Jump to content

హేమలత/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము

మదనసింగునకు గాయము తగిలిన మఱునాడు రహిమానుఖాను తన యంతఃపురమున నొకగదిలో దీర్ఘవిచారమున బాధపడుచు గూర్చుండెను. అపుడు నాతనియెదుట కిర్వురు సేవకులు వచ్చి భయవినయములతో వంగి వంగి సలాములుచేసి కట్టెదుటనిలువంబడిరి. అది సంధ్యాసమయముగనుక కార్యాంతర మాలోచించుచున్న ఖాను వారిని గుర్తింపక “ఎవరువారు?” అని బిగ్గఱగ నఱచి చూచి “ఓహో! నందుడా! రెండవవాఁడెవడు? ఓరీ గులామల్లీ! మీరు సుఖముగా వచ్చినారా? యని పలుకరించెను. అంతట నా సేవకద్వయము. “ఏలినవారి కటాక్షమువలన మేమీ గడియవఱకు సుఖముగా నున్నాముస్వామీ” యని కంటనీరువెట్టుకొనఁ జొచ్చిరి. ఖానుసాహే బదరిపడి జరిగిన యావద్వృత్తాంత మెఱిఁగింపుమన వారిలోనందు డిట్లని చెప్పసాగెను. మహాప్రభూ! ముందుగ నిన్నటి వృత్తాంత మెఱిఁగించెదను. నిన్న నుదయ మెవరో పదుగురు మనుష్యు లాగ్రానగరమునుండి యెటకో బోవుచు మాకగపడిరి. భాగ్యవంతులగు బాటసారుల విడువవలదని యేలిన వారిచ్చిన హుకుము ప్రకారము వారు ద్రవ్యవంతులవలె నుంటచే మే మిరువది యైదుగురము వారిపైఁబడితిమి. తరువాత నేమి మనవి చేయుదును మహాప్రభూ! అందొక సుందరఁడగు రాజపుత్రుఁడు మాపైఁబడి మాలోఁ దక్షణమే పండ్రెలడుగురను స్వర్గమున కంపెను. మిగిలిన వారాఱ్వురు గాయములఁ జెంది మరణమునకు సిద్ధముగ నున్నారు. కాని యారాజపుత్రునకు గాయము దిట్టముగ దగిలినది స్వామి” యని కన్నీరు కాల్వాలుగట్ట నేడ్చుచు గద్గద స్వరముతో మనబాలాజికూడ మృతినొందెను మహాప్రభూ! యని రోదన మారంభించెను. ఈ వృత్తాంతము సవిస్తరముగ నాలకించిన తోడనే సాహేబునకు మహాకోపమును భయమును నాశ్చర్యమును నేక కాలమున జనియింప గదియదాఁక మాటాడలేక కొయ్యవలెనుండెను. తుదకు ధైర్యముఁ దెచ్చుకొని “యౌరా! యెంతపని చేసితిరి. కొంప మునిగినిది. పాడుముండకొడుకులు మీరొకకార్యము చక్కఁజేయఁగలరా? అయ్యయ్యో! వారు చక్రవర్తికడకు రాయబారము దెచ్చిన రాజపుత్రకుమారుడు మొదలగు వారు ఈ గ్రామమున వారిప్పుడున్నారు. వారిలో మన నాజరుజంగుగూడ నున్నవాఁడు. నావిషయమై యతఁ డెఱఁగును. చక్రవర్తితో సంభాషింపకమానఁడు. హా మౌలాఅల్లీ! హా మహ్మద్! ఈగండముగడిచిన యెడల నూఱుగురు ఫకీరులకు సన్నముఁ బెట్టించెదను అని ధైర్యము వదలి పిఱికి స్వభావముగలవాఁ డగుటచే సేవకులనిందింపఁదొడంగెను. అప్పుడు గులామల్లి గడగడవడఁకుచుఁ దనయేలిక పాదముల పైఁబడి మేమది యెఱుఁగక గోతిలోఁ బడినాము. మహాప్రభూ! మీగులాపు వాండ్రను రక్షింపవలయునని స్వామిని బ్రార్థించెను. తర్వాత ధైర్యముఁదెచ్చుకొని ఖాను తదనంతర వృత్తాంతము నెఱిగింపుఁడని వారల నడుగ నందుఁడు నోట మాటాడక నొక సంచిని దెచ్చి యందుండి యొక కాగితములకట్టను బైటకుఁ దీసి, “మహాప్రభూ! ఇది యమునాతీరమున దేవాలయమువద్ద మాకొక యోగి దగ్గఱ లభించినది. వానిని గటతేర్చి యిది తెచ్చినాము. ఏలినవారు చిత్తగింపవలెను అని చేతి కందించెను. ఆతఁ డాకాగితముల నందుకొని దీపముఁ దెప్పించి వానిని జక్కగఁ జదివి పరీక్షించినపు డందు మిగుల రహస్యమగు కాగిత మొకటి కనఁబగుటచే విచారసమేత మగు ఖానుమొగము మందహాసముతో వికసించెను. నూతనముగ సంభవించిన యీకాగితములయందు దాను చక్రవర్తి దయ సంపాదించు కొనుట కాధారమును కలిగినది. అందుచే నానందపారవశ్యమున వెనుక చింత మఱచి గులామును భోజనమునకుఁ బొమ్మని పంపి నందుని దూరముగ దీసికొనిపోయి యిట్లు చెప్పఁ దొడంగెను. నందా! నీవు మిగుల విశ్వాసము గలవాడవు. నీతో నాకు రహస్యకార్య మొకటి కలదు. ఆకార్యము జేసినయెడల నీ చేతినిండ వరహాలు పోసెదను. ఈ గ్రామమున నంధుఁ డగుయోగివద్దనున్న యాసుందరాంగిని నాకడకు మాయాపాయముననో సమ్మతితో తీసికొని రావలయును. దానిని వివాహ మాడకున్న నేను జీవింప జాలను. నీ నిమిత్తమయి నే నెదురుచూచుచుంటిని. అని చెప్పిన తోడనేనందుఁ డులికిపడి శరీకము జల్లుమన “స్వామి! ఆమె సద్గుణ వంతురాలు, ముసలివాఁడును మిగులమంచివాడు. జనుల కందఱకు నతని యందు భక్తికలదు. అది నాకు సాధ్యమగునా” యని నందుడు తన యసమర్థత నెఱిఁగింపఁ గోపోద్దీపితుఁడై ప్రక్కనున్న ఖడ్గమును జేఁ బూని విశ్వాసఘాతకుఁడా! నాసొమ్ముదిని నాకార్యమును జేయలేవా? ఇది చేయవేని నీ ప్రాణము దక్కవుసుమీ” యనిబెదిరింప మందుఁడగు నందుఁడు మ్లేచ్ఛుని పాదములపైఁబడి దేవా! ఆగ్రహింపకుఁడు. నా ప్రాణములనైన ధారవోసి యీ కార్యము సాధించెదను. గోవింద శాస్త్రియింట దాసియగు రాధవలన నీ కార్యమగును. నెలలో సమకూర్తును.” అని వాగ్దానము చేసిన తరువాతఁ దురుష్కుఁడు నందుని విడువ నతడు మృత్యుని ముఖమునుండి వెడలినట్లు సంతోషించుచు స్వామికార్యసాధనం దుపాయమలఁ బన్న దొడంగెను. ఇదియిట్లుండ మదనసింగునకు గాయము నెమ్మదిగా నున్నదని హేమలత యిష్టదేవతల కెల్ల ముడుపులు గట్టుచు సంతోషించుచుండ నాజరుజంగు నమితానందభరితుడయి నమస్కరించెను. మదనసింగునకు నానాఁటి కారాగ్యము గలుగ నారంభించెను. రక్తక్షయమయి, నది గనుక నతనికి నీరసము దక్క దక్కిన రోగిమేదియుఁ గానరాదయ్యెను. ముసలివాని నేర్పుచే నరములకు బలము కలుగుచుండెను. తన ప్రియమితుఁ డారోగ్యస్నానమొనర్చువఱకు నాజరుజంగా గ్రామముఁబాసి పోఁదలంచుతో నందున దానచట నుండు నంతకాలము ఖానుగారియింట బసచేసి ప్రతిదినమును ఖాను యొక్క దుర్గుణములను, మర్కటచేష్టలను స్వానుభవమువలన గ్రహించు చుండెను. అందుచే సద్గుణసంపన్నుఁ డైనందున, నన్యమతస్థుఁ డయినను సింగునం దనురాగంబును స్వమతస్థుఁడు నాప్తబంధుఁడైనను దుర్గుణుఁడయిన ఖాను నెడ నసూయయు నాజరుజంగునకుఁ గలుగ నారంభించెను. హేమలత చేయు వివిధోపచారములును నామె రూపాతిశయమును సుగుణ వైభవమును మదనసింగు హృదయమున నామె యెడ గాఢానురాగమును గల్గించెను. మధ్యాహ్న కాలమున సింగునకు నిద్రరాకుండగాఁ జిన్న నాఁట దాతాతదగ్గఱ నేర్చుకొనిన హిందీభాషలోని భక్తిరస ప్రధానములగు నీతికీర్తనల హేమలత శ్రావ్యతర కంఠముతో సప్పుడప్పుడు పాడుచుండెను, ఒకప్పుడు తాఁ బెంచుచున్న చిలుకకు “రామ రామ” యని మాటలు నేర్చుచు వినువారి చెవులకు విందు సేయుచుండును. ఈ కన్య తన యీఁడుకును స్థితికిని దగిన విద్యలను దనపితామహునిదగ్గఱ చేర్చియుండుటచే నన్యులెవరు లేని సమయములయందుఁ దాతకు వినుపించువంకఁబెట్టి తేనెతేటలొలుకు మాటలతోఁ బుస్తకము జదివి సింగునకు హృదయానందమును గలిగించెను అదిగాక ప్రొద్దుపోవునపుడు వృద్ధుఁడును వినోదకరములగు కథలను, మ్లేచ్ఛరాజవృత్తాంతములను దన చిన్ననాఁటి యుద్ధములను గడుఁజమత్కారముతో వర్ణించి చెప్పుచుండును. ఆ గ్రామవాసు లందరును రహిమానుఖాను చేష్టలను హాస్యరస ప్రసంగములుగ మార్చి వానికిఁ జెప్పి నవ్వించు చుందురు. అందుచే నిరంతరానంద మగ్నుఁడై సింగు త్వరలో నారోగ్య స్నానము జేసెను. సింగు సద్గుణవంతుడని సద్వంశ సంభూతుఁ డనుయు నెఱిగి వృద్ధయోగి తన దీనచరిత్రమును రాచకొమరునకుఁ దెలియ పఱపఁ గోరి యాతనితోఁ గూడ నొకటి రెండు సారులు తన యిచ్చ దెలిపెను. అతడును విననుత్సహించెను గాని యోగి యేకారణముననో చెప్పలేదు. చిత్తూరు నుండి బయలుదేరి చిరకాలమగుటచే భీమసింగు మహారాజు తనకయి యెదురు చూచుచుండునని ప్రయాణమై పోవుటకు సిద్ధముగనుండియి యోగి బలవంత పెట్టుటచే మరియొకవార మట నుండసమ్మంతించి యొకనాఁడు రహిమానుఖానుగారి దర్శనముఁజేసి యాకచ్చేరియుఁ గోటయుఁ జూడవలెనని పోయి యనేక రాజకార్యముల ముచ్చటించుచుఁ బ్రసంగవశమున మదనసింగు ఖానుతో నిట్లనియె –

మద – మిత్రుడా? నీవు కోపంపకుందువేని నీకొక సలహా చెప్పెదను.

రహి – మంచిసంగతికి గోపమెందుకు! అవశ్యముగాఁ జెప్ప వలసినదే.

మద – ఈ గ్రామమున మీకీర్తి చక్కగాలేదు. మీరు ప్రజలనవమానము చేయుదురనియు బాధించుచుందురనియు నందరుఁజెప్పుకొనుచుండ వినుటకు నాకుఁ గష్టముగనున్నది. అదిగాక దొఁగతనము మొదలగునవి మీవలన జరుగుచుండునని జనులు దురభిప్రాయముఁ బడియున్నారు. అట్టి దురభిప్రాయమును మీసత్ప్రవర్తనమువలన మీరు పోగొట్టుకొనవలెను. మీదగ్గఱ నున్న తుచ్ఛ సేవకులను ద్వరితముగఁ బంపి వేయుట మంచిది. అని యివ్విధమున హితోపదేశమును చేయుచున్న రాజకుల భూషణునిపయి మహమ్మదీయుఁడు త్రాచుపామువలెలేచి తనచేతనున్న ఖడ్గముతో నాతని నొకదెబ్బ వేయఁజూచెను గాని నాజరుజంగాతనిఁబట్టుకొని యాదౌర్జన్యము నివారించెను. వెంటనే సింగమువలె సింగునులేచి యాయుధ పాణియై నిలువ ఖాను వెనుకదీసెను. అనంత రమామందిరము విడిచి మదనసింగు నాజరుజంగుతోఁగలిసి మఠమునకరుదెంచెను. తనదురాచారమును జక్రవర్తికి నివేదించి తన కపాయమును గలుగజేయుదురని నాజరుజంగు మదనసింగులపయిఖాను సాహేబున కీవఱకే యాగ్రహమును ననుమానమును నుదయించెను. గోరుచుట్టుపై రోఁకటిపోటననట్లు నేఁటికథ దానినత్యున్నత స్థితికిఁ దెచ్చినది. రాజనందనుని సంబంధమున సజాతీయుఁడైన నాజరుజంగు పై నతనికి మహాగ్రహము గలుగ, నే యుపాయములను బన్నియైనను నే నేరములను జక్రవర్తితోఁ జెప్పిఅయినను తాను నిర్దోషి యనిపించుకొని వారపరాధులని దండింప జేయవలెనని మహమ్మదీయుఁడు యోజింపుచుండెను. శత్రురాజ్యమున నుండుట ప్రాణాపాయకరమని మదనసింగు ప్రయాణమగుచుండెనుగాని యతని ప్రయాణము హేమలతకు దుఃఖకారణముగ నుండెను. పైవాదము దటస్థమయిన మఱునాడు తెల్లవాఱునపుడు, ప్రయాణము నిశ్చయింపఁబడెను. ఆ రాత్రి హేమలత యన్నము ముట్టుకొనలేదు. ఎట్లయినను రాకొమరుఁడు పోకతీరదని తలఁచి వృద్ధయోగి రహస్యముగ వొకగదిలోని కాతనిం దీసికొనిపోయి రహస్యమును బయలుపఱుపకుండ ననేక ప్రమాణములఁజేయించి యొట్టుఁబెట్టించి తన పూర్వాశ్రమవిచిత్రవృత్తాంతములీ తెఱుంగునఁజెప్పనారంభించెను “నాయనా! నీవు నా కుమారునివంటివాడవు. నిన్ను జూడ నాబంధువులందఱు వచ్చినట్లున్నది. నా దీనమైన చరిత్ర నీకుఁ దెలియఁజేయుమనియు నీవలన నా కుపకారము కలుగననియు నాయంతరాత్మ నన్ను బ్రేరేపించుచున్నది. అందఱనుకొనునట్లు నేను బావాజీనిగాను. నేనుత్తము రాజపుత్రఁ వంశస్థుఁడను. మా కాపురము జయపురము. కాలవశమున నేను స్వదేశమునుబాసి ఢిల్లీ చక్రవర్తియొద్ద పౌజుదారుగ నుంటిని. నేనును నాకుమారుఁడగు జనార్ధన సింగును కిల్జీ వంశస్థాపకుఁడగు జలాలుద్దీనువద్ద సేనానాయకులుగా నుండి యతని యన్నకుమారుఁడును బ్రస్తుత చక్రవర్తియునగు నలాయుద్దీనుతో గూడి దక్షిణ హిందూస్థానముపై దండెత్తినారము. అచట మహారాష్ట్ర రాజ్యమును జయించినపుడు నేను జాల సహాయమును జేసినాడను. జలాలుద్దీనుకు నాయందు పుత్రవాత్సల్యముండెను. దక్షిణ హిందూ దేశము నుండి వచ్చిన తరువాత నలాయుద్దీనుకు బినతండ్రిని గపటముగ వధించి తాజక్రవర్తి యగుటకు దురుద్దేశము కలిగెను. ఆకాలమున నాతని కాంతరంగికుడ నగుటంజేసి నాతో నాతడాలోచింపగా నేనట్టి దుష్కార్యమున కీయకొనక నిరుత్సాహము గలిగించి రాజభక్తి వలన యువరాజును గొంచెము నిందించినాడను. అలాయుద్దీను మహాగ్రహముతో మరలిపోయి యా రాత్రి – హా! ఏమి చెప్పుదును. నా రెండుకన్నులును దనఖడ్గముతో బొడిచివైచి నాకు శాశ్వతమయిన యంధత్వమును దెచ్చిపెట్టెను. తరువాత నన్ను జంపుమని సుబేదారులలో నొకని కతడుత్తరువిచ్చి నాప్రియపుత్రకు నారాత్రి జంపించెను. నాపూర్వ స్నేహితులందఱు నన్ను జంపకుండ మాయోపాయములచే రక్షించి నన్నీ గ్రామమునకు బల్లకిలోబంపిరి. ఈ పిల్ల యప్పటి కేడు సంవత్సరముల పసికూన. నిష్ప్రయోజనమైన యాజీవనము కంటే మరణమే యుత్తమమని తలచియు నీపసికూన నిరాధారయైనందున జెట్టంతకొడుకును జంపుకొనియు మొండినై యిట్లు జీవించినాడను. ఆ మరునా డల్లాయుద్దీను తన పినతండ్రిని జంపించి మరికొన్ని దినములకు మహావైభవముతో దాను జక్రవర్తి యయ్యెను. ఈతడు నీతియుబాపభీతియు లేనివాడు. ఒకటి తలచి యొకటి పలుకును. కుమారా! నాదశ యిట్లున్నది. డెబ్బదియేండ్ల వాడను. నాకు మరణము సమీపించుచున్నది. ఈబాల సంప్రాప్త యౌవన. నేను మృతినొందిన దీని నెవరైన బలాత్కారముగ నవమానింతురు. నాకు గలబెంగ యిదియే; నాకిపుడెట్టులయిన జిత్తూరు నగరము రావలెననియున్నది. భీమసింగు మహారాజుతో నా దీనదశ దెలిపి నాపయి ననుగ్రహము గలిగించిన నీకు మిగుల పుణ్యముండును. నా పేరు నారాయణసింగు, ఆహాహా! నారాయణ సింగుదశ యెంతవఱకు వచ్చినది. ఇరుపార్శ్వముల నెచ్చట దిక్కులేక యనాధుడనై యున్నాను గదా నాయనా! అనుచు సహజధైర్యమును విడుచుచుగొలకులనుండి వేడికన్నీరొలికి తన తెల్లగడ్డము దడియనేడ్వసాగెను. వజ్ర సమాన హృదయమునకు గనికరమున సృజియించు నారాయణసింగు దీనచరిత్రమును విని మదనసింగు క్షత్రియకాఠిన్యమును విడిచి యొక్క నిమిషము విచారించి , పిమ్మట “తాతా! నీవు విచారింపకుము. కష్టములు దైవికములు. మీ విషయము భీమసింగు మహారాజుతో నేను జక్కగాజెప్పి మీపయి వారికనుగ్రహము గలుగునట్లు చేసెదను. మీకష్టములు గట్టెక్కినవని నమ్ముడు. మీ మనుమరాలికిదగిన యుత్తమవంశజాతుని వెదకి పెండ్లి చేయించెదను. నామాటనమ్మి యుండుడు. కొద్ది దినములలో మీకు నేను వర్తమానమంపెదను. అప్పుడు మీరు రండు. రేపుదయమున నేను నిశ్చయముగ బ్రయాణమై చిత్తూరుపోయెదను. అని చెప్పి యారాత్రి సుఖముగా నిద్రించెను. మరునాడు రహిమానుఖాను వొద్ద సెలవుదీసికొని నాజరుజంగు నాగ్రా నగరమునకు బ్రయాణమయ్యెను.

మరునాఁడు వేకువజామున రాజపుత్రమహమ్మదీయు లొండొరుల వలన సెలవుగైకొని పోవుచున్నపుడు మదనసింగు నాజరుజంగును రహస్యస్థలమునకుఁ గొనిపోయి గాఢాలింగన మొనర్చి “మిత్రుడా! మన మిరువుర మన్నదమ్ముల వలె నుంటిమి. మన మన్యజాతులవారమైనను మనకు భేదము లేదు. ఇంక ముందుండదు. నాకిదివఱకుఁ జేసినది గాక యింకొక మహోపకారమును జేయవలయును. ఈ వృద్ధుఁడును బాలికయు నిరాధారులై యున్నారు. వారికి రహిమానుఖాను వలన భయము గలదు. అతనివలన నపాయము గలుగకుండ నీవు జాగ్రత పెట్టవలెను. ఈ యూర నెవరి కైనను వారి నప్పగింపుము. అన నాజరుజంగును నటులే చేయుదునని యాపూటకఁ బ్రయాణము మానెను. మదనసింగంతట నాజరుని జూచి “మనమింక మరల నెన్నఁడు కలియుదుమో? మామహారాజును మీచక్రవర్తియు సంధిచేసికొందురేని మనము రాకపోకలు గలిగి మన స్నేహబీజము యొక్క ఫలముల నందవచ్చును. కాదేని ప్రళయ యుద్ధమున మనము కలిసికొందుము. సాధ్యమయినప్పుడు నీక్షేమము నాకంపుచుండుము. నేఁ బోయి వచ్చెదను సలాము” అని తన పరివారముతోడ బయలుదేఱి మాటి మాటికి హేమలతను దలంచుకొని తిరిగిచూచి విచారించుచు వెడలి పోయెను. ఆనాఁటి మధ్యాహ్నము నాజరుజంగు తన తండ్రికి జిరపరిచయుండగు నబ్దుల్ ఖరీముమౌలవియనునాతనిం బిలిచి నారాయణసింగు నొప్పగించి వారి కపాయము కలుగునప్పుడు సహాయ మొసగుఁమని చెప్పి వానిచేనట్లు చేయుటకు వాగ్దానముల గ్రహించి యారాత్రి బయలుదేఱి వెళ్ళెను. మాలవి యాగ్రామమునందు జపమిత్రుండును భగవత్సేవాపరాణుఁడు నయి యుండుటచేఁ బ్రజల కతనియం దతిగౌరవము కలదు. నారాయణ సింగును వైద్యమూలమున సకలజనోపకారి యగుటచేత బ్రజలలెల్ల నతని కాప్తులయిరి. ఈ పరిచయములవలన మౌలవియు నారాయణసింగును మిత్రులై తమతమ మతములఁ గూర్చి వాదములు సలుపుచు సుఖముగఁ గాలమును బుచ్చుచుండిరి.