కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/రాజశేఖరచరిత్రము-ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎనిమిదవ ప్రకరణము

సంవత్సరాది - రాజశేఖరుఁడుగారి ప్రయాణము - రాజానగరమునకు సమీపమున నొకరాజు వడఁగొట్టి పడిపోవుట - నల్లచెఱువు సమీపమున నొకయోగి కనఁబడుట - దొంగలు కొట్టుట - రుక్మిణి మరణము

సంవత్సరాదినాఁడు తెల్లవారినతరువాత రామమూర్తిగారు మంగలివానిని పిలిపించి రాజశేఖరుఁడుగారికిని సుబ్రహ్మణ్యమునకును వానిచేత తల యంటించిరి. ఇంటనున్న మగవారియభ్యంజనస్నానము లయినతరువాత, ఆఁడువారందఱును తలలంటుకొని నీళ్ళుబోసికొనిరి. స్నానములయినపిమ్మట వేపపువ్వును క్రొత్తమామిడికాయ ముక్కలును క్రొత్తచింతపండుపులుసుతో నందఱును దేశాచారముననుసరించి భక్షించి రెండుజాములకు పిండివంటలతో భోజనములు కావించి పండుగచేసికొనిరి. పండుగదినములలో జనులు మఱింత యెక్కువసుఖపడవలసినదానికి మాఱుగా, ఈదేశములో వేళతప్పించి భోజనములుచేసి యట్టిదినములందు దేహములను మఱింత యాయాస పెట్టుకొందురు. మధ్యాహ్నముచల్లపడినమీఁదట రామమూర్తిగారు రాజశేఖరుఁడుగారిని వెంటఁబెట్టుకొని నూతనపంచాంగశ్రవణమునకయి వేణుగోపాలస్వామివారి యాలయమునకు వెళ్ళిరి. ఆ వఱకే యొకసిద్ధాంతి పసపుతోఁగలిపినయక్షతలను పళ్ళెముతో ముందుపెట్టుకొని --

             శ్లో|| శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం|
                  గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం
                  ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతాప సంపత్ప్రదం
                  నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం||

ఎనిమిదవ ప్రకరణము

అను శ్లోకము జదివి, సంక్రాంతి పురుషుని లక్షణమును వివరించి సంవత్సరఫలమునుజెప్పి, ధాన్యాదులయొక్కయు వృశ్చికాదులయొ క్క యు వృద్ధిక్షయములను జదివి, జన్మనక్షత్రములను తెలియనియెడల నామనక్షత్రములను తెలిసికొని యెల్ల వారికిని కం దాలయముల యంకములను ఆదాయవ్యయములను జెప్పెను. అక్కడ నున్నకావులు మొదలగు వారు సిద్ధాంతిగారి చేతిలో నేమైనఁబెట్టి తను కేకందాయమున్ందును నున్నలు రాకుండఁ జేసికొనిరి. పంచాంగశ్రవణ మయిన తరువాత రామమూర్తిగారు-"సిద్ధాంతిగారూ ! కలియుగము ప్రారంభమయి యిప్పటికెన్ని స్ంవత్సరము లయినది?"

    సిద్ధాంతి-ఇప్పటికి కలియుగాది గతసంత్సరములు ౪౭౧౯ శాలివాహనశకాబ్దములు ౧౫౪౧, విక్రమార్క శకసంవత్సరములు ౧౬౭౬.
    రామ-మనదేశములో మ్లేచ్చుల యధికార మింకను ఎంత కాలముండునో కాలమానమునుబట్టి చెప్పగలరా?                                                                             

సిద్దాంతి-మనదేశములో తురష్కుల దొరతనము అయిదు వందల సంవత్సరములకు లోపలపోదు. ఆపిమ్మట పూనపాటివారివంశమున వేపకాయంత తోకఁగలవా డొకఁడు పుట్టి, ఆనేతుహిమాచలమును గల సర్వప్రపంచమును మరల జయించును.

అంత ప్రదోషనమయమయినందున పంచాంగము కట్టిపెట్టి యందఱును తమతమ యిండ్లకు నడచిరి.

రాజశేఖరుఁడుగారు విదియనాడు కాశీయాత్రకు బయలుదేఱ నిశ్చయించుకొని యెంద రెన్నివిధములఁ జెప్పినను వినక ప్రయాణ ముహూర్తమును పెట్టుటకై గుడిలో పంచాంగమును జదివిన పిదపర్తి శ్ర్రీరామసిద్ధాంతిని పిలిపించిరి. ఆతఁడును తిధివారనక్షత్రములను చక్కఁగా నాలోచించి యారాత్రియే పదియారుఘటికల తొమ్మిది </poem>

               14 
రాజశేఖర విజయము

విఘటికలమీఁద యాత్రకు యోగ్యసమయమని ముహూర్తముంచెను.ఆ సమయమున కుటుంబముతో బైలుదేరుట క్షేమకరము కాదనియెంచి, రాజశేఖరుఁడుగారు పొరుగింట నొకవస్త్రమును దానిలో చుట్టబెట్టి యొకపుస్తకమును నిర్గమనముంచి తెల్లవారినతరువాతనే బైలుదేరుటకు నిశ్చయించిరి. అప్పుడు రామమూర్తిగారు బండినిమిత్తము వర్తమానముపంపఁబోఁగా వలదని వారించి బండినెక్కి పోయినయెడల యాత్రాఫలము దక్కదుగాన కాలినడకనే పోయెదనని రాజశేఖరు@ండుగారు చెప్పిరి. ఆ రాత్రియే వారికందఱికినిఁక్రొత్తబట్టలు కట్టఁబెట్టి, రామమూర్తిగారు ప్రాతఃకాలముననే వారికంటే ముందుగాలేచి వారు ప్రయాణమగునప్పటికి సిద్దముగా నుండిరి. అప్పుడు రాజశేఖరుఁడుగారు తాము ధవళేశ్వరమునుండి తెచ్చిన పాత్రసామగ్రియు, మంచములను, బట్టలపెట్టెలను తాము మరల వచ్చువరకును భద్రముగా జాగ్రత్తచేయవలయునని రామమూర్తిగారికి చెప్పియెప్పగించి, దారిప్రయాణమునకు ముఖ్యముగా కావలసిన వస్తువలను మాత్రము తమతో నుంచుకొనిరి. మాణిక్యాంబ మొదలగు వారు బైలుదేఱునపుడు రామమూర్తిగారిభార్య వీధివరకును వచ్చి వారు దూరదేశయాత్రను జేయయఁబూనుటను దలఁచుకొని కంటఁదడిబట్ట మొదలుపెట్టెను.అప్పుడు వారందఱును గుమ్మములోనున్నవారి యొద్ద సెలవుపుచ్చుకొని, ఒంటిబ్రాహ్మణుఁడెదురుగా వచ్చుచుండగా నతఁడు పోవువరకును నిలిచి యావల నొక పుణ్యస్త్రీ రాఁగా మంచిశకున మయినదని దారిపొగి నడువనారంభించిరి. రామమూర్తిగారు వారి నూరిబయలవరకును సాగనంపి దూర దేశప్రయాణమును జేయుచున్నారుగాన భద్రముగా వెళ్ళుడని బుద్ధులుచెప్పి వెనుకకు మరలి యింటికివచ్చిరి. రాజశేఖరుఁడుగారు త్రోవపొడుగునను చెట్లుమొదలగువానిని భార్యకును బిడ్దలకును జూపుచు దారినడువసాగిరి.

ఎనిమిదవ ప్రకరణము

రాజ-చూచితిరా యీమఱ్ఱిచెట్టు ఆమూలాగ్రము చిగిరించి, పగడమువలె, యెఱ్ఱని పండ్లగుత్తులతో నెంత మనోహరముగానున్నదో!

సుబ్ర-ఔనౌను, దానిచేరువనున్న మామిడిగున్నచీనాంబరమువలె నున్న లేఁతచిగుళ్ళతో మఱిఁతవింతగానున్నది. కొనకొమ్మనుజేరి కోయిల యొక్కటి మధురమైన కంఠద్వనితోఁజెవులపండువునేయుచున్నది.

రుక్మి-నాన్నగారూ! రామచిలుక కొమ్మమీఁద తలక్రిందులుగా నిలచుండి జామపండునేప్రకారముగా ముక్కుతో పొడుచుకొని తినుచున్నదోచూడుండి.

సీత-అన్నయ్యా! నాకామామిడికాయ కోసియిచ్చెదవా?

సుబ్ర-అమ్మాయీ! చెట్టిక్రింద చిలకకొట్టిన దోరకాయలున్నవి తెచ్చుకో.(సీత పరుగెత్తుకొని పోయి నాలుగయిదు కాయలను తెచ్చుకొని కొఱికిచూచి పంచదారవలెనున్నవని చంకలుకొట్టుకొనుచున్నది.)

మాణి- ఎక్కడినుండియో యిప్పుడు గుప్పున మల్లెపువ్వులవాసన కొట్టినది!

సుబ్ర- అమ్మా! వేగిరము రా. అదిగో పొగడచెట్టుమీఁదనొక యడవిమల్లెతీఁగ అల్లుకొని, గంపలకొలఁది తెల్లని పుష్పములతో నిండియున్నది.మన యింటికడ నెన్నినీళ్ళు పోసినను, మల్లెపువ్వులీలాగున పూయవుగదా!

మాణి- ఆహా! పొగడపువ్వు లెంతసువాసన గలిగియున్నవి!

సుబ్ర- ఇప్పుడు పదిగడియలప్రొద్దెక్కినను, గాలి యెంత చల్లగా కొట్టుచున్నది! మన యింటివద్ద నెన్నఁడైన వేసవికాలములో గాలి యింతచల్లగానున్నదా!

రాజశేఖర చరిత్రము

రాజ--- సర్వేంద్రియములకు సౌఖ్యము కలుగునట్టుగా, మార్గస్థుల సంతోషమునకై యిటువంటివాని నన్నిటిని సృజించి నిర్హేతుకిగాయమానకటాక్షముచేత స్వేచ్చముగా ననుభవింప ప్రసాదించినయీశ్వరుని మహత్త్వము నెఱిఁగి కొనియాడ మన యెంతవారము? మనమొన్నడును నిల్లుకదలకపోవుటచేత నిటువంటిసౌఖ్యముల నేమియుమెఱుఁగనివారమైయుండియు, మనమే యెల్లవారికంటెను మిక్కిలి సుఖపడుచున్నా మనుకొని గర్వపడుచుంటిమి. ఈ యడవులలోనే సదా కాపురముండి, దీనబంధువైన పరమాత్ముని యనుగ్రహమువలనఁ గలిగిన యీసౌఖ్యముల ననుభవించుచుండెడి యీ వనచరులైన కిరాతులు మొదలగువా రెంతటి యదృష్టవంతులు! ఆహా! గ్రామములో నెప్పుడును మనకీ వసంతకాల మింత మనోజ్ఞముగానుండలేదుగదా?

సీత- అమ్మా! నేనిఁకనడవలేను. నన్నెత్తుకో.

మాణి- ఆ చెట్టుదాఁకా నడచిరా. అక్కడ యెత్తుకొనెదను. రుక్మిణీ! వెనుకపడుచున్నావేమి? రెండడుగులు వేగిరముపెట్టు.

రుక్మి- అలవాటు లేకపోవుతచేత కాళ్ళుపొక్కు లెక్కినవి. వేగిరము నడవలేకున్నాను.

రాజ- పనులకాపరివాని నడిగాను. ఊరొకక్రోసున్నసఁట! రెండుజాములు కావచ్చినది. ఏలాగునైనను కొంచెముశ్రమచేసి నాలుగడుగులు వేగిరము నదువవలెను.

మాణి- సీత నెత్తుకొని నదుచుచున్నాను. ఆఁకలియగుచున్నదని యిది యేడ్చుచున్నది. మన కిడిచేతివైపున దూరముననేమో మనుష్యుల మాటలచప్పుడు వినవచ్చుచ్చున్నది. అది యూరేమోమన మీపూఁటదిగుదామా?

ఎనిమిదవ ప్రకరణము

రాజ- ఎవ్వరోమనుష్యులక్కడ తొందర పడి పరుగెత్తుచున్నారు; వారిలో నెవ్వరికైన నొకయాపద వచ్చియుండఁబోలును!శీఘ్రముగా వెళ్ళుదము రండి.

అని వేగముగ నడచివారు మనుష్యుల కలకలములువునఁబడుచున్న ప్రదేశమునకు సమీపముగాఁబోఁగా, మార్గమునకుఁగొంచెముదూరములో దక్షిణపుదిక్కున మూగియున్న గుంపులో నుండి "శుద్ధిచేయుటకు మజ్జిగ" యని కేకలువేయుచు కొందఱుపరుగెత్తుకొని వచ్చుచుండిరి. రాజశేఖరుఁడుగారు వాండ్రను జూచియీసందడి యేమని యడుగఁగా, వారిలో నొకగొల్లవాఁడు 'రాచకుమారుఁడొకఁడువడగొట్టి యారావిచెట్టుకిద పడిపోయినా' డని చెప్పెను.

రాజ- మీ రాతనిగొంతుకలోఁ గొంచెము నీళ్ళుపోయలేక పోయినారా? గొల్ల- మొట్టమొదట మేము నీళ్ళియ్యఁబోఁగా, శూద్రులము కాఁబట్టి మాచేతినీళ్ళు త్రాగనని యారాజు పుచ్చుకొన్నాఁడుకాఁడు. తరువాత దాహమునకు తాళలేక మాచేతి నీళ్ళు త్రాగుట కొప్పుకొన్నాడుఁ. కాని మావారిలో పెద్దవాఁడు వచ్చి శూద్రుఁడు రాజునోటిలో నీళ్ళుపోసిన పాపమువచ్చునని చెప్పునీళ్ళు శుద్ధిచేయుటకై మజ్జిగనిమిత్తము మమ్ముఁబంపినాఁడు. మాపల్లె ఇక్కడికి పావుక్రోసుదూరమున నున్నది. మీరుబ్రాహ్మణులుగాఁ గనఁబడుచున్నారు. మీవద్ద నేమయిన మంచితీర్ధ మున్నయెడల, వేగిరము పోయి యాతనిగొంతుకలో నాలగుచుక్కలుపోసి పుణ్యము కట్టుకొనండి.

ఆమాటలువినిరాజశేఖరుఁడుగారురిక్మిణిచేతిలోనున్నమంచినీళ్ళచెంబునుపుచ్చుకొని,చెట్టుదగ్గఱకుపరుగెత్తిపోయిగుంపులోనుండి

రాజశేఖర చరిత్రము
త్రోవచేసికొని ముందుకునడచి గుంపునడుమను చెట్టునీడను కటికి నేలను పరుండి చేతితో నోరును జూపి నీళ్ళనిమిత్తము సైగచేయుచున్న యొకమనుషుని జూచిరి. ఆమూకలో నొకడు నీళ్ళముంతను జేతిలోఁబట్టుకొని "ఈరాజు నిష్కారముగా జచ్చిపోవుచున్నాడు; ఏదోషమువచ్చిననుసరే నీళ్ళనుపోసి బ్రతికించెద" నని చేరువుకుఁ బోవుచుండెను. అప్పు డొక్కముసలివాఁడడ్డమువచ్చి వానిచేయి పట్టుకొని నిలిపి, " ఈవరకు బూర్వజన్మములో మన మెన్నియో పాపములను జేయుటచేతనే మనకిప్పుడీ శూద్రజన్మము వచ్చినది. ఇప్పుడీరాజును జాతి భ్రష్టునిజేసి యీపాపముసహితము కట్టుకోవలెనా? నామాట విని నీళ్ళు పోయవలద" ని వారించుచుండెను. ఇంతలో రాజు కన్నులు తేలగిలవైచి, చేయి నోటివద్ద కెత్తఁబోయి వడకించుచు క్రిందఁ బడవైచెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు వెంటనే పోయి మంచినీళ్ళతో ముందుగా నెండుకొని పోవుచున్న పెదవులను దడిపి నోటిల ఁ గొంచె మునీళ్ళుపోయగా కొంతసేపటికి కాతడు మెల్లగాఁ చప్పరింపనారంభించెను. అంతట రాజశేఖరుడుగారు తన చేతిలోని యదకముతో మొగమును దడిపి మఱికొంచెము నీరు లోపలికి బోయగా త్రాగి కన్నులు విప్పిచూచి రెండవ ప్రక్క కొత్తిగిలి మఱి కొంతసేపునకు సేదతేఱి, ఆరాజు తన జీవములను నిలిపినందులకై రాజశేఖరుడుగారికి కృతజ్ఞతతో బహునమస్కారములు చేసి లేచి కూరుచుండెను. ఇంతలో పల్లెకుబోయినవారు మజ్జిగయు, కొన్ని పండ్లను దీసికొనివచ్చి యిచ్చిరి. ఆరాజు కొన్నిపండ్ల నులోపలికి బుచ్చుకొని మజ్జిగత్రాగి స్వస్థపడెను. అంతట నక్కడనున్న వారందరును తమతమ త్రోవలను బోయిరి. ఈలోపల మాణిక్యాంబ మొదలగు వారొకతరువునీడను గూర్చుండి మార్గాయాసము కొంత తీర్చుకొనిరి. రాజశేఖరుడుగారు మిక్కిలి బడలియున్నవారయ్యును, సమీపములో నెక్కడను ఊరులేదని విన్నందున నేవేళకైనను రాజా నగరమునకు బోవ నిశ్చయించుకొని, తమవారినందఱిని లేవ నియమించి యారాజుతో ముచ్చటలాఫుచు దారిసాగి నడవనారంభించిరి.

రాజ - రాజుగారూ! మీపేరేమి ? మీనివాసస్థల మెక్కడ? మీరిక్కడ కొంటిగా నెందుకువచ్చినారు?

రాజు - నాపేరు రామరాజు; మాది పెద్దాపురమునకు సమీపముననున్న కట్టమూరు వాసస్థలము ; మాకక్కడ నాలుగుకాండ్ల వ్యవసాయ మున్నది ; రాజమహేంద్రవరములోనున్న మాబంధువుల జూచుటకై పది దినముల క్రిందట పోయి, నిన్న తెల్లవారుజామున బయలుదేరి మరల వచ్చుచుండగా నొక పెద్దపులివచ్చి నన్నెదిరించినది; నాపైన నున్న యుత్తరీయమును వేగముగా నెడమచేతికి జుట్టుకొని యాచేయి పులినోటి కందించి రెండవచేతిలోని కత్తితో దాని ఱొమ్మున బొడిచితిని; ఆపులి మిక్కిలి బలముకలది కాబట్టి యాపోటును లక్ష్యముచేయక త్రోవపొడుగునను నెత్తురు గాలువలు గట్ట నన్నడవిలోనికి బహుదూర మీడ్చుకొనిపోయెను; ఈలోపల నేను కత్తితో దానిని పలుచోట్లను బొడిచినందున నడువలేక యొక వృక్షసమీపమున బడియెను. నేను బహుప్రయాసతో జేయి వదల్చుకొనుటకై కుడిచేతిలోని కత్తి వదలిపెట్టి దానినోరు పెగిలించి చే యూడదీసికొంటిని; ఇంతలో మునుపటిదానికంటెను బలమైన మఱియొక వ్యాఘ్రము చేరువ పొదయందుండి నామీదికి దుమికెను; కాని దైవవశముచేత గొంచెము గుఱితప్పి నాప్రక్కనున్న చిన్న గోతిలో బడెనూ కత్తిని బుచ్చుకొనుటకు సమయము చిక్కనందున వెంటనే నేను వృక్షము కెగబ్రాకి అది మరల దూకులోపల

రాజశేఖర చరిత్రము

పై కొమ్మజేరి కూర్చుంటిని; పులియు విడిచిపోవక వృక్షముక్రిందనే పీటపెట్టుకొని గూరుచుండెను; నేఁడు తెల్లవారినతరువాత పదిగడియల ప్రొద్దెక్కువఱకును అది యాప్రకారముగానే యుండి చివరకు విసిగి లేచిపోయినది; నేను నిన్నటి యుదయమునుండియు నిద్రాహారములు లేక వృక్షశాఖయందేయుండి, పులిపోయిన గడియకు మెల్లగా వృక్షముదిగి కత్తిని చేతఁబుచ్చుకొని బయలుదేఱి గతదినమంతయు నెంతచేత మలమల మాడినందున నాలిక పిడచకట్టి నడచుటకు కాళ్ళయందు సత్తువలేకయేరీతినో దేహము నీవృక్షచాయకుఁ జేరవైచిపడిపోయితిని. నాకు చేతిమీఁద మాత్రమివుగో రెండు గాయములైనవి. అనిచెప్పి చేయి చూపిపైకి చేతికఱ్రలాగున నగపడుచున్న మొఱయందున్న కత్తినిదీసిచూపెను. రాజశేఖరుఁడు గారును దానిని పుచ్చుకొని చూచి యాతఁడుచేసిన సాహసకార్యమునకు మిక్కిలి యాశ్చర్యపడసాగిరి.

రామ- నాకు మీరీదినమునపోయిన ప్రాణములను మరల నిచ్చినారు; మీకు నా ప్రాణములిచ్చినను, మీరుచేసినయుపకారము యొక్క ఋణముతీఱదు. నాయందు దయచేసి నేను కృతజ్ఞతా సూచకముగాఁ జేయు నమస్కారముల నంగీకరింపుఁడు. అదృష్టదేవత యితరులను ధనదనము మొదలయిన కార్యములచేతఁ దమకృతజ్ఞతను దెలుపునట్టుగాఁ జేసి యిప్పుడు బీదవాఁడనైయున్న నన్ను మాత్రము మీయింతటి మహోపకారికి వట్టిమాటలచేతనే నాకృతజ్ఞతను దెలుపునట్టు చేసినందున కెంతయుఁ జింతిల్లుచున్నాఁడను. అయినను నాచేతినైన యుపకారము మీకేదైన గావలసియున్నచో నా ప్రాణములకైన నాశపడక చేయ సిద్ధముగానున్నాఁడను. మీరిప్పుడెక్కడకుఁ బోయదరు? ఎనిమిదవ ప్రకరణము

రాజ- కాశీయాత్రకయి బయలుదేఱినాము.

రామ- ఈ వేసవికాలము ప్రయాణమున కెంతమాత్రమును మంచిసమయముకాదు. ఈ యెండలో మీరు గాడుపుకొట్టి పడిపోవుదురు. త్రోవపొడుగునను దొంగలభయము విశేషము. మీకు రాజమహేంద్రవరములో నెవరైన బంధువులున్నారా? లేక మీకదే నివాసస్థలమా?

రాజ- గోటేటి రామమూర్తిగారిని మీరెఱుగుదురా? అతఁడు నాపినతండ్రి కొమారుఁడు. వారియింటనేనేను పదియేను దినములుండి బయలుదేఱినాను. మాస్వస్థలము ధవళేస్వరము.

రామ-మీపేరేమి? వీరందఱును మీ కేమగుదురు?

రాజ- నా పేరు రాజశేఖరుఁడు; వాఁడు నాకొమారుఁడు; ఆయాడుపిల్ల లిద్దఱును నాకొమార్తెలు; అది నాభార్య.

రామ- మీరింత వేసవికాలములో యాత్రకు బయలుదేరుటకు కారణమేమి? మీవైఖరిచూడ మిక్కిలి సుఖము ననుభవించిన వారుగాఁగనబడుచున్నారు.

రాజ- నేను మొదట ధనికుఁడనే యౌదును. కాని నా వద్దనున్న ధనమునంతను నాకొర్తెవివాహములోనిచ్చిన సంభావనలక్రిందను ముఖస్తుతులనుచేయు మోసగాండ్రకుఁజేసినదానముల క్రిందను వెచ్చపెట్టి బీదవాఁడనయి,కడపటి యాత్రకు బయలుదేఱినాను. నిత్యమును వారి స్తుతిపాఠములను స్వీకరించి నేను తుష్టిపొందుచుంటిని; నాధనమును స్వీకరించి వారు తృప్తిమొందుచుండిరి. తుదకొక బైరాగి బంగారము చేసదనని నాయొద్దనున్న వెండిబంగారముల నపహరించి వానికి బదులుగా నింత బూడిద నిచ్చి పోయి నన్ను నిజమైన జోగిగా జేసెను. రాజశేఖర చరిత్రము

రామ- మున్నెప్పుడు మీరు దూరదేశ ప్రయాణములను చేసినవారుకారు. నామాటవిని మీరీవేసవికాలము వెళ్ళువఱకైన భీమవరములో నుండుఁడు. అది గొప్ప పుణ్యక్ష్యేత్రము; భీమనది సమీపమున భీమేశ్వరస్వామివారి యాలయమున్నది.; దానికిని పెద్దాపురమునకును క్రోసెడుదూరముకలదు. పెద్దాపురమును పాలించుచున్న కృష్ణగజపతిమహారాజుగారు మిక్కిలి ధర్మాత్ములు; వారు తమ ప్రజలక్షేమమును విచారించు నిమిత్తమయి మాఱువేషమువేసికొని తిరుగుచుందురు; వారియొద్ద మాభంధువొకఁడు గొప్ప పనిలోనున్నాడు. మీరుభీమవరములో మీకొక యుద్యోగమును జెప్పించెదను.

రాజశేఖరుఁడుగారు మంచివారుగనుక పెద్దాపురము వెళ్ళిన మీఁదట నాలోచించెదమని యప్పటికి చెప్పిరిగాని, యారాజుస్థితినిజూచి యాతఁడుద్యోగము జెప్పించు నన్నశనుమాత్రము పెట్టుకొన్నవారుకారు. ఈ మాటలు ముగియునప్పటికి వారు గ్రామమును సమీపించిరి.

రాజ- ఆ చెట్లకు గ్రామ మెంతదూరము?

రామ- గ్రామసమీపమునకు వచ్చినాము. ఆచెట్లు చెఱువు గట్టుమీఁదివి.చెఱువున కెదురుగానే సత్రమున్నది.

రాజ- మీరీపూటమాతో భోజనము చేసెదరా?

రామ- నాకు గ్రామములో బంధువులున్నారు; అక్కడకు వళ్ళి భోజనముచేసి, చల్లపాటువేళ మెల్లఁగా బయలుదేరి వచ్చెదను.మీరుస్త్రీలతో బయలుదేఱినారు. కాఁబట్టి భోజనముచేసినతోడనే ప్రయాణమయి ప్రొద్దుకుంకకముందే వేఁడిమంగలమును దాఁటవలెను.

ఎనిమిదవ ప్రకరణము

అక్కడ దొంగలభయము బహువిస్తారము. మీ రేలాగుననయిన శ్రమచేసి చీఁకటిపడకముందే పెద్దాపురము చేరి యొకనాఁడక్కడనుండుడు. నేను మిక్కిలిడస్సియున్నాను గనుక మీతో నిప్పుడురాలేను. రేపటి దినమువచ్చి మిమ్ము గలిసికొనెదను.

అని రాజశేఖరుఁడుగారికి నమస్కారము చేసి, అందఱివద్దను సెలవుపుచ్చుకొని త్రోవలో భధ్రమని పలుమాఱుచెప్పి, రామరాజు తనదారినపోయెను. వంటలైన తరువాత భోజనములు చేసి వారందఱును బయలుదేరి యెండలో దేహములనిండను జెమ్మటపట్ట, అడుగడుగునకు ముంతెడునీళ్ళు త్రాగుచు నడుమ నడుమ వృక్షచ్చాయలను నిలుచుచు అడుగొకయానడగా నడచినాలుగు గడియల ప్రొద్దువేళ నల్లచెరువు చేరిరి. ఆచెరువుగట్టునకు క్రిందగానున్న యొక జువ్విచెట్టుమొదలనుతాటాకుపందిరిలో దేహమునిండ విభూతి పూసికొని కంఠమునను, చేతులను, శిరస్సునను రుద్రాక్షమాలలను ధరించుకొనిగూ రుచుండి వారిని చేసైగచేసి పిలిచి, దగ్గఱనున్న చాపమీఁద గూరుచుండనియోగించి యొక యోగి కుడి చేతిలోని తులసిపూసల తావళమును ద్రిప్పుచు నోటిలో నేనేమో జపించుకొనుచు నడుమనడుమనొక్కొక్కప్రశ్నవేయ నారంభించెను.

యోగి- మార్గస్తులారా! మీరు మిక్కిలి యెండబడి మార్గయానముచే బడలియున్నారు. కొంచెముసేపిక్కడ విశ్రమించి పొండి.సకుటంబముగా బయలుదేఱినట్లున్నది.మీరెక్కడకుఁబోయెదరు?

యోగి- అట్టి దూరదేశయాత్ర ధనవంతులకు కాని లభింపదు.త్రోవపొడుగునను సత్రములులేవు.మీరేమైన ధనమును సేకరించుకొని మఱి బయలుదేఱినారు కారా?

రాజశేఖర చరిత్రము

రాజ- మావంటి బీదవారికి విశేషధన మెక్కడనుండివచ్చును? అయినను మేము నూరు రూపాయల సొమ్ము తెచ్చుకొన్నాము.నేలాగునైనను వానితోనే గంగాయాత్రచేసికొని రావలెననియున్నది.

యోగి- మీరు బహుజాగ్రత్తగా నుండవలెను.ఇక్కడకు రెండుక్రోసుల దూరములో నున్నవేఁడిమంగలమువద్ద బాటసారులను దొంగలు కొట్టుచుందురు.గడియసేవు తాళుదులేని మాశిష్యులను తోడిచ్చిపంపెదము.

అనిచెప్పి యాయోగి తావళమును ద్రిప్పుచు మరల జపముచేయనారంభించెను.ఏ వేళకునునాతని శిష్యులు రానందున, రాజశేఖరుడుగారు మనసులో తొందరపడుచుండిరి.ప్రొద్దును అంతకంతకు వాలుచుండెను.

రాజ- స్వామీ! మీశిష్యులీవఱకును రాలేదు.రెండు గడియలప్రొద్దున్నది.వేగిరము వర్తమానముపంపెదరా?

యోగి- ఆవశ్యముగా బంపెదను. అని చివాలునలేచి జువ్విచెట్టునకు నూఱుబారల దూరములోనున్న యొక గుడిసెయొద్దకుఁబోయి 'గోపాలిగా' యని యొకపిలుపు పిలిచెను. లోపలినుండి చినిగినగుడ్డను కట్టుకొని బొగ్గువంటి శరీరముతో బుఱ్ఱముక్కును, మిట్టనొనలును, తుప్పతలయు, గొగ్గిపళ్ళను గల యొకకిరాతుఁడు బయలవచ్చెను. వానితో నేనేమో మాటాడుచు పందిరివఱకును దీసికొనివచ్చి, రాజశేఖరుఁడుగారు వినుచుండగా 'వీరికి సహాయముగా బంపుటకయి మనవాండ్రను బిలుచుకొని యిక్కడ నున్నట్టుగా రమ్మ 'ని వంపెను.

రాజ- స్వామీ! మీశిష్యులేవేళకు వత్తురో చీకఁటి పడక ముందేవేఁడిమంగలము దాఁటవలెను. మేము నడచుచుందుమా?

ఎనిమిదవ ప్రకరణము

యోగి- అవును. మీరు చెప్పిన మాటనిజమే. మీరు నడుచుచుండుండి.వాండ్రు వచ్చిమిమ్మిప్పుడేకలసికొందురు.

అప్పుడు రాజశేఖరుఁడుగారు పెండ్లముతోను బిడ్దలతోను బయలుదేఱి దొంగలపేరు జ్ఞప్తికి వచ్చినప్పుడెల్ల గుండెలుతటతటఁగొట్టుకొన, బుజముమీఁది మూటనుపలుమాఱు తడవిచూచుకొనుచు, చీమచిటుక్కుమన్న వెనుకఁదిరిగి చూచుచు, కొంచెమెక్కడనయినను పొదకదలిన నులికిపడుచు నడుచుచుండిరి. ఆయోగిచేఁ బంపఁబడిన కిరాతుఁడును వేగముగా నడచిపోయి త్రోవలో నొకచోట దిట్టముగా కల్లునీళ్ళుతూలుచు తల వణికించుచు చింతణిప్పులవలెనున్న గృడ్లుత్రిప్పుచు సంకేతస్థలమునుజేరి, అక్కడనొక పాకలో నొదురించుచున్న మనుష్యునిచేతితో గొట్టిలేపి,"ఓరీ! ఒక బ్రాహ్మణుఁడును కొడుకును భార్యయు యిద్దరు కొమార్తెలును నూఱురూపాయలతో వెళ్ళుచున్నారు. కాఁబట్టి మీరు చీమల చింతదగ్గఱకు వేగిరము వెళ్ళవలెనని మన గౌరువుగారు చెప్పినారు" అని చెప్పి పోయెను. అతఁడామాటలు విన్నతోడనే కొంతసేపేమో యాలోచించి సంతోషపూర్వకముగా లేచి, ఆత్రోవలను సంకేత స్థలములను నె!ఱిఁగియున్నవాఁడు కావున మాఱుమాటాడక కత్తినిచేతఁ బట్టుకొని పాకవెదలి బయలుదేఱెను.ఆకిరాతుఁడును అడ్డుత్రోవను బోయిదారిలోఁగనబడ్డ మఱియొకనితోఁగూదఁజెప్పితిరిగి యోగిని గలిసికొని యాతని యుత్తరువుప్రకారమువిల్లునునమ్ములునుధరించి వారిని మార్గముతప్పించి చీమలచింతయొద్దకుఁదీసికొనిపోవుటకయి పగెత్తుకొని పోయి సంజచీఁకటివేళ వారిని గలిసికొనెను.

కిరా- అయ్యా! శిష్యులు రానందున మా గురువుగారు మీకాపుదలకయి నన్నుఁబంపినారు.మంచిసమయములో వచ్చి
రాజశేఖర చరిత్రము

మిమ్ముఁ గూడూకొన్నాను. దొంగలు కొట్టు స్ధలమునకు సమీపములో నున్నాము అయినను మీ కేదియు భయము లేదు. మనుమీమార్గమున విడీచి కాలిమార్గమునఁ బోయి భయపడవలసిన స్ధలమును దాఁటిన తరువాత పెద్దబాటలో వెళ్ళి చేరుదము.

రాజు- అలాగునుయినను మమ్ము సుఖముగాఁ దీసికొని వెళ్ళవలసిన భారమునీది. నీ వేత్రోవనురమ్మన్న నా త్రోవనే వచ్చెదము.

అప్పుడాకిరాతుఁడు వారిని పెద్దత్రోవ నుండి మరలించి యిఱుకు దారిని వెంటఁ బెట్టుకొని పోవుచుండెను. ఇంతలో మబ్బు పట్టి దారి కానరాక గాఢాంధకారబంధురముగా నుండెను. చెట్ల మీఁది పక్షులు కలకలము లుడిగెనుగాని గ్రుడ్లగూబ మొదలగు కొన్ని పక్షులు మాత్రము మేఁత కయి సంచరించు చుండెను; చిమ్మటలు కీచుమని దశదిశలయందును ధ్వనిఁ జేయఁజొచ్చెను; అడవిమృ గములయొక్క కూఁతలును పాముల యొక్క భూత్కారములను కర్ణకఠోరములుగా వినఁబడుచుండెను. నడుమనడుమ మేఘములలోనుండి తళుక్కుమని మెఱుపొక్కటి కొంచము త్రోవ కనఁబడుచుండెను. ఈ రీతిని కొంచము దూరము నడిచిన తరువాత వెలుతురగపడెను; ఆ వెలుతురు సమీపించినకొలఁదిని గొప మంటగా నేర్పడుచు, ఒకగొప్ప చింత చెట్టునకు సమీపముగా నుండెను. చీఁకటిలో నీ ప్రకారముగా నడుచునప్పుడు రాజశేఖరుఁడు గారి ప్రాణము లాయనదేహములో లేవు.; తక్కిన వారును అఱచేతిలో ప్రాణ్ములు పెట్టుకొని కాళ్ళీడ్చుచు నడచుచుండిరి. ఆ రాత్రి యాపద నుండి తప్పించుకొని యేదైన నొకయూరు చేరితిమాయిఁక నెప్పుడును దారి ప్రయాణము చేయ మని యెల్ల వారును నిశ్చయము చేసుకొనిరి, ఊరు చేరినతరువాత గ్రామ దేవతకు మేఁకపోతును

ఎనిమిదవ ప్రకరణము


బలి యిప్పించెదనని మాణిక్యాంబమొక్కుకొనను. ఈ ప్రకరముగా వ్యాకులపడుచు వారు నడిచి యొక విశాలస్ధలమును జేరునప్పటికి, చింతచెట్టు క్రింద మంటముందఱఁ గూరుచుండి యున్న రెండు విగ్రహములు లేచి, దేహమునిండ కంబళ్ళు కప్పుకొని నోటిలో చుట్టలంటించి బుజములమీఁద దుడ్డుకఱ్ఱలతో వారి వంక నడచి రానారంభించెను. వాండ్రను జూచినతోడనే వారి కందఱకును పయి ప్రాణములు పయినిపోయినాయి; వెనుకనున్న కిరాతుఁడు దొంగలని కేకకేసి వెనుకవాఁడు వెనుకనే పాఱిపోయెను, ఇంతలో నాదొంగలలో నొకడు ముందునకు వచ్చి రెండు చేతులతోను కఱ్ఱను పూనిపట్టి, మాటాడక ముందున్న రుక్మిణి నెత్తిమీఁద సత్తువకొలఁది నొకపెట్టు పెట్టును. ఆ పెట్టుతో మొదలునఱికిన యరఁటి చెట్టువలె రుక్మిణి నేల కొఱిగి నిశ్చేష్టురాలయిపడియుండెను. ఇంతలో నెవ్వఁడో కత్తి దూసికొని ' ఆగు ' 'ఆగు ' మని కేకలు వేయుచు, మెఱుపు మెఱసినట్టు మీఁదఁబడి దొంగలలో నొకనిని మెడమీఁద ఖడ్గముతో వేసెను. ఆ వేటుతో శిరస్సు పుచ్చకాయవలె మీఁది కెగరి దూరముగా బడఁగా మొండెము భూమి మీఁద బడి చిమ్మనగొట్టములతోఁ గొట్టినట్లు రక్త ధారలు ప్రవహింప కాళ్ళతోను చేతులతోను విలవిలఁ గొట్టుకొనచుండెను. శత్రు వాయుధపాణియమయుండుటయు, తానొంటిగాఁడగటయు, బాటసారులలో మఱియిద్దరు మగవాండ్రుటయు చూచి కిరాతునితో గూడికొని రెండవ దొంగవాఁడు కాలికొలఁదిని దూఁటెను. ఖడ్గపాణియైన యాపుణ్యాత్ముఁడు వాండ్రను కొంత దూరము వెంబడించెను గాని వాండ్రు నిమిషములోఁ జూపుమేరదూరము దాఁటి యద్రశ్యలయినందున వెనుకకు మరలి వచ్చి రాజశేఖరుఁడుగారిని కలిసికొనెను.

రామ-రాజశేఖరుఁడుగారు! ప్రొద్దుండగానే యీస్థలమును దాఁటవలసినదని నేను మధ్యాహ్నాముననే బహువిధములు భోధించితిని

రాజశేఖర విజయము


గదా ? మీరు నామాటలను లక్ష్యముచేయక యీయాపదను దెచ్చి పెట్టుకొంటిరి .

రాజ- ఓహోహో! రామరాజుగారిరాశి మీరు మాపాలిట దైవమువలె సమయమునకు వచ్చి మా యందఱిప్రాణములను నిలువఁబెటిరి. మీ రింకొక నిమిషము రాకుండిన మేమందఱము నాదుర్మార్గుల చేతులలోఁ బడిపోయి యుందుము. మీరీవేళ నిక్కడ కెట్లురాఁగలిగితిరి?

రామ - మీతోవచ్చిన కిరాతుఁడు యోగిచే దొంగలను బిలుచుకొని వచ్చుటకయి పంపఁబడి యెండలో నడువలేక యొక పాకలోఁ బరుండియున్న నన్నుఁ ద్నవారిలో నొకనిగా భ్రమించి తనగురువు కొందఱుఁ బ్రాహ్మణులను దోఁచుకొనుటకు కయి యీ చింతచెట్టు వద్దకి వెళ్ళుచున్నాఁడని చెప్పెను. ఆమాటలు విన్న తోడనే యాబ్రాహ్మణులు మీరే యని యూహించి నాకచట గాలు నిలువక దొంగలను వారింపవలె నను నుద్దేశముతో యోగియున్న తావునకు బోతిని. అక్కడ నావరకే దొంగలు వచ్చి యోగితో మాటాడి పోయినారన్న వార్త విని గుండెలు పగిలి నేను వచ్చు లోపల మీకేమి యుపద్రవమువచ్చునో యని మార్గాయాసమున నేమియు లక్ష్యము చేయక యొక్క పరుగున వచ్చి యుక్త సమయమున మీకుఁదోడు వడఁగాంచి నా జన్మము క్రతార్ఠత గనెనుగదా యని సంతోషించుచున్నాఁడను.

అనునప్పుడు మాణిక్యాంబ రుక్మిణిని నఖశఖపర్యంతము తడవిచూచి గొంతెత్తి యేడ్వఁజొచ్చెను. రామరాజును రాజశేఖరుఁడుగారును గూడ దగ్గఱకు బోయి చూచి కడుపుపట్టి చూచి ముక్కు దగ్గఱ వ్రేళ్ళుపెట్టి యూపిరి గానక దెబ్బ చేతను భయముచేతను

ఎనిమిదవ ప్రకరణము

మరణమునొందెనని నిశ్చయించుకొనిరి. రామరాజును నాడి నిదానించి చూచి యామె చచ్చినదనియే స్థిరపరిచెను. అప్పుడందఱను శవముచుట్టును జేరవిలపించుచుండిరి. ఆ సమయమున సమీపము నుండి వ్యాఘ్రముయొక్క కూఁత యొకటి వినఁబడెను. అంతయాపదలో సహిత మాధ్వని కందఱును బెదరి వడఁకుచుండగా, రామరాజు వారిక ధైర్యము చెప్పి క్రూరమృగములతో నిండియున్న యర్యణమధ్య మగుటచే నచ్చట నిలువఁగూడ దనియ తెల్లవారిన మీఁదట మరల వచ్చి శవమునకు దహనాదిసంస్కారములు చేయు వచ్చుననియు బోధింపజొచ్చెను. కన్నకూఁతును కారడవిలో విడిచి పెట్టివెళ్ళుటకు మనసురాక వారాతనిమాటలను చెవిని బెట్టక రుక్మిణి సుగుణములను దలఁచుకొని యేడుచుచుండిరి. ఇంతలో మఱింత సమీపమున గాండ్రు మని పులి మఱలనఱచెను. ఆ రెండవ కూతతో సూర్యకిరణములను కరఁగునట్టుగా వారి ధైర్యసారము కరిఁగి పోయెను. అప్పుడారామరాజు హితబోధ నంగీకరించి, యెంతో కష్టముతో రుక్మిణిని విడిచిపెట్టి , నడువ కాళ్ళు రాక ముందుకు నాలుగడుగులుపెట్టి మరల వెనుకకు తిరిగి చూచుచు , తుదక విధి లేక రామరాజు వెంట వారందఱును పెద్దాపురమునుకుఁ బోయిరి. తమ ప్రాణముల మీఁదికి వచ్చునప్పుడు లోకములోనెల్లవారును తామావఱుకు ప్రాణాధికులనుగాఁ జూచుకొనువారి యాపదలయినను మఱచిపోయి తమ యాపదను తప్పించుకొనుటకే ప్రయత్నింతురు గదా?