చిన్ననాటి ముచ్చట్లు/మానవసేవ
19
మానవసేవ
మానవసేవ అంటే స్త్రీపురుషులను దుర్మార్గవృత్తులనుండి సన్మార్గములకు మరల్చుటకు చేసే కృషి. వారిలో స్త్రీ సాధారణంగా పొట్టకూటికి లేనప్పుడే తప్పు త్రోవ త్రొక్కును. అదియును కొన్నాళ్లు మాడిమాడి పిదప కక్కుర్తిపడును. కొందరు మానవతులు మాత్రము అట్టే పస్తుండి తుదకు ఆకలిబాధకు తాళలేక ప్రాణత్యాగము చేసుకొనుచున్నారు. పురుషుడో తిండి దండిగ నున్నప్పడే మదించి చెడుమార్గమునకు తిరుగును.
కావున స్త్రీ శ్రేయోభిలాషులై స్త్రీలనుద్దరింప దలచినవారందరును అనాథలకు బ్రతుకుదెరువును చూపించి కాపాడుటయే మానవసేవ.
ఈ పతిత జనోద్దరణము మన దేశమున కొత్తగాదు. నిష్కారణముగ అపనిందల పాలైనవారిని యుద్ధరించుట అంతకన్న శ్రేష్ఠమైనది. అహల్యను ఆమె భర్త రాయికమ్మని శపింపగా శ్రీరామచంద్రమూర్తి ఆమెను కరుణించి శాపవిమోచన మొనర్చెను. సత్యవతియు, కుంతియు - అవివాహితులుగనే సంతానవతులయ్య - పిదప ఉత్తమ రాజపత్నులు, రాజమాతలునై వర్ధిల్లిరి. సీతను, అపవాద పరితప్తను, భర్తచే అడవిలో విసర్జింపబడినదానిని వాల్మీకి ఆదరించి, పురుడుపోసి, శిశువులను తల్లిని పోషించి తిరిగీ వారిని రాముని సన్నిధానమునకు చేర్చియున్నాడు.
గుంటూరు శారదానికేతనమునకు తల్లిదండ్రులు ఉన్నవ లక్ష్మీబాయమ్మగారును, వారి భర్త లక్ష్మీ నారాయణగారున్నూ. వీరిరువురు ఏకమనస్కులై పాటుబడుచున్నారు. ఆదిలో కందుకూరి వీరేశలింగము పంతులుగారితో కూడ పనిచేసి పిమ్మట గుంటూరులోనే వితంతూ ద్వాహములు జరిపించినారు. వీరి చేతిమీదుగా గుంటూరులో 35 వితంతు వివాహములు జరిపి పుణ్యము గట్టుకొన్నారు. ఆ పిదప నొక బాలికా పాఠశాల నడుపుచు దానిని శారదా నికేతనముగా స్థాపించి స్త్రీ విద్యాభివృద్ధికి తోడ్పడుచున్నారు.
చెన్నపురిలో ఆంధ్ర మహిళాసభను స్థాపించి సర్వశక్తులను సమకూర్చి పెంచి పెద్ద చేసిన శ్రీమతి దుర్గాబాయమ్మగారిని ఎల్లరును వేయినోళ్ల పొగడుచున్నారు. ఈ సభ ఇంతై, అంతై ఇప్పుడొక బ్రహ్మాండ మైనదై, దివ్యతేజముతో ప్రకాశించుచున్నది. ఇందు విద్య గరపుటయేగాక బ్రతుకుదెఱువు మార్గములను కూడ నేర్పుచున్నారు.
ఒకదినమున యామినీ తిలకమ్మగారు వచ్చి వారి శరణాలయమును చూచుటకు నన్ను పిలిచెను. నేను మరునాడు అక్కడికి వెళ్లి చూచితిని. అప్పడా శరణాలయము ఒక చిన్న యింటి యందుండెను. కీలుపాకులో యొక పెద్ద బంగళాతోటను అద్దెకు తీసుకొని ఈ శరణాలయమును అక్కడికి మార్పించితిని. నూలు వడుకుటకు రాట్నములు, గుడ్డలు నేయుటకు మగ్గములు వగైరాలు సమకూర్చి తగు సహాయము చేయు చుంటిని. అక్కడి పిల్లలకు చదువు, చేతిపనులు నేర్చుచుండిరి. అక్కడి పిల్లకాయలను 'కేసరి కుటీరము'నకు పిలుచుకొని వచ్చి తలనూనెలు, పళ్లపొడులు, వార్లచేత తయారుచేయించి, ఇంటింటికి తీసుకొనిపోయి విక్రయించు ఏర్పాటున్నూ చేయించితిని. వార్లకు తగు ఉడుపుల కుట్టించి యిచ్చుచుంటిని. స్వతంత్రముగ జీవించుటకు తగు చేతిపనులను నేర్చించుటకు ప్రయత్నించితిని. అయితే అక్కడి పిల్లలు పెద్దవారై వార్ల యిండ్లు చేరుకొనిరి. శరణాలయమును మూయబడెను. తిలకమ్మగారి కుత్సాహము, దీక్షయు నున్నను ఆమెకు సరియగు మగతోడు లేకపోవుట మొదటినుండి లోపమే. ప్రస్తుతమామె తాంబరములో యొక చిన్న పాఠశాల నడుపుచున్నట్లున్నది.
మద్రాసు సేవాసదనము స్థాపించినవారు శ్రీ ముత్తా వెంక సుబ్బారావుగారును, వారి సతీమణి ఆండాళ్లమ్మగారును. ఈ సంస్థకు వారె తల్లిదండ్రులైయున్నారు. శ్రీ వెంకట సుబ్బారావుగారు మహోన్నత దశలోనుండి ఈ సేవాసదనమును స్థాపించుటవల్ల ఇది గట్టి పునాదితో వర్ధిల్లుచున్నది. ఇందు చదివిన వారందరుకూడ మంచిబ్రతుకు తెరువును సంపాదించుకొని ఆ దంపతులను సదాస్మరించుకొనుచు జీవయాత్ర సలుపుకొనుచున్నారు.
మద్రాసు స్త్రీసదనమని యొక శరణాలయము కలదు. పడుపు వృత్తియందు జీవించు పడుచులను, భర్తలచే తరుమగొట్టబడిన భార్యలను, అత్తపోరు పడలేక ఇల్లు వెడలి పారిపోయివచ్చిన పడుచులను, అనేక విధములగు అవస్థలు బాధలు పడలేక సంసారము త్యజించి పరుగెత్తి వీధినపడిన పడుచులను ఈ సదనము వారు చేరదీసి ఆదరించుచున్నారు. ఈ సదనమున విద్య, చేతిపనులు, మొదలైనవాటిని నేర్చి జీవించు మార్గములను చూపించుచున్నారు. తగు వరుడు చిక్కిన వివాహమును చేయుచున్నారు. పడుపువృత్తినే జీవించువారిని శిక్షానంతరము గౌరవముగా బ్రతుకుటకు బ్రతుకుదెరువు నేర్చి క్రమశిక్షణనిచ్చి కాపాడుటకు ఈ సంస్థకు పంపుదురు. అప్పడు వారికగు ఖర్చులు ప్రభుత్వము భరించును. ఈ విధముగ దీనికి ప్రభుత్వపు గ్రాంటులు వచ్చును. ఈ సంస్థలోని వారిని ఎంతో బందోబస్తుగా అనేక కట్టుదిట్టుములతో కాపాడవలసి వస్తున్నది.
శ్రీమతి డాక్టరు ముత్తులక్కీ రెడ్డిగారును ఈమెభర్త డాక్టరు రెడ్డిగారును చేరి అవ్వ శరణాలయమును తల్లిదండ్రులై పోషించుచుండిరి. శ్రీరెడ్డిగారు కాలగతిచెందిన తదుపరి శ్రీమతి ముత్తులక్ష్మీ రెడ్డిగారు వ్యవహారానుభవముగల వారగుటచే దీనిని చక్కగా అభివృద్ధికి తెచ్చినారు. ఆదిలో ఇది చిన్నసంస్థయే. ప్రస్తుతం అడయారులో పెద్ద భవనములను కలిగియున్నది.
నేను మంచిస్థితికి వచ్చినప్పడు గుంటూరు శారదానికేతనమునుండి సంగం లక్ష్మీబాయమ్మ యనునామెను మద్రాసులో చిత్రకళాశాలయందు చదువుకొనుటకు నా వద్దకు పంపిరి. ఈమె నాయింటిలోనే భోజనము చేయుచు మూడు సంవత్సరములు కళాశాలలో చదివి ఉత్తీర్ణురాలై యిప్పడు హైదరాబాదులో విద్యాలయమున సుఖముగ నున్నది. ఈమె ఖద్దరు వస్త్రములనే ధరించుచు దేశసేవాభిమానురాలైయుండెను.
నేను తిరుచూరులో యున్నప్పడు నాకు కృష్ణుడనే మంగలి క్షౌరము చేయుచుండెను. వాడికి జానికియను చెల్లెలు కలదు. ఆమె కొంతవరకు ఇంగ్లీషు చదివియుండెను. ఈమెను మద్రాసుకు తీసుకొనిపోయి నర్పుపని నేర్చించమని ఆ మంగలి నన్ను కోరెను. నేను దానికి సమ్మతించితిని. నేను మద్రాసుకు వచ్చునపుడు నాతో కూడ ఆమెను పిలుచుకవచ్చి నాయింట వుంచుకొని చదువు చెప్పించి గోషా ఆసుపత్రిలో చేర్చి చదివించితిని. ఇక్కడ ట్రైయినింగు ముగిసిన పిమ్మట గుంటూరు గవర్నమెంటు హాస్పిటలుకు పంపితిని. అక్కడామె యుండగ యొక డాక్టరును వివాహము చేసుకొని బిడ్డలతల్లి అయి సుఖముగ నున్నది.