Jump to content

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదునైదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునైదవ ప్రకరణము.

వెలనాటిచోడులు.

వెలనాడనునది గుంటూరు మండలములోని చందవోలు ప్రాంతదేశమునకు మొదట వర్తించుచు దరువాత విస్తరించినది. వెలనాడు మండలమునకు చందవోలు రాజధానిగనుండెను. ఇయ్యది రేపల్లె తాలూకాలోనున్నది. [1] కాకతీయగణపతి దేవునియొక్క గణపేశ్వరము శాసనములో వెలనాడు రెండుమాఱు లుదహరింపబడినది. అమ్మరాజ విజయాదిత్యుని యెలవఱ్ఱు శాసనములో ఎలపఱ్ఱు వెలనాడు విషయములోనిదని చెప్పబడినది. [2] ఈ యెలవఱ్ఱు రేపల్లె తాలూకాలో చందవోలున కుత్తరమున నున్నది. దాక్షారామములోని యొక శాసనములో కులోత్తుంగ మనుమ గొంకరాజు(మూడవగొంకరాజు) వెలనాడులోని సనదవ్రోలు పట్టణమున నివసించుచున్నట్టు చెప్పబడినది.[3] కాబట్టి యిప్పటి చందవోలె పూర్వము సనదవ్రోలని పిలువబడియుండెను. బ్రాహ్మణులలో వెలినాడు వారను నొక తెగ బ్రాహ్మణులు కలరు. వెలినాడనునది వెలనాడెగాని యన్యముగాదు. వెలనాడులో నివసించు బ్రాహ్మణు లన్యవిషయములకు బోయినప్పుడు వెలనాడు లేక వెలినాడు బ్రాహ్మణులని పిలువంబడుచుండిరి. తరువాత నీ వెలనాటి వారు బ్రాహ్మణులలో నొక శాఖావారుగా నేర్పడిరి. వెలనాడునకు బ్రభువులుగ నుండిన చోడులు చాళుక్య చోడుల యధికారము కిందను వారలకు బ్రతినిధులుగ నుండి వేంగి దేశమును బరిపాలించి మిక్కిలి ప్రసిద్ధిగాంచిన వారుగనుండిరి. పేరునకు మాత్రము చాళుక్యచోడులు రాజులుగనున్నను పరిపాలన భారమంతయును వీరె వహించియుండిరని చెప్పవచ్చును. ఈ వెలనాటి ప్రభువులు తాము చతుర్ధాన్వయకులులమని చెప్పుకొని యుండుట చేత వీరలు క్షత్రియులుగారనియు, శూద్రులనియు దేటపడుచున్నది. వీరు శూద్రులయినను క్షాత్రమున క్షత్రియులకు దీసిపోయిన వారుకారు. వీరలును దాము చంద్రకులులమనియు, ఇంద్రసేన వంశజులమనియు జెప్పుకొనుచున్నారు. యుధిష్ఠిర మహారాజుయొక్క దత్తపుత్త్రుడయిన యింద్రసేనుడు మధ్యదేశమును కీర్తిపురము రాజధానిగా బరిపాలించుచుండెనట. వాని వంశమునందు కీర్తివర్మయను రాజు జనించెనట. వానివంశమునందు మల్లివర్మ పుట్టెను. వానికి రణదుర్జయుడు జనించెను వానికి కీర్తివర్మ, వానికి రణదుర్జయుడు, వానికి కీర్తివర్మ పుట్టిరట. కీర్తిపుర మెచ్చటనుగానరాదు. కీర్తివర్మ నామము చాళుక్యులవంశవృక్షమునుండి గ్రహించినట్టు గానంబడుచున్నది. రణదుర్జయుడనునది బిరుదునామముగా గానంబడుచున్నది గాని నిజమైన పేరుగ గానంబడదు.

ఈ వెలనాటి చోడవంశమునకు మూలపురుషుడయిన మల్లవర్మ త్రినేత్ర పల్లవుని సహాయముబొంది దక్షిణాపథముపై దాడివెడలి షట్సహస్ర దేశమును(ఆఱువేల నాడును) వశపఱచుకొనియెనట. త్రినేత్రపల్లవునితోడి మైత్రియు, దక్షిణాపథ దండయాత్రయును విజయాదిత్యుడు అయోధ్యనుండి వచ్చి త్రిలోచన పల్లవునితో యుద్ధముచేసెనని చెప్పెడు పూర్వచాళుక్యుల శాసనములలోని గాథలను జూచి కల్పించినగాథలుగ గన్పట్టుచున్నవి కాని నిజమైనవిగ గన్పట్టవు. విజయాదిత్యునికిని త్రిలోచన పల్లవునకును చాళుక్యుల గాథల విరోధముగలదని చెప్పియుండ నిచ్చట మల్లవర్మకు త్రినయిన పల్లవునకు మైత్రి చెప్పబడియెను.

ఆఱువేలనాడు.

(షట్సహ ప్రదేశము.)

షట్సహ ప్రదేశమను సంస్కృతనామమునకు తెలుగులో ఆఱువేలనాడని యర్థము. ఈ దేశము కృష్ణకు దక్షిణముననున్నదనియు దీనిక ధనపురము రాజధానియనియు జెప్పబడియున్నది. మొదట నీదేశము వెలనాటిచోడులకు వంశకర్తయైన మల్లివర్మ త్రినేత్రపల్లవుని సహాయముతో నాక్రమించెనని పైని జెప్పబడియెనుగదా. ఇది నిజమైనను గాకపోయినను వెలనాటి చోడులకు షట్సహ ప్రదేశములోని ధనదపురము రాజధానిగనుండెను. వెలనాటి ప్రభువులలో రెండవ గొంకరాజు త్రిశతోత్తర షట్సహస్రావనీనాథుడని దాక్షారామములోని యొకశాసనమున బేర్కొనంబడియుండుటయో గాక ధనదపురమును నివాసస్థలముగ నేర్పఱుచుకొనియెనని చెప్పబడియుండెను. ఇట్లనే ప్రసిద్ధికెక్కిన త్రినయన పల్లవుని యనుగ్రహమున దమపూర్వులీ షట్సహస్రదేశమును సంపాందించిరనియును, తామును గూడ షట్సహస్రావనీనాథులమనియు, అమరావతిని బాలించినకోట వంశజులు చెప్పుకొనియుండిరి. [4] ఇంతియగాక కృష్ణా మండలములోని నూజవీడు తాలూకాలోనున్న యెనమదల గ్రామములోని యొకశాసనములో కొన్నతవాడి విషయమును షట్సహస్రదేశమును నొక్కటియే యనియు, దానికి రాజధాని ధాన్యాంకపురమనియు జెప్పబడియున్నది. ధాన్యాంకపురమనునది అమరావతియొక్క నామాంతరమైయున్నది.

కాబట్టి యెనమదల శాసనమునకును పిఠాపురము శాసనమునకు ఏకీభావము గన్పట్టుచున్నందున ధనదపురమనునది ధాన్యాంకపురముయొక్క నవీననామమని తేటపడుచున్నది. ఆంధ్రబౌద్ధుల కాలమున ధనదపురము ధాన్యాకటకమను పేరబరగు చుండెనని మనమెఱుంగుదుము. కనుక షట్సహస్రదేశమనియెడి యాయాఱువేల నాడు వెలనాడులో నంతర్భాగమైన గుంటూరు మండలమునకును అందుముఖ్యముగా గుంటూరు నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పల్నాడు తాలూకాలకు వర్తింపగలదని చెప్పవచ్చును.


ఆఱువేలనియోగులు.

ఆంధ్రబ్రాహ్మణులలో నియోగులలో నాఱువేల నారనియెడు శాఖయొకటిగలదు. ఈశాఖవారు మహమ్మదీయ ప్రభుత్వకాలములో దొరతనము వారి కొలువులో బ్రవేశించినపుడు వీరిసంఘములో నాఱువేలకుటుంబములవారుండుటచేత వీరు తామాఱువేలవారమని చెప్పుకొనుచుచుండిరని జనప్రతీతయొ కటి వ్యాపించి యుండెను. వీరినిగూర్చి పెక్కు గాథలు చెప్పబడుచున్నవి. ఆవన్నియు వట్టికల్పనలు గాని సత్యములు గావు. ఆఱువేలనియోగులనునామము తక్కినవారివలెనె దేశభేదమునుబట్టి కలిగినదే గాని మఱియొకటి గాదు. ఈ శాఖవారి జన్మస్థానమీయాఱువేలనాడు. మొదట వీరీప్రదేశముననుండి యన్యభాగములకు బోయినపుడు వెలనాటి వారు, వేగినాటి వారు, మొదలగువారివలెనే వీరును ఆఱువేల నియోగులని పిలువంబడుచు రాగా రాగా నాడుపదము విడిచిపెట్టబడి ఆఱువేల నియోగులని మాత్రము వ్యవహరింపబడుచువచ్చిరి. మఱికొంతకాలమునకు నియోగులన్నపదముగూడ విడిచిపెట్టబడి యాఱ్వేలవారనియె పిలువంబడుచున్నారు. ఆఱ్వేలవారని యెప్పుడు ప్రారంభమైనదో అప్పటినుండి యాఱ్వేలసంఖ్యనుగూర్చి కల్పనాకథలెన్నో పేర్కొనబడుచున్నవి. వానితో మనకిప్పడు నిమిత్తములేదు. వెలనాడు నుండి వచ్చినవారు వెలనాటి వారైరి. వేగినాడు నుండి వచ్చిన వారు వేగినాటివారైరి.ములికినాడు నుండి వచ్చిన వారు ములికినాటివారయిరి. తెలుగునాడు నుండి వచ్చినవారు తెలగాణ్యులయిరి. కోసలనాడు(దక్షిణకోసలము) నుండి వచ్చిన వారుకాసలనాటి వారైరి. ఆఱువేల నాడునుండి వచ్చినవారాఱ్వేల వారయిరి. ఇట్లు తమతమనాడులనుండి పెఱనాడుల నివసింపబోయినప్పుడు వాడివారి నాడులను బేర్కొనుచువచ్చిరి. తుదకవి బ్రాహ్మణులలో శాఖాభేదములుగా బరిణమించినవి. ఈ నాడీ భేదము లొక్కమాఱుగ నేర్పడినవికావు. పూర్వకాలమునందీనాడులన్నియు నొక్క ప్రభుత్వము క్రిందివిగాక యొకచోటనున్నవి గాక యొక కాలమునందేర్పడినవిగాక వేఱ్వేఱు రాజులచే బరిపాలింపబడుచు, ఒకదానికొకటిబహుదూరమున నుండుచు, భిన్నకాలములయందేర్పడినవగుచేతను, ఆ కాలమునందు రాకపోకలు సులభసాధ్యములుగాకుండుటచేతను, ఒకనాడులోని బ్రాహ్మణులు మఱియొక నాడులోని బ్రాహ్మణులతో సంబంధములు చేసికొనుటవలన జిక్కులు పెక్కులుండుటచేత సంబంధ భాంధవ్యములు మానుకొనుచు సర్వసాధారణముగాదమతమ నాడులలోనే పిల్లల నిచ్చి పుచ్చుకొనుచుండిరి. అందుచేత నొకనాటివారితో మఱియొకనాటివారికి సంబంధ బాంధవ్యములు లేకపోయినవి. అయినను భోజనప్రతిభోజనములకభ్యంతరము లేకయుండెను. అవియును గూడ శైవ వైష్ణవ స్మార్తద్వైతమతభేదములు ముదిరిన తరువాత గట్టువడినవి. ఆఱువేలనాడు పదునొకండవ శతాబ్దమున వ్యవహరములోనికి వచ్చినదగుటచేత నంతకు బూర్వము నియోగులులేరని గాని ఉన్నను వారువేఱని వీరువేఱని గాని యెంతమాత్రము భావింపరాదు. పల్లవులకాలముననే రాజకీయోద్యోగములను బడసియుండిన బ్రాహ్మణులు నియోగులని వ్యవహరింపబడుచుండిరని కుమార విష్ణునిశాసనము నిదర్శముగ జూపియుంటిమి. అయిననుపదియవశతాబ్దమునకు బూర్వమునుండిన రాజులవృత్తాంతములుగాని మంత్రులవృత్తాంతములగాని మనకు సంపూర్ణముగ లభింపనందున నా కాలపు నియోగులచరిత్రమంతయు వీనియోగులతోనే గూడియున్నది. కృష్ణదేవరాయల కాలమునాటికి నియోగులలో మఱికొన్ని శాఖాభేదము లేర్పడియుండుట చేత నీయాఱ్వేలవారంతకు బూర్వము విశేషప్రఖ్యాతి వహించి యప్పటికి మహోన్నతపదవులకు వచ్చియుండిరి గావున వీరిని నాఱ్వేలవారని పేర్కొనుచుండిరి. తరువాత వారు సహితము తమ గొప్పతనమును దెలుపుకొనుటకై యాఱ్వేలవారమని చెప్పుకొనుచుండిరి. విమలాదిత్యుని మంత్రియగు సబ్బియప్రెగ్గడ మొదలుకొని కృష్ణదేవరాయని మంత్రియగు సాళువతిమ్మరాజు వఱకుగల నియోగులలో విశేషప్రఖ్యాతి వహించినవాఱెల్లరు నొక్క కూటమిలోనివారేగాని భిన్నులుగారు. కృష్ణదేరాయలకడ మంత్రులుగనుండి రాజ్యతంత్రజ్ఞులయి ప్రభుత్వముల బంతులాడించి నట్లాడించి యాంధ్రదేశ నాటకరంగమున బ్రఖ్యాత పాత్రముల బ్రదర్శింపజేసిన వారీశాఖా బ్రాహ్మణులే. ఆంధ్రభాషా కోవిదులై యుత్కృష్టగ్రంథరచనము గావించి కవిబ్రహ్మలై కవి సార్వభౌములై తమకు దామె సాటియననొప్పి కీర్తిశేషులై చన్నవారీశాఖాబ్రాహ్మణులే. ఇట్లు రాజ్యపాలనా సా మర్థ్యము, గ్రంథరచనాకౌశల్యము మాత్రమెగాక పరరాజులు దండెత్తివచ్చినప్పుడుగాని పరరాజులపైదాడి వెడలవలసివచ్చినప్పుడుగాని వెనుదీయక నడుమునకుగత్తికట్టుకొని సేనాధిపతులై సేనలనునడిపించియుద్ధములరణశూరులై పోరాడి పౌరుషము నెఱపినవారీశాఖాబ్రాహ్మణులే. కాబట్టి రాజ్యతంత్రము, కవితాసతియు వీరియధీనమైయుండుటచేత వీరిని మఱచి యాంధ్రదేశచరిత్రమువ్రాయుట సాధ్యముగాదు. ఒకవేళ సాధ్యమైనను శిరములేని మొండెమువలెనుండును. సారములేని పిప్పివలెను, ఉప్పులేని కూరవలెనుండును. వీరి యందింకొకవిశేషముగలదు. అభివృద్ధియందపేక్షగలిగి దురభిమానమంతగా లేక సంస్కరణాభిలషులై యే యెండకా గొడుగుపట్టుచు దేశకాల పాత్రస్థితులననుసరించి సంచరించినవారిలో వీరగ్రగణ్యులుగా నున్నారు.

రెండవకుడ్యవర్మ.

షట్సహస్రదేశమును జయించి సంపాదించిన మల్లవర్మ సంతతిలో నైదవతరము వాడగు రెండవకుడ్యవర్మ చాళుక్యరాజగు విమలాదిత్యునికి లోబడిన మాండలిక సామంతుడుగనుండి యాతనివలన గుద్రవారవిషయ పాలకత్వమును వహించి పరిపాలించిన ప్రసిద్ధవీరుడుగనుండెను. కాబట్టి యితడు క్రీ.శ.1011-1022 సంవత్సరముల నడుమనున్న వాడని నిశ్చయింప వచ్చును.

మొదటి గొంకరాజు.

కుడ్యవర్మ మునిమనుమడగు గొంకరాజు విమలాదిత్యుని మనుమడగు కులోత్తుంగ చోడదేవుని కాలమున వానికి లోబడిన సామంతుడై యాంధ్రమండలములోనొక భాగమును బాలించుచుండెను. ఈ వెలనాటి గొంకరాజు మంచనకవి విరచితమైన తేయూర బాహుచరిత్రమునందిట్లు వర్ణింపబడియున్నాడు.

" శా. ప్రాగ్దేశాపర దక్షిణోత్తరదిశా భాగప్రసిద్ధక్షమా
భుగ్దర్పాంతకుఁడేలె గొంకవిభుడీ భూచక్రమక్రూరతన్

 
వాగ్దేనీస్తనహారనిర్మలయశోవాల్లభ్యసంసిద్ధితో
దిగ్దంతిశ్రవణానిలోజ్జ్వలరట త్తీవ్రప్రతాపాఢ్యుఁడై"

ఈ వెలనాటి గొంకరాజునకు కౌశికగోత్రుండగు నండూరిగోవిందామాత్యుడను నియోగి మంత్రిగనుండి ప్రసిద్ధిగాంచినవాడు. ఈ గోవిందామాత్యుడుగూడ కేయూరబాహ చరిత్రమునందె యిట్లువర్ణింపబడియున్నాడు.

" మ. విహితాస్థానమునందు జూపుఁదగ గోవిందాభి ధాన ప్రభుం
డహితోర్విధర వజ్రగొంకవిభు రాజ్యాధిష్ఠుడై సంధివి
గ్రహముఖ్యోచిత కార్యసంఘటనతం త్రప్రౌఢియున్ బాఢన
న్నహనోదగ్రరిపుక్షితీశబహు సైన్యధ్వంసనాటోపమున్."

రెండవవిదురరాజు.

ఈ మెదటి గొంకరాజున కన్నకొడుకగు రెండవవిదురవర్మ వేగీరాజప్రతినిధియగు వీరచోడ భూపాలునకు మంత్రియ సేనాధిపతియునై యాతని యాజ్ఞానుసారముగ పాండ్యభూమిపతిని యుద్ధములోనోడించి విజయముగాంచి తనప్రభువుచే సింధుయుగమంతర దేశపాలకత్వమునువహించి పరిపాలనము చేసి ఖ్యాతి గాంచెను.

కులోత్తుంగరాజేంద్రచోడుడు.

వెలనాటి గొంకరాజు పుత్రుడయిన యీ చోడుని చాళుక్యచోడుడు పెంచుకొని పదునాఱువేల గ్రామములుగలిగి యుండిన వేగిదేశమునకు రాజప్రతినిధిగ నియమంచియండును. ఈ వెలనాటి కులోత్తుంగ రాజేంద్రచోడునకు గొంకరాజు మంత్రియైన నండూరి గోవిందన్న కుమారుడు కొమ్మనమంత్రిగనుండెను. వీరిరువురును గూడ కేయారబాహచరిత్రమునం దిట్లు వర్ణింపబడియున్నారు.

"సీ. నవకోటి వరిమతద్రవిణ మేభూపతి
భండారమున నెపుఁడుఁ బాయకుండు
నేకోవ శతదంతు లేరాజు ఘనశాల
నీలమేఘంబుల లీలఁగ్రాలు
బలవేగ రేఖ నల్వదివేల తురగంబు
లేనరేంద్రుని పాగ నెపుడు నిలుచుఁ
బ్రతివాసరంబు డెబ్బది యేనుపుట్ల నే
యే విభుమందల నెపుడుఁగలుగు
నట్టి సమధిక విభుఁడగు కులోత్తుంగ రా
జేంద్రచోళవిభుని కిష్టసచివ
తంత్రముఖ్యుడగుచు మంత్రి గోవిందనం
దనుఁడు కొమ్మన ప్రధానుఁడొప్పె."

ఈ నండూరి కొమ్మనమంత్రి యనేక తటాక దేవాలయ మహాగ్రహారములు నిర్మించి కీర్తి ప్రతిష్ఠలు గాంచినట్లు పై గ్రంథములోని యీ క్రిందిపద్యము చాటుచున్నది.

"చ. ఇల వెలనాటి చోడమనుజేంద్రునమాత్యతయానవాలుగాఁ
గులతిలకంబుగా మనినకొమ్మన ప్రెగ్గడ కీర్తిమాటలన్
దెలుపఁగ నేల తత్క్రియఁ బ్రతిష్ఠితమైన తటాక దేవతా
నిలయమహాగ్రహారములు నేడును నెల్లెడఁ దామచెప్పఁగన్."

రెండవగొంకరాజు.

వెలనాటి చోడుని మరణానంతరము వేగిదేశము పశ్చిమచాళుక్యరాజగు విక్రమాదిత్యునిచే జయింపబడియెను. విక్రమాదిత్యుడు వెలనాటిచోడుని కుమారుడగు మహామండలేశ్వర వెలనాటి గొంకయను (రెండవగొంకరాజు) రాజప్రతినిధిగ నియమించెను. విక్రమాదిత్యుని శాసనములు 1120-24 సంవ త్సరముల నడుమని గొన్ని దాక్షారామమున గన్పట్టుచున్నవి. శాలివాహన‌‌‌శకము 1063వ సంవత్సరములోని వెలనాటిగొంకయ దానశాసనమొకటి దాక్షారామములోనువాని భార్య నబ్బాంబిక యొక్క దానశాసనమొకటి నాదెండ్లలోను గానంబడుచున్నవి. దాక్షారామశాసనములో "చాళుక్యరాజభవనమూల స్తంబు" డని గొంకరాజునకు బిరుదు నామముగా బేర్కొనబడియెను. కాబట్టి యితడు 1133 వ సంవత్సరమువఱకు పశ్చిమచాళుక్యులను రాజప్రతినిధిగనుండి మహేంద్రపర్వతము మొదలుకొని కాళహస్తివఱకుగల యాంధ్రదేశమును బరిపాలించినట్టు గన్పట్టుచున్నది. తరువాత విక్రమచోడుని శాసనములు చేబ్రొలు, నిడుబ్రోలు గ్రామములందు 1134-35సంవత్సరములలోనివి గన్పట్టుచుండుటచేత విక్రమచోడునిచే వేగిదేశము మరల స్వాధీనము జేసికొనబడియెనని యూహింపబడుచున్నది.

వెలనాటి వీరరాజేంద్రచోడుడు.

తరువాత రెండవగొంకరాజునకు నబ్బాంబిక యందు జనించిన వీరరాజేంద్రచోడుడు రాజ్యభారమును బూనెను. సారపిపురాధ్యక్షుండయిన తెలుంగుభీమనాయకుడు చోడుని యధికారమును ధిక్కరించి కొల్లేరు కోటలో దాగొనియుండ నితడు దండెత్తిపోయి వానితో యుద్ధముజేసి కోటధ్వంసముచేసి వానిని జంపెను. ఇప్పటి కృష్ణామండలములోని యేలూరు పట్టణ మాకాలమున సారసిపురమనియ, కమలాకర పురమనియు బిలువంబడుచుండెను. ఈ పట్టణమిప్పడు కొల్లేరుసరస్సునకు నైదు మైళ్లదూరమున నున్నను ఆ కాలమునందింకను కొల్లేరు సమీపముగనుండుటచేత నీ పట్టణమును సారసిపురమనుచుండిరి. తెలుగు నాయకులు దీనిని పరిపాలించుచుండిరి. వీరు స్వసంరక్షణార్థము కొల్లేరులో నొక కోటను గట్టుకొనియుండిరి. అదియిప్పుడు శిథిలమయిపోయినను ఆ ప్రదేశమిప్పటికిని కొల్లేరుకోట యనునామముతో బిలువంబడుచున్నది. ఈ భీమనాయకునకు ముందుండిన మఱియొక భీమనాయకుడు విక్రమచోడునిచే జంపబడియెను. [5] వీరలు వెలనాటి చోడులకు లోబడి పరిపాల నము చేయుచుండెడివారు. వీరిలో గడపటివాడైన కాటమనాయకుడు రెండవకులోత్తుంగ చోడదే‌వునకు సేనాధిపతిగనుండి యాతనిచే మెప్పుగాంచి గోదావరి మండలములోని చెల్లూరు గ్రామమును బహుమానముగ బొందెను. [6] మఱియు నితడు అత్తిలినాడులోని పాందువ్వ (భీమవరము తాలూకాలోనిది) గ్రామవాసియగు నొక బ్రాహ్మణునకు మంతదొఱ్ఱు (మందపఱ్ఱు భీమవరము తాలూకాలో గణపవరమునకు సమీపముననున్నది) గ్రామమును దానము చేసియుండెను. వీని శాసనములుకొన్ని యేలూరుమొదలగు ప్రదేశములం గానంబడుచున్నవి.

వెలనాటి మనుమగొంకరాజు.

ఇతడు వీరరాజేంద్రచోడునకు అక్కాంబికయందు జనించినవాడు. ఈ మూడవగొంకరాజు గిరిపశ్చిమశాసనులయిన కోనబుద్ధరాజు వంశమునందు జనించిన జయాంబికను వివాహమయ్యెను. ఇతడు రెండవకులోత్తుంగ చోడదేవునకు మాండలిక సామంతుడుగనుండెను. వెలనాటి కులోత్తుంగ చోడగాంగేయగొంకరాజనునది. వీనిసంపూర్ణనామము. వీనిశాసనములు క్రీ,శ. 1138 మొదలుకొని 1156 వఱకును గాన్పించుచున్నవి. వీనిభార్య జయాంబిక పిఠాపురములోని కుంతీమాధవ స్వామిదేవాలయమును గట్టించుటయెగాక సింహాచలములోని నృసింహుని విగ్రహమును సువర్ణముతో గప్పెను.

ప్రథ్వీశ్వరరాజు.

వెలనాటిచోడరాజులలో గడపటివాడు పృథ్వీశ్వరరాజు. ఇతడు మనుమగొంకరాజునకు జయాంబికయందు జనించినవాడు వీనిశాసనములు. క్రీ.శ, 1163 మొదలుకొని1180 వఱకును గానిపించుచున్నవి. ఇతడు రాజరాజచోడునకు సామంతుడుగనుండెను. వీనికాలమున వీనితల్లియగు జయాంబిక క్రీ.శ.1186-87వ సంవత్సరమును పిఠాపురములోని కుంతీమాధవస్వామి యాలయమునకు గంగయికొండ చోడవలనాడులోని యంతర్భాగమగు ప్రోలనాడు లో నున్న నవఖండవాడ (పిఠాపురమునకు దగ్గిరనున్నది) యను గ్రామమును దానము చేసియుండెను. అది యిప్పటికిని నాదేవునిక్రిందనే యుండెనని తెలియుచున్నది. ఈ పృథ్వీశ్వరరాజు విక్రమసింహపురమను బాలించుచుండిన మనుమ సిద్ధిరాజు తండ్రియగు చోడతిక్క నృపాలునిచే యుద్ధరంగమున జంపబడియెను.

వెలనాటి చోడవంశము.


1 మల్లవర్మ
|

2 ఎఱ్ఱయవర్మ
|
3. కుడ్యవర్మ
|
4. మల్లవర్మ (2)
|
5. కుడ్యవర్మ(2)
(1011-1022)
|
6. ఎఱ్ఱయవర్మ (2)
|
7. సన్నిరాజు
|
|------------- ----------- ---------------- ------------------ ---------------- ----------------|
| 8. విదురరాజు 9 గండరాజు 10. గొంకరాజు (1) 11.మల్లయ్య 12. పాండయ
---<>- - -
9. గండరాజు
|
13. విదురరాజు (2)
---<>- - -
10.గొంకరాజు(1)
|
14. చోడరాజు
|
15. గొంకరాజు (2)
|
16. చోడరాజు
|
17.గొంకరాజ(3)
|
18.పృథ్వీశ్వరరాజు

బేటవిజయాదిత్యవంశము.

ఈ వంశమునకు మూలపురుషుడయిన బేటవిజయాదిత్యుడు వేగిదేశమును క్రీ.శ.918 మొదలుకొని 924వఱకును బరిపాలించిన పూర్వచాళుక్యరాజగు అమ్మరాజ విష్ణువర్థనుని జ్యేష్ఠకుమారుడగనుండి తండ్రియనంతరము పట్టాభిషిక్తుడై యుద్ధమల్లునికుమారుడగు మొదటి తాళరాజు చే జయింపబడి పదభ్రష్టుడయ్యెను. వీని కాఱవతరమువాడగు విజయాదిత్యుడు రెండవ కులోత్తుంగుచోడుని కాలములోననగా బండ్రెండవశతాబ్దమున వెలనాటి చోడులకు బిమ్మట వేగి దేశమును స్వాధీనము జేసికొని పరిపాలించినట్లు పిఠాపురములోని మల్లపదేవుని శాసనమువలన దెలియుచున్నది. ఈ శాసనమునందు బేటవిజయాదిత్యుని కాఱవతరమువాడగు మూడవ విజయాదిత్యుని కుమారుడు మల్లవిష్ణువర్థనుడు శాలివాహనశకము1124వ సంవత్సరము జైష్ఠబహుళ 10 భానువారమశ్వినీనక్షత్ర సింహలగ్నమునందు శ్రీపిఠాపురములోని కుంతీమాధవస్వామి దేవాలయములో బట్టాభిషిక్తుడయ్యెనని దెలుపంబడనది. ఈ తెలుగుతిథికి సరియైన యింగ్లీషు తేది (కీల్ హారన్ పండితునిగణన ప్రకారము.) క్రీ.శ. 1202వ సంవత్సరము జూను నెల 20 దవతేది యగుచున్నది. ఈ శాసనమునందే మల్లవిష్ణువర్థనుని తండ్రియగు మూడవ విజయాదిత్యుడు శాలివాహనశకము 1079దవ సంవత్సరమునకు సరియైన క్రీ.శ. 1158దవ సంవత్సరము పదునొకండవ జనవరి తేదిని సింహాసనమెక్కినట్లుగ గూడ దెలుపబడినది. క్రీ.శ.1228దవ సంవత్సరమున వేంగిదేశమంతయు గణపతిరాజులయధీనమైనది గనుక మల్లవిష్ణువర్థనునితో నీ వంశమువారి పరిపాలనము తుదముట్టినది. ఈ మల్లవిష్ణు వర్థనుని శాసనములో విశేషచరిత్రాంశము లేవియుగానరావు. ఈ శాసనములో నీ వంశములోని రాజులనామములు మాత్రమె గాక వారి రాణుల నామములు గూడ పేర్కొనబడినవి. బేట విజయాదిత్యుని కొడుకు నుత్తమచాళుక్యబిరుదాంకితుండగు సత్యాశ్రయుడు గాంగవంశజు రాలయిన గౌరిదేవిని వివాహమయ్యెను. ఈమె క్రీ.శ. 1082 మొదలుకొని 1159దవ సంవత్సరము వఱకు గళింగనగరము రాజధానిగా జేసికొని కళింగదేశమును బరిపాలించిన అనంతవర్మ చోడ గంగదే‌వునికి బంధువురాలయి యుండునని తోచుచున్నది. సత్యాశ్రయుని కొడుకయిన విజయాదిత్యుడు సూర్యవంశమున జనించిన విజయాదేవిని వివాహమయ్యెను. ఈమె చోడరాజపుత్రికయగునని తోచుచున్నది. ఈ విజయాదిత్యుని ద్వితీయపుత్రుడగు మల్లపదేవుడు సాగర విషయాధిపతియు. హైహయవంశజుడునగు నొక బ్రాహ్మణుని కూతురగు చందలదేవిని వివాహమయ్యెను. ఈ సాగరవిషయాధిపతియగు హైహయుడును కోనమండల మేలిన హైహయులు నొక్కవంశములోని వారేయై యుండవచ్చును. ఈ మల్లపదే‌వుని కొడుకగు విజయాదిత్యుడు అరదవాడ రాజపుత్రికను వివాహమయ్యెను. అరదవాడ యక్కడిదో దెలియరాదు.

ఈ వంశములోని కడపటివాడయిన మూడవ మల్లసదేవునకు విష్ణువర్థనమహారాజనియును, మల్లపదేవ చక్రవర్తియనియును బిరుదునామములు గలవు. ఇతడు పట్టాభిషేకము బొందినదినముననే ప్రొలనాడులోని గుడివాడ గ్రామమును, శ్రీపిఠాపురములోని కుంతీమాధవస్వామి దేవాలయమునకు ధారపోసెను. వెలనాటి చోడుడయిన పృథ్వీశ్వరుని పిఠాపురశాసనమునుబట్టియు, సర్వవరములోని శాసనములనుబట్టియు సర్పవరము సమీపమునందుండిన నవఖండవాడగూడ ప్రోలనాడులోనిదేయని తెలిసికొనియే యుంటిమి. శకటమంతినినాడులోని చాళుక్యభీమవరములోనున్న రాజనారాయణస్వామి దేవాలయములో మల్లపదేవుని శాసనములు రెండుగలవు. ఆ రెండు శాసనములలోను మల్లవిష్ణువర్థనుడు శాలివాహనశకము 1069దవ సంవత్సరమనగా క్రీ.శ.1147 వసంవత్సరములననే సింహసనమెక్కినట్లు దెలుపబడినది. ఈ భీమవరము శాసనములను పిఠాపురము శాసనములతో సమన్వయించుట కష్టసాధ్యముగనున్నది. పైరాజనారాయణదేవాలయములోనే శాలివాహనశకము 1098దవసంవత్సరములో మల్లపదేవుని సవతితమ్ముడయిన నరేంద్రుడు చేసిన దానశాసనమొకటిగూడ గానవచ్చుచున్నది. ఈ నరేంద్రుడు విజయాదిత్యునికి లక్ష్మీదేవి వలన జనించిన పుత్రుడని మఱియొక శాసనమును బట్టికూడ దెలియుచున్నది. కాబట్టి యింతకన్న వీరిని గూర్చి మఱియేమియునుదెలియరాదు.
బేటవిజయాదిత్య వంశము.

- - -<>- - -

i)విజయాదిత్యుడు (1)
i.i) సత్యాశ్రయుడు
i.i.i)విజయాదిత్యుడు
i.i.i.i)విష్ణువర్థనుడు(2)
i.i.ii) విమలాదిత్యుడు
i.i.iii)విక్రమాదిత్యుడు
i.i.iii.i)మల్లప్ప
i.i.iii.i.i)విజయాదిత్యుడ(3),క్రీ.శ.1185
i.i.iii.i.i.i) మల్లప్పదేవుడు(3),క్రీ.శ.1202
i.i.iii.i.i.ii)నరేంద్రదేవుడు
i.i.iv)విష్ణువర్థనుడు
i.i.v)మల్లప్ప
i.i.v.i)సామిదేవుడు
i.i.vi)కామడు
i.i.vii)రాజమార్తాండుడు

హైహయవంశము.

కోనసీమరాజులు.

చాళుక్యచోడులకును వెలనాటి చోడులకును లోబడి కోనమండలమేలిన రాజవంశమునకు హైహయవంశమనిపేరు. ఇప్పటి గోదావరి డెల్టా భూమియంతయునప్పుడు కోనమండలముగానుండెను. ఇప్పటికిని అమలాపురముతాలూకాకు కోనసీమయను పేరు నిలిచియున్నది. ఈకోనసీమ రాజులశాసనములు 1128 మొదలుకొని 1206వ సంవత్సరము వఱకు గానంబడుచున్నవి. ఇటీవల వారు కొందఱు కాకతీయగణపతులుకుగూడ సామంతులుగానుండరి. ఈ రాజులు తమశాసనములలో దాము యదువంశజుడయిన హరియొక్క మునిమనుమడగు హైనాయుని మనుమడగు కార్తవీర్యుని ‌‌‌వంశములోని వారమని తమశాసనములలో జెప్పుకొనిరి. ఈ‌వంశమునకు మూలపురుషుడయిన ముమ్మడి భీమరాజు మహారాజాధిరాజగు రాజేంద్రచోడదేవునిచే వేంగిదేశ రాజప్రతినిధిత్వము బడసెనని యొక శాసనమున జెప్పబడినది. రాజేంద్రచోడు డనునీమొదటికులోత్తుంగ రాజదేవుడు రాజప్రతినిధిత్వము మొదటి తనపినతండ్రియగు విజయాదిత్యునకును తరువాతా రాజరాజు, వీరచోడుడు, చోడగంగు అనుతన ముగ్గురు కొడుకులకును పిమ్మట వెలనాటిచోడునకును నొసంగెనని మనమెఱంగుదుము. ఈకోనసీమరాజులు రాజప్రతినిధులకులోబడి పరిపాలనము చేసినవారుగా నుండిరి. ఈవంశములో మూడవ వాడయిన రాజపఱేడు కోనమండలాధిపతియని యొకశాసనమునం బేర్కొనంబడియెను. ఈ కోనశబ్దము వీనినామమునకు మాత్రమేగాక మఱికొందఱినామములకు బూర్వమునగానంబడుచుండుటచేత కోనమండలరాజులని పిలుచుటకు సంశయింపబనిలేదు. ఈ వంశములో నైదవరాజయిన రాజేంద్రచోడరాజు తనప్రపితామహుడయిన ముమ్మడిభీమరాజునకొసంగబడిన వేంగిరాజ్యమున కభిషిక్తునైతినని చెప్పుకొనియున్నాడు. వీనికి విక్రమరుద్రుడు హైహయాదిత్యుడు, మొదలగు బిరుదునామములుగలవు. ఇతడు, దాక్షారా మములోని భీమనాథాలయములో నొక మండపమును గట్టించెను. వీనిమరణానంతరము వీనిసోదరులగు రెండవభీమరాజు మొదటిసత్యరాజు గలిసి పరిపాలనము చేసిరి. వారితరువాత వారి కొడుకులు లోకమహీపాలుడును మూడవభీముడును గలిసి పరిపాలనము చేసిరి. వారికి బిమ్మట రాజేంద్రచోడునికొడుకు మల్లిదేవుడును రెండవరాజపఱేడుకొడుకు వల్లభరాజును గలిసి పరిపాలనము చేసిరి. వల్లభరాజు 14సంవత్సరములు పరిపాలనముచేసినతరువాత మరణము నొందగా వానికొడుకు రెండవమనుమసత్యరాజు వాని స్థానమునకు వచ్చెను. ఈ మల్లిదేవుడును మనుమసత్యరాజునుగలిసి గుద్దవాడివిషయములోని ఒడియూరను గ్రామమును శాలివాహనశకము 1117వ సంవత్సరములో మేష సంక్రాంతినాడు శ్రీపిఠాపురములోని కుంతీమాధవస్వామి దేవాలయమునకు ధారపోసి యొక శాసనమును వ్రాయించిరి. ఈయెడియూరునకు దూర్పునవేలంగయ దక్షిణమున సిరిపురమున్నదని చెప్పుటచేతను, ఇప్పటి ఓదూరు అనిపిలువంబడు గ్రామమునకు దూర్పున వేలంగి గ్రామమును దక్షిణమున సిరిపుర గ్రామమునుండుటచేతను ఒడియూరే ఓదూరయినదని తలంపబడుచున్నది. ఈ శాసనములో జయమాంబను బొగడునట్టి రెండు శ్లోకములు గానంబడుచున్నవి. ఈజయమాంబ వెలనాటి చోడుడయిన మనుమగొంక రాజుయొక్క భార్యయు, కులోత్తుంగ పృథ్వీశ్వరుని తల్లియునైయుండెను. పృథ్వీశ్వరుని పిఠాపురము శాసనములో నీమెగూర్చి దెలిసికొనియుంటిమి. ఈశాసనమునందీమె పొగడబడియుండుటచేత 1108దవ శకసంవత్సరములోనుండిన జయమాంబ 1117లోగూడ జీవించియున్నదనియు కోనమండలరాజులు వెలనాటిచోడులకు లోబడిన సామంత ప్రభువులనియు దేటపడుచున్నది. ఈ రాజుల చరిత్రమును దెలిపెడివి పిఠాపురశాసనము మాత్రమె గాక మఱికొన్ని శిలాశాసనములు దాక్షారామభీశ్వేరుని యాలయములోను, పాలకొలను(పాలకొల్లు) గ్రామములోని క్షీరారామదేవునియాలయములోనుగలవు. మాహిష్మతీపురంబున కలంకారభూతుడును, కోనమండలాధిపతియు హైహయవంశజుడునుగు రాజపఱేడు కుమారుడును విక్రమరుద్ర బిరుదాంకితుడునైన రాజేంద్రచోడుని శాసనము పై జెప్పిన శాసనములలో బురాతనమైనదిగనున్నది. ఇందు జెప్పబడిన మహిష్మతీనగరము కార్త్యవీర్యుని వంశములోనివాడగు ప్రతీపునికిరాజధానియై రేవానదీతటంబుననున్నదని రఘువంశమునందు జెప్పబడినది. నర్మదానదీతటంబున నున్న మండ్లయును గ్రామమే పూర్వము మహిష్మతీనగరము గానుండెనని జనరల్ కన్నిహ్యామ్ గారు వ్రాయుచున్నారు. [7] మహిష్మతీనగరము నర్మదాతీరుము నందున్నదని డాక్టరు భాండార్ కర్ గారుకూడ వ్రాయుచున్నారు.[8] కోనముమ్మడిరాజుయొక్క రాణియగు రాజుదేవి శాలివాహనశకము 1057వ సంవత్సరములో జేసిన దానశాసనము మఱియొకటిగలదు. ఈ ముమ్మడిరాజు రాజేంద్రచోడునికి బెద్దన్నయగు రెండవముమ్మడి భీమరాజుగనుండెను. మఱియును వీనితోగూడి పరిపాలనముచేసిన మొదటి సత్యరాజుయొక్క శాసనముగూడ గలదు. ఈ సత్యరాజుకోనరాజపఱేడునుకు తొండాంబికయందు జనించినవాడును రాజేంద్రచోడునకు దమ్ముడునై యుండెను.

ఈ మొదటి సత్యరాజునకు దరువాతి రాజ్యాధిపత్యమును వహించిన వానికొడుకు మూడవభీమరాజు వేగి విషయాధీశ్వరుడయిన రాజరాజునకు లోబడిన సామంతుడగ నుండెనని రాజరాజదేవుని రాజ్యకాలములోని తొమ్మిదవ సంవత్సరమున ననగా శాలివాహన శకము 1075 దవ సంవత్సరములో కోనసత్యరాజు యొక్క కుమారుడును మహామండలేశ్వరుండు నైన భీమరాజుచేవ్రాయించబడిన శాసనమును పట్టి దెలియుచున్నది.

మఱియును కోనమల్లి దేవరాజు రాణియగు గంగాదేవి వలన శాలివాహనశకము 1077వ సంవత్సరములో నొక దీపము దానము చేయబడినట్లుగా దెలిపెడి శాసనమొకటియు కోనమల్లిదేవరాజుతో గలిసి పరిపాలనముచేసిన రెండవమనుమసత్యరాజుమంత్రి గూడనొకదీపమును దానము చేసెనని దెలిపెడి దానశాసనమొకటియు నాదేవాలయమునందే గాన వచ్చుచున్నవి. ఇంతియగాక పాలకొలను గ్రామములోని క్షీరారామేశ్వరుని దేవాలయములో నిటీవల వ్రాయబడిన శాసనములు కొన్ని యీవంశములోని మఱియిద్దఱు రాజులపేరులను బేర్కొనుచున్నవి. వారినామములకు ముందు కోనశబ్దము ప్రయోగింపబడియుండుట చేత నీ యిరువురు గూడ కోనసీమరాజులలోని వారేయని నిశ్చయింప బడియెను. అందొకరు కోనగణపదేవమహారాజనువారు మఱియొకరు కోనభీమవల్లభరాజనువారు. వీరిలో మహామండలేశ్వర గణపదేవ మహారాజుగారి దేవియగు నుదయమహాదేవి చాళుక్య వంశజుడును విష్ణువర్ధన మహారాజబిరుదాంకితుండును, నిడుదప్రోలు (నిడదవోలు రాజమహేంద్రవరమునకు బడమట 10 మైళ్లదూరమున నున్నది.) పురాధీశ్వరుండు నైన మహాదేవచక్రవర్తి కొమార్తెయైయుండెను. ఈ మహాదేవ చక్రవర్తి శాసనములు శాలివాహనశకము 1218 వ మొదలు కొని 1022 వఱకును వానియల్లుడగు గణపతిదేవ మహారాజుయొక్క శాసనములు శాలివాహనశకము 1184 మొదలుకొని 1022 వఱకును, గానిపించుచున్నవి. భీమవల్లభరాజుయొక్క దానశాసనములు రెండింటిలో నొకటి శాలివాహనశకము 1240దవ సంవత్సరమున వ్రాయబడినది. కాబట్టి వీరలిరువురును కాకతీయులైన గణపతిరాజులకు సామంతులుగ నుండి కోనసీమరాజ్యమును బరిపాలించిరని చెప్పవచ్చును.

---<>- - -
హైహయ వంశము
  1. Ep Ind. IV, 33 and Manual of the Kistna District, 214.
  2. Incl. Ant. Vol XII, p. 91
  3. No. 268 of 1893 in Anuual Report for I793~94u
  4. Ep. Ind. Vol.III. p. 95.
  5. Son. Ind. Ins. Vol II. p. 308.
  6. Ind. Ant. Vol XIV. p. 55.22
  7. Ancient geography of India, p. 488.
  8. Dr. JBhandarkar's Early History of Deccan p.7.