Jump to content

చిన్ననాటి ముచ్చట్లు/కందుకూరి

వికీసోర్స్ నుండి

18

కందుకూరి

శ్రీ పంతులుగారు ఆంధ్రమహిళా లోకమునకు చేసిన మహోపకారమును వెల్లడిపరచుచు పలువురు వ్రాసిన వ్యాసములను ఈ మాసపు 'గృహలక్ష్మీ' పత్రికలో కాననగును. శతవార్షిక జన్మదినోత్సవమున వీరిని స్మరించి నమస్కరించి నాకు వీరు చూపిన పరమోత్కృష్ణ సంఘసేవా మార్గమున నేను చేయదగిన స్వల్పవిషయములను, అనుభవములను వ్రాయుచున్నాను. నేను మద్రాసునకు వచ్చిన కొంతకాలమునకు పంతులుగారు ప్రెసిడెన్సీ కళాశాలకు ఆంధ్రపండితులుగా వచ్చిరి. 1904లో కాబోలు వారా పదవి నుండి విరమించిరి. ఆ మధ్యకాలమున అప్పుడప్పుడు వారిని దర్శించుట తటస్థించుచుండెను. తలపాగా, చాదుబొట్టు, తెల్లని మీసములు గల అప్పటివారి ముఖవిలాసము ఇంకను నాకు మరుపు రాలేదు. పిమ్మట వారప్పుడు చేయుచుండిన స్త్రీజనోద్ధరణ, సంఘసేవల గూర్చి తరచుగ వినుచుంటిని. ఆ కాలమున వారు వ్రాసిన గ్రంథరాజములను నేను చదువుచుంటిని. ఆంధ్రదేశమున స్త్రీ పురుషులు వీరి నవలలను, ప్రహసనములును, నాటకములను విడువక చదువుచుండిరి. విద్యాలయములలోకూడ వీటిని పాఠ్యగ్రంథములుగ నిర్ణయించియుండిరి. ఈ కారణములచే స్త్రీలలో మంచి సారస్వత చలనము కలిగినది. అప్పటి నుండియే మన ప్రాంతమున స్త్రీ విద్యాభివృద్ధికి ప్రారంభమని చెప్పవచ్చును.

వీరు ఆంధ్రదేశమున సంఘసంస్కరణ కార్యక్రమమును తలపెట్టినప్పుడు బాల వితంతువులు మెండుగనుండిరి. ఒక సం|| వయసుగల ఆడపిల్లలకుకూడ వివాహము చేయుచుండిరి. ఇందువలన బాలవితంతువుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుచుండెను. అప్పడు ఈ అనాథలకు ఆలన పాలన లేకుండెను. చిన్నబిడ్డలను పెద్దలకు విక్రయించి తల్లిదండ్రాదులు ధనమును గడించుచుండిరి. ఇట్టి విషమస్థితిలో, దైవము వీరేశలింగముగారి హృదయమున ప్రవేశించి స్త్రీ దౌర్భాగ్యమును రూపుమాప ఆయనను ప్రేరేపించెను.

కౌతా శ్రీరామశాస్త్రిగారు బందరు కాపురస్తులు వితంతు వివాహమాడినవారు 'శారద' యను సచిత్ర మాసపత్రికను 1923లో స్థాపించి కొంతకాలము నడిపించియుండిరి. వందేమాతరోద్యమములోను, బ్రహ్మ సమాజప్రచారమునను పనిచేసియుండిరి. కొంతకాలము బందరు జాతీయ కళాశాలయందు ఉపాధ్యాయులుగకూడ ఉండిరి. బంగాళీభాషనుండి భక్తియోగము, పూర్ణ యోగము మున్నగు గ్రంథములు కొన్ని తర్జుమా చేసియున్నారు. వీరు శారద పత్రికను ఉచ్ఛస్థితిలో నడుప యత్నించిరి, చాల నష్టపడి బందరు విడిచి మద్రాసు చేరిరి. వారికి నా యింటనే స్థలమిచ్చి గృహలక్ష్మీ పత్రిక కార్యాలయమున ఉద్యోగమిచ్చి ఆదరించితిని.

పసుమర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు కూడ వితంతు వివాహమాడినవారే. వీరును బిడ్డలతోకూడ మద్రాసుకు వచ్చి కష్టపడుచుండిరి. వీరి ఇద్దరు ఆడబిడ్డలు సంగీతమున పరిచయము గల్గినవారు. కుమారుడు చిన్నకుమార్తె వేణుగానమును, పెద్దకుమార్తె ఫిడియల్, గాత్రమును సాధనమొనర్చి యున్నారు. వీరందరికి నా యింటనే వసతినిచ్చి గృహలక్ష్మి ఆఫీసులో శాస్త్రిగారికి కొలువిచ్చితిని. వీరి బిడ్డలందరిప్పడు మంచిస్థితిలో యున్నారు. మహలక్ష్మమ్మ వితంతువై తిరిగి వివాహమాడినది. పాపము రెండవ భర్తనుకూడ పొగొట్టుకొని నర్సుపనిని నేర్చుకొని మావద్ద కొలువునకు కుదిరినది. ఈమె మంచి భాషా జ్ఞానముగల తెలుగుతల్లి, నేర్చుగ వ్రాయకలిగిన ముసద్దీ.

వీరేశలింగం పంతులుగారు వృద్ధాప్యమున వ్యాజ్యములలో చిక్కుబడుట అందరికి తెలిసిన విషయము.