హేమలత/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవ ప్రకరణము

ఆ గ్రామమునకు రమారమి పదునైదుక్రోశముల దూరమున “పాలి” యను చిన్న గ్రామము కలదు. తత్పరిసరమున నున్న మండలమునకు దానిని ముఖ్యపట్టణముగ నొనర్చి యందొక ప్రతినిధినేర్పఁరచి యాతనికి సర్వస్వతంత్ర్యాధికారమిచ్చి చక్రవర్తియగు అల్లాయుద్దీను పరిపాలన మొనర్చుచుండెను. పాలిసర్కారున కీ సమయంబున రహిమానుఖాన్ ఖిల్లాదారుగనుండెను. ఆతఁడు మొదట పారసీక దేశమునుండివచ్చిన బానిసఁవాడయ్యు దనస్త్రోత్ర పాఠనైపుణ్యముననో దురాచారసంపత్తి చేతనో యల్లాయుద్దీన్ చక్రవర్తి కాప్త వర్గములోని వాఁడై నానాఁటికి నున్నతపదవుల నొందుచుఁ దుదకు నీయధికారము నొందెను. ఈతఁ డీనూతనపదవినొంది యిప్పటికి మూఁడు సంవత్సరములైనది. అధికార ప్రాప్తియైనదిమొద లాతఁడు గర్వోన్మత్తుఁడై రాజకీయోద్యోగస్థుల నందఱ నగౌరవంబుతో జూచుచు నిజాధికారమునకు లోఁబడిన ప్రజల ననేకకష్టముల పాలు చేసిన విరోధియై యుండుటయేగాక యంతఃపుర స్త్రీలను జెఱపట్టుటయు దురాచారులచే దొంగతనములఁ జేయుటయు లోనగు దుష్కార్యధౌరేయుఁడై యహోరాత్రములు మద్యపాన మత్తుఁడై స్త్రీ జన మధ్యంబునఁ గాలము బుచ్చుచుండెను. అది చిన్న గ్రామమగుటచే నచ్చట నున్న యుద్యోగస్థులలోనెల్ల ఖానుగాలే మహోన్నత పదవినున్న కారణమున జన సామాన్య మాతని నవాబని చెప్పుకొనుచు నతని కటాక్షపాత్రు లగుటకు యత్నించు చుందురు. వెయ్యేల! చండతరమయిన ఖాను యొక్క పరిపాలనచే బ్రజలు మలమలమాడుచు నన్న వస్త్రములకు దూరులై యాతనిమరణ మెదురుచూచుచు సాధ్యమగునేని తామె యాతని దుదముట్టింప దలచుచుండిరి. ఈత డన్యమతస్థులగు హిందువులకె కాక సదాచార పరాయణు లగు మహమ్మదీయులకు ననిష్టుడుగ నుండెను.

క్రీ. శǁ 1301 వ సంǁ రమున వేసవికాలమున నొకనాఁటి మధ్యాహ్నము పదుగురు మనష్యులశ్వారోహణ మొనర్చి పాలిగ్రామ సమీపమునకు వచ్చుచుండిరి. అందు ధవళతురంగమునెక్కి, మన్మధునివలె లావణ్యనిధియైన యెక రాజపుత్రకుమారుఁడు సేనానాయకుఁడై తోడివారలను దన మృదుమధుర వాక్యములచే హెచ్చరించుచు నెండతాపమున నుస్సురనుచు వచ్చుచుండెను. మదనసింగు రమారమి యిరువదియైదు సంవత్సరముల వయస్సుగలిగి మూర్తీభవించన పూర్ణయౌవనమువలె సర్వాంగసౌష్టవము తోడను, విశాలవక్షస్థలముతోడను జూచువారెల్లరు మెచ్చునట్లుండెను. ఆతని ధవళాశ్వముమీఁదఁ బారసీక దేశపుజీను వేయఁబడియుండెను. చలువ చేసిన తెల్లనిషరాయిదొడిగికొని విశాలమై జరీపట్టెలతోఁ దలతలమని సూర్య కాంతిచే మెఱయుతలపాగను ధరించి, నిగనిగకాంతులను గ్రక్కుచున్న నల్ల మొహము లంగరక దొరిగి, నడుమునుబటకాతో బిగించి, పైనున్న కాశ్మీర శాలువా నెండకడ్డముగ మీఁదవైచుకొని గుఱ్ఱమును మాటిమాటికీ జబుకుతో బెదరించుచుఁ బ్రయాణము సేయుచుండెను. క్షత్రియకుల శిరోభూషణుండును సగు భీమసింగునకు మదనసింగు బాలుఁడయ్యు నాంతరంగికుడగుటచే స్వామికార్యనిర్వాహణమునకై యప్పుడాగ్రానగరమున గారణాంతరమున వసించుచున్న చక్రవర్తి యొద్దకుఁ బోయి తన ప్రభువు పంపినసందేశమును దృప్తికరముగి నిర్వర్తించి తిరిగి చిత్తూరున కతఁడు వోవుచుండెను. జిల్లాయుద్దీ నతనితోఁగూడ నాజరు జంగను నతని నిచ్చి పాలిగ్రామమువఱకు మదనసింగునకు సహాయమొనర్ప వలసినదని పంపెను. నాజరుజంగు హిందూస్థాననివాసులకు మహమ్మదీయులలో బ్రఖ్యాతిగన్న వంశభూతుఁడై గుణములచేఁ దనవంశమునకు గీర్తిఁ దెచ్చుచుండెను. చక్రవర్తి కాతనియందు గొంత నమ్మకము గలదు. మదనసింగు నాజరుజంగును సహజసద్గుణ సంపన్నులు గనుక నాగ్రానగరమునం దున్నప్పు డిరువురకు స్నేహమయ్యేను. అట్లిద్దఱును బయలుదేరి పాలిగ్రామమునకు వచ్చుచుండగా మార్గమధ్యమున బందిపోటు దొంగలసంఘ మొకటి వారి పైబడి శౌర్యరాసియగు మదనసింగు నాజరుసహాయమున దొంగలనందలఁ బాఱఁదోలి యందనేకుల వధించెను. స్వభావసిద్ధముగ నతఁడు మోటచొరవయుఁ దిగువయుఁగల శరీరలక్ష్యము లేని సాహసుండగుటచే సంపూర్ణ జయమునొందినను మెడమీఁదఁ జిటికినవ్రేలు పొడుగుగల గాయము నొందవలసిన వచ్చెను. ఎండవేఁడిమిచేతను, గాయపుమంట చేతను దాళఁజాలక రెండుమూడు పర్యాయము లతఁడు మూర్ఛిల్ల సిద్ధముగ నుడి వెంటనే తెలివిఁదెచ్చుకొని కష్టముమీఁదఁ బ్రయాణ మొనర్చుచుండెను. ఏకధారగ స్రవించుచుఁ జూపఱకుఁ గనులు మిఱుమిట్లుగొలుపు రక్తముచే నతని యుంగరకాలన్నియుఁ దడిసి శరీరమున కంటుకొనిపోయి మిగుల బాధకరముగ నుండెను. మదనసింగుతోఁ జిత్తూరునుండి వచ్చిన సేవకు లేవురును భయకంపితులై నోట మాట లేక హృదయస్థిత విచారమును నేత్రబాష్పములవలనఁ దెలియఁజేయుచుండిరి. స్వల్పకాల పరిచయుఁడైనను నాజరుజంగు తన మిత్రుని యవస్థకు మిగులఁ గుందుచు నతనికి ధైర్యముఁ గలిగించుటకు బహువిధ ప్రయత్నములు సలిపెఁగాని యవియెల్ల వ్యర్థములయ్యెను, కొంతసేపు నిశ్శబ్దముగ నయ్యాశ్వికులు నడిచిరికాని తుదకు నాజరుజంగు రసపుత్రకుమారు బలుకరించె. “నాలుగు గడియ లోపికఁ గలిగియుండుము. గ్రామ సమీపమునకు వచ్చినారము. ఆచెట్ల చాటున నున్నదే పాలి గ్రామము అని హెచ్చరించి కొంచెము మంచితీర్థ మత నికిఁ ద్రావనిప్పించె. నీరుత్రాగి సేదదీఱి రసపుత్రుఁడు ధైర్యమును బూని గుఱ్ఱముపైఁ గూర్చుండఁగా మరల నాజరుజం గిట్లనియె. “ఈ గ్రామమున మాబంధువుఁడును జక్రవర్తికిఁ బరమాప్తుఁడనైన రహిమానుఖానున్న వాఁడు. మనకు, సమస్తోపచారములు నతఁడుచేయును.” ఈమాటల తరువాత నిశ్శబ్దముగా వారందఱు నడచునప్పటికి గ్రామమువారియెదుట ననతిదూరమునఁ గనఁబడెను ఈ యాశ్వికులు గ్రామసమీపమున కరుగుట, ఖాను యొక్క సేవకులు కోట బురుజులమీద నుండి దూరముననే చూచి రహిమాను ఖానున కెఱిగింప నతఁడును సముచితవస్త్రములు ధరించి వారినెదుర్కొని సగౌరవముగ నాదరించి మదనసింగుయొక్క దురవస్థనుజూచి గాయమును మాన్పు మంగలి వానికైవర్తమానమును పంపెనుగాని యతఁ డూరలేనందన గొంచెము విచారించి ఖాను నాజరు జంగుతో నిట్లనియె. “తమ్ముడా! మంగలి వాఁడు లేడని మనము విచారింప నక్కఱలేదు. ఆవల మఠమున నొక వృద్ధుఁడగు బావాజీకలడు. ఈతని నటఁకు దీసికొని పొండు” అని చెప్పి తన సేవకులలో నొకనిని మఠమునకు జూపుమని పంపెను. మదనసింగును మెల్లమెల్లగా మఠమునకు దీసికొనిపోవువఱకు రాత్రి నాలుగుగడియల కాలమైనది. బావాజీయును సాయంకాలానుష్ఠానములను దీర్చుకొని భోజనముచేసి పండుకొనుటకు సిద్ధముగనుండెను. ఖానుచే సంపబడిన పరివారము ద్వార ముననుండ భానుయొక్క సేవకుండు బావాజీ మహారాజ్ అని కేకలు వేసి తలపుదట్టెను. బావాజీ యాతని కంఠదధ్వని నానవాలు పట్టి తనకడ కతఁ డెవరివో గాయపడిన వారిని దోడుకొనవచ్చెదనని యెఱిఁగి తన ప్రక్కను బవ్వళించిన మనమరాలిని మెల్లగా జేతితోఁదట్టి “హేమలతా! హేమలత! తలుపుదీయు మమ్మ” యని పిలిచెను. సాధుశీలము నవనీతహృదయయు నగు హేమలత తన పితామహుఁడు పిలిచినంతటనే లేచి తన్నతఁడు పిలిచిన కారణ మరసి నిద్రాభారముచే గనులు నులిమికొనుచు నతిదీర్ఘమగు వేణి భరమువీడి పిక్కలపైఁబడ మెల్లమెల్లగ దలుపుదీసెను. అపుడు రాజసేవకులవలన వేయబడిన కాగడాల వెలుతురున హేమలత ముఖము సంపూర్ణ శరత్కాలచంద్ర మండలమువలె ముద్దులమూట గట్టుచుండుటచే నొక నిమిషము వఱకును వారందఱు నిశ్చేష్టులై మదనసింగు యొక్క యవస్థను మఱచి యనిమిషత్వము నొంది యామెను జూచుచుండిరి.

వారి యాశ్చర్యమొక కొంత తగ్గువఱ కామె తాత దగ్గఱకుబోయెను. అంతట సేవకులు వృద్ధునితో దమరాకకుగారణ మెఱింగిఁచి స్మృతియెఱుంగక యున్న రాజపుత్రుని జూపిరి. వృద్ధుఁడును వానికి బ్రక్క గదిలో నొక మంచము వేయించి పూర్ణాంధుఁడు గనుక గాయమును దనహస్తముతో దడవి “యిది దిట్టమైన గాయమే అయినను రామదేవునిదయచే నాకిది సాధ్య మగు నని తోచుచున్నది. మీరందరు నావలకు బొండు, ఒకరుమాత్ర మిచట నుండుడని చెప్పి వారినందఱ నవల కంపకముందే యంధుడయ్యు నేత్రము లున్న వానికంటె నేర్పుగ గాయమునుగట్టి దానిపై నొకపట్టిక వైచెను. అంతవార్ధకమున నతనికి గల యోపికకును నపారప్రజ్ఞకును నందరు నాశ్చర్యపడి కన్వులున్నపు డెంతనేర్పరియై యుండునో” యని యోజింప నారంభించిరి. తరవాత వారిపరివారమున నొక్కని దక్క దక్కిన వారలనందఱ నావలకంపి వృద్ధుఁడు మనుమరాలిం జూచి “అమ్మాయి, ప్రొద్దుపోయినది పండుకొను” మని చెప్పెను. కాని యెందుచేతనో హేమ లతకు నిద్రరాకుండుటచే “దాదా! ఈయన యవస్థను గొంతవఱకు గనిపెట్టి యుండెదను. పెద్దవాడవు నీవు నిద్రపొమ్ము నే నిదివరకు నిద్ర పోయినా” నని ప్రత్యుత్తరమిచ్చి తానామంచము వద్దఁ గూర్చుండి మదనసింగు లక్షణములఁ జూచుచుండెను. యోగియు మదనసింగు యొక్క యనుచరుని వలన నతఁడుత్తమ రసపుత్రవంశస్థుడని యెఱింగి గాయము తగిలిన కారణ మడిగి తెలిసికొని పిమ్మట నిద్రపోయెను. రసపుత్రుఁడుసు సుఖముగఁ గొంతవఱకు నిద్రించెను. హేమలత యతని మంచము దగ్గఱ గూర్చుండి ఱెప్పవాల్చక చూచుచుండెను. హేమలత యసమానరూప లావణ్యములయం దాశకాలపుస్త్రీలలో నెల్ల శిరోరత్నమై యుండెనని చెప్పుటకు సందియములేదు. నిరంతరము నామెను బాయకుండు సద్గుణములు తక్క తదితర భూషణము లామెకడలేవు. ఆకర్ణాంత విశాలనేత్రములను, దొండపండువలె సహజారుణ్యముల మోవియు వంకరతిరిగి విండ్లవలెనున్న కన్బొమలును, నిరంతర మందహాసమును, నామె ముఖారవిందలావణ్యమును బరిపూర్ణత నొందించెను. ఆమె పితామహుఁ డాగ్రామము వచ్చినప్పుడు బాలికగ నుండుటచే శుక్లపక్ష చంద్రమండలమువలె దినదిన ప్రవర్థమానమగు నామె రూపమునుచూచి తత్పురవాసు లామెయెడ ననురాగసమేతులయిరి. ఆమె రాజవీధిని బోవు తరి తేరిపాఱి యామెను గన్గొనని బాటసారులును, ఉత్కంఠమునఁ బుష్పహారము వేయని పూలవర్తకులను, నామెకొఱకుఁ జక్కెర పెట్టని కోమటులను లేరు. కాని యా జగన్మోహనాకారము ప్రజల కనేకులకు విచార కారణమయి యుండెను. ఇంతసౌందర్య విలాసవతియగు కన్య యేమహారాజు గర్భమునైన నుదయింపక నిరుపేదయయిన జాత్యంధుని మనుమరాలయి పుట్టి సామాన్య స్త్రీ వలె పాటుపడవలసివచ్చెను గదా యని జనులందఱు విచార మొందుచుందురు. కెంజిగురాకులకు వన్నె దెచ్చు నామె ప్రశస్త హస్తములతో బావినీరు తోడునపు డామెవేళ్ళుకంది నొప్పులెత్తుటఁ జూచిన స్త్రీలందఱు నొక్కమారు కంటఁదడివెట్టుకొని యామె నేపనిని జేయనీయక తామె యామెకయి సకలకార్యములను జేయుచుందురు. ఈమె సంప్రాప్త యౌవనమైనది మొదలామె తాత యామెను వీధిలోని కరుగవలదనియు, దురాత్ముల దృష్టిని బడవలదనియుఁ బలుమాఱులు చెప్పుచుండుటఁబట్టి మునుపటివలె నిలువెడలక గృహముననే యుండుట కారంభించెను. అంధుఁ డయిన పితామహుని పరిచర్యయం దతి శ్రద్ధ గలిగి యతని కామె సమస్తోపచారములు విసుగక చేయుచుండును. అందుచేతనే నిద్రాభంగ మగునేని తాతకనారోగ్యమగునని యతని నిద్రపుచ్చి యామె రోగిమంచము నొద్దఁ గూర్చుండెను. అప్పుడు రెండు జాములరాత్రియైనది, మదనసింగును గాఢనిద్రాసక్తుఁడై నడుమ “ఓరి దురాత్ములార రండిరండి మీ ప్రాణము లపహరింపక మాననుసుఁడీ!” యని రెండుసారులు పలవరించెను. ఒక పర్యాయములేచి దాహముత్రాగి యొత్తిగిలి పండుకొన్నప్పుడు మనుష్యావతారము ధరించిన సౌందర్య దేవతవలె గట్టెదుట నిలిచి తనకు దాహమొసంగిన కాంతారత్నమును గన్నెత్తి చూచి మఱల నిద్రపోయెను. హేమలత యాతని ముఖావలోకనము జేయుచు సుందరమందహాస మతని ముఖారవిందమున నంకురించునపుడు తాను జిఱునవ్వు నవ్వుచు, వాని శరీరమున జెమ్మటపట్టునెడ దనశరీరమున జెమట పట్టువఱకును విసనకఱ్ఱతో విసరుచు గాయమువలన రాచకొమరుడు బాధపడునెడ దానెంతయు విచారపడుచు నతడు జ్వరపీడితుడగువేళ, తాతనులేపి యౌషధ మొసగుచు నతనితో సమస్త బాధల దాను బడుచు సకలోపచారముల జేయుచుండెను, మదనసింగు యొక్క మనోహరాకారమును జూచుటాదిగ హేమలత కదివఱ కెన్నడును జనింపనిదియు నిట్టిదని నిరూపింపరానిదియు నగు నొకానొకమనోవికార ముదయించెను. దానితో బాలికకు రాచకొమరునియందు ననురాగము పుట్టెను. హృదయము గాఢముగ క్షత్రియపుత్రునియందు దవుల్కొని మరల్చుకొందమని యయ్యబల ప్రయత్నించిన మరలకయుండెను. అందుచే రాచకొమరు డచిరపరిచయు డయినను, గుణ సముద్రుడై కడు సుందరుడగు నీతని కింత బాల్యమునం దింతకష్ట మేలసంప్రాప్తింప జేసితివి దైవమా! ఈతడు నిరపాయుండయి బ్రదికి యెన్నడయిన బట్టగట్టునా” యని దైవము ననేక విధంబుల వేడుకొనుచు నిష్టదేవతా ప్రార్థన మొనర్చుచు నామె చింతించు చుండెను. అపుడు రమారమి యొక జాము ప్రొద్దుండుటచే కోడికూతవలన యోగి మేలుకొని మనుమరాలిని బిలిచి “అమ్మా! నీవు రాత్రి యంతయుమేలు కొన్నావు, ఇక నేను గని పెట్టు కొనియండెదను, నీవు నిద్రపొమ్ము” అని చెప్పి రోగిమంచము దగ్గఱకు బోయి యాతనినాడి జూచి జ్వరమతి తీవ్రముగానుండుటచే మఱియొక కొత్తమందువేసి మనుమరాలిని నిద్రపుచ్చి తా నొంటగ గూర్చుండెను.

అపుడు తనకు జరిగిన మహాపకారము జ్ఞప్తికిరా “ఆహాహా! అల్లాయుద్దీను చక్రవర్తి యొక్క క్రౌర్యము నన్నెంతవఱకుదెచ్చినది? భగవంతుడు దుర్మార్గులకు దోడ్పడుట కలియుగ ధర్మము కదా? హా జలాలుద్దీను చక్రవర్తి! ఎందున్నావు. అట్టి ధర్మశీలుడగు పినతండ్రిని జంపి సింహాసన మెక్కిన యల్లాయుద్దీనునకు నామీద దయ యెట్లుండును? ఇంతకు దైవానుగ్రహమేమో” యని యాత్మవిచార మొందునప్పటికి రోగి దాహ మడుగుటవలన యోగి తనతలంపుమాని దాహమిచ్చి శరీరముపై జేయివైచి జ్వరము తగ్గినదని యెఱింగి సంతోషించి రాచకుమారుడు జీవించునని నిశ్చయించుకొనెను. తరువాత గొంతసేపటికి కాకులుకూయ నుదయపర్వతశిఖర మలంకరించుచు సకల జనమిత్రుం డగుసూర్యుడుదయించి తన యరుణకాంతి దిగంతముల యందు బర్వ బంగరుపూతవలె నలరు లేత నీరెండ సమస్త పదార్థములపై వ్యాపింప జేసి వాని కపూర్వాలంకార మొసంగెను. తన యాప్తమిత్రుని యవస్థ యెటులున్నదో యెఱుగగోరి సూర్యోదయ పూర్వముననేలేచి రహిమానుఖాను ప్రముఖులనులేపి తనవెంట బెట్టుకొని వచ్చిన నాజరుజంగు తనమిత్రస్థితి యపాయమును దాటినదని సంతోషించెను కాని రహిమానుఖాను రోగి యోగక్షేమము లరయక యవల ప్రక్కగదిలో దలుపుచాటున నిలువబడి యున్న హేమలత యొక్క యరుణపదపల్లవముల జూచి యాశ్చర్యపడి యా ప్రక్కనే తనచిత్తమును నిలిపి, నాజరజంగు మదనసింగులు తనలో జెప్పుచున్న మాటల కసంబద్ధప్రత్యుత్తరంబుల నిచ్చుచు “నేను విన్నదానికిని నేడు చూచినదానికిని సరిపోయినది. నందుడు సమయమునకు లేకపోయెను గద. అయిననేమి?” యని మనశ్శాంతి కలుగమి వారితో “నాకీ దినమున దల దిమ్ముగానున్నది. మీరనుకొను మాటలు నాకు వినబడుచుండుటలేదు.” అని చెప్పెను. మదనసింగును నాజర జంగును ఖానుసాహేబు యొక్క ముఖలక్షణములు మాఱుటయు నతం డసంబద్ధ సంభాషణుండగుటయు గ్రహించి కారణమూహింపజాలక యూరకుండిరి. తరువాత నందరును గోటకు జనిరి.