Jump to content

హేమలత/పదియేడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదియేడవ ప్రకరణము

హా! దైవమా! నన్నింత దిక్కుమాలినదానిగ నేలజేసితివి? ఆ పవిత్రమగునట్టియు గౌరవమగునట్టియు రాజపుత్రవంశమునబుట్టి తుదకు నిర్భాగ్యురాలయి శివప్రసాదుపంచను గొన్ని నాళ్ళును, జంద్రసేనుని యింట గొన్ని నాళ్ళును వసియించి మహమ్మదీయుల బారిబడుచున్నాను. నాకేల మరణములుగలుగజేయవు? హా తాతా! ఎందున్నావు? అయ్యోతల్లీ నా బాల్యముననందె నీవు మృతినొందుటచేతగది నాకిట్టి యవస్థసంభవించినది, కడుపులో నున్న దుఃఖము నెల్ల దెలుపుకొందమన్న నిరుపార్శ్వముల బంధువులైన లేదు. నేనేమి చేయుదును? మరణమేనాకు శరణ మగుగాక! బలవంతముగా జక్రవర్తిచే నవమానింప బడుటకంటె మర్యాదగ మృతినొందుట మేలుగదా. అని తనలో దాననుకొనుచున్న హేమలత వద్దకు జంద్రసేనుడువచ్చి యామె గౌరవమును గాపాడలేనందులకు విచారించుచు అమ్మా! యీ దినమున నిన్నుదప్పక తీసికొనిరావలసినదని చక్రవర్తి మరల నాకు వర్తమానమునంపినాడు. ఈమాట నీతో జెప్పజాలక నేను సందేహించుచున్నాను. ఏమిచేయుటకును దోచదు. అయినను నా ప్రాణముల నిమిత్తము పోగొట్టు కొందును. నా మరణాంతముగాని నీకు బరాభవము సంభవింపదు. భయపడకుము” అని పలుక హేమలత యామాటలు విని ‘నా నిమిత్తము మీరు మృతినొందవలదు. నాకవమానము ఘటిల్లెడు పక్షమున నాచేతినున్న వజ్రమును నూఱుకొని త్రాగుటకు సిద్ధముగనున్నాను. నా వజ్రపుటుంగరమ నా యవమానమును బాపనోపును. ఆ చెఱలో నీవఱకు మృతినొందియున్న మాతాతను సత్వరమే నేను కలిసికొందును.’ అని యాత్మహత్యకు సిద్ధముగ నున్న సుందరాంగికి బ్రత్యుత్తరమీయజాలక మరల నొకపర్యాయము నీ విషయమై ప్రయత్నించెదనని చంద్రసేనుడు కన్నీళ్ళతో వెడలిపోయెను. హేమలత ప్రతిక్షణమును తనకొఱకు బల్లకివచ్చుననియెంచుచు మృత్యుదేవత రాక కెదురుచూచుచుండెను.

ఆ దిన ముదయమైనది మొదలు రహిమానుఖాను మదనసింగును దుదముట్టించు మహోత్సవముగలుగునని మహానందముతో నుండెను. హేమలత తన సంయోగమునకు సమ్మతింపనందున నామెపై గసిదీర్చుకొన దలంచి చక్రవర్తి కామెనెరింగించెను. ఆ కారణముచే నతడు రెండు రెట్లు సంతోషముగ నుండెననుటకు సందేహము లేదు. జాము ప్రొద్దెక్కిన తరువాత మదనసింగును బూర్వోక్త ప్రకారముగ వధింప వలదని చక్రవర్తి యొద్దనుండి ఖాన్ న కుత్తరవు వచ్చెను. వెంటనే ఖాను మిగుల నెఱ్ఱగ గాలిన యినుపకర్రులను బట్టించుకొని యిరువురు సేవకులతో మదనసింగు వసియించు గుడారమునకు బోయి మదనసింగును జూచి మరణమునకు సిద్ధముగ నుండుమని చెప్ప ఖాన్ తో నతడు దనకు మృత్యువు తృణపాయ మనియు దాను సిద్ధముగ నుండెననియు ధైర్యగాంభీర్యముల బలికెను. అంతటఖాన్ కోపమున బండ్లు పటపట గొఱకుచు నినుపకర్రలను మదనసింగు కన్నుల పై బెట్టి కాల్పుడని సేవకుల కానతిచ్చెను. సేవకులును నరహత్యయం దారి తేరిన వారగుటచే యజమానుల యాజ్ఞ తక్షణమే శిరసావహించి కాలిన యినుప కర్రుల నెత్తి పట్టుకొని మదనసింగు సమీపమున కరిగిరి. వెంటనే నందుడు సింగును వెనుకకు బడద్రోయ తక్షణమే యిరువురు సేవకులు మదనసింగు రెండుచేతుల నొక త్రాట విఱచికట్టి పాదముల బొటనవేళ్ళను గూడబంధించిరి. అప్పుడు మదనసింగు మనస్సున నీశ్వర ధ్యాన మొనర్చు చుండెను. “ఇపుడైన జక్రవర్తి మాట విందువేని నిన్ను రక్షించెదను, అట్లు చేసెదవా? యని రహిమాన్ ఖాన్ నడుగ నిర్భయముగనతడు నేనట్లు చేయను. నీ యిష్టము వచ్చినట్లు చేయుము అని యుత్తరమిచ్చెను. అపుడు వారినుపకర్రను గన్నుల దగ్గఱకు దెచ్చునప్పటికి వెనుక నుండి యొక సేవకుడఱచుచు వచ్చి నిలువుడు! నిలువుడు చంపవద్దని కేక వైచెను. ఆ మాటలు విని రహిమాన్ ఖాన్ తిరిగిచూచి యామనుష్యు డెవ్వడని యఱచుచుండ నతడొక సాహేబుతో వధ నాపలసినదనియు జక్రవర్తి ఖాన్ ను రమ్మనియెను. అని చెప్పెను. ఆ ఘోరకృత్యము నాపి ఖాను మదనసింగు బంధములను విప్పించి చక్రవర్తి గుడారమున కరిగెను. చక్రవర్తి యెదుట రసపుత్రుడొకడు కూర్చుండెను. ఖాన్ ను జూచినతోడనే చక్రవర్తి రసపుత్రుని వంక దిరిగి రాయబారము విశదీకరింపుమని కోరెను. రాయబారములు నడుపుటయందు మిగుల నేర్పుగల దుర్గసింగు చక్రవర్తితో నిట్లనియె. “అయ్యా! నారాయణుయు శ్రీపద్మనీ దేవియు విన్నవింపుమన్న సంగతులను నేను మీతో మనవి చేయుచున్నాను. భీమసింగును మీరు చెఱనుండి విడిపింతురేని పద్మినీదేవి మీ భార్యయై యుండుట కొప్పుకొన్నది. భర్త ప్రాణరక్షణమునకును, దనకాయమునైన సమర్పింపదలచి పద్మిని మీ సాంగత్యమునకు సమ్మతించినది అని దుర్గసింగు విన్నవింప జక్రవర్తి యమితానంద పరవశుడై యఱచి పీఠమునుండి లేచి రహిమాన్ ఖాన్ ని గౌగలించుకొని దుర్గసింగును మెచ్చికొనెనును. అంతట దుర్గసింగు మరల “ఆ పద్మినితో గూఁడ మానగరమునందు గల గొప్ప స్త్రీలందఱ నిటకు వచ్చి సాగనంపెదరు. వారేడు వందలకంటే నెక్కువ గనున్నారు. అందఱు బల్లకీలలో నెక్కివత్తురు. వారు ఘోషాస్త్రీలుకాఁబట్టి వారికి బ్రత్యేకముగ నొకగుడారమునిచ్చి మహమ్మదీయుల దృష్టి బడకుండ మీరు జాగ్రత్త పెట్టవలెను. అనవుడు చక్రవర్తి సందేహమెందుకు? మిగుల జాగ్రత పెట్టెదను. త్వరగా రమ్మను త్వరగా రమ్మను. పో పో యని కేకలు వేయసాగెను. ఇట్లు చెప్పి దుర్గసింగు చక్రవర్తి వీడుకొని పోవునపుడు చక్రవర్తి రసపుత్రునకు దన కంఠమున నున్నహారమును బహుమానముగ నొసగెను. ఈ రాజపుత్రు డరిగినది మొదలు చక్రవర్తి బద్మినిపై ధ్యానమెక్కువగుటచే నతడు తీవ్రముగ మదనాగ్ని పాలయ్యెను. ఒకమారు సంతోషముచే వెర్రి వానివలె నఱచుచు, నొక పర్యాయము సేవకులకు బహుమానము లిచ్చుచు నొకమారు తోచక గుఱ్ఱముపై సవారి చేయుచు మదనావస్థ నొందుచుండెను. పద్మిని ప్రముఖులగు రాజపుత్ర సుందరు లబలగుటచే నాయుధపాణులగు భటులను జూచి భయపడుచుందురని చక్రవర్తి నిరాయుధులై యుండునట్లు సైనికుల కానతివచ్చెను. వారును నాయుధములను వదలి బంగు నిషాచేయ హాయిగ నిద్రపోవుచుండిరి. మదన పీడితుడగు నతనికి నెంతసేపటికి బ్రొద్దువోనందున దన ఖాజీని రహిమాన్ ఖానుని రప్పించి వారితో గొంతసేపు దనకు రాబోవు నూతనభార్యను గూర్చి పరిపరివిధముల ముచ్చటించుచుండెను. అట్లు కొంతసేపు ముచ్చటించి తన పెండ్లి నిశ్చయమని యెంచి తాను శయనించు మందిరమును జక్కగ నలంకరింప నాజ్ఞాపించి యమూల్య వస్త్రాభరణములను ధరించెను. దుర్గసింగు దెచ్చిన రాయబారమును వినియుండుటచే జక్రవర్తి హేమలత మాట మఱచియుండ మధ్యాహ్నము చంద్రసేనుడే ప్రభుదర్శనమునకు వచ్చి పద్మిని రాకను జక్రవర్తి ముఖమున విని యిదియె హేమలత నపాయము నుండి రక్షించుట కదనని యెంచి చక్రవర్తితో నిట్లనియె. “మహాప్రభూ! హేమలతను దీసికొని వత్తునా, వద్దా? ఆమె మీయొద్ద నుండిన యెడల మీకొక నష్టము సంభవించును. హేమలతయు బద్మినియు సవతులై యుండుటకు మహారాజపత్నియగు పద్మిని యొల్లదు. ఆమె యిందు కాగ్రహము దెచ్చుకొని మరలిపోవు నేమోయని నాకు భయమగుచున్నది. అని చంద్రసేనుడన జక్రవర్తి హేమలత తన కావశ్యము లేదని వాక్రుచ్చెను. వ్యాఘ్రముఖమునుండి బయలువెడలిన కురంగమట్లు చంద్రసేనుడు సంతోషించుచు బ్రభువు నొద్ద సెలవు గైకొనిపోయి యవార్త హేమలతకును దన భార్యకును దెలిపి వారితో గూడ నానంద మొందుచుండెను. సాయంకాల మగుటతోడనే చక్రవర్తి మధురాహారములు భుజించి యభ్యంగన మొనర్చి పద్మినిరాకను నిరీక్షించుచుండెను. వచ్చెడి స్త్రీ జనంబుల కెల్ల నొకపెద్ద గుడారము వేయబడి యుండుటచే వారు ఘోషాతో లోపలి కరుగుటకు వీలేర్పడెను! ఈ మహాట్టహాసమును విని పద్మిని సాహసమునకును రాజపుత్రుల యవినీతికిని రాజస్థానముయొక్క దురవస్థకును మదనసింగు భీమసింగ్ అద్భుత పడుచుండిరి. పతివ్రతయగు పద్మిని మ్లేచ్ఛరాజ సంభోగమువ కియ్యకొనుట గారణ ముండకపోదని చంద్ర సేనాదులును, నాజరు జంగ్ ను నాలోచించిరి. నాజరుజంగ్ పై జక్రవర్తికి రహిమాన్ ఖాన్ చెప్పెడు మాటలవలన గోపము నానాటి కధికమగుటచే గనబడినచోట మాటలాడుటయును నతడు మానెను. నాజరుజంగ్ మహా విచారముతో దన రాజభక్తి జూపు సమయ మెపుడువచ్చు నాయని దేవుని బ్రార్థించుచుండెను. ఆ సాయంకాలమున సూర్యాస్తమయమైన తరువాత చిత్తూరుకోటలో నుండి యొక్క వరుసగ దురుష్క శిబిరమునకు నేడు వందల పల్లకులు రాసాగెను. పల్లకికి నల్వురు బోయలుండిరి. కోట మొదలు శత్రువుల స్కంధావారముదా కనేక పంక్తిగ నున్న పల్లకులను మోయు బోయల యోంకారనాదమువలన మహమ్మదీయుల కర్ణపుటములు పగలు చుండెను. శిబిరమున నొక చోట నాలుగు ప్రక్కలను దెరలగట్టించి చక్రవర్తి స్త్రీల పల్లకులను నా స్థలమునకు దీసికొనిపొండని బోయల కాజ్ఞాపించెను. లోపల కరిగిన మనుష్యులు తురకల కగపడకుండ దమఘోష నిలపుకొనిరి. శత్రు సైనికులు పల్లకుల వంక జూచుచు నశ్రద్ధతో నిరాయుధులై యుండిరి. ఆ పల్లకులలో బంగపు బనిచేసిన పల్లకీయందు పద్మిని కూర్చుండెనని చక్రవర్తితో బోయలు చెప్పిరి.