Jump to content

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము

ఆంధ్రదేశ ప్రశంస.

ఇప్పుడు మన మేభూభాగము నాంధ్రదేశమని పిలుచు చున్నారమో యాభూభాగము పూర్వము దండకారణ్యములోనివని చెప్పబడినంతమాత్రమున నాకాలమున నాంధ్రదేశముగాని యాంధ్రులుగాని యిచ్చటలేరని యూహింపరాదు. ఆంధ్రులు ప్రాచీనులేగాని నవీనులుగారు. దేశములలో మిక్కిలి ప్రాచీనమైనదగు ఋగ్వేదమందలి తైత్తరీయ బ్రాహ్మణమునందు నాంధ్రుల ప్రశంసగలదు. ఆం దాంధ్రుల నాగరికారణ్యక జాతులలో జేర్పబడియుండరని యీ క్రిందివాక్యము వలన బోధపడగలదు."శ్రు. తస్యవావిశ్వామిత్రస్యేక శతంపుత్రాఅనుః - పంచాశదేవజ్యాయాం సో మధువందనః పంపాశత్కనీ మాన్తస్తద్యేజ్యాయాంపోనతే కుతలం మేనిరే. తానను వ్యాజాహారాంతాస్వః ప్రజాభక్షిష్టేతి తనీతేంద్రాః పుండ్రాః శబరాః పులిందామూతిబా ఖత్యుదంత్యా బహవోబహతి" [1] విశ్వామిత్రఋషి తనపుత్రులలో నేలచుండ్రయొక్క సంతతిని ఆర్యాశ్రమములయొక్క సరిహద్దులలో నివసించునట్లుగా శపించననియు వారలే ఆంధ్రులనియు, పుండ్రులనియు, శబరులనియు, పులిందులనియు, మూతిబాలనియు, పిలువబడుచున్నారనియు, విశ్వామిత్రుని సంతతివారలే దస్యులలో నధికభాగముగా నేర్పడిరని తెలుపబడినది. వీరెల్లరును దక్షిణమున, నివసించుచుండిన వారని చెప్పబడుచున్నారు. పులిందులును శబరులును, వింధ్యపర్వతప్రాంత భూములయందు నివసించియుండినారని నవీనగ్రంధముల వలన దెలియుచున్నది. వింధ్యపర్వతారణ్యములలో శబరులున్నారని బాణకవి తన కాదంబరి యందు వ్రాసియున్నాడు. ఆంధ్రుల కృష్ణా గోదావరులనడుమనుండెడి యరణ్య ప్రదేశమున తూర్పుభాగమున ననగా నిప్పటి కృష్ణామండలమున నివసించుచుండెడి వారని చరిత్రకారులనేకు లభిప్రాయపడియున్నారు. కృష్ణా గోదావరుల నడుమనుండెడు నరణ్యప్రదేశమే యాకాలమునం దాంధ్రదేశముగా నుండెను. రామాయణ మహాభారతముల నాటికి దక్షిణాప్రదేశమున నాంధ్రదేశము లేదనియు ఇప్పటి యాంధ్రదేశము బహు నవీనమైనదనియు, ఆంధ్రులు మగధదేశ సమీపమున గంగాతీరమునందుండి నాగరీకులై క్రమక్రమముగా దక్షిణమునకు వచ్చి యీదేశమును జయించి యాక్రమించుకొనిరనియు, అప్పటి నుండి నీదేశమునకాంధ్రదేశమని పేరు వచ్చినదనియు కొందరు పాశ్చాత్యులు మాత్రమే గాక మనవారు కూడా కొందరు తలంచుచుండిరి. మరియును శ్రీరామాయణమునందీ ప్రదేశము దండకారణ్యముగా జెప్పబడుటచేతను శ్రీరాముని మార్గమునం దీదేశము బేర్కొనబడ కుండుటచేతను, రామాయణములోని కిష్కింధా కాండములో నాంధ్రాది దేశముల ప్రశంస దేశములదెల్పుచోట గలిగియున్న నది ప్రక్షిప్తముగా గ్రహింపవలసి యున్నదనియు ఇక మహాభారతమును బట్టి చూచినను నీ ప్రదేశము మరణ్యమనియె తోచుచున్నదనియు, అర్జునుడు తీర్ధయాత్రకు బయలుదేరి మహేంద్రపర్వతము[2] వరకును తీర్ధములను దేశములను ఆయతనములను జూచుచు వచ్చి దాని దాటిన తరువాత మణిపూరము వరకును సముద్రతీరమున బడిపోయి మరల మణిపూరము [3]మొదలు పట్టణములను, మేడలను, మిద్దెలను తీర్ధములను జూచినట్లు చెప్పబడినది గాని యాంధ్రదేశము చెప్పబడ లేదనియు ఇందును దేశముల దెల్పుచోట నాంధ్రాదిదేశముల ప్రశంసకలదు కాని యదియును ప్రక్షిప్తమని పైవిషయము వలనే బోధపడగలదనియు, కావున మహేంద్రపర్వతమునకును బాండ్యదేశమునకును నడుమ దేశములేదని కొందరు తలంచుచున్నారు[4] గాని యది విశ్వసనీయముగాదు. పైనుదహరింపబడిన యైతరీయ రచనమునుబట్టి యాంధ్రులను నవనాగరీకారణ్యకజాతివా రొకరుకలరని తేటపడినది ఆయానాగరికాంధ్రులు నివసించుదేశమే యాంధ్రదేశ మనంబడుచున్నది. నాగరీకులు వసింప శక్యముకాని యంధకార బంధురమైన మహారణ్య ప్రదేశము నందు నివసించెడువా రగుటచేతనే యార్యులు వీరిదేశము నాంధ్రదేశమనియు వీరిని నాంధ్రులనియు నాడుదువచ్చిరి. అనాగరికులయిన యాంధ్రులు నివసించు దేశమున మిద్దెలు, మేడలు, నెట్లుగాననగును? అనాగరికదేశమునందు బుణ్యతీర్ధములెట్లుగాననగును? అర్జునుడు ప్రశంసింపక పోయినంతమాత్రముచేత నప్పటియనాగరికాంధ్రదేశము లేదనుకోవచ్చునా? మహాభారతము సభాపర్వమునందును, రామాయణము కిష్కింధకాండములోను నాంధ్రులు దక్షిణాపథముననున్న వారని తెల్పబడియుండలేదా ? [5] కాబట్టి రామాయణ మహాభారతములనాటికి దక్షిణాపథమున నాంధ్రులు లేరని ఆంధ్రదేశము లేదని చెప్పుటసొహసము. ఆంధ్రులున్నారని యొప్పుకొనుచు నాంధ్రదేశము లేదనుట మహాసాహసము. ఆంధ్రదేశము లేదనరాదుగాని అప్పటి కప్రసిద్ధమై అనార్యమై అరణ్యప్రదేశమున నున్నదని యొప్పుకొనక తప్పదు.

ఈ భాగమునందు దాంధ్రదేశము లేకుండుటచేతనే కాళిదాసు తన రఘువంశమునందు కళింగదేశమును పాండ్యదేశమును వర్ణించి నడుమనున్న యాంధ్రదేశమును వర్ణింపకుండెనని చెప్పుదురు కాని కొంచె మించుమించుగ గాళిదాసుని కాలమునందే యుండిన వరాహామిహిరాచార్యులు తన బృహత్సంహిత కూర్మ విభాగమునందు నాంధ్రదేశమును బ్రశంసించియే యున్నాడు.[6] అశోకుని శాసనములలో నెచ్చటను ఆంధ్రరాష్ట్రముల ప్రస్తావము లేశము లేదనియు"బహుశః" అప్పటికా హిందూభూభాగము బొత్తుగా నాగరికతలేక కొండకోయలకు నివాసస్థానమైన యుండనోపు నని డాక్టరు బర్నెలుగారు తమ ప్రాచీనలిపి శాస్త్రములో వ్రాసియున్నారు. [7] ఈ బర్నెలుగారి లేఖనమును జూచి భ్రమపడియె కాబోలు"అశోకుని శాసనములలో పెక్కు బలుతావుల బాండ్యచోళాదుల ప్రశంస కలదు. అప్పటికాంధ్రదేశమే యున్న ఎడల దీని ప్రశంస లేక యుండదు. అశోకుని కాలము క్రీస్తుశకమునకు బూర్వము సం|| 320అయిఉన్నది. అప్పటికీ భూభాగము వట్టి యరణ్యప్రదేశము. గాని జననివాస యోగ్యంబగు దేశము కాదు. ఈ సంగతినే మన గ్రంధములును దెలుపుచున్నవి." అని యొకరు వ్రాసియున్నారు. [8]

అశోకుని కాలము నాటికి నాంధ్రులు నాగరికులై పల్లెలు పట్టణములు దుర్గములు నిర్మించుకుని రాజ్యములు స్థాపించి ప్రభుత్వములు సేయుచుండి రనుటకు నశోకుని శాసనములే సాక్ష్యమిచ్చుచున్నవి. అశోకుని శాసనములో నాంధ్రుల ప్రశంస లేదనుకొనుట పొరబాటు. తనరాష్ట్రములోని వారల వలెనే యవనులును కాంభోజులును, నాభకులును, భోజులును, పైకాణితులును, ఆంధ్రులును, పుళిందులును, తనచే బ్రకటింపబడిన బుద్ధ ధర్మమును నవలంబించిరని 13వ శిలాశాసనమున నశోకుడు వ్రాయించెను. ఇంతియగాక యశోకుని పితామహుడు మౌర్యవంశస్థాపకుండునునగు చంద్రగుప్తుని యాస్థానమునం దున్న మేగాస్థనీనను రాయబారి యాంధ్రరాజ్యము మహోన్నత దశయందున్నట్లును ఆంధ్రరాజ్యమునందప్పుడు ముప్పదిదుర్గములును లక్షకాల్బలములును రెండువేల యాశ్వికులును వేయి యేనుగుల బలముండెనని వ్రాసియున్నాడు. ఈ విషయ మునే ప్లీని మొదలగు విదేశీయులైన చరిత్రకారులు వక్కాణించి యున్నారు. కాబట్టి అశోకుని కాలంనాటి నాంధ్రులు నాగరికు లయియుండిరనుటకు సందియములేదు.

ఆంధ్రరాజులు మగధరాజ్యమును బాలించుచుండిన కాణ్వాంశజులను జయించి తద్రాజ్యము నాక్రమించుకొని నాలుగువందల యెనుబదియారు సంవత్సరములు నిరంకుశముగా బరిపాలనము చేసెనని పురాణములయుండియె పేర్కొనంబడి యుండుట చేత బాశ్చాత్యపండితులు ఆంధ్రులు గంగాతీరవాసులుగా బరిగణించి వాదోపవాదములను సలిపి గ్రంధసామాగ్రిని ఏర్పాటుచేసి క్రొత్తచిక్కులను గల్పించిరి. "ఆంధ్రులు ఆంధ్రజాతీయులు, ఆంధ్రభ్రుత్యులూ" అనివరుసగా వేర్వేరువంశనామములతో గంగాతీరమున --- నిరంతరముగా రాజ్యపాలనచేసి క్రమక్రమముగా తూర్పుతీరమంతయు నాక్రమించుకుని తుదకు కృష్ణాగోదావరుల నడుమ ధాన్యకటక దేశమును స్థాపించి పాలించిరనియు, వారుపోయిన విధముగాని కాలముగాని సరిగాదెలియరాదని విల్ఫర్డుగా రాంధ్రులనుగూర్చిన వ్యాసములో వ్రాయుచున్నారు.[9] దక్షిణహిందూస్థాన నాణెములచరిత్రము వ్రాసిన సర్ వాల్టరు ఎల్లియాట్ దొరగారు కూడా క్రీస్తుశకమునకు బూర్వము మూడవ శతాబ్ధమున గడపటిసారి వచ్చిన ద్రావిడులు మగధరాజ్యమునకు దూర్పున గంగానదీ ప్రాంతభూములు యందు గొంతకాలము నివసించి పెక్కు తెగలుగ నేర్పడిరనియు వారిలో[10] ముఖ్యులయినయాంధ్రులను కాళింగులును ప్రభుత్వములు చేసి శకనులతో బోరు పడలేక తూర్పుతీరముకు వచ్చిరనియు, వారిలో గాళింగులు గోదావరికి నుత్తరమున, ఆంధ్రులు కృష్ణా గోదావరులనడుమను స్థిరనివాసము లేర్పరచుకునిరనియు దరువాత గృష్ణాతీరమునందలి ధాన్యకటకమును రాజధానిగ జేసికొన యాంధ్రులు పశ్చిమ సముద్రమువరకు నాక్రమించి జగద్విఖ్యాత పరిపాలనము చేసిరని వ్రాసియుండిరి.[11] వీరు తమవాదమునకు బలముగా నుండుటకై ప్లీనీ వ్రాసినదానికి ప్రమాణముగా జూపుచున్నారు అయినను గంగానదికి దూరముగా నాంధ్రులుండిరని ప్లీనీ వ్రాయుచున్నాడు. సముద్రముకు మగధరాజ్యముకు నడుమ నాంధ్రరాజ్యముండుట యసంభవము. ఆకాలమందలి భరతఖండమునందలి రాజ్యములలో చంద్రగుప్తుని మగధరాజ్యము మేటి యని చెప్పదగియున్నది. ఆరులక్షల కాల్బలముతోను ముప్పదివేల యాశ్వికబలముతోను నొప్పియుండిన యీరాజ్యము ప్రక్కను లక్షకాల్బలమును, రెండువేలా శ్వికబలమును మాత్రము గలిగియుండిన యాంధ్రరాజ్య ముండుట పొసగనేరదు. ఈ యభిప్రాయముగానే జనరల్ కన్నింహ్యాం దొరగారు కూడా దెలిపియున్నారు.[12] ఇంతియగాక యశోకుని 13వ శిలాశాసనమందు "ఆంధ్రపుళిందేష్" అని యాంధ్రులు దక్షిణముననున్న పుళిందులలో జేర్పబడియున్నారు. ఆంధ్రులు గంగా తీరమునందుండిరిని యూహించుటకాధారము మగధరాజ్యము నాంధ్రరాజులు పాలించిరని పురాణములందు బేర్కొనబడుట తప్ప వేరొండు ప్రమాణము గానరాదు. మరియును క్రీస్తుశకము మొదటి శతాబ్దమున కనిష్కుడను శకరాజు మగధరాజ్యము ను జయించి నట్లును వాని సంతతి వారు కొంతకాలము దానిని పరిపాలించినట్లును నిటీవల నూతనముగా గనుగొనబడిన మధురలోని యొకశాసనము బట్టియు జిరకాలము నుండి యాంధ్రులు దక్షిణదేశమున

నున్న వారని నిశ్శంకముగా నుడువవచ్చును. కృష్ణాగోదావరి నదీ ప్రాంతములందు వారు నెలకొల్పిన బౌద్ధసంఘారామములును స్థూపములును శిధిలములయ్యును నేటికిని గన్పట్టుచు నాంధ్రులయునికిని వేనోళ్ళ జాటుచున్నవి. ఐతరేయబ్రాహ్మణ కాలము నాటినుండి యాంధ్రులు దక్షిణాపథదేశమునందలి ప్రాగ్దిశనున్న యరణ్యప్రదేశములో నివసించు ననాగరికులుగానుండి క్రమక్రమముగా గాలము గడచినకొలది నాగరికులయిన ద్రావిడులయొక్కయు నార్యులయొక్కయు సహవాసము గలిగి వారలసంపర్కంబున దామును నాగరికులై పల్లెలు పట్టణములు నిర్మించుకొని బ్రజాస్థాపక సంఘముల మూలమున దొరతనము సేయుచు దరువాత నిరంకుశులై రాజ్యములు స్థాపించి తొల్లింటి రీతులను విడిచి నిరంకుశాధికారులయిన నాయకులకు దలయొగ్గి దొరతనము విడిచి పెట్ట వారలు విజృంభించి పశ్చిమమున మహారాష్ట్ర ఘూర్జరమాళ్వ కరూశకోశలాది దేశములను నుత్తరమున, కళింగమగధములను జయించి యాంధ్రరాజ్యము నానాదిశల వ్యాపింపజేసి విఖ్యాతయశులైరి. వీరికి దొలుత కృష్ణతీరమునందలి శ్రీకాకుళమును[13] దరువాత ధాన్యకటకమును[14] రాజధానులుగా నుండెను. రాజులు ధాన్యకటకమున బరిపాలనము సేయుచుండ యువరాజులు మహారాష్ట్రమునందు గోదావరీ తీరమునందుండిన ప్రతిష్ఠాన పురము [15]నందుండి ప్రభుత్వము సేయుచుండిరి. ఆంధ్రభృత్యవంశములో నొక తెగవారు శ్రీశలముకు సమీపమున జంద్రగుపపట్టణము రాజధానిగ జేసికొని పరిపాలనము చేసినట్టు గన్పట్టుచున్నది. ఆంధ్రులు గంగా తీర వాసులని ప్రబలప్రమాణము గాన్పించువరకు వారు దక్షిణాపథవాసులనియును వారిదేశము దక్షిణాపథదేశ మనియును అదియె కృష్ణాగోదావరీ నదీ గర్భదేశమనియును మనము విశ్వసింతము. ఈ యాంధ్రదేశ మె తరువాత కళింగ త్రికళింగ[16] త్రిలింగ వేంగీ నామములచే వ్యవహరింపబడుచు వచ్చినను ఆంధ్ర త్రిలింగ నామములు మాత్రము నిలిచినవి.

కళింగదేశము.

గంజాము మండలములోని మహేంద్రగిరి మొదలుకొని గోదావరి వరకును గల దేశమునకు గళింగమను పేరుగలదు. చంద్రవంశపు రాజులు కళింగుడనువాడీ దేశమును బాలించుట చేత నప్పటి నుండి ఈ దేశము కళింగదేశమని వ్యవహరించ బడుచున్నది. ఇది పూర్వము మిక్కిలి ప్రఖ్యాతి గాంచినట్టి దేశము. బుద్ధుని కాలమందు దీనికి దంతపురము రాజధానిగనుండెను. దీనినే అంగుల్య నదిమీదనుండు సింహపురము పూర్వమొకప్పుడు రాజధానిగ నుండినది. బౌద్ధులచరిత్ర గ్రంధమగు మహావంశమునందు జెప్పబడినది. శ్రీకాకుళమొకప్పుడును కళింగపట్టణ మొకప్పుడును పూర్వము రాజధానులుగ నుండుచువచ్చెను. క్రీస్తుశకము మూడు నాలుగవ శతాబ్ధములయందు పిష్టపురము రాజధానిగనుండెను. దీనినే ఇప్పుడు పిఠాపురమనుచున్నారు. ఇది చాళుక్యుల కాలమునందు బీఠికాపురమను పేరం బరిగినది. తరువాత కురంగేశ్వర పురమనియెడి కోరంగి యేడవశతాబ్ధమునందు గళింగదేశములో బ్రఖ్యాతి కెక్కిన పట్టణముగా నుండెను.

ఒకప్పుడీ కళింగముత్తరమున గంగాతీరము వరకును మరొకప్పుడు దక్షిణమున కాంచీపురము వరకును వ్యాపించినది. వేంగీదేశమును పాలించిన పల్లవులు చాళుక్యులు నీకళింగదేశమును జయించి తమరాజ్యములో గలుపుకునుట చేత నాంధ్రకళింగములు రెండును మిశ్రములగుచు వచ్చి యేకదేశమైనవి. అయినను మహేంద్రవరము వరకును గలదేశమును పదునారవశతాబ్ధము దనుక గృష్ణాతీరప్రాంత ప్రదేశముల వారిచే గళింగదేశమనియె వ్యవహరింపబడుచు వచ్చినది. పదునారవ శతాబ్దములోని

1. తృతీయ కళింగమని యర్థము కాని యైరోపీయ పండితులు తలచి నట్లు మూడు కళింగములు కాదు. వాడై మూరురాయగండ డని ప్రఖ్యాత బిరుదుగాంచిన మహావిక్రమశాలియగు కృష్ణదేవరాయలు తమ యాముక్తమాల్యదయందు "కళింగదేశ విజిగీషా మనీషందండెత్తిపోయి " అని వ్రాసుకొనియున్నాడు. ఆశతాబ్ధములోని వాడేయైన తెనాలి రామక్రిష్ణకవి తనపాండురంగమహత్యమున అతండు "కళింగ దేశాభరణంబగు పీఠికాపురం బధిష్టించి" అని వ్రాసియున్నాడు. ఏదియెట్లున్నను నాంధ్రదేశములోని సముద్రతీరప్రదేశము కొంతభాగము కళింగదేశముగా వ్యవహరింపబడుచు వచ్చెననుట నిర్వివాదాంశమనుటకు సందియము లేదు.

త్రికళింగదేశము.

ఇకను త్రికళింగ దేశమని వ్యవహరింపబడినాదా లేదా యని దెలిసికొనవలసి యున్నది. అందుకు నిదర్శనములు గాన రావని కొందరిచే దలపబడుచున్నది. [17]

మహాభారతమున మూడుతావులను కళింగ దేశము వర్ణింపబడినది. మార్కండేయపురాణములో నుత్తరదేశములందును, మధ్యదేశమునందును, దక్షిణదేశమునందును, మూడుతావులను కళింగదేశమున్నట్లు వర్ణించబడినది. [18] మనగ్రంథములయందు మాత్రమేకాక క్రీస్తుశకమునకు బూర్వము రెండవశతాబ్దమున కళింగదేశమును జయించి యెరిస్సాలోని (ఉత్కలము) యుదయగిరి (ఖండగిరి) యందు ఖారవేలుడు వ్రాయించిన శాసనమునందును మూడు తావులకళింగము పేర్కొనబడినది. ఇదియునుంగాక విదేశీయులైన "ప్లీనీ, టాలెమీ" అను చరిత్రకారులిరువురును ఉత్తరకళింగమును, మధ్యకళింగమును, మూడవ కళింగమును (త్రికలింగమును) బేర్కొనియుండుట చేత మేగాస్తనీసు కాలమున సహితము మీ మూడు కళింగములన్నట్లు గన్పట్టుచున్నది.[19] అయిన అశోకుని శాసనములయం దొక్క కళింగమే పేర్కొనబడినది.

గంగానది మొదలుకొని కటకపురి వరకును గల దేశము త్తరకళింగ మనంబడుచున్నది. ఉత్తర కళింగమే యుత్కలమనబడుచున్నది. కటకపురి మొదలుకొని మహేంద్రగిరి పర్యంతముగలదేశము మధ్య కళింగము. ఇదియే కన్యోధదేశమనబడుచున్నది. మహేంద్రగిరి మొదలుకొని గోదావరివరకును గలదేశము కళింగము లేక త్రికళింగ మనబడుచున్నది. ఆంధ్ర రాజ్యము ప్రభ యడంగిపోయిన తరువాత నీ త్రికళింగ దేశు వేంగిరాజులచే జయింపబడి వేంగికి కూడా వ్యాపించియుండును. ఈ దేశమునకు ద్రికళింగ సంజ్ఞ యున్నటుల గ్రంథ నిదర్శనములు గానరావని కొందరు తలచుచున్నారు.[20] ఈ దేశము త్రికళింగమని వ్యవహరింప బడుదు వచ్చినదనుటకు గ్రంథస్థములగు నిదర్శనములు లేకపోలేదు. క్రీస్తుశకము 650 దవ సంవత్సరములోని యుద్ధమల్లుని శాసనములందొకదానిలో "వేంగీభువః పతిరభూ త్త్రికళింగకొట్టేః" అని త్రికళింగము వాడబడియున్నది. ఇంతియగాక క్రీస్తుశకము పండ్రెండవ శతాబ్దమున చేది దేశపురాజును కాళచూరి వంశజుడునగు శ్రీమ ద్విజయసింహదేవుని వంశములోని వాడగు శ్రీకర్ణదేవుడు త్రికళింగదేశమును జయించి త్రికళింగాధిపుడ నని బిరుదువహించినట్లుగ గాదకాపురలోని యొక తామ్రశాసనముననున్నది. [21]

పై నుదహరించిన ప్రమాణములను బట్టి త్రికళింగమను పేరు కొంతకాలము వ్యవహారము నందుండినదని స్పష్టముగ జప్పవచ్చును.

త్రిలింగ దేశము

త్రిలింగ సంజ్ఞ దేశమున ఎప్పటినుండి యేరీతి గలిగినదని పరిశీలింప బూనితిమా మనము నమ్మ నర్హముకాని పురాణ గాథలనే శరణ్యములుగా జేసి కోవలయును గాని విశ్వాసపాత్రములయిన చరిత్రాంశములేవియు మనకు గాన రావు. నిన్న మొన్న జరిగిన విషయములను బహుయుగములకు బూర్వమున బెట్టెడు పురాణము లీచరిత్రమున నిజము దెలిసికొనటు కెట్లు తోడ్పడగలవు. అయినను సాధ్యమగునంతవరకు నిజము దెలిసికొనుట బ్రయత్నించి చూతము. ఆంధ్రదేశమును పాలించెడి వేంగిరాజులు (పల్లవులును, చాళుక్యులును) త్రికళింగరాజునుగూడ జయించి పాలించుచుండిన వారగుటచేత నీ దేశముకూడా వ్యవహారమున ద్రికళింగమని వాడబడచు వచ్చెననుటకు సందియము పడవలసినపనిలేదు. ఈ త్రికళింగము జనసామాన్యముచే నుచ్ఛరింప బడునప్పుడు కొంతకాలము జరుగునప్పటికి క లోపింటచి త్రిలింగ పదమే వ్యవహారములోకి వచ్చియుండును. విదేశస్థులును త్రిలింగమనియే వ్యవహరించి యుందురు. త్రిలింగపదము వ్యవహారములోనికి వచ్చి యభ్యాసపడి దేశమున నాటుకున్న తరువాత త్రికళింగపదము జనులనుడులనుండి తొలగిపోయి శాసనములయందు మాత్రమే నిలిచియుండును. తరువాత నీ దేశమును బాలించిన వారిలో శైవమతస్థులయిన కడపటి పల్లవుల కాలముననో, కాకతీయులకాలముననో మొదటి చాళుక్యుల కాలముననో త్రిలింగదేశనామము మిక్కిలి ప్రాచీనమైనదైనట్లుగ జేయుటకు బ్రయత్నములు చేయబడియుండును. అయినను క్రీస్తుశకము రెండవశతాబ్దమునందుండిన టాలెమీయను నాతడు త్రిలింగమని పేర్కొని యున్నాఁడు. త్రికళింగమనుటకు త్రిలింగమని యుండవచ్చును. దీనినంతయును బట్టి చూడఁగా కళింగమునుబట్టియె యాంధ్రదేశమునకు త్రిలింగమను పేరు వచ్చినదనియే తలంచుట సముచితమని దోఁచుచున్నది. అయినను కళింగమునుండి త్రిలింగము పుట్టినదని మనపండితు లొప్పుకొనక త్రి+లింగ శబ్దములనుండి పుట్టినదనియు నీదేశమున మూడు ప్రసిద్ధలింగములు గలవనియు నందుమూలముననీదేశమునకుఁ ద్రిలింగ సంజ్ఞ కలిగినదనియుఁ జెప్పుదురు. సుచంద్రునికొడు కాంధ్రవిష్ణువనువాఁడు శ్రీశైలము[22]భీమేశ్వరము [23] కాళేశ్వరము[24]ను మహేంద్రపర్వతముతో గూడ, గలియునట్లుగా ప్రాకారములునిర్మించి యీమూటిని ద్వారములనుగాఁ జేసెననియు, ఈ ద్వారములందీశ్వరుఁడు శూలపాణియై ప్రమధగణములతోఁగొలువఁబడుచు లింగరూపములను దాల్చి యిందుండెననియు, ఆంధ్ర విష్ణువు సురులసహాయమును బొంది దానవాగ్రేసరుఁడగు నిశుంభునితోఁ బదమూండు యుగములు యుద్ధముచేసి వానిని హతముగావించి గోదావరి తటమునందలి ఋష్యాశ్రమములతో సహా వానినివాసము నాక్రమించు కొనెననియు, అప్పటి నుండియు నీదేశము త్రిలింగమనుపేరఁ బఱగుచున్నదని బ్రహ్మాండ పురాణమునందుఁ జెప్పఁబడినది.[25] గంజాము మండలములో నుత్తరభాగముననున్న మహేంద్రగిరి నీత్రిక్షేత్రములను గలిపెడి ప్రాకారములమధ్య కట్లుకొనిరాగలిగెనో బోధపడకున్నయది. ఈ యాంధ్రవిష్ణు నిచ్చటివాడని విచారింపగా నితడు శ్రీకాకుళమును బాలించిన సుచంద్రుని కొడుకనియు అతడు కలియుగంబున స్వాయంభవుమనువుకాలమున నున్నాడనియు ఆంధ్రకౌముదియందు దెలుపబడినది.[26] బ్రహ్మాండపురాణము పదునొకండవ శతాబ్ధమున వ్రాయబడినదిని కొందరుపండితులూహించుచున్నారు. ఎప్పుడు రచింపబడినను బహుసమీపమైనదనుటకు సందియములేదు. బ్రహ్మాండపురాణము లోని యీ వాక్యమే మరికొన్ని గ్రంధములలో బేర్కొనబడి యుండెను. బ్రహ్మాండపురాణమునందు మాత్రమేగాక స్కాందపురాణమునందును త్రైలింగులు అని యాంధ్ర దేశస్థులు పిలువంబడిరి. [27] ఇంతియగాక, త్రిలింగ శబ్ధానుశాసనమును, వ్యాకరణమున, నధర్వణాచార్యులు, త్రిలింగశబ్ధములకు వ్యాకరణము రచించెదనని చెప్పియున్నాడు.[28] ద్వితీయాచార్యుడ[29]ని బిరుదుగాంచిన యీయధర్వణాచార్యుడు పదునొకండవ శతాబ్ధముననో పండ్రెండవ శతాబ్ధారంభముననో నున్నవాడు. మరియును పదమూడవశతాబ్ధ ప్రాంతమునున్న విద్యానాధకవి తన ప్రతాపరుద్రీయమున ద్రిలింగములు బేర్కొని త్రిలింగదేశప్రశంస సలిపియున్నాడు.[30] మరియు నా శతాబ్దమునందే యుండిన విన్నకోట పెద్దనామాత్యుడు తనకావ్యాలంకార చూడామణియందు "క|| ధరశ్రీపర్వతకాళేశ్వర దాక్షారామసంజ్ఞ వరలంద్రిలింగా | కరమగుటనంధ్రదేశకంబురుదారం ద్రిలింగదేశమన మనజనగృతులన్ ||" గీ. తత్రిలింగపదము తద్భవంబగుచే | దెలుంగు దేశమున దేటబడియె | వెనుక దెనుంగుదేశమునండ్రుగొంచర | బ్భా షను దగతులం బరగుచుండు." నని వ్రాసియున్నాడు. పదునేడవ శతాబ్ద ప్రాంతమున నుండిన కాకుమార్యప్ప కవియు దన వ్యాకరణములో: ---

క|| శ్రీక్షితి ధర కాళేశ్వర, దాక్షా రాంమంబుల నంగఁ దనరారెడు నీ
క్షేత్రంబుల లింగమ, లీక్షితిని ద్రిలింగ సంజ్ఞ కెన్నిక కెక్కున్.

తే.గీ. తత్త్రిలింగ నివాసమై తరుకతన
నాంధ్ర దేశంబు దాఁ ద్రిలింగాఖ్యమయ్యె
దెలుఁగ గుచు దద్భవము దాని వలనఁ బొడమె
వెనుక కొందఱు దానినె తెనుఁగునండ్రు.

అని శ్రీశైలము, దాక్షారామము, కాళేశ్వరము, ఈ మూడు క్షేత్రముల లింగములును త్రిలింగములనియు, వానిచే నొప్పు నీదేశము త్రిలింగ దేశమనియు వ్రాసి యున్నాడు. ఈ పై ప్రమాణవచనములను బట్టి "శ్రీశైలము, భీమేశ్వరము లేక దాక్షారామము, కాళేశ్వరము" అను త్రిక్షేత్రముల లింగముల మధ్యనుండు దేశము త్రిలింగదేశమనియు, త్రిలింగశబ్దభవము తెలుగుగుటం జేసి తెలుగదేశమయినదనియు మనపండితుల యభిప్రాయమని తేటపడుచున్నది. ఈ తెలుగు దేశమునే తరువాతి వారు తెనుగుదేశమని కూడ వాడుచువచ్చిరనుటకు సందియము లేదు. పదునొకండవ శతాబ్దారంభమున నుండిన నన్నయ భట్టారకుడు భారతము దెనిగించుచు కం. జనమత కృష్ణద్వైపా, యనమునిష్ఫషభాభిహిత మహాభారతము| ద్ధనిగూపతార్థమేర్పడఁ దెనుగునరచియింపు మధికధీయుక్తి మెయిన్. అనియు ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్నకథావివిధార్థయుక్తితో | నారపిమేలునా నితిరు లక్షరరమ్యత నాదరింపవా| నా రుచిరార్థసూక్తినిధి నన్నయభట్టు తెలుంగు[31] న న్నహాభారత సంహితా రచనబంధురుడయ్యె జగద్ధితమబుగనే" అనియు వ్రాసి " తెనుగు;తెలుగుననుపదములు రెండును ప్రయోగించెను. అనగా నన్నయ కాలమునాటికి నీ తెలుగుశబ్దము త్రిలింగశబ్ధభవముగా వాడబడుచుండెను. త్రిలింగపదము త్రికళింగపద వికారమయినను, సంస్కృతమైనను త్రిలింగమునుండి తెలుగుపదము పుట్టినదనుటకు సందియము లేదు. పాలకభేదమును బట్టి యీ యాంధ్రదేశమునుకు హద్దు తెలియక పోగా నాంధ్రదేశ వ్యాప్తి నిరూపణమునకై యెకవేళ శ్రీశైలాది త్రిక్షేత్రముల లింగములను హద్దులుగా తదనంతురులు గ్రహించి యుండుటంజేసి యంధ్రదేశమునకు ద్రిలింగ సంజ్ఞ గలిగినం గలుగవచ్చును.[31]

వేంగి దేశము.

ఆంధ్రదేశమునకు వేంగి దేశమను పేరుగూడ వాడబడియుండెను. చోళమండలమునకు రాజధానియగు కాంచీపురమునకు నైఋతిభాగమున వెంగియును నొక చిన్న గ్రామమిప్పటికిని గలదు. ఆ ప్రదేశము మొదట నిర్జనంబయి

<<స్కాన్ లో దోషం , అచ్చు మూలంనుండి సరియైన 32 పేజీ పాఠ్యాన్ని చేర్చాలి >>


కారణము లేకపోలేదు. క్రీస్తుశకము మూడవశతాబ్దము మొదలుకొని యేడవ శతాబ్దమువరకును పల్లవరాజులు, నటు పిమ్మట బండ్రెండవ శతాబ్దము వరకును పూర్వ చాళుక్యులును బరిపాలనము చేసిరి. వారి కాలమున దేశము వేంగి దేశమనియె విశేషముగా వాడబడుచువచ్చెను. రాజనరేంద్రుని యాస్థానకవియు పండితుడునగు నన్నపార్యుడు రాజమహేంద్రవరమును వేంగిదేశమునకు నాయకరత్నమని చెప్పియున్నాడు. పల్లవరాజులిప్పటి యేలూరునకు సమీపముననుండెడి వేంగీపురమును రాజధానిగా జేసుకొని యూదేశమును పరిపాలించిరి. ఏడవశతాబ్దాదిని రెండవ పులకేశివల్లభుడను చాళుక్యరాజు పల్లవరాజును జయించి తన తమ్ముని కుబ్జ విష్ణువర్థనుని వేంగీదేశమునకు బాలకునిగా నియమించెను. అమ్మరాజవిష్ణువర్థనుని కాలమున ననగా దొమ్మిదవశతాబ్దాదిని రాజధాని రాజమహేంద్రవరమునకు మార్పబడినది. పల్లవచాళుక్యులకాలమున నిదియంతయు వేంగీదేశముగా వ్యవహరింపబడినను మొదటి వేంగిదేశము చోళదేశప్రాంతమునందలిదియే యైయుండును.
"సీ. దక్షిణగంగనాఁదద్దయు నొప్పిన గోదావరియు జగదాదియైన

భీమేశ్వరంబును బెడఁగగుచున్న శ్రీపర్వతంబును జూచి యుర్విలోన
ననఘమై శిష్టాగ్రహారభూయిష్టమై ధరణీసురోత్సమాధ్వరవిధాన
పుణ్యసమృధ్ధమై పొలుచు వేఁగీదేశ విభవంబు జూచుచు విభుడు దక్షి
ణాంబురాశితీరంబున కరిగి దరితి| హారియైన కావేరీ మహాసముద్ర
సంగమంబునభూసరేశ్వరులకభిమతార్ధదానంబు చేపకృతార్థుడగచు ".


అని నన్నయభట్టు భారతాదిపర్వమున నర్జునుతీర్థయాత్రాసందర్భమున కళింగదేశమును, పురుషోత్తమ క్షేత్రమును, మహేంద్రపర్వతమును జెప్పినతరువాత నీపద్యములో గోదావరిని భీమేశ్వరమును, శ్రీశైలమును జూచిన తరువాత "అనఘమై శిష్టాగ్రహారభూయిష్టమై ధరణీసురోత్సమాధ్వరవిధాన పుణ్యసమృధ్ధమై పొలుచు వేంగీదేశ విభవంబు జూచుచు " నని వేంగిదేశము నెక్కువగా వర్ణించియుండుటచేత శ్రీశైలమునకు దిగువనుండుదేశమే మొదటి వేంగిదేశమని గన్పట్టుచున్నది. ఇంతియగాక కేతనకవి తనదశకుమార చరిత్రమునందు "సీ. వేంగివిషయమున వెర్రిరాలనుపేర నభిరామమగునగ్రహారమునకు నగ్రణియగువాని నభినవదండినా బొలుపుమీరిన వాని ***** గేతనార్యుని నన్ను విఖ్యాతయశుని||" అనియును, ఎర్రాప్రెగ్గడకవియు దన నృశింహ పురాణమున :-


"సీ. ప్రజ్ఞాపవిత్రుడాపస్తంభమాంత్రుండు శ్రీవత్సగోత్రుడూర్జితచరిత్రు

డగుబొల్లనకు బ్రోలమాంబకు బుత్రుండు వెలనాటిచోడునివలన మిగుల
మన్ననగన్న భీమనమంత్రిపౌత్రుండు ప్రేకమాంబామన ప్రియుడు పోత
మాంబికావిభుసూరనార్యుమజ్జనకుని బొల్లదీనిధికిని బ్రోలమకును
జన్ననకు ననుజమ్మని గన్నతండ్రి వేగినాట గరాపర్తకవృత్తిమంతుం
డనఘుడెరపోతనూరికంసారిచరణ కమలమధుకరపతిసారవిమలయశుడు"


అనియు నెల్లూరిమండలనివాసులగు వీరిరువురును దాము వేంగిదేశములోనివారమని చెప్పికొనుటచే వేంగిదేశము శ్రీశైలమునుకు దక్షిణభాగమె యనితోచుచున్నది. పదునారవుశతాబ్దమునందుండిన తెనాలిరామకృష్ణకవి తనపాండురంగమహత్మ్యమున :-


"సీ. నలుదెరంగులు గావ్యవసుధాధారలఘనుడ వాశువునందు గరముమేలే

నఖిలభూమిపాలకాస్థానకమలాకరోచ్చయతరుణసూర్యోదయుడవు
శైవవైష్ణవపురాణావళి నానార్థరచనాపటిష్ఠ్రైకరమ్యమతిని
లౌకికవైదిక లక్షణచాతుర్యదైర్యప్రభారూఢకార్యచణుడ
నాంధ్రభూమికుచాగ్రహారాభమైన
శ్రీతెనాల్యగ్రహారనిర్నేతనగ్ర
శాభికాకోకిలనమ నీవు సరసకవివి
రమ్యగుణకృష్ణరామయరామకృష్ణ"


అని తానాంధ్రదేశములోనివాడ నని చెప్పికొని యుండుటంజేసి శ్రీశైలము మొదలు గోదావరిపర్యంతముగలదేశ మాంధ్రదేశము లేక తెలుగునాడ నిదోచుచున్నది.[32] ఈ పైగనబరచిన ప్రమాణములను బట్టి యాంధ్రదేశగలింగదేశము వేంగిదేశమునను నామములు పాలకభేదమున తటస్థించిన పాత నామములుగాని నియతనామములుగావని స్పష్టముగా జెప్పదగును.

  1. ఐతరేయ బ్రాహ్మణము; సంచిక 2 అధ్యాయము 3, కండిక 1-
  2. ఇది గంజాముజిల్లాలో నుత్తరభాగమున నున్నది
  3. ఇది పాండ్యదేశమునకు ముఖ్యపట్టణము.
  4. నన్నయబట్టారక చరిత్రము. పొరటలు 36-42
  5. "శ్లో. పౌండ్రాంశ్చద్రవిడాంశ్చైవ సహితాంశ్చాడ్రకేరళై ఆంధ్రా స్తాలవనాంశ్ఛైవ కళింగా నుష్ట్రకర్ణికాన్ " మహాభారతము, సభాపర్వము.
  6. ఆగ్నేయాందిశి వర్ణితః తతథా, ఆగ్నేయాందిని-కౌశలకళింగ వంగో పనంగ జఠరాంకాః కాణిక విదర్భవత్సాంధ్రచేదికాశ్చోస్వితండాశ్ఛ అని బృహత్సంహితాకూర్మ విభాగము, వాచస్పత్యము.
  7. There is not the least mention of any Telugu kingdoms in the Asoka inscriptions. Probably that past of India was not then civilized at all, but inhabited by wild tribes. Dr burnell's South Indian Paeleography
  8. నన్నయ భట్టారక చరిత్రము పొరట 35.
  9. And likewise here, in the king's dominions, among the yonas and kambhojas, in (?) Nabhaka of the Nabhitis, among the Bhojas and Pitinkas, among the Andhras and Pulindas, everywhere men follow the law of Piety as proclaimed by his Majestry" (Rock Edict XIII)
  10. Pliny, Hist, Nat, book Vi, 21,22,23, From information probably supplied by Magesthenes. -Asiatic Researches Vol IX page 101.
  11. Sir Walter Elliot's coins of Southern India
  12. Coins of Ancient India by Major. General Sir.A. Cunningham ; page 108.
  13. కృష్ణామండలములోని చల్లపల్లి జమిందారీలో నున్నది
  14. గుంటూరుమండలములోని సత్తెనపల్లి తాలూకాలోని అమరావతి ధరణికోట యనునవే ధాన్యకటకముగా నున్నవి
  15. గోదావరీ నది మీదనుండు పైఠవి అను గ్రామము
  16. తృతీయ కళింగమని యదార్ధము కాని యైరోపీయ పండితులు తలచి నట్లు మూడు కళింగములు కాదు.
  17. ఆంధ్రాక్షరతత్వము, పొరట 43
  18. " శ్లో. మత్యాశ్యకూటాః కుల్యాశ్చ్య కుంతలాః కాశ కోసలాః
    అధర్వశ్చ కళింగాశ్చ మశకాశ్చస్పకైస్సహ
     మద్యదేశ్యా జనపదాః ప్రాయకోమిప్రకీప్తాః


    శ్లో. గాంన్ధారాయననాశ్చైని సిస్తుసౌవీరమద్రకాః
    శతద్రుజాః కలింగాశ్చ పరదాహారభూషికాః


    చలి కాహుహుకాశ్చైవ ఊర్ణదార్ణాస్తధైనచః
    ఏతేదేశాహ్యుదీచ్యాశ్చ ప్రాచ్యాన్ దేసాన్ నిబోధమే.


    అధాపరేజనపదా దక్షిణాపధఃవాసినః
    మహారాష్ట్రామహిషికాః కళింగాశ్చైవసర్వశః

  19. A.Cunningham's Ancient Geography of India 519
  20. ఆంధ్రాక్షర తత్వము45 పొరటలు 45.46
  21. See P,11, C. F.Cunningham's Arch-Repts IX;J.A.S.B.VII I.485; As, Res IX108 Sir,Walter Elliot's Coins in Southern India.
  22. కర్నూలుమండలము మార్కాపురము తాలూకాలోనున్నది.
  23. గోదావరి మండలములోని రామచంద్రపురము తాలూకాలోని దాక్షారామమను గ్రామము.
  24. కాళేశ్వరము హైదరాబాదు రాజ్యములో నెలగందల మండలమున గోదావరి నదితో నింద్రావతి సంగమించెడు స్థలము చెంత మంథనియను గ్రామమునొద్ద శివక్షేత్రము కాళేశ్వరము కలదు.
  25. శ్రీశైల భీమాకాళేశ మహేంద్రగిరి సంయుతం। ప్రాకారంతుమహ్త్కృత్వాత్రీణి ద్వారానుచాకరోత్॥ త్రిలోచనోమహేసస్స త్రిశోలంచకరే వహన్।త్రిలింగరూపీన్యవసత్ త్రిద్వారేషుగణైనృతః॥ఆంధ్రవిష్ణుస్సురయుతో దనుజేననిశంభునా। యుధ్వాత్రయోదశయుగాన్ హత్వాతుంరాక్షసోత్తమం అవసత్తత్రఋషిభిర్యుతో గోదావరీతటే॥తత్కాల ప్రభృతి క్షేత్రం త్రిలింగ మిత విశ్రుతం॥
  26.  ఆంధ్రనాధో మహావిష్ణు ర్నిశంభుదనుజాపహా |
    పురాస్వాయంభువమనోః కాలేకలియు గేవారః |
    అభసంవత్సర్వదేవైశ్చ వేష్టితో లోకపూజితః
                        ఆంధ్రకౌముది

  27. శ్లో. కర్ణాటాశ్చైవత్రైలింగ గూర్జరరాష్ట్ర వాసినః|
    ద్రావిడాద్రావిడాఃపంచ నింధ్యదక్షిణ వాసినః|
         (స్కాంద పురాణము వాచస్పత్యము)

  28.  శ్లో. జయతిప్రసిద్ధంలోకే సర్వలక్షణలక్షితం |
    శబ్ధలింగశబ్ధనా మధర్వణకవేఃకృతిః|
    కరోమిశబ్ధంశబ్దంశబ్దానాం త్రిలింగానాంనలక్షణం |
    బార్హ స్పత్యానిమాత్రాణి కాణ్వంవ్యాకరణం విదన్
    అధర్వణాచార్యకృత త్రిలింగశబ్ధానుశాసనం.

  29. ప్రధమాచార్యుడని నన్నభట్టునకు బిరు8దము గలదు. గావున నధర్వణాచార్యుని ద్వితీయా చార్యుడందురు.
  30. "మైర్దేసస్త్రిభిరేషి యాతి మహతీం ఖ్యాతింత్రిలింగాఖ్యాయా యే షాంకాకతి రాజ కీర్తి విధ వైః కైలాస శైలాకృతాః తే దేవాః ప్రసరత్పసాదస్మభురాశ్శ్రీశైల కాళేశ్వరః దక్షారామనివాసినః | ప్రతి దినంత్వచ్ఛ్రేయ జాగ్రత " ప్రతాప రుద్రీయం, నాటక ప్రకరణే పంచ మంకం. 44.
  31. 31.0 31.1 ఇది వేంగిరాజుల చరిత్రమున జర్చింపబడవలసిన విషయము గావున గ్రంథవిస్తరభీతిచే నీచర్చ నిచ్చట విరమించుచున్నాడను.
  32. 1. ఈనాడి భేదము లనేకములు గలవు. ద్రావిడులలో 1. పాకనాడు2. - కనాడు. 3. బెడగనాడు 4. నాదనాడు 5. వెర్నాడు,6 ఉలచనాడు 7కళింగనాడు,8 కాపలనాడు 9తెలుగువాడు=తెలగాణ్యులు. 10ము 11నెలనాడు 12వేంగినాడు 13వేంగినాడు 14కమ్మనాడు 15ఇం- 16ఇన్నంబర్నాడు 17తిరుమునాడు 18తిరుపలినాడు 19తిరుణర్నాడు 20పల్నాడు 21చేగల్నాడు 22పోల్నాడు మొదలగునవి ననేకములుగలవు.అవియన్నియు ద్వితీయాదిసంపుటముల జర్చింతును.