హేమలత/మొదటి ప్రకరణము
హేమలత
మొదటి ప్రకరణము
ఒకనాఁటి సూర్యాస్తమయ సమయమున శరీరమునందంతట భస్మముఁ బూసికొని కాషాయాంబరములఁ గట్టుకొనిన యొక మార్గస్థుఁడు యమునానది వైపునకు వచ్చుచుండెను. అతఁ డేగ్రామము నుండి వచ్చుచుండెనో యేగ్రామమునకుఁ బోవుచుండెనో యేఱిఁగిన వారెవ్వరును లేరు. మార్గ మధ్యమున నొకరిద్ద ఱాతనిని బలుకరించిరి కాని వారికతఁ డెట్టి ప్రత్యుత్తరమును నీయలేదు. అది వేసవి కాల మగుటచేతను, సకలజంతు భయంకరముగా నామధ్యాహ్నమున వీఁచుటచేతను, నామనుష్యుఁడు మార్గాయాసము వలన డస్సియుండెను. అతని యాయాసమునుబట్టి దూరప్రయాణము నతఁడు చేసెనని నిశ్చయముగాఁ జెప్పవచ్చును. ఆతఁడు రమారమి నలువది సంవత్సరముల వయస్సు గలిగియున్నను, నంత వయస్సుగల వాని వఁలె గన్పడఁడు. ఆ మనుష్యుఁడు పొడగరికాఁడు కాని కేవలము పొట్టియని చెప్పుటకు వీలులేదు. శరీరము చామనచాయఁ గలదియై యుండును, ఆయనను జూచువా రందఱు నతఁడు సుదరపురుషుఁడని యనకమానరు. లావుగానున్న శరీరమునం దాపాదమస్తకము వఱకును భస్మమలఁదఁబడి యుండుట చేతను మెడలో యజ్ఞోపవీతము వస్త్రముచాటుననుండి కనఁబడ కుండుటచేతను, నతఁడేజాతిమనుష్యుఁడో తెలిసికొనుట దుర్లభముగాని, యాతఁడు త్తరహిందూస్థాన వాస్తవ్యుఁడనియు నందు బ్రహ్మక్షత్రియ వైశ్య జాతులలో నొకజాతివాఁడనియు మాత్రమూహింపవచ్చును. తీవ్రమైన సూర్యతాపమువలన, బయలు వెడలిన చెమ్మటచేత శరీరమునం దలఁదుకొన్న భస్మ మక్కడక్కడ కరిఁగిపోయి యతని సహజకోమలమైన శరీరమును జూపుచుండెను. గడ్డమును జడలను నతఁడు యోగియని చెప్పుచున్నవి. కాని చక్కగా నవి పెరుఁగకుండుటచేత నూతనముగా నాశ్రమస్వీకారము నొనర్పునట్లు చూపరులు గ్రహింతురు. భగ్గుభగ్గుమని కాలు గాలుచుండినను, నెండవేడిమిచే శిరస్సు మాడుచుండినను, నతఁడు పాదరక్షలుకాని గొడుగు కాని ధరింపకయే దినమంతయుఁ బ్రయాణము జేసెను. బైరాగుల దగ్గఱ నుండు కక్షపాల, యతనిదగ్గఱనుండెనుగాని యోగిజనుల కత్యంత ప్రియము లగు గంజాయియుఁ జిలుమును నందులేవు. యమునా నదీతీరముననున్న మధురాపుర సమీపమున కతఁడు నాలుగుగడియల ప్రొద్దువేళ వచ్చినను నేమి కారణముననో పట్టణమునఁ బ్రవేశింపక క్రోసుదూరమున నున్న మామిడి తోఁటలో దాఁగియుండి సూర్యాస్తమయమయినతోడనే యాస్థలమును విడిచి చీఁకటికాల మగుటచేత నొరులకంటఁబడకుండ యమునాతీరమునకుఁబోవుచుం డెను. నదీతీరమునఁ జేరినతోడనే చంకనున్న కక్షపాల నొకమూలఁ బడ వైచి కాలుసేతులు జన్నీటఁ గడిగి మొగపైము నానిర్మలో దకములఁ జల్లుకొని నాలుగు పుడిసిళ్ళ నీళ్ళుత్రాగి యచ్చట నిసుక తిన్నపై నించుక శయనించెను. అప్పుడు యమునాజలబిందువులతోఁ గూడ మలయమారుత మరుదెంచి యాప్తమిత్రుఁడువచ్చి మీఁదఁ జేయివైచి తట్టినట్టు గడుమార్గాయాసము నొందియున్న యాతని శరీరమును స్పృశించి యాయాసము నపన యించెను. ఆతఁడును సకలజన సులభమైన యీదైవదత్త సౌఖ్యము చేత పరవశత్వమునొంది కనులు మూసికొని హాయి హాయి యని కొన్ని నిమిషముల వఱకును దనకష్టములనెల్ల మఱచిపోయెను. ఆసమయమునం దాకాశమున వసంతకోటి నక్షత్రములు మినుకుమినుకు మని జ్యోతులవలెఁ బ్రకాశించుచుండెను. అదినిర్జనస్థల మగుటచే నిలకోఁడి, చిమ్మట, మొదలగు జంతువుల రొదతప్ప మఱియొ ధ్వని యేదియు లేదు. నిశ్శబ్దముగనున్న యాస్థలమునందు శయనించినతోడనే యతనికిఁ దన పూర్వవృత్తాంతము జ్ఞప్తికివచ్చి వానిని విచారమునందు ముంచెను. వెంటనే యతండు “హా దైవమా! ఎంతకష్టము గలుగఁజేసితివి, ఆహా! ఏమీ తురకల దౌర్జన్యము. ఈ మహమ్మదీయ ప్రభుత్వ మెన్నఁడై న నశించునా” యని తనలో దాననుచుకొనుచు వశముగాక వచ్చిన బాష్పజలమును దుడుచుకొని యాకాశమువంకఁ జూచునప్పటికిఁ జిన్నమబ్బు కనఁబడెను, అది క్రమ క్రమముగా గొప్పదై యాకసమునంతను నాక్రమించుకొనుటచేతను, దానితో గాలిదుమారము వచ్చుటచేతను వర్షమువచ్చునని యోజించి యిసుక తిన్నె మీద బవ్వళించిన యోగి యెచట తలదాచుకొందునోయని చింతింప నారంభించెను. కొంచెమాలోచించు కొనునప్పటికి దాను బగలుదాగికొన్న మామిడి తోపునకును నదికిని మధ్యనున్న పాడుదేవాలయ మాతనికి జ్ఞప్తికిరాగా నటకుఁ బోవ బ్రయాణమయ్యెను. ఆ దేవాలయమునకును నదీతీరమునకు గొన్ని గజముల దూరముమాత్రమే యుండుటచేత నీమనుష్యుడు త్వరితముగా నడిచి గడివైపునకు వెళ్లెను. కొని యంతకుముందే చినుకులారంభమై యెండచే గాగియున్న యోగి శరీరమును వడకునట్లు చేసి యాతని వస్త్రముల దడిపెను. బట్టతడుపుజల్లువాన కురియునప్పటికి మన బాటసారి దేవాలయపు ముంగిలి భాగమునకు నడచెను.
ఆ దేవాలయము మనము వ్రాయుచున్న యీకాలమునాటికి శిథిలావస్థ నొందినను బూర్వకాలము నందు గొన్ని దినము లున్నతదశ యందుండెను. క్రీస్తుశకము 1016వ సంవత్సరమునందు గజనీ మహమ్మదు హిందూదేశముపై దండెత్తి జగత్ప్రసిద్ధ పుణ్య క్షేత్రమగు మధురానగరమునఁ దద్దేవాలయమును దోచిఁకొని స్వామివిగ్రహమును స్వహస్తములతో బెకలించి దేవాలయమునెల్ల భూమితో మట్టము చేసెను. ఈ దేవాలయ మూరు బయటనుండుటచేత మ్లేచ్ఛ ప్రభువు స్వయముగా నాశనము చేయలేదుగాని తద్భటులు విగ్రహనాశన మొనర్చి యందు సైన్యమవ్వీటనున్నంత కాలమును దామువసించిరి. ఆనాట నుండియు నాకోవెల శిలావిగ్రహశూన్యమయ్యు నప్పుడప్పుడు డర్థ రాత్రముల యందు మనుష్యవిగ్రహములతో గూడియుండుటగలదు. దూరదేశ ప్రయాణములను జేయుచున్న బాటసారులను, ద్రవ్వపంతులను వణిజులను దోచిఁకొని స్త్రీలను జెఱఁబట్టి స్వచ్ఛందవిహారము సేయు దుర్నీతిపరులగు చోరులకును దురాచారులకును నాదేవళము శరణ్యంబై యుండెను. అందుచేత దీపములు పెట్టిన తరువాత మధురానగర వాస్తవ్యులెవ్వరు నా దేవాలయ ప్రాంతముల రుగరు. అరిగిన నపాయము లేకరారు. ఒకనాడు శవదహనమైన గుర్తులు కనఁబడుట వలనను, నింకొకనాడు మనుష్యులు ధరించు కొన్ని వస్త్రములును గన్పడుటవలనను జను లాప్రాంతమునకు బొత్తుగా వచ్చుట మానిరి. ఈ ప్రదేశమునకు నలుదెసలను దట్టముగనున్న వృక్షములు పెట్టనికోటవలె నుండుటఁబట్టి చోరులకు సదుపాయ మెక్కువగ నుండెను. ఆ యాలయమునందుఁ బూర్వము శ్రావ్యమైన మురళీనాద మొనర్చుచుండగా యాహిపడగలపై నాట్యముసలుపు శ్రీకృష్ణుని విగ్రహముండెనని పట్టణమునఁ గల వృద్ధు లప్పుడప్పు డాస్థలమును జూచునప్పు డనుకొనుచుందురు. తురుష్కులు చేసిన నాశనమునకుఁదోడు కాలము గూడ దేవాలయ ప్రాకారమును నాశన దేవతపాలు చేసెను. మనము వర్ణించెడు కాలమునాఁటికి ముఖాలయమొకటి తక్క మఱియేమియులేదు. గర్భాలయము సహజముగా నంధకారబంధురమై యుండెను. నాఁటిరేయి మేఘములచే గుడియందు జీకటి పది రెట్లధికముగ నుండెను. మన తెరువరి తడిపిన వస్త్రముల నారఁగట్టి కక్షపాలయందున్న పొడిబట్టను దీసి కప్పుకొని మహాగుహవలె భయంకరముగానున్న యాదేవళముఁ బ్రవేశింప జంకుచుఁ జలిబాధ కోర్వఁజాలక లోనఁ జొరఁబడి తప్పుటడుగు లిడుచుఁ గొంతదూరముపోయి పూర్వము విగ్రహ ముండునట్టి యున్నత స్థలమునఁ గూర్చుండెను. అక్కడక్కడఁ గూర్చుండి తన పూర్వాశ్రమ సంబంధమగు దుఃఖాలోచన సముద్రమున మగ్నుఁడై పరవశత్వముఁ జెందియుండ నానిర్జన ప్రదేశమున నతనికి మనుష్యుల యలికిడి వినఁబడి యాతనిఁ జింతాసమాధినుండి మేలుకొలిపెను. నిర్మానుష్య ప్రదేశమున నరుల యలుకు డగుట కతడాశ్చర్యపడి యది నిజమా యబద్ధమాయని వితర్కించుచుండగా నిద్దఱు మనుష్యులు చీకటియందు దళతళ మెఱయుచున్న ఖడ్గములు హస్తముల ధరియించి గుమ్మముముందఱ నిలువఁబడిరి. అప్పటికి వర్ష మాగిపోయినందున వారిదేహము లంతగా దడిసియుండలేదు. చేతులనున్న ఖడ్గములను గోడకుఁ జేరవైచి గుమ్మము ముందఱనిలచి దేహములను దుడుచుకొనుచు వారొకరితో నొకరు మాటలాడక యెవరి నిమిత్తమో నిరీక్షించుచుండిరి. ఇట్లుకొంతసేపు చూచి వారిరువురు లోనఁ బ్రవేశించిరి. అందొకఁడు మహారాష్ట్రుఁడు; రెండవవాఁడు తురుష్కుఁడు. తురుష్కుఁడు దీర్ఘకాయము తోను, దూలమువలెనున్న భుజద్వయముతోను గుండెలను దాఁకుచున్న నల్లని గడ్డముతోడను జూచువారికందఱకును భయమును గల్గించుచుండెను. భయంకరమైన యాతని ముఖావలోకనము జేసిన వారందఱును దయమున దతనియందును లేదని నిశ్చయముగఁ జెప్పఁగలరు. మహారాష్ట్రుడు కొంచెము గొప్పకుటుంబమునం దుద్భవించినను గాలవశమున ధనాదులు గోలుపోయి దురాచారుల స్నేహముఁజేసి దౌర్జన్యము లందారితేఱెను గాని ముఖవిలాసముజూడ గొంచెము జాలిగల వాడని తోచును. అయినను దొంగతనము మనుష్యవధ మొదలగు దుష్కార్యముల నాచరించునెడ జంకును సందేహమును నిరువురకును లేవు. అదివఱకు గోడలకు జేరవైచిన ఖడ్గముల నొరలలోనుంచి వారు దేవళము మును ముందఱఁ గూర్చుండి యేదోఁ యోజింపుచుండిరి. అందు మహమ్మదీయుఁడు మహారాష్ట్రుని జూచి యిట్లనియె.
నందా! బాలాజీ యింకను రాకుండటకు నేమి కారణము? అతనిని మార్గమునం దెవరైనఁ బట్టుకొనియుందురా?
నందు — గులామల్లీ! నీకింత వెఱ్ఱియెందుకు! మనబాలాజీ యిదివఱకెన్నఁడైన నొకరిచేతఁ జిక్కెనా? ఆతఁడు దేవాంతకుఁడని యెఱుగఁవా?
గులా — అవును! నేనెఱుగుదును. అందుచేతనే మనకీవఱకెన్నడును జక్రవర్తివలన భయము లేదు. మనరహస్యము బయలుపడలేదు. నందు – మనచేత నీకార్యములఁ జేయించుచున్న రహిమాన్ నలాయుద్దీను చక్రవర్తికడ గొప్ప యుద్యోగమునందుండగా మనకు నెవరి భయమును గలుగదు. అతడు సుఖవంతుఁడగుగాక!
గులా – మొన్నటిరాత్రి స్త్రీలను దోఁచుకొన్నప్పుడు దొరికిన నగలలో నెన్నవవంతు మనము తీసికొనునట్లు ప్రభువుగా రేర్పఱచినారు?
నందు – ఎంతయిచ్చిన నంతే మనమును బుచ్చుకొందము.
గులా – అదిసరే. కాని యాదినమున మనుష్యులను నరికినట్లు నీవిదివఱకెప్పుడు నఱికియుండలేదు. ఒక దెబ్బకు రెండు తునకలుగదా! వహవ్వా! శహబాస్! అటువంటి యేటు మఱిదొరకదు.
నందు – అదియొక్క లెక్కా! నెలదినముల క్రిందటఁ బ్రయాగలో యాత్రార్థమరుగు దెంచిన యోఢ్రులను దోఁచుకొన్నప్పుడు దయాదాక్షిణ్యములు లేక స్త్రీలను శిశువులనుగూడ నఱికివేసినాను. నాడు నీవుచూడలేదా?
అని వీరిరువురు సంభాషించుకొనుచుండఁ బోతవిగ్రహమువలె నాలయ మధ్యమున సుఖాసీనుఁడైయున్న మనబాటసారి భయముచే గడగడవడంకుచు నేమియుఁ జేయలేకయుండెను. వారి సంభాషణమునుబట్టి వారు మనుష్య హంతకులని యతఁడు తెలిసికొనెను. వారిదివఱ కతనిని జూడక తమ రహస్యముల బయలుపఱచు కొనుచుండిరి. అపుడు నందుఁడు కొంచెము గంజాయి పీల్చవలెనని కోరి సంచిలో నున్న చెకుముకిరాతిని నినుపముక్కను దీసి వాని రాపిడిచే నగ్నిని సృజంచి చిలుములో గంజాయియాకును బొగాకునువైచి యందు నిప్పంటించి తాను నాలుగు గుక్కలను దాగి గులామున కందిచ్చెను. ఈ నిప్పు వెలుతురున గులాము మనుష్యుఁ డాలయమున నున్నట్లు జాడగట్టి తన యనుమానమును నందుని చెవిలో వైచెను. సహజలక్షణమైన క్రౌర్యములకు గంజాయిమత్తు తోడ్పడ, వెంటనే నందుఁడు త్రాఁచుపామువలె లేచి మనబాటసారి యున్న వైపున కరుగుచుండగా గలామాతనిని వెంబడించెను. అదివఱకే భయకంపితుఁడైన మన తెరువరి యీ దురాత్ములు తనవైపు వచ్చుచుండుటఁజూచి కెవ్వుననఱచి స్మృతి యెఱుఁగక తనయున్నస్థలమునుండి క్రిందఁబడెను, ఆతనిఁజూచి నందుడును గులామును నాశ్చర్యపడి యొండొరులతో నిట్లు సంభాషించిరి.
నందు – అరే! అన్నయ్య! ఎవఁడురా వీఁడు?
గులా – ఎవఁడో మనమాటలువిని మనగుట్టుబైటఁబెట్టదలంచినదొంగ.
నందు – ఈ ఛండాలు నిప్పుడేమి చేయుదము? ఏదీ కత్తి యిలాగునతే.
గులా – కత్తితోఁ గొట్టవద్దు. ఈలాగునఁ జేయుదము. (అని చెవిలో రహస్యముగాఁ జెప్పెను)
అట్లిరువురుఁ గూడఁ బలుకుకొని నిస్పృహహృదయుడై యున్న యాదీనునినోట గడ్డలంగ్రుక్కి శిరస్సునొకరును బాదములొకరును బట్టుకొని మోసికొనిపోయి యతండు గిజగిజ తన్నుకొనుచున్నను వదలక నదీతీరముఁ జేరి లోతునీటఁదిగి, చావు ముండకొడక, యని వాని నందుఁబాఱవైచిరి. తరువాత వారిరువురు నాలయమునకు వచ్చి యాతని కక్షపాలను వెదకి యందుండి కొన్ని వస్తువులను సంగ్రహించి తమ ప్రియమిత్రుడై న బాలాజీ రాఁడని నిశ్చయించుకొని యధేచ్ఛం జనిరి.