Jump to content

హేమలత/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము

ఒకనాటి రాత్రిదీపములు పెట్టిన నాలుగు గడియలకు మదనసింగును బ్రతాపసింగును గూర్చుండి రాజకీయ వ్యవహారములు ముచ్చటించుకొనుచుండిరి. ఆసమయమున వ్రేలాడుచున్న జడలతోడను శరీరము నిండ నలఁదుకొన్న భస్మముతోడను తెల్లమచ్చలుగల కృష్ణాజినముతోడను మెల్ల మెల్లగాఁ జిదానందయోగి వచ్చి వారి కట్టెదుట నిలిచెను. అతడు తఱచుగా రాత్రులయందు బ్రతాపసింగు గృహమునకు వచ్చుట కలదు. కాబట్టి యాతడరుదెంచిన కార్యమును నెఱిగి ప్రతాపసింగు వెంటనే లోనికి జనెను. మదనసింగు లేచి నమోనారాయణ! బావాజీ! యని సమస్కరించి యాతనిం దోడ్కొని గదిలోనికిబోయి వచ్చిన కార్యమేమని యడుగ యోగి యిట్లనియె ‘రాజా! నీవు రాజభక్తిగల రసపుత్రులలో నగ్రగణ్యుడవు. రాజు నిమిత్తము ప్రాణములనైన ధారపోయ గల సాహసికుడవు. గనుక నేను నీ నిమిత్తము వచ్చితిని. ఈ రాత్రి చిత్తూరునగరమునందు నేను ముందుగా మీతో చెప్పదగని ఘోరకృత్యములు జరుగదలచి యున్నవి. మన మీరాత్రి యేమాత్ర మశ్రద్ధ చేసినను మన మాజన్మాంతము విచారింపవలసి వచ్చును. తెల్లవారిన దాక నీవు నాతో నుండుము’ అని యోగి పలుక మదనసింగు శరీరము వడక నారంభించెను. యోగి యాతనిపై జేయివైచి నాయనా! భయపడకు నేనుండగ నీనగరమున కాపద కలుగదు. నీవు వచ్చునపుడు యుద్ధములయందు నీహస్తమలంకరించు ఖడ్గమును దీసికొని రమ్ము. నిన్ను నీ రాజపుత్రవేషమును మార్చి బ్రాహ్మణ వేషమును ధరించి జామున్నర రాత్రియైన తరువాత యోగానంద మఠము దగ్గర నన్ను గలసికొనుము. జయ్ క్షీరసాకారశయిన యని నీవు పలికిన వెంటనే నేను నిన్నానవాలు పట్టెదను. నేను మరొకనితో మాటలాడు చుండిన యెడ నీవు నాకడకు రావద్దు. ఈ రాత్రి నీ రాజ్యమును నీదేశమును నీవు కాపాడుకొందు వని యోగి చెప్పి వెడలిపోయెను. అతని సాగనంపి రెండునిమిషములు మదనసింగు వాని మాటల సారాంశమేమై యుండునా యని యోజించెను. కాని తెలియరాలేదు. అతడు లోనికిం జని ప్రతాపసింగును జూచి యోగికిని దనకును జరిగిన సంభాషణమును సవిస్తరముగ దెలియజేయ నాతడు విస్మయమునొంది కుమారునితో నాయనా! నీవాలస్యమును జేయక త్వరగ నరుగుము. యోగి మాటలయం దర్థము విస్తారముగ నున్నదని నేనూహించెదను. అతడు మనరాజ్యముపై మిగుల భక్తి గలవాడగుటచే గారణాంతరమున యోగిగానున్నట్టుల గనబడునుగాని నిజముగా యోగికాడని నాయభిప్రాయము. త్వరగా నీవు బ్రాహ్మణ వేషమువైచికొనుము. అని యాతనికుత్సాహజనకములగు మాటల జెప్పెను. మదనసింగును తక్షణమే లోనికిబోయి తన రాజచిహ్నముల నెల్ల దీసివైచి మొగమునిండ బూదిబులిమికొని చిన్న యంగవస్త్రమును గట్టికొని చేతితో నొక చెంబును భుజముపై నొక దుర్భాసనమును సంతరించి తండ్రియెదుటికి వచ్చి నమస్కరించెను. అంతట బ్రతాపసింగును కుమారుని జూచి, నాయనా! నిజముగ బ్రాహ్మణుని వలె నున్నావు. అని లోపలకత్తి యమర్పబడిన చేతికఱ్ఱ నతనికిచ్చెను. అదిగైకొని మదనసింగు పోవుచుండగా నర్థ రాత్రమునందు దుర్జన సంచారములగువీధులకొంటరిగ దనకుమారు డరుగుట కిష్టములేక ప్రతాపసింగు తత్సహాయముగ నిద్రించుచున్న కృష్ణసింగును లేపి నిద్రమత్తునకు గంజాయిమత్తు తోడుగ దూగుచున్న వానికి వెంటనంపను. అపుడు వారిరువురును గృహము విడిచిపోవునపుడు ప్రతాపసింగు, “నాయనా! కడు జాగ్రత. శత్రువులనేకులుందురు. నీకపాయమేదైన నుండునేని గృష్ణసింగును నావద్దకు బంపిన నేను వెంటనే తగుబలముతో నీసహాయార్థము వచ్చెదను. అని చెప్పి వారల నంపెను. వారరిగిన వెనుక బ్రతాపసింగు తన శరీరమింటమన్నను మనస్సు కుమారుని మీదికే పోగా నానాటి సంగతులనెల్ల మదిలో నూహించుకొనుచు జిత్తూరు రాజ్యక్షేమమును గూర్చి భయపడుచు బురమున గుట్రలు జరుగుచున్నవని విచారించుచు “ఓ భగవంతుడా, అతిపురాతనమైన చిత్తూరు రాజ్యమున కాపదరాకుండ జేయుము. ఆవశ్యకమైనచో నా ప్రాణములనైన నిచ్చెదను. నాకుఱ్ఱవానిని సుఖముగ నింటికి దెమ్ము” అని ప్రార్థించుచు నిద్రరాక పలుమారులు వీధితలుపులు దెఱచి చూచుచు, నా రాత్రి కలవరపడుచుండెను. అట్లు మదనసింగును గృష్ణసింగును బయలుదేఱి పదినిమిషములలో రాజవీధికి జనిరి. గంజాయిమత్తు పూర్ణముగ గృష్ణసింగును విడువనందున నడచుచునే యతడు కునుకుపాట్లు పడుచు యజమానుడు వచ్చి వీపు మీద దట్టగా మేలుకొని వడివడి బరుగెత్తుచు నతని వెంట వచ్చుచుండెను. వారు రాజవీధి మధ్యమునకు వచ్చునప్పటికి జామున్నర రాత్రియయ్యెను. అది వెన్నెల గల దినముగానందున నంధకారము నగరమునంత నావరించెను గాని గగనమండలము నందు వజ్రములవలె దళతళ మెఱయుచున్న నక్షత్ర కోట్లు కొంచెము వెలుతురు విచ్చుచుండెను. పట్టణమెల్ల మాటుమడుగుటచే మనుష్య సంచార మంతగా లేకపోయినను జలువ వస్త్రములు గట్టుకొని యత్తరు మొదలగు సుగంధ ద్రవ్యంబులును గ్రమ్మ పూదావులను దమ రాకను దెలియజేయ దాంబూలము నమలుచు వేశ్యాంగనా గృహముల నలంకరింపబోవు రసికశిఖామణులు మాత్రము కొందఱందందు వారి కగపడుచు వచ్చిరి. అక్కడక్కడ రెండుమూడు మిఠాయి దుకాణములును వొకటి రెండు తమలపాకుల దుకాణములును దక్క దక్కిన బజాఱులెల్ల మూయబడియుండెను. మెల్లమెల్లగ నడచి రాజవీధినిదాటి ప్రక్కసందులోనుండి కొంతదూరముపోయి మదనసింగు తనకు యోగిచెప్పిన గుర్తులను బట్టి యావీధి నున్న చిన్న మఠముజేరి కృష్ణసింగును వీధిలో నుండనియమించి తాను లోనికిబోయెను. అతడు మఠము బ్రవేశించునప్పటికి జిదానంద యోగి యెవరితోనో రహస్యములు మాటలాడుచుండుటంబట్టి మదనసింగు వెంటనే యోగిదగ్గఱ కరుగక యొక యరుగుమీద గూర్చుండి వారి సంభాషణము వినుచుండెను.

చిదా – ఏమిరా! దామోదరా ! ఢిల్లీ వార్తలేమి?

దామో – స్వామీ! చక్రవర్తి దండయాత్రమాట నిజము. ప్రయాణసన్నాహము జరుగుచున్నది. మురళీధరదాసు మఠములో మనవాండ్రందరు నెప్పటి వర్తమానములప్పుడు తెలిసికొనుచున్నారు.

చిదా – అట్లయిన నీవుపో! (అని వాని నంపి) ఓరీ సదాశివా! ఇటురా.

సదా – మహాప్రభూ! ఆపిల్ల మీరు జెప్పినచోట సుఖముగనున్నది. నేను జూచి మాటలాడి వచ్చినాను. ముసలివాడందే యున్నాడు.

చిదా – గంజాయి దుకాణమునకు వెళ్ళినావా? అందలి విశేషములేమి? సదా – ఆ సంగతి జెప్ప మఱచినాను రాముడు గంజాయి మత్తుచే రహస్యము వెడలగ్రక్కినాడు. ఈ దినమున జరుగదలచి నదియు మనము విన్నదియు నిజమే.

చిదా – నీవింక పొమ్ము. ఓరీ గంగా! రా రా నీవార్తలేమి?

గంగా – మహరాష్ట్రరాజులు మాలికాఫరుచే నోడింపబడిరి. ఆ దేశము గూర్చిమన మిక నాశ పడగూడదని మనబావాజీలు చెప్పినారు. గోకులమఠమున గోసాయి లిచ్చిన యుత్తరము లివిగో! (అని యుత్తరములిచ్చెను)

ఆ యుత్తరముల గ్రహించి చిదానందయోగి వారినందఱ నంపి తనయెదుట గుండమున వెలుగుచున్న యగ్నిహోత్రపు కాంతి నాలేఖల జదువుకొని యేదో యోజించుచుండెను. అప్పుడు మదనసింగు జయ్ క్షీరసాగరశయన, యని యఱచెను. చిదానంద యోగి త్వరితగతి లేచి మదనసింగును వెంటబెట్టుకొని లోపలికి వచ్చి తలుపు గడియ వైచెను. కృష్ణసింగు వీధిలో మఱ్ఱి చెట్టుక్రింద పైబట్ట పరచుకొని నిద్రపోవనారంభించెను. చిదానందయోగి వేషభాషాదుల జూచి మదసిం గాశ్చర్యమునొంచి కొంతసేపటికి స్వామీ మనమేమి చేయవలయును దాదాపుగ రెండు జాముల రాత్రియైనది యనెను. యోగి తద్వచనము యోజించి మదనసింగును దగ్గఱగ రమ్మని యిట్లనియె, “బాబా! నీవాయుధముతో సిద్ధమైవచ్చినావా? ఏదీ కత్తి యెక్కడ” అన మదనసింగు, నే నెవరినైన వధింపవలెనా యేమి? ఎవరిని? ఈ వేషమున నున్న మీరెవ్వరో నాకెఱిగింపుడు. ఈ విషయమున నన్ను సంతుష్టునిగఁ జేసిరేని మీ సెలవునకు బద్ధుడను అని రాకొమారుడను పలుక యోగి వాని కుడి చెయ్యిపట్టుకొని కుమారా! నా వృత్తాంతమును బూర్ణముగ నీ కెరిగింపరాదు. అయినను నీ సందేహ నివారణార్థము నేనొక సంగతి జెప్పెదను. చిత్తూరు రాజ్యసంరక్షణమునకై నేను నాశక్తి ని ధారవోయుచున్నాను. దేశముయొక్క నానాభాగములకు మాఱు వేషముతో మనుష్యలనంపి యాయావృత్తాంతము లెఱుంగుచున్నాను. నేను గూడ శౌర్యవంశమైన వంశస్థుడనే కాని కారణాంతరమున నీ యాశ్రమంబును స్వీకరించితిని. నేను జెప్పునట్లు నీవీ రాత్రి నడచికొనిన నాప్రాణమునైన గోల్పడి నీకాపద రాకుండ జేసెదను అని చెప్ప మదనసింగాశ్చర్యపడి మీరు రసపుత్రులా! అట్లయిన నేను దమ యాజ్ఞ ప్రకార మీరాత్రి నిస్సందేహముగ నొనర్చెద ననెను. ఈ వఱకే రాత్రి పొద్దుపోయినది. ఇక మన పనిమీద మన మరుగుదము. రమ్ము, అని యోగి లేచెను. మదనసింగును లేచి యాతని వెంబడింప నిరవురును నడువ నారంభించిరి. అప్పుడుసరిగ రెండుజాముల రాత్రి యగుటచే నమ్మహానగర వాస్తవ్యులందరు నిర్భయముగ నిద్రపోవుచుండిరి. వీధులన్నియు నిర్మానుష్యములై యుండెను. ఉత్తమకులస్థులెన్నడు బ్రవేశింప గూడని పేటలను సందులను గొందులను వారు తిరుగుచుండిరి. అప్పుడు మదనసింగు “ఆహాహా! ఈవీధుల యందర్థ రాత్రముల నరహత్యలు జరిగినను దిక్కులేదు గదా. ఒంటరిగ నీ సందుల నరుగువాడు నిరపాయముగ జనడు” అని తనలో ననుకొనుచు గమ్యస్థాన మెదురు చూచుచు జిదానందయోగితో గూడ నరుగు చుండెను.