చిన్ననాటి ముచ్చట్లు/పార్కుఫేర్ పరశురామప్రీతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2

పార్కుఫేర్ పరశురామప్రీతి

మొదటి ముచ్చటలో చెన్నపట్నానికి రాకముందు మా గ్రామంలో ఉండగానే జరిగిన నా చిన్ననాటి సంగతులను చెప్పియున్నాను. ఇకపై చెన్నపట్నం వచ్చిన తర్వాత నేను పెరిగి పెద్దవాడనై, ప్రయోజకుడను కాగలుగుటకు ముందు నా అనుభవములో తెలిసిన కొన్ని విశేషములను చెప్పదలచి, అందొక ఘట్టమును వ్రాయుచున్నాను.

చెన్నపట్నంలో ప్రతి డిశంబరు నెల ఆఖరు వారమున రాణితోటలో (పీపిల్స్ పార్కు) వేడుకలు జరుగుట కారంభమైనవి. వానినే 'పార్క్ ఫేర్ వేడుకలు' అని జనులు పిలుతురు. చెన్నపట్న మీ రాష్ట్రమునకు రాజధాని కదా. వేసవి శెలవులలో రాష్ట్రీయోద్యోగులు పలువురు చల్లదనమునకై ఉదక మండలములకు వెళ్ళుదురు. కావున డిశంబరు శలవులు వేసవి శలవులకన్న క్లుప్తమైనను, పెద్ద పెద్ద ఉద్యోగులను చూచి ఎరుకపడ వచ్చుననే ఉద్దేశముతో మండలములనుండి చిన్న ఉద్యోగులు పలువురు పనికట్టుకొని చెన్నపట్నమునకు వచ్చుట అలవాటు. బంధువులిచ్చటయున్నవారు కొందరు కుటుంబములతోనే వచ్చేవారు. ఇట్టిపై జనము వచ్చుటచేత ఈ వేడుకలకు విస్తారముగా ధనము వచ్చెడిది. మరియు అనేకవిధములగు వస్తువుల ప్రదర్శనమును, విక్రయమును జరిగెడిది.

ఈ ప్రదర్శనములకై ఏటేటా టెంకాయ ఆకులతో వెదురు బొంగులతో పెద్ద పెద్ద రెండు ఆవరణములను కట్టేవారు. మొదటిది లోపలి ఆవరణము (Inner Circle), రెండవది వెలుపలి ఆవరణము (Outer Circle), మొదటి ఆవరణములో వెలగల వస్తువులను ప్రదర్శించేవారు. రెండవ ఆవరణములో సోడా అంగళ్లు, లాటరీ అంగళ్లు, కాఫీ హోటళ్లు మొదలగు వాటిని ప్రదర్శింపజేయుదురు. దుండగీడులు మొదటి ఆవరణపు తడికలపైనెక్కి లోనికి దూకకుండ దానిని చౌకకొయ్యలతో దిట్టముగా కట్టేవారు. ఒక్కొక్క ఆవరణమునకు నాలుగుద్వారములుండేవి. ద్వారముల వద్ద పోలీసు కాప్దారీతోపాటు అంగళ్ల కంట్రాక్టరుల తాలూకు మనుష్యులు కూడా ఉండేవారు. వెలుపలి ఆవరణము లోనికి పోవుటకు అర్ధణా టిక్కట్టు; లోపలి ఆవరణమునకు పోవుటకు నాలుగణాలు యివ్వవలయును. మొదట అర్ధణా యిచ్చి, లోపలికి పోతేగాని నాలుగణాల ఆవరణమునకు పోవుటకు వీలుకాదు.

అప్పటికి యింకను మద్రాసులో ఎలక్ట్రిక్ దీపాలు ఏర్పడలేదు. రాత్రి వెలుతురు కొరకు కిర్సనాయిల్ పోసిన తగరపుబుడ్లను, అంగళ్లలోను, బయటను తోరణములుగా కట్టేవారు. ఆ నూనెదీపములను వెలిగించుట 5 గం||లకే ప్రారంభించినగాని, చీకటిపడునప్పటికి ముగియదు. ఆ కాలమున నేను మద్రాసులోనేయుండి చదువుకొనుచుంటిని. నా తల్లి నన్ను చూచిపోవుటకు మద్రాసు వచ్చినది. ఆమె వచ్చిన పిమ్మట కొత్వాలు బజారు సమీపమున యుండు ఆచారప్పన్ వీధి సందులోయున్న ఒక యింటిలో ఒక రూమును నెల 1-కి రూ. 0-12-0 లకు అద్దెకు తీసుకొని ఇరువురము నివసించుచుంటిమి.

అది 1886 అని జ్ఞాపకము. అప్పటికి రాణి తోటలో డిశంబరు వేడుకలు ప్రారంభమై రెండు మూడు సం||లైనది. ఆ సం౹౹ను యథాప్రకారమవి సాగుచున్నవి. ఒకనాటి సాయంకాలము మాయింటిలో కాపురముండే పిల్లవాడును నేనును కలిసి రాణి తోటలోని వేడుకలు చూడ వెళ్లితిమి. నేను మా తల్లితో చెప్పియే వెళ్లితిని. మేమిరువురము సంతోషముతో ఇల్లు విడిచి నడుస్తూ, సాయంకాలం 6 గంటలకు తోటకు చేరితిమి. పిమ్మట కొంతసేపు బయటనున్న రంగులరాట్నమును ఎక్కి గిరగిర తిరిగి ఆనందించితిమి. చుక్కాణిలో కాశీ రామేశ్వరములను చూచి సంతోషించితిమి. ఆవల నాతో వచ్చిన పిల్లవాడు లోనికి పోదాము అని నన్నుకూడ పిలిచినాడు. నావద్ద అర్ధణాలేదని చెప్పితిని. అయితే నాతో వచ్చిన బాలుని వద్ద అర్ధణామాత్రమే యుండెను. అతడు నాయందలి సావాసమున నన్ను విడిచి పోలేక పోలేక లోపలికి పోయెను. అప్పడు నా చేతిలో ఆరు దమ్మిడీలు లేని కారణమున నేను దిగబడి ఉండవలసి వచ్చెను. అర్ధణా మాత్రమే చేతిలో ఉన్న ధనవంతుని బిడ్డ మాత్రము లోపలికి వెళ్లగలిగినాడు. నేను వెలుపలనే తిరుగుచుంటిని.

పిమ్మట కొంతసేపటికి లోపలి ఆవరణమునుండి పొగలెగయ నారంభించెను. మంటలు మండి వ్యాపించుచుండెను. ఆ మంటతో గూడ నెదురుబొంగులు పెఠీల్, పెఠీల్మని కాలి పగులుచున్న శబ్దము లోపలినుండి వినబడెను. లోపలికి పోయిన జనము బయటికి వచ్చుటకు ప్రయత్నించు చుండిరిగాని, పొగమంటవల్ల కండ్లుగానక దారితప్పి ఒకరిమీద ఒకరు పడుటయు, కాళ్లక్రింద స్త్రీలు బిడ్డలుపడి చితికిపోవుటయు తటస్థించెను. ఆనాటి ప్రదర్శనమునకు గొప్ప యింటివారు చాలామంది వచ్చియుండిరి. వచ్చిన పురుషులు వారి ఆలుబిడ్డలను వెతుకుచు ఒకరినొకరు గుర్తించలేక అగ్నిదేవున కందరు నర్పణమైరి.

అంతటి ఆనందమయమైన ప్రదేశమంతయు నొక్క అరగంట లోపల రుద్రభూమియై పోయినది. లోపలినుండి తప్పించుకొని రాగలిగిన వారిలో కొందరికి గాయములు, కాల్పులు, గ్రుడ్డితనము, ఏర్పడగా ఎట్లో వారు బయట పడిరి. కొందరు మంటలకు తాళజాలక సమీపములో నున్న కూవం నదిలో దూకిరి. వెలగల నగలు, ఇతర విలువైన పదార్ధములు ప్రదర్శించినవారు సొమ్మును విడిచి రాలేక అంగళ్లలోనే కాలిపోయిరి. అట్టి సమయమున చోరీలుకూడా మెండుగా జరిగినవి. మరణించిన బిడ్డల మీదను స్త్రీల మీదను యుండే, వెండి బంగారపు నగలు, వస్త్రములందలి సరిగెలు కరిగి బంగారము, వెండి ముద్దలు గట్టిపోయినవి. ఆ రోజులలో పురుషులును తగు మాత్రము నగలు ధరించేవారు. ఆనాడు అమావాశ్యనాటి నీలి ఆకాశమువలె రుద్రభూమియైయున్న ఆ వినోదప్రదేశమున, ఆ వెండి బంగారపు ముద్దలు నక్షత్రములవలె మిసమిసలాడుచు వెలుగసాగినవి.

ఇంతలో పోలీసువారు వచ్చి నిప్పునార్పు ఇంజన్లతో కాలిన కొరవులను, ఆర్పివైచిరి. ఆరోజులలో చెన్నపట్నంలో చాలినన్ని నిప్పునార్పు యంత్రములు (ఫైర్ ఇంజన్లు) లేవు కావున తెల్లవార్లు ఆ మంటల నార్పవలసి వచ్చినది. ఆరోజున నొక మహనీయు డొనర్చిన సేవ వర్ణనాతీతము. ఆయన క్రిస్టియన్ కాలేజీ ప్రిన్సిపాల్ మిల్లరుదొర. ఆయన నేటివారి వంటివారు కారు; పూర్వపు కణ్వ, గౌతమ కాణాదాది కులపతుల తలపించు కరుణార్ధ్ర హృదయుడు. ఆయన స్వయముగా, సాహసించి గుంజలెగబ్రాకి కాలుచున్న పందిళ్లను దులిపివేసినారు. పొగలోనున్న, శిశువులను స్త్రీలను ఇవతలికి తెచ్చి విడిచినారు. ఇంకెన్ని విధములుగానో అచ్చట బాధితులకు సహాయపడినారు. అంతేకాక కాలేజీకి వెళ్లి రిజిస్టరు చేతబుచ్చుకొని పొరుగూరు నుండి విద్యాభ్యాసమునకై వచ్చి, కోనకొక్కడు, గొందికొక్కడుగా నుండిన వారిని పేరుపేరు వరుసన తెలుసుకొని వారి యోగక్షేమములను విచారించి వారి తల్లిదండ్రులకు పోషకులకు తెలియపరచి, వారి ఆత్రము బాపిన శిష్యవత్సలుడగు మహాత్ముడతడు.

ఆ రుద్రభూమి నంతయు పోలీసులెంత కాపలా కాచినను, తెల్లవారేసరికి కరిగి ముద్దలైన వెండి, బంగారములు, వెదజల్లబడిన నవరత్నములు చాలావరకు ఆ నక్షత్రముల వలెనే మటుమాయమై పోయినవి.

ప్రదర్శనమున మంట ఎంత త్వరగా జ్వాలారూపమును దాల్చినదో, అంత త్వరగానే రాణితోట కాలిపోయినదన్న వార్త పట్నమంతా అల్లుకొనినది. మద్రాసులో ఆరోజు విశేష దినమగుటచే చాలా యిండ్లలో నుండి వేడుక చూచుటకు వెళ్లియుండిరి. ప్రదర్శనశాల భస్మమైన సంగతిని వినిన తోడనే వారివారి బంధువుల క్షేమము తెలుసుకొనుటకు వేలకు వేలు జనము వెర్రిత్తినట్టు ఆక్రోశించుచు, ఆ స్థలమునకు పరుగెత్తిరి. నల్లగా గాలి కొరివి దయ్యముల వలె నున్న ఆ శవములను చూచుటకు ఆరాత్రి అధికారులు అవకాశమివ్వరైరి. అందుచే వారి బంధువులందరును ఆరాత్రి అంతయు అక్కడనే యుండవలసి వచ్చినది. తెల్లవారిన పిమ్మట పోలీసువారు చచ్చిపడియుండిన వారిని గుర్తించుటకు వారి బంధువులకు అనుమతి నిచ్చిరి. అయితే చచ్చిన వారంతా నల్లగా బొగ్గు రూపమును దాల్చియుండుట వలన నిజమైన వారిని బంధువులు గుర్తించలేకపోయిరి. సగముకాలి వంటిన నగలున్న వారుకూడా కొందరుండిరి. అట్టివారిని 'మావారు' అని వీరు, 'మావారు' అని వారు తగాదాలను పెట్టుకొనిరి. కొందరిని మాత్రం బాగా గుర్తించగలిగిరి. చాలామంది గుర్తించనే లేకపోయిరి. ఆదినము రాత్రియింటికి 'రాని వారంతా, చచ్చినవారనే తలంపబడి, వారివారి ఇండ్లలో కర్మకాండ జరిపింపబడినది. కొన్ని యిండ్లనుండి కొందరు ఇంటిలో చెప్పకుండ అవసరము పనులపై గ్రామములకు వెళ్లినవారునున్నారు. అట్టివారికి కూడా వారి యిండ్లలో కర్మకాండ ముగిసిపోయినది. పిమ్మట ఆ ఊరికి పోయినవారు యింటికి తిరిగిరాగా, ఇంటివారును, వారును ఒకరి నొకరు చూచుకొన్నప్పడు వారివారి మనస్సు లెట్లుండెననేది పాఠకులే ఊహింపదగును.

ప్రదర్శనములోనుండి చావు తప్పించుకొని ఇవతల పడిన వారును కలరు. అట్టి వారిలో సుప్రసిద్ద పురుషులగు శ్రీ కొల్లా కన్నయ్యశెట్టి గారొకరు. వీరు మంచి కసరతు చేసిన బలశాలులు. వీరు లోపలినుండి బైటికి తడికల ఆవరణముపైకి పల్టీకొట్టి వెలుపలికి దూకిన సాహసికులు, చతురులు. వారట్లు దూకుచుండగా వారిమెడలో నుండిన పెద్ద పగడాల కంఠమాల జారి క్రిందపడిపోయినది. ఆదండ దొరికిన వాడు మరునాడు శెట్టివారింటికి వెళ్లి సమర్పించుకొని బహుమానమును పొందినాడు. ఆ కాలమున కొల్లా కన్నయ్య శెట్టిగారిని, వారి మెడలో యుండు పొగడాల మాలను తెలియని వారరుదు.

వీరు కోమట్లలో పెద్ద శెట్టి. వైశ్యులందరు వీరిని పూజించనిదే వారిండ్లలో శుభ కార్యములను చేసుకొనే వారుకారు. ధనికుడు; దాత; గంభీర పురుషుడు. వీరు శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవాలయపు ధర్మకర్తలు. వారు అప్పుడప్పు డాదేవాలయమునకు వచ్చుచుండేవారు. వారప్పుడు మొగమునిండ విభూతి పూసుకొని దానిపైన యర్రటి కుంకుమబొట్టు పెట్టుకొని, జోడు గుర్రముల ఫీటను బండిలో కూర్చుండి జోడు వింజామరలతో, ఇల్లు బయలుదేరి పరమేశ్వరి దర్శనార్ధము దేవాలయమునకు వచ్చునప్పుడు వారికి జరుగుచుండిన గౌరవము, మర్యాద ఇప్పడీ ప్రాంతమునకు వైస్రాయిగారు వచ్చినా వారికిన్నీ జరుగజాలదు. శెట్టిగారు దేవాలయమునకు వచ్చెదరన్న సంగతిని జనులకు తెలుపుట కొరకు దేవాలయములోని పెద్దగంటలను మ్రోగించేవారు. ఈగంట శబ్దమును విన్న వారందరును ఆదర బాదరగా నడుములకు పైపంచల కట్టుకొని, వీధి గుమ్మమున నిలువబడిశెట్టిగారికి రాగానే దాసోహముల సమర్పించేవారు. వీరి ఆస్థిపాస్థుల పరిమితి చెప్పవలయునంటే - ప్రస్తుతము హైకోర్టు దాని చుట్టుప్రక్కల కొన్ని బిల్డింగులుగల ప్రదేశమంతయు - నాడు వారి స్వంతము అని చెప్పిన చాలును.

ఇక నా సంగతి ఏమైనదో చెప్పెదను. నేను ప్రదర్శనమును చూచుటకు లోనికి పోకుండ బయటనుండి ప్రాణముల కాపాడుకొంటిని; నాతో కూడ వచ్చిన బాలుడు కనబడకుండుటచే చాలాదూరము వెలుపల గేటువద్ద నిలుచుంటిని గాని వాడు కానరాడాయెను. అప్పడు నేను వంటరిగా ఇంటివైపునకు తిరిగి పోవుచుండిని. నేను సెంట్రల్ స్టేషన్ ఎదుటికి వచ్చుసరికి నాపేరుపెట్టి పెద్దగా పిలుచుచూ ఆత్రముతో మాతల్లి పార్కువైపునకు పరుగెత్తుచుండెను. ఆమె గొంతును నేను గుర్తించితిని. వెంటనే పరుగెత్తి పోయి ఆమె ఎదుట నిలువబడితిని. అప్పడు మా అమ్మ నన్ను కౌగలించుకొని నిట్టూర్పు విడిచెను. ఆమె ఈప్రదర్శనము కాలిపోయిన వార్త విన్న వెంటనే పరుగెత్తుతూ వచ్చి నన్ను కలుసుకొనుటచే, వళ్లంతయు జోరు చమటలు పోయుచు అలసటచే రొప్పుచుండెను. నేనామె అవస్తను చూచి, రోడ్డు వార నామెను కూర్చుండమని చెప్పి నేనున్నూ కూర్చుంటిని. ఆ కూర్చుండిన చోటు సెంట్రల్ స్టేషన్ గేటు ఎదురుగా జనరల్ హాస్పిటల్ ఆవరణపు గోడ ప్రక్కన. ఇప్పటికిని నేనాప్రక్క వెళ్లినప్పడెల్ల పూర్వ స్మృతితో ఆ ప్రదేశమును గమనించి చూచుచుందును. అక్కడ కొంత విశ్రాంతి తీసుకొని ఒంటెద్దు బండి మీద యిరువురము యింటికి చేరితిమి. అప్పడు నాతో కూడవచ్చిన వాని తల్లి 'మావాడెక్కడ' యని అడిగెను. కాని నాకు వెంటనే నోట మాటరాక కొంతసేపటికి జరిగిన సంగతినంతయు తిన్నగా చెప్పితిని. వెంటనే ఆమె తన బిడ్డకొరకు పార్కునకు పరుగెత్తినది గాని, రాత్రి యంతయు అక్కడ వేచియుండి పిల్లవానిని గుర్తించలేక, తెల్లవారిన పిదప నిరాశతో ఆతల్లి యిల్లు చేరినది. చెన్నపట్నమున ఆనాటి దుర్దినం ఆవిధముగా గడిచిపోయినది.

Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf