Jump to content

కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము-మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

సత్యరాజా పూర్వదేశ యాత్రలు.


ప్రథమ భాగము

ఆడుమళయాళము

మొదటి ప్రకరణము


నేను పరీధావి సంవత్సర చైత్ర శుద్ధ నవమి మంగళవారమునాఁడు పుష్యమీ నక్షత్రమందు విజయనగరములో పూర్వము శ్రీ రాములవారు పుట్టిన దినముననే జన్మించితిని. మాయింటి పేరు పత్రివారు. నేను వ్యాసరాయాచార్యులవారి పుత్రుఁడను. నా తల్లి లక్ష్మీబాయమ్మ. నేను ముందు మహాసత్యసంధుఁడనయి యీ సత్యచరిత్రమును వ్రాయుదునని తెలిసియో, తనకుఁగల సత్యప్రియత్వము చేతనో, మఱి యేహేతువు చేతనో మా తండ్రిగారు నాకు తన తండ్రి పేరు పెట్టక దేశాచారమును తప్పించి చిన్నతనములోనే నాకు సత్యరాజాచార్యులని పేరు పెట్టిరి. మా తండ్రిగారు జ్యోతిశ్శాస్త్రమునందు మహా పండితులయినందున పుణ్యపురుషాగ్రగణ్యులయిన వారు స్వమహీమ చేత నా భవిష్యద్యోగతను ముందుగా తెలిసికొనియే తప్పక నాకిట్లు నామకరణము చేసియుందురు. "సుకృతీగతాయుః" అను న్యాయమనుబట్టి వారు నాపసితనములోనే పుణ్యలోకయాత్రకు విజయం చేసినందున నా పేరును గూర్చి వారి నడిగి తెలిసికొనుట కవకాశము లేకపోయినది. నా నిజమయిన పేరు సత్యరాజాచార్యు లయినను మా గ్రామములోనున్న వారు నన్ను సత్యరాయాచార్యులని పిలుచుచుండిరి. 'రాజు'ను 'రాయ'లని వ్యవహరించుట కర్ణాటక సంప్రదాయము. అంతేకాక, 'జ' కార 'యా' కారముల కభేదము. అందు చేతనే వంగము మొదలయిన యుత్తరదేశములయం దయెాధ్యకు అజోధ్యయని యకారమునకు మాఱుగా జకారమును వాడుదురు. ఈ శాస్త్ర చర్చ నింతట విడిచిపెట్టి కార్యాంశమునకు వత్తము. నా పేరు యొక్క యుచ్చారణక్రమ మెట్టిదయినను నాది సార్థక నామధేయమని నేను వేఱుగ చెప్పనక్కఱలేకయే నేను వివరింపఁబోయెడి యీ సత్యయాత్రాచరిత్రమే లోకమునకు వేయినోళ్ళ ఘోషింపవచ్చును. ఆత్మస్తుతి నింద్యమయినంగున నా సత్యసంధతను గూర్చి నేనిఁక చెప్పను. నేనవలంబించియున్న సత్య మతము కూడ నా చరిత్రమూ యొక్క పరమ సత్యత్వమును సాధింప వచ్చును. సత్యప్రియత్వము చేతనే కదా మామతకర్తలయిన శ్రిమధ్వ రాయలవారు మిధ్యాభూతములయిన పూర్వ మతసిద్ధాంతములనన్నిటిని తిరస్కరించి, శ్రీమదాంజనేయ సహాయము చేతను ముఖ్య ప్రాణదేవుని యనుగ్రహము చేతను ఖిలములయిపోయిన యపూర్వశ్రుతిస్మృతి వాక్యరత్నములను బ్రహ్మలోకము నుండి తెప్పించి బ్రహ్మసంప్రదాయానుసారముగా సత్యమయిన ద్వైత సిద్దాంతమును లోకానుగ్రహార్థము స్థాపించియున్నారు! అటువంటి సత్యమతమున జన్మించి సత్యవ్రతమును పూనియున్న నేను నా గ్రంథమునందు సత్యముకాని వాక్యము నొక్కదానినయినను చొరనిత్తునా? ఓ చదువరులారా! నా మాటనమ్మి యిందలి ప్రతి వాక్యమును వేదవాక్యమునుగా విశ్యసింపుఁడు. నేనిందు తెలుపఁబోయెడు సంగతు లీవఱకు మనుష్యుల కెవ్వఱికిని తెలియని దేవ రహస్యములయినను స్వదేశస్థులయిన మీయందు నాకుఁగల భ్రాతృస్నేహము చేత మర్మము విడిచి చెప్పివేయుచున్నాను.

మా తండ్రిగారు కర్మిష్ఠులయి, బాల్యము నుండియు వైదికమయి పూజ్యమయిన యాచార్యవృత్తియందే కాలము గడపిన వారయినను, వారి పుత్రుఁడనయిన నాకు మాత్రము పూర్వకర్మానుభవము చేత శిష్య పరంపరలు నేవింపఁగా ఆచార్య పదమునొంది పూజింపబఁడెడు భాగ్యము పట్టినదికాదు. మా తల్లి పుట్టినింటివారు మొదటి నుండియు లౌక్యవ్యనహారములలో పుట్టిపెరిగినవారగుట చేత మా మేనమామగారగు కంచి శేషగిరి రావు పంతులు గారు నన్ను వేద పాఠశాలకు పంపక బడి చదువుకాఁగానే హూణ పాఠశాలకుఁ బంపిరి. మా గ్రామములో నొక బ్రాహ్మణ బాలుఁ డింగ్లీషు చదివి క్రైస్తవ మతములో కలిసినప్పుడు మా తండ్రిగారు నన్ను మాత్రమే గాక మా వంశమున పుట్టినవారి నెవ్వరిని కూడ హూణ పాఠశాలకు పంపమని ప్రతిఙ్ఞ పట్టిరి. నాకు బుద్దివచ్చు వఱకును జీవించియుండిన పక్షమున వారు తమ ప్రతిజ్ఞను తప్పక చెల్లించుకొనియుందురు. తానొకటితలఁచిన దైవమొకటి తలఁచునుగదా? నేను చిన్నవాఁడనయినను పూర్వచార విరుద్ధమయిన మాలచదువు చదువుట నాకిష్టము లేకపోయెను. దానికీతోడు మా తండ్రిగారిప్పుడు జీవించియున్న పక్షమున వారు నన్ను హూణపాఠశాలకు పంపుట కిష్టపడి యుండరుగదాయన్న విచారమొకటి నా మనస్సును భాధింపఁజొచ్చెను. ఈ రెండు కారణముల చేతను నాకింగ్లీషు చదువెప్పుడును సరిపడినది కాదు. అయినను నాకప్పుడింకొక బాధ కూడ తటస్థమయ్యెను. నా మేనమామ మాటవిని నా తల్లి ప్రతి దినమును హూణపాఠశాలకు పొమ్మని నన్ను నిర్భంధింప మొదలు పెట్టినది. అప్పుడు నాకు పరస్పర విరుద్ధములయిన రెండు ధర్మములు సంప్రాప్తములయినవి. నేనింగ్లీషు పాఠశాలకు పోవుట నా తండ్రిగారి యభిమతముగాదు; పోకుండుట తల్లిగారి యభిమతము కాదు. ఇందులో నేనెవ్వరి యభిమతమును చెల్లింపను? నా మనస్సు తండ్రిగారి యాజ్ఞనే చెల్లింప వలసినదని భోధించుచున్నను చచ్చి స్వర్గమునందున్న తండ్రిగారి యాజ్ఞనువలె బ్రతికి భూలోకమునందున్న తల్లిగారి యాజ్ఞను మీఱుట నాకుసాధ్యముగా కనఁబడలేదు. మన వేదము పితృదేవోభవయని మాత్రమేకాక మాతృదేవోభవయని కూడ చెప్పుచున్నది. అందుచేత పితృనియోగమును మాతృనియోగమును నాకుసమానముగానే యలంఘ్యములయినవి. నేనిపప్పుడు తండ్రియభిష్టమును తీర్చవలెను. తల్లిమనోరధమును తీర్చవలెను. కాఁబట్టి నేను బుద్ధిమంతుఁడనయినందున పితృవాక్య పరిపాలనను మాతృవాక్యపరిపాలనమును కూడచేసి యుభయ ఋణవిముక్తుఁడనయి కృతార్థతను పొందుటకొక్క యుపాయము నాలోచించితిని. ఆయుపాయమును విన్న పక్షమున నాబుద్ధికుశలతకు మీరును సంతోషింపకపోరు. తల్లి యజ్ఞానుసారముగా నేనింగ్లీషు పాఠశాలకు పోవుచుంటిని; పోవుచున్నను పాఠములను చదువక తండ్రిగారి యిష్టానుసారముగా పోనట్లేయుంటిని. ఈ యుపాయము చేత నే నుభయవాక్య పరిపాలన దక్షుఁడనై ధన్యుఁడనుకాఁగలిగితిని. ఈ ప్రకారముగా నేను దాదాపుగా పది సంవత్సరములు హూణపాఠశాలలో చదివినను, గొప్ప పరిక్షలో దేనిలోను కృతార్థుఁడను కాలేదు. కాని యెంతో కష్టము మీఁద నేను సామాన్య పరీక్షలో మాత్రము తేరినాఁడను. నేనింటికడ పాఠములు చదువకపోయినను, ఉపాధ్యాయుల కృషి చేత నా ప్రయత్నములేకయే కొన్ని యింగ్లీషు ముక్కలు నాకుక్షిలోదూరినవి. అటు తరువాత వానిని నా హృదయము నుండి పాఱఁదోలుట నాకు సాధ్యమయినది కాదు. ఎవ్వానికయినను మొదట చోటిచ్చిన తరువాత వెడలఁగొట్టుట సులభసాధ్యముకా నేర్చునా? అయినను నా చేతనయిన పని నేను మన వేదశాస్త్రములకు విరుద్ధముగా మాయసాధ్యాయులు బోధించిన భూగోళ విషయములను చరిత్రములను హూణశాస్త్రములను సత్యములని నమ్మకుంటిని. ఈ చరిత్రమును చదివినకొలఁదిని నా మాటలయందలి సత్యము మీకే బోధపడఁగలదు. ఇంగ్లీషు చదువు వలన బుద్ధిహీనులైన యిప్పటిబాలురకువలె నాకు మన శాస్త్రములయందును పురాణములయందును నమ్మక మావగింజంతయు తగ్గినది కాదు. ఇంగ్లీషు తిన్నగా చదువుకున్నను నేను నిత్యమును స్నానసంధ్యా ద్యనుష్తానములను మాసక జపములను తపములను జేయుచు మంత్రతంత్రములను గురుముఖమున నేర్చుకొని నిష్ఠాగరిష్ఠుఁడనయితిని. నా యాచారవ్యవహారములు చూచి నా తల్లియు మేనమామయు కూడ సంతోషపడుచుండిరి.

నేను నాల్గవ తరగతిలో చదువుకొనుచుండఁగా నాకు వివాహకార్యము తటస్థమయ్యెను. ఈ యాంధ్రదేశములో మా శాఖవారు మిక్కిలి తక్కువగా నున్నందున మాలో కన్యలు దొరుకుట మిక్కిలి కష్టము. అందుచేత సామాన్య స్థితిలో నున్నవారికి వేయి రూపాయలయిననియ్యక మూఁడేండ్లకన్య యయినను లభింపదు. మా మేనమామగారి కృషిచేత నిప్పాణి నృసింహాచార్యులుగారు తొమ్మిది సంవత్సరముల ప్రాయము గల తమ కొమార్తెను వేయి రూపాయలకే నాకిచ్చి వివాహము చేయుట కంగీకరించినారు. ఇటువంటి తరుణము మరల రాదనియెంచి నా మేనమామగారును తల్లిగారును జేరి నూటికి మూడు రూపాయలవడ్దికి మా పిత్రార్జితమయిన మాన్యముల మీఁద వేయి రూపాయలు ఋణము చేసి, వివాహవ్యయములకై యిన్నుఱు రూపాయలను మఱియొకరి యొద్ద అప్పుచేసి, శుక్ల సంవత్సర వైశాఖ మాశములో నొక మంచి ముహూర్తమున నాకు వివాహము చేసిరి. నాకప్పటికి పదునెనిమిది సంవత్సరములు దాటినవి. నా భార్య రూపవంతురాలు కాకపోయినను, గుణవంతురాలుగా కానఁబడెను. కులకాంతలకు గుణము ప్రధానముగాని చక్కఁదనము ప్రధానముకాదు. ఇట్లోక సంవత్సరము గడచిన తరువాత నా భార్యకు స్ఫోటకము వచ్చెను. అప్పుడాచెన్నది జీవించుటయే దుర్ఘటమని యెల్లవారును భావించినను, నేను పునశ్చరణ చేసిన వీరహనుమంత మంత్ర ప్రభావమువలన చిన్నదానికి ప్రాణబయము తప్పి కుడి కన్ను మాత్రము పోయెను. మొగము నిండ గోతులు పడి యాచిన్నది మఱింత కురూపిణియయినందున "భార్యారూపవతీశత్రు" వనెడుబాధ నాకు లేకపోయెను. నేనొక్క పరీక్షయందుఁజేఱి పాఠశాలను విడుచునప్పటికి నా భార్యయెడిగి కాపురమునకువచ్చెను. మా మాన్యముల మీద వచ్చెడి యాదాయము మేము చేసిన ఋణముల వడ్డికే చాలనందున నా కుటుంబభారము కూడ మా మేనమామగారి మీదనే పడెను. అందుచేత రెండు కుటుంబములను పోషించుట దుర్భరమయినందున మా మేనమామగారు నన్ను చదువు మానిపించి, విశాఖపట్టణము పోయి యెవ్వరెవ్వరినో యాశ్రయించి విశేష కృషిచేసి దొరతనమువారి కార్యస్ధానములో నొకచోట నాకు నెలకు పదునేను రూపాయల జీతము గల యద్యోగమును చెప్పించిరి. ఆ పనిలో నుండఁగానే యప్పులవారు నా మీద వ్యాజ్యములు వేసి ధనద్విగుణమునకు తీర్పులను పొంది నా మాన్యముల నమ్మించిరి. నా మాన్యముల విక్రయము వలన వచ్చిన సొమ్ముతో నా ఋణము సగము తీరినది. మిగిలినది తీఱుటకు సాధనముకనఁబడలేదు. అప్పులవారు ప్రతి దినమును వచ్చి నాయిల్లు చుట్టుకొని ఋణము తీర్పుమని నను నానావిధముల చిక్కులు పెట్ట మొదలుపెట్టిరి. ఈ చిక్కులలో నుండగా నాకుగ్రామముల వెంట తిరిగెడి మఱియొకపనియైనది. ఈ క్రొత్త పనిలో జీతమిరువది రూపాయలయినను, ఆయెక్కువ జీతము ప్రయాణవ్యయములకే చాలకుండెను. ఇప్పుడింకొక విధమయిన క్రొత్త వ్యయము కూడ నామీఁదపడెను. నాకెప్పుడును గుప్తదానము చేయుటయందేయిష్టము. ఇప్పుడట్టి దానములు చేయవలసిన నిర్భంధము కూడ నాకు తటస్థమయ్యెను. అట్టిదానములు చేయకపోయినయెడల నా పనికి కూడ భంగమువచ్చునట్లు కానఁబడెను. మా మండలము నందప్పు డుద్యోగస్ధులలో లంచగొండులధికముగా నుండురి. అప్పుడు మాపై అధికారులు పూర్వపువారు మాఱి క్రొత్తవారు వచ్చుట తటస్ధించెను. అందరికంటెను కష్టపడి యెక్కువ పని చేయుచున్నను నేను పనితిన్నగా చేయుచుండలేదని కోపపడుచు వచ్చినందున నాహితుల యుపదేశము చేత శిరష్తాదారుగారికి మూఁడు సారులు హిరణ్యదానములు చేసితిని; ఎన్నిసారులో యిప్పుడు సరిగా జ్ఞప్తికిరాలేదుగాని పెక్కుసారులు వస్త్రదానములు చేసితిని; పిల్లకుపాలు కావలసివచ్చినందున రెండుసారులు సవత్సక గోదానములు సహితమాయనకే చేసినాఁడను. చేసిన దానములు చెప్పుకోరాదు. ఇటువంటి గుప్తదానములు మఱియెన్నెన్నో నేను చేసితిని. ఈ హేతువు చేత దానములు చేయఁగా మిగిలిన సొమ్ము నాకును నా భార్యకును నిత్యైకాదశీవ్రతములతో భుక్తికయినను చాలకుండెను. ఇట్లుండగా నా భార్య జ్వరబాధితురాలై, మా గ్రామములో రెండవ ధనవంతరియని ప్రసిద్ధికెక్కిన వైద్యశిఖామణి చేత ఇరువది యొక్క లంకణములు కట్టించఁబడి ఆకస్మికముగా స్వర్గస్థురాలయ్యెను. ఆ చిన్నదాని చావుతో నాకీ లోకము మీద విరక్తికలిగినది. ఈ సమయములోనే ఋణప్రదాతలు కఠినులై నన్ను తమ యప్పులకై చెఱసాలకు సహితము పంప యత్నించుచుండిరి. ఈయన్ని కారణముల చేతను నాకు సంసారము మహారణ్యమువలె తోచఁగా నాకప్పడు సర్వసంగములును పరిత్యజించి ముముక్షుఁడనై యెగిని కావలెనన్న బుద్ధిపుట్టినది. అందుచేత నేను నా తల్లిని మా మేనమమగారి ఇంటికి పంపివేసి, ముందుగా అప్పలవారి బాధను తప్పించుకొనుటకై దేశత్యాగము చేసి దక్షిణ దేశయాత్రలు సేవింపలెనన్న యుద్దేశముతో విశాఖపట్టణము వచ్చి చేరితిని. అప్పడాపట్టణములోనున్న నా బాల్యమిత్రుడొకడు నన్ను చూచి నా దురవస్ధివిని జాలిపడి నాకు నూరు రూపాయలిచ్చిను. మఱునాటి యుదయకాలమున నేను సముద్రతీరమునకు పోఁగా ధూమనౌక యొకటి యప్పడే రేవునకు వచ్చెను. అదియెక్కడకు పోవునని విచారింపఁగా చెన్నపురికి పోవునని యక్కడివారొకరు చెప్పినందున శీఘ్రముగా పోవలెనన్న యభిలాష చేతను, దుస్సహమైన ఋణప్రదాతల బాధ తప్పించుకోవలెనన్న యుద్దేశము చేతను, సముద్రయానము శాస్త్రనిషిద్ధమని తెలిసినవాఁడ నయినను తరువాత ప్రాయశ్చిత్తము చేయించుకోవచ్చునని పూటకూటి యింటికి పోయి శీఘ్రముగా భోజనము చేసివచ్చి, ౧౮౭౯వ సంత్సరము మార్గశిర మాసంలో భానువారము నాఁడొక చిన్న పడవలో పోయి పొగయెడలో నెక్కితిని. ఇరువది యేడవ యేట నాకు దేశాంతర యాత్ర నా జాతకములోనే వ్రాయఁబడియున్నది. ఎక్కినజాములో పొగయోడకదలి నాల్గవనాఁటి ప్రాత:కాలమున నన్ను చెన్నపురికిఁ గొనిపోయి విడిచినది. పొగయోడలోని యవస్ధ యీకాలమునందు సముద్రయాత్రలు చేయువారి కందఱికిని తేలిసినదే యగుటచేత నేనిక్కడ వివరింప నక్కరలేదు. ఒకవేళ సముద్రయాత్రలు చేయని సిష్టుల లాభామునిమిత్తము వివరింత మన్నను, పొగయోడలో నెక్కిన తరువాత మరల దిగువఱకును నాకు దేస్మృతియేలేదు. నేనెఱిఁగినదంతయు నా కడుపులో నేదో వెఱ్ఱి వికారమారంభమయి నాటి దినము తిన్న యన్నము మాత్రమే కాక చిన్నప్పటి నుండియు కడుపులోనున్న పసరంతయు వాంతులగుటయు, దేహముతూల లేవశక్తుఁడనుగాక కన్నులు మూసుకోని శవమువలె నొకమూల పడియుండుటయు, మాత్రమే. ఇప్పడింకొక సంగతి కూడ స్మరణకు వచ్చుచున్నది. నేను చిన్నతనములో నుయ్యెలలో నంతగా నూఁగలేదు. ఓడలోనున్న మూఁడు దినములలోను నాకు యావజ్జీవమును సరిపోవునంత యుయ్యాల లూగుట సంభవించినది. ఆసౌఖ్యమనుభవైక వేద్యమేకాని చెప్ప నలవియైనది కాదు. నేను పడవ దిగి మెట్టకుపోయిన తరవాత కూడ కొన్ని దినముల వరకును నేనుయ్యాలలో నూగుచున్నట్టే భ్రమ పడుచుంటిని. నా కీడోలికాక్రీడ మొదలయిన వైభవములు కలిగించిన వాడు మా ముఖ్యప్రాణదేవుడే. భక్తవత్సలుఁడగుట చేత వాయుదేవుఁడు భక్తుఁడనయిన నేనొంటిగా పోవుట చూచి సహించలేక తన మహాబలత్వము సార్ధకమగునట్లుగా సముద్రము పొడుగునను నాకు తోడుగా వేంటవచ్చి నాకీ క్రీడాసాఖ్యములను ప్రసాదించెను. వాయు మహిమచేతఁ గలిగిన వికారమును వాంతులును నాకసాఖ్యమును కలిగించినట్లు మీరెంచు కొందురేమోకాని నిజము విచారింపక నాకవి మంచి వైద్యులవలె లోని కల్మషమును పోగొట్టి యారోగ్యమునే కలిగించి నన్ను మహబలుని వంటి సత్వసంపన్నునిగా జేసినని. నేనోడలోనున్న మూడుదినములును ఉపవాసవ్రతము పూనియుండిన సంగతి బుద్ధిమంతులైన మీరివరకే యూహించి యుందురు.నాభాగ్యము నేమనిచెప్పను? అందులో కపటిదినము ఏకాదశికూడ నయ్యెను.అకడపటినాటి నిరాహారపుణ్యమున కెందైన సాటికలదా? తక్కిన రెండుదినముల యుపవాసఫలమును పొగయెడనెక్కిన పాపమునకు సరిపోయినను హరివాసరమునాటి శుష్కోపవాస పుణ్యఫలము నాకు మిగిలియుండక మానదు. శ్రీహరి కరుణాకటాక్షము గలవారి కెక్కడకు పోయినను పుణ్యమునకులోపముండదు. అటుతరువాతి చరిత్రము వినుడు.


రెండవ ప్రకరణము

నాలవనాఁడు ద్వాదశిపారణమున కనుకూలముగా ప్రాత:కాలముననే పొగయోడ చెన్నపురి రేవు చేరెను. ఓడ లంగరు వేసిన తరువాత చిన్నపడవ లనేకము లక్కడకు రాగా నేనొక పడవలో నొక్కి యొడ్డునకు పోతిని. ఒడ్డు నుండి నూరు గజముల దూరము నడచునప్పటికి గుఱ్ఱపు బండి యొకటి కనబడెను.

"వూళ్లోకి బండి అద్దెకు తీసుకువస్తావా?" అని నే నాబండివాని నడిగితిని. వాఁడేమో అఱవములో మాటాడఁగా నేను తెలిసి కోలేక "నీకు తెలుగు తెలుసునా?" అని వాని నడిగితిని. అప్పుడు మా యిద్దఱికిని యీ క్రింది సంభాషణము జరిగినది.