ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/రెండవ ప్రకరణము
రెండవప్రకరణము
___
దండకారణ్య ప్రశంస.
మనపురాతన గ్రంథములలో శ్రీమద్రామాయణ మహాభారతములు మన పూర్వుల చరిత్రములను గొంతవఱకుఁ దెలుపుటకు సాధనములుగా నున్నవి. తన తండ్రియగు దశరథుడు కేకయ రాజపుత్త్రి కొసంగిన వరములదీర్చి తండ్రియాడినపలుకు దబ్బర గాకుండ నిలుపుటకై దేశములందును గ్రామములందును బ్రవేశింప నొల్లక పదునాలుగు సంవత్సరములు వట్టి యరణ్యమునందే నివసింప దీక్షవహించి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతముగా వచ్చి ఇప్పటి ఈ ఆంధ్రదేశ ప్రాంతములయందు నివసించినట్లును, అప్పుడీ ప్రాంతము ఘోరారణ్య ప్రదేశముగా నున్నట్లును శ్రీమద్రామాయణమునందుఁ దెల్పఁబడినది. అదియునుంగాక ఈ మహారణ్యప్రదేశముకు దిగువను కిష్కింధారాజ్య మున్నట్లుగూడఁ జెప్పఁబడినది. మరియును రావణుఁడు సీత నెత్తుకునిపోయినప్పుడామె మొఱ్ఱనాలకించి యాసాధ్వీమణిని రక్షింపవచ్చుటకుఁ గాని యామె యిచ్చెడు నానవాలును భద్రపఱచుటకుఁ గాని గోదావరి మొదలుకొని పంపానది వఱకు నామెకెవ్వరును గాన్పించి యుండలేదనియు గూడా దెల్పబడి యుండెను. పంపానది [1] కావలమాత్రము సుగ్రీవాదులు గాన్పించిరి. దీనింబట్టి రామాయణ కాలము నాటికి హిందూదేశము యుత్తరపు కొనయును దక్షిణపు కొనయును నాగరికులైన జనులచే నివసింపబడుచుండినదనియును, ఈ మహారణ్యమునం దనాగరికులయిన జాతులవా రచ్చటచ్చట నివాసము లేర్పరచు కొని యున్నను అధికభాగము నిర్జనారణ్యముగానె యుండెడిదని యూహింపవచ్చును.
దండకారణ్యగాధ.
ఈయరణ్యప్రదేశమునకే దండకారణ్యమని పేరుగలిగినది. పూర్వము వింధ్యాద్రి మొదలుకొని యంతటను నూరు యోజనములు ప్రమాణముగాఁ గలదేశమునంతను గిరాతులచేఁ జుట్టుకొనఁబడి యున్న దానిని దండుఁడనురాజు పరిపాలనము సేయుచునుండి యొకనాడు వేటకుంజని యరణ్యసంచారము సలుపుచు తన కులగురుఁడగు శుక్రుని కూతు సరజ యనుదానిఁ గాంచి మోహవివశుడై యామెను జెఱఁబట్టి యామె ఇచ్చకు వ్యతిరేకముగా బలాత్కరించెను. దానినంతయును శుక్రుఁడు కుమార్తె వలనం దెలిసికొని యాగ్రహించివాని దేశమున నేడు దినములు మట్టివాన గురియు నని శపించెను. ఆ శాపకారణమున నీ ప్రదేశమంతయు నిర్మానుష్యమగు దండకారణ్యమైనదనియు యుత్తర రామాయణమునఁ జెప్పఁబడినది. మఱియు నీ దేశము కిరాతజాతులచే నివసింపబడుచుండియఁ బూర్వకాలమునుంచే భార్గవానామక బాడబగోత్రజాతి (అగ్నిపర్వతముల) ముఖంబుననుండి వెడలఁ గ్రక్కంబడిన బురద వానచే నిర్మూలము చేయబడినదనిగూడఁ జెప్పఁబడినది. పూర్వమెప్పుడో యొకానొకప్పుడీ దేశ మగ్నిపర్వతముల చేత నాశము చేయఁబడినదని పై గాథ వలన మనకు సులభముగా బోధపడుచున్నది.
కొల్లేరు సరస్సు.
ఈ దండకారణ్య మధ్యమమున యోజనాయుతమైన (100 చతురపు మైళ్ళు వైశాల్యము) మహాసరస్సొకటి కలదనియు, అది జలవిహంగమములతో నత్యంత రమణీయమై యొప్పుచున్నదనియు దానియొడ్డున ఒక యాశ్రమము కలదుకాని యందెవరు లేరనియు, సమీపమునఁ బడియున్న శవము దినుట కేజంతువు లేదనియు, ఆ ప్రదేశమంత నిర్జంతుకముగా నున్నదనియు, నగస్త్యుఁడు శ్రీరామచంద్రునితోఁ జెప్పినట్లుగనుత్తర రామాయణమునఁ జెప్పఁ బడి యున్నది.[2] ఉత్తరరామాయణమునందు దండకారణ్యములోని పేర్కొనబడిన ఈ సరసెక్కడనున్నదని విచారింపగా నయ్యది యాంధ్రదేశము లోనిదిగా జూపట్టుచున్నది. ఏమన గొప్పదైదండకారణ్య మధ్యగతమై కొంగలకాకరమై యుండు తియ్యనీటికొలను మన యాంధ్రదేశములోనిదే కాని మైరియెచ్చటను గానరాదు. మరియు దండియు మహాకవి తన దశకుమార చరిత్రములో నీ యాంధ్రదేశము నభివర్ణింపుచు నిందిక మహాసరస్సుగలదనియు నది సారసనిలయమనియు నది యాంధ్రనగరికి[3] ననతి దూరముగానున్నదనియు బేర్కొని యుండుట చేత నట్లభివర్ణింప బడిన కొలను కొల్లేరుకాక మరియొక్కటి కానేరదు.[4]
"కొల్లేటి కొంగ"లను లోకోక్తియె కొల్లేటి కొంగలకు ప్రసిద్ధమను విషయమును వేనోళ్ళ జాటుచున్న దక్షిణ హిందూ స్థానమున నెన్నందగినపెద్ద తియ్య నీటి కొలను కొల్లేరు మాత్రమే యై దండి చెప్పినట్లుగా సలిల రాశి సదృశమై యాంధ్రనగరి యను వేంగీపురమునకు నాత్యాసన్నమై యున్నదనుటకు సందియము లేదు. 25 మైళ్ళ పొడవును 10 మైళ్ళ వెడల్పును గలిగి యున్నది. కాబట్టి ఇప్పటి ఆంధ్రదేశము దండకారణ్యములో నొకభాగముగా నుండెనని తేటపడుచున్నది.
పంచవటి.
అయినను ఆంధ్రదేశమును దండకారణ్యము నుండి తొలగించి దక్షిణా పథమన మహారాష్ట్ర దేశమనియు ఇప్పటి మహారాష్టము మునుపటి దండకారణ్యముగా నుండెననియు, అగస్త్యాశ్రమమునకు యోజన దూరము గోదావరితీరమున నుండిన పంచవటి యందు శ్రీరాముడు కొంతకాలము నివసించె ననియు, హిందూమత కర్మకాండ ప్రకారము నేమతికార్య మాచరించినను తమదేశము పేరు చెప్పుకొనుట నాచారముగావున సంకల్పము చెప్పునప్పుడు మహారాష్ట్ర దేశస్థులు మహారాష్ట్రదేశము పేరు చెప్పుకొనక దండకారణ్య దేశే" యని దండకారణ్యము పేరు మాత్రమే చెప్పుచున్నారనియు గోదావరితీరమునందలి నాసిక పట్టణము పంచవటి అని చెప్పుకొనబడుచున్నదనియు గోదావరి ప్రవహించెడి సహ్యాద్రియొక్క యుత్తర భాగమైన గోవర్ధనము పురాణములందభి వర్ణింపబడినదనియు భరద్వాజుడు తన భార్యను సంతోషపెట్టుటకై గోవర్ధమున నొక ఆరామము నిర్మించెననియు గోవర్ధనము పురాణములయందు పట్టణముగాను పర్వతముగాను గూడ చెప్పబడుట చేతను గోవర్ధనమను గ్రామమొకటి నాశికపట్టణ సమీపమున నుండుటచేతను నాసికపట్టణమే పంచవటియని పురాణములు సమర్ధించుచున్నవిగా గ్రహింప వలసినదనియు డాక్టరు బండార్కరు గారు తమదక్షిణాపథ దేశ పూర్వచరిత్రమునందు జర్చించి యున్నారు.[5] మహారాష్ట్రము దండకారణ్య దేశము నుండి యాంధ్రదేశము దొలగించుటకును పంచవటి యన నాసికపట్టణమే యని నిర్ధేశించుటకు సాహసింపరాదని నిస్సంశయముగా జెప్పగలము. సంకల్పము చెప్పునప్పుడు "దండకారణ్యదేశే"యని చెప్పుకొనునది యొక్క మహారాష్ట్ర దేశస్థులు మాత్రమే కాదు. ఆంధ్రదేశస్థులు, అందుముఖ్యముగా కృష్ణాగోదావరీ మధ్యఖండమున వారు సహితము జెప్పుకొనుచున్నారు. ఇట్టి యాచారము ముండుటచేతను పైగ్రంథములలో నుదాహరింపబడిన దండకారణ్య వర్ణనలచేతను ఆంధ్రదేశము కూడా దండకారణ్యము లోనిదే యని విస్పష్టముగుచున్నది. ఇంతియుగాక పంచవటి కొందరు చెప్పినట్లు మహారాష్ట్ర దేశమునందుగాక యిప్పటి యాంధ్రదేశమునందే కలదని యాంధ్రుల యభిప్రాయమై యున్నది. శ్రీమద్రామాయణము నాసికపంచవటి వారి వాదము నెంతమాత్రము సమర్ధించుచుండలేదు. రామాయణమునందును భవభూతికృతమగు నుత్తర రామచరిత్రమునందును పంచవటి కడ గోదావరి వెడల్పుగానున్నట్లు చెప్పబడియున్నదని వారే యొప్పుకొనుచున్నారు . జన్మస్థానమునకు సమీపమునందున్న నాసికయం దట్లుకాదని జగద్విదితమైన విషయముగాన వేరు నుడువంబనిలేదు. ప్రస్తుతము గోదావరి మండలములోని భద్రాచలమునకు సమీపమున నున్న పర్ణశాలయే పంచవటియని యాంధ్రులు విశ్వసింపు చున్నారు. వాల్మీకి రామాయణములోని వర్ణననుబట్టియు, ఆధునిక విద్వాంసుల యభిప్రాయమునుబట్టియు, చూడగా వీరి నమ్మికయె నిజమైనదని తోచుచున్నది. రామాయణములోని పంచవటియే నాసికాపట్టణమగునేని రాముడు చిత్రకూటము నుండి నాసికకు వచ్చునప్పుడు మధ్యను వింధ్యపర్వతమును నర్మదానదియును దగులక మానవు. ఈ నదియును పర్వతముగూడ రాముని మార్గమున నున్నట్లు వాల్మీకి రామాయణమునందు వర్ణింపబడినదిశలను జూచినపక్షమున పర్ణశాల హిందూదేశమునకు దూర్పు ప్రక్కను నుండవలసినట్లూహింపవలసియున్నది. శ్రీరాముని దండకారణ్య మార్గమీక్రిందిరీతిగ నున్నది.
శ్రీరాముని దండకారణ్య మార్గము.
" సీతాలక్ష్మణ సమేతముగా శ్రీరాముడయోధ్య నుండి బయలుదేరి భరద్వాజాశ్రమమునకు వచ్చియుండెను. భరద్వాజాశ్రమము ప్రయాగలోను న్నది[6]. అచ్చట నొకరాత్రముగడపి వారు చిత్రకూటముకు వెళ్ళిరి. చిత్రకూటము ప్రయాగకు పది క్రోశముల దూరము మీద నుండెను.[7] ఇప్పటిలెక్కననుసరించి ప్రయాగకు చిత్రకూటము డెబ్బైయైదు మైళ్ళదూరమున ఉన్నది. ఇందువలన రామాయణములోని క్రోశమునకు నేడున్నరమైళ్ళు సరిగానుండునని మనమూహింపవలసియున్నది. ఈ చిత్రకూటముకు సమీపమున మందాకినీ యనునది యున్నట్లుగ జెప్పబడినది. ఇప్పుడును నా పేరుగలనదియే యాపర్వతముకడనున్నది. కనుక బ్రస్తుతము ప్రయాగపట్టణముకు బశ్చిమమున డెబ్బైయైదు మైళ్ళదూరమునున్న చిత్రకూటమను పర్వతమే రామాయణములోని చిత్రకూటమని నిశ్చయించుటకు సంశయింప బనిలేదు. అచ్చటి నుండి వారు మూవురు నాగ్నేయదిక్కునకు బోయి "అత్రిమహర్షి" యొక్క ఆశ్రమమున బ్రవేశించిరి. ఆశ్రమమనగా కొన్ని ముని పల్లెల సమూహమే కాని యొక పర్ణశాల కాదు.
ఆకాలమునందొకానొక మహర్షి నాశ్రయించి యనేకశిష్యులు సమీప ప్రదేశములజుట్టును గుటీరముల నిర్మించుకొని నివసించుచుండెడి వారు. అట్టి మునిపల్లెలనియు మహర్షి యొక్క యాశ్రమమని పిలువబడు చుండెడని. అత్రిమహర్షి యొక్క యాశ్రమము మిక్కిలి విశాలమైనదిగ నుండెను. ఇయ్యది ప్రస్తుతపురీనాప్రాంతముయొక్క దక్షిణసీమవరకు వ్యాపించెనని చెప్పవచ్చును. అత్రిమహాముని భార్య యనసూయ యనునామె. అనసూయకును సీతకును జరిగిన సంవాదము మిక్కిలి జ్ఞానప్రదమైనదిగ నున్నది. వీరిచ్చటనున్న కాలమున ౠషులు గొందరు వచ్చి తమకు రాక్షసుల వలన గలిగెడు బాధలను మాన్పుమని కోరగా రాముడొక మహారణ్యమున బ్రవేశించెనని తెల్పబడినది.[8] ఈ యరణ్యమే దండకారణ్యముగానున్నది. ఇది మిక్కిలి విస్తీర్ణమైన అరణ్యము.అసంఖ్య ఋ
- రెండవ ప్రకరణమ
ష్యాశ్రమములును అనేక అనేకరాక్షస నివాసస్థలంబులు నిందుండెను. ఈ దండకారణ్యమునకు నుత్తరమున గంగానదియొక్క దక్షిణపుతీరమునువింధ్యపర్వతమును, పశ్చిమమున వింధ్యను, అత్రాశ్రమము దక్షిణకొసలను, మలయాద్రియు దక్షిణమున కిష్కింధారాజ్యమును ద్రవిడ పాండ్యరాజ్యములును తూర్పున నుత్కలకళింగాధ్రచోళదేశములు నుండెను. ఈ దండకారణ్యములో రామునికి ద్రోవజూపుటకు ఋషులు కొందరు వెంటనడిచిరి.[9] రామునికి మార్గమున ననేక ఋష్యాశ్రమములు దగిలెను. కొంతదూర మరిగినతరువాత విరాధునివాసముగానిపించెను. ఇది దండకాంతర్గతము. ఇది మధ్యపరగణాలోని "బిలాసపూరు" జిల్లాలో నీశాన్యపు దిక్కున నున్నది.
ఇచ్చటి నుండి యర్ధయోజనముమీదననగా బదునైదు మైళ్ళదూరమున శరభంగాశ్రమముండెను.[10] ఈ యాశ్రమము వనమునకు దక్షిణమున నాజిల్లాలోనే యుత్తరభాగమున నీశాన్యపుమూలనుండినట్లు గానవచ్చుచున్నది. రాముని దర్శనమైన తరువాతశరభంగు డగ్నిప్రవేశము జేసెను. అచ్చట రాముని జూడ మునులనేకులు వచ్చి రాక్షసులచే జంపబడిన ఋషుల యస్తుల ప్రోవులను జూపగా వారలందరినీ రక్షించెదనని రాము డభయహస్తమునొసగి యచ్చటనుండి సుతేక్ష్ణాశ్రమముకు బోయెను.[11] ఆయాశ్రమమున ఒక రాత్రముండి తరువాత నక్కడనుండి బయలుదేరి త్రోవలో నాశ్రమములు పెక్కింటిని గనుగొనుచు బోయెను. కొంతదూరము గొంతదూరము పోవునప్పటికి నొక గొప్ప సరోవరము గానిపించెను. దానికే పంచాప్సరో మని పేరు. రామునకు దారి జూపుచున్న ధర్మభృతు డనుఋషి యాసరోవరము గూర్చిన యితిహాసముగొన్నింటిని వారికి జెప్పెను. మాడపర్ణి ఋషియొక్క తపస్సుచే సరోవరము నిర్మించబడెనట.[12] ఈ పంచాప్సర సరోవరము బిలాసపూరు జిల్లాలోనిది. కొన్ని హేతువులం గనంబరచి జనరల్ కన్నింహ్యాం దొరగారు నిశ్చయించి యున్నారు.[13] మరియును కాళిదాసుచే మేఘసందేశమునందు వర్ణించబడిన యక్షునినివాసస్థలమగు రామగిరి[14] యీ యాశ్రమప్రాంతముననే యుండెనని కొందరు విద్వాంసుల యభిప్రాయమై యున్నది.
సుతీక్ష్ణాశ్రమమునకుదక్షిణమున నాలుగుయోజనముల మీదననగా 120 మైళ్ళ మీదనగ స్త్యమహాముని భ్రాతయొక్క యాశ్రమముండెను. ఈ యాశ్రమము రాయపూరు జిల్లాయొక్క దక్షిణభాగమున బస్తరు సంస్థానం యొక్క యుత్తరభాగమున వ్యాపించి యుండెనని రామాయణములోని వర్ణనవలన మనమూహింపవలసి యున్నది. ఈ యాశ్రమమున దక్షిణమున నొకయోజనము (30 మైళ్ళు) మీద నగస్త్యాశ్రమముండెను. ఈ యాశ్రమము బస్తరు సంస్థానమునకు దక్షిణభాగమునం దుండెను. అగస్త్యాశ్రమనకు దక్షిణమున రెండామడల దూరమున ననగా నరువది మైళ్ళదూరమున బంచవటీ ప్రదేశమును గోదావరీ నున్నవి. పంచవటి కొంతవరకు నరణ్యప్రదేశమగుటం జేసి గోదావరి సమీపమున బర్ణశాల నిర్మించుకుని సీతారాము లక్ష్మణులు కొన్ని దినములు నివసించి యుండిరి. ప్రస్తుతపు గోదావరిమండలములోని భద్రాచలమునకు సమీపమున నున్న పర్ణశాలయను గ్రామములో శ్రీరాముని పర్ణశాలయుండెనని యాంధ్రుల యభిప్రాయమై యున్నది. రాముడు పంచవటిలో నుండగాశూర్పణఖ వచ్చి యాతని మోహించుటయు, లక్ష్మణుడు దానిముక్కు చెవులు గోయుటయు, ఖరాదిరాక్షసులను జంపుటయు మొదలుగాగల కథ యంతయు నడచినది ఈ ఖరాదులందరును జనస్థానమందుండిరి.
కావున నీజనస్థానమనునది యెద్దియో మనము దెలిసికొన వలసి యున్నది. మధ్యపరగణాలోని రాయపూర్ (రాయపురము) జిల్లా యొక్కయు బస్తరు సంస్థానం యొక్కయు బూర్వభాగము సంబల్ పూరు (సంబళ పురము) జిల్లాలోని చాలాభాగమును, చెన్నరాజధానిలోని జయపురసంస్థానాంతర్గతమై గోదావరికి నుత్తరమునున్న కొంతభాగమును, గోదావరికి దక్షిణముగానున్న నైజాము రాజ్యములోని చాలభాగమును ఈ జనస్థానమును లోనివిగా గానవచ్చుచున్నవి. రావణుని తమ్ముడగు ఖరుడీజనస్థానమున కధిపతిగా నుండెను. వీని రాజధాని ఖరాలయము. రాయపూరు జిల్లాలోని "ఖరియా" లనునదియే ఖరాలయమని చెప్పబడుచున్నది. సంబలవూరనునదియె వాల్మికిచే వర్ణించబడిన శంబరపురమని చెప్పబడుచున్నది. పంచవటీ ప్రదేశముగూడా జనస్థానాంతర్గతమైనదిగ గానంబడియెడు పర్ణశాలనుండి రావణుడు సీతనెత్తుకు పోయిన కథ సర్వజనవిదితమైనదే గోదావరికి నుత్తరమున బంచవటీ ప్రదేశమునందును జనస్థానమునందును సీతను వెదికి వెదికి వెదికి గోదావరియొడ్డున కొంతదూరమరిగి పర్ణశాలకు దూర్పున భద్రాచలముకడ రామలక్ష్మణులు రామలక్ష్మణులు గోదావరి నదిని దాటిరి. అటనుండి దక్షిణముగా జనస్థానమున గొంతదూరము ప్రయాణము చేసిన తరువాత జటాయువు గలుసికొనియెను. అచ్చటనుండి పశ్చిమదిశను నైఋతిదిశను నడిచి జనస్థానారణ్యముదాటిన తరువాత సూటిగ దక్షిణదిశకు బోయిరి.[15][16][17] జనస్థానా నంతరమున మూడుక్రోశులమీద గ్రుంచారణ్యముదగిలెను. ఇది నైజాము రాజ్యమునకు నైరుతముననుండెను. ఈ యరణ్యము విడుచుటకు బూర్వము మూడుక్రోశములు తూర్పుదిక్కునకు బోయిన ఇచ్చటనే వీరికి గబంధుడడ్డుపడెను. వాడు చెప్పినందున వారిరువురు పశ్చిమదిశకు బంపరు బోయిరి. పంచవటినుండి పంపానది వరకు వాల్మీకి రామాయణములో నిచ్చిన యీదిశలను బట్టి చూచినను నవి భద్రాచలమునకు సమీపమునందలి పర్ణశాలకుననుకూలముగా నున్నవే కాని నాసిక పట్టణము పంచవటియని గాని జనస్థానమని కాని యనుకొనుటకు ననుకూలముగా లేవు. ఋష్యమూకమును, మాల్యవంతమును, కిష్కింధము మొదలైన ప్రదేశములన్నియు హంపీ విరూపాక్షము సమీపమందలి పర్వతాదులని యందరి యభిప్రా యమై యున్నది.[18] కాబట్టి యాంధ్రదేశము దండకారణ్యములోనిది పై బేర్కొనబడిన శ్రీరాముని మార్గమువలనే తేటపడుచున్నది. ఇంకనాంధ్ర దేశ మెట్లు నాగరికతగాంచి యెప్పటినుండి ప్రఖ్యాతికి వచ్చినదో వీనిం గూర్చి మనము విశేషముగా జర్చించి దెలిసికోవలసి యున్నది.
- ↑ పంపానదియే తుంగభద్రానది. రామాయణమందు పంపా పంపాసరమని వర్ణింపఁబడినవి. బళ్ళారి జిల్లాలో హంపీ, హంపీసాగరమను పేరఁ హిందూదేశ కథాసంగ్రహము. ప్రథమభాగము 58వపొరట
- ↑ "నాం త్రేతాయుగే రామ బభుాన బహువిస్తరం | సమంతా ధ్యోజన శతం మృగపక్షి విసర్జతం | తస్మి న్నిర్మానుషేరణ్యే కుర్వాణ సప్త ఉత్తమం అహ మాక్రమితం సౌమ్య మధారణ్య ముపాగమం | తస్యరూప మరణ్యన్య నిర్ధేషుం మైన శత్నుమః| తస్యారణ్యన్య త మధ్యేతు సరోయోజన మాయతం | హంసకారండవాకీర్ణం చక్రవాకో సశోభితం | సమీపేతస్య సరసో మహా దద్భుత మాశ్రమం | పురాణం పుణ్య మత్యుర్ధంతసర్వజన వర్జితమ్ | "
- ↑ " అయాసిషందిసైః రైశ్చిదంధ్రనగరం | తస్యనాత్యానన్నే సలిలరాశిసదృశ్యస్య కలహంస గణదళసంసాతిగళిత కింజల్క శకలశారస్య సారసశ్రేణి శేఖరన్య సరసస్తీరకాననే కృతనికేతనస్థ్సి తః|"
- ↑ ఆంధ్రనగరియనునది యోరుగల్లు పట్టణమనియు, అందభివర్ణింపబడిన సరస్సామీపమున నెచ్చటనో యున్నదనియు కొందరు చెప్పుచున్నారు.
- ↑ Dr Bhandakar's Early History of Deekhan. sec 1-2-3.
- ↑ వాల్మీకి రామాయణము, అయోధ్యాకాండము 45సర్గము మొదలు 54 వరకు
- ↑ (అయోధ్యా 54-78) 3 (అయో 95)
- ↑ (618 అధ్యా 16-22)
- ↑ (అరణ్య 18 సర్గము)
- ↑ (28-38-48 సర్గములు)
- ↑ (68 సర్గము)
- ↑ (11 సర్గ 1-20)
- ↑ Archeological Reports vol.XI
- ↑ (మేఘసందేశము 1 వ శ్లోకము).
- ↑ ( 62-4-56)
- ↑ ( 69-1-2)
- ↑ ( 64
- ↑ హిందూదేశకథాసంగ్రహము, ప్రథమభాగము, పొరట 53-58