Jump to content

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదునాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునాలుగవ ప్రకరణము.

విమలాదిత్యుడు.

(క్రీ.శ. 1011మొదలుకొని 1022వఱకు)

ఈ విమలాదిత్యుడు దానార్ణవునికి నార్యమహాదేవివలన జనించిన ద్వితీయపుత్త్రుడు. శక్తివర్మ తమ్ముడు. శక్తివర్మ తరువాత నితడు 1015వ సంవత్సరమున సింహాసనమునకు వచ్చి 1022 వఱకు నేడు సంవత్సరములు మాత్రము పరిపాలనము చేసియుండెనని కొన్ని శాసనములు స్పష్టముగా దెలుపుచున్నవి గాని విమలాదిత్యునిచే బ్రకటింపబడిన రణస్థిపూడి శాసనము శాలివాహనశకము 933 సంవత్సరము జ్యైష్ఠశుద్ధ పంచమీ గురువానరంబున పుష్యమీ నక్షత్ర సింహలగ్నమునందనగా క్రీస్తుశకము 1011వ సంవత్సరము మే నెల 10వతేదీని పట్టాభిషిక్తుండయి నటుల దెలుపుచున్నది.[1]

ఇట్టి భేదమునకు గారణమేమో మనము దెలిసికొనవలసియున్నది. విజయనగరమునకు సమీపము నందుండిన రామతీర్థము కడనున్న కొండమీద లిఖింపబడిన యొక శాసనము చాలమట్టుకు శిథిలమై పోయినను ముమ్మడి భీముని పేరు కలిగియుండెను. [2] ముమ్మడి భీముడనునది విమలాదిత్యుని బిరుదునామములో నొక్కటియగుటచేత విమలాదిత్యుడు కళింగదేశమును జయించి యుండవచ్చునని కొందఱు తలంచుచున్నారు. పూర్వచాళుక్యలకును వెలనాటి చోడులకును లోబడి కోనమండలమేలిన హైహయవంశజులలో ముమ్మడిభీముడను వాడొకడుండుట చేత కేవలము పేరును బట్టి యే యది విమలాదిత్యుని శాసనమని దెలుపుట సాహసకార్యమైనను మఱియొక హేతువుచేత నయ్యది విమలాదిత్యునిదే యై యుండవచ్చునని సంశయము కలుగుచున్నది. గంజాము మండలములోని మహేంద్రగిరి మీద రెండుశాసనములు రాజేంద్రచోడుడు విమలాదిత్యుని నోడించి యాపర్వతముమీద జయస్తంభము నెలకొల్పెనని తెలుపుచున్నవి. [3] అయినను రాజేంద్రచోడుని ద్రావిడశాసనములలో నెచ్చటను నిట్టివిషయమును దెల్పియుండక బ్రదికియున్న కాలమున రాజేంద్రచోడుడు యువరాజుగనుండి యీ దండయాత్రను జరిపి యుండును గావున దనశాసనములలో నతడీ వృత్తాంతమును బేర్కొనియుండక పోవచ్చునని కొందఱు తలంచుచున్నారు. ఇక్కడ నొక ముఖ్యాంశమును చదువరులు జ్ఞప్తియందుంచుకొనవలయును. చోడచక్రవర్తియగు రాజరాజ రాజకేసరివర్మకూతురును రాజేంద్రచోడుని గారాలుచెల్లెలునగు కుండవాంబాదేవి విమలాదిత్యునకు వివాహముచేయబడియుండెను.[4] ఈ వివాహమెప్పడు జరిగినదో తెలియరాదు. ఇంకొక విశేషము గన్పట్టుచున్నది. తంజాపురమునకు సమీపమునందున్న తిరువైయారు గ్రామములోని పంచనాదేశ్వర దేవాలయములో రాజరాజ రాజకేసరివర్మ 29దవ పరిపాలన సంవత్సరమున విష్ణువర్ధన విమలాదిత్యునిచే నొక దానశాసనము వ్రాయించబడియుండెను.

రాజరాజచోడుడు క్రీస్తుశకము 985దవ సంవత్సరమున సింహాసనమెక్కినవాడు గావున విమలాదిత్యుని తిరువైయారు శాసనము 1013లేక 1014వ సంవత్సరమున లిఖింపబడియుండును. అనగా నా కాలమున విమలాదిత్యుడు తంజాపురి యం దత్తవారింటనుండి యుండవలయును. మహేంద్రగిరిశాసనములవలన బావమరిదియగు రాజేంద్రచోడునిచే నోడింపబడినట్లుండుటయు, తిరవైయారు శాసనమువలన విమలాదిత్యుడు తంజాపురమునందుండి పంచనాదేశ్వర స్వామికి దానము సలిపి నట్లుండుటయు, గన్పట్టుచుండుట[5] చేత డాక్టరు హల్ ట్జు మొదలగు వారు రాజేంద్రచోడుడు విమలాదిత్యుని నోడించి దక్షిణదేశమనకు జెఱగొనిపోయె ననియు, అచ్చటనున్న కాలమున జోడరాజు కుండనాంబా దేవిని విమలాదిత్యునికిచ్చి వివాహముచేసి వేంగిదేశమును బరిపాలించుటకు మరల బంపిరనియు, విమలాదిత్యుడు స్వదేశమునకు వచ్చి 1015 దవ సంవత్సరమునుండి నిరంకుశముగా దేశమును బరిపాలించెననియును విమలాదిత్యుడు దక్షిణదేశమున నున్న కాలమును విడిచి పూర్వచాళుక్యుల శాసనములు వానిరాజ్యపాలనకాలము 1015వ సంవత్సరమునుండి మాత్రమె పరిగణించి యేడుసంవత్సరములని వక్కాణించినవనియుసమన్వయము చేయుచున్నారు గాని తక్కిన విషయములను బాటింపుచుండలేదు. విమలాదిత్యుని మామయగు రాజరాజ చోడుడు 985దవ సంవత్సరమున సింహాసనమునకు వచ్చెను. తన పదునాలుగవ పరిపాలన సంవత్సరమున ననగా 999దవ సంవత్సరమున వేంగిదేశముపై దండెత్తివచ్చి జయించెనని వానిశాసనములే దెలుపుచున్నవి. శక్తివర్మ 999 దవ సంవత్సరమునసింహాసనమెక్కినట్లు చాళుక్యుల శాసనములు దెలుపుచున్నవి. అదివఱ కరాజకముగ నుండిన వేంగి దేశమునందలి కలహముల నడంచి రాజరాజు శక్తివర్మను బట్టాభిషిక్తుని గావించెనని సమన్వయించిరి. విమలాదిత్యుడు 1011వ సంవత్సరమున సింహాసనమునకువచ్చినట్లు రణస్థిపూడిశాసనము చాటుచున్నది. 1014వ సంవత్సరమున విమలాదిత్యుడత్తవారింట విందులు గుడుచుచుండెను. 1011 వ సంవత్సరమునకును 1014 ‌ ‌వ సంవత్సరమునకును నడుమ రాజేంద్రచోడునిచే నోడింపబడి చెఱగొనిపోబడుటయు నచట కుండవాంబాదేవిని వివాహమాడుటయు, పంచనాదేశ్వరసామికి విమలాదిత్యుడు దానశాసనము వ్రాయించుటయు జరిగియుండెనని చెప్పుదురు. మంచిది. విమలాదిత్యుని కుమారుడయిన రాజరాజు 1022వ సంవత్సరమున సింహాసనమెక్కినట్లు రాజరాజనరేంద్రుని కోరుమల్లి నందమపూడి శాసనములు విస్పష్టముగా వెల్లడించుచున్నవి, అట్లయినచే రాజనరేంద్రుడు సింహాసన మధిష్టించునప్పటికి పదేండ్లకంటె నెక్కువవయస్సుండదని నిస్సంశయముగా జెప్పవచ్చును. రాజేంద్ర చోడుడు విమలాదిత్యుని జయింపకపూర్వమే కుండవాంబను విమలాదిత్యునికిచ్చి వివాహము చేసియుండినయెడల రాజేంద్రచోడుడు విమలాదిత్యునితో బోరాడి యోడించి చెఱగొని పోవుట కంతనిరోధ కారణమేమి యుండగలదు? రాజరాజనరేంద్రుడు సింహాసనమునకు వచ్చునప్పటికంతబాలుడని యెచ్చటనువర్ణింపబడియుండలేదు. ఇయ్యది విచారణీయమైన విషయము. విమలాదిత్యుడు1011వ సంవత్సరము మొదలుకొని 1022వ సంవత్సరము వఱకు బదునొకండు సంవత్సరములు పరిపాలనము చేసెను. విమలాదిత్యునకు బిరుదాంక భీముడనియు, త్రిభువనాంకుశుడనియు, భూపమహేంద్రుడనియు బిరుదునామములుగలవు. విమలాదిత్యుడు ప్రభుత్వము చేయుకాలమునందే తనకుమారునకు రాజ్యపదవి నిలుచునట్లు కట్టుదిట్టములు గావించి విశ్వాసపాత్రులయిన మంత్రుల మొదలగువారికి గ్రామాదులనొసంగి తనయనంతరముగూడ తనపట్టున విశ్వాసముగలిగి తనకుమారుని పక్షమున నిలిచియుండునట్లు చేసికొనియెను. ప్రతాపశాలియైన నృపకాముడు దండనాయకుడుగ నుండెను. వజ్జియు యను నియోగి ప్రధానమంత్రిగనుండి అమాత్య శిఖామణి యని పేరుగాంచెను. మిక్కిలి ప్రతాపవంతుడును బలశాలియునైన కుడ్యవర్మ వీనికిలోబడిన సామంతుడుగనుండి వీని మిత్రవర్గములో జేరియుండి వెలనాడున కధీశ్వరుడుగ నుండెను.

విమలాదిత్యునిమంత్రి.

విమలాదిత్యునిమంత్రియగు వజ్జియ ప్రెగ్గడ రణస్థిపూడి శాసనమున విశేషముగా నభినందింపబడియుండెను. ఇతడు కారమచేడు గ్రామనివాసియు [6] కౌండిన్య గోత్రుడునైన బ్రాహ్మణుడుగానుండెను. ఇతడు పరిశుద్ధమైన వాక్కును, పవిత్రమైన వర్తనమును గలిగి బ్రాహ్మణకులమునకు భాస్కరునివలె నున్నవాడని గొనియాడబడియుండెను. ఈవజ్జియ ప్రెగ్గడ అమాత్యశిఖామణియనియు, బుధనజ్రప్రకారడనియు, సౌజన్యరత్నాకరుడనియు బిరుదునామములను వహించి యాంధ్రదేశమునందతట బ్రఖ్యాతి వహించెను, ఈ బ్రాహ్మణప్రభువు మనోవాక్కాయ కర్మంబుల బరిశుద్ధుడయిన కుండిన ఋషీంద్రుని వంటివాడట, మఱియు శివభక్తుడు. యజ్ఞయాగాది క్రతువుల నాచరించినకర్మిష్ఠి. ఔదార్య చిత్తముగలవాడు. ఇతడు తన ప్రజ్ఞావిశేషముచేత విమలాదిత్యుని పరిపాలనము జయప్రదమైనదిగా జేయుటకు బహుకష్టపడినందున విమలాదిత్యుడు సంతోషించి వాని ప్రభుభక్తికి మెచ్చుకొని గుద్రవాడి విషయములోని పాఱువళమను గ్రామముతో గూడ రణస్థిపూండిగ్రామము నగ్రహారముగా నేర్పాటు చేసి దానముచేసెను. ఈ రణస్థిపూడి గ్రామముచుట్టును మ్రొంతకఱ్ఱు (మోడేకఱ్ఱు) లుల్ల (లొల్ల), సిరిపొడపూండి (పెదపూడి) చింతగుంట, పెంజెఱువు మొదలగు గ్రామములు పేర్కొనబడియుండుటచేత ఈరెండు గ్రామములు గోదావరిమండలములోని అమలాపురము తాలూకాలోనివిగా గన్పట్టుచున్నవి. పాఱువళగ్రామ మమలాపురము కాలువయొడ్డున నున్న పలివెల గ్రామముగానున్నది. ఈశాసనమును వ్రాసినవాడు భీమనభట్టు.

రాజరాజవిష్ణువర్ధనుడు.

(క్రీ.శ.1022 మొదలుకొని 1063 వఱకు)

ఆంధ్రదేశమును బరిపాలించిన పూర్వరాజులలో నీరాజరాజ విష్ణువర్ధనుడు మిక్కిలి యదృష్టవంతుడని చెప్పదగియున్నవాడు. తమ భుజబల పరాక్రమముచేత దక్షిణహిందూదేశమునంతను జయించి శత్రుజనభయంకరులైయుండిన చోడరాజులకు నితడు రక్తబంధువగుటంజేసి పరరాజులెవ్వరును వీనినిగాని వీని రాజ్యమునుగాని మార్కొన సాహసింపజాలకుండిరి. అందువలన నాంధ్రదేశమునకు శాంతియును, వీనికి మనస్స్వాస్త్యమును లభ్యములయ్యెను. వీనితండ్రియగు విమలాదిత్యడు రాజరాజచోడుని కూతురును రాజేంద్రచోడునిచెల్లెలు నగుకూండవాంబాదేవిని వివాహమాడెనని యింతకు బూర్వము దె లిసికొనియుంటిమి.[7] విమలాదిత్యునికి కూండవాంబా దేవియందు జనించిన జైష్ఠపుత్రుడే మన యీరాజరాజ విష్ణువర్ధనుడు. ఇతడు రాజరాజచోడుని మనుమడగుటంజేసి వీనిని చోడులు రాజరాజనిపిలుచుచుండిరి. చాళుక్యులు వీనిని విష్ణువర్ధనుడనుచుండిరియ రాజరాజనుపేరువహించిన వేంగిరాజులలో నితడు మొదటివాడును విష్ణువర్ధన నామమును వహించిన వేంగిరాజులలో నితడు తొమ్మిదవవాడునై యుండెను. వీనికి విజయాదిత్యుడను తమ్ముడుగూడగలడు.

ఈ రాజరాజనరేంద్రుడుశాలివాహనశకము 944వ సంవత్సరము శ్రావణ బహుళద్వితీయాగురువారము నాడు త్తురాభాద్రనక్షత్రమున సింహాసన మెక్కినట్లుకోరుమల్లి నందమపూడి శాసనములవలన విస్పష్టమగుచున్నది.[8] ఈ కాలము లెక్కనేసిచూడగా క్రీస్తుశకము 1022 వ సంవత్సరము జూలయినెల పంతొమ్మిదవతేదితో సరియగుచున్నది. మఱియును రాజనరేంద్రుని ముమ్మనుమడయినకులోత్తుంగు చోళదేవుడు గోదావరి మండలములోని కోరంగికి సమీపమున నుండు చెల్లూరు గ్రామము కొలనుకాటమ(?) నాయకున కిచ్చినట్టియు కాలేరగ్రహారమును దాక్షారామ పీఠికాపుర సత్రములను జరుపుటకయి ముద్గలగోత్రుడును పోతనార్యుని పుత్రుడునయిన మేడమార్యుడను బ్రాహ్మణునకిచ్చినట్టియు దానశాసనములనుబట్టి రాజరాజనరేంద్రుని కుమారుడయిన కులోత్తుంగ చోడదేవుడు శాలివాహనశకము 986వ సంవత్సరమనగా క్రీస్తుశకము 1063వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చినట్టు చెప్పబడియున్నదిగనుక రాజరాజనరేంద్రుడు1022వ సంవత్సరము మొదలుకొని 1063వసంవత్సరమువఱకును40సంవత్సరములు నిరాతంకముగా రాజ్యపరిపాలనముచేసినట్లు సిద్ధాంతమగుచున్నది.[9]

విమలాదిత్యుడు రాజేంద్రచోడునిచే జెఱగొని పోబడి తంజాపురియందుండిన కాలమున కూండవాంబాదేవిని వివాహమాడినది వాస్తవమగునేని రాజనరేంద్రుడు 1011వ సంవత్సరమునకును నడుమజనించి యుండవలయును గావున సింహాసనమెక్కునప్పటికి బదిపండ్రెండుసంవత్సరముల బాలుడైయుండవలయును. అటుగాక 999 దవ సంవత్సరమన విమలాదిత్యునియన్న యగుశక్తివర్మ సింహసమునుకు వచ్చినతరువాత కూండవాంబను విమలాదిత్యుడు వివాహమాడి పుత్రజననమును గాంచినను రాజనరేంద్రుడు సింహసనమెక్కునప్పటికి నిరువదియేండ్లలోపలి వయస్సుగలవాడేయైయుండును. శాసనములను జక్కగా బరిశోధించి చూచిన పక్షమున మొదటి వృత్తాంతమె నమ్మదగియున్నది. ఈరాజరాజనరేంద్రుడు సింహాసనమెక్కిన తరువాత కొండ రాజేంద్రుని కూతురగు అమ్మంగదేవిని వివాహమాడెను. ఈవివాహమెప్పుడు జరిగినదియు దెలియరాదుగాని రాజనరేంద్రు డు సింహాసనమెక్కిన తరువాతనె జరిగినదనుట మాత్రము వాస్తవమనుటకు సందియములేదు. రాజనరేంద్రుని పరిపాలనకాల మీయాంధ్రదేశమునకు మిక్కిలి మంచికాలమని చెప్పుటకు సంశయింపబనిలేదు. ఇంతకు బూర్వమనేక పర్యాయములు రాజోపద్రవములచే బీడింపబడు చుండినయీయాంధ్రదేశ మీసరగండ భైరవుండగు రాజరాజనరేంద్రుని కాలములో స్వస్థతనుగాంచి దివ్యసుఖములను గాంచెను. ఇతడింత దీర్ఘకాలమునిష్కంటకముగా దేశపాలనము జేయుటకు గారణము బలాఢ్యులయినచోడులయొక్క సహాయమేగాని యన్యముగాదనియు, వారిసహాయములేని యెడల నిట్టిస్వాస్త్యము గలుగనేరదనియు గొందఱు తలంపవచ్చునుగాని పరాక్రమంబున రాజనరేంద్రుడు పూర్వరాజులకెంతమాత్రమును దీసిపోయినవాడుకాడు.

రాజనరేంద్రుని బిరుదునామములు.

సత్యాశ్రయకులశేఖరుడు, సర్వలోకాశ్రయుడు, రాజకంఠీరవుడు, త్రిభుననాంకుశుడు, సమస్తభువనాశ్రయుడు, బిరుదాంకభీమడు, రాజమహేంద్రుడు, రాజమార్తాండుడు,పరగండభైరవుడు, రాజపరమేశ్వరుడు మొదలగు బిరుదునామములెన్నో వహించి రాజరాజనరేంద్రుడు సుప్రఖ్యాతి గాంచినవాడని నన్నయభట్టనేకబిరుదునామములతో నభివర్ణించుటయేగాక

"ఉ.రాజకులైకభూషణుడు రాజమనోహరు డన్యరాజతే
జోజయశాలి శౌర్యుడు విశుద్ధయశశ్చరదిందుచంద్రికా
రాజితసర్వలోకుడపరాజిత భూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్.

అనియు
                     వసంతతిలకము.
"వీరావతారనుకవిస్తుతనిత్యధర్మ
ప్రారంభశిష్టపరిపాలనశక్తరాజా

నారాయణాఖ్య కరుణారసపూర్ణ వీర
శ్రీరమ్యరాజకుల శేఖరవిష్ణుమూర్తీ.

అని రాజనరేంద్రుని "నారాయణాఖ్యు"డనియు "విష్ణుమూర్తి"యనియు బొగడియున్నాడు.

కాబట్టి తావికి బరిమళమబ్బినట్లుగ నిట్టి రాజనరేంద్రునకు బలపరాక్రమవంతులయిన చోడులతోడ బాంధవ్య మబ్బుటవలనగూడ వీనిపరిపాలనము వేయివిధంబుల బరిశోభించి ప్రశంసనీయమయ్యెను. దేశోపద్రవకరములైన విషయంబువేవియును దటస్థింపక దేశమంతయు సుభిక్షముగా నున్నందునగాబోలుదనకుగలదానితో దృప్తినొంది పరరాజులతోడగయ్యెమునకు డీకొనక తనకాలమును విద్యావ్యాసంగములతోడ గడిపి యుండెను.

రాజమహేంద్రవరము.

రాజమహేంద్రపురము రాజమహేంద్రుడని బిరుదుగాంచిన అమ్మరాజు విష్ణువర్ధనునికాలములో యీరాజరాజ విష్ణువర్ధనునికాలముననో గట్టబడియుండును. ఎవరిచేత గట్టబడినను రాజరాజనరేంద్రునకు రాజధానిగనుండెననుటవాస్తవము. ఈ రాజమహేంద్రపురము వేగిరాజ్యములో మధ్యమభాగమున నుండుటచేత రాజనరేంద్రుడిందొకకోటనుగట్టి తనకు రాజధానిగ జేసి కొని చిరకాలము రాజ్యపాలనము చేసెను, రాజమహేంద్రపురము వేగిదేశంబునకు నాయకరత్నంబని నన్నయభట్టు మహాభారతమున జెప్పియున్నాడు, ఈపట్టణమునకుగలిగిన ప్రఖ్యాతి రాజనరేంద్రుని మూలమున గలిగినదేగాని మఱియొకరి మూలమున గలిగినది కాదు. అందుచేతనే విన్నకోట పెద్దన్న యనుకవి తనకావ్యాలంకారచూడామణిలో తనకృతికర్తయగు విశ్వేశ్వరమహారాజువంశమును వర్ణించునపుడు

"సీ. శ్రీకంఠచూడాగ్ర శృంగారకరణమే
రాజున కన్వ యారంభగురుడు

చాళుక్యవంశభూషణము శ్రీవిష్ణువ
ర్ధనుడే మహీశు తాతలకు దాత
భృతకుమారారామ భీముండు చాళుక్య
భీముడే నృపకులాబ్ధికివిధుండు
రాజమహేంద్రనరస్థాతరాజన
రేంద్రుడెక్కువ తాత యే విభునకు
నంధ్రదళదానపూసేంద్రుడగు నుపేంద్ర
ధరణివల్లభుడేరాజు తండ్రితాత
ఘనుడు పేంద్రాఖ్యుడెవ్వని కన్నతండ్రి
యతడు విశ్వేశ్వరుడు లక్క మాంబసుతుడు."

అను పద్యములో రాజనరేంద్రుని రాజమహేంద్రవరస్థాతయని యొక మహద్విషయముగ జెప్పినదానిని బట్టిచూడ రాజనరేంద్రునకును రాజమహేంద్రపురవరమునకును విశేషసంబంధము గలదనియును, రాజమహేంద్రపురంబునందుండి రాజ్యపరిపాలనము చేసిన మొదటి చాళుక్యప్రభువు రాజనరేంద్రుడే యని సూచించుచున్నట్లు గన్పట్టగలదు.

రాజరాజనరేంద్రభోజరాజులు సమకాలీనులు.

రాజమహేంద్రవరము రాజధానిగా నాంధ్రదేశమేలిన రాజరాజనరేంద్రుడునుధారాపురము రాజధానిగా మా‌ళవదేశము నేలినభోజమహారాజును సమకాలీనులగుటమాత్రమేగాక సమానలక్షణములనుగూడ గొన్నిటిని గలిగియుండిరని తెలిసికొనినప్పు డెంత యానందముకలుగుచున్నది. భోజరాజు 1018 వ సంవత్సరము మొదలుకొని1060దవ సంవత్సరమువఱకును నలువది సంవత్సరములకుబైగా రాజ్యపాలనము చేసియుండెను, భోజమహారాజుసంస్కృత పండితులను, సంస్కృతకవులనాదరించి సంస్కృతభాషాకవులను మాత్రమేగాక దేశభాషాకవుల కగ్రహారములు మొదలగునవి యిచ్చి పోషించి దేశభాషల నుద్ధరించెను. భోజమహారాజు సరిహద్దులనుండు రాజులతోడను గజినీమమూదు సైన్యములతోడను బోరాడవలసివచ్చి యతనిమనస్స్వాస్త్యమునకు గొంతభంగము కలుగుచువచ్చునుగాని మనయీరాజరాజనరేంద్రునకట్లు చేయదగిన యుద్ధములేవియును లేక మనంబు నిశ్శంకముగ నుండెను. అయిన నిరువురకును విద్యావ్యాసంగముల నభిరుచి మెండుగ నుండెను. భోజరాజు సంస్కృతపండితులచే సంస్కృతభాషలోనే బహుగ్రంథములను రచింపించియు సంస్కృతకళాశాలను స్థాపించినవాడగుటచేత భరతఖండమునందంతట బ్రఖ్యాతిగాంచుటకు గారణమయ్యెను. రాజనరేంద్రుడు తనదేశభాషనుద్ధరించి తరింపజేయుకొఱకే విశేషకృషిసల్పినవాడగుటచేత నొక్క యాంధ్రదేశముననే ప్రసిద్ధికెక్కియాంధ్రమహాజనులకృతజ్ఞతకు మాత్రమె పాత్రుడయ్యెను. భోజమహారాజు వీరమరణమైనను శత్రుజనమధ్యమున బ్రాణములు విడువవలసినవాడయ్యెను. రాజనరేంద్రుని కట్టిది సంభవింపలేదు. రాజనరేంద్రుని కాలము సుఖతరంబుగ నడిచెను. రాజనరేంద్రుడు భోజరాజుకంటె నదృష్టవంతుడని చెప్పవలయును.

రాజనరేంద్రుడ కావ్యగీతి ప్రియుడు.

రాజరాజు సరసుడును గాన్యగీతి ప్రియుడునని నన్నయభట్టు మహాభారతమునందు జెప్పియున్నాడు. అందుచేతనే యాతని కొల్వుకూటమెప్పుడును బహుభాషాపండితులచే నలంకరింపబడుచుండెను. వీనికెప్పుడును భారతమును వినుటయం దభిరుచి మెండుగాగలదు. బహుభాషలలో బహువిధముల బహుజనులచే జెప్పంబడుచుండిన మహాభారతకథను వినుచుండియు దృప్తిని బొందజాలక తెనుంగు భాసలోగూడ వినవలయునని యీతనికెంతో యభిలాషముగలదు.

నన్నయభట్టు.

ఒకనాడు రాజరాజవిష్ణువర్ధనుడువిద్వజ్జనంబులచే బరివేష్టింపబడినిండుకొలువున్న కాలమున మంత్రి పురోహితసేనాపతి యువరాజ దైవారిక ప్రధానసమక్షంబున దనకులబ్రాహ్మణుండును, అమర్తండును, అవిరళజపహోమతత్పరుండును, విపులశబ్దశాసనుండును, సంహితాభ్యాసుండును, బ్రహ్మాండాది నానాపురాణవిజ్ఞాననిరంతుండును, ఆపస్తంబసూత్రుండును, ముద్గలగోత్రజాతుండును, నద్వినుతావజాతచరితుండును, లోకజ్ఞుండును, ఉభయభాషాకావ్యరచవాభిశోభితుండును, సత్ప్రతిభాభియోగ్యుండును, మత్యమరాధిపాచార్యుండును, సుజనుండును నగునన్నపార్యునింజూచి యిట్లయనియెను.

"చ. విమలమతిన్ బురాణములు వింటి ననేకము లర్థధర్మశా
స్త్రముల తెఱంగెఱింగితి నుదాత్రరసాన్విత కావ్యనాటక
క్రమములు పెక్కుచూచితి జగత్పరిపూజ్యములైనయీశ్వరా
గమములయందునిల్పితి బ్రకాశముగా హృదయంబు భక్తితోన్.

మ. ఇవి యేనున్ సతతంబునాయెడగరంభిష్టంబులై యుండుబా
యవు భూదేవకులాభి తర్పణమహీయ ప్రీతియున్ భారత
శ్రవణాసక్తియు బార్వతీ పతిపదాబ్జధ్యానపూజా మహో
త్సవమున్ సంతతిదానశీలతయు శశ్వత్సాధు సాంగత్యమున్

మఱియు నదియునుంగాక.

చ. హిమకరుదొట్టి పూరభరతేశకురుప్రభుపాండుభూపతుల్
క్రమమున వంశకర్తలనగా నుహినొప్పిన యస్మదీయవం
శమున బ్రసిద్ధులై విమలసద్గుణ శోభితులైన పాండవో
త్తముల చరిత్రనాకు సతతంబువినంగనభీష్టమెంతయున్"

ఈపైని జెప్పబడినపద్యములలోని భావములనుబట్టి శైవమతాభిమానము గలవాడనియు అనవరతంబును శ్రీమహాభారతమునందలి యభిప్రాయమును విననభిలాషగలవాడనియు స్పష్టముగ దేటపడుచున్నది. కనుకనే రాజమహేంద్రుడు.

" జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభి హితమహాభారత బ

ద్ధనిరూపితార్థమేర్పడ
దెనుగున రచియుంపు మధికదీయుక్తిమెయిన్."

అని మహాభారతమును దెనుగున రచియింపుమని నన్నపార్యునిగోరెను. హిమకరపూరు భరతేశకురు ప్రభుపాండు భూపతులవంశమునందు దాను జనించెనని తనపూర్వులును తన్నాశ్రయించుకొనియుండు పురోహితులు మొదలగువారును జెప్పెడుగాథలను విశ్వసించినవాడగుటచేతగూడతనపూర్వులయిన పాండవులచరిత్రమును వినంగుతూహల మాతనికి స్వాభావికమునగా నగ్గలమై యుండవచ్చును. కావున నట్లు మహారాజాధిరాజుచే బ్రేరేపింపబడి విద్వత్కవిశిరోమణియు బుద్ధియందు బృహస్పతియునగు నన్నయార్యుడు వాజ్మయ దురంధురుండయిన నారాయణభట్టు సహాయముతో మహాభారతములోని మొదటి రెండుపర్వములను మూడవపర్వములోని కొంతభాగమును మాత్రము దెలిగించెను.

నన్నయభట్టాది కవిగాడు. ఆంధ్రభారతము ప్రథమాంధ్రకావ్యముగాదు.

నన్నయభట్టునకు బూర్వము గవులెవ్వరును, ఆంధ్రభారతమునకు బూర్వమున నాంధ్రగ్రంథము లెవ్వియును వినంబడకుండుటయు, గానరాకుండుటయుంజేసి నన్నయభట్టే ప్రథమాంధ్రకవియనియు, ఆంధ్రభారతమె ప్రథమాంధ్ర గ్రంథమనియు గొందఱి యభిప్రాయమై యున్నదిగాని వారివాదమును మేమువిశ్వసింపజాలకున్నారము. ఏతద్విషయమై గావింపబడిన చర్చలను సంపూర్ణముగా వినియుంటిమి. తత్పక్షమున వ్రాయంబడిన నన్నయ భట్టారకచరిత్రమాదిగాగల గ్రంథములను ఆ గ్రంథములలోని యుక్తులను, మేము సాంతముగ జదివియుంటిమి. అవియేవియును మా విశ్వాసమును మరలింపజాలకున్నవి. మహాభారతమును దెనుగున రచింపుమని రాజరాజనరేంద్రుడు నన్నయభట్టును గోరునప్పటికే నన్నయ ఉభయ భాషాకావ్యారచనాభిశోభితుండని రాజనరేంద్రునిచే బేర్కొనంబడియెనని నన్నయ్య మహాభారతమునందు స్పష్టమనగా జెప్పియుండుటయె నన్నయభట్టారక చరిత్రమునందలి యుక్తులన్నియు గాలికి దూదిపింజె లెగిరిపోవునట్లెగిరిపోవుచున్నవి. నన్నయకాలమునందే యాంధ్రకవులనేకులు ప్రసిద్ధికెక్కియున్నారు. వారిలో నారాయణభట్టొకడుగ నున్నాడు. నారాయణభట్టు తనకీకార్యమునందు దోడ్పడినట్లుగా నీక్రిందిపద్యమున నన్నయభట్టే చెప్పియున్నాడు.

"ఉ. పాయకసాకశాసనికి భారత ఘోరరణంబునందు నా
రాయణునట్లు, తానును ధరామరవిభూషణుండు నా
రాయణభట్టు వాఙ్మయధురంధరుడం దనకిష్టుడు న్సహా
ధ్యాయుడునైన వాడభిమతంబుగదోడయి నిర్వహింపగన్."

నారాయణభట్టు,

నందమపూడి శాసనము.

"నన్నయలిఖితమైన యొకశాసనమున నారాయణభట్టు కర్ణాటకభాషయందు బండితుడని తెలుపబడియున్నదిగావున నీ కన్నడపండితుని సహాయముచే శబ్దమణిదర్పణపద్ధతిని మనయాంధ్రమును భట్టారకులవారు శాసించి"రని నన్నయ భట్టారకచరిత్రమునందలి కల్పితవాక్య మాంధ్రప్రపంచముయొక్క సంపూర్ణవిశ్వాసమును పెడత్రోవను బట్టించుచున్నది గనుక దానినెంతమాత్రమును విశ్వసింపరాదు. ఒక్క కర్ణాటక పండితుడని మాత్రమునన్నయలిఖితమైన శాసనమునందు దెలుపంబడియుండలేదు. నన్నయలిఖితమని చెప్పబడుశాసనము నందమపూండి (నందంపూడి -ఇది ప్రస్తుతపు కృష్ణామండలములో తణుకుతాలూకాలోని సెట్టిపేటకు సమీపమున నెఱ్ఱకాలువయెడ్డునున్నది) శాసనమేగాని మఱియొకటిగాదు. [10] సింధుయుగమంతరదేశమను నామాంతరముగల రెండేఱులవాడి విషయములోని యీ నందమపూండి గ్రామమును చంద్రగ్రహణ పుణ్యకాలమున రాజరాజనరేంద్రుడు తన ముప్పదిరెండవ పరిపాలన సంవత్సరముననగా (బహుశ) శాలివాహనశకము 975వసంవత్సరమ మార్గశిరశుద్ధ15భా నువారమునకు సరియైన క్రీస్తుశకము 1053 వ సంవత్సరము నవంబరు నెల 28వతేదీని మంత్రిపురోహితసేనాపతియువరాజదౌవారిక ప్రధానసమక్షంబున నారాయణభట్టునకు నగ్రహారముగాననుభవింప ధారపోసెను. ఈ నారాయణభట్టు సంస్కృతకర్ణాటప్రాకృత పైశాచికాంధ్రభాషాసుకవిరాజశేఖరుండనియు కవీభనజ్రాంకుశుండనియును, అష్టాదశావధారణచక్రవర్తియనియు నందు బేర్కొనంబడి యుండెను. మఱియు హరితగోత్రుండు నాపస్తంబసూత్రుండు నైనకాంచనసోమయాజిప్రపౌత్రుండును, కాంచనార్యునిపౌత్రుండును శౌచాంజనేయనిపుత్రుండుననియుంగూడ పేర్కొనబడియుండెను. ఈ నారాయణభట్టుతండ్రి యగు శౌచాంజనేయునకు అకలంకాశాంకనామాత్యుడను నామాంతరము గలదు. ఈ యమాత్యవరునకు సామికాంబవలన జనించినవాడె మననారాయణభట్టు. ఈకవిరాజశేఖరుని సహాయముతో మననన్నయభట్టు మహాకవి మహాభారతమును దెలిగింపబూనెను. మహాభారతమును నన్నయభట్టు సాంతముగా దెలిగింపక యారణ్యపర్వము నడుమనే విడిచిపెట్టుటకు గారణము రాజనరేంద్రుని మరణమేకాని వేఱొండుగానేరదు. కావున భారతము రాజనరేంద్రుని కాలముననే నన్నయభట్టు మరణము నొందియుండుటగాని లోకాపవాదము ప్రకారము నన్నయభట్టునకు మతిభ్రమణము కలిగియుండుటగాని జరిగి తమ్మూలమున భారతము తెలిగింపబడక నిలిచియుండునేని అంతటి యభిమానముగలరాజనరేంద్రుడంతటికవిరాజశేఖరుండయిన నారాయణభట్టుచే బూర్తిచేయింపకుండె ననుమాట విశ్వసింపదగినదికాదు. కాబట్టి యాంధ్రభారతరచనము జరుగుచున్నకాలమునందు రాజనరేంద్రుడు మరణమునొంది యుండవలయును. రాజనరేంద్రునికుమారుడగురాజేంద్రచోడుడు సింహాసనమునకు రాకపోవుటయు, రాజనరేంద్రునికి బిమ్మట రాజనరేంద్రుని తమ్మడగు విజయాదిత్యుడు రాజ్యమాక్రమించుకొనుటయు సంభవించినదిగావున గొంతవఱకు దేశోపద్రవము సంభవించి మనకవివరులచే బ్రారంభింపబ డిన భారతరచనము మూలబడియుండవచ్చును. కాబట్టి మహాభారతరచనమునకు ముందే ఉభయ భాషాకావ్యరచనాభిశోభితుండై నన్నయభట్టును సంస్కృతప్రాకృతకర్ణాటపైశాచికాంధ్రభాషాకవిరాజశేఖరుండై నారాయణభట్టును ప్రసిద్ధిజెందియుండ నన్నయభట్టేయాదికవియనియు, ఆంధ్రభారతమే మొదటిగ్రంథమనియు, ఆంధ్రకవితాసతి నన్నయభట్టునకే జనించినదని చెప్పెడివారివాదము నెంతమాత్రమును మేము విశ్వసింప జాలకున్నారము.

పావులూరి మల్లనకవి.

ఇతడు తెనుగున గణితశాస్త్రమును రచించినమహాకవి. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; శివ్వన్న పుత్రుడు; అప స్తంబ సూత్రుడు గార్గ్య గోత్రోద్భవుడు; కమ్మనాడులోని పావులూరి గ్రామమునకు గరణమైయున్నాడు. ఈ కవి తనకు రాజనరేంద్రుడు పిఠాపురసమీపమున నున్న నవఖండవాడ యనుగ్రామము నిచ్చినట్లుగా నీక్రిందిపద్యమునంజెప్పుకొని యున్నాడు.

" ఉ. శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చనురాజరాజభూ
పాలకులచేత బీఠపురిపార్శ్వమున న్నపఖండవాడయన్
ప్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళా
శీలుడ రాజపూజితుడ శివ్వనపుత్రుడ మల్లనాఖ్యుడన్."

దీనినబట్టి యీ పావులూరి మల్లనకవియు రాజనరేంద్రుని కాలమునందున్నవాడని స్పష్టపడుచున్నది. ఇట్లు నన్నయభట్టు నారాయణభట్టు పావులూరి మల్లన ఆంధ్రగ్రంథరచనయందు నిపుణులయినట్టు గానంబడుచుండగానాంధ్ర కవితాసతి అప్పుడే యవతరించినదని చెప్పెడిమాట యొట్లు విశ్వసింపవచ్చును. భాషయెన్నడు నొక్కసారిగ సంస్కరింపబడునదికాదు. ఆంధ్రభాషాసంస్కరణము నన్నయకు బహుకాలమునకుముందే ప్రారంభమయియుండును గాని యొక్కసారిగ సంపూర్ణస్థితికి దేబడెననుటయు విశ్వసింపదగినదికాదు.

కోరుమల్లిశాసనము.

రాజరాజవిష్ణువర్ధనుమహీపాలుడు సంస్కృతకర్ణాటపైశాచికాంధ్రభాషాకవిరాజశేఖరుండగు నారాయణభట్టునకు నందమపూడి గ్రామమును మహాకవి యగు పావులూరి మల్లనామాత్యునకు నవఖండవాడ యనుగ్రామమును దానముచేసినట్లుగా నందమపూడి శాసనమువలనను, పావులూరి మల్లనకవివరచితమైన గణితశాస్త్రమువలనను దెలిసికొంటిమిగదా. ఇట్లేయాపస్తంబసూత్రుడును భారద్వాజగోత్రుడు నగు చీదమార్యుడను బ్రాహ్మణునకు కోరుమల్లినామగ్రామమును చంద్రగ్రహణ పుణ్యకాలమున దానముచేసి యుండెను. [11] ఇట్టి కవులను బండితులను నాదరించి యగ్రహారములు మొదలగునవి యిచ్చి భాషాపోషణము మొదలగు సత్కార్యములాచరించిన వాడగుటచేత నన్నయభట్టు తనభారతమునందు రాజనరేంద్రుని

"సీ. నిజమహామండలప్రజఁ బ్రీతిఁ బెంచుచు
బరమండలములధరణిపతుల
నదిమి కప్పంబుల ముదముతోఁ గొనుచును
బలిమి నీయనిభూమివలయపతుల
ను క్కడగించుచు దిక్కులఁ దనయాజ్ఞ
నెలిగించుచును విప్రకులము నెల్లఁ
బ్రోచుచు శరణన్నఁ గాచుచుభీతుల
నగ్రజన్ములకు ననుగ్రహమున
జారుతరమహాగ్రహారంబు లిచ్చుచు
దేవభోగముల మహావిభూతిఁ
దనరజేయు చిత్లు మనుమార్గుఁడగువిష్ణు
వర్ధనుండు వంశవర్ధనుండు."

అని యభివర్ణించియున్నాడు. కాబట్టి భూదేవకులాభితర్పణమహీయ ప్రీతియును, భారతశ్రవణాసక్తియును, పార్వతీపతిపదాబ్జధ్యానపూజామహోత్సవమును సంతతదానశీలతయును, శశ్వత్సాధుసాంగత్యమును తనకుగరం బిష్టంబులై యుండునని రాజనరేంద్రుడు చెప్పుకొన్న దానిలో నసత్యముగాని యతిశయోక్తిగాని లవమాత్రమును గానరాదు.

కృతఘ్నాపవాదములు.

నన్నయభట్టంతటివిద్యత్కవిరాజసింహునిచే.

"క. విమలాదిత్యతనూజుడు
విమలవిచారుడుఁ గుమారవిద్యాధరుఁడు
త్తమచాళుక్యుఁడు వివిధా
గమవిహితశ్రముడు తుహినకరుఁ డుగుకాంతిన్
చ. ఘనదురితానుబంధకలికాలజదోషతుషారసంహతిన్
దనయదయప్రభావమున దవ్వుగఁజోపిజగజ్జనానురం
జనముగ రాజ్యసంతతవసంతనితాంతవిభూతి నెంతయుం
దనరుజళుక్యమన్మథుఁడు ధర్మదయార్ద్రని బద్దబుద్ధియై
ఉ. ఆశ్రితపోషణంబున ననంతవిలాసమునన్ మనీషివి
ద్యాశ్రమతత్త్వవిత్త్వమున దానగుణాభిరతిని సమస్తవ
ర్ణాశ్రమధర్మరక్షణ మహామహిమన్ మహినొప్పు సర్వలో
కాశ్రయుఁ డాది రాజవిభుఁ డత్యకలంకచరిత్రసంపదన్."

అని సన్నతులను గాంచి "రాజమహేంద్రకవీంద్రసమాజసురక్ష్మాజ" యని సంబోధింపబడినవాడును, " సకలభువనలక్ష్మీవిలాస నివాసంబయిన రమ్యహర్మ్యతలంబున మంత్రిపురోహితసేనాపతిదండనాయక దౌవారికమహాప్రధానానంతసామంతపరివృతుండై అపారశబ్దశాస్త్రపారగులైన వైయాకరణులును భారతరామాయణాద్యనేక రచనావిశారదులయినమహాకవులును వివిధతర్కవిగాహిత సమస్తశాస్త్ర సాగరగరీయప్రతిభులయిన తార్కికులును నాదిగాగల్గు విద్వజ్జనంబులు పరివేష్ఠించి కొలువ నిరంతరము విద్యావిలాసగోష్ఠి సుఖోపవిష్ఠుండయి యిష్టకథావినోదంబుల బ్రొద్దుపుచ్చువాడును నైనయాంధ్రభారతకృతిపతితలకు దలయుందోకయులేని చిత్రాంగిసారంగధరులకథను కనకాంబచరిత్రమును ముడివెట్టియు, నన్నయభట్టుతలకు నతండనూయాపిశాచగ్రస్తుండని దెలుపు నసందర్భము లయిన గాథలను ముడివెట్టియు జరిత్రజ్ఞానములవలేశమును లేక కూపస్థమండూకములవలె నున్న కుకవిరాజమండలము పామరప్రపంచమును పెడదారిని బట్టింటుట కృతఘ్నాపవాదములే కారణములుగదా.

కులొత్తుంగ చోళదేవుడు.

(క్రీ.,శ. 1070 మొదలుకొని 1118వఱకు) రాజనరేంద్రుని కాలమున నాంధ్రదేశమునకుం గలిగిన స్వాస్థ్యమునకు రాజనరేంద్రుని మరణానంతరము భంగము గలిగినది. రాజనరేంద్రునికి బిమ్మట నాతని కుమారుడగు కులోత్తుంగ చోళదేవుడు సింహసనమెక్క వలసియుండ గులోత్తుంగ చోళదేవునకు బదులుగా విమలాదిత్యుని రెండవకుమారుడును రాజనరేంద్రుని తమ్ముడు నైన విజయాదిత్యుడు సింహాసన మాక్రమించుకొని యాంధ్రదేశమును బాలించునట్లు గానంబడుచున్నది. విమలాదిత్యుని కుమారుడగు రాజరాజనరేంద్రునకు రాజేంద్రచోడునికూతురగు అమ్మంగదేవికి జనించినవాడు రాజేంద్రచోడదేవుడు. విమలాదిత్యుడు రాజరాజచోడునికూతురగు కూండవాదేవిని వివాహమాడి యామెయందుగన్న తనకుమారునకు రాజరాజని తనమామపేరు పెట్టెను. ఈ రాజేంద్రచోడుడు మాతామహుని రాజ్యమగు చోడరాజ్యమును వశపఱచుకొన్న తరువాత కులోత్తుంగ చోళదేవుడను నామమును వహించెను. రాజరాజనరేంద్రుని కుమారుడగు రాజేంద్రచోడుడు యువరాజుగనుండినపుడె యుత్తరదేశములపై దండెత్తిపోయి మాధ్యమాగాణములలోని వాయిరాగరమను ప్రదేశమును ననేక గజయూధములను ముట్టడించి వశపఱచుకొని సింధువంశపురాజగు ధారవర్షునిచే బరిపాలింపబడుచుండిన చక్రకోట్యమును ముట్టడించివశపఱచుకొనియెను.[12] ఈ దండయాత్ర యెందుకొఱకు సంభవించెనో దెలియరాదు. భారతకృతపతి యైనరాజరాజవిష్ణువర్ధనునిమరణానంతరము చోడదేశమును బాలించు చుండిన వీరరాజేంద్రునిసహాయముతో రాజరాజవిష్ణువర్ధనుని తమ్ముడగు విజయాదిత్యుడు రాజరాజవిష్ణువర్ధనుని(రాజరాజనరేంద్రుడు) కుమారు డగు రాజేంద్రచోడుని వెడలగొట్టి వేంగిరాజ్యమును దానేయాక్రమించుకొని పరిపాలింప నారంభించెను. వీని పరిపాలనకాలమున నాహమల్లని రెండవకుమారు డుగునీయాఱవవిక్రమాదిత్యుడును పశ్చిమచాళుక్య రాజు వేగిదేశముపై దండెత్తి వచ్చి కలవరపెట్టనారంభించెను. రాష్ట్రకూటులప్రభయడంగి పశ్చిమచాళుక్యరాజ్యము పునరుద్ధారణ కాబడినతరువాత నాహవమల్లుని రెండవకుమారు డగు నీయాఱవవిక్రమాదిత్యుడు నిర్వక్రపరాక్రముండై విజృంభించి దిగ్విజయములు సలుపుచున్న వాడగటంజేసి యెట్లయిన నాంధ్రదేశమును మ్రింగివేయవలెనని దండయాత్ర నెడలి వచ్చెను. ఈ యాఱవవిక్రమాదిత్యుడు బహుపరాక్రమువంతుడగుటచేత వీని నెదుర్కొనుపాటిరణశూరుడు దక్షిణహిందూస్థానమునందు గానరాకుండెను. చోడరాజగు వీరరాజేంద్రుడు వీని దోర్దర్పమునకు భయపడి విక్రమాదిత్యునికి దనకూతురనిచ్చి వివాహముజేసి వానితో మైత్రి నెఱపవలసినవాడయ్యెను. అట్టి ప్రబలశత్రవుదేశముపై దండెత్తివచ్చినపడుపౌరుషశాలియైన రణశూరడెట్లూరుకుండగలడు? విజయాదిత్యుడసమర్ధుడై యేమియు జేయజాలకుండుట జూచి రాజరాజనరేంద్రునితనయుండగు రాజేంద్ర చోడుడు ధైర్యసాహసములు ముప్పిరిగొన స్వసైన్యముతో శత్రువుని మార్కొని తిరిగి చూడకుండ దఱిమి గొట్టెను. అంతట నూరకొనక యావాడిమగం డాంధ్రదేశంబున దనయధికారమును స్థాపించి తనపినతండ్రి తనకు జేసిన యుపకారమును మన్నించి యా విజయాదిత్యునే వేగిరాజ్యమునకు రాజప్రతినిధిగ బునరభిషిక్తునిగావించి తనమాతామహునిదైన చోడరాజ్యమును బాలించుచుండిన వీరరాజేంద్రుడు మరణము నొందెను. రాజ్యాధిపత్యముకొఱకు దేశమున బెద్దకల్లోలము జనించెను. ఈ సమాచారమును దెలిసికొన్నవాడై వీరరాజేంద్రుని యల్లుడును కుంతలరాజు నగునాఱవవిక్రమాదిత్యుడు కాంచీపురముపై దాడివెడలి వచ్చి తన భార్యతోబుట్టువగు కేసరివర్మకు బట్టముగట్టి యొక మాసమువఱకచ్చట నుండి కలహములనడచి మరల రాష్ట్రమునకు బోయెను. అతడు మరలిపోయిన వెనుక శీఘ్రకాలములోనే రాజ్యమున మరల గల్లోలము ప్రారంభమయ్యెను. తనమాతామహుని రాజ్య మాక్రమించుకొనగోరి రాజరాజనరేంద్రుని తనయుండగు రాజేంద్రచోడుడు వీరరాజేంద్రతనయుండగు పరకేసరివర్మను జంపి రాజ్యామాక్రమించుకొని కులోత్తుంగ చోళదేవుడనుపేరుతో బట్టాభిషిక్తుడయ్యెను. ఇతడు క్రీస్తుశకము 1070 దవ సంవత్సరముమొదలుకొని 1118వఱకు గొంచముతక్కువగ నేబది సంవత్సరములు కళింగవేంగిచోడరాజ్యములను నిరాతంకముగా బరిపాలనము చేసెను. ఇతడు తనబావమరిదిని జంపి చోడరాజ్యమును వశపఱచుకొనుట జూచి సహింపజాలక కుంతలరాజగు విక్రమాదిత్యుడు దండెత్తివచ్చెను గాని మార్గమధ్యమున గులోత్తంగునిచే నెదుర్కొనబడి యుద్ధముజేసి యపజయములను గాంచి మరలపోయెను. బిల్హణకవివిరచితమై విక్రమాదిత్యుని కంకితము చేయబడిన విక్రమాంకడేవచరిత్రమునందును విక్రమాదిత్యునిశాసనములయందు కులోత్తుంగుడే యోడిపోయినట్లు చెప్పియున్నను కులోత్తుంగుని శాసనములు కులోత్తుంగునికే జయముగలిగినట్లుగ జాటుచున్నవి. కులోత్తుంగదేవుడే యోడుటసంభవించెనేని విక్రమాదిత్యుడు వేంగిచోడదేశములను మ్రింగివేసియుండును. అట్లుజరిగియుండక పోవుటయెవిక్రమాదిత్యునికి సంపూర్ణవిజయములు కలిగియుండలేదనుటకు నిదర్శనము గా నున్నది. కొన్ని యుద్ధములయందొకవేళ విక్రమాదిత్యునికి విజయములు గలిగియుండినను కడపటివిజయము మాత్రము కులోత్తుంగ దేవునిదేయని చెప్పదగినది కాని కేవలము విక్రమాంకదేవచరిత్రములోని వాక్యముల నే విశ్వసించి భాండార్కరుగారు తమదక్షిణాపథ ప్రాచీనచరిత్రమునందు జెప్పినట్లు విక్రమాదిత్యునిదికాదు. విక్రమాంకదేవచరిత్రము విక్రమాదిత్యునివిజయములను ప్రకటించుచుండగా గళింగట్టుపారణి యను ద్రవిడకావ్యము కులోత్తుంగుని విజయములను బ్రకటించుచున్నది.

కులోత్తుంగ దేవునివిజయములు.

ఇతడు రాజ్యాధిపత్యము వహించిన రెండవ సంవత్సరమున ననగా క్రీ.శ.1071-72వ సంవత్సరమున వ్రాయించిన శాసనములు పులియారునాడు (ఎళుమూరునాడు (ఎళంబూరు-Egmore)సాలయనూరునాడు మొదలగునవి స్వాధీనములో నున్నటుల జాటి చెప్పుచున్నవి. ఇయ్యవి యిప్పటి చెంగలుపట్టు, ఉత్తరార్కాడు మండలములోనివిగా నున్నవి. [13] ఇతడు కేరళపాండ్యకుంతలదేశములను జయించినట్టు వీరచోడుని చెల్లూరుశాసనముంబట్టి దెలియుచున్నది. [14] కళింగట్టుపారణి యనుద్రావిడకావ్యమునందు కుంతలము నేలుబిరుదరాజును (విక్రమాదిత్యుని) జయించినట్టుగూడ చెప్పబడినది. [15] వీని పదునొకండవ పరిపాలన సంవత్సరములోని యొక శాసనమీతడు విక్రమాదిత్యుని కోలారు మండలములోని నాంగిలినుండి మానలూరు మార్గముగా తుంగభద్రానది వఱకు దఱిమినట్లును, గంగమండలమును సింగాణమును ( మైసూరు దేశములోనివి) జయించినట్లునుజాటుచున్నది. తరువాత నొక శాసనము మూనలూరునకు బదులుగా ఆలట్టిని సింగాణమునకు బదులుగా కొంకణమును బేర్కొనుచున్నది. మఱియొకశాసనము విక్రమాదిత్యుడును వానిసోదరుడయిన జయసింహుడును కులో త్తుంగుని ప్రతాపముముంగట నిలువంజాలక పశ్చిమసముద్రమును శరణుచొచ్చిరని చెప్పబడినది. విక్రమాదిత్యజయసింహులతోడి పోరాటములో నవిలై యను ప్రదేశమున శూరులయిన దండనాయకులచే సంరక్షింపబడుచుండిన వేయియేనుగులను ముట్టడించి పట్టుకొనియెనని చాటిచెప్పుచున్నది. నవిలైయనునది మైసూరు రాజ్యములోనినవిలెనాడులోనిది. వీని పదునాలుగవ పరిపాలన సంవత్సరములోని యొకశాసనమీతడు పాండ్యులనైదుగురిని జయించుట మాత్రమేగాక మన్నారుజలసంధి, పొడియిల్ కొండ, కన్యాకుమారి, కొట్టారు మొదలగు ప్రదేశములను వశపఱచికొనియెనని చెప్పబడియెను. పాండ్యదేశమునకు హద్దులేర్పాటు గావించెను. పాండ్యదేశముతో గూడ కుడమలైనాడును (మలబారులోని పశ్చిమభాగము) గూడ జయించెను. ఇప్పటి నాయరులపూర్వికులయిన యాదేశములోని రణశూరులు తమస్వాతంత్ర్య సంరక్షణనం దందఱును బ్రాణములర్పించుకొని నాశముజెందిరి. చేరరాజుయొక్క నావికాసైన్యమును నోడలును రెండుమాఱులు నాశము గావించెను. [16] నయిరువది యాఱవ పరిపాలనసంవత్సరమునకు లోపలనే అనగా 1065-1069వ సంవత్సరమున గళింగమును జయించెను. [17] ఇదియె వివరముగా కళింగట్టుపారణి యనుగ్రంథమున వర్ణింపబడినది.

కులోత్తుంగ చోడదేవునిబిరుదునామములు.

ఈ రెండవ రాజేంద్ర చోడదేవునకు రాజకేసరివర్మ యను బిరుదు నామముగలదు. చెల్లూరు పిఠాపురము శాసనములో నీతనికి రాజనారాయణ బిరుదముండినటుల జెప్పబడియుండెను.[18] ఈ బిరుదు నామమునుబట్టియే గోదావరిమండలములోనిదగు భీమవరములోని యొకదేవాలయమునకు రాజనారాయణ దేవాలయమని పేరుగలిగినది.[19] కొన్ని నాణెములపైన చోళనారాయణనామము గన్పట్టుచుండుటచేత నయ్యవి వీనివేయని యూహింపబడుచున్నవి. కళింగట్టుపారణి యను కావ్యము వీనిని కులోత్తుంగ చోళుడనియు, కరికాళచోళుడనియు,బిరుదరాజభయంకరుడనియు, అభయుడనియు, జయధరుడనియు బేర్కొనుచున్నది. ఇతడు తుదకు చక్రవర్తి, త్రిభువనచక్రవర్తి యనుబిరుదునామములనుగూడ వహించెను.

కులోత్తుంగుని రాజధాని.

కులోత్తుంగుని రాజధాని గంగాపురి ఇయ్యది గంగకుండపురమనియు, గంగయికొండచోళపురమనియుగూడ పిలువంబడుచుండెను. ఈ పట్టణము మొదట కులోత్తుంగచోడదేవుని మాతామహుడగు రాజేంద్రచోడునిచే నిర్మింపబడినది. ఆ రాజేంద్రచోళునకు గంగయికొండ చోళుడుని నామాంతరము గలదు. ఈపట్టణమునకు దరువాత రెండవముఖ్యపట్టణము కాంచీపురముగ నుండెను.

కులోత్తుంగునిరాణులు.

ఇతడు రాజేంద్రదేవుని కూతురగు మధురాంతకదేవిని వివాహమాడియామెయందు రాజరాజచోడగంగును, రాజరాజముమ్మిడిచోడుని, వీరచోడుని, విక్రమచోడుని, మఱిముగ్గురిని మొత్తమున నేడుగురు పుత్రులను రాజసుందరియను కూతురిని గాంచెను. మఱియును దీనచింతామణి ఎళిశైవల్లభి, త్యాగవళ్లియను మఱిముగ్గురు రాణులుగలరు. దీనచింతామణి చనిపోయినతరువాత నామెస్థానమును త్యాగవల్లి వహించెనట! ఈ త్యాగవల్లి రాజుతో సమానమైనయధికారమును నెఱపుచుండెనని కళింగట్టుపారణియను కావ్యమునందు జెప్పబడియుండెను. కులోత్తుంగదేవుని కూతురగురాజసుందరి కళింగరాజయిన రాజరాజుకిచ్చి వివాహము చేయబడియెను.

కళింగదండయాత్ర.

విశాఖపట్టణము లేక కులోత్తుంగచోడపట్టణము.

కులోత్తుంగుడు కళింగదేశముపై రెండుమాఱులు దండువెడలియుండెను. మొదటియాత్ర తనరాజ్యకాలములో నిరువదియాఱవసంవత్సరమనగా 1095-96వ సంవత్సరమునకు బూర్వమె జరిగియుండును. రెండవది తనపరిపాలనావసానదశయందు జరిగియుండును. అదియె కళింగట్టుపారణి యనుకావ్యమునందు వర్ణింపబడినది. మొదటి దండయాత్ర దక్షిణకళింగముపై మాత్రమె నెఱపబడినది. ఉత్తరకళింగమును బాలించుచుండిన అనంతవర్మ చోడగంగు ఈదండయాత్రయందంతగా దానుసంబంధము కలిగించుకొనియుండలేదుగాని రెండవదండయాత్రయందు కులోత్తుంగదేవునికి తోడ్పడియెను. ఈ యనంతవర్మ చోడగంగకులోత్తుంగచోడుని కూతురగు రాజసుందరికి కళింగరాజగురాజరాజువలన జనించినవాడుగావున గులోత్తుంగునకు దౌహిత్రుడు. అనంతవర్మ చోడగంగునకు లోబడియుండిన యేడుగురు కాళింగులు తిరుగబడినందున వారలను వశపఱచుకొనుటకై కులోత్తుంగుడు దండెత్తివచ్చెను. క్రీ.శ. 1078వ సంవత్సరములో కళింగసింహాసనమెక్కిన అనంతవర్మ దేవుని శాసనమొకటి విశాఖపట్టణమునగలదు ఆ శాసనములో విశాఖపట్టణమునకు కులోత్తుంగుచోడదేవుని పేరేయీపట్టణమునకు బెట్టబడినదని నిశ్చయముగా జెప్పవచ్చును. ఈ మొదటిదండయాత్రలో నితడు సింహాచలపర్యంతమును బోయినట్లుగానంబడుచున్నది. సింహాచలములో నీతనిపేరిటి శాసనమొకటి యిప్పటికిని నిలిచియున్నది. ఒకవేళ నీ దండయాత్రయుగూడతనమనుమడయిన అనంతవర్మ దేవునిపక్షముననే జరిపియుండవచ్చును. విశాఖపట్టణములోని శాసనము ద్రావిడభాషలోనికి భాషాంతరీకరింపబడినది.(No 90 of 1909) ఈ శాసనములో దానప్రతిగ్రహీత మాలమండలము ('Malabar) లోని యొక వర్తకుడు. తనయనుచరులయిన దక్షిణదేశీయులను గొందఱినితనమనుమనిదైన దక్షిణకళింగములో నిలుపుటయె యీప్రథమకళింగదండయాత్రయొక్క ముఖ్యోద్దేశమని మన మూహింపవచ్చును. ఇట్లు కొందఱు దక్షిణ దేశీయులు వచ్చి యిచ్చటస్థిరవాసము లేర్పఱచుకొనుట కళింగగంగవంశజుడగు మొదటి నరసింహుని కాలమువఱకు జరుగుచుండెనని వీరనరసింహదేవుని పదునేనవసంవత్సర మనగా శాలివాహనశకము 1072వ సంవత్సరములో విశాఖపట్టణమున లిఖింపబడిన మఱియొక శాసనముంబట్టి దెలియుచున్నది. సాండలాయనికొల్లముగ్రామవాసియొకడు విశాఖపట్టణములోని కరుమాణిక్యాళ్వారుదేవాలయమునకు దానముచేసినట్టు చెప్పబడియున్నది. ఈ పాండలాయనికొల్ల మనుగ్రామము క్వీలాండికి నుత్తరమున నున్నది.[20]

వేగి దేశపాలకులు.

కులోత్తుంగ చోడదేవుని కాలమున వేగిదేశమునకు రాజప్రతినిధిగ నియమింపబడినవాడు రాజరాజనరేంద్రునిసోదరుడును కులోత్తుంగ చేడదేవునితండ్రియు నగు విజయాదిత్యుడు మొదటివాడని చెప్పియుంటిమి. ఈవిజయాదిత్యుడు 1077వ సంవత్సరమువఱకును వేగి దేశమును బాలించి మృతినొందగా గులోత్తుంగ దేవుడు తన రెండవకుమారుడయిన రాజరాజును రాజప్రతినిధిగా నియమించెను. ఇతడీపదవిని వహించినతరువాత వీనికి సుఖమును సురక్షణమును లేకపోయెను. వీనికి గురుపాద సేవవలన గలిగెడి యానందమునంటి యానంద మీరాజ్యపాలనాధికార మీయనందున రోసి వేగుదేశము నొక్క సంవత్సరము మాత్రము పరిపాలించి తనతల్లిదండ్రులకడకు వెడలిపోయెను.[21] తరువాత 1078 దవ సంవత్సరమున వానితమ్ముడయిన వీరచోడుడు రాజప్రతినిధిగ నియమింపబడయెను. ఇతడు బాహుబలము గలిగిన మహారణశూరుడు. ఇతడు 1084వఱకును వేగిదేశమును బాలించినతరువాత రాజధానికి రప్పించుకొనబడి కులోత్తుంగజ్యేష్ఠపుత్రుడగు రాజరాజచోడగంగు రాజప్రతినిధిగ నియమింపబడియెను గాని 1088-89దవ సంవత్సరమున చోడగంగునకు బదులుగా మరల వీరచోడుడే రాజప్రతినిధిగనియమింపబడియెను. ఇతడు 1092-93 వ సంవత్సరము వఱకు బరిపాలించినతరువాత వీని స్థానము నకు వీరచోడునితమ్మడగు విక్రమచోడుడు నియమింపబడియెను. ఇతడు 1117వఱకును వేంగిదేశమును బాలించెను. తరువాత గొంతకాలము వెలనాటి చోడులు రాజప్రతినిధులుగ వేగిదేశమును బరిపాలించిరి.

వీరచోడుడు.

కులోత్తుంగుని మూడవకుమారు డయినవీరచోడుడు విష్ణువర్ధనుడను నామముతో వేంగిదేశమును 1087 మొదలుకొని 1084వఱకును 1088-89మొదలుకని 1092-93వఱకును బరిపాలనము జేసినటుల టేకి , పిఠాపురము శాసనములబట్టి నిర్ణయింపవచ్చును. ఇతడు వేగిదేశమునకు రాజప్రతినిధిగ నున్న కాలమున వెలనాటి ప్రభువయిన మొదటి చోడగొంకరాజుయొక్క సోదరపుత్రుడయిన రెండవ విదురుడు మంత్రిగనుండెను. ఈ విదురరాజు తనయాజ్ఞ ప్రకారము పాండ్యరాజు నొకని జయించుటచేత మెచ్చుకొని తనరాజ్యములోని యర్థభాగమగు సింధుయుగ మంతరదేశమును (కృష్ణాగోదావరుల మధ్యదేశమును) వీరచోడుడు బహమానముగ నొసంగెనట. వీరచోడుని శాసనములనేకములు గలవు.

మేడమార్యుడు.

ఈ మేడమార్యుడమబ్రాహ్మణోత్తముడు వీరచోడునియొక్క ముఖ్యసేనాధిపతిగనుండెను. ఇతడు ముద్గలగోత్రజాతుడయిన పోతనార్యనికి కన్నమాంబయందుజనించిన పుత్రరత్నము, పోతనార్యునియందుగల గుణాధిక్యతచేత రాజరాజువానిని బ్రాహ్మమహారాజని పిలుచుచుండెనట. అందుచేత జనులు వానిని రాజరాజబ్రహ్మమహారాజను బిరుదునామముతో సమ్మానించుచుండిరట. మేడమార్యుడు తనయొక్క సుగుణములచేతను బుద్ధివిశేషముచేతను రాజానుగ్రహము బడసి మహోన్నత పదవికి వచ్చెను. ఇతడు వేదవేదాంగవేదియగుటయే గాక ధనుర్వేదపారంగతుడు, భుజబల పరాక్రమసంపన్నుడు. రాజనీతివేత్తయు నగుటచేత వీరచోడుడు వీనికి సేనాధిపత్యము నొసంగెను. ఇతడనేక యుద్ధములయందు వీరచోడునకు జయమును సమకూర్చెను. వీరిరువురనడుమ బ్రేమ మగ్గలముగ నుండెను. ఈ మేడమార్యుడు వైష్ణవభక్తాగ్రేసరుడయినట్టు గన్పట్టుచున్నాడు. ఇతడు మిక్కిలి గుణవంతుడగుటచేత గుణరత్నభూషణుడనెడు బిరుదునామమును బొందెను. ఇతడు పెద్దలను బొడగన్న భృత్యునికైనడి వినయము జూపునట, బాంధవులయెడగౌరవముసూపునట బీదలయినసజ్జనులకు దానధర్మములు చేయుచుండునట, మఱియు నితడు పిఠాపురము దాక్షారామములయందు రెండు సత్రములు నిర్మించి బ్రాహ్మణులకు నిరతాన్నప్రదానము సలుపుచుండెను. ఇతడు చెల్లూరు గ్రామములో నొక విష్ణవాలయమును నిర్మించి యొకకోనేరును ద్రవ్వించెను. ఆ విష్ణ్వాలయమునకే వీరచోడ విష్ణువర్ధన మహారాజు కాలేరగ్రహారమును దానము చేసి యుండెను. ఇటీవల మహారాష్ట్రరాజులకడ పీష్వాలుగ నుండిన మహారాష్ట్ర బ్రాహ్మణులవలెనే యాంధ్ర బ్రాహ్మణులుగూడ చాళుక్య రాజులకడ బురోహితులుగను మంత్రులుగను ఆస్థానకవులుగను, మాత్రమేగాక ఖడ్గమునుజేతబట్టి శౌర్యప్రతాపములు చూపి యుద్ధముసేయునట్టి రణకౌశము లయినసేనాధిపతులుగ గూడ నుండెరి. ఈ మేడమార్యుడు కాకతీయాంధ్ర ప్రభువయిన మొదటిప్రతాపరుద్రునితో యుద్ధముజేసి యోడిపోయినట్టుగన్పట్టుచున్నది.

రాజరాజచోడగంగు.

(క్రీ.శ.1084 మొదలుకొని 1088-89వఱకు)

ఇతడు కులోత్తుంగ చోడదేవునకు మధురాంతకదేవియందు జనించిన జ్యైష్ఠకుమారుడు. గోదావరిమండలములో రామచంద్రాపురము తాలూకాలోని టేకి గ్రామమునందు రాజరాజచోడగంగునిశాసనము బయలుపడకపూర్వము చరిత్రకారులెల్లరును రాజరాజచోడగంగుని మూడవతమ్ముడయిన విక్రమచోడుడే కులోత్తుంగ చోడదేవుని జ్యైష్ఠకుమారుడని వ్రాసియుండిరి. టేకిశాసనము చోడగంగు జ్యైష్ఠకుమారుడని దెలిసి చరిత్రకారుల బూర్వపు వ్రాతలనన్నిటిని తాఱుమాఱు చేసినది. ఇతడు శాలివాహనశకము 1006ల సంవత్సరము జ్యైష్ఠశుద్ధపూర్ణిమాగురువానరమునా డనగా క్రీస్తుశకము 1084 దవ సంవత్సరము మే నెల 22వతేదీన గాబోలు వేంగిసింహాసన మధిష్ఠించెనని చెప్పబడియెను. చెల్లూరు పిఠాపురము శాసనములు వీరచోడుని కిరువురన్నలుండిరని చెప్పియుండుటచేత నాయిరువురు చోడగంగు, ముమ్మడిచోడుడని యిప్పడు స్పష్టమైనది గనుక విక్రమచోడుడు వీరచోడునితమ్ముడని సిద్ధాంతము చేయవచ్చును. చెల్లూరు పిఠాపురము శాసనములలో జివరనీయబడిన తెదులు అనగా రాజ్యకాలముయొక్క 21, 23 వ సంవత్సరములని చెప్పినవి వీరచోడుని పరిపాలనమున కన్వయింపవలసినవిగావు. అదేరీతిగ టేకిశాసనము తుదను నీయబడిన చోడగంగుయొక్క రాజ్యకాలమునలోని పదునేడవ సంవత్సరము 1084-1617-1100-01వ సంవత్సరముతో సరియగుచున్నది గనుకను, వీరచోడుని చెల్లూరు శాసనము తుదనుగల తేదులు 1088+1021=1098-99 దవ సంవత్సరముతో సరియగుచున్నవి గనుకను వీరచోడుని శాసనములు రాజరాజచోడగంగు రాజప్రతినిధిగనుండు కాలమున వీరచోడునిచేలిఖింపబడినవి గానె నిశ్చయింపవలసియున్నది. వీరచోడుడు రాజప్రతినిధిగ నున్నకాలమున దండ్రిచే రప్పించికొనబడి యైదవయేట మరలబంపబడియెనని పిఠాపురము శాసనము చాటుచున్నది. ఆ నడుమకాలముననే చోడగంగు రాజప్రతినిధిగనుండి వేగిదేశమును బరిపాలించెను. చెల్లూరు శాసనమునందు చోడగంగు పాలకత్వమును విస్మరించుటయు, పిఠాపురము శాసనమున చోడగంగు పేరెత్తక పాలకత్వమునుదాహరించుటయు బరిశీలించిన పక్షమున చోడగంగు పాలనము తండ్రికి దృప్తిగలిగింపజాలక పోయననియు, చోడగంగునకును వీరచోడునకు పొందికలేదనియు, పొడకట్టకమానదు. వీనికి సర్వలోకాశ్రయుడనియు, విష్ణువర్ధనుడనియు బిరుదనామములు గలవు. ఇతడు వీరచోడునివలెనే జననాధనగరిని రాజధానిగ జేసికొని యందే నివసించియుండెనని శాసనములు చాటుచున్నవి, ఈజననాథనగరము రాజమహేంద్రవరము యొక్క మాఱుపేరని కొందఱు తలంచుచున్నారు. రాబర్టు స్యూయలుగారు కాకినాడకు జేరియుండినజగన్నాథపురమనియూహించుచున్నారు గాని రాజమహేంద్రనగరమని చెప్పుటయె సముచితముగానుండును. రాజరాజ చోడగంగదేవుని టేకిశాసన మితరశాసనములవలె భూదానమును గూర్చినది కాదు. ఈ శాసనమునందలి యాజ్ఞమన్నేఱునకును మహేంద్రగిరికిని నడుమనుండు యావద్దేశమునకు వర్తించునదిగానున్నది. మహేంద్రగిరి గంజాము మండలములో నుత్తరభాగముననున్నది. మన్నేఱు నెల్లూరుమండలములోనికందుకూరు తాలూకాలో సింగరాయకొండ సమీపమున బ్రవహింపుచున్నది. ఈ హద్దులమధ్యనుండు దేశము యాకాలమున వేంగిరాజ్యముగ నుండెను. ఆంధ్రదేశమంతయు నింజమిడి (?) /యుండలేదు. ఈ టేకిశాసనము తైలికులనియెడి తెలికతెగ వారికి సంఘమునందు గౌరవనీయులయిన హక్కుల నొసంగునదిగా నున్నది.

తెలిక తెగవారు.

ఈ తెలికకుటుంబమువారు సహస్రశాఖాన్యయగోత్రులుగా విభాగింపబడియుండిరటగాని పది తెగలవారు మాత్రమే పేర్కొనబడియుండిరి. ఈ పది తెగలవారును తరతరములుగా చాళుక్యరాజకుటుంబమునకు సేవకులుగనుడి యీదేశమునకు వచ్చి విజయవాటిక (బెజవాడ) యందు స్థిరనివాసము లేర్పఱచుకొన్నట్టు వీరలు విశ్వసించుచున్నారు. గుంటూరు మండలములోని బాపట్ల గ్రామములోనున్న భావనారాయణస్వామి దేవాలయములోని రెండు శాసనములందీతెగవారిదానములనుగూర్చి ప్రశంసింపబడియుండెను. ముసునూళ్లగోత్రజాతుడొకడును మంజమూళ్లగోత్రజాతుడొకడును గలిసి శాలివాహనశకము 1076 అనగా క్రీస్తుశకము 1054 వ సంవత్సరమున దానశాసనములు వ్రాయించి యుండిరి. ఈ వెలందమూళ్ల తెగవారును టేకిశాసనము నందు నుదాహరింపబడిన వెలమసూళ్ల తెగవారు నొక్కరేయని తోచుచున్నది. అందొకశాసనమునందు. "స్వస్థియమనియమధర్మపరాయణ బ్రహ్మసంభవమను వంశాది సకలశాస్త్రవిశారదులం గణకపురాయ అయోధ్యాపురగజపురాధానాయకులం సత్యశౌవాభిమానులు గురదేవపదారాధిరులు పాలస్తభాగవకీస్థాన ప్రతిష్ఠితులు సహస్రశాఖాన్వయగోత్రులయిన శ్రీమధ్భజవాళశాసనులయిన తెవికి వేవురాయుండు వెలందనూళ్ల గోత్రుడు ఐనసూరిపట్టి" అని వ్రాయబడియుండుట చేత నీతెలికతెగవారు అయోధ్యను బెజవాడనుగూడ పాలించినవారమని చెప్పుకొనుచున్నట్లు గాన్పించుచున్నది. ఇటులె టేకిశాసనముగూడ సూచించుచున్నది.[22]


"వెలమనూళ్లు, పత్తిపాలు, నరియూళ్లు, కుముదాళ్లు, మఱ్ఱూళ్లు, పావండ్లు, శ్రావకులు, ఉండ్రూళ్లు, అనుమగొండలు, అడ్డమాళ్లు," అను తెలికతెగవారిలోని దశవిధశాఖలును టేకిశాసనమున బేర్కొనబడినవి. ఈ తెగవారికింగల రాజభక్తిని మెచ్చుకొని రాజరాజచోడగంగు తెలికతెగవారిలోని వివాహదంపతులు గుఱ్ఱమముపైనెక్కి యూరేగవచ్చుననియు, వివాహమహోత్సవానంతరము వివాహదంపతులు రాజునుదర్శించి విలువగలిగిన నూతనవస్త్రముల రెంటిని దెచ్చి రాజుపాదములకడ గానుకగాబెట్టి సాష్టాంగదండ ప్రణామం బాచరింపవలెననియు, అప్పుడానూతనదంపతులకు తాంబూల మీయబడుననియు గౌరవీనీయమైన క్రొత్తహక్కును గలుగజేసినట్లుగ టేకిశాసనము చాటుచున్నది. ఈ శాసనమును విద్యాభట్టు విరచించెను. ఆ కాలమునందలి చాళుక్యచోడులశాసనముల బెక్కింటిని విద్యాభట్టు వ్రాసియుండెను. ఇతడు నన్నయభట్టు కుటుంబములోని వాడయియుండునని యూహపొడము చున్నదిగాని ప్రబలప్రమాణములేనిదే విశ్వసింపరాదు. ఈ శాసనమును బట్టి తెలికతెగవారిలోనంతకు బూర్వమిట్టి హక్కువారికిలేదని స్పష్టముగా జెప్పవచ్చును. చోడగంగు 1089దవ సంవత్సరమున రాజప్రతినిధి పదవినుండి తొలగింపబడిన తండ్రిచే స్వస్థానమునకు బిలుపించుకొనబడియెను. వీనిసోదరుడయిన వీరచోడుడే మరల రాజప్రతినిధిగా బంపబడియెను. వీరచోడుడు 1093 వసంవత్సరమవఱకు బరిపాలనము చేసినతరువాత నీస్థానమునకు వీనితమ్ముడయిన విక్రమచోడుడు నియమింపబడియెను.

విక్రమచోడుడు.

కులోత్తుంగ చోడదేవుని నాలుగవ కుమారుడయిన యీ విక్రమచోడు[23] డు 1118 వ సంవత్సరము వఱకు వేంగిదేశమునకు రాజప్రతినిధిగనుండి తరువాత తండ్రిమరణానంతరము చోడరాజ్యమునకు బట్టాభిషిక్తుడయి 1135వఱకును రాజ్యపరిపాలనము చేసినట్లు గన్పట్టుచున్నది. మల్లపదేవుని పిఠాపురము శాసనము విక్రమచోడునకు త్యాగసముద్రుడన్న బిరుదునామము గలదనియు విక్రమచోడుడు చోడదేశమును బరిపాలించుటకై వేగిదేశమును విడిచిపోయిన తరువాత వేగిదేశము కొంతకాలము పాలకుడలేకయె యుండెననియు దెలియజేసి యుండుటచేతను, విక్కిరావ్ చోలన్ ఉలయను ద్రావిడకావ్యము యొక్క కథానాయకునకు త్యాగసముద్రుడన్న బిరుదనామము గన్పట్టుచుండుటచేతను అతడునితడు నొక్కడేయని చెప్పవచ్చును. విక్రమచోడుని ద్రావిడశాసనములు విక్రమచోడుడు కొంతకాలము వేగిదేశములోనుండి చోడదేశమును బాలించుటకు వేగిదేశమును విడిచివచ్చెనని దెలుపుచున్నవి. చెల్లూరు పిఠాపురము తామ్రశాసనముల రెండింటియందును మధురాంతకదేవినామము పేర్కొనబడియుండినను విక్రమచోడుని నామము పేర్కొనబడియుండకపోవుటచేత నతడు మధురాంతగదేవియొక్క తనయుడగునోకాదోయని సందియము దోచుచున్నది. అయినను మధురాంతకదేవికి నేడుగురు పుత్రులుగలరని చెప్పబడియుండుటచేత విక్రమచోడుడుగూడ ఆమెపుత్రుడనియె నిర్ధారణము సేయవచ్చును.

ఆఱవశాసనములను బట్టి డాక్టర్ కీల్ హారన్ గారు చేసిన పరిగణన ప్రకారము క్రీస్తుశకము 1058దవ సంవత్సరము జూను 29వ తేదికి గొంచెమీవలనో కొంచెమావలనో విక్రమచోడుడు చోళరాజ్యమునకు బట్టాభిషిక్తుడయ్యెనని చెప్పవచ్చును. అఱవశాసనములనుబట్టి విక్రమచోడుని కాలమును మూడు యుగములుగా విభాగింపవచ్చును. అఱవశాసనములలో నితడు కళింగదేశముపై దండెత్తిపోయెనని చెప్పబడినది మొదటియుగముగా నుండెను. ఇది వేంగిదేశములో నుండుటకు బూర్వమె జరిగియున్నది గావున నితడు కులోత్తుంగచోడదేవుని కళింగదండయాత్రలో గూడ నుండియుండెనని చెప్పవచ్చును. ఆసమయమునందితడు సారసిపురాధ్యక్షుడయిన (Elllore)తెలుంగుభీ మని జయించెను. రెండవకులోత్తుంగచోడదేవునికి సంబంధించిన కులోత్తుంగ చోలన్ఉలయను కావ్యమునందు విక్రమచోడుడు కళింగట్టు పారణయను కావ్యమును గ్రంథకర్తనుండి యంకితముగాంచినట్టు చెప్పబడియుండెను. విక్రమచోడుని కాలములో రెండవయుగము శాసనములలో జెప్పబడిన ప్రకారము కొంతకాలము వేంగిదేశములోనుండి యుత్తరదేశమును జయించుటగానున్నది. పల్లవదేవుని పిఠాపురము శాసనము చోడదేశమును బాలించుటకై వెళ్లుటకు బూర్వము విక్రమచోడుడు వేంగిదేశమును బాలించుచుండెనని చెప్పుచున్నది కాబట్టి వీరచోడునికి బిమ్మట రాజప్రతినిధిగానుండి యితడు 1118వ సంవత్సరమున బిలువంబడు నంతవఱకు వేగిదేశమును బరిపాలించుచుండెననియె నిర్ధారణము సేయవచ్చును. ఇతడు చోడదేశమునకు బోయినతరువాత వేగిదేశమున రాజులేడని మల్లపదేవుని పిఠాపురము శాసనము చెప్పియుండుటవలన నాకాలమున దేశమునకేవియో కష్టములు సంప్రాప్తములయ్యెనని భావింపవలసి యున్నది. పృథ్వీశ్వరుని పిఠాపురము శాసనములో కులోత్తుంగ చోడదేవుడు పదునాఱువేల గ్రామములు గలిగిన వేంగిరాజ్యమును తనకుదత్తపుత్త్రుడయిన వెలనాటి చోడునకు దానము చేసెనని చెప్పబడియున్నది. ఈవెలనాటి చోళుని యొక్క దాక్షారామమములోని యొకశాసనములో నతడు క్రీస్తుశకము 1120-21వసంవత్సరమున బశ్చిమచాళుక్యరాజగు నాఱవవిక్రమాదిత్యునకు లోబడిన యొక సామంతుడుగ నున్నట్టు చెప్పబడియుండెను. కాబట్టి పై శాసనములలోని వాక్యములను మనమిట్లు సమన్వయము చేసికొనవచ్చును. విక్రమచోడుడు వేంగిదేశమునువిడిచి దక్షిణమునకు వెళ్లినతరువాత కులోత్తుంగ చోడదేవుడు తనపుత్త్రులతో సమానముగా జూచుకొనుచుండిన వెలనాటి చోడునకు వేంగిరాజ్యాధిపత్యము నొసంగెననియు, విక్రమచోడుడు దేశమును విడిచిపోవుటయు, బిమ్మట కులోత్తుంగ చోడదేవుడు మరణము జెందుటయు జూచి యదియ మంచిసమయముగానూహించి పశ్చిమచాళుక్యుడగు విక్రమాదిత్యుడు దండెత్తివచ్చి వేగిదేశమునుజయించి రాజప్రతినిధిగ వెలనాటిచోడునే నియమించపోయెనని యూహింపవచ్చును. ఈయాఱవవిక్రమాదిత్యుని శాసనము లు 1121-22 మొదలుకొని 13-24వఱకును దాక్షారామమునందుగాన్పించుచుండుటచేత నంతపర్యంతము నాతని వంశమునందే వేంగిదేశముండినదని భావింపవలయును. అయినను విక్రమచోడుని చేబ్రోలుశాసనము 1127వసంవత్సరమునాటిదిగను, నిడుబ్రోలు శాసనము 1135వసంవత్సరమునాటిదిగనుండుటచేత విక్రమచోడుడు 1125దవ సంవత్సరముననే విక్రమాదిత్యుని వేగిదేశమునుండి సాగనంపెనని మనము నిశ్చయింపకతప్పదు. విక్రమచోడుడు వృద్ధుడయిన తనతండ్రి కులోత్తుంగ చోడదేవుడు మృతినొందుట కొకసంవత్సరమునకు బూర్వమె అనగా 1118దవ సంవత్సరములో బట్టాభిషిక్తుడైనట్లు గానంబడుచున్నది. కులోత్తుంగుడు కొంచెమించుమించుగ నేబది సంవత్సరములు రాజ్యభారమును వహించి పరిపాలనము చేసియుండెను. విక్రమచోడుడు 1118 మొదలుకొని 1143వఱకు బరిపాలించెను. వీనికాలమున వేగిదేశము వెలనాటి చోడులవలన బరిపాలింపబడుచుండెను.

రెండవకులోత్తుంగ చోడదేవుడు.

ఈ రెండవకులోత్తుంగుడు విక్రమచోడునికొడుకు; విక్రమచోడునకు బిమ్మటరాజ్యమునకు వచ్చి1157వఱకును బరిపాలనము చేసెను. వీనికొడుకు రాజేంద్రచోడుడు పండ్రెండవశతాబ్దము వఱకును వీనికొడుకు రాజరాజచోడుడు లేక మూడవకులోత్తుంగ చోడదేవుడు 1232వఱకును చోడరాజ్యమును పరిపాలించిరిగాని వేంగిదేశము రెండవకులోత్తుంగ చోడదేవునికాలములోనె యన్యులవశమైపోయెను. ఈ రెండవకులోత్తుంగ చోడదేవుని యధికారముక్రింద వెలనాటిచోడులు కొంతకాలమును మఱికొంతకాలము వేఱొకశాఖవారయిన చాళుక్యులును, అటుపిమ్మట కాకతీయులును వేగిదేశమునకు బ్రభువులైరి. అంధ్ర చాళుక్యవంశవృక్షము.

  • 1 కుబ్జవిష్ణువర్ధనుడు
    • 2 జయసింహుడు(633-663)
    • 3 ఇంద్రభట్టారకుడు (663)
      • 4 ‌విష్ణువర్ధనుడు(663-672)
      • 5 మంగియువరాజు (672-696)
        • 6 జయసింహుడు(696-709)
          • 7 కొక్కిలి
            • మంగియువరాజు
        • 8 విష్ణువర్ధనుడు (709-746)
          • 9 విజయాదిత్యుడు(746-764.)
            • 10 విష్ణువర్ధనుడు (764-799)
              • 11విజయాదిత్యుడు (799-843)
                • 12కలివిష్ణువర్ధనుడు (843-844)
                  • 13 గణకవిజయాదిత్యుడు (844-848)
                  • విక్రమాదిత్యుడు
                    • 13చాళుక్యభీముడు
                  • యుద్ధమల్లుడు
                    • 18 తాళరాజు(925)
                      • 21యుద్ధమల్లుడు (927-934)
              • నృపరుద్రుడు
                    • 15 విజయాదిత్యుడు(918)
                    • 19విక్రమాదిత్యుడు తాళరాజు(925-926)
                      • 16 అమ్మరాజవిష్ణువర్ధనుడు (918-925)
                        • 17బేటవిజయాదిత్యుడు(925)
                          • సత్యాశ్రయుడు
                            • విజయాదిత్యుడు
                              • విష్ణువర్ధనుడు
                                • మల్లప్పదేవుడు
                                  • విజయాదిత్యుడు
                                    • మల్లవిష్ణువర్ధనుడు(1202)
                          • 20 భీముడు (926-927)
                      • చాళుక్యభీముడు
                        • 24 దానార్ణవుడు (970-973)
                          • 25 శక్తివర్మ (799(?)-1011)
                          • 26 విమలాదిత్యుడు(1011-1022)
                            • 27 రాజరాజు(1022-1063)
                            • 28 కులోత్తుంగచోడదేవుడు (1063-1118)
                              • రాజరాజచోడగంగు
                              • రాజరాజు
                              • వీరచోడుడు
                              • 29 విక్రమచోడుడు (1118-1143)
                                • 30 కులోత్తుంగ చోడదేవుడు (1158)
                            • విజయాదిత్యుడు
                        • 23అమ్మరాజ విజయాదిత్యుడు (945-970)
భాషలను దెలుపు పటము. (4 వ పేజి చూడుడు)
  1. Ep.lnd, Vol. VI,pp.347-367.
  2. No- 372 of1905;
  3. No 396 and 397 of 1896
  4. South Ind. Ins. VoL III, p. 126
  5. No215 of 1894.
  6. కారించేడు గ్రామము గుంటూరు మండలమున బాపట్లకు బడమట9 మైళ్లదూరమున నున్నది.
  7. శ్లో. తస్మాచ్చాశుక్యచూడామణి రధవిమలాదిత్య దేవాన్మహీశా
    చ్చోడక్ష్మాపాలలక్ష్యా ఇవరచితతపోః కూండవాయాశ్చ దేవ్యా
    జాతశ్రీరాజరాజోరజనికరకుల శ్రీమ దంబోధిరాజో
    రాజద్రాజన్యసేవ్యా మభృతిభుజబలాద్రాజ్యలక్ష్మీంపృథివ్యామ్

    అని రాజరాజనరేంద్రునికోరుమల్లిశాసనమునంగూడ స్పష్టముగా జెప్పబడినది.

  8. Ind. Ant. Vol XIV. p. 55-, Ep Ind Vol IV pp 300-309.

    "వసంతితిలక. యోరక్షీతుం వసుమతీమ్ శకవత్సరేషు
    వేదాంబురాశినిధి వర్తిషుసింహగేర్కే

    కృష్ణద్వితీయదివసోత్తర భాద్రికాయాం

    వారేగురోర్వణిజలగ్ననరేభిషిక్తః "

  9.  " శ్లో. తత్తనయోనయశాలీ జయలక్ష్మీధామ రాజరాజనరేంద్ర
    చత్వారింశతి (మ) బ్దానేకంచ పునర్మహీమపాలయదఖిలామ్"

    " తదనుజో విమలాదిత్యస్తప్త, తత్సుత్రో రాజరాజదేవ ఏకచత్వారింశత్. తత్పుత్ర శ్రీకులోత్తుంగ చేడదేవ ఏకోనపంచాశత్.... రాజ్యం ప్రశానతి"

  10. Ep.Ind Vol. IV, pp. 300-309, No. 43.
  11. lnd. Aut. Vol XIX,p.129; ఈ కోరుమల్లి కోదావరిమండలములో రామచంద్రాపురముతాలూకాలో నున్నది.
  12. Ep- Ind. Vol IX, p. 178;No.538, Public,28thJuly 1909 para 66.చక్రకోట్యము (చక్రకోట) బస్తరురాజ్యములోనిది.
  13. Ind.Ins. Vol III, part II,Ins. Nos 64.to 66.
  14. Ind.Ant. Vol I,No. 39, Verse 10 f
  15. Canto IV, Verse 6 and Canto X,verse 25
  16. Ind. Ant. Vol XXII, p. 142
  17. Ep.,Ind. Vol V, Appendix, p. 5l, No. 358, add, p. 52,No. 363.
  18. Ep Ind Vol I , No. 39, Verse 12, and Ep. Ind.Vol V. No. 10 Verse11
  19. Ep. Ind. Vol IV. p. 230
  20. Malabar Gazetteer p. 36
  21. Sou. lnd. Ins., i 60.
  22. Nos. 189, 192 of 1897, see Report
  23. Ep. Ind, Vol VI, p. 334