హేమలత/పదమూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదమూడవ ప్రకరణము

“హేమలతా! హేమలతా! ఇటురమ్ము” అని లోపలి నుండి యొక యెఱిగిన మనుష్యకంఠము వినబడిన తోడనే హేమలత వీధి గుమ్మమునుండి లోనికి బరుగెత్తి శివప్రసాదు వద్దకుబోయి “అయ్యా! ఎందుకు బిల్చినారు” అని యడిగెను. శివప్రసా దామెనుజూచి “అమ్మాయీ చక్రవర్తి చిత్తూరుపై దండువెడలుటకు సైన్యముల నానాభాగములనుండి పిలిపించుచున్నాడు. అందుచేత మనయూరిమీదుగ దుర్మార్గులగు రాజసైనికులు పోవుచున్నారు. నీవు వారికంట బడకుము. ఆయన నిన్ను నాకప్పగించినందులకు మరల నిన్ను నేనాయనకప్పగించి మాట దక్కించుకొనవలెను. నీవు వీధిలోని కరుగకుము.” అని హితోపదేశము చేసెను. హేమలత యామాటల గమనించి “వీధిలో నొక ముష్టివాడు చిత్రముగ బాడుచున్నాడు! అది వినుటకయి వెళ్ళినాను. ఇదె వాడు మనయింటికే వచ్చుచున్నాడు” అని హేమలత ప్రత్యుత్తరమిచ్చెను. హేమలత సాలిగ్రామమున రహిమానుఖాను ధాటి కోడి మూర్ఛిల్లియుండ నామెకు జ్వరము తగిలినపుడు మందు నొసంగి రక్షరేఖ గట్టిన గోసాయి యామెను మెల్లమల్లగా నావలకు దీసికొనిపోయి యొకబండిపై నెక్కించి తిన్నగా కుల్వానగరమునకు గొనిపోయెను. అచ్చోట దనకు బ్రాణమిత్రుడయిన శివప్రసాదునకు నామె నప్పగించి యత్యంత జాగ్రత్తగ నుండుమనియు, దాను వచ్చినపుడు గాని మదనసింగు వచ్చినప్పుడు గాని యామెనంపవలయు ననియు జెప్పి యాతడుచనెను. శివప్రసాదు పండితసంప్రదాయమున జేరిన బ్రాహ్మణుడు. అగ్రహారీకుడు. అందుచే ద్రవ్యవంతుడును, మాట చెల్లుబడిగలవాడును నై ధర్మకార్యముల జేయుట యందు తనధనమును గొంతవ్యయపఱచుచు సత్కీర్తి ధనుడైనందున హేమలత వారియింట నిరపాయముగ నుండెను. గాని పితృసమానుడయినందున తాత కారాగృహవాసి యగుటకును దనకు దల్లిదండ్రులు గాని సోదరులుగాని మఱియేయితరదిక్కుగాని లేనందునకును మనస్సున నెల్లప్పుడు నామెచింత నొందుచు జిక్కి శల్యమైయుండెను. ఆమెమారార్చుటకు శివప్రసాదు కుమారియగు చంద్రావతి యనేకప్రయత్నముల జేయుచు వచ్చెను. గాని యవియెల్ల వ్యర్థములయ్యెను. చంద్రావతిభర్త యప్పటికి రెండు సంవత్సరములక్రిందట దేశాంతరమఱిగి తిరిగిరానందున వ్యక్తురాలైన యామె మిగులదుఃఖభారముచేత నలిగియుండి, తనతో సమాన దుఃఖురాలగు హేమలత నూరార్పుచు నామెచే దానాశ్వాసింపబడుచు బ్రొద్దులు పుచ్చుచుండెను. కాలము సకలదుఃఖభారములను శమింప జేసెను. కాబట్టి క్రమక్రమముగ హేమలత, చంద్రావతి మధురభాషణములచే గొంతయూరట గల్గియుండెను. ఇట్లు కొన్నిమాసములు గడచెను. ఆనా డుదయమున శ్రావ్యతర మయిన హిందీపాటల బాడుచు ముష్టివాడు ప్రసాదుగారియింటికి రాగా హేమలత గానకళాప్రవేశము గలదగుటచే నా పాటలు విని ముష్టివానికి బెట్ట దోసెడు బియ్యము దెచ్చెను. హేమలతను బిచ్చగాడెందుచేతనో యాపాదమస్తకమును ఱెప్పవాల్పక జూడజొచ్చెను. బిచ్చగాని వికృత దృష్టికి జడిసి బియ్యము త్వరితముగ బెట్టి పాకలోనికి జని జంద్రావతికామాటజెప్పెను. విని చంద్రావతి వచ్చునప్పటికి బిచ్చగాడు మరలిపోయెను.

ఇది జరిగిన కొన్ని దినముల కొకనాఁడు హేమలత దీపములు పెట్టిన తరువాత మదనసింగును గూర్చి తలంచుకొని తత్సంయోగము లభించుట దుర్లభమని విచారము నొందుచుండగా శివప్రసాదొక సేవకుని వెంట బెట్టికొని లోపలికి వచ్చెను. అతఁడు హేమలతను జంద్రావతిని దనవద్దనుంచుకొని వాని వృత్తాంతమును జెప్పమనఁగా “అయ్యా! తమయింట హేమలత యున్నదని తెలిసి శ్రీమదనసింగామెను వెంటబెట్టి కొని రమ్మని నన్నుఁబంపినాఁడు. వివాహప్రయత్నము సర్వముజరిగి సిద్ధముగ నున్నది. చిత్తూరిరాజు భీమసింగుగా రీమెనుదోడి తెమ్మని పల్లకియు పండ్రెండుగురు బోయలను నిరువురబంట్రోతులను నా వెంట నంపినారు. చక్రవర్తికిని రాజపుత్రులకును మహాయుద్ధము సంప్రాప్తమగును గనుక సాధ్యమైనంత శీఘ్రముగ రప్పింపుమని వారు సెలవిచ్చినారు. మీద మీ చిత్తము” అనిచెప్పి సేవకుఁడూరకుండెను. ఈ మాటలు హేమలత హృదయారవిందమును వికసింపఁజేసెను. చంద్రావతి హేమలతావియోగము గలుగునని విచారభరముదాల్చెను. నీయిష్టమేమని శివప్రసాదు హేమలతనడిగెనుగాని యామెయుత్తరమీయదయ్యెను. శివప్రసా దనంతరమునఁ దనభార్యకావృత్తాంతమును జెప్ప నామె యభిప్రాయము నీయఁజాలక తడఁబడజొచ్చెను. రాత్రి జామగునిప్పటికి బోయలు పల్లకి నెత్తి కొనివచ్చి గుమ్మముముందుట నిల్చిరి. శివప్రసాదు వారికందఱకు నన్నముబెట్టించి పండుకొను సదుపాయముచేసెను. చంద్రావతి, హేమలత మనస్సులో జిత్తూరుపోవుటకిష్టమున్నట్లు మాటలవల్ల సూచకముగా నెఱింగి తలిదండ్రుల కెఱింగింప వారును హేమలతవివాహము నాపుట మేలుకాదనియు మొదట నామెనప్పగించిన యోగి కూడ మదనసింగువద్దకంపుట నిష్టపడెననియు నాలోచించి యామెను చిత్తూరునంపుటకు నిశ్చయించకొనిరి. మఱునాఁడు మధ్యాహ్నము ప్రయాణము నిర్ణయింపబడెను. శివప్రసాదును, భార్యయు, నామెను దమపుత్రికవలెఁ జూచుకొనుచున్నందునఁ జీరలురవికెలు మొదలగువాని నిచ్చిరి. హేమలత వారిని వదలలేక కన్నీటితోఁ బల్లకి నెక్కెను. శివప్రసాదామెను నొంటిగా విదేశీయులతో బంపుట యుచితముగాదని మిగులఁ గృతజ్ఞుడును, శూరుడునగు లాహిరియనుఁ వొక శూద్రుని బల్లకివెంట సహాయముగనంపెను. మఱియును ఢిల్లీనగరముమీఁదుగఁ దీసికొనిపోవలదనియుఁ జిత్తూరు నగరముననకుఁదిన్నగఁగొని పోవలసినదనియు, బ్రాహ్మణుఁడు చెప్పి సాగిపొమ్మని బోయల కాజ్ఞాపించెను. లాహిరియును నిరువురు సేవకులను వెంట రానందఱ దగ్గఱ వేఱువేఱు సెలవుఁగైకొని హేమలతఁ జాముప్రొద్దువేళ కుల్వా పురమును బాసి మదనసింగును గలసి సుఖించున పేక్షతోఁ బ్రయాణము చేయుచుండెను. లాహిరి స్వామిభక్తి గలవాడు. సాహసుండె యగునుగాని యొకరేమిచెప్పిన నది సులభముగ నమ్మి మోసపోయెడు మూఢుఁడు. అందుచేతనే శివప్రసా దాతనితోఁ బలుమాఱు జాగ్రత్తగా నుండుమని చెప్పెను. లాహిరియు సాధ్యమైనంత వరకప్రమత్తుఁడై పల్లకి వెంటనడుచుచుండెను. ఇట్లు కొంతదూరము ప్రయాణము చేసినతరువాత వారు ఫజీబాదుకడకు సాయంకాలమునకు వచ్చిరి. ప్రయాణము వలన డస్సియున్న బోయలు కొంచెము కల్లునీరు త్రాగుటకు గ్రామముననొక చెట్టు క్రింద బల్లకిని దింపిరి. కూడనున్న సేవకులిద్దఱు గంజాయిదమ్ముపీల్చగ జూచి లాహిరి మనస్సు పట్టజాలక తానును రెండు గ్రుక్కలు పీల్చెను. తదనంతరము బోయలు వచ్చి మరలఁ బ్రయాణమునారంంభించిరి. ఫజీబాదు దగ్గరనే చిత్తూరునకరుగుటకు వేఱుబాటను గ్రహింపవలయును అయినను, బోయలును సేవకులును మార్గమును దప్పింపక ఢిల్లీవైపుఁ బోవుచుండిరి. లాహిరి యదివఱకు మార్గమును మార్పుఁడని వారి నడుగఁ దలచియు మత్తుచే సమయమున కూరకుండి వారితోఁ గలిసి చిత్రములైన పాటలు బాడుచు నడచుచుండెను. మద్యపానమత్తులగుటచే బోయలు వడివడిగ నడవసాగిరి. రాత్రి జాముప్రొద్దు పోవునప్పటికి వారందరు ఢిల్లీనగరము బ్రవేశించిరి. నగర ముఖద్వారమును దాటి వారు నాలుగడుగులు సాగిపోవునప్పటికి దీపపు గ్రీనీడను గంబళమును గప్పుకొని కూరుచున్న యొకమనుష్యుడు బోయలం జూచి ఓరీ! యిటుయిటు అని మార్గమును జూపెను. అది యానవాలుగ బోయలు రాజవీధిని విడిచి సందుగొందులవెంట నడువసాగుట జూచి లాహిరి గంజాయిమత్తు పూర్ణముగ దిగినందున వడివడి ప్రక్కను నిలిచి చిత్తూరు వచ్చినాములే అమ్మా! యని హేమలతను లేపెను. మదనసింగు దర్శనమును లభించునని యూటలూరుచు నందు శయనించిన యీ బాలిక యా మాటవిని ప్రాణము లేచి రాగా దలుపులు దీసి వీధులఁ జూచుచుండెను. తరువాత గొన్నివీధుల, గడిచి బోయలొకసందులో నున్నత ప్రాకారములు గల యొక గృహముదగ్గరకు బోయి కంబళమును గప్పుకొన్న మనుష్యుడు నిలువుడని చెప్ప దామట నిల్చి పల్లకి దించిన తొడనే కంబళము గప్పుకొన్న సేవకుడు వచ్చి పల్లకి తలుపులను దెఱచి అమ్మా! స్త్రీలు కనిపెట్టుకొని యున్నారు. లేచి రమ్ము అనిపలికెను. లోపల స్త్రీ లొకదాసినయిన నేల యంపి తన్ను గౌరవింపరైరని హేమలత యోజించుచు మెల్లగ బల్లకి విడిచి లాహిరిని వెంటబెట్టుకొని తప్పటడుగులిడుచు లోనికి జనెను. ఆయింట హేమలత ప్రవేశించునప్పటికి నందు దీపమైనను లేదయ్యెను. ఈ మాయ యేమని మన హేమలత యోజించుచుండ నొకసేవకు డరుదెంచి లోపల స్త్రీలున్నారు. వారికి ఘోషాకలదు. మీలాహిరిని లోనికి దీసికొని రాకుము అని చెప్పను. అంతటనామె చేయునదిలేక లాహిరిని జాగ్రత్తగ నుండుమని మెల్లగా యొకగదిని బ్రవేశించెను. ఆగదిలో నొక చిన్నదీపము మాత్రము గూకటిలో నుండుట బట్టి నిలిచియున్న మనుష్యుల మొగమును జూడజొచ్చెను. ఆగదిబ్రవేశించి రెండడుగులదూరమరిగి హేమలత యెదుట నతిదీర్ఘ కాయమును భయంకరమగు గడ్డమును దాల్చి ప్రత్యక్షయముని వలె నున్న రహిమానుఖాను విగ్రహము జూచెను. చూచి యకస్మికభయముచే శరీరము గజగజవడక నోట మాటరాక చేష్టలుదక్కి యెట్టకేలకు లాహిరీ! లాహిరీ యని భయాతిశయముచే నేలమూర్ఛిల్లెను. నేలబడుచున్న యామెను దనచేతులతో నిలిపి ప్రాణేశ్వరీ! భయపడకు. నేనుండగ నీకేమి భయములేదని రహిమానుఖానామె నాపబోయెను. కాని దుఃఖావేశముచే శరీర మెరుగని యామెను మొహావేశముచే శరీర మెరుగనిఖాను బట్టికొనలేకపోయెను. హేమలతపై ధ్యానము నిల్పియున్న లాహిరి ‘లాహిరి’ యను కేక తన చెవిని బడినతోడనే బాలిక కపాయ మేదో దటస్థమయినదని లేచి గడియ వేయ బడియున్న తలుపుదన్ని చేతులతో గుంజెను గాని యెవ్వరును దీయువారు లేరైరి. వెంటనే యిల్లువెడలి వీధిలోనికి వచ్చి యెలుగెత్తి అయ్యో అయ్యో! రక్షింపుడు. రక్షింపుడు అని కేకలు వేయనారంభించెను. అప్పుడు రాత్రి జామున్నరప్రొద్దుపోయి నందున జనులందరు నిద్రాసక్తులై యుండిరి. ఈ కేకలచే వారు మేలుకొని మహాపాయ మేదో వాటిల్లినదని యావీథిమనుష్యులెల్ల వడివడినాయుధములధరించి లాహిరియున్న వైపునకు వచ్చిరి. లాహిరి వారిని జూచి అయ్యా! యీ యింట నొక స్త్రీని జెఱ బట్టుచున్నారు. తలుపులు మూయబడియున్నవి. మీరామె ప్రాణములను రక్షింపవలెను అనిచెప్ప వారందరు గోపొద్దీపితులై గడ్డపారలతో దలుపులు బ్రద్దలుగొట్టి లోన బ్రవేశించిరి. అప్పటికి రహిమానుఖానును గంబళి కప్పుకొని మార్గప్రదర్శకుడైన నందుడును పాఱిపోయిరి. బంగారుబొమ్మవలె హేమలత నేలబడి యప్పుడే తెలివి దెచ్చుకొని కనుల మూసికొని భయముతో అయ్యో దైవమా! అని యేడ్చుచుండెను. వారామెను లేవదీసి యాదుర్మార్గులందు లేరని యామెకు ధైర్యము చెప్పిరి. ఆ వచ్చినవారిలో జక్రవర్తి యొద్ద గొప్పయుద్యోగమున నున్న చంద్రసేనుడను బంగాళాక్షత్రియుడు డొకడుండెను. ఆయన యేబది యేండ్ల వయస్సు గల వాడగుటను సకలకష్టసుఖములు దాటిన వాడగుటను బాలికపై జాలిగలిగి తన యింటికి రమ్మని లాహిరిసమేతముగ నామెను గొనిపోయెను. అందరును రహిమానుఖానును నిందించుచు నిండ్లకు జనిరి. ఆయింటిదొడ్డిలో జెట్లక్రింద దాగికొని యున్న రహిమానుఖానును నందుడును మనుష్యుల సందడి తగ్గినతోడనే మరల గృహముబ్రవేశించిరి. అంతట రహిమానుఖాను విచారగ్రస్తుడై రెండుసారులు తనకు భంగపాటు గలుగుటకు జింతిల్లి నందునితో నందా! పాపము, నీవు బిచ్చగాని వేషము వైచికొని గ్రామములెల్ల దిరిగి హేమలత యున్నచోటెరిగి వచ్చి నాకుపకారము జేసినావు. మనము మదనసింగు పేరుపెట్టి ఆమెను రప్పించినాము గాని నామనోరధము సఫలముకాలేదు. నీశ్రమకైనను దైవము మెచ్చలేదు గదా, యని నిట్టూర్పు విడుచుచు నాయిల్లివిడిచి నందునితో గూడ బోయెను.

అట్లు చంద్రసేను డామెను గృహమునకు గొనిపోయి భోజనము బెట్టించి తరువాత నిట్లనియె. అమ్మా నీవును క్షత్రియకన్యవని చెప్పు చున్నావు. నీవు మాయింట నుండవచ్చును కాని యిక నాలుగు దినములకు మా చక్రవర్తి చిత్తూరుపై దండయాత్ర కరుగుచున్నాడు. నేను నా కుటుంబముతో నరుగుచున్నాను. నీవు వచ్చిన యెడల వెంట దీసికొని పోవుదును. రానియెడల నిన్నెవరి కప్పగించి పోవలెనో తోచకున్నది. అని చెప్ప నామె యాతనితో చిత్తూరు బోయెద ననెను. లాహిరి హేమలతతో గూడ చంద్రసేనుని యింట మూడుదినములుండి కుల్వానగరమునకు బోయి యావార్త శివప్రసాదున కెఱింగించెను.