చిన్ననాటి ముచ్చట్లు/ఇద్దరు తల్లుల చలవ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
3

ఇద్దరు తల్లుల చలవ

రాణితోటలో ప్రదర్శనశాల తగులబడిపోయిన పిమ్మట నా తల్లి నన్ను ఒంటరిగ మద్రాసులో విడిచిపెట్టిపోలేదు. మేమిరువురము మద్రాసులో యుండవలసివచ్చినది. నేను బడిలో చదువుకుంటూ యిద్దరు వర్తకుల పిల్లకాయలకు బడిపాఠములను చెప్పచుంటిని. వారు నాకు నెలకు చెరియోకరు 2-8-0 లు ఇచ్చేవారు. ఈ రూ.5 ల వరుంబడితో ఇద్దరము మద్రాసులో బ్రతుకుటకు కష్టమైనది. నా తల్లి ఒక కోమటి ఇంట్లో వంటచేయుట కారంభించినది. అందుకు వారామెకు నెలకు రూ.5 లు ఇచ్చేవారు. ఈ విధముగా ఇరువురము కలిసి రూ. 10 లు తెచ్చుకొనుచు కాలము గడుపుచుంటిమి. ఆ కాలమున రూపాయికి బియ్యం 6 పళ్లు మొదలు 8 పళ్ల వరకు ఇచ్చుచుండిరి. సమీపమునయున్న రావిచెట్టు అగ్రహారమున బిక్షమెత్తుకొనే బ్రాహ్మణులు రూపాయకు 8 పళ్ల బియ్యమును అమ్మేవారు. మేము తరుచుగా వారివద్దనే బియ్యం కొనేవారము. ఈ ప్రకారము కొంతకాలము జరిగినది.

ఆ కాలమున కాలేజీలో చదువుకొనే విద్యార్థులకు "హాస్టల్స్ లేవు. తెలుగువారికి అరవహోటలు భోజనము సరిపడేది కాదు. అందువల్ల ఆంధ్రులు ఎక్కడనైనా ఒక్క రూమును చదువుకొనుటకు అద్దెకు తీసుకొని సామాన్య గృహస్థుల ఇండ్లలో డబ్బిచ్చి భోజనము చేసి చదువు కొనుచుండేవారు.

ఆ రోజులలో టంకసాల వీధిలో కాశీపాటి (వారింటిపేరు కాశీవారు; ఆమెను - పాటి అనగా అరవంలో అవ్వా అనేవారు) హోటలులో కంది పచ్చడి, వేపుడు కూరలు వడ్డించేవారు. అందువల్ల కొందరాంధ్రులు అక్కడ చేరసాగినారు. ఈ హోటలులో అరవలు, ఆంధ్రులు కలిసి యుండుటవల్ల భోజనపదార్ధములలో పేచీ వచ్చి, ప్రతిదినము పిల్లకాయలు దెబ్బలాడుకొనుచుండేవారు. ఇందువల్ల ఆమె తెలుగువారిని తన హోటలుకు రావద్దని వెళ్ళగొట్టినది.

ఆ సమయంలోనే అమ్మాయమ్మయను తెలుగుఆవిడ తెలుగువారికి ప్రత్యేకంగా హోటలుపెట్టి, తెలుగువారికి సరిపడు వంటకములను చేసి, పిల్లకాయలను తృప్తిపరచుచుండెను. ఆ కాలమున హోటలుకు నెలకు రూ. 7లు మొదలు రూ. 10 లు వరకు ఇవ్వవలసియుండెడిది. అమ్మాయమ్మయు తెలుగువారివద్ద రూ. 10 లు వసూలు చేసెడిది. కాని వీరికి వేపుడుకూరలు, కోరిన పచ్చళ్లు, ఆవకాయ, ఊరగాయ వగైరాలు - ఇవి కలుపుకొన్నపుడెల్లా ముద్దముద్దకు చారెడేసి కమ్మనినేయి - ఈ విపరీతపు ఖర్చుకు తట్టుకోలేక పోయినది. ఆమె వీరిని భరించజాలక హోటలు ముగించి తలుపు మూసినది.

క్రమముగా ఆంధ్ర విద్యార్థులు మద్రాసులో విస్తారమైనారు. కొందరు విద్యార్థులు భోజనమునకై ఈ ఇబ్బందులు పడలేక ఇక్కడ కాపురములే పెట్టకొనసాగినారు. అయితే ఆంధ్రులకు అరవలుండు ఇండ్లలో కాపురమునకు స్థలము చిక్కుట దుర్లభమైనది. ఏలనంటే ఆంధ్రులకు ఆచారము లేదు; మగవారు చుట్టలు త్రాగుచు ఎక్కడ పట్టిన అక్కడ ఇల్లంతా ఉమ్మివేయుచుందురు; బిడ్డలు ఇల్లంతయు చెరిచెదరు; సాధారణముగా స్నానము చేయరు - అని అరవవారికి వీరియందొక అపోహ. ఇది కేవలము అపోహయే కాదేమో!

సరిగా నిట్టి సమయంలో వంగవోలునుండి కొండపి రామకృష్ణా రావు, గొట్టెపాటి చెంచు సుబ్బారాయుడుగార్లనే వారిరువురు మద్రాసుకు కాలేజీ విద్యకై వచ్చిరి. ఈ చెంచు సుబ్బారాయుడుగారు హైకోర్టు జడ్డీ గౌరవనీయులగు శ్రీ చింతగుంట రాఘవరావుగారి మామగారు. చెంచు సుబ్బారాయుడుగారు చాలా ఆచారవంతులు. కాఫీ పుచ్చుకొనేవారు కారు; చిరుతిండ్లు తినేవారు కారు; శివార్చన చేయనిది భుజించేది లేదు: సత్యవంతుడు. ఇట్టివారికి నగరంలో భోజనవసతి దొరకుట కష్టసాధ్యము. వీరిరువురు మా ప్రాంతమువారగుటచే కాబోలు ఎట్లో నన్ను తెలిసి కలుసుకొన్నారు. ఎట్లైనా తమకు భోజనవసతి ఏర్పాటు చేయమని గట్టిగా కోరినారు. నేను అప్పడు నా తల్లితో యోచించి, ఆమె చేయుచున్న వంటకొల్వును మాన్పించి, వీరిరువురికిని ఆచారముగ అన్నము వండిపెట్టు ఏర్పాటు చేసినాను. మేము అగ్రహారములో పెద్దగదిని అద్దెకు పుచ్చుకున్నాము. మా తల్లి అనుకున్న ప్రకారము వీరిరువురికిని వంటచేసి పెట్టుచు వచ్చినది. చెంచు సుబ్బారాయుడు గారికి ఆచారమే గాకుండా కొన్ని భోజన నియమములు కూడ యున్నవి. ఈ ఊరి కాయగూరలను తింటే ఏమేమో జబ్బులు వస్తవి అని వారి భయము. అందువల్ల ఇంటినుండి చింతపండు పచ్చడిని, ధనియాలపొడిని తెప్పించుకొని వాటితోను చారు మజ్జిగలతోను భుజించుచుండెడివారు. పండుగనాడుకూడా వారికదే భోజనం. చదువుకొనుటకు వారు యేర్పాటు చేసుకున్న రూముకు రాత్రిళ్ళు నేను గూడ వెళ్ళి వారికి తోడుగ పడుకొనేవాడను. ఈ కారణమువల్ల వారికి నాకు మంచిస్నేహము కుదిరినది. వీరితో కూడ యుండిన కొండపి రామకృష్ణరావుగారున్ను చాలా పెద్ద మనుష్యులు. వారిరువురితో నేను చాలా చనువుగా ఉండేవాడను.

ఇట్లుండగా నా తల్లి అకస్మాత్తుగా చనిపోయినది. మద్రాసులో నేను మరల ఏకాకినైనాను. నాకు భోజనమునకే కరవైనది. అయితే ఈసారి నాకు మరి ఇరువురు తోడైనారు. మాయింట్లో భోజనము చేయుచుండిన విద్యార్థులకు కూడ భోజనవసతి తప్పిపోయినది. మేము ముగ్గురమును చాల కష్టపడవలసి వచ్చినది. కాని దైవమొక దారి చూపినాడు.

మేముండే ఇంటిలోనే జొన్నలగడ్డ నరసమ్మ అనే ఆమె కాపురమున్నది. ఆమెను నేనాశ్రయించి వారిరువురికిని భోజనము వండిపెట్టుటకు వప్పించితిని, నరసమ్మ సమ్మతించుచు, మరి ఎవరినైనా కొంతమందిని కూడా కుదిర్చిన బాగుండుననెను. అప్పడు నేను కావలి కాపురస్తులగు విస్సా రామారావుగారిని, వెన్నెలకంటి కృష్ణస్వామి రావుగారిని, ఓరుగంటి వెంకటసుబ్బయ్యగారిని జతగూర్చితిని. అప్పడది యొక చిన్న భోజనశాలయైనది. నరసమ్మగారు వంటరియగుటచే ఆమెకు కావలసిన వస్తువులు తెచ్చియిచ్చుచు, నేనుకూడ ఆ విద్యార్థులతోకూడ భోజనము చేయుచుంటిని. నరసమ్మ గారు తెనుగువారి వంటలను రుచికరముగా చేయుటలో మంచి నేర్పరులు. నరసమ్మ గారికి సంతానము లేదు. దైవికముగా కల్గిన మా పరస్పర సన్నివేశము వలన ఆమెకు నాయందు పుత్రవాత్సల్యమును, నాకామె యందు మాతృభక్తియు కుదిరి పెంపొందినవి. నా తల్లిపోయిన వెంటనే ఈ విధముగా దేవుడు నాకు మరియొక తల్లిని చూపుట నా అదృష్టమే.

నేను చదువు చాలించుకొని ఉద్యోగంకొరకు ప్రయత్నించుచుండగా, బెంగుళూరు సమీపమునయుండు చిక్బళాపురము పోలీసు ఇన్సెక్టరుగారు మద్రాసుకు వచ్చియుండిరి. ఒకరు నన్ను పరిచయపరచిరి. వారు నాకు పోలీసు డిపార్టుమెంటులో యేదైన ఉద్యోగమును ఇప్పించెదనని వాగ్దానము చేసిరి. అందువల్ల వారిని పలుమారు కలుసుకుంటూ వచ్చితిని. ఇంతలో ఇన్సెక్టరు గారి కూతురికి పెండ్లి మద్రాసులోనే కుదిరెను.

ఆ పెండ్లికి నెయ్యి, చక్కెర వగైరా సామానులు కావలసి వచ్చెను. వారు ఈ ఊరికి కొత్త అగుటచే నన్ను తన్నెవరికైన సిఫారసు చేయమని అడిగిరి. అప్పడు అగ్రహారం ప్రక్కనయున్న మళిగె అంగడివానితో చెప్పి సామానులను ఇప్పించితిని గాని ఆయన డబ్బు యివ్వలేదు. అంగడివాడు ఆయన పేర పద్దు వ్రాసుకొని దానిపై నా చేవ్రాలుకూడ పెట్టమనెను. పెట్టితిని, పెండ్లికాగానే ఇన్స్పెక్టరు ఊరికివెళ్లి పైకమును పంపెదనని చెప్పిరిగాని పంపలేదు. నేను కూడా వారి ఊరికి వెళ్లి అడిగితిని, ఇప్పుడు పైకము లేదు; వెనుక పంపెదనని చెప్పి నన్ను సాగనంపెను. కొంతకాలము అంగడివాడు వేచియుండి కోర్టులో దావాచేసి మా యిరువురిమీద డిక్రీ పొంది నన్ను అరెస్టు చేయించి, అప్పుల జైలులో పెట్టించెను. పగలు 10 గం౹౹లకు నన్ను జైలులో నుంచిరి. నేను సకాలమునకు భోజనమునకు రానందున నరసమ్మగారు నన్ను గూర్చి విచారించగ, నేను నిర్బంధములోనున్నట్లు ఆమెకు తెలిసి, ఆతురతతో గిన్నెలో అన్నమును తీసుకొని నడియెండలో నావద్దకు నడిచివచ్చినది. నన్ను చూచి నా అవస్థకు కన్నీళ్లు పెట్టుకొనుచు, కన్నకొడుకునకు వలె కనికరముతో ఆ దినమున నాకు అన్నముపెట్టిన ఆ చల్లనితల్లి దృశ్యమును నేను ఇప్పటికిని మరువజాలను. ఆ సాయంత్రమే నా బాల్యస్నేహితులగు అన్నం చెన్నకేశవులు శెట్టిగారు నా అవస్థను విని జైలుకు వచ్చి, నా బాకీ రూ. 150 లు చెల్లింఛి నన్ను విడుదల చేయించినారు. నేను ఆ నిర్బంధములో 6 గం౹౹ల కాలము గడపవలసి వచ్చినది.

పిమ్మట నేను ఉద్యోగమునకై పలువిధముల పాకులాడవలసి వచ్చినది. అప్పడు వేసిన ట్రాంబండ్లలో వుద్యోగమునకై ప్రయత్నించితిని; కాలేదు. ప్లీడరు గుమాస్తా పని ఒక నెల మాత్రమే చేస్తిని; అదియు తుదముట్టలేదు. కడకు ఏదియు కొనసాగలేదు. ఇతరులను ఆశ్రయించి ఉద్యోగమును సంపాదించుకొనుట అసాధ్యమైనదని తోచి ఆ కార్యమును విరమించుకున్నాను.

Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf