హేమలత/పదియారవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదియారవ ప్రకరణము

ఆ మఱునా డుదయమున నిద్రమేలుకొనక ముందే సేవకులరుదెంచి మహారాణావారు రమ్మని వర్తమానమంపిరని చెప్ప మదనసింగు వస్త్రాలంకారముల దాల్చి తనయశ్వము పైనెక్కి మఠమునందున్న తన ప్రియురాలి యోగక్షేమము నరసికొనుటకు యోగికడకు వచ్చెను. యోగి మదనసింగును రహస్యముగ నొకగదిలోనికి గొనిపోయి యాతనితో “బాబా! యీ పడుచు హేమలతకాదు. పాలిగ్రామమున నుండెడి రాధయను దాసి సుమీ. దీని విషయమై దయ దలపక నేను దగినట్లు శిక్షించెదను. నీదారిని నీవరిగి పని జూచుకొనుము” అని చెప్పెను. ఆ పలుకులు విని మదనసింగత్యంతాశ్చ ర్యమునొంది తన్నట్లు మోసపుచ్చిన రాధ శిక్షార్హురాలని యొప్పుకొనెను. కాని స్త్రీయగుటచే క్షమించి ప్రాణహాని లేకుండ జేయుమని యోగిని ప్రార్థించి తాను గోట కరిగెను. అప్పటికి ప్రతాపసింగు గోరాసింగును మొదలగు ప్రధాన యోధులువచ్చి దర్బారున గూర్చుండిరి. మదనసింగు దనకుచితమగు నాసనమున గూర్చుండి భీమసింగును మ్లేచ్ఛుల బారినుండి తప్పించుటకు దగునుపాయ మాలోచించు చుండెను.

అప్పుడు గోరాసింగు లక్ష్మణసింగును సభ్యులను జూచి యిట్లనియె. “మన మీ సమయమున చక్రవర్తియొద్దకు మదనసింగును రాయబారిగ నంపుదము. అంతటి న్యాయముతో ప్రవర్తించిన మాయెడ మీరింత యన్యాయముతో ప్రవర్తించుట సత్పురుషోచితము కాదని చక్రవర్తికి నతడు తెలిపి యతనిలోపము నతని కెఱింగించినను నతడు మనమాట కియ్యకొనడేని తగుచర్య జరుపుదము” అని గోరాసింగు నుడువ నంద ఱదియుక్తముని మదనసింగును సందేశాలర్థమరుగుమనిరి. మదనసింగు స్వామికార్యార్థ మెంతటి సాహసకార్యమునైన నాచరింప నుద్యుక్తుడగుటచే నీ కార్యమునకు సమ్మతించెను. ఆతడు మరల నింటికి రాక సువర్ణబాయికడ సెలవుగైకొనక కొలువుననున్న పినతండ్రికి నమస్కరించి యతనిచే నాశీర్వచనముల బడసి రాణావద్ద సెలవుగైకొని చక్రవర్తి సమ్ముఖమునకు గతిపయసేవకులతో బోయెను.

ఇట జిదానందయోగి యరుణోదయమునలేచి స్నానసంధ్యాదికముల దీర్చికొని సదాశివునిచే రప్పింపబడిన మంగలివానినొకచోట గూర్చుండుమని గాడిద నొకచెట్టునకు గట్టించి రాధను దనకడకు బిలిపించి యాగ్రహముతో “ఓసీ మూర్ఖురాలా! నీసంగతి నేనెఱుగుదును. నీవు పాలిగ్రామములో నుండు రాధవు. చిత్తూరు నీవెట్లువచ్చితివి?” అని యడిగెను. అది భయ సంభ్రమములచే నొడ లెఱుంగక కొంతసేపుండి తెలిసి యింక బొంకిన కార్యము లేదని యిట్లనెను. “స్వామీ! మదనసింగు పాలిగ్రామమునకు వచ్చినపు డాయనమీద నాకు వెఱ్ఱిమోహ ముదయిలప నాపుకొనలేక హేమలత ఖాను పాలయినదని యెంచి నేనామెవేషము వైచికొనివచ్చి నాకర్మ వశమున బట్టుపడితిని. నాకు బ్రాణదానము చేయవలెను. నేను మీబిడ్డను” అని యోగిపాదములపై బడి హృదయము కరగునట్టు రోదనమారంభించెను. యోగి జాలిగొని ప్రాణదానము జేయుటకు వాగ్దానముజేసి దానిని దొడ్డిలోనికి దీసికొనిపోయి తానొక చేయియు సదాశివుడొక చేయియు బట్టికొని యౌవన పరిపూర్ణురాలగు నామెను వికృతాంగిగ నొనర్పదలచి క్షారముజేయుమని మంగలివాని కాజ్ఞయొసగ వాడు తుమ్మెద ఱెక్కలవలె నల్లనివై నిడుదలగు రాధశిరోజముల భారము బాపి విధవవలె జేసెను. వికృతాంగియగునామెను యోగి తక్షణమే గాడిదపై గూర్చుండ నియమించి చిత్తూరనగరమున వీథుల వెంట ద్రిప్పించెను. గ్రామనివాసులెల్ల మందలు మందలుగ నామెను జూడ వచ్చి కడుపులు పగులునట్లు నవ్వసాగిరి. ఇట్లు సంభవించిన పరాభవము భరింపలేక రాధ యాపూట నగరము విడచి గ్రామాంతరము బోయెను. అక్కడ మదనసింగు చక్రవర్తి శిబిరమునకు జని తన రాక నతని కెఱిగించెను. అక్కడ మదనసింగు వంటి శూరశిఖామణిని శత్రు మండలమున లేకుండ జేయుటకు జిరకాలమునుండి ప్రయత్నించుచున్న చక్రవర్తి యాతని రాకవిని రహిమానుఖానునకు వర్తమానము నంపెను. రహిమాను ఖానును మదనసింగు పైగల యసూయచే నాతని రాయబారము విననక్కఱ లేదనియు వెంటనే యాతని జెఱబెట్ట దగుననియు జక్రవర్తికి నాలోచనచెప్పెను. చక్రవర్తి తత్ప్రకారముగ మదనసింగును గారాగృహమున బెట్టించి రహిమాను ఖానును నచట గావలియుండ నాజ్ఞాపించెను. మదనసింగు ననుచరులలో నొకడు సత్వరముగ బఱతెంచి యతని యవస్థను బ్రతాపసింగునకు విన్నవించెను. భీమసింగు చెఱలో బడిననాడెట్లు చిత్తూరున దుఃఖముదయించెనో యటులే నేడును మదనసింగు విషయమై దుఃఖముదయించెను. ప్రతాపసింగు విచారమునకు నలవిలేదు. సువర్ణ భాయి కీసంగతి తెలిసినపుడు గాలి తాకున నేలపైబడు తీగవలె నామె మూర్ఛతో, తెలిసిన తరువాత సన్నపానములు ముట్టక దుఃఖపారవశ్యము నొందియుండెను. ఆ దివసముట్లు మహమ్మదీయ శిబిరమున మహానందముతోడను రాజపుత్ర శిబిరమున దుఃఖముతోడను గడచినవెనుక మఱునాడుదయమున చక్రవర్తి మదన సింగును జెఱబెట్టి గుడారమునకు జని యొక పీఠముపై నాసీనుడై యతనిని దనయెదుటకు దీసికొని రమ్మని యాజ్ఞాపించెను. భటు లట్లతని దోడితేర మదనసింగు తురుష్కుని కట్టెదుట నిర్భయముగా నిలిచి యుండెను. అతని ధైర్యసంపదకు దనలో చక్రవర్తి యచ్చెరువడి వానితో నిస్సందేహముగా నిట్లని చెప్ప దొడంగెను. “ఓయీ! కాఫరు! రాజపుత్రా! నీవు మాచేబడినావు. నీకు బ్రాణముల దక్కించుకొనవలెనని యున్న పక్షమున నాకార్యము జక్కజేయుము. పద్మినిని మాకు సమకూర్చునట్లు మీ భీమసింగునకు సలహా చెప్పి కార్యసాఫల్యము గావింపుము. అట్లయిన నీ ప్రాణ సంరక్షణ మొనర్చుటయెగాక భీమసింగును విడుచుటయు నీకనేక బిరుదులను బహుమానములను నొసగుటయుగూడ నగును. లేకున్న నీకు మరణ దండన విధించెదను. నీసుందరకాయమును నీపరాక్రమమును జూడ నాకు జాలి యగుచున్నది. నీవు మరణమును గోరెదవా, నీ ప్రాణములను రక్షించుకొన గోరెదవా?” యని చక్రవర్తి పలక మదససింగు మహాకోపోద్దీపితుడయి నేత్రద్వయము చింతనిప్పులవలె జేవురింప మొగ మెఱ్ఱబార బరవశుడై తాను మ్లేచ్ఛ సార్వభౌముని స్వాధీనము నందుండుటయు దనకు మరణము సంప్రాప్త మగుటయు మఱచి నిర్భయముగా నిట్లు పలికెను. “ఛీ! నీ దురాలాపముల నింక గట్టి పెట్టుము. నీవు పౌరుషవంతుడ వనియు మానాభిమానములు గల వాడవనియు నేననుకొంటిని గాని యింత నీచుడవని నేనెన్నడెఱుగను. నీకు భీమసింగు మహారాజు భార్య యగు మహాపతివ్రత పద్మిని కావలయునా? మేముత్తమ క్షత్రియవంశ సంభూతులముగాని కఱకు తురకలముగాము. మాకు మానాభిమానములే తల్లిదండ్రులు. ప్రాణముల దీసివేయుదునని నీవు బెదరించు మాత్రమున తుచ్ఛ ప్రాణములకు జడిసి నీచకర్మము నొనర్చువా రనుకొంటివి కాబోలును! ఈ తుచ్ఛకర్మముల నొనర్చి జీవించుటకంటె మాకు శూరజన సులభమగు మరణమే మేలు. పరాక్రమవంతుడవేని యీదుర్భాషలుడిగి కత్తిగట్టి మాతో మగవాడవై పోరుము.” అని యనేక భంగుల నిందించుచున్న మదనసింగు మాటల కాశ్చర్యపడి చక్రవర్తి మేర మీఱిన కోపముతో “నీ దుర్మార్గునిజంపివేయుడు. వీని నాలుకనుగోసి యెఱ్ఱగా గాలిన యినుప కఱ్ఱలను వీనికన్నులలో జొప్పించి పిమ్మట దలదెగ వేయుడు.” అని రహిమానుఖానున కానతిచ్చి తక్షణమే యాగుడారమునుండి వెలుపలికి జని భీమసింగును జెఱవెట్టిన గుడారమున కరిగెను. కామపీడచే జక్రవర్తికి యుక్తాయుక్త జ్ఞానము నశించినందున నతడు భీమసింగు సమ్ముఖముగ కరిగి తనహృదయ పద్మమును బాయకుండిన పద్మిని సంయోగమున దనకు గూర్పవలసినదని యాతని వేడుకొనెను. కీచకుని మాటలు కలిగిన భీమసేనునివలె జక్రవర్తి మాటల కలిగి భీమసింగు రౌద్రరస మొల్క నిట్లనియె. “అపకీర్తితో జిరకాలము జీవించుటకంటె గీర్తితో మరణమునొందుట యుత్తమము రాజపుత్ర రక్తము నరములయందు బ్రవహించు నంతకాలమును, గంఠమున బ్రాణము లుండునంత కాలమును భీమసింగు మరణమునకు వెఱచి నైచ్యము కొడంబడునని స్వప్నమున నయిన నమ్మకుము. నాకు మరణము మాట వంటిదికాని భయకారణము కాదు. నాకుమరణము సంభవించినను సరే; రసపుత్ర వంశములు నిర్మూలమైనను సరే! నేనట్టి కార్య మొనర్పను,” అని ప్రత్యుత్తరమియ్యగా నా మ్లేచ్ఛ చక్రవర్తి భీమసింగు మదనసింగుల నిరువుర జంపివేయవలెనని సంకల్పించుకొనెను. అందుచేత మదనసింగును దక్షణమే యంతమొందింపవలదనియు మఱునాడు భీమసింగుతో గూడ దుదముట్టింపవచ్చుననియు రహిమానుఖానుతో జెప్పెను గాని మరల నారాత్రి కొందఱి యాలోచనము చొప్పున భీమసింగును వధించుట మానుకొనెను. ఇప్పటికైనను బద్మినిపై దనకాస నశింపనందున భీమసింగును జంపిన వ్యవహారము మొదలే మోసమగుననియు నతడు సేమముగ నుండిన రసపుత్రులు పద్మిని దనవద్ద కేనాటికైన నంపి యతని ప్రాణముల రక్షించు కొందురనియు నమ్మి భీమసింగునకు మరణదండన మాన్పెను. మదనసింగు చావా మఱునాడు నిశ్చితమయ్యెను. రహిమానుఖా నాకార్యనిర్వాహమునకు నియమింపబడినందున నతని యానందము వర్ణింప దుస్సాధ్యమైయుండెను. ఆ మధ్యాహ్నమె యినుపకఱ్ఱలను గొలిమిలోబెట్టి యెఱ్ఱగ గాల్పించుచుండెను. ఆ సాయంకాలమునందు రహిమానుఖాను వద్దకు నందుడు వచ్చి “స్వామీ! హేమలత చంద్రసేనుని గుడారములోనే యున్నది. ఆరాత్రి చంద్ర సేనుడామెను గొనిపోయెనని విన్నాను. మీద మీచిత్తము” అని విన్నవింప నాడబోయిన తీర్థ మెదురయినట్లు తనహృదయమును బీడించు కన్యతన శిబిరమున నుండుటకు సంతోషించి, రాత్రి రెండు గడియలైన తరువాత దనయశ్వము నెక్కి ఖాను చంద్రసేనుని గుడారమున కరిగి యాతని బిలిచి తనకు నెట్లయిన హేమలతను సమర్పింపుమని యాతని బతిమాలుకొనెను. ఆతని మౌఢ్యమునకును దుర్వర్తనమునకును జంద్రసేను డచ్చెరువడి యాతనతో “మేము రాజులము, మీరు తురకలు, మాకన్యనెట్లు మీకియ్యగలమని యడిగినావు? చాలుజాలు! నీ చర్యలు గట్టిపెట్టుము. లేకున్న జక్రవర్తితో నిది చెప్పెదను; అని మందలించెను. రహిమానుఖాను నింటి కరిగి భగ్న ప్రయత్ను డగుటకు జింతించుచుండెను. చంద్రసేనుడు వెంటనే చక్రవర్తి సన్నిధి కరుగుదెంచి వినయపూర్వకముగ జరిగిన వృత్తాంత మంతయు నెఱిగించెను. రహిమాను ఖానుయొక్క దౌర్జన్యమునకు జక్రవర్తి మండిపడి చంద్రసేనుని బంపి ఖానుని బిలిపించి కఠినముగ నాతని మందలించెను. అంతట దనమీద నేరము దప్పించుకొనుటకు ఖాను ఉపాయమును వెదకి తుదక పన్నుగడ నూహించి యేలికతో నిట్లు విన్నవించెను. “మహాప్రభూ! అతని వద్దనున్న బాలిక నిజముగ నప్సరస, పద్మినివలె నుండును. పద్మిని కామె బంధువని విని యామె నెట్లయిన దమకు సమర్పింపవలెనని చంద్రసేనుని నేనడిగితిని గాని యాకన్య నా నిమిత్తముకాదు” అని విన్నవించిన ఖాను మాటలచే మదన వికారముదయింప ఖానుపై దయజూపి యంపి తక్షణమే చంద్రసేనుని రప్పించి హేమలతను దన శిబిరమునకు దీసికొని రావలయునని యానతిచ్చెను. ఆ మాటలు విని చంద్రసేనుడు నిర్విణ్ణుడై యది రహిమానుఖాను మాయగా దెలిసికొని చక్రవర్తి సమ్ముఖమున మాఱుమాటాడ లేక సరేయని వెడలెను. మార్గమున బోవుచు దానింత కాలము దిక్కులేని రాచకన్నియ మర్యాద గాపాడి తుదకు నిర్దయాత్ముడయిన మహమ్మదీయ చక్రవర్తి కప్పగింపవలసివచ్చెనని విచారమునొందుచు గుడారమునకు వచ్చి యతడావార్త దనయింతికిని హేమలతకును దెలయజేసెను. హేమలత యవ్వచనము లాలకించి సకల దీనులకును న్యాయమొసగి స్త్రీల జెఱబట్టు దురాత్ముల శిక్షింపవలసిన చక్రవర్తియే స్త్రీల జెఱపదలంచినపుడు తన మర్యాద నిల్చుట దుర్ఘటమని నిశ్చయముగ నమ్ముకొని దైవముపై భారము వైచి యెంతెంత వారి నాశ్రయించిన నెన్ని దినములకును దనకష్టముల కంతము సంభవింప దయ్యెనని యారాత్రియెల్ల విచారించుచుండెను.