హేమలత/పందొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పందొమ్మిదవ ప్రకరణము

ఇట్లు సమస్తసైన్యమును శత్రువులచే వధింపఁబడుటయుఁ దనకపారకష్టము సంభవించుటయుఁ బద్మినీ దేవి చేకూరకుండుటయుఁజూచి చక్రవర్తి రణరంగము విడిచి సత్వరముగ భద్రగజముపై నెక్కి తన కాపత్కాలమున సహాయ మొనర్చిన నాజరుజంగును వేనోళ్ళ నుతియించుచు నాతనిఁగూడ నేనుఁగుపై నెక్కించుకొని దీనుండయి ఢిల్లీ నగరమునకుఁ బ్రయాణమయ్యెను. శిబిరముననుసరించి వచ్చిన స్త్రీజనమెల్ల నాక్రందన ధ్వనులతోఁ బరుగెత్తనారంభించినపుడు వారివారి భర్తలు వారికి సహాయముగఁబోయి వారి కపాయము వాటిల్లకుండఁగఁ జేసిరి. చంద్రసేనుఁడు యుద్ధము జరుగుచున్నంత వఱకును రంగస్థలమును బాసిచనక చక్రవర్తి సైన్యములు పఱచిన వెనుక జయాశవీడి శిబిరమునకుఁ జని భార్యను గనుఁ గొని హేమలతతో గూడ బ్రయాణమై వెడలుమని యానతిచ్చెను. హేమలత వారి గుడారమున లేదని భార్యయెఱిఁగింపఁ గొంతసేపు చంద్రసేనుఁడు బాలిక కొఱకు వెదకి యామెను గన లేత తుదకు విసిగి హేమలతను మహమ్మదీయులో, శత్రువులలో నెవరో తీసికొని పోయి యుందురని నిశ్చయించి కొంచెము విచారించి తనరాజు వెంటఁ దానరిగెను. మదనసింగు పినతండ్రియవస్థ యెట్లున్నదో యని త్వరితగతి నావంకకు వచ్చెనుగాని యానడుమనే భీమసింగు ప్రతాపసింగు నిమిత్తము మనుష్యుల నంపి వెదకి యాతనిఁ దోడ్కొని రమ్మని వారికానతిచ్చినందునఁ గాయము నిండ గాయములతో నున్న యమ్మహాశూరశిఖామణిని వారు భీమసింగుగారి దగ్గఱకుఁ దీసికొనివచ్చిరి. భీమసింగును వానిస్థితిని బట్టి యతఁడు జీవించుట దుర్ఘటమని యెంచినను బ్రాణములున్నంతవఱకు మనుష్య ప్రయత్నములు మానుట యనుచితమగుటచే వ్రణవైద్యునికాతని నప్పగించి, తమ మందిరమునకుఁ గొనిపోవ నియమించెను. పినతండ్రి భీమసింగు నొద్ద సురక్షితుడై యున్న వార్త మదనసింగు విని గాయములు తగిలి ప్రాణములతో యుద్ధ భూమిని బడియున్న తన యాప్తులగు రసపుత్రుల కౌషధ మిప్పించి బ్రదికింపదలఁచి కొందఱు రాజపుత్రులతో యుద్ధ భూమిని సంచరించు చుండెను. రహిమానుఖాను ప్రాణభీతిచే ఖడ్గమును దాఁచి యంతఃపుర స్త్రీవలె నొక పల్లకిలో యుద్ధము ముగియు వఱకుఁ గూర్చుండి తమ సైన్యమును శత్రు సైన్యమును యుద్ధభూమిని విడిచిన తరువాత బల్లకీ తలుపులు తెఱచి బైటకు వచ్చి మెల్లగా నడుచుచుండెను. అతడట్లు పోవుచుండ నతని యదృష్టహీనతచే మార్గమున మదనసింగెదురు పడెను. అతని జూచిన తోడనే ఖానుసాహెబుగారు మీది ప్రాణములు మీదనై పోవ జీవచ్ఛవమువలె నిలువబడి తనకు మరణ మతనిచే దప్పదని శూరుని చావుచచ్చుట కిష్టముగలుగ ఖడ్గమును జేతబట్టుకొని మదనసింగుపై బడ వరిగెను. మదనసింగతని యేటు దప్పించుకొని మ్లేచ్ఛ సేనానాయకుడుక్కు దక్కి నేల వ్రాలునట్లొక దెబ్బకొట్టెను. బాటసారులను దోపించిన పాతకమును స్త్రీలను జెఱబెట్టిన దోషమును నిరపరాధులపై జక్రవర్తి కాగ్రహము గలిగించిన క్రౌర్యమును వాని కా సమయమున జ్ఞప్తికి రా నతడు మనః క్లేశమునొంది తుదకు మహమ్మదువారిని సర్వేశ్వరుడైన యల్లాను దలచికొన మక్కావైపు మొగముద్రిప్పి ప్రాణమువిడిచి కొనెను. తనమిత్రులకు మందు మాకు లిప్పించి తగినవారి సుపచారమునకు నియమించి మదనసింగు ప్రొద్దు జూచి రెండు జాము లైనదని తెలిసికొని గృహాభిముఖుడై యరుగుచుండ నతని వెనుక నొక మనుష్య విగ్రహము వచ్చి వీపుపైఁ జేయివైచి యాకస్మికముగ నతని నాపెను. మదనసింగులికిపడి తిరిగి చూచి తన యెదుటఁ బదియాఱువత్సరముల ప్రాయముగల యొక బాలకునిఁ జూచి యాశ్చర్యపడి నీవెవ్వడ వని యడిగెను. నా పేరు కుమారసింగు. నేను రాజపుత్రుఁడను అని యాతఁడుత్తరమిచ్చెను. అంతట వారిట్లు మాటాడిరి.

మద – నీవీరాత్రి యెందుండి యిటు వచ్చు చున్నావు? నీ చరిత్రమును గొంత చెప్పుము.

కుమా – అయ్యా! నేనీవఱకు జక్రవర్తి కొలువున నుంటిని. పాలిగ్రామమున నున్న నారాయణసింగు మాతాత. హేమలత నా చెల్లెలు. మేము చాలాకాలము క్రిందట వియోగము నొందినాము. మాతండ్రి నా చిన్నతనమునందే మృతినొందెను.

మద – అహాహా! నీమాట లాశ్చర్యమును గల్గించుచున్నవి. హేమలతకు నన్న యుండుట నేనిప్పుడు విన్నాను. ఆహా! నీ మొగ మచ్చముగ నామె మొగమువలెనే యున్నది. హేమలత యిప్పుడెందున్నది? ఆమెనుజూచి చాలాకాలమైనది, మీ తాత యేమయ్యెను?

కుమా – మా హేమలతా? ఆమెయు నీ శిబిరముతో వచ్చినది, కాని యీ యల్లరిలో నెటకో పోయి యుండును. ఆమె దొరకుట దుర్లభమని నాకు దోచుచున్నది. మద – అయ్యో! నాకాసంగతి తెలియదయ్యెను. నేనేమి చేయుదును? నాకామె దొరకు టెట్లు! దైవము నాయెడ నిర్దయుడై యున్నాడు.

కుమా – నీ కామెయం దంత ప్రేమ యేల? నీ వామెను వివాహ మాడెదవా యేమి? నీకామెపై ననురాగ మున్నట్టు లామెకు నీపై నుండునా?

మద – నీవాలాగున ననబోకుము. ఆమెకు నాయందనురాగమున్నది. ఆమె యెందున్నదో నేనెఱుగగోరు చున్నాను. దయచేసి నీవు చెప్పుము. ఆమె నిజముగ నీశిబిరముతో వచ్చినదా అట్లయిన నామె కొఱకు వెదకుదము నాతోరమ్ము.

అని మదనసిం గాత్రముతో నడుగ గుమారసింగు మందహాసముతో “నీవు తొందరపడకుము. తెల్లవారినదాక నోపిక పట్టుము” అని చెప్పి పాలిగ్రామమున రహిమానుఖాను హేమలత విషయమున జరిగించిన దౌర్జన్యమును, నారాయణసింగును జెఱసాల కంపుటయు, హేమలత గోసాయీ దయవలన కుల్వానగరమున శివప్రసాదు నింట నుండుటయు, మాయోపాయమున నామెను రహిమానుఖాను ఢిల్లీకి దీసి కొనిపోయి బలాత్కరింపజూచుటయు జంద్రసేనుని దయవలన బాధా విముక్తినొంది యామె చక్రవర్తి శిబిరముతో వచ్చుటయు నాదిగా గల పూర్వ వృత్తాంతము నెఱిగించెను. రహిమాను ఖాను చేసిన దౌర్జన్యమును విని సింగు మిగుల విచారమునొంది హేమలతపై జాలియుననురాగము నెక్కువకాగా నామెను జూపు మని కుమారసింగును వేగిరిపెట్టెను కాని యత డేమియు జెప్పక నన్ను నీ వేవిషయమునను బ్రశ్నలు వైచి బాధ పెట్టకుము. ఱేపు నా సంగతి చెప్పి మా చెల్లెలి సంగతి గూడ బయలు పఱచెదను, అని పలుక మదనసింగూర కుండెను. అతనిమనమున నాందోళన మధికమయ్యెను. వారి రువురును గొంత సేపు నడచి నగరమును సమీపించునప్పుడు వారికి జిదానంద యోగి కనబడెను. యోగిని జూచి కుమారసింగు వినయముతో నమస్కరించి చేతులు జోడించి నిలువ యోగి వాని నాశీర్వదించి యానవాలు పట్టి తన బసకు రమ్మని బలవంతము చేసెను. కుమారసింగు మదనసింగు వొద్ద సెలవుగై కొని యారాత్రి యోగితో నరిగెను, మదనసింగుమాత్రము కుమారసింగు మాటలయం దర్థము నరయుచు నాతని ముఖవిలాసమునం దొకయాకర్షణముండుటచే ధ్యాన్య మావైపుంచి యింటి కరిగెను. కుమార సింగారాత్రి చిదానందయోగి మఠమున భుజియించి సుఖముగా నిద్రించెను. మదనసింగింటి కరుగునప్పటికిఁ గృష్ణసింగు రోదనముచేయుచు బ్రతాపసింగు గాయములచే మరణావశిష్టుడై రాజమందిరమున నుండెననియు, సువర్ణ బాయి యటకరిగెననియు జెప్పి యాతని నటకు బొమ్మనెను. ఆ మాటలు విని మదనసింగు దుఃఖభారముచే నడువజాలక కన్నీళ్ళు విడుచుచు మెల్లమెల్లగా రాజాంతఃపురము బ్రవేశించెను. భీమసింగు, మహారాణాలక్ష్మణసింగు, గోరా సింగు మొదలగు వారందఱు మదనసింగున కెదురు వచ్చి శత్రుజయమున కాతని బహుకరించి పినతండ్రి యొద్దకు దోడ్కొని పోయిరి. జయ సంతోషమును బితృమరణదుఃఖమును నేక కాలమున సింగుహృదయమున జనియింప నాతఁడు లోపలి కరిగి గాయములచే బాధపడుచు ధైర్యమును విడువ పినతండ్రినిం జూచి దుఃఖమును బట్టజాలక యాతనిపై బడి యేడ్వ నారంభించెను. సువర్ణబాయి కుమారుని గౌగిలించికొని నాయనగారు పోవుచున్నారు తండ్రీ! యని రోదన మారంభించెను. అంతట మదనసింగు ప్రతాపసింగు మొగము మీద మొగముబెట్టుకొని “కక్కా, నేను దల్లిదండ్రుల నెఱుగను. నీవేనన్ను గారాబముతో దండ్రి లేని లోపము కనఁబడకుండఁ బెంచినావు. అయ్యో! నన్ను విడిచిపోయెదవా! నాకెవరు దిక్కు? నే నింక నెట్లు జీవింతును?” అని వాపోవఁదొడఁగెను. శౌర్యరాశియగు ప్రతాపసింగు వానిని వారించి “నాయనా! నీవు రాజపుత్రుఁడ వగుదువా, కావా? మరణ మెన్నడయిన దప్పదుగద. నేను వీరపురుషోచితి మగు మరణము నొందుచుచున్నాను. దేశస్వాతంత్ర్యమునకు బోరాడి మృతినొందుచున్న నన్ను గూర్చి సంతోషించుటకు మాఱు దుఃఖించెద వేల? నీవు రాజభక్తి గలిగి జాగ్రత్తగ నుండుము.” అని యోదార్చి భీమసింగును మహారాణాలక్ష్మణసింగును బిలిచి మదనసింగును జూపి “అయ్యా! నాకును మాయన్నయగు మాధవసింగునకు నితఁడే కుమారుఁడు. ఈతని మీ కుమారునిగ నెంచికొని లోపములను క్షమియించి రక్షించి కొనుడు” అని చేతిలో జేయి వైచి యప్పగించెను. ఇంతలో బ్రతాపసింగున కాయాసము రాఁగా నందఱును రామ రామ యనుచు హరినామస్మరణ మొనర్చిరి. అప్పుడు భగవద్ధ్యానముతోఁ బ్రతాపసింగు లోకాంతరమున కరిగెను. తరువాత నమిత గౌరవముతో నూరేగించి ప్రతాపునకు భీమసింగు దహనసంస్కారములు జేయించెను. మదనసింగు పినతండ్రి కుత్తరక్రియలు చేసి పితృ ఋణమును దీర్చికొని పిత్రవియోగమునకు హేమలతా వియోగముతోడ్పడ జింతిల్లుచుండ సువర్ణ బాయియెఱిగి కుమారునిజూచి “నాయనా! నీవింక వివాహమాడి యిల్లు నిలువబెట్టి కొమ్ము. నీ మనో నాయకి యగు హేమలత యున్నచో నామెను జేకొనుము” అని పలుక నామాట అమృత సేచనమట్లు మదనసింగున కపార సౌఖ్యమును గలిగించెను, కాని హేమలత యెందును గాన రానందున నతఁడు దీర్ఘ విచారమగ్నుఁడయి యానాడుదయమున చిదానంద యోగి మఠమున కరిగెను. కుమారసింగా తొలినాడే మఠమును బాసి చనినట్టు చిదానంద యోగి యెఱిఁగింప మదన సింగు హేమలత జాడలు తెలియనందులకు విచారించుచు నింటికి వచ్చుచుండెను. అప్పుడు రాజవీధిలో నొకపల్లకి యాతని కంటబడెను. ఆ పల్లకి వెంటవచ్చుచున్న యేఁబది వత్సరముల ప్రాయముగల యొకతురక మదనసింగును “మదనసింగుగారూ! నిలువుఁడీ” యని పిలువ నతఁడును నిలిచిచూచి యామనుష్యు నానవాలు పట్టి పేరు స్ఫురణకు రానందున జ్ఞప్తికిఁ దెచ్చికొను చుండెను. అంతట నాతురక సింగుతో “అయ్యా! మీరు నన్ను గుర్తింపఁ జాలరు. నాది పారీ గ్రామము, నా పేరబ్దుల్ ఖరీము మౌలవి. పల్లకిలో నున్న యతఁడు ముసలినారాయణసింగు. ఇతనిని మీరాదరింపుఁడు అన సంతోషముతోఁ బల్లకినింటికిఁ దోడ్కొని పోయి నారాయణసింగును సగౌరవమున నాదరించి హేమలత కై యాతడు వెదకుటవిని చిత్తూరునందామె లేదని చెప్పి “మీరు పాలిగ్రామమునుండి యిటకెట్లు వచ్చిరో మాకుఁ దెలియఁ జేయుఁడి” యని మదనసింగడిగెను. రహిమానుఖాను దౌర్జన్యమును, దాను జెఱసాలయందుండుటయు, రహమానునకు బదులుగ వచ్చినవాఁడు తన్ను హింసించుటయు, వేటకుఁబోయినప్పుడొక వ్యాఘ్రము వానిపైఁ బడి వధించుటయు, గ్రామస్థులు తన్ను విడిపించి హేమలతను వెదకించి యెందును గానకుండుటయుఁ జెప్పి యామె చిత్తూరు నందున్నదేమో యని మోలవిని సహాయములఁదీసికొని నేనిటకు వచ్చినాఁడను. ఈతని దయవలన నేనాపద నుండి బయట బడితిని. అన్యమతస్థుఁడైనను నీతఁడు నాకొనర్చిన యుపకారమునకు నే నీతని బుణము నెన్ని జన్మలకైనను దీర్పఁజాలను. మా హేమలత యెందును లేదని మీరనుచున్నారుగద. అయ్యో! నేనేమి చేయుదును? ఆమె యిక్కడనుండునని గంపంతయాశతో వచ్చినాఁడను. ఇంక నే మృతినొందుట మేలుగాని జీవించుట మేలుగాదు. ఈ మౌలని నన్ను నమ్ముకొని చక్రవర్తి రాజ్యమును బాసి చిత్తూరునఁ గాపుర ముండ నిశ్చయించుకొని వచ్చినాఁడు. నే నొకవేళ మృతినొందినను నీవీ మౌలవి సాహెబున కుపకారము జేసి యిక్కడనుండునట్లు జేయుము. అని చెప్పు నారాయణసింగు పలుకులు విని మదనసిం గబ్దుల్ ఖరీమున కభయ మిచ్చి హేమలతను వెదకించు చుండెను,