హేమలత/పదునెనిమిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునెనిమిదవ ప్రకరణము

పల్లకులెల్ల నియమిత ప్రదేశమున కరిగిన తరువాత వానితో గూడ వచ్చిన దుర్గసింగు చక్రవర్తి యొద్దకు జని యిట్లనియె.

“అయ్యా! పద్మినీదేవి యింక మీ పట్టపుదేవి యగును. కాఁబట్టి శాశ్వత వియోగము సంభవించుచుండుటచే దనభర్తతో నొకమాఱు మాడలాడఁ గోరుచున్నది. అందుచే నొకగడియ సెలవు దయచేయింప వలెను” అని పలుకుటయుఁ జక్రవర్తి సరేయని సెలవొసఁగెను. పిమ్మట పద్మిని పల్లకి భీమసింగు గుడారమునకుఁ గొనిపోఁబడ వారిరువురు నొక గడియవఱకును మాట్లాడుచుండిరి. కామాతురుడైన యల్లాయుద్దీను నిమిష మైనను వియోగమున కోర్వలేక పద్మినితో సత్వరముగా సంభాషింపఁదలచి భీమసింగును విడువక ఢిల్లీ నగరమునకు బందీగాఁ గొనిపోవదలచియు రహిమానుఖానును బిలిచి యా దంపతులను బట్టికొమ్మని యానతిచ్చెను. రహిమాను ఖాను నిజ సైన్యముతో నచటి కరుగునప్పటికి రాజపుత్ర స్త్రీలుండు మందిరమునుండి యొక పల్లకి వారి కెదురుగ వచ్చెను. పల్లకివెంట నాయుధ పాణులగు రసపుత్రు లనేకులుండి యందున్న వారిని రక్షించుచుండిరి.

ఎదురుగవచ్చి వారి ప్రయాణమును నివారించుటకు మ్లేచ్ఛ భటులు ప్రయత్నించిరి. కానీ రసపుత్రులు నిలువనందున వారల కిరువురకును సంకుల యుద్ధము జరుగసాగెను. అంతలో భీమసింగు పాఱిపోవుచున్నాడని మహాధ్వని యొకటి శిబిరమున వ్యాపింప రహినూనుఖాను మోసమేదో సంభవించినదని తెలిసికొని ప్రాణభయనుగునని యెంచి వడివడిఁ జక్రవర్తి వద్దకు బరుగెత్తి విచారముతో “స్వామీ! మోసము! మోసము జరిగినది” అని యఱచెను.

అల్లాయుద్దీనులికిపడి లేచి యది యెట్టిదని యడుగ ఖాను తొందరతో నిట్లు చెప్పెను. “మహాప్రభూ! పల్లకులలోఁ గూర్చుండి వచ్చినవారు స్త్రీలు కారు. ఒక్కొక్క పల్లకియం దొక రసపుత్ర శూరుఁడు కూర్చుండెను. పల్లకుల మోయువారందఱు రసపుత్ర సిపాయిలేకాని బోయలుకారు. వారు బోయలవేషముల దాల్చి పల్లకులలో సాయుధముల దెచ్చి కొన్నారు. మన సైనికు లశ్రద్ధగనున్నందున మన మీదినమున నోడిపోదుము. భీమసింగు పల్లకిలో గూర్చుండి కోటకుఁ బాఱిపోవుచున్నాఁడు. నే నాతని నాపఁజాల నైతిని” అని ఖాను విన్నవించుచుండఁ జక్రవర్తి నిశ్చేష్టితుడై కొంతసేపటి కొడలెఱిఁగి రాజపుత్రులు త్రవ్విన మహావిపత్సముద్రమునఁబడి తానును దన సైనికులును మృతినొందవలసి వచ్చెనని చింతించి ధైర్యమును దెచ్చికొని “హా మౌలా ఆల్లీ! హా ముహమ్మద్! హా హుస్సేన్! హుస్సేన్! అరే నాజరుజంగ్! అరే అరే అల్లా అల్లా అల్లా అయ్యో! పరుగెత్తి భీమసింగును దఱిమి పట్టుకొనిరండు. అయ్యో! పద్మినీ! పద్మినీ! పట్టికొండు. సిపాయిలు లేచి యుద్ధసన్నద్ధులుగండు.

ఓయీ! ఇబ్రహీం, ఓయీ! జహందర్, లెండి లెండి. అరే జోహారుల్లా త్వరపడు అని యఱవజొచ్చెను. ఈలోన మునుపటి స్థలమున దాగియున్న రాజుపుత్రశూరులు భటసమేతముగ నాలుగు వేల తొమ్మిది వందల మందియు నొక్కసారిగ హుమ్మ నివచ్చి యశ్రద్ధగనున్న మ్లేచ్ఛ సైన్యమును దాఁకిరి. అతి త్వరితముగలేచి మహమ్మదీయ సైనికులు తమ తమ ఆయుధ ముల ధరించి రసపుత్రుల నెదుర్కొన నుభయసైన్యములకును ఘోరయుద్ధం జరిగెను. ఆకస్మిక మహాయుద్ధములో మహమ్మదీయులు స్వసైన్య పరసైన్య భేదమెఱులుగఁ జాలక తమవారిని సహిత మా చీకటిలోఁ బొడిచికొనసాగిరి. ఈలోన సురక్షితముగ నగరముజేరి భీమసింగు మూలబలములనెల్ల దీసికొని దక్షిణ భాగమున మహమ్మదీయ సైన్యమును దాకెఁను. బలపడిన యీ సైన్యమునకును మ్లేచ్ఛులకును జరిగిన మహాయుద్ధము వర్ణింప దుస్సాధ్యమై యుండెను. తమ మాన ప్రాణములకు హాని తటస్థించునని శిబిరమందున్న స్త్రీ లాక్రందన ధ్వనిఁజేయ యుద్ధముమాని కొందఱు సైనికులు దారపుత్రాదుల సంరక్షణకై వెనకకు బరుగులిడుచుండిరి.

కొబ్బరి పుచ్చెలవలె దెబ్బ దెబ్బకు నెగిరిపడుచున్న మనుష్యుల పుర్రెలును స్రవించు రక్తముతో నేల గుభాలునఁబడు మొండెములును దళ తళ మెఱయు యోధుల యాయుధంబులును దక్క మఱేమియు నచ్చటఁ గనఁబడుటలేదు. రసపుత్రులును మహమ్మదీయులును హతులైన తన బంధుమిత్ర కళేబరములమీఁదనుండి నిర్దయాత్ములై నడిచిపోవుచు యుద్ధము నొనర్చుచుండిరి. పడినవారితోడను, పడెడువారితోడను, గాయములచే బాధపడి యేడ్చువారితోడను, దేహమును విడుచునెడ నీశ్వర స్మరణము జేయువారితోడను, వెన్నిచ్చి పరుగెత్తువారితోడను యుద్ధభూమి నిండి యుండెను.

ఈమధ్య మహాశూరుఁడగు ప్రతాపసింగు భీమసింగును విడిచి చక్రవర్తిని జెఱబెట్ట నుద్యమించి నాలుగువందల సైనికులను దోడుకొని యల్లాయుద్దీను గుడారముపై నరిగెను. చక్రవర్తిమీదికి రాజపుత్రులరుగుట జూచి స్వామి ప్రాణరక్షణ మవశ్యము కర్తవ్యమని మహమ్మదీయులెల్ల వడి వడిఁ బ్రతాపసింగు నాపుటకు వ్యాఘ్రములవలె రోషావేశ పరవశులై చని ప్రతాపసింగు దాఁకిరి. ప్రతాపసింగు మధ్యాహ్న సూర్యునివలె దుర్నిరీక్ష్య ప్రతాపుడై మహమ్మదీయ భటులకు భీతిగొలుపుచుండెను. మహమ్మదీయులు రసపుత్రులమీదికి వచ్చుటయుఁ జచ్చుటయు నేకకాలమున సంభవించెను. ఎందఱు తురకలను రసపుత్రులు చంపినను దురకలసేన యధికమగుటచే మరల యధా ప్రకారముగ సైనికులు ముందుకుఁ జనుచుండిరి. తుదకు జీమలపుట్టవలె మోటతురకలు చుట్టుముట్టుటచే స్వల్పసంఖ్యగల రాజపుతులు క్రమ క్రమమున క్షీణించిరి.

ఏమి చిత్రమోకాని రాజపుత్ర సైనికులలో నొక్కడైనను రణరంగమును విడిచి పరుగెత్తడయ్యె. కంఠమునఁ బ్రాణమున్నంతవఱకును రసపుత్రులు ఖడ్గమును విడువక యుద్దము జేసిరిగాని శత్రువుని చేతికిఁ గత్తి నీయరైరి. ఇట్లు సైన్యము పలుచబడినందునఁ బ్రకాతసింగు ఖడ్గమును డాలునుబూని యకాల మృత్యుదేవతవలెఁ దురకల పైబడి యనేకులను దెగనరక నాతని ధాటికి వెఱచి ముందటివారు చెల్లాచెదరై పరుగులిడిరి. తపవాత నలువది యోధులతో రణరంగమున నిలిచియున్న ప్రతాపసింగుపై వెనుక నున్న తురకలు గవిసిరి. ప్రజాపసింగు దేహమంతయు గాయములతో నిండి చిమ్మన గొట్టములనుండి వచ్చు వసంతమట్లు గాయములనుండి రక్తము స్రవించి చుట్టు పక్కల నున్నవారిపై బడుచుండెను. రక్త క్షయముచే, బలక్షయమగుటయు సింగు నడుమ నడుము సొమ్మసిల్లుచు దెబ్బ దెబ్బకు నొక్కొక్క తురకను గూల్చుచుండెను. ఆవేళ బ్రతాపసింగుచే నిహతులైనవారు దాదాపుగ నూరుమంది యుండిరి. బలహీనుడైయున్న ప్రతాపసింగుమీదికి రహిమానుఖాను వడివడి వచ్చి తాఁక సింగు గుఱ్ఱముమీదనున్న ఖానును దిగలాగి తన ఖడ్గమాతనిపై నెత్తెను. అప్పుడు మ్లేచ్ఛ సేనాధిపతియగు రహిమానుఖాను ప్రతాపసింగు పాదముల పైఁబడి “నేను నీ బిడ్డవంటి వాడను, నన్ను జంపినను మీ యింటి కుక్కను జంపఁజూచినను నొకటే బాబూ! నాకుఁ బ్రాణ దానము సేయుము. నాతల్లికి నేనొక్కడనే కుమారుడను. నాకు బిడ్డలు పుట్టిన మీ పేరు పెట్టెదను. నన్ను వదలి పెట్టు మహాప్రభూ! నన్ను వదలిపెట్టినయెడల మా చక్రవర్తియున్న రహస్య స్థలమును మీకుఁ జూపెదను. అతనిని మీరు చంపి మీ కసిదీర్చుకొనవచ్చునుగాని నావంటి దిక్కుమాలినవానిని జంపిన నేమి ప్రయోజనము” అని వీరపురుష లక్షణముల విడిచి పరిపరి భంగుల వేడికొన జాలి గుండెగల ప్రతాపసింగు వానిని విడిచిపుచ్చెను.

రహిమాను గండమునుండి బయలుపడి మఱి యితర యోధుఁడు కనబడకుండ గొంత సేపు చచ్చినయేనుఁగు చాటున దాగికొని యక్కడనుండి లేచి రాజపుత్రు లెక్కివచ్చిన పల్లకులలో నొకదానియందు రహస్యముగ దలఁదాచికొనెను. అదివఱకు జెఱలో నుండిన మదనసింగు మహమ్మదీయుల కలకలముజూచి చక్రవర్తి తన్ను విడిపింపడని యెఱిఁగి యాతనిచే మోసపోక ముందే మేలుకొని తన గుడారమునుండి వెడలివచ్చి రసపుత్ర వీరులను గలసికొనెను. భీమసింగు వానిని గనుఁగొని కొంత సైన్య మాతనికిచ్చి ప్రతాపసింగునకు సహాయ మొనర్పుమని యంప నాతడును సత్వరముగఁ జక్రవర్తి గుడారమువంక వచ్చి ప్రాణావశిష్టుఁడై యప్పటికిని దన ప్రాణ రక్షణ మొనర్చికొనుచున్న పినతండ్రిని జూచెను. మదనసింగు పినతండ్రి యవస్థను గనుఁగొని యతని శరీరమును బరీక్షించునప్పటికిఁ బ్రతాపుని దేహమున ముప్పది రెండు పెద్దగాయములును నెనిమిది చిన్న గాయములు నుండెను.

మదనసింగు పినతండ్రితో “అయ్యా! మీరు మనశిబిరమునకరుగుడు. మీరింక యుద్ధ మొనర్పలేరు. వ్రణ వైద్యులచే గాయములకుఁ గట్టుకట్టింపుఁడు” అని చెప్ప బ్రతాపుడు “నాయనా! రణమునుండి యింటికి మరణ భయమున నీవఱకు నేనరుగలేదు. నేనింక బోఁజాలను, రక్తవర్షముచే దడిసిన యీ మంటి పరుపుపై బండు కొనియెద. నీవు చక్రవర్తిమీది కరిగి వానిని బట్టుము, లేకున్న వధింపుము. నా నిమిత్తమై విచారింపకుము” అని పలికెను.

మదనసింగు విచారముతోఁ బినతండ్రి ప్రాణముల కాశవదలుకొని చక్రవర్తిమీఁది కరిగెను. చక్రవర్తి యంగరక్షక సైన్యములతో నొక చిన్న గుడారమునుండి సైన్యము పలాయన మగుటకును రాజపుత్రులు చేసిన యుక్తికిని విచారించుచు బ్రాణ సంరక్షణ మొనర్చుకొనుచుండెను, మదనసింగును జూచి యంగరక్షకులు నిశ్చేష్టితలుగా నతడు శత్రుమధ్యమునకుఱికి యాకస్మికముగ సింగపుఁగొదమవలె జక్రవర్తి యెదుట నిలిచి యాయుధ మెత్తులోనఁ జక్రవర్తి సమీపమునసున్న నాజరజంగు వారిరువురకు నడుము వచ్చి నిలిచి ఖడ్గమును త్రిప్పుచు నాతని దాకెను. నాజరుజంగు సమయము నకు రాకుండిన జక్రవర్తి యా దినమునఁ బరలోక వాసియై యుండును. చక్రవర్తి మదనసింగును జూచి నిర్విణ్ణుడై చేష్టలుదక్కి కదలి పాఱిపోజాల డయ్యెను. అప్పుడు నాజరుజంగు మదనసింగునితో నిట్లనియె.

“మిత్రుడా! నాఁటికి నేఁడు నీ దర్శనమైనదని నేనూరకుండను. నా ప్రాణములుండినంత వఱకు నీవు చక్రవర్తిపై పఱగజాలవు. అక్కడనే నిలువుము. ఒక్క యడుగు దాటివచ్చితివా నీ ప్రాణములు నీకు దక్కవు. మా స్వామి ప్రాణరక్షముకంటె నారక్షణ మెక్కువకాదు” అని శౌర్యరసమొల్కు రాజభక్తి ప్రపూరము లగుమాటలతో మదనసింగును నిలుప, నత డాశ్చర్యపడి, చక్రవర్తి యదృష్టవంతుడగుటచే నీవాతనికి నేఁ డడ్డము వచ్చినావు. నీతో యుద్ధము చేసి గెలిచి చక్రవర్తిని బరిమార్చెదను అని పలికి యాతనితో యుద్ధమారంభించెను. అట్లిరువురును గొంత సేపు యుద్ధము సలిపి యెవ్వరును గెలువనందున విసుగుచుండిరి. అంతలో యుద్ధమాఁపి వేయుమని భీమసింగు ఉత్తరువుజేయ మదనసింగు మరలెను.

ఆ దినమున రాజపుత్రవీరు లనేకులు మృతినొందినను దుదకు మహమ్మదీయులు చెల్లాచెదరై నానాముఖములకు బాఱిపోయిరి. ఈ నడుమ మన చిదానందయోగి కాగడాలను వేయించుకొనివచ్చి నూరుగురు భటులతో రంగస్థలము జొచ్చి తురకల గడ్డములను దివిటీలతో గాల్చుచు వారి వస్త్రములను శరీరములను దహన మొనర్చుచు జిత్రవిచిత్రముగ వారిని జంపనారంభించెను. మహమ్మదీయు లప్పటికి నిశ్శేషముగ నోడింపబడిరి. సరదారులు, చచ్చిన గుఱ్ఱము లొక వైపరుగ నేనుగులు మఱియొక వంకకు జనసాగెను. స్త్రీ లార్తనాదములతో నటు నిటు బరువులిడ మ్లేచ్ఛ సైన్యమున గలవలమును బాధయు నధికమయ్యెను. ఎచట జాచిన ఏనుగులు, నెచట గనుగొన్న రక్తప్రవాహములు, నెందు నడచిన నెముకలు, నేమివిన్న నార్త ధ్వనులు నయ్యెను.

అట్లున్న రంగస్థలమున మృత్యుదేవత విచ్చలవిడిగా సంచరించు చున్నట్లు, మహాభయంకరమై యుండెను. రాత్రి రెండు జాములకు సైనికులు శిబిరమునువిడిచి, పాఱిరి. రసపుత్రులు తెల్లవాఱు వఱకు నుండిరి.