Jump to content

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము

ఆదిమనివాసులు

ఆంధ్రదేశము పూర్వకాలమున నొకప్పుడు దండకారణ్యముగా నుండెననియు,ఆ కాలమున గిరాతజాతులవారు మాత్రమె నివసించుచుండి రనియు మనము దెలిసికొనియుంటిమి. ఆ కిరాతజాతులవారెవ్వరో, వారి వెనుక నెవ్వరెవ్వరీ దేశమునకు వచ్చి యుండిరో , వారెట్లు నాగరికులైరో మనము దెలిసికోవలసి యున్నది. ఈదండకారణ్యదేశమునందు ప్రప్రథమమున నివసించిన ప్రజలెట్టి వారో వారెందుండివచ్చిరో సత్యమెవ్వరికిని దెలియరాదు. ఇట్లని యూహించి చెప్పుటయు సులభసాధ్యముగాదు. వారెచ్చటివారయినను మిక్కిలి మృగప్రాయులుగా నుండియుందు రనుటకు సందియము లేదు. ఇప్పటి అండమానుదీవులలోనుండిన యనాగరికులను బోలియుందురని కొందరూహించుచున్నారు గాని వారియూహ సరియైనదికాదు. అండమానుదీవులలోని యనాగరికులు మిక్కిలి పొట్టివారుగనున్నారు. వీరిలో బురుషులు మూడుమూళ్ల మూడంగుళములను ఆడువాండ్ర మూడుమూళ్లును పొడవుమాత్రమే గలిగియున్నారు. వీరు బట్టకట్టుట నైన నెరుంగని స్థితియందున్నవారు . ఆకులను మొలకు ధరింతురు. చేపలను పీతలను పట్టుకొని తిని జీవింతురు. వట్టి మృగప్రాయులుగనున్నారు. వీరిపూర్వులే మొదటి నీదేశమున నివసించియుండిరని కొందరు వ్రాసియున్నారుగాని అదియెంతమాత్రమును విశ్వాసార్హమైనది కాదు. ఇప్పటి కృష్ణా గుంటూరు మండలములలోని నందిగామ, సత్తెనపల్లి పల్నాడు తాలూకాలో బెక్కు చోట్లను గుండ్రముగా మలచబడిన శిలలను శిలలతో జేయబడిన గృహోపకరణములు,అందములేని మట్టిపాత్రములు గాన్పించినందున నీయాంధ్రభూమి కొందరు తలంచుచున్నట్లు నిర్జనప్రదేశముగానుండక ప్రాచీనజననివాసభూమిగా నుండెనని మెకంజి, బిషప్ కాల్డువెల్లు మొదలుగు పాశ్చాత్యులు తలంచుచున్నారు. రాబర్టున్యూ గారుమాత్ర మీఱాతిగుండ్లను ధాన్యకటకములోని బౌద్ధస్థూపమును నిర్మించకుముందు నభ్యాసమునకుగాశిల్పకారులు చేసియుందురుగాన వీరలు బౌధ్దుసంతతివారయియుందురుగాని పైవారు తలంచునట్లు ప్రాచీనులుగారనిరిగాని డాక్టరు కార్నీషుగారుమాత్రము వారివాదమునంగీకరింపక వారు బౌద్ధులకం _ , బూర్వీకులనియువాకొనియున్నారు.[1] ఇప్పటియొఱుకు, చెంచు, కోయ,యానాది మొదలగు తెగలవారియొక్క ప్రాథమికులయిన పితురులే యాదిమవాసులై(?) యుందురని మెకంజీదొరగారభిప్రాయపడియున్నారు. వీరిని __ మీ చెప్పిన సవరులు, రోదలు, గోండులు, శబరులు మొదలగు తెగలవారి __ జేర్పదగినవారని కార్మికేలుగారు వ్రాసియున్నారు. [2] ఇప్పటికి నాలుగు సంవత్సరములకు బూర్వమున నార్యులీదేశమునందలి సింధునదీతీరమునకు __నప్పటికి వీరికంటెను నాగరికులయిన జాతులవారు నివసించుచుండెడివా__న్పట్టుచున్నారు.

అనార్యులు-దన్యులు.

ఆ కాలమునం దనార్యజాతులవారెంత యనాగరికులుగాను మృగప్రా__గాను వర్ణింపబడినను వీర లచ్చటచ్చట గ్రామము లేర్పఱచుకొని పట్టణ __దుర్గములు నిర్మించుకొని రాజ్యములు స్థాపించుకొని సేనలనుగలిగి యార్యు __సమానముగా బోరాడినట్లు ఋగ్వేదాది గ్రంథములవలన స్పష్టముగా గ __చున్నది. అయినను ఆర్యాచారములకు విరుద్ధములయిన యాచారములను __టిని గలిగియుండుటచేత ననాగరికులుగ భావించి యార్యులు వీరపట్ల __మును వహించిరి. వీరికృష్ణవర్ణమును, వికృతరూపములును, మోటుతనము, రిక సహ్యముగా గన్పట్టి వీరినిదిరస్కార భావముతో జూచుచు అనార్యులు అని పిలువసాగిరి. ఇంతియగాదు; అనార్యులు తమత్రోవ కడ్డమువచ్చితమ్ము ననేక విధముల బాధింప నారంభించినందున శత్రువులనుగ భావించి దస్యులని గూడపిలుచుచుండిరి.

ఆర్యులుకు వీరిభాష తెలియనందున వీరికి భాషలేదని చెప్పిరి. యజ్ఞాదికర్మలు వీరు చేయనందున వీరికీశ్వరుడు లేడనిరి. ఆర్యులకును దస్యులకును జరిగిన యుద్ధములు వేదములయందు వర్ణింపబడినవి. అనార్యు లాదిమనివాసులగుటచేతను ఆర్యులు క్రొత్తగవచ్చి తమభూము లాక్రమించుకొను చుండుటచేతను ఆర్యులకు అనార్యులకు నన్యోన్యకలహములేర్పడి యుద్ధములు జరుగుటలో వింతయేమియును లేదు. ఆర్యులు బలవంతులగుటచేత ననార్యులను వారిసుక్షేత్రభూములనుండి వెడలగొట్టి వాని నాక్రమించుకొనుచుండిరి. అనార్యులార్యుల యెదుట ముఖాముఖిని నిలువంబడి పోరాడలేక ఆర్యుల భుజబలంబునకు దాళగజాలక యరణ్యములలోను పర్వతగుహలలోను దాగియుండి రాత్రులందు నార్యుల నివాసస్థలంబులపై బడి పశువులను ధాన్యాదులను దోచుకొనుచు, ద్రోవలగొట్టుచు యజ్ఞాదికర్మల ధ్వంసము చేయుచు, స్త్రీలనెత్తికొనిపోవుచు నానావిధముల బాధపెట్టియుండిరి. మరియు నదులచేతను సెలయేళ్లచేతను సురక్షితములయిన స్థానములందు నివాసములేర్పరచుకొని నగరవాసులయిన యార్యుల కుపద్రవము సలుపుచుండిరి. అయినను ననార్యులు సులభముగా లోబడక బహుకాల మార్యులతో యుద్ధము సేయుచునే యుండిరి. ఋగ్వేదమునందనార్యుల కీకటదేశము వర్ణింపబడినది. ప్రమగందుడను రాజు కీకటదేశమును బాలించుచుండెనని చెప్పబడి యున్నది. "కీకటోనామధేశే నార్యనివాసః" అని యాస్కాచార్యులవారు నిరుక్తమునందు వ్రాసియున్నారు. "మాగధాఃకీకటాః మతాః "యని త్రికాండశేషమను కోశములో వ్రాయబడియున్నది. కనుక వైదికకాలములో గంగానదికి దూర్పువైపున గీకటము ననార్యజననివాసం బొండుగలదని తేటపడుచున్నది. ఆ కాలమునందలి సింధునదీప్రాంతదేశమునందలి యనార్యులకు కుయవడనువాడును,కృష్ణుడనువాడును నాయకులుగా నుండి బహుసైన్యములం జేర్చుకొని యార్యులతో ఘోరయుద్ధము చేసి సంహరింపబడిరనిఋగ్వేదమునందు జెప్పబడియెను. ఆర్యులు బహుకాలము దనుక దస్యులతో బోరాడి వారిని నరణ్యప్రదేశములకు దోలుచు క్రమముగా సింధూనదీప్రాంతప్రదేశమంతయు నాక్రమించుకొనిన తరువాత నుత్తర కురుదేశము , నుత్తర మాద్రదేశము, సప్తసింధుదేశము ననునవి యేర్పడినవి. ఋగ్వేదమును జదివినవారికి నార్యులయెక్కయు, దస్యులలయెక్కయు చరిత్రము సంపూర్ణముగా బోధపడగలదు.

లంకాద్వీపవాసులు.

దండకారణ్యమునందు భిల్లులు, గోండులు, శబరులు మొదలగు కిరాతజాతులవారు నివసించియుండగా దరువాత వచ్చి యాదేశము మొదటి నాక్రమించినవారు లంకాద్వీపవాసులయిన యనార్యులని రామాయణమును బట్టి గన్పట్టుచున్నది. లంకాద్వీపమును బాలించెడి రావణసంబంధు లయినవారు దండకారణ్యములో బ్రవేశించిరి. ఈ లంకాద్వీపవాసులచే నాక్రమించుకొనబడిన ప్రదేశముంతయు జనస్థానముగా పరిగణింపబడుచు వచ్చినది. అయోధ్యనుండి శ్రీరాముడు దక్షిణమునకు వచ్చి యీదండకారణ్యము బ్రవేశించినప్పుడు లంకాద్వీపవాసులయిన యనార్యులచే నాక్రమింపబడి యుండెను. రావణుని తమ్ముడగు ఖరుడనువాడు జనస్థానమును బరిపాలించుచుండెను. వీనికి దూషణుడు, త్రిశిణుడుననువారలు మంత్రులుగా నుండిరి. ఇచ్చటనే వీరి సోదరియగు శూర్ఫణఖ యనునామె రామలక్షణులను మోహించి సీత కుపద్రవము చేయబూనగా లక్ష్మణుడు దాని యొక్క ముక్కు చెవులను గోసివేసెను. అది తన సోదరుడగు ఖలునితో దనదురవస్థను జెప్పుకొనగా వాడు వీరలపై దండెత్తివచ్చెను. రామలక్ష్మణులిరువురు వారలతో యుద్ధము చేసి వారలను సంహరించిరి. తరువాత రావణుడు వచ్చి సీత నెత్తికొనిపోవుటయు మొదలగు వృత్తాంతమునంతయు రామాయణమునందు జదివి యున్నారము. ఈ రామాయణకథ సుప్రసిద్ధము. ఆబాలగోపాలము దీని నెరింగి యున్నవారు గాన నాకథ నిచ్చట దెలుప బనిలేదు. ఆర్యులు వీరిని రాక్షసులుగా వర్ణించియుండిరి. ఇట్లు రామాయణమునందు మాత్రమేగాక పురాణాదులయందును ఆర్యులకు ననార్యు లకు జరిగిన యుద్ధములను దేవదానవ యుద్ధములుగా మిక్కిలి చమత్కారముగా వర్ణించియుండిరి. ఆర్యులు దేవతలనియు సురలనియును, దస్యుల నసురులనియు దైత్యులనియు, దానవులనియు, రాక్షసులనియు పేర్లుపెట్టి వాడియుండిరి.

ద్రావిడులు, ద్రావిడదేశము .


ఆర్యులకంటెను బెక్కువేలేండ్లకు ముందే మధ్యాసియా ఖండము నుండి బయలుదేరి హిమాలయమును దాటి యీదేశమున బ్రవేశించి సింధునదీ ప్రాంతమున గొంతకాలముండి తరువాత గంగానది ప్రవహించెడి పల్లపు నేలదారిని తూర్పునకుబోయి యటనుండి వింధ్యపర్వతము ప్రాగ్భాగము వరకు వచ్చి అనంతరము తూర్పు కనుమలకు సముద్రమునకు నడుమనుండెడి సమభూమి మార్గమునందూర్పు తీరము వెంబడిని దక్షిణముగా గన్యాకుమారి వరకును బోయిరని కొందరిచే మార్గము నిశ్చయించబడినదిగాని యీదేశమునకు రాక పూర్వము ద్రావిడు లెందుండెడివారో ఏకాలమున ఏదేశమునకు వచ్చియుండిరో సహేతుకముగా నిర్ణయించి చెప్పుట కష్టసాధ్యమైన విషయముగాని యూహలపై నూహలునల్లి చెప్పుటకు సులభసాధ్యమైన సామాన్య విషయముగాదు. మనవారు ద్రావిడులనగా తరుమబడిన వారని యర్ధము చెప్పి యీదేశము మొట్ట మొదట స్వభావమునుబట్టి రోదులనబడెడి కోతులచే గాని వికల్పనకులని యౌత్తరాహులచే బిలువంబడెడి వానరులచేగాని [3] నిండియుండెడిదనియు ఈవికల్పనరులచే నాక్రాంతమై యుండిన కాలమున బరశురామునిచే నుత్తర దేశపు రాజులెల్లరు నిహతులై హతశేషు లయినవారురు. దక్షిణపుగొననున్న మలయాద్రిచాటునకు బారిపోయి వచ్చి యుండగా గ్రమక్రమముగా వారి బంధులును వారి పోష్యులు నగు నన్యవర్ణములవారును వచ్చి చేరి యుండుట చేత వీరందరు నౌత్తరాహులచే ద్రవిడులు లేక ద్రమిళులు ననునామంబున బిలువం బడుచుండిరనియు నార్యగ్రంధములందు గానంబడుచున్నది. ఈకథ మహాభారతములోని యశ్వమేధపర్వమున జెప్పబడియున్నది. [4] ఆదిమనివాసులయిన యనార్యులను రాక్షసులుగాను, ద్రావిడులను వానరులుగానుగూడ నార్యులు తమకావ్యములయందు వర్ణించినట్లుగ గన్పట్టుచున్నది. మనకాలమునందు అరవము, మళయాళము, కన్నడము, తెలుగు మొదలగు భాషలను మాటాలాడు వారిని ద్రావిడులుగా నెంచుచున్నారుగాని వీరు కేవలము ద్రావిడులని చెప్పుట యెంతమాత్రము సరికాదు. వీరిభాషలు ద్రావిడములో మిశ్రములయిపోయి వీరు ద్రావిడభాషావలంబనముజేసి యుండుటచేత భాషనుబట్టి వీరినందరిని ద్రావిడులుగా దలంచుచున్నారు. ద్రావిడులచేత నివసింపబడిన దేశమునకు ద్రావిడదేశమని పేరు వచ్చినది. వింధ్యకు దక్షిణమున గన్యాకుమారి వరకునుండు దేశము ద్రావిడదేశమని చెప్పంబడుచున్నది. ఆర్యులు ద్రావిడదేశమును మ్లేచ్చ దేశముగాను ద్రావిడులను మ్లేచ్చులుగాను భావించిరి. ఇందుకు బ్రమాణములు మహాభారతమునందును మన్వాది స్మృతి గ్రంధములయందును గానంబడుచున్నవి.[5] పౌండ్రకులు, ఓండ్రులు, ద్రావిడులు, కాంభోజులు, యవనులు, శాకులు, పారదులు, పహ్లవులు, చీనులు, కిరాతులు, దరదులు, ఖకులు మొదలగు క్షత్రియులు పుణ్యకర్మలను విడిచి పెట్టి బ్రాహ్మణులను జూడనందున శూద్రులైనారని మనువు వ్రాసియుండెను. ఈ ద్రావిడులు క్రమముగా దక్షిణమునకు జేరి నాగరికులై జనసంఖ్య యెక్కువయిన కొలదినుత్తర భూముల నాక్రమించుకొనుచు దుదకు దండకారణ్యమునం బ్రవేశించి పల్లెల బట్టణముల నేర్పరుపసాగిరి. ఈ ద్రావిడులమూలముననే దండకారణ్యములో నివసించెడి యనాగరికజాతులన్నియు నాగరికతను గాంచి ద్రావిడులలో గలిసిపోయిరి. వీరి తరువాత దండకారణ్య దేశమునకు వచ్చినవారు మంగోలియా జాతుల వారుగా నున్నారు.

యక్షులు-తమిళులు-తమిళకము

ఆర్యులు దృషద్వతీ సరస్వతీ నదుల నడుమ బ్రవేశించి స్థిరనివాసము లేర్పరచుకున్న తరువాత, ఆసియాఖండ మధ్యమున నుండెడి పీఠభూమి యందు నివసించుచుండిన పసిమి వర్ణముగల జాతులవారు త్రివిష్టపము (Tibet) నేపాళము (Nepal) నడుమంగల పర్వత మార్గముల గుండ దక్షిణమునకు వచ్చి గంగానది ప్రాంతభూమిని నాక్రమించుకుని యుండిరి. ఈ పసిమి వర్ణముగల జాతులవారు సంస్కృత గ్రంధములయందు యక్షులుగా బరిగణింపబడి యభివర్ణింపబడి యున్నారు. పాలీభాషయందు యక్కోసనం బడిరి. చీనాదేశస్థులు వీరిని యూచీలనిరి. ఈ పసిమి రంగుగల జాతులవారు ప్రపంచమందలి యున్నత భూమియందు నివసించియుండిన వారగుట చేత లోకమందలి యున్నత భూమియందు నివసించి యుండిన వారగుట చేత లోకమునందలి జాతులలో నెల్ల దామే పూజ్యులమని యధికులమని భావించుకొనుచు "దైవపుత్రులమని" మని చెప్పుకొనుచుండెడి వారు. వీరు వివేకజ్ఞానసంపన్నులయిన నాగరికులగుట చేత గ్రమముగా బంగాళము (వంగము) నంతయు నాక్రమించుకొని తరువాత నక్కడ నుండి సముద్రముమీదుగా సింహళముకును దక్షిణహిందూదేశమునకును వచ్చి యుండిరి. రామాయణము రచింపబడునప్పటికి యక్షులు హిందూ దేశముయొక్క దక్షిణపుగొననుండిరి. ఆకావ్యమునందు లంకాద్వీపమున కెదుట నుండు సముద్రతీరమున నివసించుచుండిరని చెప్పబడి యుండెను. క్రీస్తుశకమునకు బూర్వ మయుదవశతాబ్ధమున విజయుడనురాజు లంకాద్వీపముపై దండెత్తివచ్చినప్పుడు డా ద్వీపము యక్షుల పరిపాలనము నందుండెను. ఆ విజయుడు మొదట కువేణియను యక్షరాజకన్యను వివాహమాడెను. ఈ మంగోలియాజాతి వారిలో బెక్కుండ్రు బంగాళములోని గంగానదీ తటముననుండెడి తామ్రలిప్తియను నగరమునుండి మొదట దక్షిణ హిందూదేశమునకు వచ్చి యుండిరి. ఆ తామ్రలిప్తియె పాలీభాషయందు "తమలిట్టీసు" (Ta-malittis) అని పిలువంబడినది. దీని నుండియె తమిళమను శబ్ధము పుట్టి యచ్చట నుండి వచ్చిన వారిని తమిళులనుచున్నారు. ఈ తమిళ శబ్ధమె యాంగ్లేయభాషలో "టమిల్" అనబడుచున్నది. తామ్రలిప్తులను, రోసలులతోను, ఉత్కలులతోనూ జేర్చి వంగదేశవాసులుగానూ, సముద్రతీరస్థులనుగానూ విష్ణుపురాణము వాకొనుచున్నది. ఈ మంగోలియా జాతులవా రేకకాలమున నందరు నొక్కమారుగ వచ్చిన వారు కారు. వీరిలో వేర్వేరు తెగలవారు వేర్వేరు కాలములందు వచ్చి యున్నారు.

మొదటి తెగవారు "పలయాన్ మారన్ " అనువారు. వీరికి గన్యాకుమారికడనుండు మోహూరనునది రాజధానిగనుండెను. పాండ్యరాజొకడు తానీ తెగలోని వాడినని చెప్పుకొని యున్నాడు. క్రీస్తుశకమునకు బూర్వమే బర్మాదేశమును జయించిన "మ్రాన్మర్" అనుజాతియను ఈమారన్ జాతియు నొక్కటియె యని యూహింపబడుచున్నది. పాలీభాషయందు వ్రాయబడిన బర్మాదేశ చరిత్రములందు మారమ్మదేశమని వ్రాయబడి యుండెను. అయినను మ్రాన్మదేశమనగా బ్రహ్మదేశమనియు అదియే బర్మాదేశమైనదనియు కొందరు నుడువుచున్నారు. [6] తరువాతవచ్చిన వారు రెండవతెగవారు "తిరయార్" అను సాగరకులులు. వీరు సముద్రము మీద బ్రహ్మదేశము (బర్మాకును)నకును, కొచ్చిన్ చీనాకును, సింహళముకును (లంకాద్వీపము) దక్షిణ హిందూదేశముకును వచ్చి యుండిరి. ఈ తెగలో చేరిన తిరయా నను రాజొకడు కరికాలచోడునితో సమకాలికుడై కాంచీపురమనియెడి కంచిని పాలించెను. ఈతడు తాను విష్ణ్వాంశ సంభూతుడ నని చెప్పుకొనియుండెను. ఇందుచేతనే కాబోలు నా తెగలో జేరిన చోళరాజులు తాము సూర్యవంశజులమని గరువముతో జెప్పుకొనియుండిరి. ముచ్చుకుంటు డనునతడు చోళరాజులలో ప్రాధమికుడుగా తమిళ కావ్యములందు బేర్కొనబడియెను. అసుర లింద్రుని రాజధానియగు యమరావతిని సంరక్షించెను. తనకుజేసిన యుపకారమునకు బ్రత్యుపకారముగా నింద్రు డయిదుగురు రాక్షసులను బంపగా వారలు కావేరీ పద్దినములోని (కావేరీపట్టణము) నాగులనుసంహరించి పట్టణమును చోళరాజుకు వశపరచిరి. తమిళులాపట్టణమునకు చంపాపతి అని పేరు పెట్టిరివంగదేశమునకు చంపానగరము రాజధానుగ నుండెను. ఆ పేరునే వీరచ్చటిపట్టణమునకు బెట్టిరని యూహింపబడుచున్నది. తొండైమండలమును బాలించిన పూర్వరాజులు సాగరకులులకు సంబంధించిన వారుగా నుండిరి.కానీ ఇటీవలి పల్లవులు తాము భారద్వాజులమని చెప్పుకొనుచుండిరి. ఇప్పటి చెంగలుపట్టు ఉత్తరార్కాడు మండలములే తొండైమండలముగా నాకాలమున బ్రసిద్ధివహించి యుండినవి. ఈ తిరయార్ తెగలోని కుటుంబము లయిదు వేర్వేరు నామములతో బిలువబడుచుండినవి. వంగదేశపు తిరయారులు పౌంగల తిరయారులని, చీనాదేశపు తిరయారులు చీనాతిరయారులని, కడరం (బర్మా) తిరయారులు, కడరతిరయారులులనియు, సింహళ ద్వీపతిరయారులనియు, పల్లవము తిరయారులనియు, పదునారవ శతాబ్ధము వరకు బిలువంబడుచుండిరి. తిరయారులకు వెనుకవచ్చిన వారు వనవారు లనెడి తెగవారు. వీరిని స్వర్గము నుండి వచ్చినవారనియెదరు. వీరు వంగదేశమునందలి యుత్తరపర్వత ప్రాంతభూముల నివసించుచుండెడివారు. వీరు దక్షిణ హిందూదేశమునకు వచ్చినప్పుడు సేలము జిల్లాలోని కొల్లికొండలకడను. నీలగిరులకడను, పడమటి కనుమలకడను నివాసములనేర్పరచుకొనిరి. చేరరాజు లీతెగలోనివారుగా నుండిరి. హిమాలయమునందలి వనవారులలో జేరినవారమని చెప్పుకొనుచు నీతెగలోని రాజులు " పవనర్మన్, ఇమయవర్మన్ " అను బిరుదు పేరులను వహించుచుండిరి. ఈ రాజులు మాత్రమేగాక పర్వత నాయకులకు నన్నన్, ఆలంబిల్వెలు మొదలగువారు కూడా వనవాసనాయకులని యర్ధమిచ్చెడు "వనవీరల్వేలు" లని పిలుచుకొనుచుండెడి వారు. లంకాద్వీపమేలెడి గజబాహునకు (క్రీ.త.113-105 సమకాలికుడైన "చెంకుడ్డునాన్" అనియడు చేరరాజొకడు మగధదేశమును బాలించు చక్రవర్తియగు కర్ణునితో (ఆంధ్రరాజగు శాతకర్ణుడితో) సఖ్యము జేసికొని హిమాలయముకు సామీప్యమున నార్యులతో యుద్ధము చేసెనని చిల్లపది కారమను తమిళకావ్యమునందు జెప్పబడినది. ఈ చరిత్రము నాంధ్రరాజులగూర్చి వ్రాయుప్రకరణమునందు సంపూర్ణముగా దెలుపబడును.

కాబట్టి తమిళజాతులకు మ్రాన్మరులు, తిరయారులు, వనవారులనియెడు మూడు తెగలవారును దక్షిణ హిందూదేశమున పాండ్య చోళ చేర రాజ్యములను స్థాపించిరి. ఇందలి చేరరాజ్యమునే కేరళరాజ్యమందురు. అశోకుని కాలమునాటికే యీరాజ్యము లేర్పడి యశోకవర్ధన చక్రవర్తికి లోబడక స్వతంత్రమును వహించి యుండినవి.[7]

అయినను పౌరాణిక గ్రంధకర్తలు పాండ్యచోళ కేరళ రాజ్యముల స్థాపించిన జాతులవారి యుత్పత్తిని మరగుపరచి వీరలనార్యరాజుల సంతతి వారినిగా జెప్పియుండిరి. పాండ్య చోళ కేరళ కోలు లనియెడి వారు పురువంశజుడైన దుష్యంతుని మునిమనుమలుగా నగ్నిపురాణ హరివంశములో వ్రాసియుండిరి. వీరలే పాండ్యచోళ కేరళ కోల రాజ్యములను స్థాపించి తద్వంశములకు మూలపురుషులయినారని కూడ వ్రాసిరి. కాని విష్ణుపురాణమునందు దుష్యం తునిసంతతిలో వీరిని జేర్చియుండ లేదు. మరియును పాండ్యచోళుల భ్రష్టతనొందిన క్షత్రియులని హరివంశము నుడువుతుంది.[8] మరికొన్ని పురాణముల యందు దక్షిణాపధముయొక్క కొట్టుకొన "అక్రీడు" డను రాజు తొల్లి పరిపాలించు చుండెననియు, అతనికి పాండ్య, కేరళ, కోల, చోళులను నల్వురు పుత్రులు కలరనియు వారిలో బెద్దవాడగు పాండ్యుడు స్వస్థానముననే రాజయ్యెననియు, తక్కినమువ్వురును, స్వదేశమును దాటి పైకి బోయి చోళ, కేరళ, కోలరాజ్యములను స్థాపించుకొని రనియును మరికొన్ని పురాణములు చెప్పుచున్నవి.

ఈ మూడు తెగలవారికి బిమ్మట కోనరులనియెడు మరియొక తెగవారు. వచ్చి కొంతకాలము వరకు బాండ్యులకు లోబడి తరువాత కొంగదేశమునకు (ఇప్పటి కోయంబత్తూరు జిల్లా) నధిపతులైరి.

తమిళులచే నివసింపబడుదేశము తమిళకమైనది.[9] ఈ తమిళకమున కుత్తరపు హద్దు వేంగడము వేంకటాచల (తిరపతి) మనబడుచున్నది. దక్షిణపుహద్దు కన్యాకుమార్యగ్రము. (Cape Comorin) తూర్పున బంగళా ఖాతమును పశ్చిమమున నరాబియాసముద్రమును గలవు ఈ హద్దులకు నడుమ నుండేడి దేశము తమిళకమని పేరు. తమిళులు దక్షిణా పధము యొక్క దక్షిణపుగొనకు రాకపూర్వము నాగులును ద్రావిడులును నివశించుచుండిరి. వీరికంటె సంఖ్యయందు గొరవడియుండుట చేత తమిళులు ప్రాచీన ద్రావిడభాష నవలంబింపవలసి వచ్చినది. వీరు ద్రావిడులలో గలిసిపోయి కొంతకాలమునకు నాప్రాచీన ద్రావిడ భాషను సంస్కరించిరి. వీరిభాష తమిళభాష. ఇదియే యింగ్లీషున "టమిల్" అనబడుచున్నది. వీరార్యులుగారు. ఆర్యులకు ప్రతిస్పర్ధులగ నుండుచువచ్చిరి. వీరిని మ్లేచ్చులని, సెఱవారని యార్యగ్రంధములు బేర్కొనియున్న వి. [10][11] ఈ ద్రావిడులు తమిళులు కూడా నార్యులకంటెను విలక్షణమయిన నాగరికతను గలిగియున్నట్లుగంపట్టుచున్నది. ఈ సంఘములవారే యిటీవల మనయాంధ్రదేశమున బ్రవేశించి యాంధ్రులలో గలిసిపోయినట్లుగా గన్పట్టెడివి.

ఆర్యులు-ఆర్యావర్తము.

అనేక సహస్రసంవత్సరములకు బూర్వమే యార్యులనెడి వారు హిమాచలమున కుత్తరభాగమున మిక్కిలి దూరమున మధ్యాసియా ఖండము నందు నివసించుచుండెడివారని బహుగ్రంధపరిశోధకులకు చరిత్రకారు లనేకు లభిప్రాయపడియున్నారు. అయినను ఉత్తరధృవమండలమే యార్యులజన్మస్థానమని ఋగ్వేదము నుండి కొన్ని ప్రమాణ వచనముల నెత్తి చూపి బాలగంగాధర తిలకుగారు "ఆర్కిటిక్ హోం " అనుగ్రంధమున విశేషముగా జర్చించి నిశ్చయించి యున్నారు. ఆర్యులు మొట్ట మొదట మధ్యాసియాఖండమునందుండినను, ఉత్తరధృవమండలమునందుండినను మరి యెచ్చట నుండినను క్రమముగా జనసంఖ్య పెరిగిన కొలది జన్మస్థానమున నివసించుటకుందావును ఉదరపోషణమున కాహారపదార్ధములను జాలక తమ జన్మస్థానమును విడిచిపెట్టి దక్షిణ దిగ్భాగమునకు గొందరును పశ్చిమదిగ్భాగమునకు గొందరును, వెడలిపోయిరి. వారిలో దక్షిణ దిగ్భాగమునకు వచ్చినయార్యులు హిందూదేశమునకు వాయవ్యదిశనున్న పర్వత మార్గములలో నుండి " సింధుతీరముకు వచ్చి యా మహానదిని దాటి దానికి దూర్పుననుండుదేశము నాక్రమించుకునిరి. ఈ ప్రదేశము సరస్వతీ దృషద్వతీ నదులకు నడుమనుండునది. ఈ భూమి మిక్కిలి పవిత్రమైనదిగా నెంచబడుచు వచ్చినది. దీనినే బ్రహ్మావర్తదేశమని దేవదేశమని పిలుచుచుండిరిని. మనుస్మృతియందు వా కొనబడినది. ఇచ్చటనే చాతుర్వర్ణ విభాగమును. యజ్ఞాది క్రతుకర్మలను ఆచరణలోనికి దేబడి పెంపొందినవి. ఇచ్చటినుండియే యార్యులు తూర్పునకును దక్షిణమునకుబోయి క్రమముగా హిమాలయముకును వింధ్యకు నడుంనుండెడి యావద్దేశము నాక్రమించుకొనిరి. దీనికే యార్యావర్తమని పేరు.

ఇట్లని మనుస్మృతి [12] వలనమాత్రమేగాక పతంజలికృత మహాభాష్యమువలనను వింధ్యోత్తరభాగం బార్యావర్తంబనియు, దేవదేశంబనియు, గౌడదేశంబుననియు, వ్యవహరింపబడియె నని తెలియుచున్నది. తద్దక్షిణభాగము మ్లేచ్చ దేశంబనియు, ద్రావిడదేశంబనియు, దక్షిణాపధమనియు వ్యవహరింపబడియెను.

దక్షిణాపథము.

నర్మదానదికి దిగువభాగము దక్షిణాపథమని పూర్వసంస్కృత గ్రంధ ములందు వ్రాయబడినది. దక్షిణశబ్ధములో నుండి దక్కినము పుట్టినది. అదియె హిందీభాషలో "డెక్కన్" అని చెప్పబడుచున్నది. అదియె "డెక్కన్" అని చెప్పబడుచున్నది. అదియెహిందీభాషలో "డెక్కన్" అని చెప్పబడుచున్నది. అదియె "డెక్కన్" అని యింగ్లీషున వాడంబడుచున్నది. డెక్కన్ అనుపదము దక్షిణశబ్ధము యొక్క వికృతరూపమని కొందరిచే భావించబడుచున్నది. డెక్కన్ దేశమున దక్షిణా పథదేశమె యని కొందరు చెప్పుచున్నారు. ఆర్యులుత్తరమునుండి దక్షిణమునకువచ్చిన మార్గమునుకు దక్షిణాపథదేశములని పేర్లు వచ్చినవి.

దక్షిణాపథదేశమునే ప్రాకృతభాషలో దభ్కిణాబదేశమని వ్యవహరించుచుండిరట![13] దక్షిణాపథమున చోళులయొక్కయు కేరళులయొక్కయు, దేశములుకలవని మార్కండేయ వాయుమత్స్య పురాణములో దెల్పబడియెను.[14] సహదేవుడు తన దక్షిణదిగ్విజయమును గూర్చి చెప్పుసందర్భమున దాను బాండ్యులను జయించిన తరువాత దక్షిణాపథమునకు బోయియుంటినని చెప్పినట్లుగ మహాభారతమున జెప్పబడినది.[15] సహ్యగిరియందు జనించు గోదావరి మొదలగునదులు దక్షిణాపథదేశములోనివని వాయుపురాణము దెల్పియుండియునర్మదాతాపీనదులనట్లు పేర్కొని యుండక పోవుట చేత నా రెండునదులు ప్రవహించెడి దేశములు దక్షిణాపథములోనివి కావని చెప్పవలసి యున్నది. [16] ఆంధ్రదేశము దక్షిణాపథములోనిదని యిదివరకే దెలిపియుంటిమి. దక్షిణాపథము వేర్వేరుగ్రంథ కర్తలచే వేర్వేరు విధములుగా నిరూపించబడుచున్నవనవచ్చును గాని సామాన్యముగావింధ్యకు దక్షిణ భాగమంతయు దక్షిణాపథముగానే వ్యవహరింపబడుచు వచ్చెననుటకు సందియము లేదు.

ఆర్యులు దక్షిణమునకు వచ్చుట.

ఉత్తరము నుండి యార్యులు దక్షిణమునకు వచ్చుటకు బహుకాలము పట్టి యుండును. ఆర్యాశ్రమములకు దక్షిణపర్వతముండెనని మనువు పతంజలి మొదలగువారు చెప్పియుండిరి. ప్రచండభాస్కరుని మార్గమునరికట్టి వింధ్యపర్వత మాకాశమంటుకుని విజృంభించి లోకమునంతయు నంధకారబంధురముగావించి గర్వించి యుండెనని పురాణకవుల భాషలో జెప్పబడినది. ఆర్యుల దక్షిణాపథము నవరోధించి గర్వించి యుండిన వింధ్యముయొక్క గర్వము నడంచు మహావీరుడు బయల్పడునంతవరకు నార్యులకు మార్గావరోధము గలిగియుండెను. అట్టి మహావీరు డగస్త్యమహర్షి. ఇతడు వింధ్యమును బాదాగ్రతములచే ద్రొక్కి పట్టి గర్వాపహరణము గావించి మరల సూర్యరస్మిని బ్రసరింపగ జేసి లోకమునుద్ధరించెనని పురాణములయందభివర్ణింపబడియెను. ఆర్యులలో మొదట నగస్త్యుడే వింధ్యపర్వతమును దాటి దక్షిణమునకు వచ్చినవాడని పైపురాణగాథను బట్టి స్పష్టమగుచున్నది. వింధ్యపర్వతము యొక్క పశ్చిమోత్తరభాగమునకు బారియాత్రమను పేరుగలదు. ఇచ్చటనే వేత్రపతి మొదలగు నదులు జనించి యున్నవి. ఆర్యులు దక్షిణయాత్రకు బయలుదేరి యీపర్వత పంక్తి పార్శ్వమునకే పోయియుండుత చేత దీనికి బారియంత్రమని పేరువచ్చి యుండునేమోనని భాండార్ కర్ గారూహించియున్నారు.

అగస్త్యుడు వింధ్యము కడవరకు దూర్పుగాబోయి గోదావరికి సమీపమున నొకయాశ్రమము నిర్మించుకొని యుండెను. శ్రీరాముడీయాశ్రమమునకు వచ్చినట్లు రామాయణమునందు చెప్పబడి యుండుటచేత యిప్పటికే యీదండకారణ్యమునం బ్రవేశించి యార్యులాశ్రమాదుల నెలకొల్పుచుండిరని ధ్రువబడుచున్నది. ఈ యగస్త్యాశ్రమము ప్రస్తుతపు గోదావరి మండలములోని భద్రాచలమునకు సమీపమున నుత్తరదేశమున్నదని రెండవ ప్రకరణమున నుదహరించియుంటిమి. మొట్టమొదట నార్యులు దక్షిణాపథమున ద్రొక్కినప్రదేశ మాంధ్రభూమిగానే గన్పట్టుచున్నను. కొందరార్యులు కొంకణదేశమునకును బోయినట్లు కూడా గన్పట్టుచున్నది.

కర్ణాటార్యులు.

కడపట నీ యాంధ్రదేశమునకు వచ్చినవారు కర్నాటకార్యులు. కర్ణమనగా కొండలోయ. వానియందు సంచరించు వారు కర్ణాటకార్యులని చెప్పబడుచున్నవారు. కొందరుద్రావిడులు దక్షిణదేశమున నుండి పశ్చిమోత్తరమునకు గ్రమముగా వ్యాపించి మలయపర్వత ప్రాంతములందున్న లోయలలో నివసించు మనుష్యులతో గలసి తమ ద్రావిడమును లోవలోని వారి స్వభాషయగు కన్నడము జేర్చి కొంతకాలమువరకు వాడుకొనుచుండగా నుత్తరదేశము నుండి కొం తకాలమున కార్యులు కొందరు వచ్చి యీకర్ణాటులతో గలసి తమ ప్రాకృత సంస్కృతములను వారి కర్ణాటక ద్రావిడములను గలిపి రూపభేదములతో వ్యవహిరించు కొనుటంజేసి వారి భాషయంతయు గర్ణాటంబనియె వ్యవహరింపబడుచుండెను. ఈ కర్ణాటకాంధ్రులే క్రమక్రమముగా గొందరాంధ్రదేశముకు వచ్చి యాంధ్రులలో గలిసిపోయిరి.

ఆంధ్రులార్యులా, అనార్యులా, ద్రావిడులా ?

ఆంధ్రు లాదిమనివాసులో ద్రావిడులో ఆర్యులో మనము నిశ్చయముగా జెప్పజాలముకాని యైతరేయ బ్రాహ్మణమునందు నాంధ్రులు విశ్వామిత్రుని సంతతి వారనియు, వానిచే శపింపబడి నారనియు జెప్పబడియుండుట చేత, యార్యాశ్రమముల యొక్క సరిహద్దుల నివసించుచుండినారనియు, జెప్పబడియుండుటంజేసి యీ యాంధ్రులు ఉత్తరదేశములోని యార్యులతో బోరాడి లేచి వచ్చి దండకారణ్యములోని యనార్యజనమధ్యమున సంచరించెడి యొక తెగవారైన యార్యులుగా గొందరు తలచుచున్నారు. ఆంధ్రులను పులిందుల తోడను శబరులతోడను జేర్చియుండుట చేతను వీరాదిమవాసులైన యనార్యులేమో యని కొందరు తలంచుచున్నారు. అనేకవిధముల ద్రావిడులతో విశేష సంబంధముతో గన్పట్టుచుండుట చేత వీరలు ద్రావిడులని మరికొందరు తలంచుచున్నారు. ఆంధ్రశబ్ధము యొక్క వుత్పత్తిని బట్టి చూచిన మొదటి యభిప్రాయము సరియైనదేమోయని తోచుచున్నది. మనుష్యులు నివసించుటకు సాధ్యముకాక యంధకారబంధురముగా నుండు మహారణ్య ప్రదేశమున కంధ్రమని యార్యులు పేరిడియుందురు. ఈ ప్రదేశమున మొదట ననార్యులే నివసించి యుండిరి. తమతెగవారు వెడలివచ్చి యీ యరణ్యప్రదేశము ననార్యజన మధ్యమున నివసించియుండుట చేత నార్యులు వీరికి నాంధ్రులని పేరుపెట్టి యుండవచ్చును. ఆంధ్రు లార్యులయినను ననార్యులైనను పేరుమాత్రమార్యులచే నీయబడినదనుట స్పష్టము. ఈయార్యాంధ్రులు తమతో బోరాడి [17] వేఱుపడి వచ్చి దస్యులతో గలిసి వర్తించుచుండుటచేత నార్యులు వీరినిగూడ దస్యులనుగానే భావించి వారినెట్లు చూచుచుండిరో వీరినిగూడ నట్లే చూచియుండవచ్చును. ఆర్యాంధ్రు లాకాలమున నీయరణ్యప్రదేశములయందు నాశ్రమముల నేర్పఱచుకొని యందందు నివసించుచుండిరిగాని వీరి ప్రదేశమార్యప్రదేశముగా నెన్నబడక యనార్యప్రదేశముగానే భావింపబడుచుండెను. ఆర్యాంధ్రులు మాట్లాడుభాష యసంస్కృతముగాని సంస్కృతభాషగాదు. అనార్యాంధ్రులు మాట్లాడుభాష పైశాచీ భాషగా నుండెను. ఆర్యాంధ్రులు మహారణ్య ప్రదేశమున ననార్యంధ్రజన మధ్యమున నివసించుచుండుటంజేసి వీర లార్యభాషకు నార్యాచారములకు దూరగులై తుదకు ననార్యసంబంధమె యొక్కుడుగా గలిగియుండిరి. ఆర్యాంధ్రులయొక్కయు అనార్యాంధ్రులయొక్కయు రక్తమిచ్చట సమ్మేళనమయ్యెను.ఆర్యాంధ్రుల యసంస్కృతంబును, అనార్యాంధ్రుల పైశాచీభాషయు నిచ్చట మిశ్రములగుచువచ్చెను. ఇట్లుకొంతకాలము జరుగునప్పటికి వీరెల్లరు నాంధ్రలయిరి. వీరు మాట్లాడుభాష యాంధ్రమయ్యెను. ఇదియొక ప్రాకృతభేదముగా నుండెను. ఐతరేయ బ్రాహ్మణకాలమునాటికి వింధ్యోత్తర ప్రదేశము మాత్రమె గాక యీ యాంధ్రదేశముగూడ కలదని యార్యులకు దెలిసియుండెను. మహాభారతము కురుపాండవులచారిత్రంబగుటం జేసియు గురుపాంచాలాదులును, దుష్యంత భరత పరీక్షిజ్జనమేజయాదులును నైతరేయ బ్రాహ్మణంబున బేర్కొనంబడియుండుటం జేసియు, నైతరేయ బ్రాహ్మణ మైతరేయుండను మహీదానఋషిచే మహాభారత యుద్ధానంతరమె దెలుపబడినదని తేటపడుటం జేసియు నాంధ్రులుగూడ మూడువే లేండ్లనుండి యున్నారని మనకు నిశ్చయుముగా దెలియుచున్నదిగాని యాకాలము మొదలుకొని యేడెనిమిది శతాబ్దముల వరకు ననగా గ్రీస్తుశకమునకు బూర్వము మున్నూరు సంవత్సరముల క్రిందట నుండి యేకచ్ఛత్రాధిపత్యము వహించి పాటలీపుత్రము రాజధానిగా భరతఖండము విశేషభాగమున బరిపాలించిన చంద్రగుప్తచక్రవర్తి కాలమునాటి వరకు మరల నాంధ్రుల ప్రశంస యే గ్రంథమునందును గానంబడదు.

  1. Mr G. Mekengie's District Manual of Kistna.
  2. Mr B.Corralkael's District Manual ofViza---tarn.
  3. నరసదృశా వానరాయని లేక వికల్పనరా వానరాయని వ్యుత్పత్తి (అనగా గొండవాండ్రు, కోదు వాండ్రు, మొదలగు ననాగరిక జాతులచే నిండి యుండినది )
  4.  శ్లో. తతస్తు క్షత్రియాః కేటి జ్జామదగ్ని భయార్ద తాః
    తేషాం స్వస్వహితం కర్మ తద్భయాన్నా నుతిష్ఠి తామ్
    ప్రజా వృషలతాం ప్రాప్తాబ్రాహ్మణానామదర్శనాత్
    ఏవం తే ద్రావిజాభీరాః పుండ్రాంశ్చ శబరైస్సహ
    వృషలత్వం సరిగతా వ్యుత్థా నాక్షత్రధర్మిణః

  5. శ్లో చాతుర్వర్ణ్యవ్యవస్థానం యస్మిన్ దేశే నవిద్యతే
    తం మ్లోచ్ఛవిషయం ప్రాహు రార్యావర్తాదనంతరమ్. అని
    భోదాయనస్మృతి మనుధర్మశాస్త్రము అధ్యాయము ౧౦ శ్లో ౪౩
    "పౌండ్రాకాశ్చౌఢ్ర "ద్రవిడాః" కాంభోజాయపనాశ్చకాః
    పారదాపహ్లవాశ్చీనాః కిరాతాదరదాఖశాః"
    మనుధర్మశాస్త్రము, అధ్యాయము. ౧౦ శ్లో౪౪

  6. Taw Sein Ko in the Indian Antiquary, Vol xxiii p 8.
  7. Indian Antiquary, Vol xx p. 212.
  8. Prof. H.H.Wilson's Historical Sketch of the Pandyan Kingdom. Journal of the Royal Asiatic Society Vol. ii Act ix p.199
  9. The Tamils: eighteen hundred years ago pp.10-12
  10. In early times all Dravidian were regarded as outcasts and even a Brahmin who came to the Dravida country was held to be a Mlecha(Census report 1891. Vol. xiii para 332.)
  11. శ్లో. సరస్వతీదృషద్వత్యో ర్దేవవద్యోర్యడంతెరం|
    తందేవనిర్మితందేశం బ్రహ్మవర్తం ప్రవక్షతే|| అని మనుస్మృతి అ.2-17

  12. శ్లో. అనముద్రాత్తువైపూర్వా దానము ద్రాత్తుపశ్చిమాత్

    తయోరేవాంతరంగిర్యో ర్యార్యావర్తంవిదుర్బుధా అని మనుస్మృతి.

  13. Ind. Ant, Vol viii. p.143
  14. మార్కండేయపురాణము. అధ్యాయము 57. శ్లోకము. శ్లోకము 45. పాఠము రెండవపంక్తి తప్పుగనున్నది. పాండ్యాశ్చైవ కేరళాశ్చైవ చోళాఃకుల్యాస్తధైవచ. అని యుండవలయును. వాయుపురాణము. అధ్యాయము, 45, శ్లోకము. 174. మత్స్యపురాణము, అధ్యాయము 117 శ్లోకము 43.
  15. మహాభారతము. సభాపర్వము. అధ్యాయము. 31 . శ్లోకము 17.
  16. వాయుపురాణము. అధ్యాయము 45 శ్లోకము 104.
  17. Dr. Bhandarkar's Early History of Deckhan p.2