Jump to content

చిన్ననాటి ముచ్చట్లు/బాల్యము - విద్యాభ్యాసము

వికీసోర్స్ నుండి

1

బాల్యము - విద్యాభ్యాసము

మా తల్లికి నేనొక్కడనే సంతానము. ఆమె తనకు ఆడబిడ్డలులేని ముచ్చట తీర్చుకొనుటకై నాకు ఆడపిల్ల వేషమువేసి ఇరుగుపొరుగిండ్లచూపి ఆనందించుట నాకిప్పటికిని జ్ఞాపకమున్నది. నా 5వ ఏటనే మా అమ్మ నన్ను మా ఊరిలో బడికి చదువ పంపినది. ఆ బడిపంతులు పేరు పిచ్చయ్యగారు. వారికి పిల్లకాయలకు చదువు చెప్పగల సామర్థ్యము లేకపోయినను చీటికి మాటికి వారిని చావగొట్టేవారు. అందుచేత వారిని చూస్తే పిల్లకాయలందరికి చాలా భయముగా ఉండేది. ఆకాలములో బడిపంతుళ్లకు నెలజీతములు లేక నెలకింతని జీతముగానిచ్చుట లేకపోయినను భోజనపదార్థములగు వరిగలను, కాయధాన్యములను, వంకాయలు, గోంగూర పచ్చిమిరప కాయలు మొదలగు కాయగూరలను, రైతుల పిల్లకాయలు తెచ్చి ఇచ్చేవారు. అందుచే వారు పంతులు దయకు పాత్రులై యుండేవారు. అట్టివారికి దెబ్బలుండవు. ఏమీ తేలేని వారికి మాత్రము, పంతులు బెత్తముతో కావలసినన్ని పేముపండ్లను ప్రసాదించేవారు. బడిలో పిల్లకాయల సంఖ్యను బట్టి ప్రభుత్వమువారు అప్పటికి కొంతకాలమునుండి, సాలీనా రొఖ రూపమున గ్రాంటు నిచ్చుచుండిరి. ఆ సర్కారు గ్రాంటుకై ఆయన తంటాలుపడి పిల్లకాయలను బడికి చేరదీసేవారు.

కొత్త పిల్లకాయలను బడిలోనికి చేర్చేనాడు, బడిలో చదివే పిల్లలందరికి పప్పుబెల్లాలు పంచి పెట్టేవారు. పంతులుకు వరహా (4 రూIIలు) మామూలైనను అందరు ఇచ్చుకొన గలిగేవారుకారు. అయినను పిల్లకాయలవల్లనే పంతులుకు సంసారము తేలికగా జరిగిపొయ్యేది. పంతులు ఇంటిముందు వేయబడిన పూరికొట్టములో మాబడి ఉండేది.

ఆ కాలమున గుంట ఓనమాలు నేర్చుకొని ఆ పిమ్మట కొయ్య పలకమీద వ్రాయడమారంభించేవారము. కొయ్యపలకమీద వ్రాయుటకు ముందు నీలిమందు, దోసాకు పసరులు పట్టించి, బాగుగా మెరుగుపెట్టి, ఎండలో పెట్టేవారము. ఆరిన పిదప దానిపై బలపముతో వ్రాయవలసి యుండేది. ఆ కాలమున బలపపు కోపులనే మెత్తటి తెల్లరాళ్లుండేవి. వాటిని తెచ్చి రంపముతో సన్నసన్న కోపులుగా కోసి వానితో ఆ కొయ్య పలకపై వ్రాసుకొనేవారము.

నాలుగైదు సంవత్సరములు ఆ బడిలో చదివిన మీదట పెద్ద పుస్తకమును (సామాన్యముగా రామాయణము, లేనిచో భారతమో భాగవతమో) పట్టించుట జరిగేది. సరస్వతి పూజ జరిపి పిల్లవానిచేత రామాయణమును పంతులు చదివించేవారు. ఆ దినమున పిల్లకాయలకు పప్పుబెల్లాలు పంచి బడికి ఆటవిడుపు (శెలవు)ను ఇచ్చేవారు. ఈపెద్ద పుస్తకముతో ఆ బడిలోని చదువు సమాప్తము. ఆ కాలమున పెద్దపుస్తకము పట్టుట పూర్తి అయినచో, ఈ కాలమున బి.ఏ. పట్టా పొందుట వంటిది.

నేను పేదవాడిని గనుక పంతులుకు ఏమియు సమర్పించుకోలేని కారణమున నాకు దెబ్బలు తప్ప చదువు అంతగా అంటలేదు. నేను బడికికూడా క్రమముగా పోలేకపోతిని. ఏలననగా మాతల్లికి నేను కొంత సహాయం చేయవలసి ఉండేది. మాఊరిలో గుండ్లకమ్మ అనే నది కలదు. నేను తెల్లవారగనే ఏటికిపోయి, కాలకృత్యములు తీర్చుకొని, చిన్నకావడిలో రెండు చిన్నతప్పేలాలు పెట్టుకొని, ఏటిలో నీటిని ఇంటికి తీసికొని పోయేవాడను. పిమ్మట చద్దిఅన్నమును తిని, ఎవరి పొలముల వద్దకైనా పోయి వంకాయలను, గోంగూర, పచ్చిమిరపకాయలను, దోసకాయలు మొదలైన వానిని అడిగి కోసుకొనివచ్చి తల్లికి ఇచ్చేవాడిని. మరి జొన్నకంకులు, సొజ్జకంకులను కూడా తెచ్చుకొనేవాడిని.

మా యింటి సమీపముననే ఉప్పలవారి మర్రిచెట్టు అని, యొక పెద్దచెట్టు ఉండెను. అది యిప్పటికిని యున్నది. దాని ఆకులు చాలా పెద్దవి. విస్తరాకులు కావలసి నేను ఒకనాడు ఆ మర్రియాకులను కోయుటకై చెట్టెక్కితిని. కొంతదూరమెక్కగానే కండ్లు తిరిగినవి. పైకెక్కలేను; క్రిందికి దిగలేను. అట్లనే చెట్టు కావలించుకొని యుంటిని. పట్టు తప్పెనా నీపట్టున వ్రాయవలసిన అగత్యముండేది కాదు. దైవవశమున ఇంతలో మరియొకడు ఆకులను కోసుకొనుటకు వచ్చి నా అవస్థ చూచి నన్ను వాడు మోకుతో క్రిందికి దించెను. అప్పటినుండి నేను చెట్టు ఎక్కడము మాని, దోటి కట్టుకొనిపోయి దానితో ఆకులను కోసి తెచ్చేవాడను. ఆ ఆకులతో విస్తళ్లను కుట్టేవాడను. జొన్నదంటు ఈనెలను సన్నగా చీల్చి, విస్తళ్లను సన్నగా కుట్టు నేర్పరితనము నాకు ఉండేది. నేను కుట్టిన విస్తళ్లను చూచిన మిషను కుట్టువలె ఉండేది.

నాతల్లి రవికెలు కుట్టడంలో చాలా నేర్పరి. ఊరివారంతా మా అమ్మవద్దకు వచ్చి రవికెలు కుట్టించుకొనేవారు. సాదా రవికెలు కుట్టిన ముక్కాలణా; పూలువేసి కుట్టిన ఒక్కణా; తేళ్లు, మండ్రగబ్బలు, పక్షులు - వీని బొమ్మలువేసి కుట్టిన రెండు అణాలు; యిచ్చేవారు. ఆ కాలమునాటి నాజూకు వస్తాలంకారములు పాలచాయ కోకలు, నల్లచాయ రవికెలు, గువ్వకన్ను, నెమలికన్ను అద్దకము రవికెలు. అట్లతద్దె పండుగ వచ్చినప్పడు ఆనాటి స్త్రీలు, ఈ విధమగు చీర రవికెల ధరించి, కొప్పలనిండ బంతిపూలు తురుముకొని కోలాహలముగా వుయ్యాలలూగు చుండెడువారు. అట్టి వినోదములు ఈనాటి స్త్రీలకు పరిచయము లేవు. అవి జాతీయమగు క్రీడా వినోదములు; దేహమునకు చురుకు, పుష్టినిచ్చునవి కూడ, మాతల్లి రవికెలను కుట్టి సంపాదించిన డబ్బు మా భోజనమునకు కొంతవరకు సరిపోయేది.

ఆ కాలములో పండుగనాడు, తద్దినము నాడు మాత్రమె వరి అన్నమును తినేవారము. తక్కినదినములలో జొన్నలు, సజ్జలు, వరిగలు వాడుకొనువారము.

నెయ్యి, వరిబియ్యమును మాత్రము డబ్బిచ్చి కొనేవారము. వంటచెరకునకై మాతల్లి పొలముల చాయవెళ్లి కంది దుంపలను త్రవ్వి తెచ్చెడిది. కందిమొక్కలను కోయునపుడు జానెడు లోపున భూమిపై విడిచి కోయువారు. ఆ విడువబడిన దానిని సమూలము త్రవ్వి తీయుచో చక్కని వంట చెరకుగా ఉపయోగపడేది. తిరగాపైరు వేయుటకు అడ్డములేకుండా ఈ దుంపలు తీసివేయవలయును. పైగా రైతు లటు నిటు పొలములలో తిరుగునప్పుడీ దుంపలు పొరబాటున కాలులో గుచ్చుకొన్నచో గాయమై ఒక రాగాన మానదు. అయితే తామే త్రవ్విస్తే కూలి ఇవ్వవలెను. అందుచేత సామాన్య రైతుల ఇంటి ఆడువాండ్లు వచ్చి వారి ఇంటికి వంటచెరకున కవసరమైనన్ని త్రవ్వి తీసుకొని పోవుదురు. రైతులున్నూ, పేదవారిని ఉచితముగానే త్రవ్వి తీసుకొని పోనిత్తురు. ఈ ప్రకారం మాతల్లి సం॥నకు చాలినన్ని దుంపలను త్రవ్వి జాగ్రత్త వెట్టేది.

మా ఊళ్ళో మా బంధువులు ములుకుట్ల కృష్ణయ్య అనేవారు భిక్షాటనమున, పౌరోహిత్యమున తన జీవితమును గడుపుకొనేవారు. వారు అప్పుడప్పుడు మా ఊరికి సమీపములో ఉండే బసవన్న పాలెమనే చిన్న గ్రామానికి భిక్షమునకు వెళ్లేవారు. నాకు ఉన్న ఊరిలో బిచ్చమెత్తుకొనుటకు లజ్జగా ఉండేది. అందుచేత కృష్ణయ్యతో కూడా బసవన్న పాలెమునకు జోలెకట్టుకొని భిక్షమునకు పోతిని. నేను చిన్నవాడిని అగుటచేతను, కొత్తగా వెళ్లుటచేతను, ఆ వూరి అమ్మలక్కలందరూ నన్ను ప్రేమతో లాలించి కృష్ణయ్యకు కంటే ఎక్కువగా నాకు బిచ్చము పెట్టినారు. కృష్ణయ్య జోలెకన్న నాది పెద్దదైనది. మోయ జాలనైతిని. అప్పుడు నా అవస్థ చూచి కృష్ణయ్యగారు నా మూటను గూడ కొంచెము దూరము వారే తీసుకొనిరి. మధ్యాహ్నమునకు ఇంటికి చేరినాము. అప్పడు మా తల్లి నా జోలెమూటను జూచి సంతసించినది; గాని వెంటనే నా చమటలు, అలసట, ఆయాసము చూచి భోరున ఏడ్చినది. తక్షణమే నన్ను స్నానము చేయించి, కడుపునిండ అన్నముపెట్టి నిదురపొమ్మని ఆమె భోజనమునకు పోయినది. ఆమె భోజనము చేసివచ్చే లోపలనే నేను నిద్రపోతిని. నాతల్లి నాకాళ్లవైపున కూర్చుండి ఏడ్చుచుండెను. నాకు మెలకువ వచ్చి "ఎందుకేడ్చెదవమ్మా అని నేనడుగగా నాకాళ్లలో ముళ్లుగుచ్చుకొని యుండుటను చూపినది. నేను భిక్షాటనమునకై పోయివచ్చిన డొంకన తుమ్మ ముళ్లు విస్తారముగా నాకాలిలో విరిగియుండెను. వాని నన్నిటిని ఆమె సూదితో మెల్లగా తీసివైచి మరల ఎన్నడు అట్లా భిక్షాటనమునకు పోనని నాచే ప్రమాణము చేయించుకున్నది.

మా ఇంటి యెదుటనే మా మేనమామగారు ములుకుట్ల మహదేవయ్యగారు నివసించేవారు. కాని వారి సహాయము మాకు ఏమీ లేకుండెను. మా మామగారు ధర్మరాజు వంటివారు. మా అత్తగారు మాత్రము గయ్యాళిగంప. వారి ధాటికి మా మామగారేగాక ఊరివారంతా భయపడేవారు. ఆమె అమిత జగడాల మనిషి ఎవరినైనా తిట్టదలుచుకుంటే తిట్టిన తిట్టు మరల తిట్టకుండా రెండు మూడు గంటల కాలము తిట్టగల శక్తి ఆమెకు గలదు. అందువల్ల ఆమెను చూచిన యింటివారికి, వెలుపలి వారికికూడా అమిత భయము. ఈ కారణమున మా మేనమామ మాకు సహాయమొనర్ప జాలకుండెను.

ఈ విధముగా సమీప బంధువుల సహాయములేక, స్వయం శక్తిచే సంపాదించి తాను వంటిపూట భుజించి, నాకు వీలువెంట రెండుమూడు పూటలు అన్నము పెట్టుచు నా తల్లి నన్ను కంటిని రెప్పవలె పోషించు చుండెను. అప్పడామె కష్టమును చూడలేక ఆమెతో చెప్పకుండానే మా ఊరినుంచి కాలినడకన మద్రాసుకు చేరినాను.