Jump to content

హేమలత/ఎనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ ప్రకరణము

ఉత్తర హిందూస్థానమునందలి క్షత్రియకుటుంబములలో రాజస్థానములోని మీవారు రాజ్యమునేలు కుటుంబమే మొక్కవోని పరాక్రమముతోడను సత్కీర్తి తోడను నగ్రగణ్యమై యొప్పును. మహమ్మదుగోరీ హిందూదేశముపై దండెత్తివచ్చి యాకాలమున నుత్తర హిందూస్థానమునందుండెడి రాజులనెల్ల స్వదేశముల నుండి పాఱదోలెను. అప్పుడు రాజ్యభ్రష్టులైన రాజకులశిఖామణులందఱును దద్దేశమున స్వతంత్ర రాజ్యముల నేర్పఱచుకొని వసించుటజేసి యాదేశమున రాజస్థానమను పేరు కలిగెను. ఆ రాజస్థానమునం దనేక రాజపుత్రకుటుంబములున్నను వారిలో జిత్తూరు కుటుంబము నేటికిని గౌరవము నందుదొల్లిటి స్థితికి దీసిపోకయున్నది. మీవారు రాజ్యమునకు జిత్తూరు రాజధాని అయివుండెను. ఆకాలమునందు రాజస్థానమున జిత్తూరునకు సమానమైన పట్టణ మేవిషయమునను లేదు. చిత్తూరు రాజవంశము శ్రీరాముని ద్వితీయపుత్రుఁడగు కుశమహారాజుసంతతి యని చెప్పుదురు. అందుచేత సూర్య వంశజులనియు రాజకులప్రదీపకు లనియు వారిని రాజులందరు గణింతురు. పరాక్రమమునందును సత్కులప్రసూనత యందును సద్గుణవైభవమునందును రాజస్థానము నందలి తక్కినరాజులు చిత్తూరు రాజులకు దీసిపోవుట జేసి వారందరు జాలకాలమునుండి చిత్తూరు కుటుంబ గౌరవము నెరింగి యారాజులను దమకు సార్వభౌములుగ నేర్పరచుకొని వారియాజ్ఞలకు బద్ధులైయుండెడివారు. శత్రురాజులు రాజస్థానముపై దండెత్తినపుడు చిత్తూరు రాజునకు దక్కిన వారందరు నొకకట్టుగవచ్చి సాహాయ్యము జేయుచుండుటయు గలదు. మనము వర్ణించుకాలమున చిత్తూరునకు మహారాజు లక్ష్మణసిం గనునొక బాలుడు చిన్నతనముననే యాతని తండ్రి పరలోకగతు డగుటచే నాతని పినతండ్రియు శూరశిఖామణియు సింహపరాక్రముడనగు భీమసింగుమహారాజు లక్ష్మణసింగునకు సంరక్షుడయి రాజ్యపరిపాలన మొనర్చుచుండెను. అతనికి రణరంగమున నెంత సాహసమో న్యాయపరిపాలనమునం దంత శాంతమునుండెను. లక్ష్మణ సింగుప్పటికి బదునాలుగేండ్ల ప్రాయము గల కుమారుడైనను శౌర్య సద్గుణములచే మిగుల వృద్ధుడైయుండెను. రాజాస్థానముపై ఢిల్లీచక్రవర్తి యగు నలాయుద్దీను దండెత్తునని భీమసింగు విని చక్రవర్తి సమ్మతమునకు మదనసింగును రాయబారిగ నంపెను. చిత్తూరు సేనా నాయకుడగు ప్రతాపసింగునకు మదనసింగన్న కుమారుడు. అతడు బాలుడయ్యుదృత రాజభక్తియుక్తుడు విమలగుణ సంపన్నుడు నగుటచే మహారాజున కాంతరంగికుడై రాజకీయవ్యవహారములయందు గొంతభారము వహించి పాటుపడుచుండెను. అందుచేత నాతడు చక్రవర్తికడకు పంపబడి సాలిగ్రామము విడుచునంత వఱకును జరిగిన వృత్తాంతమును మీరందఱెరు గుదురు. చిత్తూరు నుండి రాయబారిగ నేగిన మదన సింగు దర్బారునందు గడుచమత్కారముగ సంచరించుచుండుటచే జక్రవర్తి యాతని నెక్కుడు గౌరవముతో నాదరించెను కాని కార్యములయం దాతనితో గపటము విడిచి మాటలాడలేదు. చిత్తూరుపై దండయాత్రజరుపుటకు దనకిష్టము లేదనియు రాజపుత్రులతో నత్యంతమైత్రినుండుట దన మనోరథ మనియు జక్రవర్తి యాతనితో బలికి యతనిని సబహుమానముగ దేశమున కంపెను. మదనసింగు చిత్తూరునకు వచ్చిననాడె తనసందేశార్థమును భీమసింగు మహారాజునకు నిశ్శేషముగ దెల్పెను. అంతట మహారాజును దక్కిన యుద్యోగస్థులును సంతోషమునబొంగి మదనసింగును స్తోత్రముజేసిరి. మదనసింగింటికి వచ్చినతోడనే తనపినతల్లియగు సువర్ణబాయికి నమస్కరించి యామె యాశీర్వచనముల నంది యనేకాంశములగూర్చి యామెతో ముచ్చటించెను. మాటలాడునపుడు పరధ్యానముచేత దడబడుచుండుటయు నారాత్రినిద్రలేక నటు నిటు విహరించుటయు సువర్ణబాయిచూచి యతడు మోహపరవసుడై యుండెనని కనిపెట్టెను. మరునా డుదయమున మదనసింగుతో గూడ బ్రయాణము జేసినకృష్ణసిం గనుసేవకుని దత్కారణమడుగ నాతడు హేమలత సమాచారమును నామె యందాతని చిత్తము దగులుటయు సమగ్రముగా విన్నవించెను. సువర్ణబాయి యుత్తమ కులేస్థురాలగుటచే హేమలతవంటి బీదకన్యను దనకుమారునకు భార్యగా గ్రహించుట కిష్టపడక తనభర్తయగు ప్రతాపసింగున కావార్తనెరిగించి యతడు దనతో నేకీభవించునట్లు జేసెను. మదనసింగు రెండు సంవత్సరముల ప్రాయము గలవాడైనపుడు తండ్రి మాధవసింగు మహాయుద్ధమున మృతుడయ్యెను. మృతినొందిన భర్తకళేబరముతో నాతనిభార్యయు మదనసింగుతల్లియు నగు మోహిని యప్పటి వాడుక ప్రకారము సహగమనము చేసెను. సువర్ణబాయికి బిడ్డలులేరు గనుక బావకుమారుడగు మదనసింగును బెంచుకొని యామె కడుగారామున జూచుకొనుచుండెను. ప్రతాపసింగునకు మాధవసింగు దమ్ముడగుటచే నాతనిసేనానాయకత్వ మితనికిచ్చి చిత్తూరు ప్రభువులీతనిని గౌరవించిరి. ఆనాటనుండియు సువర్ణమతని తల్లిగను బ్రతాపసింగును దండ్రిగను నెంచికొని మదనసింగు తల్లిదండ్రుల మఱచి సుగుణసంపత్తిగలవాఁడై తండ్రికిని గుటుంబమునకును గీర్తిదెచ్చుచుండెను. మదనసింగు చిత్తూరు ప్రవేశించి హేమలతా నారాయణసింగులను మరువక యొకదినమున మహారా జొంటిగ నున్నప్పుడు పాలిగ్రామమున సకల కష్టములతో గాలముబుచ్చుచున్న వృద్ధుని వాని మనుమరాలిని రాజస్థానమునకు బిలిపింపవలయునని చెప్పి యనేక విధముల బ్రార్థించెను. దయాళుడగు భీమసింగు వారల దైన్యమును విని విచారించి చక్రవర్తికిని దమకును జరుగుచున్న సందేశములు మగిసిన తరువాత గొన్నినాళ్ళకు వానిని రావింప నగునని చెప్పి మదనసింగును సంతోష పెట్టెను. మదన సింగునకు హేమలతయం దను రాగము నానాటికి దృఢ మగుచుండ నామె యెంతదూరము నున్నను సింగుహృదయమామెసమీపముననే యుండెను. ఇట్లు మదనసింగు మదనాగ్నిచే వేగుచు నాగతానాగతవేది యని ప్రసిద్ధి కెక్కిన చిదానందయోగిదర్శనము జేయగోరి యొకనాడత డున్న రామదేవునిమఠమున కరిగి యోగి దర్శించి నమస్కారము జేసి యతడు గసుసన్నజేయ యొకచోట గూర్చుండి యితడింత నిండు జవ్వనమందే యోగాశ్రమస్వీకార మేలచేసెనోయని యోజించుచుండెను. చిదానంద యోగి సాక్షాచ్ఛివావతార మని జనులు చెప్పుకొనట కలదు. మదనసింగు ముఖ విలాసము జూచి యాతడేదోపని మీద వచ్చినా డని తెలిసికొని యోగి “బాబా! ఏమి నీ విటు వచ్చినావు? అని యడిగెను.

మద – స్వామీ! మీదర్శనమునకే వచ్చినాను.

చిదా – నీవేదో యడుగవలెనని వచ్చినట్లున్నావు అడుగవచ్చును.

మద – అయ్యా! దూరదేశమున నాకాప్తులున్నారు. వారుసుఖులై యున్నారా?

చిదా – వారు తురకలా? హిందువులా? ఏజాతివారు?

మద – హిందువులు మారాజపుత్రులు. ఇట్లు మదనసింగు చెప్పినతోడనే కొంచెమాలోచించి చిదానందయోగి పైకిఁజూచి స్పటికాక్షసూత్రమును ద్రిప్పి సంచిలోనుండి యొకతాఁటియాకు గ్రంథమును దీసి యొక చిన్నపుల్లతో మూఁడుమాఱు లాపుస్తకముపయ్యి గొట్టి గ్రంథమును విప్పి యేదియో చూచి యోగి యిట్లనియె బాబా! నీవడిగినప్రశ్న రామదేవు నను గ్రహముచే నాకుఁ బూర్ణముగఁ దెలిసినది. నీ వడిగినవారిలో ముసలివాఁడొకఁడున్నాఁడు. పదునాఱేండ్లకన్య యొకతెయుఁగలదు. వారిద్దఱు ఆపదలో నున్నారు. ఆమె యతనివద్దలేదు. పరదేశమందున్నది. వారి కింతలోఁగష్టము తొలగునట్లు తోఁచదు. అనిచెప్ప మదనసింగునకు ముఖవికాసముతగ్గెను. తరువాత యోగివద్ద సెలవుగైకొని యాతడింటికరిగి యాదిన మన్నము ముట్టక విచారగ్రస్తుఁడై యుండెను. రాత్రి జామైనతరువాత మదనసింగు మంచముపై శయనించి యుండఁ గృష్ణసింగు వచ్చి యాతనితో “అయ్యా” మహారాజుగారు తమ్మొకసారి రమ్మని వర్తమానము పంపినారు. వీధిలో వారిసేవకుఁడున్నాడు” అని నమ్రతతో విన్నవించుటయు వెంటనే మదనసింగు తల్లిదండ్రులకావార్తజెప్పి రాజసమ్ముఖమునకరుగుటకుఁ దగు వస్త్రాలంకారముల ధరించి యశ్వారోహణముజేసి తిన్నగఁగోటకుఁజని, రాజపుత్రభటులుకావలియున్న యనేక ద్వారములు గడిచి మోతీమహల్ ప్రవేశించి గుఱ్ఱముదిగి మహారాజు కూర్చుండియున్న గదిలోనికి బోయిఁతనయేలికయెదుట నిలుచుండెను. భీమసింగతనిజూచి ‘కుమారా! ఇచ్చటఁగూర్చుండు’ మని చెప్పి పీఠమునుజూపెను. ఆగదిలోనొక యున్నతాసనమున భీమసింగు గూర్చుండియుండగా లక్ష్మణసింగును బ్రక్కను గూర్చుండి పినతండ్రివైపు జూచుచుండెను. వారికట్టెదుట నెఱ్ఱని వస్త్రములు గట్టుకొని నిలువఁబడియున్న యొకపురుషుని జూపి “కుమారా! ఈతఁడొక విచిత్రవృత్తాంతమును జెప్పుచున్నాడు. నీవును దానిని విని కార్యాంశము నాలోచింపుము” అని మహారాజు మదనసింగుతో జెప్పి యెదుట నున్న యాపురుషునివంకఁ జూడ నతఁడు ‘మహారాజా! నేను మహారాష్ట్ర దేశస్థుఁడను; బ్రాహ్మణుఁడను. నా పేరు వసంతభట్టు. నేనీవఱకును ఢిల్లీచక్రవర్తియగు నల్లాయుద్దీను కొలువులో నుంటిని. కాని యతని దౌర్జన్యమును దురాచారమునుజూచి సహింపలేక యాతని కొలువు విడిచి వచ్చినాను. గోవులను జంపు పచ్చితురకల దగ్గర నింతకాలము గొలువు సలిపిన పాపము నాకాశీవిశ్వేశ్వరుడు క్షమించుగాక! స్వదేశీయులును వేదశాస్త్రసంరక్షకులునగు మీకొలువు నిఁకఁ జేయవలయునని మీపాదములచెంతఁ జేరినాఁడను. అని విన్నవించిన యాకథ విని మదనసింగు మహారాజున కభిముఖుడై “స్వామీ! ఈతనిచరిత్రము నాకు సందేహాస్పదముగ నున్నది. దేవర వారును యోజింపవలె” ననెను. ఆ మాటలువిని భీమసింగుతో దేవా! ఈ బాలుని మాటలు నమ్మి నాపై ననుమానపడఁ బోకుడు. నేను జేయఁ బోయెడి యుపకారము ముందుముందు నా కార్యములవలనే మీకు బోధపడును. అలాయుద్దీను యొక్క గుట్టుమట్లు నాదగ్గర నున్నందున నేను మీ రనాయాసముగఁ జక్రవర్తిని గెలుచునట్లు చేయఁగలను” అని మహరాష్ట్రుఁడు పలుక భీమసింగు సచ్చీలుండగుట చే ననుమానపడక వానికి నెలకు పదివరహాలు జీత మేర్పఱచి యుద్యోగమిచ్చెను. మహారాష్ట్రుని చమత్కారసంభాషణమున బాలుఁడైన లక్ష్మణసింగు వాని యెడల ననురాగము గలిగియుండెను. మదనసింగు కేలనో కాని వసంతభట్టు చూపులును, రూపును జూచినవెనుక నాతనియం దని ష్టము కలిగెను. కాని తన యేలిక వానినాదరించుటచే దానును గౌరవముతో నాతనిఁ జూచుచుండెను. అందఱును సంభాషణ చాలించిన తరువాత లక్ష్మణసింగు మహారాష్ట్రునిజూచి “అల్లాయుద్దీను మాదేశముపై దండెత్తునా” యని యడిగెను. వసంతభట్టు కొంచెము యోజించి ‘స్వామీ! తమ దేశముపై జక్రవర్తి దండువెడలడు. అతనికి రాజపుత్రుల పోరువిన్న గడుభయము’ అని పలికిన వసంతభట్టు మాటలను మహారాజును లక్ష్మణసింగును విశ్వసించిరి. మదనసింగు వారివలెదృఢ విశ్వాసముంచలేదు. ఆ సంభాషణము ముగిసిన పిమ్మట భీమసింగు మదనసింగు ప్రముఖులకు సెలవునొసంగెను. ఆనాడు మొదలు కుమారుడయిన లక్ష్మణసింగుమహారాజునకు వసంతభట్టు ప్రాణమిత్రుఁ డయ్యెను. భీమసింగునకు నత డాంతరంగికుడై యుండి సర్వకాలములయందు నాలోచనము జెప్పుచుబ్రభుసమ్మానముచే జనులకును గౌరవాస్పదుడై యుండెను. అదియిట్లుండ మదనసింగు త్రికాలవేది యగు చిదానందయోగి మఠమున కనేకపర్యాయము లరిగి వేదాంతవిషయములను రాజకీయవ్యవహారములను ముచ్చటించుచు నుండుటచే యోగికిని మదనసింగు నకును స్నేహమయ్యెను. అందుచేత మహారాజునకు గూడ యోగిని రెండుసారు లాతడు చూసి వారి కాతని యందు గౌరవము కుదురునట్లు చేసెను. యోగి రాజపుత్రులయందత్యంతాభిమానమును మహమ్మదీయుల యందసూయ మెండుగజూపుచు, మదనసింగునకును, రాణాకునుఢిల్లీ విషయ వర్తమానముల నెట్లో తెప్పించి యనుదినమును దెలియ జేయుచువచ్చెను. అందుచేత యోగితో బలుమారు రాజులర్ధరాత్రముల రహస్యముల మాటాడుచు వచ్చిరి. ఇట్లు నాలుగుమాసములు గడచెను.