ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/యథావాక్కుల అన్నమయ్య

వికీసోర్స్ నుండి

యథావాక్కుల అన్నమయ్య

ప్రాచీనులగు శివకవులలో యథావాక్కుల అన్నమయ్య యొకఁడు. ఇతcడు "సర్వేశ్వరా " అను మకుటముతో శివస్తుతి నొనరించుచు నొక కృతిని రచించెను. అది "సర్వేశ్వర శతకము"గా ప్రసిద్దమైయున్నది. ఇందలి పద్యసంఖ్య వివిధములగు వ్రాతప్రతులలో విభిన్నముగ నున్నది కొన్నింట 123 కొన్నింట 133. పరిషత్తు వారు ముద్రించిన ప్రతిలో 128 పద్యములు, మఱికొన్నింట 142 పద్యములను కానవచ్చుచున్నవి. ఇందలి పద్యములు కొన్ని యితర గ్రంథములందును (అబ్బయామాత్యుని కవిరాజమనోరంజనమునను కలదు. ప్రబంధ రత్నావళియందు, మమ్మయ జైతరాజు రచనగా నొకపద్యముకలదు ) కానవచ్చుచున్నవి. ఇతరులు పై మకుటముతో వ్రాసిన పద్యములు కొన్ని యిందుఁజేరినట్లు విమర్శకు లభిప్రాయపడుచున్నారు. కావున ఇందలి పద్యసంఖ్యను నిర్ణయించుట కష్టము. కవి, తాను శతకమును వ్రాసితినని చెప్పనందున-ఇది శతక మగునో, కాదో నిర్ణయించుటయు కష్టము. అన్నమయ్య తాను 'సర్వేశ్వర ప్రాకామ్యస్తవము'ను జెప్పినట్లును. 'సర్వేశ్వరస్తోత్రంబు' చెప్పినట్లును తెల్పియున్నాఁడు. మఱియు 'సర్వేశ్వర స్తోత్రం బన్నయచెప్పె' నను పద్యభాగమునుబట్టి యితనికి 'అన్నయ" అను పేరు నున్నట్లు స్పష్టము.

        "శాకాబ్దంబులు వార్థి షట్కపురజి
                     త్సం ఖ్యం బ్రవర్తింప
         శ్లోకానందకరంబుగా మహిమతో
                       శోభిల్ల సర్వేశ్వర
         ప్రాకామ్య స్తవ మొప్పఁ జెప్పె శుభకృ
                     త్ప్రవ్యక్తవర్షంబునన్
         శ్రీకంఠార్పితమై వసుంధరపయిం
                   జెన్నొంద సర్వేశ్వరా!"

అను నీతని పద్యమునుబట్టి యేతద్గ్రంథరచనాకాలము 1164 నకు సరి యగు క్రీ.శ.1242 గా తెలియుచున్నది.

ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ప్రకటించిన 'సర్వేశ్వర శతక' పీఠికనుబట్టి యీ యన్నమయ్య ఆత్రేయసగోత్రుఁడగు నారాధ్యబ్రాహ్మణుఁడనియు, యజుశ్శాఖాధ్యాయి యనియు, గోదావరీ తీరవాసియనియు, పట్టెసమున వెలసిన వీరభద్రేశ్వరస్వామి యీతని యిలవేలుపనియుఁ దెలియుచున్నది. ఈ వృత్తాంతము పరిషత్తువారికి శ్రీ శేషగిరిరావుగారు సంపాదించి యిచ్చినట్లును సోమరాజు వేంకట శివునిచే వ్రాసియుంచఁబడినట్లును తెలియు చున్నది.

అన్నమయ్య ప్రాచీనుఁ డగుటచే "సమూహి, విగర్వించు, సురంగము, బహురూపమాడు" మున్నగు పదములను ప్రయోగించెననియు, ఇట్టివి సోమనాథాదుల గ్రంథములందును గలవనియు "తెనుఁగు కవుల చరిత్ర"లోఁ గలదు.

పెక్కు విషయములలో అన్నమయ్య కృతికిని, సోమనాధుని గ్రంథములకును పోలిక కానవచ్చుచున్నది. సోమనాధుఁడు క్రీ. శ. 1190-1260 ల నడుమ నుండెనని నిశ్చయించిన శ్రీ వేంకటరావుగారు సోమనాధు ననుసరించియే అన్నమయ్య గ్రంథరచన సాగించెననియు, అన్నమయ్య అతి రమ్యంబుగ దూదికొండ మహనీయారాధ్య సోమేశ్వర, ప్రభుకారుణ్య వసంతసంజనితమత్సద్య ప్రసూనావళిన్"--అనునెడ పేర్కొనిన దూది కొండలోని ఆరాధ్య సోమేశ్వరుఁడు పాలకుఱికి సోమనాధుఁడే యయి యుండుననియు తెలియజేసియున్నారు.

సోమనాధుఁడు ద్వితీయ ప్రతాపరుద్రుని కాలమున నుండెనని తలఁచుచున్న *ఆంధ్రకవితరంగిణి" కర్త 'శతకవాఙ్మయ సర్వస్వ' కర్త మున్నగువారు ఆరాధ్య సోమేశ్వరుఁడు సోమనాధుఁడు కాఁడనియు, అన్నమయ్య కృతి ననుసరించియే సోమనాధుఁడు తన గ్రంథములను రచించెననియు నభిప్రాయపడుచున్నారు. ఏదియెట్లున్నను అన్నమయ్య 18 వ శతాబ్ది నడుమ నున్నవాఁ డనుట నిశ్చయము. l] య థా వా క్కుల అ న్న మ య్య

అన్నమయ్య రచించిన వేఱొకకృతి 'లీలానంద సర్వేశ్వర శతక' మున్నట్లు శ్రీవేంకటరావుగారు "తెనుఁగు కవుల చరిత్ర" లోఁ దెల్పియున్నారు. (పుట 377) ఈ "లీలానందసర్వేశ్వర శతకము"న అన్నమయ్య శైలి ననుసరింపని పద్యములున్నందున, ఇది అన్నమయ్య కృతి కాదని "ఆంధ్రకవి తరంగిణి" కారుల యభిప్రాయము. ప్రాచీన భాషా సంప్రదాయము లిందుండుటచే, అన్నమయ్య రచనయే యగునవి శ్రీ వేంకటరావుగారను చున్నారు.

సర్వేశ్వర స్తుతిలో నెన్ని పద్యములున్నదియు నిశ్చయము కాలేదు. ఒకవేళ నివి యందలి పద్యము లేమో : 'లీలానంద' అనునది "సర్వేశ్వరా " అను దానికి విశేషణమని గ్రహించినచో- అది ప్రత్యేకకృతి యనుటకంటె ఉపలబ్దములగు పద్యములు 'సర్వేశ్వర శతకము' లోనివే యని యూహించుటకును అవకాశము లేకపోలేదు.

పెద్దయామాత్యుఁడు

ఇతనింగూర్చి "తెనుఁగు కవుల చరిత్ర"లో వ్రాయఁబడినది. తెలుఁగు కవులలో పెద్దయలు పెక్కురు కలరు. ఇతఁడు విక్రమార్కచరిత్రమును రచించిన జక్కనకు పితామహుఁడు నెల్లూరిని పాలించిన మనుమసిద్ది రాజునకు దండ్రియగు చోళ తిక్కరాజు కాలమున నున్నట్లు జక్కన చెప్పిన "...నెల్లూరి తిరుకాళ మనుజవిభుని, సమ్ముఖమ్మున సాహిత్యసరణి మెఱసి" అను పద్యభాగమువలననే తెలియుచున్నది. తిక్కరాజే తిరుక్కాళత్తి యని శ్రీ వేంకటరావుగారు తెలిపిరి. కావున నీకవి క్రీ.శ. 1208 - 1230 నడుమ నుండెనని చెప్పవచ్చును.

పెద్దయామాత్యుని గ్రంథములు లభింపలేదు. ఇతఁడు "ఆశు-మధుర-చిత్ర-విస్తరము"లను చతుర్విధ కవిత్వములందు నాఱితేఱినవాఁడు.

వెన్నెలకంటి అన్నయ


ఇతఁడు "షోడశకుమారచరిత్రము"ను రచించెను. దీనికి "బేతాళపంచవింశతి" అను నామాంతరము కలదు. బేతాళపంచవింశతి కవిభల్లట రచనగా లాక్షణికులు చెప్పుచున్నారు. ముద్రిత షోడశకుమారచరిత్రములోని భాగములను, ఆముద్రిత బేతాళ పంచవింశతి లోని భాగములను అభిన్నములయి యున్నవి

అన్నయ తన గ్రంధమును తండ్రియగు సూరనామాత్యుని కంకిత మిచ్చెను. సూరనామాత్యుని, పశ్చిమ చాళుక్య చక్రవర్తియగు సోమేశ్వరుని (క్రీ. శ. 1128-1138) తోడను, జగదేక మల్లుని (క్రీ. శ. 1148) తోడను. కృష్ణకందారుఁ డను యాదవరాజు (క్రీ. శ. 1250) తోడను, కవి పోల్చి యుండుటచే నీతఁడు క్రీ. శ. 1250 ప్రాంతమువాఁడయి యుండవచ్చునని. 'తెనుఁగు కవుల చరిత్ర' లోఁ దెలుపఁబడి యున్నది.