Jump to content

హేమలత/పండ్రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పండ్రెండవ ప్రకరణము

ఆ మరునాడుదయమున మహారాణావారి దర్బారు నియమింపబడెను. సభామంటపమునకు రాజబంధువులును, రసపుత్రకుమారులును, సామంతులును వేఱువేఱుగ దమతమ బిరుదచిహ్నములతోడను సేవక సమూహములతోడను, సమస్తభూషణముల ధరించి వచ్చి తమ గౌరవములకుందగు స్థానముల యందు గూర్చుండిరి. అప్పుడు మదగజేంద్రము నుండి మెల్లగ దిగి కనకదండములు ధరించి కైవారముసేయు నేత్రహస్తులిరుగడల గొలువ సేవకులు మార్గమును బ్రదర్శించుచుండ శ్రీలక్ష్మణసింగు మహారాజువారు, భీమసింగు మహారాజువారును గొలువుకూటమును జేరిరి. సభామందిరము రెండువేల మంది మనుష్యులేకకాలమున గూర్చుండునంతటి వైశాల్యముగలిగి సాలగ్రామ శిలానిర్మితములై స్నిగ్ధములయిన గోడలతోడను, పైనున్న బల్లకూర్పుమీద జేయబడిన విన్నాణపు లక్కపనులతోడను, మహాలక్ష్మీ విలాసబాసురమై యలరుచుండెను. అట్టి కొలువుకూటమునుజేరి తన్మద్యంబునస్ఫటిశిలా నిర్మితమగు వేదికపై ధగధగ మెఱయుచున్న బంగరుకోళ్ళు దంతపు సింహాసనముపై మహారాణా లక్ష్మణసింగు సుఖాసీనుడయ్యెను. ఆయనకు దక్షిణభాగమున రసపుత్రకుల ప్రదీపకుడగు భీమసింగును, భీమసింగునకావల సింగపుగొదమల వంటి యాతని పండ్రెండుగురు కుమారులను, వారి కావల వాని మేనమామయు రాజపుత్రసేనాధిపతియు భీమసింగునకు ముద్దుల మఱదియునగు గోరాసింగును, వానిముందఱ బాలుడయ్యు బరాక్రమవృద్ధుడని పేరుగాంచిన గోరాసింగు పుత్రుడగుబేడల్ యును గూర్చుండిరి. మహారాజు కెడమప్రక్క సామంత రాజులను వారి కావల మంత్రిదండనాయక ప్రముఖవియోగులును, వారి వెనుక విదేశాగతులగు రాయబారులును గూరుచుండిరి. కాని ప్రతాపసింగు మదనసింగు లేమిగారణముననో రానందున సభ్యులందరు దత్కారణము నూహించుచుండిరి. లక్ష్మణసింగు, మదనసింగు ప్రతాపసింగులు రాకుండుటకు గారణమును దెలియగోరి సభ నుద్దేశించి యిట్లనియె. ఓసభాసదులారా, అలాయుద్దీను మన దేశముపై దండెత్తుటనుగూర్చిన యదార్థస్థితి మీరెరుంగుదురేమో దెలియగోరి మిమ్మిటు రప్పించుటకయు దర్బారు పిలిచినాడను. కాని నిన్నరాత్రి తద్విషయమై పరిపూర్ణముగ మేము తెలిసికొంటిమి. ఆయంశముల నిచట నుపన్యసించుట ముఖ్యమైనను మదనసింగు ప్రతాపసింగులు రానందున సందేహింపవలసివచ్చెను. వారు రాకుండుటకు గారణమెవరైన నెరుఁగుదురే? అనవుడు స్వామి పలుకులకు దొరలెల్ల దెల్లబోయి తత్కారణము నెరుగక యొండొరుల మొగముల జూచుకొనుచు రాత్రి జరిగిన యంశముల నాలకించుటకు నాత్రముతో గూరుచుండిరి. ఆసభలో ననేకులు వసంతభట్టు రానందున గుసగుసలాడుచుండ నా సమయమున నొక సేవకుడు వచ్చి ప్రతాపసింగు మదనసింగు వచ్చుచున్నట్లు రాణాతోజెప్ప సభ్యులందరు వారిరాక కెదురుచూచుచుండిరి. అప్పుడొక పచ్చని దృఢశరీరముగల మనుష్యుని వెంటబెట్టుకొని యాయుధపాణులై వారిరువురును వచ్చి రాణాకు నమస్కరించి యామనుష్యుని రాజు నెదుట నిలువబెట్టిరి. ఆ మనుష్యునకు రెండుఱెక్కలును వెనుకకు విఱచి కట్టబడియుండెను. తలయెత్తక నేలచూపులు జూచుచు సన్యాసివేషములో నిలువ బడియుండిన వానిని జూచి సభ్యులు మహాశ్చర్య మేదియో వినక పోమని యాత్రముతో నిశ్శబ్దముగ నుండిరి. అంతట బ్రతాపసింగు తనస్థానమున గూర్చున్నతోడనే మదనసింగు తనయేలిక కభిముఖమై చేతులుజోడించి యిట్లు చెప్పసాగెను. మహాప్రభూ! ఈ నిలువబడినవాడు మహారాష్ట్ర బ్రాహ్మణుడు, ఇతడలాయుద్దీనున కాంతరంగికుడై మనవద్ద మాయోపాయముచేత జీవించుచున్న యా వసంతభట్టునకు జక్రవర్తికడనుండి యుత్తర ప్రత్యుత్తరములదెచ్చుచు దన్నెవరుబట్టుకొనకుండ సన్యాసివేషముతోనున్నాడు. ఈతనివృత్తి యిదియై నట్లును వసంతభట్టు దురాత్ముడైనట్లును వీనిదగ్గఱ నాకు దొరికిన యీయుత్తరములే సాక్ష్యము నిచ్చుచున్నవి. వీని నిజమైనపేరు పాండురంగనాథుడైనను జ్ఞానానందస్వామి యనుపేర వర్తించు చున్నాడు అని తన చేతనున్న యుత్తరములు లక్షణసింగునకందిచ్చెను. వసంతభట్టు దురాత్ముడని వినుటకు ననేకులాశ్చర్యపడిరి. పారసీక భాషలోనున్న యీయుత్తరములను లక్ష్మణసింగు గోరాసింగునకిచ్చి చదువుమన నతడా కాగితములనెల్ల బరీక్షించి యందు ముఖ్యమగు నొకదానిని నీక్రింది ప్రకారము చదువు నారంభించెను. శ్రీఢిల్లీచక్రవర్తి యగు నాలాయుద్దీను వసంతభట్టునకు వ్రాయునదేమన – మిత్రుడా! నీతో నేను గపటకలహమును గల్పించుకొనుటయు నిజముగ నాగ్రహము వచ్చినవానివలె నేను సభయందు నటించుటయు, నారాత్రి నిన్ను నేను రహస్యముగ జెఱనుండి విడిపించుటయు, జిత్తూరునగరమునకు నిన్ను నేను తద్రహస్యముల నెరుగుట కంపుటయు నీవఱ కెవ్వరును నెరుగరు. నీవు లక్ష్మణసింగును జెఱపెట్టుటకు విశేషముగ శ్రమపడుచున్నావని విని సంతోషించుచున్నాను. ఎట్లయిన లక్ష్మణసింగును బట్టి తప్పక తీసుకొనిరావలయును. అప్పుడు రాజపుత్రులు తమప్రభువు ప్రాణములను రక్షించుకొనుటకు మనమెట్లు చెప్పిన నట్లు విందురు. దండయాత్రమాట నిశ్చయమే యైనను నేను దండెత్తనని వారితో దృఢముగ జెప్పుచు వారేమరిల్లి యుండునట్లు జేయుము. మహమ్మదు అలాయుద్దీను, అని యా యుత్తరము గోరాసింగు చదివినతోడనే రాజపుత్రులనేకు లాశ్చర్యకోపగ్నులైరి. అంతట భీమసింగు పాండురంగనాధుని జూచి “దీనికి నీవేమి చెప్పెదవు? నిజము చెప్పుము.” అని యడుగ బాండురంగనాధుడు నేను మీకుబదులు చెప్పను. మీయిష్టమొచ్చినట్లు చేయుడు, అని యుత్తరమిచ్చెను. అంతట లక్ష్మణసింగు సభ్యుల నుద్దేశించి, వసంతభట్టు మనతావున గడుటక్కరియైప్రవర్తించుటచే నతడు దుర్మార్గుడని యెవ్వరు నెరుగరు. నాపై గొందరు కుట్రల జేయుచున్నారనియు వారలను నాకప్పగింతురనియు జెప్పి నమ్మించి నన్ను నిన్న రాత్రినాడొంటిగ దోటకు దీసికొనిపోయి బండిలో నెక్కించి నన్నుఖైదీగ ఢిల్లీకిబట్టికొని పోవబ్రయత్నించెను. నేను తప్పించుకొన బ్రయత్నింప నాప్రాణములు గూడ నపహరింప జూచెను. నాబాగ్యవశమున మన చిదానందయోగియు మఱొకడు వచ్చి యాగోముఖ వ్యాఘ్రమును జంపి నాప్రాణసంరక్షణ మాచరించితిరి. యోగితోవచ్చి నాప్రాణము నిలిపిన మహాపురుషుడెవ్వడో యని పలుక మదనసింగు రాజపుత్ర మధ్యమునుండి సింహమువలె లేచి వచ్చి “దేవా! బ్రాహ్మణ వేషములో మిమ్ము రక్షించిన వాడను నేనే. మీరు నాకుబహుమానముగ నొసంగినఖడ్గరత్న మిదిగో అని సభాసదు లాశ్చర్యపడునట్లు కంఠమెత్తి పలికెను. భీమసింగామాటలు విని తనపీఠమునుండి లేచి యానంద మాపజాలక కుమారప్రాణరక్షణ మాచరించినందులకు మదనసింగు గౌగలించుకొని యనేక విధముల స్తోత్రము చేసెను. తన ప్రాణముల గాచిన మహాత్ముడు మదనసింగని తెలియ లక్ష్మణ సింగు దనకంఠమున వ్రేలాడుచున్న ముత్యముల హారముదీసి మెడనువైచి యాతని నాలింగనము జేసికొనెను. భీమసింగునాజ్ఞచే బాండురంగవిభుడప్పుడే కారాగృహమున కంపబడెను. అంతట వారు దర్బారును ముగింప దలచుచుండగా నటకు వేగిరపాటుతో జిదానందయోగి వచ్చి కొలువులో నున్న సమస్తరాజపుత్రవీరులను దాటి ఠాణాకు నెదురుగ జనెను. అతనిని జూచి రాణాయును భీమసింగును లేచి నమస్కరించి తమకృతజ్ఞతను దెలుపుమాటలేవో యనబోవుచుండగా వారిని వారించి చిదానందయోగి “ఓమహారాజా! ఓభీమసింగుమహారాజా! దురాత్ముడైనవసంత భట్టుపలుకులనమ్మి మీరు యుద్ధసన్నాహములు మానుకొనియున్నారు. అలాయుద్దీను దండయాత్ర వెడలి మనకు నిరువది క్రోసుల దూరమునకు వచ్చియున్నాడు. రెండుమూడు దినములలో మనపై నాకస్మికముగ బడుచున్నాడు; గాన నింక మీనిద్రలనుండి మేలుకొనుడు, అని యెలుగెత్తి పలికెను. భీమసింగు సాధారణముగ నట్టి యపశకునములందు దన్నెడబాయకుండు మనోధైర్యము జిక్కబట్టి యిట్లనియ. “చిదానందులవారిమాట నిక్కము; వారు సత్యమును దెలిసికొనినగాని మన కిట్లుచెప్పరు. అయినను మీరు భయపడక యిప్పటినుండి తగు ప్రయత్నముల జేయుడు. అనిన వెనుక యోగి రసపుత్రులారా! సూర్యచంద్రవంశజులగు మీరు మీరాజు నందును మీకుబూర్ణాబిమానమున్న బ్రాణముల కాశింపక బోరాడుడు. కులదేశాభిమానముల మాని దేవాలయముల నాశనముజేసి బ్రాహ్మణులనుజంపి గోవులనువధించు మహమ్మదీయులకు మీరు చిత్తూరుకోట నప్పగించ దలచిన పక్షమున నూరకుండుడు” అని ప్రోత్సాహ వాక్యములు పలికెను. రసపుత్రు లేక వాక్యముగ “మహారాజు నిమిత్తము దేశమునిమిత్తమును మా ప్రాణములను ధారవోసెదము. ఇదె యుద్ధసన్నద్ధుల మయ్యెదము.” అని యఱచిరి. లక్ష్మణసింగును భీమసింగును వారినభినందించి వీడ్కొలిపి యంతఃపురములకు బోయిరి.