ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మంత్రి భాస్కరుఁడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మంత్రి భాస్కరుఁడు


మంత్రి భాస్కరుఁడు సుప్రసిద్దుఁడను, కవిబ్రహ్మయునగు తిక్క-న సోమయాజి పితామహుఁడు. తిక్కన యీతనిని తన నిర్వచనోత్తర రామాయణమునందు 'నాపితామహుఁడగు మంత్రి భాస్కరునిcబట్టియే నాకృతికి ఆదరము కలుగు'నని ప్రశంసించియున్నాఁడు. తిక్కనకు "దశకుమార చరిత్రము నంకిత మొసఁగిన కేతన యీ మంత్రి భాస్కరుని -

 'శాపానుగ్రహ శక్తియుక్తుడమలా
                 చారుండు, సాహిత్య వి
         ద్యాపారీణుఁడు ధర్మమార్గపధికుం
                  దర్థార్థి లోకావన
         వ్యాపారవ్రతు డంచుఁ జెప్పు సుజన
                  వ్రాతంబు గౌరీపతి
         శ్రీపాద ప్రవణాంతరంగు విబుధ
                 శ్రేయస్కరున్ భాస్కరున్'

అని కొనియాడియున్నాఁడు మంత్రి భాస్క_రుఁడు క్రీ. శ. 1190-1220 నడువ నుండిన వాఁడు

ఇప్పడు 'భాస్కర రామాయణ' మని ప్రచారమున నున్న గ్రంధములోని అరణ్యకాండ మీతఁడు రచించినదై, తాళపత్రప్రతుల పరిశీలనమువలన బాల, అయోధ్యాకాండలను గూడ నీతఁడే రచియించి యుండవలెనని చెప్పవచ్చును. కాండముల చివఱి గద్యలు, అరణ్యకాండమందలి ఆశ్వాసవిభాగము, రచనావైలక్షణ్యము. ఇట్టి యూహ కాధారములు. మంత్రి భాస్కరుఁడు రచించిన కాండముల చివఱి పద్యములు విభక్త్యంతములతో నుండఁగా, తక్కినవి సంబోధనాంతములై యున్నవి. ప్రక్షిప్తములు ఎక్కువగా చేరినవి. మంత్రి భాస్కరుఁడు రచించిన రామాయణము మూలము ననుసరించినది కాదు. ఇందు కథాంశములు, వర్ణనలును సంగ్రహించడినవి కావుననే మఱల ఎఱ్ఱాప్రగడ మూలానుసారముగ రామాయణమును రచింపలసి వచ్చినది. భాస్కరుని రచనలో సంస్కృతపదము లెక్కువ. ఎఱ్ఱన రచనలో సంస్కృతాంధ్ర పదములు సమానముగ నుండును.

మంత్రి భాస్కరుఁడు రామాయణమును సమగ్రముగా రచింపలేదు. అసమగ్రమైన యారామాయణమును హుళక్కి భాస్కరుఁడు మున్నగువారు పూరించిరి కాని, ప్రారంభించిన కవి పేరును, పూర్తిచేసిన కవి పేరును 'భాస్కరుఁడే' అగుటచే దీనికి "భాస్కరరామాయణ" మని పేరు కలిగినది; మరియు రామాయణకర్తృత్వమున గూర్చి వివాదములు చెలరేఁగుట కవకాశము నేర్పడినది.

భాస్కర రామాయణములోని కొంత భాగము మంత్రి భాస్కర రచితమని 'తెనుఁగు కవుల చరిత్ర' కారులును వ్రాసియున్నారు. (పుటలు 313, 314) "ఆంధ్రకవితరంగిణి" కర్తయు దీనికి సమ్మతించిరి [చూ. 2 వ సంపుటము-మంత్రి భాస్కరుఁడు]

మఱియు "ఆంధ్ర కవితరంగిణి" లో నిట్లున్నది-- "కవి జీవిత కారులగు శ్రీ గురజాడ శ్రీరామమూర్తి పంతులుగారును, ఆంధ్ర కవులచరిత్ర ప్రధమముద్రణమున శ్రీ వీరేశలింగము పంతులుగారును, మంత్రి భాస్కరుఁడు రామాయణమునc గొంత భాగమును రచియించి యుండెనని యభిప్రాయపడియున్నారు. అందు పైని శ్రీ కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారు భాస్కరోదంతమను 74 పేజీల గ్రంథమున నీవిషయమును విమర్శించి, భాస్కర రామాయణముతో మంత్రి భాస్కరునకు సంబంధము లేదనియు, హుళక్కి, భాస్కరుఁడే రామాయణ గ్రంధకర్త యనియు నిరూపించి యున్నారు. దానినిబట్టి కాcబోలు శ్రీ వీరేశలింగము పంతులుగారు తమ యభిప్రాయమును మార్చుకొని కవుల చరిత్ర రెండవ ముద్రణమున రామాయణకర్త హుళక్కి భాస్కరుఁ డని వాసియున్నారు భాస్కరోదంతము క్రీ.శ.1898 వ సంవత్సరమున ననఁగా దాదాపు యేబది సంవత్సరముల క్రిందట ముద్రితమైనది. పంతులుగారి కవుల చరిత్రము రెండవ ముద్రణమును, భాస్కరోదంతమును, జదివిన పిమ్మటcగూడ నాయభిప్రాయము మారలేదు. మంత్రి భాస్కరుఁడు రామాయణములోc గొంతభాగమును రచియించి యుండెననియే నా నిశ్చితాభిప్రాయము. భాస్కరోదంతమునందలి విషయములు కొన్ని సత్యమునకు విరుద్దముగా నున్నవి. ఎఱ్ఱాప్రెగ్గడ రచించిన రామాయణ కృతికర్త ఆనవేమారెడ్డి యని భాస్కరోదంతము తెలుపుచున్నది. అది వాస్తవముకాదు. ఆ రామాయణ కృతిభర్త ప్రోలయ వేమారెడ్డికాని అనవేమారెడ్డి కాఁడు. మంత్రి భాస్కరునియొక్కయుఁ, దిక్కన సోమయాజి యొక్కయు కాలమును భాస్కరోదంతము సరిగా నిర్ణయింపలేదు [రెండవ సంపుటము-పుటలు 126,127]

భాస్కర రామాయణమునకు పీఠికను వ్రాసిన శ్రీ మేడేపల్లి వేంకట రమణాచార్యులుగారు భాస్కర రామాయణముతో మంత్రి భాస్కరునకు సంబంధములేదని తెలిపి యున్నారు,