చిన్ననాటి ముచ్చట్లు/మహాత్ముడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

17

మహాత్ముడు

మన మహాత్ముడు విజయవాడలో పూరించిన పాంచజన్యమును, నేను మొదట విన్నప్పటినుండి నాలో కల్గిన మార్పులను క్లుప్తముగ వ్రాయుచున్నాను.

నాకప్పడు నడివయసు. గుంటూరుజిల్లా నా జన్మభూమి అగుటచేత తిండికి ఘనుడుగ నుండెడివాడను. నాచేత డబ్బు మెండుగ మెదలుచుండెను. నగర నివాసమగుటచేత కోరికలకును హద్దు లేకుండెను. తెల్లవారగనే చిక్కనికాఫీతో కూడ రెండురకముల ఫలహారములను, మధ్యాహ్నమున మంచిభోజనమును, పిమ్మట మూడు గంటలకు ఒక కారము, ఒక తీపి, కాఫీ పుచ్చుకొనుచుంటిని. సాయంసమయమున పికారుకు వెళ్లి సుగుణవిలాస సభలోను, మద్రాసు యునైటెడ్ క్లబ్బులోను స్నేహితులతో కూడ యిష్టాగోష్టి సలుపుచు అక్కడి అల్పాహారములను ఆరగించుచుంటిని. పికారుకు పోయి యింటికి వచ్చునపుడు దోవలో బొంబాయి మిఠాయిూలను, గుజరాతి లడ్డులను, మార్వాడి గరిమసాల పకోడీలను తెచ్చుకొని తినుచుంటిని. ఇవి అన్నియు జాలక ఇంటిలో నేతితో గారెలను చేయించుకొనుచుంటిని. ప్రతి శుక్రవారము ఇంటిలో అమ్మణ్ణికి మధుర పదార్ధములు నివేదన జరుగుచుండెను. పరిమళ వక్కపొడికి మాయిల్లు పేరుగాంచియుండెను. తిరువళ్ళూరు కుంభకోణముల చిగురు తమలపాకులను వాడుచుంటిని, బొజ్జకు శ్రీగంధమును పూయుచుంటిని. తిలకము రకరకముగ దిద్దుచుంటిని.

మద్రాసులో నాకు వైశ్యులతో సహవాస మొక్కువగుటచేత, నా వేషము పటాటోపముగ నుండెను. ఆ కాలమున వెడల్పాటి సరిగ దుప్పటాలకు ప్రాముఖ్యత కలిగియుండెను. ఆరణి చాకులెట్టు బొద్దంచు అంగవస్త్రములను ధరించుట ఆ కాలమున నాజూకు. వెడల్పాటి బెంగుళూరు సరిగ తలపాలగాకు పెద్దపేరు లేకపోయినను, నెల్లూరు వెంకటగిరి సన్నసరిగ తలగుడ్డలకు మాత్రము మంచిపేరుండెను. ఆరణి పంచలను వెంకటగిరి తలగుడ్డలను ఆరణి చాకలివానికివేసి వాడుకొనుచుంటిని. మేలైన మల్లు వస్త్రములను వెలగల పట్టు చొక్కాయీలను కేంబ్రిక్ తెల్లషర్టులను విరవిగ వాడుకలో నుండెను. అంగవస్త్రములకు ఆరణి చాకలి, షర్టులను చొక్కాయిలను యిస్త్రీ పెట్టుటకు మద్రాసు చాకలి యుండెను. రెండు బీరువుల నిండుగ ఈవుడుపు లుండెడివి. సాక్సు బూటు వాడుకలో నుండెను. పలుమారు దుస్తులను మార్చుచుంటిని.

నా చెవులకు ఒంటిరాయి వజ్రముల అంటుజోడుండెను. చిటికినవ్రేలికి 5 కారట్ల వజ్రపు వుంగరముండెను. జేబులో పెద్ద బంగారపు గడియారము, పొడుగాటి గొలుసు, దానికి మెడల్పు వ్రేలాడుచుండెను. పికారుకు పోవునపుడు చేతులో వెండిపొన్ను వేసిన మొరాక పేముండెడిది. మొలకు విజయనగరపు బంగారు మొలత్రాడుండెను. ఇంకనెన్నియో పటాటోపములుండెను.

గాంధీ మహాత్ముని ఉపదేశ గీతములను వినిన వెంటనే క్రమముగ నాలో అనేక మార్పులు కలిగెను. నా వేషము మారినది. తల బోడిచేసి సరిగ తలగుడ్డకు బదులు గాంధి టోపిని ధరించితిని. సరిగ వస్త్రములు, పట్టుచొక్కాలు, దుకూలాంబరములు దూరములయినవి. సాత్వీకాహారము లను మితముగ భుజించుటకు అలవడితని. ఆకలి లేనిది ఆహారములను తీసుకొనుట మానితిని. కాఫీని కొంతకాలమువరకు మానగలిగితిని. మేకపాలను కొన్ని దినములు రుచి చూచితిని. వేరుశనగలు వికటించు వరకు తింటిని. రాట్నమును త్రిప్పుటకు ప్రారంభించితిని. సాధ్యమైనంతవరకు ఖద్దరు వస్తాములనే కట్టుచుంటిని. ఇంట బైట ఖద్దరుజుబ్బాతోనే కాలము గడుపుచుంటిని, అంటు జోడు, ఉంగరములను అమ్మివేసితిని. గడియారము గొలుసును కరగించితిని, తాంబూలమును మానితిని. పరదేశ వస్తువుల మీది బ్రాంతి విడిచితిని. బాధించుచుండు క్రిమికీటకాదులను హింసించునప్పుడుకూడ మహాత్ముడు మనసునకు వచ్చుచుండును. దినచర్యలలో పలుమారు మహాత్ముడు జ్ఞాపకమునకు వచ్చుచుండును.

పుణ్యపురుషుల నిర్యాణానంతరమున స్వర్గమునుండి పుప్పక విమానము భూలోకమునకు వచ్చి పుణ్యాత్ములను కైవల్యమునకు తీసుకొని పోవునని పురాణగాథలను వినుచుంటిమి. గాని 12-2-48, దివసమున మద్రాసునందు ప్రత్యకముగా చూడగల్గితిమి.

మద్రాసు సముద్రతీరమునకు మహాత్ముని అస్థుల పుప్పకవిమానము వచ్చినప్పడు ఆ దృశ్యము చూచుభాగ్యము ఈ పురజనులకు లభించుట వారు చేసిన పుణ్యఫలము. ఈ విమానమునకు ముందు గవర్నరు, వారి సతీమణి, జడ్డీలు, మంత్రులు పురపాలకవర్గము పాదచారులై నడుచు చుండుట చూడ మహాత్ముని మాహాత్మ్యము మనసుకు వచ్చెను.

ఎందరో రాజాధిరాజులు ఈ పట్టణమునకు వచ్చినది నాకు దెలుసును. దేశసౌభాగ్యమునకు పాటుబడిన దేశభక్తులలో ముఖ్యులగు సురేంద్రనాథ బెనర్ణి, బిపిన్ చంద్రపాల్, తిలక్ మహాశయుడు, గోపాలకృష్ణ గోఖలే, లాలాలజపతిరాయి, సి.ఆర్.దాస్ మొదలగువారు మద్రాసుకువచ్చి ఉపన్యాసములను యిచ్చినది నాకు తెలుసును. అట్టివారి కెవరికిని ఈవైభవము జరిగియుండలేదు.

మహాత్ముని అస్థులను మద్రాసు గవర్నమెంటు మందిరమున ప్రతిష్ట చేసిరి. ఆ అస్థులను పవిత్రమగు ఖద్దరు వస్త్రమున మూటగట్టిరి. ఆ మూటలను పుష్పక విమానమందుంచిరి. ఆహోరాత్రములు నేతితో అఖండమును వెలిగించిరి. రాత్రింబవలు భక్తబృందము చేరి రామభజన సలిపిరి. బ్రాహ్మణులు వేదపారాయణమును చేసిరి. గృహలక్ష్ములు భక్తిగీతములను పాడిరి. కర్పూర హోమము జరుగుచునే యుండెను. సాంబ్రాణి ధూపము మందిరమంతయు కమ్ముకొనియుండెను. దర్శనమునకు వచ్చువారికి విరామము లేకుండెను. గవర్నమెంటు మందిరము వైకుంఠముగ మారినది. ప్రతిదినము వచ్చిన జనము శ్రీరంగమున వైకుంఠయేకాదశినాడు ద్వారదర్శనమునకు పోయినవారికంటె నూరురెట్లు అధికముగ నుండవచ్చును. దూర దేశములనుండి అన్నిజాతులవారును కంటనీరు కార్చుచు కడవల నిండుగ మేకపాలను దెచ్చి మహాత్ముని ఆత్మకు నివేదన చేసిరి. రైతుబృందము మేలైన వేరుశెనగలనుదెచ్చి విమానమునకు ముందుబెట్టి మైుక్కుచుండిరి. ధూపదీప నైవేద్యములతో 10 దినములు గవర్నమెంటు మందిరము పవిత్రత చెందినది.