హేమలత/పదునాలుగవ ప్రకరణము
పదునాలుగవ ప్రకరణము
చక్రవర్తి మహాసేనా సన్నాహమును జేసికొని రాజస్థానముపై దండువిడియుటకు వెడలెను. ఆ మహాసైన్యమందు హిందువులు, పిండారీలు, జాటులు, బౌద్ధులు, జైనులు మొదలగు స్వదేశీయులును; అరబ్బులు, పారసీకులు, తురుష్కులు, నాపుగనులు, అల్బీనియనులు, తార్తారీలు, మొగలాయీలు మొదలగు ననేక మహమ్మదీయులును జేరియుండుటచేత నాశిబిరము కదలి వచ్చుచున్న మహానగరమువలె నుండెను. క్రమశిక్షణయుఁ దగుపరీక్షయు లేనందున సైనికులెందరో యెవ్వరు నెఱుంగరు. ముందరన దుందుభులు దిగంతములు ప్రతిధ్వనులెసఁగ మ్రోయ దళతళ మెఱయు ఖడ్గములను హస్తములఁ దాల్చి యమ్ముల పొదుల మూఁపులనిడి జయైక దీక్షతోఁ గాల్బలములు మొదట నడుచుచుండెను. అవ్వెనుక పారసీక తురంగముల నెక్కి చేతులతో బల్లెములబట్టి నొక్కుమ్మడి నాశ్వికులు వెడలుచుండిరి. వారివెనుక మదగజేంద్రములపై బంగరు కంబళములతోడను వెండికప్పుల తోడ గ్రాలు నంబారీలు నెక్కిఁపచ్చపట్టు బరుపులపై గూర్చుండి సేవకులు వింజామర లిడ సకల సేనాసముద్ర నియామకుడై శ్రీఢిల్లీశ్వరుండగు నలాయుద్దీన్ చక్రవర్తి వచ్చుచుండెను. చక్రవర్తికిరుకెలంకులను దృణీకృతమృత్యుదేవతలగు మహమ్మదీయ సామంతులంగరక్షకులై నడచుచుండిరి. వారి వెనుక శిబిరానుచరులును వారి వెనుక నేనుఁగులనెక్కియుఁ బల్లకులలోఁ గూర్చుండియు శ్రీచక్రవర్తి యొక్కయు హిందూమ్లేచ్ఛ ప్రభువుల యొక్కయు సైనికుల యొక్కయు నంతఃపుర స్త్రీజనంబులును నరుగుచుండిరి. ఇందే చంద్రసేనుని కుటుంబమును వచ్చుచుండుట జేసి మన హేమలతయు నొకపల్లకియందుఁ గూర్చుండి ప్రయాణము సేయుచుండెను. చంద్రసేనుని భార్య హేమలతను దన సోదరివలెఁ గాపాడుచుండెను. సైనికుల కోలాహలధ్వనులును హాయహేషలును గజబృంహితములును, బల్లకుల యోంకారనాదములును, బ్రహ్మాండమును బ్రద్దలు సేయసాగెను. ఈ సైన్యము చిత్తూరునకుఁ బదియేనుక్రోసుల దూరములకు వచ్చినప్పుడు చక్రవర్తి సైన్యము నిశ్శబ్దముగా నడువవలయుననియు శత్రువులు తమరాకను గుర్తించరాదనియు రణదుందుభులు మ్రోయింపవలదనియు నానతి నిచ్చెను.
నిరంతర ప్రమత్తుడై తిరుగు చిదానందయోగిచే నంపబడిన వేగులవాండ్రు సైన్యమువచ్చు టెరిఁగి యోగికి విన్నవింపనతఁడా వార్త రాజుకు దర్బారునందు దెలియజేయుట మనమీవరకే చదివినాము. ఆరాత్రి చక్రవర్తి సైన్యము యొక్క రాకను దానిస్థితిని దెలిసికొమ్మని భీమసింగును గోరాసింగును బంప వారు చూచి వచ్చి యావార్త రాణాకును భీమసింగునకు విన్నవించిరి. అంతట రాజపుత్రులు చిత్తూరు సంరక్షణమునకు సమస్త ప్రయత్నములఁ జేయసాగిరి. రాజపుత్ర సైన్యములకును శూరాగ్రేసరులగు గోరాసింగును బ్రతాపసింగును సేనాధిపతులుగ నియమింపబడిరి. మదనసింగు శ్రీభీమసింగుగారికిని శ్రీరాణాకును నంగరక్షకుఁడుగ నియమింపబడెను. మూర్తిమంతమగు ప్రతాపమువలె బ్రతాపసింగు సైన్యముల నెల్ల జక్కజేయ నారంభించెను.
ఆ మహమ్మదీయ సైన్యమట్లు ప్రయాణముచేసి మెల్లమెల్లగ జిత్తూరు నగరమునకు వచ్చికోట యెదుట విడిసెను. సైన్యమును గనుఁ గొని భీమసింగు రసపుత్రుల నెల్ల సిద్ధముచేసి కోట సంరక్షణమున కాజ్ఞనొసఁగెను. అలాయుద్దీన్ చక్రవర్తియుఁ గోటముట్టడి నారంభించి తన కాప్తుఁడు రాజకీయ వ్యవహారముల యందాలోచన చెప్పువాఁడునగు రహిమాన్ ఖాన్ నకు సేనాధిపత్యము నొసగెను. రహిమాన్ ఖాన్ కత్తి బట్టనేఱని పిరికివాండ్రలోఁ జేర్పబడదిగినవాఁడయ్యు, గౌరవార్థ మీమహోద్యోగము నంగీకరించెను. కోటగోడ యిరువది రెండడుగుల యెత్తుగలిగి యైదడుగుల వెడల్పుగలిగి యుండెను. కోటచుట్టు నగాధమైన కందక ముండెను. ఆ కందకము మీదనుండి లాగివేయబడు టకు వీలుగానున్న యొక వంతెన యుండెను. ముట్టడి యారంభమైనతోడనే మహమ్మదీయుల ఫిరంగులను బారుచేసి బారుచేసి కోటగోడను నిర్మూలింప బ్రయత్నించిరి. కాని యది దుర్లభమయ్యెను. పలుమారు పటాలముల వెనుక పటాలములు వచ్చి యగడ్త మట్టితోఁ బూడ్చి కోటగోడలపై గవిసెను గాని రసపుత్రుల బాణాసారమున హతములయ్యెను. తరువాత మ్లేచ్ఛులు లగ్గలకెగసి కోటఁ బట్ట సాహసించిరి గాని పై నుండి రాజపుత్రులు నిప్పులును మసలినచమురును, శిలలును వారిపై వైచుటచేఁ జచ్చిరి. మహమ్మదీయు లెన్ని భంగుల బ్రయత్నించినను గోటస్వాధీనము గాకుండుటజూచి చక్రవర్తి స్వసైన్యనాశనమునకు విచారింప దొడఁగెను. ముట్టడి ఫలము లేక యనేకమాసము లుండుటఁజేసి యుభయసైన్యములు విసిగి యెట్లయిన ముట్టడి నివారణమైన బాగుండునని తలఁచుచుండెను. అలాయుద్దీన్ సంధిజేసి కొనుటకు సిద్ధముగ నుండెను. గాని రసపుత్రులు ముందుగ సంధికి రారైరి. ముందుగ సంధియగుట దన కవమానకరమని చక్రవర్తి వెనుదీయుచుండెను. భీమసింగు మహారాజు భార్య యగు శ్రీ పద్మినిని జక్రవర్తి సమర్పించిన పక్షమున నాతఁడు చిత్తూరు ముట్టడి మాని స్వదేశమున కరుగుటకు సమ్మతించునని చక్రవర్తి రహిమాన్ ఖాన్ చే సందేశము నంపుటచే నభిమానధనులగు రాజపుత్రులు తమ కోపాగ్ని ప్రజ్వరిల్లి శాత్రవారణ్యమును దహింప గృతప్రతిజ్ఞులైరి. రాయబారిని వధించు పాపమని భీమసింగు చెప్పి వారింపకున్న నాదినమున ఖాను శిరస్సు వేయివ్రక్కలై యుండును. రాజపుత్రులెల్ల రోషమున జేవురించి మొగములతో భయంకరాకారులై పగదీర్చుకొనవలెనన్న యుత్సాహంతో సింహనాదముల జేసిరి. రహిమాన్ ఖాను శత్రుమండల మధ్యమున గజ గజ వడకుచు బ్రాణముల నఱచేతఁ బట్టికొని యుండెను. తరువాత వారు ఖానునంపి కవచశిరస్త్రాణములు ధరించి యుద్ధసన్నద్ధులైరి. ఈ వార్త నల్లాయుద్దీను విని మరల ముట్టడి నారంభించెను. ఉభయ సైనికులు నొండొరులపై దారుణాగ్ని వర్షముల గురియించుచుండిరి. చిత్తూరు ప్రవేశించిన కొన్ని దినములకు హేమలత చంద్రసేనునితో దనకు మదనసింగుపై గల యనురాగమును దెలిపి నాజరుజంగునకుఁ దనరాక నెఱిగింపుమని ప్రార్థించెను. అతడు హేమలత శిబిరమున నుండుట నాజరుజంగున కెరిగింప వారిరువురు నెట్లయిన నామెను మదనసింగు నొద్ద కంపుటకుపాయముల వెదకుచుండిరి. అట్టి యుద్ధ సమయమున నామె నవలి కంపుట తమకు హానికరమని యెంచి వారప్పటి కూరకుండిరి.
ఆ రాయబారము జరిగిన నాలుగు దినములకు ముట్టడి యతి తీవ్రముగనుండఁగ సాయంకాలమునందుఁ బ్రతాపసింగు గృహము నొద్దకొక బండి వచ్చి నిలచెను. ఆ బండిలో నొక ముదుసలియు బదియారేండ్ల ప్రాయముగల యొక కన్నియయుఁ గూర్చుండిరి. బండి వారిగుమ్మమువద్ద నిల్చినతోడనే ముసలిది బండిదిగి మదనసింగు గారున్నారా? యని వాకిట గూర్చున్న కృష్ణసింగు నడిగెను. మదనసిం గంతకుముందె రెండు గడియలక్రిందట నింటికి వచ్చియుండుటచేఁ గృష్ణసింగామాటవిని తలయూచి లోపలికరిగి తన యజమానుని వెంటబెట్టుకొని వచ్చెను. బండివైపు వచ్చుచున్న మదనసింగును జూచి ముసలిది యెదురుగా బోయి అయ్యా! మీ దర్శనము నిమిత్తము మీ ప్రియురాలగు హేమలత వచ్చినది. అదిగో అని మేలిముసుగు మరుగుననుండి సిగ్గుచే బండిచాటుననున్న యాసుందరిని జూపెను. ఆ మాటలువిని మదనసింగునకు బంచప్రాణములును లేచి రా సంతోషమును నివారించుకొని లోపలికి రండని యిరువురను బిలిచెను. అంతట నాబాలికను మాత్రము మదనసింగు వెంటబెట్టుకొని తనగదిలోనికి దీసికొనిపోయి కూర్చుండ నియమించి, యెట్లు పాలిగ్రామము నుండి యామె వచ్చెనో యా వృత్తాంతము నెరుగ జేయుమని యడుగ అయ్యా! నేను మిగుల శ్రమజెంది మీ నిమిత్తము వచ్చినాను. మాతాత గారు మృతినొందినారు. నేను దిక్కులేక యున్నాను. నాసంరక్షణ భారము మీదేయని యిటు వచ్చితిని అని చెప్పి కంటనీరు పెట్టుకొనసాగెను. మదనసింగామె యెడ దయార్ద్రుడయు “సుందరీ! నీకు భయములేదు. మాపినతండ్రితోడను బినతల్లితొడను జెప్పి నిన్నెట్లయిన నేను దప్పక వివాహమాడెదను. నీవు మాయింట నుండుము” అని చెప్పునప్పటికి బ్రతాపసింగు సంభ్రమముతో దెల్ల బోయి చూడసాగెను. ప్రతాపసింగు క్రొత్త విగ్రహముల జూచి “నాయనా! వీరెవరు” అనియడిగెను. మదనసింగు లజ్జావనతముఖుడై యూరకుండ ముసలిది అయ్యా! మీకుమారుని హృదయము నాకర్షించిన హేమలత యీమెయే యని యుత్తరమిచ్చెను. ప్రతాపసింగున కట్టి వివాహ మనిష్టమైననూ కుమారునికాగ్రహము కలుగునని వారిని లోనికి దీసికొనిరా నాజ్ఞాపించెను. అంతలో ముసలిదియు నావలి కరిగినందున నబ్బాలిక మోహాతిశయముచే శరీరము నెరుగక మదనసింగు సమీపమునకుఁ బోయి నేను నీదాననే నీవునన్ను వివాహమాడునట్లు నాకు వాగ్దానము చేయుము అని మదనసింగును గాఢాలింగనము జేసికొని వదలకుండెను. భయముతో మదనసింగా కౌగిలింతను వదలించుకొని సుందరీ! నీవురాచకన్నియవు. పెండ్లి గాక ముందు నన్ను గౌగలించుకొనుట తప్పు సుమీ! యని విచారించి యుత్తమక్షత్రియ కన్యయగు హేమలత కన్యాజన స్వభావమగు లజ్జను బరిత్యజించి యట్ల జేయుట కాశ్చర్యపడుచు గదివెలుపలకి వచ్చెను. అంతలో భర్తచే నంపబడిన సువర్ణపాయి తత్ప్రదేశమున కరిగి కుమారుని జూచి నవ్వుచు దనకు గోడలు కాదలచిన బాలికను సగౌరవముగ గృహమునకు వెంటబెట్టగొనిపోయెను. ముసలిదియు దనకు బంధువులున్నారని చెప్పి వెడలిపోయెను.