హేమలత/పదవ ప్రకరణము
పదవ ప్రకరణము
ఆమాఱుమూలసందులో నొకచొట శిథిలమునొంది చూచువారలకు జాలిగలిగించు నొక పురాతన మందిర ముండెను. అది పూర్వము సంపన్నులగు నున్నత వంశజులుగాఁపురముండు గృహమే. కాని, తద్వంశజులు కుమార్తెల వివాహములకయి చేసినఋణముల దీర్పలేక సర్వస్వముఁ గోలుపోయి యిల్లువిడిచి దేశాంతరములకరిగిరి. అప్పటినుండియు నది పాడయి యుండెను. మదనసింగును జిదానందయోగియు నాఁటి రాత్రి యామార్గమున బోవుచు దానికిఁ గొంచెము దూరమున నాలుగుపాడుగోడలను జూచిరి. ఆ గోడలమధ్య నొకచిన్న పెంకుటిల్లుండెను. కాని వీధిలో నుండి నడిచిపోవు వారి కందు గృహమున్నట్లు కనఁబడదు. ఆ యింటి ద్వార మే వైపున నున్నదో యెవ్వరు నెఱుఁగరుగాని గోడకడుగున నున్న పెద్దతూము మనుష్యుడు దూరిపోవునంతటి విశాలముగ నుండుటఁబట్టి గృహమున కరుగు వారందులో నుండిదూఱి లోని కరుగుదురు. దీనింబట్టి యీగృహము మఠాచార్యులకు శరణ్యం బయియుండు నని చెప్పనక్కఱ లేకయే మనమూహింపవచ్చును. ఆగృహసమీపమునకుఁబోయినతోడనే చిదానందయోగి మనకుఁగావలసినది యీయిల్లే ఇక్కడ నిలువుము అని సింగునాపెను. చిదానందయోగి తూములోనుంచి లోనికరిగి, తనకాపద సంభవించు నెడ మదనసింగును లోనికిరమ్మని యాతనిని దూము దగ్గఱ వీధిలో నిలిపెను. అతడు లోపలి కరుగునప్పటి కాయింట నిరువురు పురుషులు మాటలాడు చుండిరి. అందొకఁడు దృఢశరీరము గలదక్షిణ హిందూస్థాన వాస్తవ్యుఁడు; రెండవ వాఁడతిసుకుమారుఁడైన బాలుఁడు. వారిసంభాషణ నాలకింపఁ దలఁచి యోగి తనకడ నున్న కంబళమును గప్పుకొని యాపంచను గూర్చుండి యుచ్ఛ్వాసనిశ్వాసములను వదలక మెదలక యుండెను. అప్పుడందున్న వారిట్లు ముచ్చటించిరి.
బాలు – ఏమయ్యా! రెండుజాము లయినది. వారింకను రాలేదేమి?
బ్రాహ్మ – మహారాజా! చిత్తము వారు తప్పక వచ్చెదరు. మదనసింగు మనల నందఱ నీరాత్రి నిర్మూలించుటకుఁ బ్రతిజ్ఞగైకొన్నవాఁడు. మీరాజవంశమునకు మదనసింగు మిగులక్షేమము జేయునట్లగపడును గాని వాఁడు చక్రవర్తితో మిగుల స్నేహము గలిగి యున్నాఁడు. మిమ్ముఁజంపి మీశిరస్సును జక్రవర్తికి గానుకగానంపెద నని వాగ్దానము చేసినాఁడు. అందుచేతనే దుర్మార్గుడయిన మ్లేచ్ఛుని వలన నతఁడట్టి గౌరవము నొందెను. వారు సమయమునకు వచ్చుచుందురు. వారు పట్టణమునఁ జేయుకుట్రల నెల్ల మీకు నివేదించుటకే సుఁడీ, మిమ్ము నీమారుమూలకుఁఁదోడ్కొనివచ్చినాడను. మీకు భయము రవ్వంతయు లేదు. నాచేత గత్తియున్న దిదిగో —
బాలు – భయము నాకుఁగాదు, నాజాతిలో నెవ్వరికిని లేదు. నాచేఁగత్తి యుండఁగా నాకుభయమేల? మదనసింగు మాకింత ద్రోహము దలఁచునని మేమన్నఁ డెఱుఁగము. వారినీదినమున బట్టుకొని భీమసింగు మహారాజున కప్పగింప వలెను.
బ్రాహ్మ – మహారాజా! దేవరవారికి నే నుపదేశించిన దానికంటె మీ రెక్కువ విషయముల నీ రాత్రిచూడఁగలరు. వారు కుట్రలఁ జేయునపుడు సాధారణముగ నీగృహమునకు వత్తురు. నేఁడెందుచేతనో యిటకు రాలేదు. వారూరిబైట తోఁటలో నేఁడు కుట్రలు చేయుచుండి యందురు.
బాల – మన మక్కడకుఁ ద్వరితముగ నరుగుదము రమ్ము. తెల్లవాఱకముం దెట్లయిన నాదుర్మార్గులఁ బట్టుకొందము.
బ్రాహ్మ – నానిమిత్తమొక సేవకుఁడు రావలెను. వాఁడు వచ్చినతోడనే మన మాస్థలమున కరుగుదము. నేనావలకుఁబోయి చూచి వచ్చెదను.
అని బాలు నాచీఁకటింటనిలిచి బ్రాహ్మణుడీవలకు వచ్చుటకు యత్నించుచుండెను. ఆమాటల నాలకించి చిదానంద యోగి తూమునుండి సత్వరముగా బైటకు జని మదనసింగును వెంటబెట్టుకొని అబ్బాయి! ఇటురా, లోపలినుండి బ్రాహ్మణుఁడీవలకు వచ్చుచున్నాఁడు. వానికి మన మగపడకుండ నాగోడ చాటున నుందము. వాడొక సేవకునితో మాటలాడునఁట. ఆమాటలఁగూడవిందుమని యాతని దీసికొని పోయెను. లోపలినుండి బ్రాహ్మణుఁడు బైటకు వచ్చునప్పటికి వాని కిరువది గజముల దూరమున సేవకుఁడైన యానందదాసు వచ్చెను. అతడు తనదగ్గఱకు వచ్చినతోడనే బ్రాహ్మణుడు “ఆనందా! విశేషములేమి? బండిసిద్ధముచేసినావా?” యని యడిగెను. అంతట నా నందుఁ డానందము నొంది చిత్తము! సర్వము సిద్ధమైనది. మనశంకరుఁడును బండివాఁడునుగూడ నాయుధపాణులై సిద్ధముగ నున్నారు. మీరు కుఱ్ఱవానిఁ దీసికొని వచ్చుటయే యాలస్యమని చెప్పెను. ఆమాటవిని బ్రాహ్మణుఁడమితానందము నొంది యానందదాసును సంకేత స్థలమునకంపి మరల రహస్యగృహమును బ్రవేశించెను. పొంచుఁయున్న చిదానందయోగియు మదనసింగును వారి సంభాషణలనాలించి తామును వారి ననుసరించి పోవుటకు నిశ్చయించిరి. ఆసమయమున యోగి రాజపుత్రుని విలొకించి కుమారా! ఈ బ్రాహ్మణుడు మనకు బరమశత్రువు. వారనుకున్న కుఱ్ఱవాఁడు మనకు బరమాప్తుడు. మన ప్రాణముల విడిచియైన బాలుని రక్షించి యీబ్రాహ్మణుని నెట్లయిన మట్టు పెట్టవలెను. నేను జయకాశీ, యనునప్పుడీబ్రాహ్మణుని నీఖడ్గముతో సంహరింపుము. దీని రహస్యము దెల్లవారకముందే నీ వెఱుఁగఁ గలవు” అని చెప్పి రసపుత్రునకు బ్రోత్సాహ మొసఁగెను. బ్రాహ్మణుడు లోనికరిగి యాబాలుని వెంటబెట్టుకొని వచ్చి తూముదాటి యూరుబైట నున్న మామిడి తోఁపువైపునకు బ్రయాణమయ్యెను. తమ జాడ వారు లక్షింపకుండ యోగియు సింగును వారనుసరించుచుండిరి. ఇట్లు కొంతదూరము చనిన పిదప గమ్యస్థానమగు మామిడితోఁపు కట్టెదుటగన్పించెను. అంధకారదేవతకు నిలయమైన యాతోట ముందుగా బ్రాహ్మణుఁడును బాలుడును బ్రవేశించిరి. మన యోగియు శిష్యుడును వారి వెనుకనే చనుచుండిరి. ఆతోఁటనడుమ నొకచోట బాలునిఁ గూర్చుండ నియమించి బ్రాహ్మణుడు ముందుకు వచ్చి రహస్యముగ దనసేవకులను జూచి యోరిశంకరా? ఓరియానందా? తుపాకులు కత్తులు సిద్ధముగా నున్నవా తుపాకులలో మందుకూరి మీ మీప్రయత్నముల నుండుఁడు. అని హెచ్చరించెను. అనవుఁడు బద్ధాంజులులై సేవకులు మహాప్రభూ! సర్వము సిద్ధమైనవి. ఢిల్లీనుండి పాండురంగనాధుఁడు సన్యాసివేషముతో గొన్ని యుత్తరములను మీకు దెచ్చి బౌద్ధమఠమునందు బసచేసియున్నాఁడు. అని విన్నవించిరి. ఆపలుకులు యోగినవిని సంతోషించెను. బ్రాహ్మణుఁడా సేవకుల వచనములు విని మన కార్యసాఫల్యామీ దినమునవైనది. ఇంక నుత్తరములతో బ్రయోజనము లేదు. ఱేపుచిత్తూరుసంగతులనువిని యతఁడే మనకడకువచ్చును. మనమాతనిదగ్గఱ కఱుగక్కఱలేదు. బండికి గుఱ్ఱములఁబన్నుఁడుఁ” అని యాజ్ఞాపించెను. నిశాసంచారమెన్నఁడెరుఁగని యాబాలుఁడు బ్రాహ్మణుని విపరీతచేష్టలను రహస్యాలోచనములను జూచి సందేహింపనారంభించి నాయర్ధరాత్రమున నానిర్జనప్రదేశమున నాగాఢాందకారమునం దాబ్రాహ్మణుఁడు సహచరసమేతుఁడై యుండుటచే తన కెట్టి యపాయమునైనఁ జేయఁగలఁడని భయపడసాగెను. ఒక విదేశీయునిమాటలు నమ్మి యంతఃపురములబాసి తానట్టికాలమున మారుమూలకు వచ్చినందులకు నతఁడు చింతింప జొచ్చెను కాని బాలుఁడైనను ధైర్యసంపన్నుడగుటచే మనస్థయిర్యమును విడువక కాఁదలఁచిన కార్యము కెదురు చూచుచుండెను. అంతట బ్రాహ్మణుడు బాలకుని సమీపించి “స్వామీ! వారుతోటలోనికివచ్చినారు. మేము వారలఁ బట్టుకొనియెదము. దురాత్ముల వలన నపాయము గలుగకుండ మీరీబండిలో గూర్చుండుడు.” అని తచ్చకటమునుజూప భయ సందేహములు ద్విగుణములై మనస్సుగలంప బాలకుఁడా శకటమధిరోహించెను. బ్రాహ్మణుడు పిమ్మట నానందదాసు శంకరుని దూరముగాఁ బిలిచి బండివడిగాఁదోలుఁడు. ఆరేసిక్రోసులకొకచోట నంచెబండ్లు కలవు గనుక మన మతివేగముగా బోగలము. ఈతడు పెంకెతన మధికముగా జేసినప్పుడు తుపాకులతో బేల్చివేయవచ్చును గానిముందుగా నట్టిపనిజేయక సాధ్యమైనంతవరకు బ్రాణములతో నీతనిఢిల్లీకిఁదీసికొనిపోవుఁడు” యని యాదురాత్ముల కుత్సాహమొసంగి తానును శకటములో నెక్కెను. ఆసమయమునఁ దనయేలిక యవస్థఁ యపాయముగ నుంటజూచి గాంభీర్యమునువిడచి తొట్రుపాటుతోఁ జిదానందయోగి మదనసింగును జూచి బాబా! కత్తి. కత్తి. నవమన్మధసమానుడగు నాబాలుడు మనస్వామియు రసపుత్రకులతిలకమునగు శ్రీకుమారలక్ష్మణసింగు మహారాజుగారు దుర్మార్గుడగు నాబ్రాహ్మణు డాతని నపాయ సముద్రమున ముంపదలచినాడు. కనుకజాగ్రత్తగనుండుము. అని రహస్యముగ జెప్పెను. అర్ధరాత్రమున దనయేలిక నిజాంతఃపురముల బాసి పయోముఖవిషకుంభమునుబోలు నొకదురాత్ముని విశ్వసించి వచ్చినందుల కాత్మగతమున మెచ్చికొనుచు నతని కపాయమగునేమో యన ముందుకు దుముక జూచుచు, దైవమును దూరుచు మదనసింగు పరిపరి విధముల విచారింపనారంభించెను. చిదానందయోగి మాత్రము బండిపై దృష్టినిలిపి రెప్పవాల్చక చూచుచుండెను. తనతోగూడ బ్రాహ్మణుడును శకటమారోహించినందున బాలుడు వానిజూచి నిశ్శంకముగ నిట్లనియె. నన్నీతోటకు దెచ్చుటలో నీ యభిప్రాయమేమి? నీవేమైనను ద్రోహము చేయదలంచినావా? యని యడుగగానే బాలునికంఠముపై జేయివైచి నొక్కిపట్టి నిన్ను నేను ఖైదీగ ఢిల్లీ నగరమునకుఁ గొనిపోవుచున్నాను. అల్లాయుద్దీను నిన్నుఁ దెమ్మని మాకు నాజ్ఞయిచ్చినాడు. నేడునీవునాచేతజిక్కినావు. నీవింక నేమి చేయగలవు? రాజపుత్రుడవగుదునేని ధైర్యము జూపి తప్పించుకొమ్ము. పారిపోవ యత్నించినా నాచేత జచ్చితివని నమ్ముము, అని క్రూరుడగు వసంతభట్టు రెండవచేయి తనవాడికత్తి వంక బరపెను. ఆయాపదజూచి వెరవక రాకొమరుడు తన మొలనున్న ఖడ్గము నూడబెఱికి హస్తమున ధరించునంతలో మదనసింగు స్వామిప్రాణరక్షణమున కరుదెంచి నిలునిలు దురాత్మా, యని తోఁట ప్రతిధ్వను లెసగ నఱచి బండిమీఁదకుఱికి మూయబడియున్న బండి తలుపును ఫడాలునదన్ని విరుగగొట్టి లోన బ్రవేశించెను. వసంతభట్టు బ్రాహ్మణ వేషధారియగు మదనసింగును గుర్తింపలేక భయకంపితుఁడయి యుండ మదనసింగు కోపోద్దీపితుడై యామహారాష్ట్రాధముని బండిలోనుండియీడ్చి నేలబడవైచెను. ఆనందదాసును శంకరుండును ఖడ్గపాణియైయున్న యోగిని గూడజూచిబెదరి ధైర్యమునఁ దమకుఁ దీసిపోవని బండివానితో గలిసి వెనుకకు దిరిగిచూడక పరుగిడిరి. మదనసింగు మొదట బ్రాహ్మణుని ప్రాణము గాపాడఁదలఁచెనుగాని దురాత్ముఁడయిన వసంతభట్టు ఖడ్గము దనపై విసరినందునను, యోగి, జయకాశి యని కేక వైచినందునను మదనసిం గాదెబ్బతప్పించుకొని తన ఖడ్గముతో బ్రాహ్మణాధముని నొక్కయేటున సంహరించెను. తరువాత నర్ధరాత్రమున నీచులను విశ్వసించి రాగూడనిస్థలమునకు వచ్చినందుకు లక్ష్మణ సింగును యోగియు మదనసింగును మృదువుగా మందలించి యారాత్రి యాతని నింటికి జనవలదని మఠమునకు వెంటబెట్టుకొని పోయి యితనికి సకలోపచారములఁ జేసిరి. తనప్రాణము రక్షించిన యా బ్రాహ్మణుఁడెవ్వఁడో లక్ష్మణసింగు తెలియగోరెను. కాని వారుభయులు రేపుదర్బారున మావిషయమై మీరెఱుంగ గలరు గాన మమ్మేమియు నేఁడడుగ వలదని ప్రత్ర్యుత్తరమొసగ లక్ష్మణసింగు తనకృతజ్ఞతా సూచకముగ రత్నపుపిడి గల తన కత్తిని మదనసింగునకు బహుమానముగ నొసగి యారాత్రియటఁ బవ్వళించెను. చిదానందయోగి మదనసింగును వెంటబెట్టుకొని యవశిష్టమగు కార్యమును సమాప్తమునొందజేయుటకు మరల బ్రయాణమై పోవుచు లక్ష్మణసింగుతో మీరు తెల్లవారిన తరువాత మా నిమిత్తము వేచియుండక మీ గృహమునకు కరుగవచ్చును. మాసేవకు లీలోపల మీకుఁ గావలసిన యుపచారములు చేయుదురు. అని సెలవుదీసికొని సాగిపోయెను.