ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర దేశ కథాసంగ్రహము.

ఆంధ్రభృత్యవంశము

_____

మొదటి ప్రకరణము.

ఆంధ్రదేశము.

ఆంధ్రదేశ చరిత్రమును దెలిసిగొనుటకు బూర్వము “ఆంధ్రదేశ” మన నెట్టిదియో, దానిలెల్ల లెవ్వియో, విస్తీర్ణ మెంతయో, అందలి జనుల వేషభాషా మతంబులెట్టివో, ఎట్టి నాగరికతవహించి యుండిరో, కొంచెముగానైనఁ దెలిసికొనుట యావశ్యకము.

హిందూదేశము యొక్క మధ్యప్రదేశము నలంకరించి యుండిన వింధ్యపర్వతమునకు పైభాగ మార్యావర్తము లేక ఉత్తర హిందూస్థానమనియు క్రింది భాగము దక్షిణాపథము లేక దక్షిణ హిందూస్థానమనియు వ్యవహరింపబడుచున్నవి.

భరతఖండమునందలి దక్షిణాపథ దేశములలో నాంధ్రదేశము సుప్రసిద్ధమయినదిగ నున్నది. (ఆంధ + రస్ = అంధ = దృష్ట్యుపఘాతే యని ధాతువు) మనుష్యులు వసియింప శక్యముకాని యంధకారము కలది యగుటచే నౌత్తరాహులీదేశము నాంధ్రదేశమని వాడుచు వచ్చిరని కొందరు పండితులు చెప్పుచున్నారు.[1] ఆంధ్రులు నివసించుచుండు దేశముగాన దీనికి నాంధ్రదేశమని పేరు గలిగినదని మరికొందరు పండితులు తలంచుచున్నారు. ప్రాచీనకాలము నందు నాగరికులు వసియింప శక్యముకాని యంధకారబంధురమయిన మహారణ్యమధ్యమునందు మొదట వీరు నివసించియుండిన వారగుటజేసి యౌత్తరా హులయిన యార్యులు వీరిదేశము నాంధ్రదేశమనియు, వీరి నాంధ్రులనియు బిలిచిరని చెప్పుమాట యుక్తియుక్తమయినదిగానే యుండును.

ఎల్లలు.

ఈ దేశమున కుత్తరమున నుత్కలమహారాష్ట్ర దేశములును, తూర్పున దూర్పుసముద్రమనియెడి బంగాళాఖాతమును, దక్షిణమున ద్రావిడకర్ణాటక దేశములును, పశ్చిమంబున కర్ణాటక మహారాష్ట్ర దేశములును గలవు.

విస్తీర్ణము.

ప్రస్తుతము హిందూదేశమును బరిపాలించుచుండిన బ్రిటీషు పరిపాలకులు పరిపాలనమున కనుకూలమగునటుల దేశము ననేక భాగములుగ విభాగించి యుండుటనుబట్టి యాంధ్రదేశము యొక్క విస్తీర్ణమును సరిగా నిర్వచించుటకు సాధ్యముగాదు. అయిన నొకరీతిగా నిర్ధారణము సేయవచ్చును. చెన్నపురి రాజధానిలో నుత్తరమునుండు గంజాము మండలములోని శ్రీకాకులమునుండి బయులుదేఱి తూర్పుసముద్రపుతీరము పొడవునను చెన్నపట్టణమున కుత్తరమున నున్న పాలయవేర్కాడు (ప్రళయకావేరి) వఱకునుబోయి యటనుండి బెంగుళూరునకును, అచ్చటనుండి తిన్నగా బల్లారికిని, పిమ్మట నుత్తరముగా హైదరాబాదునకును, తరువాత నాగపురప్రాంతము వరకును జుట్టివచ్చిన నీనడుమగల యావద్దేశ మాంధ్రదేశముగా బరిగణింపబడుచున్నది. అనగా గంజామును, విశాఖపట్టణమును, గోదావరియు, కృష్ణయు, గుంటూరును, నెల్లూరు మండలములును, చెంగలుపట్టుమండలములో గొంచెముభాగమును, చిత్తూరు లేక ఉత్తరార్కాడు మండలములో సగము భాగమును, అనంతపురము, కడప, కర్నూలు (కందనోలు) మండలములును, బల్లారిమండలములో కొంతభాగమును, నైజాము రాజ్యములో విశేషభాగము (అనగా నల్గొండ, ఓరంగల్లు, ఖరీమ్‌నగరు, మహబూబునగరము, మెతుకు, ఎల్లందలజిల్లాలును, ఇందూరు బీడరుజిల్లాలలో కొంతభాగమును) నాగపుర గోండ్వానాదేశములలో నొక కొంచెము భాగమును జేర్చిన నాంధ్రదేశమేర్పడి కొంచెమించుగ లక్షయుఁ బదునేడువేల మైళ్ల వైశాల్యముగలిగి యొప్పుచున్నది.

నైసర్గిక స్వరూపము.

ఈ దేశమునకు తూర్పుదెసను పర్వత పంక్తులుగలవు. వాటిని తూర్పు కనుమలందురు. ఇవి పడమటి కనుమలవలె నంత యున్నతములయినవి కావు. ఈ దేశము యొక్క మధ్యభాగము మిక్కిలి యెత్తుగనుండి తూర్పునకుఁబోయినకొలది ఏటవాలుగునుండును. తూర్పుకనుమలకును సముద్రమునకును నడుమ చక్కని సారవంతములయిన బయళ్లు కలవు. పురాణ ప్రసిద్ధమయిన మహేంద్రపర్వత మీ దేశము కుత్తరమున నున్నది. వానినే గంజాముజిల్లాలో మలయకొండ అనుచున్నారు. ఈతూర్పుకనుమలే మలయకొండలని నిమ్నగిరులని, పాలకొండలని గోలకొండలని, పాపికొండలని, వేలికొండలని ఆయాజిల్లాలయందు వేర్వేరు పేరులతో బిలువబడుచున్నయవి. ఇవిగాక నగరికొండలు,---కొండలు, శేషాచలపు కొండలు, నల్లమలె కొండలు, ఎఱ్ఱమల కొండలు మొదలగునవి పెక్కులు గలవు.

ఈ దేశము యొక్క యుత్తరభాగము ఋషికుల్య, వంశధార, నాగవళి, శారదా మొదలగునదులచేతను, దక్షిణభాగము గుండ్లకమ్మ, ----చిత్రావతి, పాపఘ్ని మొదలగునదులచేతను, మధ్యభాగము, కృష్ణా, గోదావరిమహానదులచేతను , ఇంద్రావతి, ప్రాణహిత, నగర, మంజీర, భీమ-- తుంగభద్రా మొదలగు వుప నదులచేతనుప్రవహింపబడుచు దేశమంతయు సారవంతమై యొప్పుచున్నది. ఈ నదులన్నియు బడమటబుట్టి తూర్పుగా ప్రవహించి సమద్రమునంగలియుచున్నవి. పీఠభూములు ప్రత్తి పండునట్టి నల్లమట్టి భూములుగానున్నవి.ఈ పీఠభూములయందచ్చటచ్చట రాళ్లగుట్టలును కాఱడవులును కలవు. ఈ దేశమునందు జలసమృద్ధములయిన చెరువులనేకములుగలవు.

శీతోష్ణస్థితులు.

ఈ దేశమునుం దుష్ణకాలమున నుష్ణమును, శీతకాలమున శీతమును అధికముగానుండునుగాని యుష్ణదేశమనియే చెప్పదగియున్నది. తూర్పుభాగమున కంటె నడుమను, బడమటను వర్షములు తక్కువగా గురియును. పీఠభూములు మిక్కిలి పొడిగానుండును. అరణ్యప్రదేశములదక్క తక్కిన తావులారోగ్యప్రదేశములై యొప్పుచున్నవి.

ఖనిజములు.

సమస్తలోహపదార్థము లీదేశమునం దుత్పత్తియగుచున్నవి. కోలారు లోను, హైదరాబాదులోను బంగారు గనులు గలవు. మంచియినుము పెక్కుచోట్లదొరకును. నేలబొగ్గు హైదరాబాదు రాజ్యమునందు విశేషముగాజిక్కుచున్నది. అభ్రకపుగనులు కూడపెక్కులు గన్పెట్టఁబడినవి. ప్రశస్తములయిన వజ్రముల కీదేశము ప్రసిద్ధికెక్కియున్నది.

జనసంఖ్యయు; భాషయును.

ఈ మహాదేశమిప్పుడు రెండుకోట్ల పదిలక్షలమహాజనులచే నిబిడీకృతమైయున్నది. వీరికిమాతృభాషయగు నాంధ్రము హిందూస్థానమునందలి దేశభాషలలో మూడవదియై మాధుర్యమునందు “ఇటాలియనుభాషను” బోలియున్నదని ఖండాంతరపండితులచే సహితము గొనియాడబడుచు దినదినాభివృద్ధిగాంచుచున్నది. ఇట్లాంధ్రదేశమునందు మాత్రమేగాక ద్రావిడ, కర్ణాటకదేశములందును నాంధ్రము మాటలాడువారలనేకులున్నారు. చెన్నపట్టణమునందుండెడి జనములలో నాల్గవవంతుకుఁబైగా జనులాంధ్రులుగ నున్నారు. ద్రావిడదేశమునందలి జమిందారులనేకు లాంధ్రభాష మాటలాడు నాంధ్రులుగ నున్నారు. ఈయాంధ్రులు పదునైదవ పదునారవ పదునేడవశతాబ్దములయందు విజయనగరపురాజులు దక్షిణదేశమునకు దండెత్తిపోయి పాండ్య, చోళ, కేరళ దేశముల నాక్రమించుకొని పరిపాలించిన కాలమున ద్రావిడదేశమునకుబోయి నాటనుండియు నచ్చటనే నివసించుచున్నారు. ఇంతియేగాక బొంబాయి పట్టణమునందును కాశీపట్టణమునందును బర్మాలోని రంగూను మోల్మేను(Moulmein) పట్టణములయందును నివాసము నేర్పఱచుకొనివసించునట్టి యాంధ్రులనేకులున్నారు. వీరికందఱికి నాంధ్రము మాతృభాషగానున్నను వీరందఱు నుచ్ఛారణమునందును నడవడులయందును స్థలభేదములను బట్టి భేదించియన్నారు. ఉత్కలదేశప్రాంతములవా రొకరీతిగను, ద్రావిడదేశప్రాంతములవారు వేరొకరీతిగను, కర్ణాటదేశప్రాంతములవారు మఱొకరీతిగను, మహారాష్ట్రదేశప్రాంతములవా రింకొకరీతిగను వేషభాషలయందు వేఱుపడి ఆయాదేశ సాంప్రదాయములను విశేషముగా గలిగియుండి భిన్నజాతులట్ల గన్పడెదరు గాని నిక్క మాలోచింప వీరెల్లరు నాంధ్రులే గాన వేఱుగా భావింపరాదు.

నాగరికత.

నదుల కానకట్టలు గట్టబడి కాలువలు త్రవ్వబడి దేశమునందంతట నదీజలములు ప్రవహింప జేయబడి యూషరక్షేత్రములు సహితము వరిపండునట్టి దివ్యక్షేత్రములుగా మార్పబడి నానా విధములయిన పంటలు పండింపబడుచున్నవి. ఇట్లు దేశము జలపూరితమై సర్వసస్యఫలప్రదం బగుటం జేసి జనాభివృద్ధిగలిగి వానితోఁబాటు పట్టణములు పల్లెలు ద్విగుణముగా త్రిగుణముగా నధికముగకాఁగా వాణిజ్యము హెచ్చినది. వాణిజ్యము హెచ్చినకొలది సౌకర్యము లెక్కువగ సమకూర్పఁబడినవి. మహానదులకు వంతెనలు గట్టబడి పర్వతములు దొలువబడి అయోమార్గములు నిర్మింపఁబడి పొగబండ్లు నడుపఁబడుచున్నవి. ప్రతి పెద్దపల్లెయందును లేఖావహన కార్యస్థానము (Post Office) నెల కొల్పబడినది. ప్రతిపట్టణనమునందును తంత్రులమూలముగా వార్తలను బంపు కార్యస్థానములు (Telegraph offices) నెలకొల్పఁబడినవి. బ్రిటీషుపాలనమున నాంధ్రులు విద్యాపరిజ్ఞానసంపన్నులై నానాట నాగరికతాభివృద్ధులనుగాంచి వర్థిల్లుచున్నారు. అభివృద్ధిఁ బడయుట కనుపయుక్తములగు సుగుణముల ననేకముల గలిగి యుండి యాత్మస్వాతంత్ర్యమునందభిలాష గలిగియుండియు నుద్రేకులుగాక ధైర్యముచూపవలసిన సత్కార్య సమయముల వెనుకంజవేయక శాంతమతులై నాగరికతయందు హిందూదేశమునందలి యేజాతివారికిని దీసిపోక సదా సంస్కరణాభిరతులయి మెలంగుచున్నారు. బ్రిటీషు పరిపాల నమునందింకను నత్యున్నస్థితి కాంధ్రులు వత్తురని విశ్వసించుటకుఁ బ్రబలహేతువు లనేకములు గలవు.

ఏదేశమిట్లు రమ్యహర్మ్యములతో నొప్పెడి పట్టణరాజములచేతను, పుష్పఫల భరితములగు నుద్యాన వనారామమలచే సొబగమీఱెడి పల్లెలచేతను, భూమిని సర్వసస్యాఢ్యగఁ జేయునట్టి మహానదీనదంబులచేతను, సారవంతములై సర్వసస్యాఢ్యములయిన సుక్షేత్రములచేతను, తామర తంపరయై నిరంతరము వర్ధిల్లుతుండెడి జనపరంపర చేతను, దివ్యక్షేత్ర మాహాత్మ్యముల బోధించెడి స్థలపురాణాద్యుద్గ్రంథసముదాయము చేతను, అలంకరించబడి దేవతల యుద్యానవనమో, పాలకుల ముంగొంగుబంగారమో, గృహస్థుల భూతల స్వర్గమో యన నాగరికతాభివృద్ధులఁ బెల్లుగ నతిశయించుతు నాంధ్రనామముచే వ్యవహరింపఁ బడుచున్నదో అట్టి యీ దేశము మూడువేలేండ్లకు పూర్వమొకప్పుడు ఘోరకిరాతావృత దండకారణ్య మధ్యగతమైన చీమలేని చిట్టడవిగనూ కాకిలేని కాఱడివిగను నుండినట్లు మనపూర్వగ్రంథములు చాటుచున్నవి.

  1. ఆంధ్రాక్షరతతత్త్వము, పొరట 45