ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదుమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
పదుమూడవ ప్రకరణము.

ఆంధ్ర చాళుక్యులు.

(క్రీ.శ. 7వశతాబ్దము మొదలుకొని 13 వ శతాబ్దమువఱకు.)

ఏడవశతాబ్దారంభమున జాళుక్యు లాంధ్రదేశముపై దండెత్తివచ్చి పల్లవరాజులను జయించి దేశమును స్వాధీనముపఱచుకొని నాటనుండి వేంగీదేశమును బరిపాలింప గడంగిరని పూర్వప్రకరణమున దెలిపియుంటిమి. "ఈచాళుక్యులెవ్వరు? ఎచ్చటినుండి వచ్చినవారు? వీరియుదంతమేమి?" అని చదువరులుప్రశ్నింపవచ్చును. కాబట్టి యాంధ్రచాళుక్యుల చరిత్రముందెలిసికొనుటకు బూర్వము వారి పూర్వుల రాజ్యక్రమము సంక్షిప్తముగా నిందు దెలుపుట యనావశ్యకముగాదు. చాళుక్యుల జన్మాదిక కథనమంతయు గల్పిత గాథలతో నిమిడియున్నది. అయిన నవియె మనకు శరణ్యములుగానున్నవి. ఈ కల్పితగాథలు గ్రంథములలోనికిని శాసనములలోనికిని గూడ నెగ బ్రాకినవి. బిల్హణ కవి విరచితమైన విక్రమాంక దేవచరిత్రమునందు చాళుక్యుల జన్మకథనము కొంత వివరింపబడినది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ప్రాత కాల కృత్యంబుల నిర్వర్తించుచుండ నచ్చటికి నింద్రుడు చనుదెంచి ప్రపంచముననే మనుష్యుడును యజ్ఞయాగాది క్రతువులనాచరించి దేవతలకు హవిర్భాగంబుల నొసంగకుండుట జేసి పాపము వర్థిల్లుచున్నదని మొఱవెట్టుకొని యెనట! అంతట బ్రహ్మదేవుడర్ఘ్యమిడు నిమిత్తముదకమునకై పట్టియుండిన తన చులుకము (పుడిసిలి) కేసి చూచెనట! అంతటా చులుకమునుండి మహాయోధుడొకండు జనించి చాళుక్యవంశమునకు గర్తయయ్యెనట! తరవాత మఱికొంతకాలమునకు నా వంశమునందు హరితుడు మానవ్యుడునను నిరువురు మహావీరులు జనించి జగద్విఖ్యాత కీర్తిగాంచిరి. వీరి మొదటి రాజధాని అయోధ్యానగరముగా నుండె నట! పిమ్మట నీవంశములో నొకశాఖవారు దక్షిణాపథమునకు వచ్చిరట! ఈ విక్రమాంక దేవచరిత్రము విక్రమాంక దేవుడను నామాంతరముగల పశ్చిమ చాళుక్యరాజయిన యాఱవ విక్రమాదిత్యుని చరిత్రమును దెలుపునదియై యున్నది. ఆంధ్రచాళుక్యులగు విమలాదిత్యుడు, రాజరాజనరేంద్రుడు, విక్రమచోడుడు మొదలుగువారు ప్రకటించిన శాసనములలో నీగాథయె కొంతమార్పు తో బ్రకటింపబడినది. విజయాదిత్యు డయోధ్యానగరమునుండి దక్షిణాపథము మీద దాడివెడలివచ్చి యీదేశమును బరిపాలించుచుండిన త్రిలోచన పల్లవునితో యుద్ధము చేసి రణవిహతుడైనట్లును, పతి వెంటవచ్చిన యాతనిపట్టమహిషి గర్భవతియై యుండి యా యాపత్సమయములో బురోహితుని గొందఱు పరిచారికలను వెంటగొని ముదినే మనియెడి యగ్రహారమునకు దప్పించుకొని పోగా విష్ణుభట్ట సోమయాజియను బ్రాహ్మణుడామె నాదరించి తన గృహమున నుంచుకొని తాను గన్నకూతురువలె జూచి యామె గర్భమునబుట్టిన మగ పిల్లవానికి క్షత్రియోచితములయిన జాతకర్మాది సంస్కారములు నడిపి విష్ణువర్థనుడని పేరుపెట్టి పెంచినట్టును, అతడు ప్రాయము వచ్చినవెనుక తన తల్లివలన సర్వవృత్తాంతమును దెలిసికొని చళుక్యపర్వతమునకు బోయి తపస్సుచేసి తన తండ్రి రాజ్యమును వహించి కదంబులను గాంగులను జయించి నర్మద మొదలుకొని సేతువువఱకు నున్న యేడుకోట్ల యేబదిలక్షల గ్రామములు గల దేశమంతయును బరిపాలించినట్టును పైశాసనములలో జెప్పబడియున్నది. నాటనుండియు చాళుక్యరాజులకు విష్ణువర్థనుడను పేరు పరంపరగా వచ్చుచుండెను. చాళుక్యుల తామ్ర శాసనములలో మొదట వీరు మానస్యగోత్రులనియును హారిత పుత్రులనియును దెలుపబడియుండెను. వారలు సప్తమాతృకల రక్షణముగలిగి కార్తికేయానుగ్రహమున నభ్యుదయమునుగాంచిరి. వారు నారాయణానుగ్రహముచే వరాహధ్వజమును బడసి యా ధ్వజము నీడనుండి అనేకరాజులను వశపఱచుకొనిరి. ఆఱవశతాబ్దమున మొట్టమొదట జయసింహుడను రాజు రాష్ట్రకూట రాజయిన కృష్ణుని కుమారుడగు నింద్రుని నుక్కడంచి రాజ్యమును స్థాపించి చాళుక్యవంశ కర్తయయ్యెనని యేవూరు మిరా జు శాసనముల వలన దెలియుచున్నది. [1]దక్షిణ దేశముల బాలించిన చాళుక్యరాజులలో మొదటివాడు జయసింహుడు. విష్ణుశర్మచేత సంరక్షింపబడిన చళుక్యపర్వతమున గౌరిని గూర్చి తపస్సు చేసి సేవలను గూర్చికొని వచ్చి దక్షిణ హిందూస్థానమునంతను జయించెనని చెప్పబడిన విజయాదిత్యతనూభవుండగు విష్ణువర్ధనుడు తాను పొందిన జయములను బట్టి జయసింహుడను బిరుదు నామమును బొందినట్టు కనబడుచున్నది.

ఒక చిత్రమైన సంబంధము.

ఆంధ్రసామ్రాజ్యమునకు లోబడి క్రీస్తు శకము రెండవ శతాబ్దమున హారితిపుత్త్ర శాతకర్ణియను నాంధ్రరాజు కర్ణాటకమును బాలించుచుండెననియును వానికి వనవాసి (Banavasi) రాజధానిగనుండెననియు నింతకు బూర్వము దెలిసికొనియుంటిమి. తరువాత నా దేశము గాంగులకును పల్లవులకు నటు పిమ్మట కదంబులకును స్వాధీనమై నాల్గవ శతాబ్దాంతము వఱకును వారలచే బరిపాలింపబడియెను. ఈ ప్రాచీన కదంబులు జైనమతావలంబకులుగ నుండిరి. మఱియు వీరలు మానవ్యగోత్రులమనియు హారితిపుత్త్రులమనియును జెప్పుకొనిరి, [1] కదంబులకు దరువాత నుత్తర కర్ణాటకమునకు రాష్ట్రకూటులు ప్రభువులయిరి. ఆఱవశతాబ్దాదిని చాళుక్యుడయిన జయసింహుడు కర్ణాటకమును బాలించెడి రాష్ట్రకూట రాజయిన కృష్ణుని కుమారుడగు నింద్రుని నుక్కడించి రాజ్యమాక్రమించుకొనియెనని యేపూరుమి రాజు శాసనములు చాటుచున్నవని పైనిజెప్పియుంటిమి. ఈ చాళుక్యులును తాము మానవ్యగోత్రులమనియును, హారితిపుత్త్రుల మనియును జెప్పుకొనిరి. వీరిలోనుండి మఱియొక శాఖగాజీలి యాంధ్రదేశమును బాలించిన పూర్వచాళుక్యులును గూడ తాము హారితిపుత్త్రుల మనియును మానవ్య గోత్రులమనియును జెప్పుకొనిరి. చాళుక్యుల శాసనములలోని గాథలో హారితిపుత్త్రులను పేరెట్లు వచ్చినదియు దెలుపబడియుండలేదు. ఒక శాసనమునందు హారితిపుత్త్ర యనునది హారితపుత్త్రయని పేర్కొనబడినది. విక్రమాంక దేవ చరిత్రమున జాళుక్యవంశమున హరితుడు మానవ్యుడునను వీరులు జనించి ప్రసిద్ధులయిరనిన పేర్కొనబడియుండెను. ఆంధ్రభృత్య వంశములో జేరిన "గోతమిపుత్త్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్త్ర శాతకర్ణి, మాధారిపుత్త్ర శకసేనుడు" అను వారి పేరుల రీతిగానే హారితిపుత్త్ర శాతకర్ణియను పేరులోని హారితిశబ్దము స్త్రీ వాచకమైయుండెను.హారితిశబ్దము హారిత శబ్దముగా మార్చుట చిత్రముగానున్నది. చాళుక్యులుత్తరముననున్న కాలమునగూడ హారితపుత్త్రులను పేరు గలిగియున్నట్లుగ విజయవర్మ యొక్క కైరా శాసనము చాటుచున్నది. అలహాబాదు ప్రాంతముననున్న రీవాలోని యొక శాసనము మహీపాలుని నామమో లేక మఱియొక విడి మనుజుని పేరో తెలియదు గాని హరితిపుత్త్ర శౌనకుడని యొక నామమును పేర్కొనుచున్నది. ఈ శాసనము క్రీస్తునకు పూర్వము రెండవ శతాబ్దలోనిదిగ నొకరు చెప్పియున్నారు గాని డాక్టరు బర్గెస్సుగారంత పూర్వపు శాసనముకాదని యభిప్రాయపడియున్నారు. [2] ఈ చిత్రమైన సంబంధమునుబట్టి చూడగా జాళుక్యులు గూడ దక్షిణాపథములోని వారేనని యయోధ్యనుండి వచ్చిన వారు గారనియు, ఆంధ్రపహ్లవ సంయోగము వలన జనించిన పల్లవులనియెడి సంకీర్ణజాతి వలెనె ఆంధ్రశక సంయోగము వలన జనించిన యొక సంకీర్ణజాతిగా నుండనోపుననియు, ఇట్లు హిందూమతావలంబులయిన పల్లవులును చాళుక్యులును తాము సంకీర్ణ జాతుల వారమని తెలియబడకుండ దమజాతి శ్రేష్ఠత్వము నిరూపించుటకై యార్యక్షత్రియులమని పౌరాణిక క్షత్రియ వంశములతో దమ వంశములను బంధించి చంద్రవంశజులమని జెప్పుకొనసాగిరని మా యభిప్రాయము. పదునొకండవ శతాబ్దమునందలి చాళుక్యుల శాసనములలో మాత్రమె పౌరాణిక వంశవృక్షము గల్పింపబడినది గాని యంతకు బూర్వపు శాసనములలో గానరాదు. పూర్వచాళుక్య శాసనములలో రణస్థిపూడి, కోరుమిల్లి చెల్లూరు శాసనములలో బౌరాణిక వంశము వివరముగా వర్ణింపబడినది. ఈ శాసనములలో రణస్థిపూడి శాసనము విమలాదిత్యునిచే వ్రాయబడినది గావున దక్కిన వానికంటె బూర్వమునందుండినది. ఈ శాసనమును వ్రాసినవాఁడు భీమనభట్టను బ్రాహ్మణుఁడు గావునఁ బౌరాణిక వంశవృక్షమును మొదట గల్పించినవాఁ డితఁడేయై యుండవలయునని కొందఱు తలంచుచున్నారు.

చాళుక్యవంశము.

జయసింహవల్లభమహారాజు.

ఇతఁడు విజయాదిత్యుని కుమారుఁడనియు విష్ణుభట్ట సోమయాజివలనఁ బెంపఁ బడి విష్ణువర్ధనుఁడను నామమును వహించి యుక్తవయస్సు వచ్చిన తరువాత చళుక్యపర్వతమునకుఁబోయి గౌరినిగూర్చి తపస్సు చేసివచ్చి కొంతసేనను గూర్చుకొనిపోయి కదంబులను గాంగులను, రాష్ట్రకూటులను యుద్ధములోనోడించి రాష్ట్రకూటరాజయిన యింద్రుని నుక్కడించి వాని రాజ్యమును గైకొని వాతాపినగరము రాజధానిగాఁ బరిపాలనముచేయనారంభించెనని యిదివఱకె దెలిపియుంటిమి. ఈజయములవలన నే యీతనికి జయసింహుఁడను బిరుదు నామముగలిగినది. ఈజయసింహుఁడు కాంచీపురాధీశ్వరుండయిన పల్లవరాజు కొమార్తెను వివాహముఁ జేసికొని యామెవలన విజయాదిత్యుఁడను కుమారుని గాంచెను.

రణరాగుఁడు.

ఈ విజయాదిత్యుఁడు బహుపరాక్రమవంతుఁడై పరరాజులతో యుద్ధములుసలుపుచు రణరాగుఁడను బిరుదును గాంచెను. వీనికిఁ బులకేశివల్లభుఁడను కుమారుఁడు కలిగెను.

శ్రీపులకేశివల్లభ మహారాజు.

ఇతఁడశ్వమేధాది యాగములఁ బెక్కింటి నాచరించి విశేషకీర్తి సంపన్నుఁడయ్యెను. మఱియును వాతాపి నగరమును పునర్నిర్మాణముఁ గావించి రాజధానిగఁ జేసికొని పరిపాలించెను. ఈ చాళుక్యవంశమునఁ బ్రఖ్యాతిఁగాంచినవారిలో మొదటివాఁ డీతఁడేయని తోఁచుచున్నది. వీని తరువాతి శాసనములన్నియు వీని పేరుతో వంశము వర్ణించుటకుఁ బ్రారంభించుచు వచ్చినవి. సత్యాశ్రయ శ్రీపులకేశి వల్లభ మహారాజనునది వీని సంపూర్ణమైన బిరుదనామముగానున్నది. వీనికుమారుడు కీర్తివర్మ మహీపాలుడుగానుండెను.

శ్రీకీర్తివర్మవల్లభ మహారాజు .

ఇతడుత్తర కొంకణమును బాలించెడి మౌర్యులను, ఉత్తరకర్ణాటములోని వనవాసిని బాలించెడి కదంబులను జయించి ఖ్యాతిగాంచెను. వీనికి "పులకేశి జయసింహుడు, విష్ణువర్ధనుడు" అను ముగ్గురు కుమారులుండిరి కాని కీర్తివర్మ మరణానంతరము వాని పుత్రులు మిక్కిలి పసివాండ్రుగనుండుటచేత కీర్తివర్మ సోదరుడు మంగళేశుడు రాజ్యభారమును వహించి పరిపాలనము సేయుచుండెను.

మంగళేశుడు.

ఇతడు రాజ్యమునకు వచ్చిన తరువాత త్రిపురమును రాజధానిగా చేది దేశమును బాలించుచుండిన కాలచుర్యులను రాజులను జయించెను. ఇతడు తన దిగ్విజయయాత్రలను పూర్వపశ్చిమ సముద్రముల వఱకు బఱపెనని చెప్పుదురు. పశ్చిమసముద్ర తీరమునందలి రేవతీద్వీపమునితడు వశము జేసికొనియెను. ఇతడు విష్ణ్వాలయములను నిర్మించి భూములొసంగి బ్రాహ్మణుల కనేక దానధర్మములను గావించి పేరుపొంది యిరువది నాలుగు సంవత్సరములు పరిపాలనము చేసి యుండెను. వీని తరువాత రాజ్యమునకు వచ్చినవాడు కీర్తివర్మ జ్యేష్ఠకుమారుడయిన పులకేశి. మంగళేశుడు తన తరువాత తన కుమారుడే రాజ్యపాలనము చేయుటకై రహస్యముగాబ్రయత్నములు చేయుచుండుటను గనిపెట్టి యుక్తవయస్సు వచ్చి మిక్కిలి సామర్థ్యము గలిగియుండిన పులకేశి వాని ప్రయత్నములనన్నిటిని భగ్నముగావించి రాజ్యాధికారమునంతను దాను బూని పరిపాలించుచుండెను. మంగళేశుడు తన కుమారునికి పట్టము గట్టవలెనని చేయుచుండిన ప్రయత్నములో దన ప్రాణములను రాజ్యమునుగూడ గోల్పోయెను.

శ్రీ పృథ్వీ వల్లభ మహారాజు.

ఇతడు శాలివాహనశకము 533నకు సరియైన క్రీస్తుశకము 611వ సంవత్సరమున సింహాసనమునకు వచ్చెనని యొక శాసనమునుబట్టి దెలియుచున్నది. మంగళేశుని మరణానంతరము నదివఱకు మంగళేశుని పరాక్రమమునకు వెఱచి యణగియుండిన శత్రురాజులందఱును విజృంభించి పులకేశిపై దండెత్తిరి. ఆ యుద్ధములలో బులకేశియు వాని సైన్యములు నసమానాద్భుత శౌర్యపరాక్రమశక్తులను జూపుటచేత గొందఱు పలాయనులయిరి. అధికశౌర్యవంతుడును రాష్ట్రకూటరాజును నగు గోవిందరాజు పులకేశిని శరణువేడెను. పులకేశి వానిని మిత్రునిగా జేకొనివానికి ననేక బహుమానములొసంగెను. పిమ్మట నాతడు వనవాసిని ముట్టడించి కదంబులను జయించి వశపఱచుకొనియెను. చేరదేశమును బాలించుగాంగులు వశులయిరి. తరువాత కొంకణదేశములోని మౌర్యులపై దాడి వెడలి వారిని సులభముగా లోబఱచుకొనియెను. నూఱుయోడలతో బయలుదేఱి సముద్రలక్ష్మియని పిలువబడుచుండిన సముద్రతీరమునందలి పూరియనుపట్టణమును ముట్టడించెను. ఇది పూర్వము మౌర్యులకును దరువాత శిల్హారరాజులకును రాజధానిగనుండెను. తరువాత లాటమాళవమూర్జరరాజులు వానిచే జయింపబడి కప్పములు గట్టుచుండిరి. ఇక్కాలమున నుత్తరహిందూదేశమునగన్యాకుబ్జము రాజధానిగ జేసికొని యుత్తర హిందూదేశమునంతనుజయించి సార్వబౌముడైయుండిన హర్షవర్ధనుడు దక్షిణదిగ్విజయయాత్రకు బయలువెడలినప్పుడు పులకేశి యెదుర్కొని వానిని క్రిందికిరానీయక వానిమనోరథమును భగ్నము గావించెను. అంతటినుండి పులకేశి రాజపరమేశ్వరుడన్న బిరుదాభిదానమును వహించెను. వీనిసంపూర్ణమైన నామము సత్యాశ్రయ శ్రీపృథ్వీవల్లభమహారాజనునదిగానుండెను. ఇతడు మహారాష్ట్రకములనియెడు మూడురాజ్యములకు ప్రభువయ్యెను. సర్వవిధములచేతను చాళుక్యులలో బహుసమర్థుడుగానుండెను.

పూర్వదిగ్విజయయాత్ర.

ఇతడాఱవశతాబ్దాదిని బహుసేనలంగూర్చుకొనిపోయి దక్షిణకోసలమును జయించి కళింగవేంగిదేశములపై దండెత్తివచ్చి మొట్టమొదట పిష్ఠపురమును ముట్టడించెను. ఈతని దండయాత్రలో నీసత్యాశ్రయపులకేశివల్లభునికి గనిష్ఠసోదరుడును యోధవరుడునగు విష్ణువర్ధనుడుగూడ నుండెను. ఆ కాలమునందు పిష్ఠపుర (Pithapuram)దుర్గము శత్రువులకు దుస్సాధ్యమైనదిగ నుండెను. ఈ చాళుక్యులు పిష్ఠపురదుర్గమును ముట్టడించి స్వాధీనము జేసికొనిరి. ఇట్ల కళింగమును వేంగిని వశపఱచుకొని శ్రీసత్యాశ్రయ పృథ్వీవల్లభమహారాజు పల్లవనాయకుని కాంచీపురదుర్గములో దలదాచుకున్నట్లు చేసెనని అయిహోలె శాసనమున బేర్కొనబడినది.[3] ఈ శాసనములోని వాక్యమునుబట్టి పిష్ఠపురమును బాలించుచుండినది పల్లవులని తేటపడుచున్నది. ఈపులకేశి రెండవతమ్ముడయిన విష్ణువర్ధనుని దనకు బ్రతినిధిగానుండి కళింగవేంగి దేశములను బరిపాలనము చేయవలసినదిగా నియమించి తనదేశమునకు వెడలిపోయెను. ఈ విష్ణువర్ధనుడే తరువాత స్వతంత్రుడై మొదటివిష్ణువర్ధనుడను పేరుతో వేంగిరాష్ట్రమును బరిపాలించి పూర్వచాళుక్యవంశస్థాపకుడయ్యెను.

ఆంధ్రచాళుక్యులు.

కుబ్జవిష్ణు వర్ధనమహారాజు.

(క్రీ.శ.615మొదలుకొని 633 వఱకు.)

ఆంధ్రచాళుక్యలలో మొదటివాడయిన యీ విష్ణువర్ధనుడు మఱుగుజ్జుగనుండుటచేతను గాబోలు నీతనిని కుబ్జవిష్ణువర్ధనుడందురు. ఆంధ్రదేశమును బాలించిన విష్ణువర్ధనులలో నితడు మొదటివాడు. ఇతడు మొదట యువరాజుగనుండి మహారాష్ట్ర దేశములోని సతారా పంఢరపురమండలములను బరిపాలించుచుండెను. భీమరథీతటమున నొక గ్రామమునుబ్రాహ్మణులకు దానము చేసెనని తెలిపెడి దానశాసనమొకటి సతారాలో గాన్పించినది. [4]

సత్యాశ్రయుడు కళింగమును వేంగినిజయించిన తరువాత పరిపాలకుడుగా నియమింపబడి స్వతంత్రుడై 615వ సంవత్సరమున చైత్రశుద్ధపూర్ణిమ తరువాత మహారాజ పదవిని గాంచి 633వ సంవత్సరమువఱకును పదునెని మిది సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతడు విషమంబులై దుస్సాధ్యములుగనుండిన దుర్గమంబులను సాధించి మనోరథసిద్ధిని గాంచినవాడు గావున విషమసిద్ధియను బిరుదమును వహించినవాడు. ఈబిరుదమును వహించినవారిలో నితడే మొదటివాడు. ఇతడు పిష్ఠపురము రాజధానిగా జేసికొని కళింగవేంగిదేశములను బరిపాలించినవాడు, వీనికి పిష్ఠపురము రాజధానిగ నున్నట్లు విశాఖపట్టణ మండలమున సర్వసిద్ధి తాలూకాలోని తిమ్మాపురశాసనమువలన బోధపడుచున్నది. [5] ఈ శాసనముయొక్క భాష సంస్కృతము. లిపి వేంగిలిపిగానున్నది. ఈ శాసనముయొక్క వైఖరి కళింగగాంగులయిన యింద్రవర్మయొక్క అచ్యుతాపురశాసనమును, దేవేంద్రవర్మయొక్క శ్రీకాకుళశాసనమును బోలియున్నది. ఈ శాసనమునందితడు సత్యాశ్రయవల్లభమహారాజుయొక్క (రెండవపులకేశి) ప్రియానుజుడనియు, కీర్తివర్మ యొక్క ప్రియసుతుడనియను, రణ విక్రముని (మొదటి పులకేశి) పౌత్రుడనియు, రణరాగుని (విజయాదిత్యుడు) ప్రపౌత్రుడనియు జెప్పబడియుండెను. ఇంతియగాక వీనిశాసనములు మఱిరెండు గానుపించుచున్నవి. అందొకటి విశాఖపట్టణ మండలములోని చీపురుపల్లి శాసనముగానున్నది. ఈ విష్ణువర్ధనుడు దిమిల సీమలోని కలవకొండ గ్రామమును తనరాజ్యకాలముయొక్క పదునెనిమిదవ సంవత్సరమున శాలివాహనశకము 555శ్రావణ శుద్ధపూర్ణిమ నాటి (క్రీస్తుశకము 672(?)వ సంవత్సరము జూలయి నెల7 వతేది) చంద్రగ్రహణకాలమున విష్ణుశర్మమాధవశర్మలను బ్రాహ్మణులకు దానముచేసెనని చెప్పబడినది. ఈ దాన శాసనము పూ (కి) లేక పక్కి (పక్షి) రాష్ట్రములోని చెఱుపూరునండి (చీపురుపల్లి) ప్రకటింపబడినది.[6] విశాఖపట్టణమండలములో సర్వసిద్ధితాలూకాలోనియెల్లమంచిలి గ్రామమునకు రెండున్నర మైళ్లదూరమున దిమిలయనుగ్రామము పూర్వము మిక్కిలి ప్రఖ్యాతికెక్కినదిగ గానిపించుచున్నది. ఈ దిమిల ప్రాంతప్రదేశము దిమిలిసీమగా నేర్పడినది. [7] ఈ విషమసిద్ధి విష్ణువర్ధనుని మఱియొక శాసనము గుంటూరుమండలములోని చెజ్జరాలయను గ్రామమునందు గానుపించినది.[8] ఈ శాసనములనన్నిటిని బరిశోధించిచూచిన నీతని రాజ్యము గంజాముజిల్లా మొదలుకొని నెల్లూరివఱకును వ్యాపించియుండినటుల గన్పట్టుచున్నది. వీనిరాజ్యమునకు నుత్తరమున కళింగగాంగులును దక్షిణమున గాంచీపురపల్లవులును, ఆంధ్రచోడులును,ఆంధ్రబాణులును, పశ్చిమంబున బశ్చిమ చాళుక్యులును రాష్ట్రకూటులును బరిపాలనము సేయుచుండిరి. కుబ్జవిష్ణువర్ధనునితో నీదేశమునకు బట్టవర్థన వంశజుడయిన కాలకంపుడనువాడు వెంబండించివచ్చెను. ఇతడు విష్ణువర్ధనునకు దళవాయిగనుండెను. ఇతడు జైనుడుగ గన్పట్టుచున్నాడు. ఈ దళవాయి దద్దరయను రాజును జయించెను. వీనిసంతతివారు చాళుక్యులుకడ మంత్రులుగను సేనాధిపతులుగనుండి సమ్మానములను గాంచుచుండిరి.

జయసింహవల్లభమహారాజు.

( 633మొదలుకొని663వఱకు)

కుబ్జవిష్ణువర్ధనుని తరువాత రాజ్యమునకు వచ్చినవాడతని జ్యైష్ఠపుత్రుడగు జయసింహుడు. ఈ జయసింహవల్లభ మహారాజు 633 వసంవత్సరము మొదలుకొని 663 వ సంవత్సరము‌వఱకును ముప్పదేండ్లు రాజ్యపరిపాలనము చేసెను. వీనికోరికలన్నియును సిద్ధించినవి గావున వీనికి సర్వసిద్ధియను నామము గలిగెను. వీనికాలముననే దిమిలి విషయములో సర్వసిద్ధియను పట్టణము గట్టబడినదిగా గాన్పించుచున్నది. ఇయ్యది పూర్వమొక ప్రఖ్యాతమైన పట్టణముగానుండెననుటకు సందియములేదు. ఇప్పడిది విశాఖపట్టణమండలములోని యెల్లమంచిలికి నైదున్నర మైళ్లదూరములోని చిన్నగ్రామముగానున్నది. ఈ గ్రామమునందు 1861వ సంవత్సరమము వఱకు తాలూకాకచేరియుండుటచేత నిప్పటికిని సర్వసిద్ధి తాలూకాయని వ్యవహరింపబడుచున్నది. [9]వీనిపేరుగల శాసనమొకటి కృష్ణామండలములోని పెదమద్దాలి గ్రామమునందు దొరకినది. ఈశాసనములో గృద్రాహార విషయములోని (గుడివాడ విషయము) పెణుకపఱ్ఱు గ్రామమును బ్రాహ్మణులకు దానముచేసినట్లు చెప్పబడినది. ఇయ్యది జయసింహుని రాజ్యకాలముయొక్క పదునెనిమిదవ సంవత్సరముననుదయపురమునుండి ప్రకటింపబడినది. [10] ఉదయపురమెక్కడిదో తెలియకున్నది. ఒకవేళ వేంగిపురమునకే యుదయపురమను పేరుకలదేమోయని సందియము కలుగుచున్నది. అట్లయినచో నితడు తండ్రివలె పిష్ఠపురము రాజధాని జేసికొనకవేంగిపురమునే రాజధానిగ జేసికొని యుండవలయును. వీనికాలములోనే హౌనుత్సాంగను చీనాయాత్రికుడీదేశమును జూడవచ్చెను. అతడీదేశమును అంతాలో (An-to-lo) అనగా ఆంధ్రమనియును, వేంగిపురమును పింకిలో (Pim-khi-lo) అనియును బేర్కొని యుండుటగూడ జయసింహుడు వేంగిపురముననుండెనని సూచించుచున్నది. అయిననింకను విచారింపవలసియున్నది. ఈ దేశమున నాకాలమున జనసంఖ్య బహుస్వల్పముగనుండెనని హౌనుత్సాంగు దెలిపియున్నాడు. ఒక ప్రక్కనుండి గాంగులు మఱియొక ప్రక్కనుండి కదంబులు నొకవైపునుండి చోడులు మఱియొక వైపునుండి రాష్ట్రకూటులు నింకొకదిక్కినుండి కళింగగాంగులు ముట్టడించుచుండగా నీదేశము వేడిమంగలమువలె వేగుచుండునపుడు జనసంఖ్య యొట్లభివృద్ధిగాంచగలదు? అయినను చాళుక్యరాజులు బహుసమర్థులును మిక్కిలి బలాఢ్యులునగుటవలన స్వరక్షణమందేమఱకయుండి రాజ్యమును గాపాడుకొనుచువచ్చిరి.

ఇంద్రభట్టారకుడు.663

ఇతడు కుబ్జవిష్ణువర్ధనుని ద్వితీయపుత్రుడు; జయసింహునితమ్మడు ఈయింద్రభట్టారకుడు పట్టాభిషిక్తుండయిన వెంటనె సామంతరాజులును శత్త్రురాజులును నేకమై వీనిని పదవీభ్రష్టునిగావింపవలయునని కుట్రచేయ నా రంభించిరి. ఈ రాజద్రోహులకు నధిరాజేంద్రవర్మ నాయకుడుగా నుండెనని ప్రభాకరమహారాజుకుమారుడగు పృథ్వీమూలుని యొక్క గోదావరిమండలశాసనము దెలుపుచున్నది. [11] అధిరాజేంద్రుడు కళింగనగరమును రాజధానిగ నుత్తరకళింగమును నేలుచుండుగాంగవంశజుడయిన యింద్రవర్మ మహారాజేగాని యన్యుడు గాడు. [12] వీని రాజ్యము చాళుక్యరాజ్యమునకు నుత్తరమున నున్నది. ఆ రాజులతో జరిగిన యుద్ధములో నింద్రభట్టారకుడు మృతినొందియుండును. ఆ కారణము చేత నాతని రాజ్యపరిపాలన మేడుదినములలోనే ముగిసిపోయినది.

రెండవ విష్ణువర్ధనుడు.

(క్రీ.శ.663 మొదలుకొని 672 వఱకు)

ఇంద్రభట్టారకుని మరణానంతరము వానికొడుకు విష్ణువర్ధనుడు సింహాసనమెక్కెను. ఇతడు శత్రురాజులను జయించి సర్వలోకాశ్రయుడనియు, విషమసిద్ధియనియు బిరుద పేళ్లువహించెను. ఇతడు తొమ్మిదిసంవత్సరములు నిరంకుశముగ బరిపాలనము చేసెను. ఈ సర్వలోకాశ్రయుడయిన రెండవవిష్ణువర్ధన మహారాజు చేసినయొక దానశాసనమునందు "ఆత్మవిజయరాజ్యపంచమే సంవత్సర ఫాల్గుణమాసే అమవాస్యా సూర్యగ్రహణ నిమిత్తం" అని శకసంవత్సరము 570 ఫాల్గుణబహుళామావాశ్యకు సరియైన 669వసంవత్సరము ఫిభ్రవరినెల 17తేది వీనిరాజ్యకాలములో నైదవయేడని చెప్పబడియుండుటచేత వీనిరాజ్యపాలనము 663వ సంవత్సరము ఫాల్గుణబహుళములో బ్రారంభమైనదని చెప్పవచ్చును. వీనిపేరుగల శాసనములు రెండుగానవచ్చుచున్నవి. అందొకటినెల్లూరు మండలములో నెచ్చటనోగాన్పించినది. కర్మరాష్ట్రములోని రేయూరు గ్రామము దానముచేయబడినట్లుగ దెలిపెడి శాసనమైయున్నది. కర్మ (కమ్మ)రాష్ట్రము ప్రస్తుత గుంటూరు మండలములోనిదని యిదివఱకె తెలిపియుంటిమి. ఈ శాసనము వీనిపరిపాలనము యొక్క రెండవసంవత్సరమున చైత్రశుద్ధదశమి బు బు(?)ధవానరంబునకు సరియైన 664వసంవత్సరము మార్చి 13వతేదీని ఎఱ్ఱయకొడుకు వినాయకునిచే వ్రాయబడినది.[13] మొదటిశాసనము గృద్రాహారవిషయములోని (గుడివాడసీమ) పల్లివాడప్రజలకు నాజ్ఞ చేయబడినదిగనున్నది. ఈశాసనములోని విషయవివరము గానరాదు.[14]

మంగియువరాజు.

(క్రీ.శ. 672మొదలు 696వఱకు)

ఈ మంగియువరాజు రెండవవిష్ణువర్ధనుని కుమారుడు. ఇతడు 672వసంవత్సరము మొదలుకొని 676 వ సంవత్సరమువఱకును, ఇరువదియైదు సంవత్సరములు పరిపాలనముచేసెను. వీనికి సర్వలోకాశ్రయుడనియు, విజయసిద్ధియనియు బిరుదునామములుగలవు. వీనిపేరుతో బ్రకటింపబడిన శాసనములు మూడు గాన్పించుచున్నవి. అందొకటి కర్మరాష్ట్రములో నూతులపఱ్ఱు గ్రామములోని కొన్ని భూములను బ్రాహ్మణులకు దానముచేయబడియెనని తెలుపునదియై యున్నది. నిస్సారామ్జీ దూతకుడని తెలుపంబడియెను. ఈశాసనము మంగియువరాజుపాలనము యొక్క యిరువదవ సంవత్సరమున నుత్తరాయణ సంక్రాంతి పుణ్యకాలమున దానముచేయబడినట్లుగ గూడ దెలుపుచున్నది.[15] గుంటూరుమండలములో వంగవోలు తాలూకాలోని చెందలూరు శాసనముగూడ మంగియువరాజు నామమును పేర్కొనుచున్నది. కమ్మరాష్ట్రములోని (కమ్మనాడు) చెందలూరు గ్రామమును బ్రాహ్మణులకు దానముచేయబడినట్లుగ జెప్పబడినది. [16] మంగియువరాజుయొక్క మఱియొకశాసనము విశాకపట్టణమండలములోని తిమ్మాపురమున నూతనముగా గానంబడినది. ఆ శాసనమింకను సంపూర్ణముగ బ్రకటింపబడియుండలేదు. [17] ఇదియును దిమిలిసీమ లోనిదిగానే గన్పట్టుచున్నది. ఈ మంగియువరాజుయొక్క చెందలూరు శా సనములో పల్లవరాజగు కుమారవిష్ణుని చెందలూరుశాసనములో వలెనె రాజకీయోద్యోగీయులకు నైయోగికులని పేరుపెట్టబడియెను. మంగియువరాజు రాజ్యముగూడ విశాఖపట్టణ మండలములోని చీపురుపల్లి మొదలుకొని నెల్లూరివఱకు వ్యాపించియున్నట్లు గానంబడుచున్నది.

రెండవజయసింహుడు.

(696మొదలుకొని709వఱకు)

ఇతడు మంగియువరాజుయొక్క ప్రథమకళత్రమునకు జనించినవాడు. ఇతడు పదుమూడు సంవత్సరములు మాత్రము పరిపాలనము చేసెను. విప్పర్లగ్రామములోని చెఱువుగట్టుమీది యొకఱాతిపలకపై నుండుశాసనములో జయసింహుని నామము గానంబడుచున్నది గాని యయ్యది సకలలోకాశ్రయజయసింహవల్లభ మహారాజునకు సంబంధించినదిగా గన్పట్టుచున్నది. ఈ రెండవజయసింహునకు నట్టిబిరుదమున్నట్టు గానంబడదు.

కొక్కిలి విక్రమాదిత్యభట్టారకుడు.709

ఇతడు రెండవజయసింహుని సవతితమ్ముడు. మంగియువరాజునకు ద్వితీయకళత్రమువలన జనించిన ద్వితీయపుత్రుడు. రెండవజయసింహుని మరణానంతరము నక్రమముగా రాజ్యమాక్రమించుకొని తొమ్మిదినెలలు మాత్రము పరిపాలనము చేసినవాడు. వీనిశాసనమొకటి విశాఖపట్టణ మండలములో భోగపురవిషయములోని మంజేఱు గ్రామమున గానిపించినది. [18] తండ్రివహించిన విజయసిద్ధి బిరుదునామమునే యీతడును వహించెను. మంగియువరాజుకుమారుడును విష్ణువర్ధన మహారాజుయొక్క మనుమడునునగు నీ కొక్కిలి విక్ర మాదిత్య భట్టారకుడు దేపూడి గ్రామనివాసులయిన బ్రాహ్మణులకు భోగపురవిషయములోని ముంజేఱు గ్రామము నాతురకాలమున దానము చేసెనని చెప్పబడినది. ఆతురకాలమనగా మరణావస్థయుందున్న కాలమని చెప్పదగును. ఈ శాసనమును బట్టియు, వీనికుమారుని శాసనమునుబట్టియు నితనికి విక్రమాదిత్య భట్టారకుడని పేరు గూడగలిగియున్నట్లు గానంబడుచున్నది. మఱియు నితనికి మంగియువరాజను కుమారుడు గలడు. ఈ మంగియువరాజుయొక్క దానశాసనము గూడ గలదు. కళింగదేశములో భోగపుర విషయములోని కోడుంకవిళంగవాడయను గ్రామమును చంద్రగ్రహణ సమయమున ముంజేఱు నివాసులగు103 బ్రాహ్మణులకును, శివాలయమునకును దానము చేసినట్టు తెలిపెడి తామ్రశాసనముగలదు. ఈమంగియువరాజు తనతాతతండ్రులవలెనె విజయసిద్ధియను బిరుదునామములను వహించియుండెను. ఈ తండ్రికొడుకల కిరువురకును ఎలమంచి వాసకమనివీరిశాసనములలో నుదాహరింపబడియుండెను. ఈ యెలమంచి యెల్లమంచిలియను పేరున బిలువంబడుచు విశాఖపట్టణ మండలములోని సర్వసిద్ధితాలూకాలోనున్నది. ఇచ్చట కుబ్జవిష్ణువర్ధనుని నాణెములు కొన్ని దొరకినవి.

కోకిలవర్మ మహారాజు.

ఇతడు మంగివర్మమను మడుగను వినయాదిత్యవర్మ కుమారుడుగను బేర్కొనబడి యుండెను. వీనిశాసనములు రెండు భీముని పట్టణము తాలూకా లోని ముంజేఱు గ్రామమున దొరకినవి. పైనిజెప్పిన కొక్కిలిరాజు యొక్కయు, వానికొడుకు మంగియువరాజుయొక్కయు శాసనములు దొరకినచోటనే యివియును దొరకినవి. అంతమాత్రముచేత నీ కోకిలవర్మయు, కొక్కిలియు నొక్కడేయని చెప్పరాదు. వేఱ్వేఱు తండ్రులను గలిగియుండుటచేత నొక్కరుగారనుట నిర్వివాదాంశామనుటకు సందియములేదు గాని యీ కోకిలవర్మ పేరు చాళుక్యలశాసనములం దెచ్చటను గానరాదు. ఈ కోకిలవర్మ దానశాసనములు రెండింటిలో నొకదానియందు భోగపురవిషయము మధ్యమ కళింగములోనిదని పేర్కొనబడియుండెను. ఎలమంచి వీనికిని రాజధానిగ నుండెనని చెప్పబడినది. చంద్రగుప్త చక్రవర్తి యాస్థానమందుండిన మేగాస్తనీ సనుయవనరాయబారిచే బేర్కొనబడిన "మోడో కళింగే" (Modo Calingae) యను నదియె యీమధ్యమ కళింగమని స్పష్టముగా జెప్పవచ్చును. (Ind, Ant Vol VI, R. 338) మధ్యమ కళింగమని కళింగదేశములోని యొకభాగము వ్యవహరింపబడినపుడు మఱియొకభాగము త్రికళింగమని వ్యవహరింపబడి యుండెననుట యబద్ధము కానేరదు. అట్లగుటంజేసి విశాఖపట్టణమండలము మధ్యమకళింగముగాను, గోదావరి మండలము త్రికళింగముగాను, గంజాము మండలముత్తర కళింగమముగాను, ఒకప్పుడు వ్యవహరింపబడినవని మనము విశ్వసింపవచ్చును. ఉత్తరకళింగము గంగానది వఱకు వ్యాపించియుత్కలదేశమై యుండవచ్చును. త్రికళింగము కాంచీపురమువఱకు వ్యాపించి త్రిలింగదేశమై యుండవచ్చును. అనివారితశక్తత్రయ సంపన్నుడని కోకిలవర్మ యొకశాసనమునందు బేర్కొనబడియుండెను. చంద్రగ్రహణ సమయమున ముంజేఱు గ్రామనివాసియగు బ్రాహ్మణున కొకనికి బొద్దేఱియనుగ్రామమును దానము చేసెను. చంద్రగ్రహణ సమయముననే ముంజేఱుగ్రామనివాసియగు అశ్వశర్మయను బ్రాహ్మణునకు వెట్టువాడయను గ్రామమును దానముచేసియుండెను. ఈరెండు గ్రామములును భోగిపుర విషయములోనివే. ఈశాసనములలోని ముద్రికలలో "శ్రీఅనివారిత శ్రీఅనివారితంబు" అను చిరునామాలు గలవు. ఈ శాసనము లలోని లేఖనము దోషభూయిష్టమై యుండెను.అయిన నీ శాసనములు కుబ్జవిష్ణువర్ధనుని జయసింహుని, రెండవ విష్ణువర్ధనుని శాసనములలోని లిపినిగలిగి వానిమార్గమునే కొంచెమించుమించుగా ననుసరించి యున్నది. ఈయనివారిత బిరుదము పశ్చిమచాళుక్యరాజగు మొదటి విక్రమాదిత్యుడు వహించియుండెను. ఆ బిరుదము నేయీతడవలంబించియుండెను. అతడే రాజవంశములోనివాడో స్పష్టముగా దెలియరాదు. చాళుక్యులలో నొకరుతక్క మఱెవ్వరును వర్మయను పట్టపుపేరును ధరించియుండలేదు గాని చాళుక్యులకు బూర్వమునందుండిన పల్లవులు ధరించుకొనియుండిరి. అయినను వీనిశాసనములు చాళుక్యులవి యగువరాహముద్రికలను గలిగియున్నవి ఇతడు చా‌‌ళుక్యుడే యైనయెడల దేశపరిపాలనము సేయురాజకుటుంబములోని వాడుగాక మఱియొక సామంతరాజ కుటుంబములోని వాడైయుండవలయును. ఇతడు చాళుక్యడుకాని యెడల చాళుక్యులీదేశ మాక్రమించుకొనుటకు బూర్వము పరిపాలనము సేయుచుండిన పల్లవవంశములోని వాడుగాని గాంగవంశములోని వాడుగానియై యుండవలయును. అట్లుతలంచుటకును దృప్తికరమైన సాక్ష్యమునుగానరాదు. తొమ్మిదవశతాబ్దమధ్యము నందుండిన గణకవిజయాదిత్యుడను చాళుక్యరాజు తనశత్రువగు నొకమంగిరాజును సంహరించి నట్లొకశాసనమన జెప్పబడినది. ఆ మంగిరాజితని వంశములోని వాడని యూహింపదగియున్నది.

మూడవ విష్ణువర్ధనుడు.

(క్రీ.శ. 709 మొదలుకొని 746 వఱకు)

ఇతడు కొక్కిలికి అనగా విక్రమాదిత్య భట్టారకునకు జ్యైష్ఠభ్రాత. రెండవ జయసింహునికి సవతితమ్ముడు. జయసింహుని మరణానంతరము రాజ్యమునక్రమముగా నాక్రమించుకొనిన తమ్ముని సింహాసన విహీనుని జేసి రాజ్యమాక్రమించుకొని 709 మొదలుకొని 746 వఱకును ముప్పదియేడుసంవత్సరములు నిరంకుశముగా దేశమును బరిపాలించెను. ఇతడన్ని శాసనములందును విష్ణువర్ధనుడని పేర్కొనబడియుండగా నొకశాసనమునందు విష్ణురాజని పేర్కొనబడియెను.

విజయాదిత్య భట్టారకుడు.

(క్రీ.శ. 746మొదలుకొని 764 వఱకు.)
ఇతడు మూడవవిష్ణువర్ధనుని కుమారుడు. విజయాదిత్య నామమును వహించిన పూర్వచాళుక్యలలో మొదటివాడుగ నుండెను. ఈ విజయాదిత్య భట్టారక మహారాజునకు విజయసిద్ధి, విక్రమరాముడని బిరుదములుగలవు. ఇతడు 746మొదలుకొని 764 వఱకును పదునెనిమిది సంవత్సరములు వేంగిదేశమును బరిపాలించి ఖ్యాతిగాంచెను. వీనితరువాత వీనికుమారుడు రాజ్యమునకు వచ్చెను.

నాలుగవ విష్ణువర్థనుడు.

(క్రీ,శ, 764 మొదలుకొని 766వఱకు)

ఈ విష్ణువర్ధనుడు మొదటి విజయాదిత్యుని కుమారుడు. విష్ణువర్ధననామమును వహించిన చా‌‌ళుక్యరాజులలో నితడు నాలుగవవాడు, ఇతడు ముప్పదియాఱు సంవత్సరములు పరిపాలనము చేసెనని మాత్రము దెలియుచున్నది గాని వీనిగుఱించి యేమియును దెలియరాదు.

రెండవవిజయాదిత్యుడు.

(క్రీ,శ. 766 మొదలుకొని 843 వఱకు)

ఇతడు నాలుగవ విష్ణువర్ధనుని కుమారుడు. విజయాదిత్యుని మనుమడు. బహుసమర్థుడయిన యోధవరుడు. మహారాజాధిరాజనియు, సమస్తభువనాశ్రయుండనియు, చాళుక్యార్జునుడనియు, రాజపరమేశ్వరుడనియు , శ్రీత్రిభువనాంకుశుడనియు, నరేంద్రమృగరాజనియు నింకననేకములగు బిరుదు నామములను వహించి 766వ సంవత్సరము మొదలుకొని 843 వ సంవత్సరమువఱకును నలువదినాలుగు సంవత్సరములు నిరాతంకముగా వేంగిరాష్ట్రమును బరిపాలించి కీర్తిగాంచెను. ఈ రెండవ విజయాదిత్యుడు రాజ్యభారమును వహించి నిర్వక్ర పరాక్రమంబున రాజ్యములోని శత్రువర్గము నడంచి నిరంకుళముగ బరిపాలనము సేయుచుండ మహాజన సత్త్వసంపన్నులగు రాష్ట్రకూటులును గాంగులును బలుమాఱులు వేంగిరాష్ట్రముపై దండెత్తివచ్చి విజయాదిత్యునితోడ బహుయుద్ధములు చేసి పలాయనులగుచువచ్చిరి. ఎన్ని తడవలు దాడివెడలి వచ్చినను నించుకయు జంకక సింహమువలె సుస్థిరచిత్తుడై నిలుచుండి శత్రువులకజేయుడై శత్రువర్గమునెల్ల దఱుముచువచ్చెను. అందుచేతనే చాళుక్యార్జునడనియు నరేంద్రమృగరాజనియు బిరుదుపేరులు గలిగినవి. ఇతడు గాంగులతోడను రాష్ట్రకూటులతోడను నూటయెనిమిది యుద్ధములను జేసివిజయమును గాంచినవాడగుటజేసి నూటయెనిమిది శివాలయములును తనదేశమునందంతట జ్ఞాపకార్థముగ గట్టించెనని కొన్ని శాసనములు చాటుచున్నవి. వీని శత్రువర్గములో ముఖ్యుడై నాయకత్వమును వహించి ఘోరయుద్ధములు సలి పినవాడు సామాన్య రాజకుమారుడుగాక నిరుపమాన విక్రముండని ఖ్యాతిగన్నట్టి రాష్ట్రకూటుడయిన మూడవ గోవిందరాజు. ఇతడు మాల్యఖేతమును రాజధానిగ మహారాష్ట్రదేశమును బాలించినవాడు. ఆ కాలమునాటి యోధవరులలో మేటియని చెప్పదగినవాడయినను, వేంగిరాష్ట్రమును స్వాధీనము జేసికొనవలయునని దృఢసంకల్పుడై యెంత ప్రయత్నించినను నమ నరేంద్ర మృగరాజుముంగట వాని ప్రయత్నము లన్నియు భగ్నములైపోయెను. ఇట్లనేక యుద్ధములలో దఱిమికొట్టబడియు రాష్ట్రకూట రాజయిన మూడవగోవిందరాజు తాను కాంచీపురమును జయించిన తరువాత పూర్వ చాళుక్యరాజునకు (నరేంద్రమృగరాజ బిరుదాంకితుడగు విజయాదిత్యుడు) కబురు పంపిన తోడనే యాతడుపోయి వానికి నౌకరువలె సేవ సలిపెనని యబద్ధపు సంగతులు తనశాసనములందు వ్రాయించుకొనియెనే గాని యీచాళుక్యడెన్నడును గోవిందరాజునకు నూడిగము సలిపినవాడుకాడు. ఇతడు గాంగులను రాష్ట్రకూటులను మాత్రమే గాక శత్రువర్గములో జేరియుండిన యొకనాగరాజును గూడ నితడు జయించెను. వీనిపేరు తోడిశాసనములు రెండుగానంబడుచున్నవి. అందొకటి కొఱ్ఱపఱ్ఱుశాసనము. [19] చంద్రగ్రహణసమయమున కొఱ్ఱపఱ్ఱు గ్రామమునువేదవేదాంగవిదులయిన యిరువదినలుగురు బ్రాహ్మణులకు దానము చేసినట్లుగ నా శాసనమున జెప్పబడినది. కొఱ్ఱపఱ్ఱు కృష్ణా మండలములోనిదిగ గన్పట్టుచున్నది. విజయాదిత్యుని సోదరుడును రాజకుమారుడు నైన నృపరుద్రుడు దూతకుడిగ జెప్పబడియెను. మఱియు హైహయవంశములోని వాడని పేర్కొనబడియుండెను గావున నితడు విజయాదిత్యునికి సవతితమ్ముడని తోచుచున్నది. వీనితండ్రియగు నాలుగవ విష్ణువర్ధనుడు త్రిపురాధీశ్వరుని (కాలచుర్యుని) కొమార్తెను వివాహము జేసికొన్నందును నామెకు జనించిన యీ నృపరుద్రుడు హైహయవంశజుడని పేర్కొనబడియుండెను గాని మఱియొకటిగాదు. విజయవాడ నివాసియగు అక్షరలలితాచార్యునిచే నీ శాసనము లిఖింపబడినది. విజయవాడయనునది బెజవాడకు బూర్వనామము. బెజవాడ పూర్వచాళుక్యులశాసనముల విజయవాడ యనియు విజయవాటిక యనియు బేర్కొనబడియున్నది. ఈ రెండవ విజయాదిత్యమహారాజు మఱియొకప్పుడు సూర్యగ్రహణ సమయమున కాండేరువాడి విషయములోని కామరూపిరేయగ్రామములోని పొలమును బ్రాహ్మణులకు దానము చేసినట్లు కృష్ణామండలములోని యీదరశాసనమువలన బోధపడుచున్నది. ఈశాసనమునందలి దూతకుడు బోలను యనువాడుగనుండెను.[20] ఈ రాజకంఠీవుడు నలువదినాలుగు సంవత్సరములు నిరాతంకముగా రాజ్యపరిపాలనము చేసి సుప్రసిద్ధమైన యశస్సునుగాంచెను.

కలివిష్ణువర్ధనుడు

(క్రీ.శ. 843 మొదలుకొని 844 ‌వఱకు)
నరేంద్రమృగరాజునకు వెనుక బూర్వచాళుక్యసింహాసన మధిరోహించినవాడు విష్ణువర్థన నామమునువహించి రాజ్యపరిపాలనము చేసిన పూర్వచాళుక్యులలో నితడైదవవాడు. వీనిని కలివిష్ణువర్ధనుడందురు. వీనికిసర్వలోకాశ్రయుడనియు విషమసిద్ధియనియు, పరమమహేశ్వురుడనియు బిరుదనామములు గలవు. ఇతడు రెండవ విజయాదిత్యుని కుమారుడు. ఇతడుతండ్రివలెనె శాసనములయందు వేంగినాథుడని పేర్కొనబడియెను. ఇతడు పదునెనిమిది నెలలుమాత్రమె రాజ్యపాలనము చేసెనని శాసనములు దెలుపుచున్నవి. వీనిపేరిట శాసనమొకటి గన్పట్టుచున్నదిగాని యందలి శైలి కఠినమైన దగుటచేత శాసనపరిశోధకులు సరిగ భాషాంతరీకరింపయిరి. పృథ్వీవల్లభపట్టణమని యొక పట్టణ ముదాహారింపబడినది. మఱియు నీ శాసనమునందు కర్ణాటకమును బాలించు ప్రభువునామ మొకటి పేర్కొనబడియెను. ఇంతియగాక కాంచీపురము రామేశ్వరము గూడ నుదాహరింపబడినవి. [21]

గణకవిజయాదిత్యుడు.

(క్రీ,శ, 844 మొదలుకొని 888వఱకు)
కలివిష్ణువర్ధనునికి బిమ్మట సింహాసన మెక్కినవాడు వానిజ్యైష్ఠకుమారుడయిన విజయాదిత్యు డనువాడు. వేంగిదేశమును బరిపాలించిన విజయాదిత్య నామధారులయిన రాజులలో నితడు మూడవవాడు. ఇతడు గణిత శాస్త్రమునందు పండితుడగుటతచేత గణకవిజయాదిత్యుడని పిలువబడుచు వచ్చెను. ఇతడు క్రీ,శ, 844మొదలుకొని 888వఱకు నలువది నాలుగు సంవత్సరములు నిరంకుశముగా దేశమును బరిపాలించెను. వీనికి యువరాజవిక్రమాదిత్యుడనియు, యుద్ధమల్లుడనియు నిరువురు తమ్ములుండిరి. కొన్ని శాసనములయందు గుణగాంకయనియు, గుణకనల్లయనియుబేర్కొనబడియుండుట చేత గొందఱు వీనిని గుణాంక విజయాదిత్యుడని పేర్కొనుచున్నారుగాని "అంక కారఃసాక్షాత్" అని గణిత శాస్త్రమునందు బ్రజ్ఞావంతుడగుటచేత నితడు గణకవిజయాదిత్యుడని ప్రసిద్ధిగాంచినట్లుగ అమ్మరాజ విజయాదిత్యుని కంచు మఱ్ఱుశాసనము స్పష్టముగ గారణము జెప్పుచుండగా గుణాంకవిజయాదిత్యుడనుటకంటె గణక విజయాదిత్యుడని గ్రహించుటయె యొప్పిదముగా నుండును. ఈ గణకవిజయాదిత్య మహారాజునకు సమస్తభువనాశ్రయు డనుబిరుదు నామము మాత్రమే గాక మనుజప్రకారుడు, రణరంగశూద్రకుడు, విక్రమధవళుడు, పరచక్రరాముడు, నృపతి మార్తాండుడు, బిరుదాంక భీముడు మొదలగు బిరుదనామములెన్నో గలవు. కలి‌విష్ణువర్ధనుని భార్యయు, గణకవిజయాదిత్యుని తల్లియు నగుశీలమహాదేవి రాష్ట్రకూటరాజకుటుంబములోని దైనను, గణకవిజయాదిత్యుని కాలమున రాష్ట్రకూటులకును ఆంధ్రచాళుక్యులకును గల స్నేహబంధములు త్రెంపి వేయబడినవి. రాష్ట్రకూటరాజయిన రెండవకృష్ణుడు గణక విజయాదిత్యుని కయ్యమునకు బిలుచుటవలన నించుకయు గొంకక యాంధ్రసైన్యముతోడ రాష్ట్రకూటులపై దాడివెడలి వారలతో ఘోరయుద్ధము సలిపి యోడించి వారల రాజధానియగు మాల్యఖేతమును దగ్ధముగావించి కృష్ణపురదహన విఖ్యాతకీర్తియని స్వజనంబుచే బొగడ్తల బొందెను. రాష్ట్రకూటులకు సామంతులుగ నుండిన గాంగులు దండెత్తివచ్చినప్పడు ఘోరసంగ్రామమున వారలను జయించి తఱిమిగొట్టెను. మంగిరాజనుశత్రు వధికసైన్యముతో వచ్చి పైబడినపుడు ధైర్యసాహసములు ముప్పిరి గొన వాని నెదుర్కొని సంకులసమరంబున నవలీల వాని శిరస్సును ఖండించెను. వీని పేరిటి శాసనము లనేకములు గలవు. గుద్రవార విషయములోని (గుడివాడసీమ) త్రాండపఱ్ఱను గ్రామమును వినయాదిత్యశర్మకు చంద్రగ్రహణ సమయమున దానముచేసెను. ఈవినయాదిత్యశర్మ మంగిరాజుతో జరిగిన యుద్ధమునందు గణక విజయాదిత్యునిసైన్యాధిపతిగనుండి యుద్ధముచేసినట్లుగ గానిపించుచున్నది.[22] వేదవేదాంగవిధులును సమస్తశాస్త్రజ్ఞులు నైన 105 గురుబ్రాహ్మణులకు కోడముప్పఱ్ఱు, పోణంగి గ్రామములను దానము చేసినట్లుగ పోణంగి శాసనమువలన బోధపడుచున్నది.[23] గణక విజయాదిత్యునికి మంత్రిగను సైన్యాధిపతిగ నుండి గాంగులతోడను రాష్ట్రకూటులతోడను యుద్ధములుచేసి ప్రాణముల గోలుపోయిన పాండురంగనిపే రాశాసనముల నుదాహరింపబడినది. ఇతడు కడియరాజపుత్రుడని పేర్కొనంబడియెను. ఈ కడియరాజు పేరేమో తెలియరాదు. కడియయనునది రాజమహేంద్రవరమునకు నేడు మైళ్లదూరమున నుండిన కడియ మను గ్రామమై యుండవచ్చునని తోచుచున్నది. పాండురంగని పేరు నెల్లూరు శాసనములందును గూడ గానవచ్చచున్నది. ఈపాండురంగని కుటుంబము వారు జైనమతావలంబకు లయినట్లుగ గన్పట్టుచున్నారు. గణక విజయాదిత్యుని యనంతరము వీనిసోదరులగు యువరాజ విక్రమాదిత్యుడును, యుద్ధమల్లుడును ప్రసిద్ధులయినను రాజ్యపదవిని బొందక విజయాదిత్యునికి వెనుక యువరాజవిక్రమాదిత్యునికొడుకు చాళుక్యభీముడు రాజ్యపదవిని వహించుటకు గారణమేమో దెలియరాదు.

మొదటి చాళుక్య భీమవిష్ణువర్ధనుడు.

(క్రీ.శ. 888 మొదలుకొని 917వఱకు)

ఇతడు గణక విజయాదిత్యుని సోదరుడగు యువరాజ విక్రమాదిత్యుని కుమారుడు. తనపెద్దతండ్రియైన విజయాదిత్యుని పిమ్మట రాజ్యమునకు వచ్చెను. గణక విజయాదిత్యుని మరణానంతరము రాష్ట్రకూటరాజయిన రెండవకృష్ణుడు పూర్వవైరమును మనస్సులో బెట్టుకొని యున్నవాడుగాన వేంగిదేశముపై దండెత్తివచ్చి దేశమాక్రమించుకొనియెను. అప్పుడీ చాళుక్యభీముడు కృష్ణునితో యుద్ధము చేసి రాష్ట్రకూటులనుజయించి దేశమునండి తఱిమివేసి దేశమునంతయు స్వాధీనపఱచుకొని నిశ్చింతగా 888మొదలుకొని 917వఱకు ముప్పది సంవత్సరములు రాజ్యపరిపాలనము గావించెను.[24] వీనికిని కృష్ణునకును జరిగిన యుద్ధమునందు వీనిసవతితో బుట్టువు కుమారుడగుమహాకాలుడనువాడు సైన్యాధిపతియై సైన్యముల నడిపించి విజయముగాంచెను. తన రాజ్యమునందంతటశాంతిని గలిగించుటకై మొదటనే దాయాదుల బలములనెల్లనోడించి వారల నందఱ నడచిపట్టి కడవఱకు రాజ్యములోన శాంతిని నెలకొల్పి ప్రఖ్యాతుడయ్యెను, ఈ చాళుక్య భీమునకు విష్ణువర్ధనుడను బిరుదునామము గూడగలదు. ఈ విషయములు నూతనముగా గనిపెట్టబడిన ఖాశింకోటశాసనమువలన దెలియుచున్నవి.[25] మఱియు నీ నూతనశాసనమునందు ఎలమంచి కళింగదేశమును, దేవరాష్ట్ర విషయమును బేర్కొనబడినవి.[26] ఈ దేవరాష్ట్రమనగా నవీనమహారాష్ట్రమదేశమని విన్సెంటు స్మిత్తుగారు చెప్పినది పొరబాటు.[27] సముద్రగుప్తునిశాసనమును బట్టి నాలుగవశతాబ్దప్రారంభమునందు విశాఖపట్టణమండలములోని దేవరాష్ట్రమును కుబేరవర్మ పరిపాలించుచుండెనని తేటపడుచున్నది. ఈ చాళుక్యభీముని శాసనములో ఎలమంచికళింగదేశమనుట కర్ధమేమని కొందరకు సందియముకలుగవచ్చును. మూడు కళింగము లుండుట చేత ఎలమంచి ముఖ్యపట్టణముగా గల కళింగమని సులభముగా గ్రహించుట కై యెలమంచికళింగదేశమని వ్రాయబడియుండునుగాని యంతకన్న మఱేమియు గారణముండబోదు. ఈ యెలమంచి అనివారితకోకిలవర్మ మహారాజునకు రాజధానిగ నుండెనని యింతకు బూర్వము దెలిపియుంటిమి. మఱియు నీశాసనము నొందొక్క విశేషము గలదు. మాలతీమాధవములోని భరతవాక్యమును దెలుపుశ్లోకము శాసనములోని ధ్యానశ్లోకములలో నొకటిగా లిఖింపబడియుండుటచేత భవభూతి మహాకవి యీ మొదటి చాళుక్యభీమవిష్ణువర్ధనునకు బూర్వమున నున్నాడని స్పష్టముగ బోధపడుచున్నది.

కొల్లభిగండభాస్కర విజయాదిత్యుడు.

( 618)

చాళుక్యభీమ విష్ణువర్ధనునకు బిమ్మట సింహాసన మధిష్ఠించినవాడు గాని జ్యైష్ఠపుత్రుడగు విజయాదిత్యడను వాడు, విజయాదిత్యనామధారులయిన పూర్వచాళుక్యరాజులలో నితడు నాలుగవవాడు. కొల్లభిగండ భాస్కరుడను బిరుదాభిదానమును వహించినవాడు. ఇతడు కళింగదేశమును జయించి త్రికళింగాటవులతో గూడ వేంగిమండలమును నాఱుమాసములు మాత్రమే పరిపాలనము చేసి దేహయాత్ర ముగించినవాడు. పట్టవర్ధకవంశములోని కాలకంపుని యన్వయమున జనించిన సోమాదిత్యుని పౌత్రుడును, కుంతాదిత్యుడను నామాంతర ప్రసిద్ధుడును నగు భండనాదిత్యుడు వీనికి మంత్రిగను సైన్యాధిపతిగను నుండెను.

అమ్మరాజ విష్ణువర్ధనుడు.

(క్రీ,శ.918 మొదలుకొని 924)

ఇతడు నాలవ విజయాదిత్యుని పెద్దకొడుకు. విష్ణువర్ధన నామమును వహించినవారిలో నీత డాఱవవాడుగ గొందఱు వ్రాసియున్నారు గాని మొదటి చాళుక్యభీమునకు గూడ విష్ణువర్ధన నామముకలిగియుండుట చేత నితని నేడవవిష్ణువర్ధనునిగా బరిగణించవలసియుండును. వీనికి సర్వలోకాశ్రయుడనియు, రాజమహేంద్రుడనియు బిరుదు నామముండుట చేత రాజమహేంద్రవరము రాజధానిగ జేసికొని మొదట పరిపాలించినవాడే రాజమహేంద్రుడనియు, నీతని మూలముననే యాపట్టణమున కాపేరు గలిగినదనియు గొందఱు తలంచుచున్నారు. కోటలేని పట్టణ మాకాలమున రాజధానిగ నుండజాలదు. గావున నీత డాపట్టణమును నిర్మించి కోటనుగట్టుటకు బూర్వమె మృతినొందియుండునని మఱికొందఱు తలంచుచున్నారు. ఏది యెట్టిదైనను రాజమహేంద్రపురంబునకుం గల సంబంధమును సూచించుచున్నది. వీనిశాసనములలోని ముద్రికలపై శ్రీభువనాంకుశ అను చిరునామము గానంబడుచున్నది. ఇతడు రాజ్యమునకు వచ్చినప్పుడు వీని దాయాదులయిన బంధువులు కొందఱు చాళుక్యులకు శత్రువులయిన రాష్ట్రకూటులతో జేరి కుట్రలు చేసి వీనిని సింహాసనభ్రష్టుని జేయజూచిరి గాని యుక్తకాలముననే మేల్కొని యీ యమ్మరాజవిష్ణువర్ధనుడు వారి ప్రయత్నములను భగ్నము చేసి స్వజనముచే మెప్పుగాంచెను. వీనిపేరిటి శాసనములు రెండుగానంబడుచున్నవి. తనతండ్రియగు నాలవ విజయాదిత్యునకును దనకునుగూడ సైన్యాధిపతిగ నుండిన భండనాదిత్యునకు కాండేరువాడి విషయములోని గొంటూరు గ్రామమును చుట్టునుండు పండ్రెండుపల్లెలతోగూడ దానము చేసెను.[28] ఇంతియగాక మొదటి చాళుక్యభీముని దళవాయిగనుండిన మహాకాలునకు పెన్నాటివాడి విషయములోని ద్రుజ్జూరు గ్రామమును దానము చేసినట్లుగ మఱియొకశాసనము దెలుపుచున్నది. [29] కటకరాజు దూతకుడుగ నుండెను. గొంటూరు ప్రస్తుతగుంటూరు మండలములోని గుంటూరనియు, [30] ద్రుజ్జూరు నందిగామ తాలూకాలోని జుజ్జూరనియును గొందఱు తలంచుచున్నారు.

బేటవిజయాదిత్యుడు.

(925.)

అమ్మరాజవిష్ణువర్ధనునకు వెనుక రాజవంశమున నంతఃకలహములు జనించి యధికములై పదిసంవత్సరములవఱకు శాంతి లేక రాజ్యపదవికై యొండొరులంజంపుకొనుచు రాజకుమారులు రాజ్య మాక్రమించుకొనజూచుచుండిరి. అమ్మరాజు మరణానంతరము వాని జ్యైష్ఠకుమారుడగు విజయాదిత్యుడు రాజ్యమునకు వచ్చెను. వీనికి బేటరాజను నామాంతరము గలదు. విజయాదిత్యులలో నితడయిదవవాడుగ నుండెను. ఇతడు సింహాసన మధిష్టించిన పదునేను దినములలోనే యుద్ధమల్లునికొడుకయిన తాళరాజు వీనిని సింహాసనవిహీనుని గావించి చెఱసాలయందు బెట్టించి రాజ్యమునువశముజేసికొని పరిపాలింపసాగెను.

తాళరాజు.

(925.)

యుద్ధమల్లుని కొడుకయిన యీతాళరాజు రాజ్యమాక్రమించుకొని ముప్పదిదినములు రాజ్యపాలనము చేసినతరువాత చాళుక్యభీముని ద్వితీయపుత్రుడును నాలవ విజయాదిత్యుని సోదరుడునైన విక్రమాదిత్యు డీతనిని జంపి రాజ్యమాక్రమించుకొనియెను.

విక్రమాదిత్యుడు.

(925-926.)

చాళుక్యభీమునికొడుకయిన యీ రెండవవిక్రమాదిత్యుడు వేగి త్రికళింగదేశములను 925,926 సంవత్సరములలో పదునొకండు మాసములు పరిపాలించిన పిమ్మట అమ్మరాజ విష్ణువర్ధనుని కొడుకగు భీముడీతని రాజ్యపదచ్యుతిని గావించి రాజ్యము నాక్రమించుకొనియెను.

భీముడు.

(926-927.)

అమ్మరాజ విష్ణువర్ధనుని తనూజుడును నయిదవ విజయాదిత్యుని తమ్ముడునైన యీ మూడవ భీముడు విక్రమాదిత్యుని జయించి 926-27 సంవత్సర ములలో నెనిమిది నెలలు పరిపాలించినతరువాత తాళరాజు కొడుకయిన యుద్ధమల్లుడీతని జంపిరాజ్యమును గైకొనియెను.

యుద్ధమల్లుడు.

(క్రీ,శ. 927 మొదలుకొని 934 వఱకు.)

ఈ రెండవ యుద్ధమల్లుడు తాళరాజు కొడుకు. ఇతడు 927 మొదలుకొని 934 వ సంవత్సరము వఱకు నేడు సంవత్సరములు పరిపాలనము చేసిన తరువాత నాలవ విజయాదిత్యుని ద్వితీయపుత్రుడయిన చాళుక్యభీమునిచే జయింపబడి సింహసనమునుండి దొలగింపబడియెను.

రెండవ చాళుక్య భీమ విష్ణువర్ధనుడు

(క్రీ,శ. 934 మొదలుకొని 945 వఱకు.)

ఇతడు నాలవ విజయాదిత్యుని ద్వితీయపుత్రుడు. అమ్మరాజవిష్ణువర్ధనుని సవతితమ్ముడు. వీనికి గండమహేంద్రుడు, రాజమార్తాండుడు నను బిరుదునామములుగలవు. చాళుక్య భీముడని పిలువంబడిన వారిలో రెండవవాడుగను విష్ణువర్ధనుడని పిలువబడిన వారిలో నెనిమిదవవాడుగ నుండెను. ఇతడు తాళరాజు కొడుకగు రెండవ యుద్ధమల్లుని చోళరాజైన లోనబిక్కిని, రాష్ట్రకూటరాజయిన యైదవ గోవిందరాజును జయించి 934 మొదలుకొని 945వఱకు రాజ్యపరిపాలనము చేసెను. గోదావరిమండలములోని సామర్లకోటకు జేరియుండిన భీమవరమీతని పేరటనే గట్టబడినందున జాళుక్య భీమవరమని శాసనములందు బేర్కొనబడినది. ఇతడు చోడులను రాష్ట్రకూటులను మాత్రమేగాక గాంగరాజగు ఎఱ్ఱపరాజుతో యుద్ధముచేసిగాంగులనుగూడ నోడించెను. వీని పేరిటి శాసనములు మూడుగానవచ్చుచున్నవి. పగుణవారవిషయములోని దిగ్గుబఱ్ఱు (దిగుమఱ్ఱు) గ్రామమును బ్రాహ్మణులకు దానము చేసెను. మఱియు నుత్తరాయన సంక్రాంతి సమయమున గుద్రవారవిషయములోని ఆకులమన్నాడు గ్రామములోని కొంతభూమిని దానము చేసినట్లు మఱియొక శాసనముగలదు. తనకు సామంతుడగు పవార రాజకుమారుడగు వజ్జయిని కోరికను మన్నించి యీ చాళుక్య భీమవిష్ణువర్ధనుడు అభరాద్వసుకాల్మాడి గ్రామనివాసియు, రేవశర్మ పౌత్రుడును, దేవి యార్యపుత్రుడును క్రమపాఠియునగు కొమ్మన యను బ్రాహ్మణునకు నుత్తరాయన పుణ్యకాలమున కాండేరువాటి విషయములోని కొడహతల్లి గ్రామమును దానము చేసినట్లుగ బెజవాడ తాలూకాలోని కోలవెన్ను గ్రామములో దొరకిన శాసనమునుబట్టి దెలియుచున్నది.[31]

అమ్మరాజ విజయాదిత్యుడు.

(క్రీ,శ. 945 మొదలుకొని 970 వఱకు.)

అమ్మరాజులలో రెండవవాడును విజయాదిత్యులలో నాఱవవాడునునైన యితడు లోకమహాదేవివలన రెండవ చాళుక్యభీమునికి జనించిన చిన్న కొడుకు. వీనికి సమస్తభువనాశ్రయుడనియు, మహారాజాధిరాజనియు, రాజమహేంద్రుడనియు, పరమ భట్టారకుడనియు బిరుదునామములు గలవు. రాజముద్రికలపై శ్రీ త్రిభువనాంకుశ అని చిత్రింపబడియుండెను. ఇతడు సింహాసనమెక్కుటకు ముందు యుద్ధమల్లునితో గొంత పెనగులాడినట్లు సూచనలు గన్పట్టుచున్నవి గాని యితడు సింహాసనమధిష్ఠించిన పిమ్మట నైదవ విజయాదిత్యుని కాలమునుండి తటస్థమగుచుండిన కుటుంబకలహములు నిలిచిపోయినట్లుగ గన్పట్టుచున్నవి. పడకలూరు శాసనమున నితడు శాలివాహనశకము 897వ సంవత్సరము మార్గశిర బహుళత్రయోదశి శుక్రవారము నాడనగా క్రీస్తుశకము 945వ సంవత్సరము డిసెంబరు నెల5 వతేదీని పట్టాభిషిక్తుడయినట్టు చెప్పబడియన్నది. వీనిపేరిటి శాసనములనేకములు గలవు.

(1) పెన్నత వాడి విషయములోని పడంకలూరు (పడకలూరు) గ్రామములో గొంతభూమిని చంద్రగ్రహణ కాలమున దానము చేసెను. ఈశాసన రచనము మాధవభట్టుచే గూర్పబడి జొంటాచార్యునిచేత లిఖితమైనది. ఈ శాసనమునందే అమ్మరాజ విజయాదిత్యుడు పట్టాభిషిక్తుడయిన తేది తెలుపబడినది.
(2) గుద్రవార విషయములోని (గుడివాడ) పాంబఱ్ఱు (పామఱ్ఱు) గ్రామములో గొన్ని భూములను పట్టవర్ధని వంశములో జేరియుండి బొద్దియను నామాంతరముగల యువరాజ బల్లాల దేవ వేలాభటునకు దానము చేసెను. ఇందు బేర్కొనబడిన పట్టవర్ధనివంశజులు కుబ్జవిష్ణువర్ధనుని కాలమునుండియు జాళుక్యులకడ మంత్రిత్వాది పదవుల వహించి శోభిల్లుచుండిరి.[32]

(3) వెలనాండు విషయములోని (వెలనాటి సీమ అనగా ప్రస్తుత గుంటూరు మండలములోని చందవోలు ప్రాంతదేశము) యెలవఱ్ఱు గ్రామమునుత్తరాయణ సంక్రాంతి కాలమున ధారవోసెను. ఈ శాసనము పోతనభట్టుచే విరచింపబడిన జొంటాచార్యునిచే లిఖింపబడినది.[33]

(4) ఉత్తరాయణసంక్రాంతి కాలమున వేంగినాడు విషయములోని గుంటుగొలను (గుంటుగొలను) గ్రామములో గొంతభూదానము చేసియుండెను. అమ్మరాజ విజయాదిత్యుని మామయగు నృపకాముని యొక్కయు, అత్తయగు నయమాంబ యొక్కయు కోరికమీద నీ దానము చేయబడినదిగ జెప్పబడియెను.[34]

(5)అది‌వఱకు గుద్రవార విషయములో నొకగ్రామమున గొంతభూమికుల బ్రాహ్మణున కొకనికి దానముచేయబడి యేకారణముచేతనో మరలగైకొనబడిన యా భూమినే రాజు పునర్దానము జేసినట్లుగ నొకశాసనము జెప్పుచున్నది.

(6) అడ్డకాలి గచ్ఛకు సంబంధించి వలహరిగణములో జేరిన జైనశ్రావకియగు చామెకాంబగురు వయిన అర్హనంది యను జైనాచార్యునకు సర్వలోకాశ్రయజైనభవనము యొక్క భోజన శాలకొఱకు అత్తిలినాడు విషయములోని కంచుం బఱ్ఱు గ్రామమున(కంచుమఱ్ఱు) గ్రామమును దానము చేసెను. ఇందుదాహరింపబడిన చామెకాంబ పట్టవర్ధని కుటుంబములోనిదని దెలుపబడి[35] నది. ఈమె రాజునకుంపుడుకత్తెగా బేర్కొనబడియెను. ఈ శాసనము భట్టదేవునిచే రచింపబడినది. ఇప్పటి కృష్ణామండలములోని తణుకు తాలూకాలో దణుకు గ్రామమునకు నేడు మైళ్ళ దూరమున అత్తిలి గ్రామము గలదు. ఇది పూర్వమత్తిలినాడు విషయమునకు ముఖ్యపట్టణముగనుండెను. [36]

(7)గణక విజయాదిత్యునికడ నుద్యోగిగా నుండిన పాండురంగని వంశములోని వాడును తనకడ నుద్యోగిగా నున్నవాడునునగు దుర్గరాజుచే విజయవాటిక (బెజవాడ)లో నిర్మింపబడిన జైనాలయమునకు గూడ అత్తిలినాడు విషయములో మల్లిపూడి గ్రామమునకు దానము చేసినట్లుగ మల్లిపూడి శాసనమువలన ద్యోతకమగుచున్నది.[37]

తన భృత్యవర్గములోజేరి తనయెడగడు భక్తింగూర్చెడు కుప్పనామాత్యుండను వానిని సమ్మానించి దానధర్మముల దనిపెనని యమ్మరాజవిష్ణువర్ధనుని వాండ్రముశాసనముదెలుపుచున్నది. <re>Ep.Ind., Vol.IX., p.152; (2)No.538, Public, 28 July 1909, para 61</ref>

ఇతడిట్లనేక దానధర్మములుచేసి ప్రఖ్యాతిగాంచినవాడు. ఇతడు జైనులకుజేసిన దానధర్మములనుబట్టిచూడగా జైనమత పోషకుడుగ గూడ గన్పట్టుచున్నాడు. బ్రాహ్మణులను జైనులను సమానదృష్టితో జూచియుండెను . ఇతడిరువది సంవత్సరములు నిరాతంకముగా దేశపరిపాలనము గావించెను.

రెండవ తాళరాజ విష్ణువర్ధనుడు.

అమ్మరాజు విష్ణువర్ధనునకు బిమ్మట రాజ్యమునకు వచ్చిన బేటవిజయాదిత్యుని జంపి రాజ్యమాక్రమించుకొని యుద్ధమల్లుని కొడుకు నెలదినములు పరిపాలనము చేసెనని యిదివఱకు దెలిపియుంటిమి. ఈ తాళరాజు కొడుకు రెండవ యుద్ధమల్లుడు. ఈ రెండవ యుద్ధమల్లునకు మహారాజరాజ పరమేశ్వర బాడబుండును, తాళరాజ విష్ణువర్ధనుడు నను నిరువురు కుమారులుండిరని యీ రెండవ తాళ రాజవిష్ణువర్ధను శాసనమువలన గానంబడుచున్నది. రాజ్యము చేయుచుండిన శాఖ వారిని ప్రతిఘటించి యీ శాఖలోని వారనేక పర్యాయములు రాజమాక్రమించుకొనజూచిరి కాని వీరి ప్రయత్నములన్నియు నిష్ఫలములయి పోయినవి. అయినను ఈ రెండవ తాళరాజు వెలనాటి సీమలో గొంత భాగమాక్రమించుకొని గొంతకాలము పరిపాలన చేసినట్లు గానిపించుచున్నది. వెలనాడు విషయములో నొక గ్రామమును పల్లవ మల్లుని వంశములో జనించిన కవివర్మయను వాని మనుమడగు కుప్పనయ్యయనువానికి రెండవ తాళరాజు దానముచేసినట్లు గుంటూరు శాసనమొకటి దెలుపుచున్నది.

పల్లవమల్లయనునది కాంచీపురమును పరిపాలించిన కడపటి పల్లవరాజగు నందివర్మయొక్క బిరుదునామమై యున్నది. అట్టి నందివర్మ పల్లవమల్లుని వంశములోని వాడగు కుప్పనామాత్యుడు తాళరాజునకు భృత్యుడైయాతని సేవించుచు నాతని కరుణకు బాత్రుడై యొక గ్రామమును బడసినది చూడ గాంచీపుర పల్లవరాజ వంశములోని యొక శాఖవారు వచ్చి యిప్పటి గుంటూరు మండలములో స్థిరనివాసమేర్పఱచుకొనిరని చెప్పుటకు తాళరాజు శాసనము పరమప్రమాణముగానున్నది. అమ్మరాజ విజయాదిత్యుని వలన జెప్పబడిన కుప్పనయ్య పల్లవమల్లుని వంశములోని వాడని చెప్పబడక పోయినను నిరువురొక్కడేయై యుండునని తోచుచున్నది. అయిన నీ యంశము విచారణీయము. ఈ కుప్పనయ్య స్వరాజ్య సమయమున తాళరాజునకు నధిక సాహాయ్యము చేసినందున విశ్వాసపాత్రుడై తాళరాజు వలన సమ్మానింపబడినట్లుగ నా శాసనమె చాటుచున్నది. చాళుక్యరాజుల ముద్రికలపై "శ్రీత్రిభువనాంకుశ"అను బిరుదునామము గన్పట్టుచుండగా తాళరాజు ముద్రికలపై "శ్రీత్రిభువనసింహ"యని గానంబడుచున్నది. కాబట్టి ఈ రెండవరాజు చాళుక్యసింహాసన మధిష్టించి వేగీ రాష్ట్రమును బరిపాలించినవాడు కాడనియు, కొంతకాలము మాత్రము కొంత ప్రదేశమాక్రమించుకొని పరిపాలించిన వాడని మాత్రము చెప్పవలసియున్నది. నిజముగా నితడు చాళుక్యసింహాసన మెక్కినవాడే యైన యెడల దనముద్రికలపై దప్పక త్రిభువనాంకుశనామముచే వహించియుండునుగాని తద్విరుద్ధమైన నామమును వహించియుండడు.

దానార్ణవుడు.

(క్రీ.శ.970 మొదలుకొని క్రీ.శ.973 వఱకు)

అమ్మరాజ విజయాదిత్యునికి బిమ్మట నతని సవతియన్నయు రెండవ చాళుక్యభీముని జ్యేష్ఠపుత్త్రుడునగు దానార్ణవుడు 970 దవ సంవత్సరమున రాజ్యభారమును వహించి973 వఱకు మూడు సంవత్సరములు రాజ్యపాలనము చేసెను. తరువాత 27 సంవత్సరములు దేశమరాజకమైనట్టు బహు శాసనముల వలన దెలియుచున్నది. ఈ కాలములో చోళులీ దేశమునకు దండెత్తి వచ్చినట్టును కొంతకాలము వేంగిదేశమును బాలించినట్టును కొందఱు వ్రాయుచున్నారుగాని, యది విశ్వసింపదగినది కాదు. వేంగి దేశమును జయించినట్టు చెప్పుకొనిన చోళరాజులలో మొదటివాడు రాజరాజ రాజకేసరివర్మ యనునాతడు. ఈ రాజరాజకేసరి వర్మ క్రీ.శ.985 దవ సంవత్సరమున చోళరాజ్యమునకు బట్టాభిషిక్తుడయ్యెను. ఇతడు తన పదునాలుగవ పరిపాలన సంవత్సరమున వేంగిదేశమును జయించినట్టు శాసనములు దెలుపుచున్నవి. కాబట్టి యితడు వేంగిదేశమును జయించిన సంవత్సరము 999వ సంవత్సరమగుచున్నది. చోళుల దండయాత్రవలన వేంగిదేశ మరాజకమైనదని చెప్పుట సత్యముగాదు. అరాజకమునకు వేఱుకారణములుండి యుండవలయును. వేంగిదేశ మిరువది సంవత్సరములరాజకము పాలయి కడగండ్లగుడుచుచున్న కాలమున ననగా 998వ సంవత్సరములోనో 999వ సంవత్సరములోనో చోళరాజగు రాజరాజ రాజకేసరివర్మ వేంగిదేశముపై దండెత్తి వచ్చి కలహములనడంచి దానార్ణవుని కార్య మహాదేవి వలన జనించిన పెద్దకొడుకగు శక్తివర్మను వేంగిరాజ్యమునకు బట్టాభిషిక్తుని గావించి స్వదేశమునకు బోయినట్లుగ గానంబడుచున్నది. ఇంతకన్న నాకాల స్థితి చాళుక్యశాసనముల వలన గాని చోడుల శాసనముల వలన గాని లేశమాత్రమును దెలియరాకున్నది.

శక్తివర్మ.

(క్రీ. శ. 999 మొదలుకొని 1011 వఱకు)

ఇతడు దానార్ణవుని జ్యేష్ఠపుత్రుడు. తంజాపురాధీశ్వరుండును చోడరాజునగు రాజరాజ రాజకేసరి వర్మతోడ్పాటుతో వేంగిరాష్ట్రమునకు బట్టాభిషిక్తుడై శక్తివర్మ 999 మొదలుకొని 1011 వ సంవత్సరమువఱకు పండ్రెండుసంవత్సరములు రాజ్యపరిపాలనము చేసి విశేషకీర్తి సంపాదించెను. వీనికి చాళుక్యచంద్రు డన్న బిరుదునామముగలదు. వీనిబంగారునాణెములుకొన్ని అరకాసు, నయాము మొదలగు ప్రదేశములందు గానిపించినవి. వాని బిరుదునామము లానాణెములపై నుండుటచేత నయ్యవి శక్తివర్మకాలమునాటివిగా నిర్ధారణము చేయబడినవి. వీనిబిరుదు పేరుగల బంగారు నాణెములాదేశములగన్పట్టుటచేత వీనికాలమునం దాంధ్రదేశమునకును పైజెప్పిన దేశములకును వర్తకవ్యాపారములు జరుగుచుండి యుండవలయును. ఆంధ్రులు మొదటినుండియు సముద్రయానము జేయుచు విదేశములతోడ వాణిజ్యాదివ్యాపారములు నడుపుచుండిరనుటకు లేశమాత్రమును సందియము బొందవలసినపనిలేదు.

  1. 1.0 1.1 Jour. R.A.S., Vol.II., III., IV.; Ind. Ant., Vol.VII., p.12
  2. Dr.Fleet's Karnatic Dynasties., p.9
  3. Ind. Aut, Vol. viii., p- 245;
  4. Jour.B. B.R.A S.,Vol II.. p. 11.
  5. No 574, public, 17th July 1908, 60-61
  6. Ind, Ant, Vol XX., p. 15 and 69;J. A. S.B 153-8
  7. The Vizagapatnam District Gazetter p.309
  8. No 154 of Appendix A, Annual Report on Epigraphy of 1899
  9. The Vizagapataiu District Gazetteer p. 97 p. 314;
  10. Ind Ant, Vol Xiii, 137; Ibid, Vol XX,
  11. Jour Bo. Br- R- As. (1) Soc vol XVI, p.119
  12. Ibid,lnd Ant, Vol XIII, pp 120-122 and Ibid XVI p 132
  13. lnd, Ant,Vol Vii p. |85; ibid Vol Viii p, 320
  14. Ibid Vol Vii 191
  15. ind.Ant Vol XX.p. 105;
  16. Ep. Ind Vol III, p. 236
  17. no 574, Public, 17th July 1908, paras 12-44
  18. కొక్కిలి విక్రమాదిత్యునియొక్కయు, వానికుమారుడు మంగియువరాజుయొక్కయు, దానశాసనములు రెండును, కోకిలివర్మ మహారాజుయొక్క దానశాసనములు రెండును విశాఖపట్టణమండలములో భీమునిపట్టణముతాలూకాలోని మంజేఱు గ్రామములో దొరకినవని మ||గురజాడ వేంకటప్పారావు పంతులుగారివలన బంపబడినవి.
  19. South Ind Ins Vol l pp 31,36
  20. Ind, Ant, Vol Xiii p. 55.
  21. Ind Ant ,. Vol Xiii.p. 185
  22. Ind. Ant. Vol xx, P. 102;
  23. No. 538, Public,58. th July 1909. para 28
  24. Ind. Ant. Vol xx ;p.103;
  25. No 538, Public, 28th July 1909 para 59;
  26. Dr. Fleet's Corpus Inscriptianum indicanim, Vol, III. p. 13;
  27. The Early History of India p, 270.
  28. Ind. Ant, Vol xili, p.; Sou Ind.'Ins, Vol p. 36.
  29. Ibid,Vol. viii, p. 76.
  30. Mr. R. Sewell:(Lists, Vol II, p. 26.)
  31. South Indian Inscriptions, Vol, I, p. 4.4.
  32. Ind. Ant, Vol, viii, y. 73;
  33. Ibid, Vol xii, p 91.
  34. Ibid, Vol xili, p.248;
  35. South, Ind. Ins VI,p.46No. 38.
  36. Epi.Ind., Vol.vii, pp.177-192
  37. Ibid.Vol.IX. pp.47-56