హేమలత/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

అట్లు లక్ష్మణసింగును మఠమునందు విడిచి మదనసింగును చిదానందయోగియు నవశిష్ట కార్యములను సమాప్తినొందించుటకు దమప్రయాణమును మరల నారంభించిరి. ఈ పర్యాయము చిత్తూరునగరము యొక్క పశ్చిమ భాగమునకు బోవలసియుండెను. వారు ప్రయాణమైపోవునప్పటికి రమారమి జామున్నర ప్రొద్దుండెను. అప్పటికి వీధులు నిర్మానుష్యముగ నుండుటచే వారిరువురును మునుపటికంటె వడిగనడిచి పెక్కుసందుల తడచి కొంత సేపటికి విశాలమైన బౌద్ధమఠము సమీపమునకు వచ్చిరి. రాజస్థానము నందాకాలమున బౌద్ధమతవ్యాప్తి లేదు గాని తన్మతము భరతఖండమునకెల్ల బ్రధానమతమై యుండునప్పుడు చిత్తూరు నందీ మఠము నిర్మింపబడినది. మనము వ్రాయుకాలమున బౌద్ధులనివాసము చేయుట లేకున్నను దాని పురాతన నామముననే యది పిలువబడుచు వచ్చెను. అందు సన్యాసులును యోగులును ప్రయాణవశమున నొకటి రెండు దినములుండి పోవుచుందురు. మనకపట బ్రాహ్మణుడును యోగియు మఠద్వారమునకు జని లోపల బ్రవేశింప బోయిరిగాని యొక సేవకుడు వారిని గదిమినిలిపెను. మదనసింగంతట నిలువక సేవకుని నొకచేతితో ద్రోసి యోగితో గూడ గుమ్మము దాటగా నాసేవకుడు వారి కడ్డుబోయి వారితో నిట్లు మాటాడెను.

సేవ — మీరెవరు? ఈమఠమునందు మీకేమి పనియున్నది?

మద — ఇక్కడ మా స్నేహితుడున్నాడు. ఆయన నిమిత్తమై వచ్చినాము. సేవ — మిమ్మెవరు పంపినారు? ఎవరినిమిత్తము వచ్చినారు?

మద — నీవిక్కడివాడవా? విదేశీయుడవా? ముందామాట చెప్పుము

సేవ — మాదీగ్రామము కాదు. నేను జ్ఞానానందులవారి శిష్యుడను.

మద — జ్ఞానానందులవారి దర్శనమునకే మేము వచ్చినారము.

సేవ — అట్లయిన నర్ధరాత్రమందేల రావలెను? రేపు పగలు రండు.

చిదా — ఈ రాత్రిరమ్మని స్వామి మాకుత్తరువు జేసినాడు. నీయసంబద్ధ ప్రశ్నలతో గాలము బుచ్చక మారాక వారి కెఱిఁగింపుము.

సేవ — అట్లయిన లోపల నున్నారేమో చూచివచ్చెదను. ఆయన యిట్టి సమయముల యందు స్మశానములో జపము చేసికొనుచుందురు గాని యింటిదగ్గఱ నుండరు. ఉన్నట్లన మీపేరు చెప్పెదను. మీరెవరు?

చిదా — మమ్ము వసంతభట్టు పంపినాడు. అతి రహస్యములున్నవి.

సేవకుడుఁ డీమాటల నాలకించి లోపలికరిగి మఠమునకు వెనుకప్రక్కగోడలో సొరంగమువలె నున్న నేలకొట్టులోఁ గూర్చుండియున్న జ్ఞానానంద స్వాములవారింజూచి యీ మనుష్యులజాడఁ దెలుప స్వామి కొంచె మాలోచించి యా క్రొత్తవారల విషయమై సమస్తము దెలియగోరి తాను మఠమందున్నయొక గదిలో బ్రవేశించి తలుపులు మూసికొని వీరి నిరువురను దద్వారముదగ్గఱకు రమ్మని వర్తమానము పంపెను. వారట్లువచ్చి గది గుమ్మముదగ్గఱ నిలువ జ్ఞానానందులవారు మదనసింగులతో నిట్లు మాటాడిరి.

జ్ఞానా — అయ్యా! మీరెవరు? నాతోమీకేమిపని యున్నది?

మద — అయ్యా! తమరు మావిషయమై యనుమాన పడవద్దు. మేమన్యులముగాము. తలపుదీసి మాతో మట్లాడుడు.

జ్ఞానా — అట్లయిన నేను మిమ్ము నమ్ముట కొక యానవాలు చెప్పుడు.

చిదా — మీపేరు పాండురంగనాధుఁడు కాదా?

జ్ఞానా — (ఆశ్చర్యముతో) అవునవును.

అని తత్క్షణమే తలుపుదీసి వెలువడెను. అతని పసుపుపచ్చని దీర్ఘకాయము గనుగొనినతోడనే యోగియు సింగును వానిని గపట సన్యాసిగ నెఱిఁగిరి. అంతట వారందఱు నిట్లు సంభాషించిరి.

జ్ఞానా — అయ్యా! మీచరిత్రములను గొంతజెప్పి మా వసంతభట్టు వృత్తాంతమును దెల్పుడు.

చిదా — అయ్యా! వసంతభట్టీ నగరమునకు వచ్చిన దాదిగ మేమిరువుర మతని యనుచరులమై యుంటిమి. అతడు మాకు నెఱిఁగింపకుండ నీవఱకే కార్యమును జేయలేదు. ఈ రాత్రి లక్ష్మణసింగును జెఱఁబెట్టినాము. అందుకే తమ దర్శనమునకు నన్నాతడు వడిగ నంపెను.

ఆ పలుకు లాలించి జ్ఞానానందస్వామి యాత్రముతో “పట్టుకొన్నారా? పట్టుకొన్నారా? ఆహాహా! ఔరా! వసంతా! ప్రజ్ఞయనగా నీదే ప్రజ్ఞరా. చక్రవర్తివలన మనకగు గౌరవమును నేను వర్ణింపజాలను” అని ప్రయత్నజనితమగు నానందమును బట్టజాలక తత్సూచకములగు మాటలాడి “ఆతఁడెక్కడున్నాడు?” అని యడిగెను. మిమ్మీక్షణమే వెంటబెట్టుకొని రమ్మని మాకు సెలవిచ్చినాడు. జోడుగుఱ్ఱముల బండిపై బాలునెక్కించి బంధించినాము. మీరు వచ్చిన వెంటనే ప్రయాణమైపోవచ్చును. చక్రవర్తి వసంతున కిమ్మని తమచేతికిచ్చిన యుత్తరముల గూఁడ దేవలయునని మీతో మనవి చేయమనెను” అని చిదానందయోగి చెప్పెను.

ఆ మాటలువిని పాండురంగనాధుఁ డాశ్చర్యమొంది వారు వసంతుని యాంతరంగికులని నమ్మెను. మదనసింగును చిదానందయోగి జ్ఞానానందుల వారిని ద్వర పెట్టి “మన నిమిత్తము వారు మామిడితోటలో గనిపెట్టుకుని యుందురు. ఇఁక బ్రొద్దెంతోలేదు. తమ రాలస్యముజేసిన దెల్లవారునప్పటికి బది క్రోసుల దూరమైన సాగిపోలేము.” అని హెచ్చరింప జ్ఞానానందులవారు తన పాతాళమందిరమున కరిగి చెంబులోఁ బెట్టి బూడ్చిన యుత్తరముల గ్రహించి మనశూర శిఖామణు లిరువురు దనవారని భ్రమపడి ప్రయాణ మయ్యెను. అట్లు బౌద్ధ మఠమునుబాసి వారు మువ్వురును గలసి దూర్పుదిక్కున కభిముఖులై నడువసాగిరి. జ్ఞానానందులవారు చిత్తూరు నగరము యొక్క మాఱుమూల సందుల నెఱుకరుగాన జిదానందయోగి యాతనిని మార్గముదప్పించి క్రొత్త సందులనుండి తీసికొనిపోవుచున్నను నాతడది గ్రహింపలేకపోయెను. కొంతదూరము వచ్చిన తరువాత వారికి క్రింది సంభాషణము జరిగెను.

జ్ఞానా — వారీపాటికి మునుపటిచోటనుండి వెడలిపోరుగదా? చిదా — మనము వెళ్ళినదాకా వారక్కడనుండి యడుగైనను గదలరు త్వరగా రండు.

జ్ఞానా — మనమందరము మిగుల నదృష్టవంతులము. మనకుఁ జక్రవర్తి దగ్గరనుండి మంచి బహుమానములు దొరకగలవు. మన మొక్క పని జేయవలయును. అది మీరతిరహస్యముగ నుంచవలయును. ఈబాలుడు మనవాడేకదా?

చిదా — ఈ కుఱ్ఱవాడు మనవాడే. మీరు సందేహింపక స్వేచ్ఛగా మటాడవచ్చును.

జ్ఞానా — “సరే సరే! దగ్గఱగారమ్ము నాయనా” (అని త్రోవలో నిలిచి మెల్లగా) ఈ చిత్తూరు నగరమునకు సంరక్షకుడై రాజున కాంతరంగికుడగు మదనసింగను రసపుత్రవీరుడు కలడట. అతడు మహాపరాక్రమ వంతుడట. అతడుండగ మనకి చిత్తూరు రాజ్యము లోబడదుగనుక మన మెట్లయిన నతని నీ రాత్రి పట్టుకొని వధింపవలయును. ఈ వేళ నతడు చిక్కకున్న పక్షమున మన మీపురమున నాల్గుదినములైన నిలచి యాతని నంతము నొందించవలయును. ఈ కార్యముజేయకున్న మనకు మాట దక్కదు. నీయభిప్రాయమేమి?” అని బ్రాహ్మణ వేషధారియగు మదనసింగు నడిగెను. మదనసిం గామాటలువిని జ్ఞానానందులవారికి దనపైగల మహాకోపమున కాశ్చర్యమొంది చేతికర్రలో నమర్పబడిన కత్తిపిడిపై జేయివైచి యుత్తరుఫు నిమిత్తము చిదానందయోగి మొగమువైపు జూచుచుండెను. చిదానందయోగి కొన్ని సంజ్ఞలచే మదనసింగు ప్రయత్నమును మాన్పి యింకను వానిదగ్గరనుండి కొన్ని మాటలు వినగోరి స్వాములవారి కిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. చిదా — “నాకును జిరకాలమునుండి మదనసింగును గడతేర్చవలెనని యున్నది. అఁత డసహాయ శూరుడు. వాని సంగతి మన యీకుఱ్ఱవాడు చక్కగానెఱుగును” అని మదనసింగును జూపెను. వెంటనే మదనసింగట్లు వారితో జెప్పసాగెను.

“అయ్యా! మదనసింగునకును నాకును నేనే యత డన్నంతయైక్యము గలదు. కాని యాతడు రాజుల పక్షమువాడు; నేను చక్రవర్తి పక్షమువాడను. అయినను బ్రభుభక్తిచేత మేమాతని గడతేర్చుట కీవఱకే కుట్రనొకటి పన్నియున్నాము. అతనిం దోడ్కొనివచ్చుటకు నొక్కమనుష్యునంపితిని. ఈ పాటికి వారు వచ్చియే యుందురు. కనుక మన మా సంకేతస్థలమునకు శీఘ్రముగఁ బోవుదము” అనెను. అంతట స్వాముల వారానందపరవశులై “నేనే యాకార్యమును జేసెదను. ఈ చేతులతో రాజపుత్రకుని ప్రాణములదీసి చక్రవర్తివద్ద పారితోషికమును గైకొనవలెను. అని యుత్సాహ వాక్యములు బలుకఁ జొచ్చెను. తరువాత వారు ప్రథమమున వసంతభట్టు లక్ష్మణసింగుతో రహస్యాలోచనలు సలిపిన యా గోడలమధ్య నున్న కుటీరమువద్దకు స్వాములవారిని గొనిపోయి యదియే మదనసింగు వచ్చెడి గృహమనిచెప్పి ముందాతూములోనుండి వారు లోనికరిగి పిమ్మట నితనింగూడ దీసికొనిపోయిరి. ఆ గృహమున కరిగి స్వాములవారు చీకటిలో గూర్చుండి తనకక్షపాల యందున్న యుత్తరముల వెదకికొనుచు “అయ్యా! మన నిమిత్తము వారు తోటలో గాచుకొని యుందురేమో! మనమరుగవద్దా” యని యడిగిరి.

“మనము మదనసింగును జంపుట యావశ్యకము గాని తోటకరుగుట ముఖ్యముగాదు. మనమురామని వారీవఱకే నిశ్చయించుకొని లక్ష్మణసింగుతో బైనమైపోయి యుందురు. లక్ష్మణసింగు వారిచేతబడ మదనసింగు మనచేతబడును. అందుచేత మనమీస్థలమును బాయవద్దు. మేమిరువురము వీధిలోనికరిగి వారు వచ్చుచున్నారేమో చూచివచ్చెదము” అని చిదానంద యోగి చెప్పి స్వాములవారు నొడఁబఱచి మదనసింగును గూడి వీధివైపు జని వారిట్లు మాటాడిరి.

చిదా – అబ్బాయి! ఈతని నిచట నేమిచేయుదుము? చంపివేయుట యుచితమగునా?

మద – నిరాయుధుఁడై యసహాయుడైన పురుషుని జంపుట శౌర్యమునకు దగిన కార్యముగాదు. కాబట్టి నేనీ క్షణమున మాపినతండ్రివద్ద కరిగి యాతని దోడ్కొనివచ్చి వీనింబట్టుకొని ఱేపుదయమున ఠాణాకు నప్పగింప బ్రయత్నించెదను.

చిదా – ఈ యుపాయము చక్కగా నున్నది. నీవు మీ పినతండ్రి కడ కరుగుము. నీవు వచ్చినదాక నేనిచట నుండెదను.

అని పలికి యోగి మదనసింగునంపి స్వాములవారు దాటిపోకుండ దానచ్చట గావలి యుండి ప్రతాపునిరాక కెదురుచూచుచుండెను. మదనసింగును వడిగ నింటికిఁజని తన రాకకు నిరీక్షించుచున్న పినతండ్రికడ కరిగి సపరివారముగ నాతని వెంటబెట్టుకొని యారాత్రి జరిగిన వృత్తాంతముల రహస్యముగ నాతనికిఁ జెప్పుచు స్వల్పకాలముననే కుటీరమువద్దకు వచ్చెను.

ఈ నడుమ చిదానందయోగి లోపలికరుగ “వారు వచ్చుచున్నారా?” యని స్వాములవారడుగ యోగి వారి నిమిత్తము మన బ్రాహ్మణ కుఱ్ఱవాని నంపినాఁడను. ఇప్పటికి వారును వచ్చుచుందురుగాని మీ క్రొత్త మొగమును జూచినతోడనే పారిపోవుదురేమో యని భయమగుచున్నది” అని పలికెను. ఎట్లయినఁ గార్యవిఘ్నముగాకుండ సఫలముచేయుట స్వాములవారి యభిప్రాయమగుటచే “అయ్యా! నేను ముసుగుఁవెట్టుకొని యిక్కడఁ గూర్చుండెదను. వారు రాఁగానే నా కాలు గోకుడు అప్పుడు లేచి వధించెదను” అని స్వాములవారు శరీరమునిండ ముసుగువేసికొని యొకమూల గూర్చుండిరి.

చిదానందయోగి వానికక్ష పాలయందలి కాగితముల కట్టను సంగ్రహించి స్వామితోఁ గొన్ని యంశముల ముచ్చటించుచుండ బ్రతాపసింగును మదనసింగును నాకస్మికముగ లోనికివచ్చిరి. వెంటనే స్వాములవారు లేచి “వీడేనా మదనసింగు? కత్తి కత్తి” యని కలవరపడుచుండ మదనసింగు ముందఱికివచ్చి “ఓరీ! పాపాత్ముడా! నీకుగత్తి యెందుకురా! నీబ్రతుకునకుఁ దోడు నీవు మదనసింగును జంపగలవా? అట్లయిన రా రమ్ము, నేనే మదనసింగును. అదిగో కత్తి” అని కత్తినందించుచుండఁ బ్రతాపసింగుని ఆజ్ఞచే నతని పరివారము స్వామిపైఁబడి పెడఱెక్కలుకట్టి బలవంతముగఁబట్టి బంధించిరి. తరువాత బ్రతాపసింగు స్వాములవారిని దనయింటికి దీసికొనిపోయి తెల్లవాఱువఱకు వాని నొక గదిలోనుంచెను. చిదానందయోగి తాను స్వాములవారి కక్షపాలనుండి సంగ్రహించిన కాగితముల కట్ట మదనసింగునకిచ్చి దర్బారునందా కాగితముల ఠాణాకు సమర్పింపవలయుననిచెప్పి తాను మఠమునకుఁ బోయెను.