చిన్ననాటి ముచ్చట్లు/మా ఊరు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

11

మా ఊరు

నేను చిన్నతనమున మద్రాసుకు వచ్చిన పిదప అప్పుడప్పుడు మావూరగు ఇనమనమెళ్ళూరికి పోవుచుంటిని. రైలు సౌకర్యము లేనప్పుడు ఉప్పు కాలువ (Buckingham Canal) లో పడవల మీద ప్రయాణమును చేయుచుంటిని. ఆ కాలమున మద్రాసులో బోటు యెక్కిన కొత్తపట్నం రేవుకు 10, 12 దినములలో చేరుచుంటిమి. బోటు చార్జి మనిషికి ఒక రూపాయి మాత్రమే. అయితే ఈ ప్రయాణమునకు కావలసిన భోజన పదార్ధములను చిరుతిండ్లను సమృద్దిగ తీసుకొనిపోవలయును. వంగవోలు ప్రాంతముల నుండి వచ్చినవారు కొందరము చేరి యీ పడవ ప్రయాణమును చేయుచుంటిమి. ఇందు స్త్రీలు, పురుషులు, బిడ్డలు యుందురు; పడవ నడుపు సరంగులుందురు. దక్షిణపుగాలి యుండిన, పడవకు చాప నెత్తిన, పడవ వేగముగ పోవును. ఈ చాపను ముతకగుడ్డతో తయారుచేయుదురు. గాలి లేనప్పుడు పడవ సరంగులు గడలను వేయుచు పదములను పాటలను పాడుచు పడవను నడిపించెదరు. గడలను వేసి అలసినప్పుడు బోటుకు మోకును గట్టి లాగుకొనిపోయెదరు. కొన్ని సమయములందు ప్రయాణీకులుగూడ పడవ దిగి సరంగుతో కూడ పడవమోకును లాగుచుండెదరు. ఉప్పుగాలి సోకుటవలన ఆకలి అమితముగ నుండును. నీళ్లవసతిగల చోటుచూచి వంటచేసుకొనుటకు పడవను నిలిపెదరు. మేము పడవను దిగి సమీపమున యుండు మంచినీళ్ల బావివద్దకుపోయి స్నానము చేసి. చెట్టుచాటుననో, గుట్టచాటుననో పొయ్యిబెట్టి, పుల్లలను యేరుకొని వచ్చి అన్నమును మాత్రము వండుకొనువారము. గాలివలన మంట తప్పెలకు సరిగ తగలనందున కొన్ని సమయములలో అన్నము సరిగ పక్వముగాక ననుబాయ అగుచుండును. ఇంటినుండి వచ్చునప్పుడు ప్రయాణీకులందరు కమ్మపొడి, మినుముల చింతపండు పచ్చడి, చింతకాయ పచ్చడి వగైరాలనుకూడ తెచ్చుకొనెదరు. కుట్టుడాకులు కూడ యుండును. పచ్చళ్లు విసుగు పుట్టినప్పుడు పచ్చిపులుసును చేసుకొనెదము. ఆకాలమున నెయ్యి చౌక గనుక సమృద్దిగ నెయ్యిని తెచ్చుకొనుచుంటిమి. సమీపమున పల్లెలుండిన మజ్జిగ దొరుకును. అందరము భోజనముచేసి మిగిలిన అన్నమును రాత్రికి మూటగట్టుకొని, తప్పెలను తొమి, దానినిండుగ మంచినీటిని తీసుకొని పడవ చేరుదుము. పడవలో కూర్చుని కూరుకునుకు పట్టించెదము. పడవ సాగును. చల్లబడిన పిమ్మట అందరము పడవ పై భాగమున చేరుదుము. పైన గాలి చక్కగ వీచునప్పుడు ఆనందముతో పాటలు పద్యములను పాడుచుందురు. మాతో కూడ ఒక లాంతర యుండును. రాత్రికాగానే అన్నము మూటను విప్పి ఒక భాగ్యశాలి అన్ని పచ్చళ్లను యొకటిగ కలిపి కదంబము చేసి పెద్ద అన్నపువాయను కలిపి చుట్టు కూర్చున్న వారిచేతులలో ముద్దలుపెట్టును. పిడచ లగుటవలన పలుమారు నీరు త్రాగవలసి వచ్చును. వెన్నెలరాత్రి అయిన మరల పడవ పైకిపోయి నిద్రవచ్చువరకు కబుర్లు కథలు చెప్పుకొనుచుండి పిమ్మట దిగి నిద్రించెదము. ఈ ప్రకారము పడవ ప్రయాణము ఆ దినములలో చేయుచుంటిమి. ఈ పడవ ప్రయాణములలో కలిగిన ఆనందమును, ఆకలిని, భోజనము రుచిని యిప్పుడు తలుచుకున్న నేను అప్పటివాడనేనా యని సందేహము కలుగుచున్నది.

కొత్తపట్నం రేవులో పడవదిగి వంగోలుకుపోయి అక్కడ మా పెత్తండ్రి యింట్లో బసచేసి మరునాడు మావూరికి వెళ్లునప్పుడు ఒంగోలు నుండి వేడివేడి శనగపప్పును, ముంత ఖర్జూరపుపండును తీసుకొనిపోవు చుందును. నా అత్తగారికి మద్రాసు మిఠాయి దినుసులు సరిపడవు. మావూరికి నేను పోవునప్పుడు గజ్జలగుఱ్ఱపు జట్కాబండిమీద పోవు చుందును. నా బండి వూరికి సమీపించగనే తహసీలుదారుడు వచ్చుచున్నాడని గ్రామమునసబు, కరణము, ముదాం మొదలయినవారు నడుములకు గుడ్డలనుచుట్టి దండములనుపెట్టుచు బండిని సమీపించుచుండిరి. తీరా నన్ను గుర్తించి 'ఈయన మహాదేవయ్య అల్లు' డని దిగాలపడి పోవుచుండిరి. ఇంటివద్ద బండి దిగగానే అత్తగారు ముందు నా మూటలను సవరించును. భోజనము వేళ కాగానే దొడ్డిలో యుండు ఎండకాగునీళ్లతో స్నానమును చేయమని చెంబును కుండవద్ద పెట్టును. స్నానము చేయుటకు,ప్రత్యేకముగ ఈ వూరిలో స్తలము యుండదు. కనుక గోడలు లేని దొడ్డియే స్నానముకు మరుగు స్థలము. నేను స్నానము చేయునప్పుడు యిరుగుపొరుగువారు నావద్దకు వచ్చి మద్రాసు సమాచారములను అడిగేవారు. ఆకాలమున సబ్బుతో వళ్లు రుద్దుకొనుట వింత. ప్రతివారు దగ్గరకు వచ్చి సబ్బును వాసన చూచి పోయేవారు. ఈసారి వచ్చినపుడు తమకొక సబ్బుబిళ్ళను తెచ్చి పెట్టమనేవారు. మద్రాసునుంచి నేనొక చిన్న అత్తరుపెట్టెను తీసుకపోతిని. ఆపెట్టెలో ఆరువిధములైన అత్తరు బుడ్లు అత్తరు బిళ్లలు యుండెడివి. మాకు పాలు, పెరుగు, కూరగాయలు, పచ్చి శెనగమండలు, సజ్జకంకులు వగైరాలు సప్లయి చేయు కాపువారు నావద్దకువచ్చి అత్తరువును పూయించుకొని పోవువారు. వారందరు నన్ను 'నరసయ్య' యని పిలిచేవారు.

చెదలవాడ మా వూరియేటి ఆవల వడ్డుననే యుండును. చైత్రమాసములో శ్రీరామనవమికి శ్రీరాములు ఉత్సవము చెదలవాడలో జరుగును. ఈప్రాంతములకంత ఈ ఉత్సవము ప్రసిద్దమగుటచే పొరుగూరి నుంచి వేలకొలది జనులు సంబరమును చూచుటకు వచ్చెదరు. ఇక్కడ వరిగబియ్యముపిండితోను, బెల్లముతోను తయారుచేసిన మిఠాయి, ఏలకవుండలు, రంగుమిఠాయి, వేడిగారెలు మొదలగునవి అమ్ము అంగళ్లుండును. దూది నిమ్మకాయలను అమ్ముదురు. నులకవుండలు, పట్టెమంచములు, ముల్లుకఱ్ఱలు, ఎద్దుల మెడపట్టెలు, నవారు బిళ్ళలు, పశువుల పలుపులు, మోటతోలు మోకులు మొదలగువాటిని కూడ యిూ తిరునాళ్లలో అమ్ముచుండిరి. ఇది యొక విధముగ గృహపరిశ్రమల ప్రదర్శనము అనవచ్చును. ఇక్కడ అమ్ముచుండిన మల్లెపూలదండల వాసనను యిప్పటికిని నేను మరువలేదు. ఇది వేశ్యలుండు స్థలము గనుక చాలాదూరము నుండి పెద్ద మనుష్యులు వచ్చుచుండిరి. స్వామి రథోత్సవమునాడు బ్రాహ్మణ సంతర్పణ జరుగును. ఆ సంతర్పణకు యిప్పుడుకూడ నేను కొంత ద్రవ్య సహాయమును చేయుచున్నాను.

మా వూరిలో శివాలయము, విష్ణ్వాలయము రెండు దేవాలయము లున్నవి. శివాలయము గర్భగుడిగోపురమువైన బండబూతు చిత్రములు సొగసుగ చెక్కబడియున్నవి. ఈ చిత్రములను చూచుటకు పెద్దలు చిన్నలు కూడ చేరి చూచి సంతోషించుచుందురు. ఈ దేవాలయపు అర్చకుడు తంబళాయన. వైద్యమును చేయును. విష్ణ్వాలయపు అర్చకుడు నంబిఆయన. ఈ నంబి అర్చకుడుకూడ వైద్యుడే. ఈ వూరిలో యీ అర్చకులిరువురు వైద్యమును చేయుచుండెడివారు. సాధారణముగ పల్లెటూర్లలో నంబితంబళులే గ్రామవైద్యులు. ఈ విష్ణ్వాలయ ముఖద్వారమునకు పెద్దతలుపులను నేను చేయించి యిచ్చితిని. ఈ దేవుళ్లు పార్వేటకు (శమీపూజకు) వెళ్ళునప్పుడు స్వాములవెంట వూరి రంగిరీజులు వార్ల యిండ్లలో పురాతనముగ యుండు కత్తులు, బాకులు, ఈటెలు మొదలగు పురాతనపు యుద్ధసాధనములతో వెంట వచ్చెదరు. ఈ పాత ఆయుధములు వీరికి యెట్లు లభించినవో? విజయదశమినాడు ఆయుధములకు మెరుగుబెట్టి పూజించి నమస్కరించెదరు. ఈ వూరి ప్రక్కనున్న కమ్మయేరు వూరిని క్రమముగ మ్రింగుచున్నది. దేవాలయములను కూడ కబళించుటకు గుండ్లఏరు సమీపించుచున్నది.

కోటప్పకొండయను శివక్షేత్రమొకటి గుంటూరుజిల్లా నర్సారావుపేట తాలూకాలోనున్నది. మ్రొక్కుబళ్లకు తిరుపతి కొండ వంటిదే కోటప్పకొండయున్నూ. ప్రతి శివరాత్రినాడు ఆ కొండకు వేలకొలది జనులువచ్చి శివుని దర్శించి పూజించిపోయెదరు. వారి వారి మ్రొక్కుబళ్లను కోటయ్యకు చెల్లించెదరు. ఈ క్షేత్రము ఆంధ్రదేశమున పెద్దపేరు గాంచినది. గుంటూరు జిల్లాలో మెట్టతాలూకాలందలి రైతులు వ్యవసాయమునకు ముఖ్యమైన ఎడ్లను బిడ్డలవలెనే పెంచెదరు. గృహ యజమాని జొన్నన్నమును ముద్దలు చేసి మింగునపుడు చనువు కొలది కోడెదూడ లతని వద్దకు వచ్చి, అతడు కంచమునుండి ఎత్తి నోటికందించు ముద్దలను తినిపోవుచుండును. అట్టి ఎడ్లకు, బిడ్డలకు జబ్బు చేసినపుడా రైతులు కోటయ్యకు ప్రభలు కట్టుకొని కొండకు నడిచెదమని మ్రొక్కుకొందురు. ఈ మ్రొక్కుబళ్లను చెల్లించుటకు అనేక గ్రామములనుండి రెండెద్దుల బండ్లమీద ప్రభలను గట్టి వాటిని చిత్రవిచిత్రములగు రంగుగుడ్డలతో శృంగారించెదరు. ప్రభయనగా వెదురు బొంగులతో రెండెడ్లబండ్ల గానులమధ్య అమరుటకు తగిన వెడల్పుతో సుమారు 10 అడుగుల పొడవున చట్టముగా కట్టుదురు. మధ్య మధ్య చీల్చిన అడ్డబద్దలు వేసి బిగింతురు. పై అంచున త్రికోణాకారముగా నమర్చెదరు. ఆ చట్టమునకు గుడ్డలను కట్టుదురు. దానిపై రంగుగుడ్డలను తోరణములను చిత్రములను అలంకరింతురు. చిరుగంటలు కూడ కట్టుదురు. ప్రభలకేగాక వానిని లాగుటకై ఏర్పరచిన ఎద్దులకుకూడ ఆప్యాయముగ గంటలను, గజ్జలను, మువ్వలను అద్దాలశిగమోరలను కట్టి అలంకరింతురు. ఈబండ్లకుకట్టే ఎద్దులను ప్రత్యేకశ్రద్ధతో అన్నిటికన్నా హెచ్చుగా పోషింతురు. వీటికి పచ్చి జొన్న చొప్ప, ఉలవలు, పత్తివిత్తులు రుబ్ళినపిండి పెట్టి పెంచెదరు. ఈ తిండిని తిని ఆ వృషభ రాజములు తెల్లగ తయారగును. వాటి చర్మము తెల్లటి వెలువెట్టుపట్టును బోలి మిసమిస మెరయుచుండును. మెడలకు గట్టిన గజ్జెల పట్టెళ్లు, మొగమునకు తగిల్చిన కుచ్చుల శిగమోరలు, కాటుక కండ్లు, కురచకొమ్ములు, మెడమీద పెద్ద చెండువంటి గట్టి మూపురములు, మెడ మీదుగా రొమ్ముచుట్టిరా బిగింపబడిన తోలు పటకాలు ఇన్నింటితో గాంభీర్యముట్టిపడ నడచివచ్చు ఆ ఎద్దులను చూచినప్పుడు, పెండ్లికొడుకలు పెండ్లికి తరలిపోవుచున్నట్లు గాన్పించును. అవి నడచుచు, అప్పుడప్పుడు తలవిసరు, వయ్యారమును, గాంభీర్యమును, అలంకారమును కనులపండువుగ నుండును. అట్లె ఉత్సాహము కొలది అవి వేయు రంకెలును ఉత్తేజముగను ఉద్రేకకరముగను నుండుటయేగాక శంఖారవమువలె శ్రావ్యముగను ఉండును. సంగీతశాస్త్రమునందు ఈ రంకెనే సప్తస్వరములలో రెండవదియగు 'రి' (ఋషభం) అని నిర్ణయించిరి. ఈ స్వరముచే వీరరసము, అద్భుతరసము, రౌద్రరసము వెల్లడియగునని చెప్పబడినది. శార్జధరుని సుభాషితములలో ఇట్లు నిర్వచింపబడినది. "పడ్డర్షభౌ తధాజ్ఞౌయౌ వీర రౌద్రాద్భుతే రసే || కావుననే ఈ బండ్లకు బాగుగా బలిసిన కోడెలనుగాని కోడెప్రాయపు ఎడ్లనుగాని కట్టెదరు. ఈ బండ్లమీద కూర్చుని తోలేరైతులను మంచి వయసు కుర్రవాండ్లుగనుందురు. మంచి దృఢకాయము కలిగి కందుకూరి తలగుడ్డలను, చెమ్లా పాగాలుగా తలలకుచుట్టి, రంగు రుమాళ్లను నడుములకు బిగించికట్టి ముల్లుకర్రలతో ముందు నొగలలో కూర్చుందురు. మొలకు బిళ్లలత్రాడు, కాళ్లకు ఎఱ్ఱబణాతు గురిగింజలు అమర్చిన కిర్రుచెప్పలు, చేతులకు వెండి మురుగులు, సందిట దండ కడియములు, చెవుకు జంపు, ఇత్యాదులతో సింగారించుకొని, కోరమీసములతో, కొంటెచూపులతో, కండ్లమీదుగా కణతలు కలియదిద్దితీర్చిన విభూతిరేఖలతో, కనుబొమలమధ్య నుంచిన కుంకుమ బొట్టుతో, నోటనున్న గుంటూరుమెట్ట (పాటి) పొగాకు (బారెడు) చుట్టను త్రాగుచున్నట్లుగానే "ప్ప-ప్ప-ప్ప-ప్పప్పా" అని ఎద్దుల నదలించుకొనుచు వారు బహు చలాకీగా సారధ్యమును సాగింతురు. ఆ మాత్రము అదలింపైన సహింపనట్లుగా ఆ కోడెలు రోషావేశమున పరవళ్లతొక్కుచు విసురుగా ముందుకు సాగిపోవుచుండును. అట్టివానిలో బాగుగా పొగరుబోతులైన కోడెలకాళ్లకు గిట్టలపైన త్రాళుకట్టి ఇరువంకల చేతబట్టుకొని, అదలించి వానిదుడుకును నిగ్రహించుచు ప్రాయము వ్రాలుచున్న పెద్ద రైతులు నడుస్తుంటారు. ఈ బండ్లు మా ఊరిగుండా పోవునప్పుడు వూరిలోనివారు ఈ ప్రభల కెదురేగి నిల్పి సత్కరించుచుండిరి. స్త్రీలు బుంగల కొలది నీరు తెచ్చి వారు పోయుటయు పురుషులు కత్తిపట్టుకొని దండకములు, ఖడ్గములు - అను తెనుగు రచనలను ఆ వేశముతో 'అద్దద్దశరభ" యని ఊతముతో చదువుటయు నాకింకను జ్ఞాపకము. సామాన్యముగ నీ ఖడ్గములను దండకములను చదువువారు జంగములు, బ్రాహ్మణులగు అరాధ్యులు. వీనికి కథపట్టు సామాన్యముగా దక్షయజ్ఞ ధ్వంసమును శివలీల లేక వీరభద్రుని వీరవిహారము. మచ్చున కొక్క చరణము :

దక్షుని తలగొట్టి తగరు తలపెట్టి

అద్దద్దద్దద్ద శరభ - శరభ"

ఈ పాడేవారు ఒక కత్తిని చేతపట్టుకొందురు. లయతప్పక ముందు వెనుకలకు నడుచుచు, గంతులు వేయుచు, పరవళ్లు త్రొక్కుచు పాడుదురు. ప్రక్కన నొకడు చల్లగా రుంజ వాయించుచుండును. మరొకవంక నొకడు - సామాన్యముగా నితడు ఎడమవైపు నుండను - డోలునో, కనకతప్పెటనో వాయించుచుండును. అతంతంల నిలిచినవారు కొమ్ములు, కాహళములు అదునుచూచి ఊదుచుందురు. సమీపస్తుడై మరొక్కడు రసముట్టి పడుపట్టున శంఖమొత్తును. ఇట్టి సన్నాహమధ్యమున - ఆ వీరుడు, - ఖడ్గము నందలి యొకటి రెండు చరణములు చదివి - ఉసితో ఆ డోలు వాయించు వానివద్దకు (లేక కనకతప్పెట వానివద్దకు) ఉరికి - ఆ వాద్య విశేషమును అంటునట్లుగా తన తలను చెవి యోరన ఆనించి, చెవిగట్టిగా మూసుకొని - 'అద్దద్దద్దద్ద శరభ - శరభ' అని ఉచ్ఛ స్వరమున పల్కును. ఆ పలుకునకు అనుగుణ్యముగా అతడా వాయిద్యమును గట్టిగా వాయించును. అసలా 'శరభ' శబ్దము వాని నాభికమలము నుండి భేదించు కొని మారు మ్రోగుచు వెలికివచ్చును. అది వినుటకు మహాభయంకరముగను, రౌద్రముగను, భక్తులకు భద్రమొసగునట్టిదిగను యుండును. కొందరు వీరశైవులీ ప్రభలకెదుట నారసములు గ్రుచ్చుకొనుట, గండకత్తెరలు వేసుకొనుట అను అఘాయిత్యములను కూడా చేయుదురట.

ఈ కోటప్పకొండ తిరునాళ్ల ఏటేటా జరుగు జాతీయ మహోత్సవము. ఈ తిరునాళ్లలో రైతులకు కావలసిన పనిముట్లను ప్రదర్శించి విక్రయించెదరు. రెండు మూడు దినములు ఈ కొండచుట్టూ జనము, పశువులు, అంగళ్లు కిటకిటలాడుచుండును. బిచ్చగాండ్రును విచ్చలవిడిగా వత్తురు. ఈ మహోత్సవము చూచుటకై అధికారులును క్యాంపులు వేసుకొందురు. అక్కడికి వచ్చిన జనులు పాకలలోను, చెట్ల క్రిందను దిగి వంటలు చేసుకొనెదరు. సర్కారువారున్ను వచ్చినవారికి సౌకర్యము లొనర్చి, పోలీసు బందోబస్తు గావింతురు.

ఈ ఉత్సవములకు ప్రభల వెంటను, విడిగాను ఆ చుట్టుప్రక్కల గల స్త్రీలును విస్తారముగ వత్తురు. ఆ ప్రాంతమున విస్తారముగ మెట్ట వ్యవసాయము. పురుషులతోపాటు అచ్చట స్త్రీలును పొలములలో పాటపడనేర్చినవారు. పల్నాడు ఇచ్చటకి సమీప ప్రదేశము. పల్నాటి సీమను గూర్చి శ్రీనాథుడు చెప్పిన చాటు పద్యములు కనుడ :

రసికుడు పోవడు పల్నా డెసగంగా రంభమైన యేకులె వడుకున్
వసుధీశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్నకూడే గుడుచున్.

చిన్న చిన్న రాళ్లు చిల్లరదేవుళ్ళు నాగులేటినీళ్ళు నాపరాళ్ళు
సజ్జజొన్నకూళ్లు సర్పంబులునుదేళ్ళు పల్లెనాటిసీమ పల్లెటూళ్ళు.

జొన్నకలి జొన్నయంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్నసుమీ పన్నుగ పల్మాటి సీమ ప్రజలందరికిన్.

ఇట్టి ప్రదేశముల స్త్రీలును స్వేచ్చా స్వతంత్ర్యము కల్గి, ధైర్య సాహసములతో పౌరుషవంతులై యుందురు. చూపునకును వడ్డుపొడుగు కల్గి, దేహపుష్టి ఆరోగ్యము కల్గి, కంటికింపుగా నుందురు. వారు ముతక కోకలను చుంగులు తీర్చికట్టి, వెండి మురుగులు ముక్కరలు, గుబావిలీలు, చెంపసరాలు మొదలైన పురాతనపు నగలతో అలంకరించుకొని కాటుక కండ్లతో కడవలంతేసి వంకకొప్పులతో వత్తురు. అమాయకులైన ఈ స్త్రీలు తాంబూలము ఝాడించుచు మధ్య మధ్య పండినదా లేదా యని నాలుక ప్రక్కకు జాపి క్రీగంట చూచుకొనుచు ఉత్సవముల తిలకించుచుందురు.

కొన్ని సంవత్సరముల క్రితము ఇచ్చట ఈ తిరునాళ్లకు ప్రభలు కట్టుకొని వచ్చిన రైతులకును సర్కారు ఉద్యోగస్థులకును గట్టి పోరాటము జర్గి తుపాకులనుగూడ ప్రేల్చవలసి వచ్చినది. ఈపోరాటము కేసు కోర్టుకెక్కి కొందరు శిక్షింపబడిరి. తగిన బందోబస్తు చేయలేదనియు, సకాలమున విధి నిర్వహింపక దాగిరనియు కొందరు ఉద్యోగస్తులను తీసివేయుటయు జరిగెను.

ఆ గాథనుగూర్చి నాటిరోజులలో నిట్లు చెప్పుకొనిరి. చెన్నప్పరెడ్డి యని ఆ ప్రాంతమున ఆరోజులలో మోతుబరి. అతని గూర్చియే పామరులు, బిచ్చగాండ్రు, నేటికిని 'రాజా చెన్నాపారెడ్డి. నీ పేరే బంగారపాకడ్డి' అని పాటలు పాడుచుందురు. ఇతని సాహసములగూర్చి ఎన్నియో కథలు చెప్పుదురు. ఇతడేదో మ్రొక్కుబడి యుండి ప్రభ కట్టుకొని కోటప్పకొండకు నడిచినాడట. ప్రభవెంట ఇతని సోదరియు వచ్చినదట. చెన్నప్పరెడ్డి ప్రభ బండికి పూన్చిన ఎద్దులు పొగరు గ్రక్కుతూ నడుస్తున్నవి. నొగలకూర్చుని తోలువాడు, ప్రక్కతాళ్లబట్టి అదలించి నిగ్రహించువారు జాగ్రత్తగా నడిపిస్తున్నారు. కొండపైకి కొంత దూరమున కేగిన మీదట ఆ ఎద్దులలో నొకటి జనసమూహమును జూచి కొంతమొరకు చేయుచున్నది. పోలీసు భటులు అథార్టీ చేయవచ్చిరి. మీరు కలుగజేసుకోవద్దు; మేము సమాళిస్తాము' అని ఆ ఎడ్లమచ్చిక తెలిసిన రైతులనుచున్నను ఆ పోలీసులలో నొకడు వినిపించుకొనక తన లాటీకర్రతో ఆ ఎద్దును పొడిచెను. అది రెచ్చిపోయినది. కలియ ద్రొక్కుచున్నది. అయినను ఆ రైతులు దానిని కొంత శ్రమపడి సమాళించగల్గువారే. కాని పోలీసు శాఖ వారికా ఓర్పునేర్పు లేకపోయినది. రైతులందరు - "వద్దు, వద్దు" అని అదలిస్తున్నా వినిపించుకోక వారు ఆ ఎద్దుపై తుపాకీని ప్రేల్చిరి. రైతుల కుద్రేకము కల్గినది. 'చూస్తారేమిరా, మీసాలుగల మొగవాళ్ళు' అని గర్జించి చెన్నప్పరెడ్డిసోదరి కోక విరిచికట్టి గండ్రగొడ్డలి తీసికొని ముందు కురికినది. ఎర్రటోపీగల (నాడు పోలీసులకు తెల్లదిరుసు, ఎర్రటోపీలు) తలలెల్ల ఎగిరి పోయినవి. భూమిపై ఇంకా గింజలుగల పోలీసులంతా తమ యూనిఫారములు టోపీలు తీసి పారేశారు. అధికార్లు చాలామంది అధికార చిహ్నములను జారవిడిచారు. నామాలు పెట్టుకొని దాసరులు, బూడిద పూసుకొని జంగాలు అయి నాటికి ప్రజా సామాన్యంలో కలిసి ప్రాణం దక్కించుకున్నారు. నిజంగా ఆనాడు కోటప్పకొండమీద చెన్నప్పరెడ్డి ప్రభముందు రక్తపువారులే పారినవి. తమ బిడ్డలను వలె కంచెములో అన్నము నోటికి కబళమందిచ్చి పెంచుకొనే ఎడ్లను గాసిపెట్టితే గుంటూరి రైతులు, అందును పల్నాటివారు సహించరు. 1921-22లలో సహాయ నిరాకరణపు గొడవలప్పుడు పోలీసులు జప్తుకు వచ్చిరి. కన్నెగంటి హనుమంతు అనువాని ఎద్దులను జప్తు చేయదలచిరి. అతడు కాదనెను. ఆ గందరగోళములో అతడు పొలీసుల తుపాకికి గురియై చచ్చెనేగాని బ్రతికియుండగా తన ఎద్దును పట్టనివ్వలేదు.

మా ఊరిలో ముఖ్యముగ ముందు ముత్తయిదువులు పూర్వ సువాసినీలు ఉలవ గుగ్గిళ్లు, జొన్న పేలాలు, పేలపిండి, భుజించి శివరాత్రినాడు జాగరణ సలుపుచుండిరి. ఈ జొన్న పేలాలకు ఎర్రటి కొరివికారమును పట్టించి భుజించెదురు. పేలపిండిలో పెరుగు కలిపి త్రాగెదరు. ఉలవగుగ్గిళ్లలో పచ్చిమిరపకాయలను కొరుకుతూ తినుచుండిరి. కొందరు సొజ్జ రొట్టెలను, తప్పెలబిళ్లలను, కాల్చి ఫలహారమును చేయుచుండిరి. ఈ కటికి ఉపవాసములతో రాత్రిళ్ళు జంగము కథలు, లక్ష్మణ మూర్చ, శీతమ్మ కడగండ్లు, విని జాగరణ చేయుచుండిరి. మరికొందరు అచ్చనగండ్లు గవ్వలాటలతోను, మరికొందరు చీలిజగడాల తోను రాత్రి అంతయు ప్రొద్దు పుచ్పుదురు. తెల్లవారగనే యేటిలో స్నానము చేసి వంటకములను తయారుచేసుకొని బ్రాహ్మణునికి ఔపోసనవేసి పారణ ముగించెదరు.

రంగిరీజులనగా గుడ్డలకు రంగువేయువారు. వీరు రంగులతో గండభేరుండ, కోటు కొమ్మంచులను చీరలకు ధోవతులకు అంచుగట్టి అద్దుచుండిరి. ఒక చుక్క, మూడు చుక్కలు, అయిదు చుక్కలతో చుక్కల చీరెల నడుచుండిరి. ముదురు చెంగావి, పాల చెంగావి, చుట్టు చెంగావి చీరెలను ధోవతులను, గువ్వకన్ను, నెమలికన్ను చీరెల నద్దుచుండిరి. ఈ రంగులన్నియు గట్టిఛాయలని పేరు. గుడ్డచినుగువరకు రంగులు పోవు. ఆ కాలమున మనదేశమున లభించు కరక్కాయ, నీలిమందు, చిరివేరు, పబ్బాకు, మంజిష్ఠ మొదలగు వనమూలికలతో రంగులు వేయుచుండిరి. ఈ పరిశ్రమకు మా ఊరున్నూ (ఇనమన మెళ్ళూరు) గొల్లపాలెం, బందరు, చీరాల, కరేడు, నెల్లూరు ఆరోజులలో మిక్కిలి ప్రసిద్ధి వహించి యుండెను. చెన్నపట్నం ప్రక్కనయుండే సైదాపేటలోకూడ ఈ రంగులను వేయుచుండిరి. ఈ పరిశ్రమ క్రమముగా నశించిపోయినది. విదేశీ కృత్రిమపు రంగులు వచ్చి మన మూలికల సంబంధమగు రంగుల పరిశ్రమను ఎట్లు ధ్వంసమొనర్చినదియు, ఆచార్య ప్రపుల్లచంద్ర రాయి గారును, ఆనంద కుమారస్వామి గారును, విశేషముగా వ్రాసియున్నారు. బందరులో తయారుచేసిన రంగు చీరెలను మద్రాసు పచ్చయప్ప కళాశాల ప్రక్కన యుండు వీధిలో అమ్ముచుండిరి. అందువలన ఆ వీధికి బందరువీధి అని పేరు కలిగెను. ఆ వీధికి మునిసిపాలిటీ పేరు గురువప్పవీధియని బోర్డుయుండినను వాడుక బందరువీధి యనియే పేరు. ఈ వీధిలో ముందు అరటిపండ్లను విస్తారముగ విక్రయించుచుండినందున అరటిపండ్ల వీధి అని కూడ పేరు కలదు. ఈ వీధిలో నేను చిన్నతనమున చదువుకొనుచుంటిని.

సంక్రాంతి పండుగను పెద్దపండుగ అందురు. అప్పడు వ్యవసాయపు పనులు కొంచెము తక్కువ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వరుసగా పండుగ రోజులు. ఆ రోజులలో గ్రామస్తులు ఆటపాటల ప్రొద్దుపుచ్పుదురు. అందులో పెద్దపండుగ రోజున మా వూరి రంగిరీజులు యేటివడ్డున యున్న చింతతోపులోనికి పోయి కోడిపందెముల నాడేవారు. మంచి కోడిపుంజులను ఈ పండుగ కొరకు ప్రత్యేకముగ పెంచి యుంచేవారు. వీటిని ఆ తోపులోనికి తీసుకొనిపోయి, వాటికాళ్లకు సన్ననికత్తులను గట్టి, రెండు పుంజులను డీకొలిపి విడిచెదరు. అవి రెండును ముందు వెనుకలకు నడుచుచు ఎగురుచు కత్తులను గట్టిన కాళ్లతో రొమ్ములపై తన్నుకొనుచు పోరాడును. రక్తము ధారగ కారుచున్నను అవి పోరాటమును విడువవు. ఈ ప్రకారము పోరి కొంతసేపటికి యొక కోడి క్రింద కూలును. గెల్చినవాడు చచ్చినకోడిని తీసుకొనిపోయి రాత్రికి విందు భోజనమును చేయును. ఇది పల్లెటూర్ల పండుగ సంబరము. నాటికి సంబరమేగాని - కోడి పందెముల పగలు సామాన్యముగా వాటితో చావవు. పోరాటము సాగుచున్నప్పుడు చూచువారు, రెండుకక్షలై పౌరుషపు మాటలతో ఆయా పుంజులను రెచ్చగొట్టి హుషారిచ్చుచుందురు. కోడిపుంజులును నైజముగనే రోషముతో పోరుచుండును. పండుగ సంబరమున కొంచెము మత్తు పదార్ధములు పుచ్చుకొని అసలే హుషారుగా నున్న ఆ గ్రామస్తులు ఈ రోషపు మాటలతో తామసము వహింతురు. పైగా ఆ కోళ్లపై కొందరు పదులు, నూర్లు పందెములు కాయుదురు. వానిని ధారపోసుకొన్నప్పుడు ఈ తామసము మించిపోవును. దానితో వారు కలియపడి కొట్టుకొనుటయు కద్దు. లేదా, సంవత్సరము పొడవున కక్షలు పెంచుకొని అప్పుడప్పుడు కొట్లాడు కొనుటయు కలదు. ప్రసిద్ధి చెందిన పల్నాటి వీరయుద్ధమునకు మూలము 'కోడి పుంజుల పందెమే' యని చరిత్రకారులు చెప్పుదురు. సామాన్య జనమునకు ఇవి సరదాగా నున్నను సౌమ్యులు వీనిని రేసుకోర్సులను వలెనే ప్రోత్సహింపరు.

మా వూరి రంగిరీజులలో కొందరు మంచి కోలాటపు పాటలు నేర్చిన వారును గలరు. అప్పుడప్పుడు పెద్దగుంపుగ కూడి ఒక దీప (గరుడ) స్తంభమును వెలిగించి దాని చుట్టు వీరు చేరి కోలాటమును వేయుచుందురు. లయతప్పక కర్రదెబ్బలను గట్టిగ వేయుచు, ఎగురుచు, దూకుచు, తిరుగుచు, ఇప్పటి స్కూళ్లలో ఆడపిల్లకాయలు కోలాటము జడను అల్లువిధముగ ఆడుదురు. వీరు మొదట శివ శివ గణనాధా! - నీవు -

శివుని కుమారుడవు! - గణ నాథా!

అను ప్రార్ధన పాటతో కోలాటము ప్రారంభింతురు. ఆ పిమ్మట

'కోలుకోలన్న కోలు, కొమ్మలిద్దరు మంచి జోడు

పల్లెటూళ్లలో జంగము కథలను చెప్పుచుండేవారు. ముఖ్యముగ బాలనాగమ్మ కథ, బొబ్బిలి కథ, దేశింగురాజు కథ, కాంభోజిరాజు కథ మొదలైన వానిని జంగములు చెప్పుచుందురు. ఆ రోజులలో ఈ కథలను చాల చాకచక్యముగ చెప్పగల్గిన వారుండిరి. ముఖ్యముగ మా గ్రామసమీపమున గల ధేనువుకొండ గ్రామమున ధేనువకొండ వెంకయ్యగారను ప్రసిద్దమగు సంగీత పాటకులు వాగ్గేయకారులు ఉండేవారు. ఆయన జంగం కథలను స్వయముగ వ్రాసి తాను ప్రక్కన నిలిచి లయ తప్పక అడుగువేయుచు శిష్యులకు నేర్పేవారు. ఆ శిష్య పరంపర నేటికిని ఆ ప్రాంతమున కలదు. ఈ జంగం కథలు చెప్పునప్పుడు కథలో ఆయాపట్టులకు తగినట్టు రసముట్టి పడ, హుంకరింపులు, పాదఘట్టనములు, హెచ్చరికలు, మున్నగువాని నొనర్చుచు, ముందు వెనుకలకు లయ తప్పక నడుచుచు, దుముకుచు, భుజమున పెట్టుకొన్న తంబురను కుడిచేతి వ్రేళ్లమీటుచు, ఎడమచేతి వ్రేళ్లకు పెట్టుకొన్న బోలుకంచు ఉంగరములతో తంబురకుండపై దరువువేయుచు పాటపాడుచు నొకడు కథ నడుపుచుండెను. అతని కిరువంకల ఇద్దరు గుంసీలు తీసుకొని వాయించుచు వంతుపాట పాడుచు అతనితో నడుచు చుందురు. పాట మధ్య మధ్య నిల్పుచు, ఆవంతు పాటగాండ్రిరువురు ప్రశ్నోత్తరములలో కథను వ్యాఖ్యానమొనర్చుచుందురు. ఈ సందర్భముననే వారు హాస్యమును చెప్పుదురు. అయితే సామాన్యముగా నిది మోట హాస్యముగా నుండును. పైన చెప్పిన పండితులవద్ద స్వయముగా తర్ఫీదైనవారి హాస్యము పండిత సమ్మతమై సభ్యముగా నుండును. అసలు జంగము కథారచనా విధానమే రసవంతమైనది. శ్రీ వేదము వేంకట్రాయశాస్త్రులవారు బొబ్బిలికథ పద్యకావ్యముల కన్న జంగము కథయే రసవత్తరమని చెప్పియున్నారు. అట్టి రచనను ప్రత్యక్షముగా పాటగాండ్రు ఒక విధమగు నాటకమాడి వినిపించి వివరించునప్పుడు శ్రోతలు తన్మయులగుదురనుట ఆశ్చర్యముగాదు. బొబ్బిలికథను వినునప్పుడు ప్రేక్షకులు ఉద్రేకులయ్యెదరు. బాలనాగమ్మ కథను విన్న స్త్రీలు జాలి నొందెదరు. దేశింగురాజు కథలో అతని పరాక్రమమును, మహబత్ ఖానుని స్నేహమును వర్ణించి చెప్పనప్పుడుగల హిందూ మహమ్మదీయ సఖ్యతను తలచి కొనియాడుదురు. ఈ జంగము కథ పద్ధతి ననుసరించి చెప్పు కథలకే, ఇప్పడు బుర్రకథలని చెప్పుచున్నారు. నూతన రాజకీయ సాంఘిక ప్రచారములను ప్రాచీన ప్రచారక పద్దతుల ననుసరించి జంగము కథలు, తోలుబొమ్మలాటలు, వీధి భాగవతముల ద్వారా సలుపుట ఎంతో ఫలప్రదమని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు చిరకాలము క్రిందటనే చెప్పియున్నారు.


నాకు తెలియకమునుపే మా వూరిలో (ఇనమనమెళ్ళూరు) యుండిన తాలూకా కచ్చేరిని వంగవోలుకు మార్చిరి. కచ్చేరి యుండినప్పడు మా వూరుకూడ పేరు ప్రతిష్టలతో యుండినదట. నేను కుఱ్ఱవాడనుగ నున్నప్పుడు మా వూరికి కలెక్టర్లు సబ్కలెక్టర్లు మొదలగు తెల్లదొరలు జమా బందికి వచ్చుచుండిరి. జమాబంది అంటే ప్రతి సం॥మున్ను రెవిన్యూ లెఖ్ఖలను తనిఖీ చేయుట. వారు మా వూరికి వచ్చుటకు ముందురోజున వంగవోలునుండి ఒక బిళ్ల బంట్రోతు గ్రామమునకు వచ్చి గ్రామ కరణమగు ఇనమనమెళ్ళూరి రాంభొట్లుగారిని, గ్రామ మునసబు వాకా రామిరెడ్డిగారిని చూచి దొరగారు రేపు ఈ వూరికి మకాం వేసుకొని వచ్చుచున్నారని చెప్పును. ఈ మాటను వినిన వెంటనే వీరిరువురు గ్రామ ముదామును పిలువనంపి మాలపల్లెలోనుండు వెట్టివార్లను పిలిపింతురు. గ్రామనౌకర్లను పాడుపడి యుండిన పాతకచ్చేరి సావడిని వూడ్చి నీళ్లు చల్లమని చెప్పుదురు. గ్రామచాకలిని దివిటీతో కూడ సావడివద్ద సిద్దముగా నుండవలయునని వుత్తరువు చేయుదురు. కుమ్మరికి కూడ కబురు పంపుదురు. ఆ రాత్రి యంతయు కరణముగారికిని ముసనబుగారికిని నిదుపట్టెడిది కాదు. తెల్లవారగనే లేచి మంగలి బాపిగాడిని పిలువనంపి క్షౌరమును చేయించుకొందురు. మాలమాదిగలకు కబురు పంపి తప్పెటలను, తాషామార్పములను, బూరగలను తయారు చేయుదురు. మంగల బాపిగాడిని దూదేకుల హుసేన్ సాహేబును పిలిపించి మేళమును సిద్దము చేయమందురు. గ్రామములో పలుకుబడిగల ఆలపాటి పెదవీరాస్వామి, చినవీరాస్వామి, వెంకటస్వామి మొదలగు శెట్లకును, వాకా రామిరెడ్డి, వీరారెడ్డి, లచ్చారెడ్డి మొదలగు రెడ్డి బృందమునకును, ఇనుమనమెళ్ళూరి నల్లసుబ్బయ్య, యెఱ్ఱసుబ్బయ్య, రామస్వామి, క్రిష్ణస్వామి, మీనయ్య మొదలగు నియోగులకును, బడిపంతులు పిచ్చయ్య నంబి వరాహాచార్యులు, తంబళ పున్నయ్య అను దేవాలయముల అర్చకులకును, వేదాధ్యయ నాది పండితోత్తములగు కొరవి, బుద్దవరపు వార్లకును వీరందరకును కలక్టరు రాకను తెలియ పరుతురు. మా వూరిలో సుమారు 40, 50 బ్రాహ్మణ కుటుంబములుండెడివి. వైష్ణవులలో ఉప్పలవారు మంచి భూస్వాములుగ నుండిరి.

వీరందరుకూడా తెల్లవారగానే గుండ్లకమ్మ యేటిలో స్నానమునుచేసి వైదిక కర్మలను తీర్చుకొని విభూతి రేఖలతోను పంగనామములతోను పింజబోసిన ధోవతులతోను దొరగారి దర్శనమునకు వేచియుండెదరు. దొరగారు ఉదయమున వంగవోలులో కాఫీని పుచ్చుకొని దొరసాని సమేతముగ రెండెద్దుల పెట్టె బండినెక్కి సుమారు రెండుగంటల కాలములో మా వూరు చేరేవారు. మావూరు వంగవోలుకు 7 మైళ్లదూరమే గనుక 9 గంటలలోపుగనే వూరికి వచ్చేవారు ఆ నాడు వూరంతయు పిల్లజల్లలతో కోలాహలముగ నుండెడిది. ముతక చీరలతో రెడ్డి పడుచులును, రంగు చీరలతో బ్రాహ్మణ ముత్తయిదువలును అక్కడ చేరేవారు.

దొరగారు వచ్చేలోపల తప్పెటలను మంటకు కాచుకొని, కాళ్లకు గజ్జలను కట్టుకొని చిందులను తొక్కుచు మాలవారు సిద్దముగ నుండెదరు. బ్రాహ్మణులు మాత్రము మాలమాదిగలకు దూరముగ నిలుచుండెదరు. మా వూరి దేవాలయ మాన్యముల ననుభవించుచుండు భోగమువారు చెదలవాడనుండి వచ్చి ఆటపాటలను సలుపుచుండిరి. వీరిని ఆదరించి అన్నమునుపెట్టు పెద్దమనుష్యులు గ్రామములో చాలమంది యుండిరి. ఆనాడు మా వూరు పార్వేట పండుగవైభవముతో నుండెడిది.

మా వూరి గ్రామకరణము తెలివిగల ముసద్దీ. మంచి మేనిఛాయ గలిగిన భారీ విగ్రహము. బట్టతల, పెద్దబొజ్జ గలిగిన మంచి మాటకారి. ఊరివారందరికి వీరిని చూచిన భయము, భక్తి యుండినది. గ్రామ మునసబు నిరక్షరకుక్షి అయినను తన చేవ్రాలు చేయుటకు మాత్రము నేర్చుకొని యుండెను. కలక్టరుగారు గ్రామములో ప్రవేశించుటకు పూర్వమే కరణము గారు పాతలెఖ్ఖలను సవరించుకొని, పాతదస్తరమును మార్చుకొని లెఖ్ఖల తనిఖీకి సిద్దముగ నుందురు. ముందుగవచ్చిన బిళ్లబంట్రోతులు గ్రామము మీదపడి దొరగారికి కోళ్లను, మేకలను, గ్రుడ్లను సేకరించుకొనెదరు. వంగవోలునుండి మంచి బ్రాందిబుడ్లను తెప్పించి వుంచెదరు. జనులందరు నడివీధిలో నిలుచుని దొరగారి రాకకు నిరీక్షించు చుండు సమయమున ముందుపోయిన ముదాము వచ్చి దొరగారి బండి వచ్చుచున్నదని చెప్పును. అప్పడు భజంత్రీలు మేళమును, మాదిగ వాండ్లు తప్పెటలను వాయించెదరు. భోగమువారు కాళ్లగజ్జలతో సందడి చేసెదరు. తక్కినవారు నడుములకు గుడ్డలు చుట్టుకొని చేతులు కట్టుకొని వేచియుందురు.

దొరగారు వచ్చు పెట్టెబండిని కరణంగారు ఫర్లాంగు దూరమున చూచి గడగడ వణకుచు, ఊడిపోవు గోచిని సవరించుకొనుచుండును. బట్టతలపైన నుండు గువ్వకన్ను తలగుడ్డ పక్కకు జారుచుండును. కట్టుకున్న పాలచంగావి ధోవతి వూడిపోవుచుండును. రొంటిన వుండిన పొడిబుఱ్ఱ క్రిందపడును. ఈ సమయమున దొరగారు, దొరసానిగారు బండి దిగుదురు. వెంటనే వీరందరు ఆ దంపతులకు రెండు చేతులతో సలాములు పెట్టెదరు. అంత మేళతాళములతోకూడ భోగము వారితో వూరేగుతు పాత కచ్చేరి సావడికి బసకు పోయెదరు. వెనుకనుండి వచ్చు రెండెద్దుల బండిలో పడక కుర్చీలు, స్నానము చేయుటకు తొట్టి, కక్కసుకుపోవు కమోడులు (మలవిసర్జన పింగాణి గిన్నెలు) మొదలగు సామానులన్నియు దిగును. కూడవచ్చిన బట్లరు (వంటవాడు) వంటకు కావలసిన సామగ్రినంతయు సరిచూచుకొని భోజనమును తయారు చేయును. దొరగారితో కూడ వచ్చిన క్యాంపు క్లర్కు (Camp Clerk) లకు మామూళ్లను చెల్లించి వారికి భోజనవసతికి యేర్పాటు చేయుదురు. మరుసటిరోజున తెల్లవారి కాఫీ పుచ్చుకొనిన పిమ్మట దొరసానితో కూడ దొరగాను తుపాకిని చేతపట్టుకొని వేటకు బయలుదేరును. మొదట వూరిలోనికి పోయి అక్కడక్కడ తిరుగుచుండిన పందులను కాల్చి చంపును. దెబ్బతగిలి క్రిందపడి కీచుకీచుమని అరచి ప్రాణమును విడుచు పందిని చూచి ప్రక్కనున్న దొరసాని, దొరగారి శూరత్వమునకు మెచ్చుకొనుచు, చేతులను తట్టి సంతోషించుచుండును. చనిపోయిన పందుల కామందులు వచ్చి యేడ్చుచు పందులను ఈడ్చుకొని యింటికి పోవుచుండిరి. పిమ్మట యేటివడ్డున వుండిన నేరేడు తోపులోనికి పోయి చెట్లమీద హాయిగ విహరించుచుండిన రంగురంగు పక్షులను కాల్చి నేల కూల్చును. క్రిందపడిన పక్షులను యేరి దొరసాని సంచిలో వేసుకొని పోవును. ఈ వేటకు కరణం మునసబుగార్లు ముందు నడుచుచు దోవ తీయుచుందురు. వేట అయిన పిమ్మట దొరగారు బసకువెళ్లి భోజనానంతరము విశ్రమించిన పిమ్మట కరిణీకపులెఖ్ఖల తనిఖీ ప్రారంభమగును. ఈ జమాబందికి చుట్టుప్రక్కలయుండు గ్రామకరణాలుకూడ లెఖ్ఖలను తీసుకొని ఈ వూరికే వచ్చెదరు. గనుక ఈ లెఖ్ఖలతనికి ఈ వూరిలో కొన్నిదినములవరకు జరుగును. కలక్టరు క్యాంపు ఈ వూరిలో నుండు నప్పుడు కలక్టరు సిబ్బంది వూర్లమీదపడి సంపాదించుకొనుచుండిరి. చదలవాడనుండి వచ్చిన భోగమువారు కూడ కరణాలను ఆశ్రయించుకొని యిక్కడనే యుండెదరు.

జమాబందికి వచ్చిన కరణాలందరు నా మేనమామ ములుకుట్ల మహాదేవయ్య గారింట బస చేయుచుండిరి. ఈ కరణాలందరికి వంతు ప్రకారము ఆలపాటి చినవీరాస్వామిశెట్టిగారు పొత్తరలను (భోజన సామగ్రిని) పంపుచుండిరి. మనిషికి తవ్వెడు చేరుడు బియ్యమును, గిద్దెడు ముడిపెసలును, చిన్న నిమ్మకాయంత చింతపండును, అరగిద్ద వుప్పును, పిడికెడు మిరపకాయలను, చిన్న చిట్టెడు సిద్దెనెయ్యిని పంపుచుండిరి. ఊరిలో యుండు గొల్లలు ముంతెడు గొల్లపెరుగును పంపుచుండిరి. ఈ భోజన సామగ్రితో మా అత్తగారు ముడిపెసల ముద్దపప్పును, ఇంటిలో నుండిన వంగవరుగు ధప్పళమును, చింతతొక్కు పచ్చడిని తయారుచేసి భోజనమును పెట్టుచుండినది. ఆ దినమున వారింట వరి అన్నము గనుక మామగారు నన్నుకూడ భోజనమునకు పిలిచేవారు. భోజనానంతరమున కరణాలందరు వీధిపంచలో కూర్చుని ఘాటయిన పాటిపొగాకు చుట్టలను పీల్చిన పిమ్మట చెంబెడు నీళ్లను త్రాగి, నులకమంచములపైన పరుండి గాఢ నిద్రను పొయ్యేవారు. ఆ కాలపు కరణాలు మంచి తిండిపుష్టిని, కండపుష్టిని కలిగిన భారీవారగుటవలన, శెట్టిగారు పంపిన తవ్వెడు చేరుడు బియ్యపు అన్నము వీరికి చాలిచాలక యుండెడిది. వీరందరు అద్దంకి అయ్యవార్లంగారి ముద్దరను వేసుకొనిన శిష్య వర్గమునకు చేరినవారగుటవలన వైష్ణవ సాంప్రదాయముల ననుసరించి దినచర్యను జరుపుచుండిరి. దట్టమైన తిరుమణి శ్రీ చూర్ణములను ధరించుచుండిరి. తులసి పూసల దండలను తామరపూసల దండలను త్రిప్పుచుండిరి. చుట్టలను కాల్చుచుండిరి. నస్యములను పీల్చుచుండిరి. పలుమారు కోర్టుల కెక్కుచు, రైతులను ఆశ్రయించి వ్యవహారములను పెంచి, పేచీలనుపెట్టి నేర్పుగ ప్రయివేటును చేయుచు పొట్ట పోసుకొనుచుండిరి.

పొరుగూర్లనుండి వచ్చిన ఈ కరణాలందరు జమాబందిని ముగించుకొని వూర్లకు పోవునపుడు - 'అబ్బాయి నీవు శెనగపప్పును కొనుక్కోమని తలా ఒక కాణీడబ్బును నా చేతిలోపెట్టి పోవుచుండిరి. అప్పటినుండి మరల వీరు మామయ్య ఇంటికి యెప్పడు వచ్చెదరా అని నేను వీరి రాకకు యెదురుచూచుచుండెడివాడను.

నా కాపురము, కమామీసు బందరు వీధిలో యున్నప్పుడే ఎగ్మూరులో యొక స్వంత భవనమునుకొని దానిని పెద్దదిగా కట్టించి, బందరు వీధినుండి ఎగ్మూరుకు మారితిని. ఎగ్మూరు యింటికి పోయిన పిమ్మట మందుల వ్యాపారము యింకను వృద్ధి అయినది. ఇంటికి సమీపముననుండు పూనమల్లి హైరోడ్డులో నొక పెద్దభవనమును అద్దెకు తీసుకొని అక్కడ ఆఫీసును మందులుచేయు ఫాక్టరీని యుంచితిని. అక్కడనే లోధ్ర ముద్రాలయమునుకూడ స్థాపించితిని. అక్కడనుండియే 'గృహలక్ష్మి' పత్రిక వెలువడినది.