడప్పుడు ఆ తోటకు స్నేహితులతో కూడ వచ్చి కేళీవిలాసాదులతో కాలము గడుపుచుండేవారు. వీరు కీ|| శే|| విజయనగరం మహారాజా ఆనందగజపతివారికి స్నేహితులు. రాజకళతో నొప్పు వీరు శ్రీ మహారాజావారి సరసన కూర్చుండి, జోడుగుర్రాలబండిలో తిరువత్తియూరు దేవాలయమునకు వెళ్లునపుడు చూడముచ్చటై దారిపొడవున జనము విరుగబడి చూచేవారట. వీరి భార్యగారు ఏడువారముల సొమ్ములు, అతి విలువ గలవి ధరించేవారట. వీరికి స్నేహితులు జాస్తికాగా, వారికుండిన ధనాదులు హరించిపోయినవి.

డాక్టరు వరదప్పగారిది బ్రహ్మసమాజపు మతము. సుమారు 6 అడుగుల ఎత్తున ఒడ్డూ పొడవుగల భారీమనిషి పెద్ద గడ్డమును గలవారు. బర్మాయుద్దములో పనిచేసిన వారు. వీరు ముఖ్యముగ ప్రసవముల చికిత్సలకు పేరుపొందినవారుగ నుండినను అన్ని వ్యాధులను సమర్థతతో వైద్యము చేయుచుండిరి. చనిపోయిన డాక్టరు రంగాచారికి యుండిన ధర్మబుద్ధి ఆ కాలమున వరదప్పగారికి యుండెను. పేదవార్లను దయతో చూచి ధర్మముగ చికిత్సను చేయుచుండెను. ఇంటికి వచ్చినపుడు డబ్బిచ్చిన (Visiting fee) వారు పేదవారని తోచినచో ఆడబ్బును వారికి మరల యిచ్చి రోగికి పాలకు, గంజికి ఖర్చుపెట్టమనేవారు. విద్యార్ధులకు సహాయము చేయుచుండువారు. దాత; దయాపరులు. వారు స్థాపించిన అనాథ శరణాలయము యిప్పుడు తిరువత్తియూరు హైరోడ్డులో యున్నది. వీరి వైద్యశాల మొదట బ్రాడ్వేలో యుండెను. తరువాత మౌంటురోడ్డులో.

ఆ కాలమున హాలరు డాక్టరు కూడ ముఖ్యముగ కోమట్లలో చాల పరిచయము పలుకుబడి గలిగియుండెడివారు. వారు ఆంగ్లోయిండినులు. చాల పొట్టిగ సన్నగ యుండిరి. మంచి డాక్టరని పేరు. ఇంటికి వచ్చిన చిట్టికథలను చెప్పి రోగిని నవ్వించును. అతనికి యొక పాతబ్రూహాం బండి, ముసలి గుఱ్ఱము ఉండెడివి. ఆ బండి మనిషి నడక కంటె అధిక వేగముగ పోజాలదు. ఆ బండిలో కూర్చుని వారు యెప్పుడును యేదో వ్రాసుకొను చుండువారు. మద్రాసులో సోడా తయారుచేసి విక్రయించిన వారిలో వీరే మొదటివారు. హాలరు సోడాయనిన యిప్పటి స్పెన్సరు సోడా వలె పేరు పొందినది.

చెన్నపట్టణము అన్నిజాతులకు కూడలి స్థలమైనను బ్రాహ్మణులకు ప్రత్యేకముగ అగ్రహారములున్నవి. కొల్లావారి అగ్రహారం, క్రిష్ణప్పనాయుని అగ్రహారం, ఏకామ్రేశ్వర అగ్రహారం, రావిచెట్టు అగ్రహారం మొదలగునవి యును, మరికొన్నియును గలవు. ఇప్పడా అగ్రహారములలో బ్రాహ్మణులు తక్కువ; బ్రాహ్మణేతరులు అధికముగా నివసించుచున్నారు.

ఏకామ్రేశ్వర అగ్రహారములో ప్రసిద్ద పురుషుడగు రంగనాథ టాకరుగారు గొప్ప నగల వ్యాపారమును చేయుచుండిరి. వీరు గుజరాతి బ్రాహ్మణులు. మొదట తన యింటిలోనే యీ వ్యాపారమును ప్రారంభించి కొడుకలు పెద్దవారై ప్రయోజకులు కాగానే మౌంటురోడ్డులో గొప్ప భవనమును నిర్మించిరి. అక్కడ బంగారు, వెండి సామానులను నవరత్నములలో పొదుగబడిన వివిధ ఆభరణాదులను తయారుచేసి వ్యాపారమును చేయుచుండిరి. వీరికి ముఖ్య ఖాతాదారులు రాజులు, మహారాజులు, జమీందారులు, లక్షాధికార్లు. ఈ ఖాతాదార్లు మద్రాసుకు వచ్చినప్పుడు నివసించుటకు వీరు టాకరు గార్డెన్ యను గొప్ప బంగాళాను నిర్మించిరి. మద్రాసుకు వచ్చిన రాజులు ఆ భవనమున కొంతకాలము బసచేసి పోవు సమయములో టాకరు కంపెనీవారు వార్లకు అమూల్యములగు కొన్ని ఆభరణములను విక్రయించెదరు. ఆభరణములకు వెల కంపెనీవారు నిర్ణయించినదే. ఈ ప్రకారము వారు కొన్ని సంవత్సరములు కోట్లకొలది వ్యాపారమును చేసి కడపట కంపెనీని మూయవలసి వచ్చినది.

మోసస్ కంపెనీ మౌంటురోడ్డులో యుండెను. వీరు రాజులకు మహారాజులకును కావలసిన స్టేటు డ్రస్సులను (State Dresses) వెలగల యితర వుడుపులను కుట్టించి వారికి సప్లయి చేయుచుండెడివారు. ఈ కంపెనీకి స్వంతదార్లు వైశ్యులలో పేరుపొందిన శీతారామశెట్టిగారు. ఈ కంపెనీవారు రాజులకు ఉడుపులను కుట్టి లక్షలాదులు సంపాదించిరి. టాకరు కంపెనీవారు ఆభరణములను, మోసస్ కంపెనీవారు ఉడుపులను రాజులకు సప్లయిచేసి పేరుప్రతిష్టలు గడించిరి. కొంతకాలమునకు వీరును షాపు తలుపులను మూసిరి.

తిరువత్తియూరు హైరోడ్డులో తంజావూరు రామానాయుని సత్రమును, దానినంటి అగ్రహారమున్నూ గలవు. ఈ రామానాయుడు చాల బ్రాహ్మణభక్తిపరుడు. దైవభీతి కలవాడు. ఇచ్చట తండియార్పేటలోనే గాక తిరువళ్ళూరు, కాంచీనగరములందును ధర్మసత్రములను వేసియున్నాడు.

రామానాయుని కుమారుడు రంగయ్యనాయుడుగారు 1822 సం|| డిశంబరు 7వ తేదికి సరియైన చిత్రభాను సం||రము కార్తీక బహుళ నవమినాడు తెలుగులో వ్రాసియుంచిన వీలునామా చూడగా వారి దానధర్మములను, రంగయ్యనాయుడుగారి బ్రాహ్మణభక్తి, దైవభీతి, శీలసంపత్తి మున్నగునవియున్నూ స్పష్టమగుచున్నవి. తండియార్పేటలోని సత్రమున ఆ రోజులలో 160 మంది పరదేశీలను, విద్యార్ధులను, 60 మంది నౌకర్లను మూడుపూటల ఇష్టమృష్టాన్న భోజనమున తృప్తుల గావించుట కేర్పాటు చేయబడియుండెను. ఇచ్చట విద్యార్థులకు భోజనముపెట్టి, పండితులచే వేదశాస్త్రములను చెప్పించేవారు. తిరువళ్ళూరు, కాంచీనగరము లందలి ధర్మసత్రములందు 12 సి మంది బ్రాహ్మణ బాలురు భోజనవసతి గల్గి వేదాధ్యయన మొనర్చుచు, ధర్మశాస్త్రములను పఠించుచుండిరి. ఆ వీలునామా యందంతటను శ్రీరామనామస్మరణ విరివిగా చేయబడినది. పవిత్రమైన శ్రీరామనామ మాహాత్మ్యమువల్లనే మనవంశాభివృద్ధి. మన పూర్వులచే స్థాపింపబడిన ధర్మాభివృద్ది సాగుచున్నవి. ఆ రాముడే మీకు భవిష్యత్తునందు సంరక్షకుడు. నిరంతరము రామనామము జపమొనర్చుటకై ఇద్దరు బ్రాహ్మణులను మనయింట ఏర్పాటుచేసియున్న సంగతి మీకు తెలియును. మీరును అట్లే నిరంతరము శ్రీరామనామజపము గావించు బ్రాహ్మణులను ఏర్పాటు చేయవలసినది' అని ఆవీలు నందు వ్రాసి యున్నారు. ఈ సత్రము పరిపాలన విషయమై కోర్టువారును ఒకటి రెండు సార్లు జోక్యము కల్పించుకొని స్కీములు నిర్మించియున్నారు.

ఇట్టివే, అన్నసత్రములు మరికొన్ని మద్రాసు చుట్టుప్రక్కలనున్నవి. తిరవత్తియూరు నందు, తిరువళ్ళూరు నందు యాత్రికుల వసతి కొరకు ఎన్నయినా సత్రములున్నవి.

పూర్వము చెన్నపట్నం సమీపమున కొండూరు అని ఒక చిన్నస్టేషన్ ను ఉండెడిది. ఆ ఊరినే ఇప్పుడు విల్లివాకము స్టేషనుగ మార్చినారు. ఈ కొండూరు నందు విశాలమైన ధర్మసత్రములున్నవి. ఇక్కడొక బావినీరు చాలా ప్రశస్త్రమైనదని ప్రతీతి. అందుచే మద్రాసునుండి అనేకులు అచ్చటికి పోయి వివాహాది శుభకార్యములు చేసుకొనుచుండిరి. ఇప్పడు మద్రాసులో పనులు గలవారు ఇండ్లను నిర్మించుకొని ఆరోగ్యమునకై అక్కడ నివసించుచున్నారు.

మద్రాసులోనుండు జనులు చాలవరకు బాడుగ యిండ్లలోనే నివసించువారగుటవలన, యెవరైనను ఆయింటిలో చనిపోయిన కర్మాంతరములను జరిపించుటకు యితర కాపురస్తులు ఒప్పకొనేవారుకారు. ఈ కారణమువలన మద్రాసులోనివారు చాల యిబ్బంది పడుచుండిరి. ఈ కార్యములను చేయుటకు ధర్మసత్రములను యిచ్చెడివారు కారు. ఇట్టి కష్టములను ముఖ్యముగ బ్రాహ్మణులే అనుభవించుచుండిరి.

ఈ కష్టములను చూచి యొక బ్రాహ్మణోత్తముడు రాయపురములో ఒక చిన్న తోటను అందు ఒక యిల్లును ఇచ్చి, ఈ కార్యములను అక్కడ చేయుటకు తగు యేర్పాటులను చేసి పుణ్యమును కట్టుకొనెను. ఈ బ్రహ్మతీర్ధమునందు బ్రాహ్మణులు మాత్రమే అపరక్రియలను జరుపుకొన వచ్చును. ఈ చిన్నప్రదేశము ఇప్పడు బ్రహ్మాండమైన బ్రహ్మసత్రముగ మారినది. గనుక ప్రతిదినము ఈ బ్రహ్మసత్రమునందు పది పన్నెండుకర్మలు జరుగుచున్నవి. వీరందరికి ఇక్కడ తగువసతులు యేర్పాట్లు గలవు. అందరికి కావలసిన పాత్రసామానులు కూడ యిక్కడ యిచ్చెదరు. కొందరు ధనికుల కర్మలను ఇక్కడ జరిపించిన పిమ్మట చనిపోయిన వారి పేరట ఒక చిన్నయింటిని ఈతోటలో కట్టించి యిచ్చెదురు. ఈ ప్రకారము ఈతోటలో వసతులు పెరిగిపోవుచున్నవి.

పల్లెటూళ్లలో చనిపోయినవారి కర్మ చేయించుటకు, బ్రాహ్మణార్ధములకు ముత్తయిదువులు మొదలగు వార్లకు చాల కష్టపడవలయును. ఈ బ్రహ్మతీర్ధమునందు ఆలాటి కష్టములు పడవలసిన పనిలేదు. పురోహితులు, బ్రాహ్మణార్ధపు బ్రాహ్మణులు, ముత్తయిదువులు, దానములను పట్టువారు వీరందరూ కూడ అక్కడ హాజరుగ నుందురు. పది కర్మాంతరములకు సరిపోవు వారందరు ఇక్కడ సులభముగ లభించెదరు. కర్మచేయు యజమాని స్నానము చేయుటకు ఇక్కడ గుంట గలదు. పురోహితునకు కావలసిన దర్బ ఈ తోటలోనే పెంచుదురు. సమిథల పుల్లలు దొరుకు వృక్షములన్నియు ఈ తోటలోనే యున్నవి. శిలాప్రతిష్టకు మంచిరాళ్లు యిక్కడనే దొరకును. కర్మనంతయు కంట్రాక్టుకు తీసుకొని జరిపించే పురోహితులుకూడ ఇక్కడ వున్నారు. నిత్యకర్మ చేయునప్పుడు పిండమును తినుటకు చనిపోయినవారిని స్మరించి కాకులను పిలువనవసరము లేదు. ఇక్కడనే చెట్టమీద వేలువేలు పెంపుడు కాకులున్నవి. ప్రతిదినము పిండములను తినుచు చెట్లమీదనే కాపురము చేయు ఈ కాకులు బలిసి యుండును.

మద్రాసులో, భర్త చనిపోయిన స్త్రీని కాపురముండు యింటికి రానివ్వరు. గనుక ఈ స్త్రీలకు బ్రహ్మతీర్ధమునగల ఇండ్ల చాలా వసతిగను మహోపకారముగను నున్నవి.

ఈలాటి ధర్మములను చేసిన పుణ్యపురుషులే నిజముగ సంఘసేవకులు. ఈ సందర్భమున ఒక చిన్న విషయము.

బరంపురం కాపురస్తులగు మారెళ్ల గంగరాజుగారు మద్రాసుకువచ్చి డాక్టరు రంగాచారి నర్సింగుహోములోచేరి వ్రణచికిత్సను పొందుచుండిరి. వారి వ్రణమును ఆపరేషన్ చేసిన పిమ్మట ఆ నర్సింగుహోములోనే వారు చనిపోయిరి. వారి భార్య, కొడుకు వగైరాలు వారితో కూడనే మద్రాసు నందుండిరి. వారి బంధువులు కూడ మద్రాసులో కొందరుండిరి. గంగరాజుగారు నాకు స్నేహితులగుటవలన నేనుకూడ ఆ సమయమున వారితో కూడ ఉంటిని. వారు ఈ వూరికి క్రొత్తఅగుటవలన దహన సంచయనాది కార్యములకు నేను సహాయపడి ముగింపించితిని.

వారి భార్య అప్పుడు వైద్యశాలను విడిచిపెట్టవలసివచ్చినది. ఆమె ఉండుటకు మద్రాసులో స్థలము దొరకదాయెను. ఆమె దగ్గర బంధువులుకూడ ఆమెను వారిండ్లకు తీసుకొనిపోరైరి. అప్పడామెను మా యింటికి తీసికొనిపోయి ఆదరించితిని. వారి బంధువులు ఇతరులుకూడ ఆమెను మాయింటికి తీసుకపోకూడదని నాకు బోధించిరి గాని నేను వినలేదు. మన సంఘములోనున్న ఇటువంటి దురాచారములను అడుగంటునట్టు చేయుటయే సంఘసేవ.

'ఆమెను మీ యింటికి తీసుకొనిపోయిన మీ యింటిలో కీడు సంభవించునని' బోధించినవారు ఇప్పడు లేరు. ఆ తల్లి సుఖముగ బిడ్డలతో కూడ బరంపురంలోయున్నది. ఈమె కాకినాడ కాపురస్తులగు పోతాప్రగడ బ్రహ్మానందరావుగారి పెద్ద కుమార్తె.