చిన్ననాటి ముచ్చట్లు/కేసరీ కుటీర స్థాపనము
4
కేసరీ కుటీర స్థాపనము
ఉద్యోగమునకై చేసిన పలువిధములైన ప్రయత్నములు విఫలములైన పిమ్మటనే వైద్యమును నేర్చుకొనుటకు ప్రారంభించితిని. చల్లనితల్లి నరసమ్మగారి చేతి ప్రసాదముతో నాకు కాలము గడుచుచున్నది. కాని ఆమె మాత్రము నాకెంతకాలము భోజనం పెట్టగలదు? అనాథ వద్ద ఉచితముగా భోజనం చేయుటు నాకే అవమానముగ తోచినది.
ఆ కాలమున మద్రాసులో తెలుగు బోయీలు చాలామంది యుండెడివారు. వారు మద్రాసు బ్యాంకి, నేషనల్ బ్యాంకి, ఆగ్రా బ్యాంకి మొదలైన బ్యాంకులలో నౌకరుగా ఉండేవారు. అప్పడు మద్రాసు బ్యాంకి బ్రాడ్వేలోను, నేషనల్ బ్యాంకి ఆగ్రా బ్యాంకీలు ఆర్మీనియన్ వీధిలోను ఉండేవి. అక్కడ కొలువుచేసే బోయిూ లందరు ప్రతి ఆదివారము నావద్దకు వచ్చి వారి బంధువులకు జాబులు వ్రాయించుకొని పోయేవారు. కార్డు వ్రాసిన అర్ధణా; కవరు వ్రాసిన ఒక అణా ఇచ్చేవారు. ఈ ప్రకారము నాకు ప్రతి ఆదివారము కొంతడబ్బు వచ్చుచుండెను.
వైశ్యుల ఇండ్లలో పిల్లకాయలకు పాఠములు చెప్పట వల్ల కొంతడబ్బును సంపాదించుచుంటిని. ఈ సంపాద్యము లాధారముగా నరసమ్మగారికి నెలకు రూ. 3-0-0 లు చొప్పన ఇచ్చుచు భోజనము చేయుచుంటిని.
కోమట్ల ఇండ్లలో పిల్లకాయలకు పాఠములు చెప్పుట వలన వార్ల పరిచయము నాకు అధికమైనది. ఆ చనువున వారు అప్పుడప్పుడు నాకు కొన్నిపనులు చెప్పి చేయించుకొనుచుండిరి. ముఖ్యముగా నా యిండ్ల ఆడువారు తమ తమ బంధువుల ఇండ్లకు నన్ను పంపి, వారి ఇంట్లో యేమేమి కూరలు, ఫలహారములు చేసుకొన్నదిన్నీ, వచ్చే ఆదివారమునాడు ఆళ్వారు శెట్టిగారింట్లో జరుగబోవు పెండ్లికి ఆ యింటి భాగ్యశాలి యేమి చీరె కట్టుకొని రాదలచినదిన్నీ - మొదలుగాగల వర్తమానములను తెలుసుకొని రమ్మనేవారు. ఈ సమాచారములు తెలిసి రాగలిగినందుకు వారు నాకు అప్పుడప్పుడు డబ్బును, వస్త్రములను బహూకరించుచుండెడివారు. వీరి పరిచయము వల్ల క్రమముగ నాకు అన్నవస్త్రముల కరువు తీరినది. వైద్యమును నేర్చుకొన్న పిదప ముఖ్యముగ ఈ కోమట్ల ఇండ్లలో హెచ్చుగా వైద్యము చేయుట కవకాశము కల్గినది. వీరు నాకు రాజపోషకులైరి.
పిమ్మట వారి సహాయ్యముననే శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆయుర్వేద ధర్మవైద్యశాలలో నౌకరిని సంపాదించుకొంటిని. ఏలననగ ఈ ధర్మ వైద్యశాల వారి కులదేవతయగు శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవాలయపు ధర్మకర్తలచే స్థాపింపబడినది. ఈ దేవాలయములో ప్రతిదినము పేదబ్రాహ్మణ విద్యార్థులకు, అన్నమును పెట్టుచుండిరి. ఆ కాలమున వైశ్యులకు బ్రాహ్మణభక్తి ఇప్పటికన్న అధికముగా నుండుటచే అన్నదానము ధారాళముగా జరుగుచుండెను.
ప్రతి సంవత్సరమును శరన్నవరాత్రములలో ఉత్సవములకు ఈ కన్యకా పరమేశ్వరీ దేవాలయమున 9 దినములు బ్రాహ్మణ సంతర్పణ జరుగును. ఈ సంతర్పణలలో ప్రతిదినము 2000 బ్రాహ్మణులకు తక్కువలేకుండా భోజనమును చేయుచుండిరి. ఇక్కడ తయారుచేయు భోజన పదార్థములు వంకాయకూర, చారు వగైరాలు చాలా ప్రశస్తములుగా నుండెడివి. ఇట్టి అద్భుత పాకకళా నిపుణులలో ముఖ్యముగా బుర్రా కుటుంబయ్యగారు, భీమవరం కాపురస్తులగు ములుకుట్ల సుబ్బయ్య, జాలయ్య, అప్పయ్య, వీరు యెన్నదగినవారు. ఇందులో జాలయ్య మంచి కసరత్తు చేసిన వస్తాదు. కొల్లా కన్నయ్య శెట్టిగారితో కూడ గరిడీని నేర్చుకున్నవారు. వారారోజులలో ఆ తొమ్మిది రోజులకు 1116 ర్లు తీసుకొనేవారు. జిహ్వాచాపల్యము తీర్చుకొనుటకై అమ్మవారి ప్రసాదమని అభ్యంతరములేకుండా ఆనాటి గొప్ప యిండ్లవారుకూడా ఏదో యొక రోజున పంక్తి భోజనమునకు వచ్చేవారు. ఏ కారణముచేనైన రాజాలని పెద్దలు ఆ ప్రసాదమందలి తీపిచే ఇండ్లకైన తెప్పించుకొని భుజించేవారు.
నేను దేవాలయమునకు సంబంధించిన నౌకరినగుటచే ఆ తొమ్మిదిరోజులు వంటశాల భోజనశాలలకు, నన్ను సూపరింటెండెంటుగా నియమించేవారు. ఈ వంటశాలలోని నెయ్యి, బియ్యము, చక్కెర, కుంకుమపువ్వు, పచ్చకర్పూరము, ద్రాక్ష వగైరా వెలగల సామానులు సామాన్యముగా చోరీ అగుచుండేవి. ఆ చోరీలు జరుగకుండా జాగ్రత్తగా చూచుట, వంట చక్కగచేసి, వడ్డన శ్రద్ధగా జరుపుట మున్నగు కార్యములను గమనించుట నా పనులుగా నుండెడివి. ఎంత జాగ్రత్తగ నుండినను చోరీలు జరుగుచునే యుండెడివి. బియ్యమును దొంగలించు విధము : ఒక పెద్దగంపకు సగము వరకు బియ్యమును పోసి దానిపైన భుజించిన ఎంగిలి ఆకులను నిండుగ కప్పినింపి, ఆ గంపను బయటికి పంపుట; నేయి దొంగలించు విధము : పేరిన నేయిని తప్పెలలోపోసి దానిపైన బియ్యపు కడును పోసి, పశువుల కుడితి యని బయటికి సాగనంపుట; కుంకుమపువ్వు వగైరా చిన్నవస్తువుల దొంగతనము : పొట్లాలుగట్టి భోజనమునకు వచ్చిన ఇతరులచేతికి రహస్యముగా నిచ్చి బయటకి దాటించుట. ఇట్లే అనేకమగు ఉపాయములు. ఈ వుద్యోగము వలన నాకు పాకకళ చక్కగ అబ్బినది. విజయదశమినాడు అమ్మవారికి గొప్ప పార్వేట ఉత్సవము జరుగును. ఆనాడు అమ్మవారికి వజ్రములతో చెక్కబడిన అనేక ఆభరణముల నలంకరించి వూరేగించెదరు. మామూలుగా అమ్మవారు గిడ్డంగివీధి అనే వరదాముత్తియప్పన్ వీధిగుండ పోవుట ఆచారము. దుండగులు దుర్మార్గము చేయుదురనే, విషయం దేవస్థానం ధర్మకర్తలకు కొద్దిగ తెలిసి పోలీసు సిబ్బందితో అమ్మవారి ఉత్సవమును సాగించిరి. అమ్మవారి వెంట వచ్చు పోలీసు సిబ్బందిలో ముఖ్యలు వెల్డన్ యను దొరగారు. ఆయన ఆకాలమున పోలీసు శాఖలో పేరుపొందిన వారిలో నొకరు. వీరితో కూడ మరి ముగ్గురు సార్జంటులు గుర్రములనెక్కి ముందు నడచుచుండిరి. అమ్మవారికి ముందుగా ముఖ్య ధర్మకర్తలగు శ్రీ కొల్లా కన్నయ్యశెట్టిగారు. వారి చుట్టును ఇతర ట్రస్టీలగు వైశ్యులును నడుచుచుండిరి. వారి వెనుక దేవస్థానపు నౌకర్లు. వారిలో నేనును, పండిత గోపాలాచార్యులు మున్నగువారు నుంటిమి. ఆ కాలమున అమ్మవారితో కూడ దివిటీలను పట్టుటకు 'సోమరివాండ్లు' అని యొక వర్గముండే వారు. వారు ఇనుప త్రిశూలములకు బిగించిన కర్రలను తీసికొని ఆ త్రిశూలములకు పాతగుడ్డలను గుండ్రముగాచుట్టి, నూనెతో తడిపి దివిటీలను వెలిగించి వెలుతురు చూపుచు వెంట నడిచేవారు.
ఆనాడు రాత్రి 10 గం|| లైనది. ఉత్సవము గిడ్డంగివీధిలో సాగినడచుచున్నది. ముందు నడచుచున్న పోలీసు సార్జంట్లు నలుగురు దుండగుల మీదికి గుర్రాలను దుమికించిరి. వారప్పడు చెదరిపోయిరి.
అమ్మవారిని క్రింద పడవేసి నగ లపహరింతమని యుద్దేశించిన దుండగుల అభిలాష విఫలమైనది.
వైద్యశాలలో నేను చేయుచున్న నౌకరివల్ల నా వైద్యవృత్తికి కూడ మెరుగువచ్చినది. అప్పుడు నా జీవితములోని కష్టములు చాలా భాగము మరుగైనవి. గోపాలాచార్యులవారికిని, నాకును మంచిస్నేహము కుదిరినది. గోపాలాచార్యులుగారు మద్రాసుకు క్రొత్తయగుటచే నేనువారికి కొంత సహాయమును చేయవలసి వచ్చినది. మొదట వైద్యశాల గిడ్డంగి వీధిలో దేవాలయమునకు సంబంధించిన కొట్లలో యుండెను. ఈ వైద్యశాల యెదుటనే నా స్నేహితుడగు అన్నం చెన్నకేశవులుశెట్టిగారి యిల్లు. గోపాలాచార్యులు గారు నివసించుటకు స్థలము లేనందున శెట్టిగారి యింట్లో, ఒక రూమును ఆచార్యులవారికి యిప్పించితిని. అప్పడు నేను నరసమ్మగారికి నెలకు రూ. 10 లు ఇచ్చి భోజనము చేయుచు, రాత్రిళ్ళు శెట్టిగారి యింటిలోనే పండుకొనుచుంటిని. ఆచార్యులవారు, నేను యిరువురము శెట్టిగారి యింట్లోనే యుండుట తటస్థించెను. మద్రాసులో వైద్యవృత్తికి కొంత డంబముండవలయును. ఆ డంబము ప్రదర్శించుటకు డబ్బు కావలయును. ఆచార్యులవారికి వైద్యశాలలో జీతము రూ. 30 లు మాత్రమే. అందువల్ల శెట్టిగారితో చెప్పి వారికి కొంతడబ్బు అప్పు ఇప్పించితిని. క్రమముగా వారు మద్రాసులో పేరు సంపాదించుకొనిరి.
ఆచార్యులవారును నేనును వైద్యశాలలో 4 సంవత్సరములుపాటు సోదర భావముతో కాలమును గడుపగల్గితిమి. ఆచార్యులవారు ఆయుర్వేదాశ్రమమును పేరుతో ఒక వైద్యశాలను స్థాపించి ముఖ్యముగ ప్లేగుమందుల మాహాత్మ్యములను కరపత్రముల ద్వారా ప్రచురించుచు వ్యాపారమును సాగించిరి. ఆ కాలమున బెంగుళూరు ప్రాంతములలో ప్లేగు తీవ్రముగ వ్యాపించియుండెను. ఆచార్యులవారికి ఆంగ్లభాష పరిచయము లేనందున ఈ వ్యాపారములన్నియును నేనే చేయుచుంటిని; గాని నాకు లాభమేమియు లేకుండెను. ఈ కారణములవల్ల నేనే వేరుగ కేసరికుటీర మనుపేరుతో వైద్యశాలను స్థాపించితిని. పనిచేయుచున్న వైద్యశాలలో నేనే మొదట రాజీనామా యిచ్చితిని. పిమ్మట కొంతకాలమునకు ఆచార్యుల వారును రాజీనామా యిచ్చిరి. అప్పటినుండి స్వంత వైద్యాలయములను నడుపుకొనుచుంటిమి.