హరవిలాసము (1931)/హరవిలాసము-పీఠిక
శ్రీరస్తు
హరవిలాసము
పీఠిక
శ్రీమహిళాపయోధరహరిన్మణిహారము, హస్తి భూధర
స్వామి, పయోజసంభవుని జన్నముఁ గాచిన వేల్పు, దేవతా
గ్రామణి, కంచి శ్రీ వరదరాజు మనోహర పుణ్యకోటి వీ
థీమణిమండితుం డవచి దేవయ తిప్పుఁ గృతార్థుఁ జేయుతన్.
ఉ. మావిడి మోక క్రింద నిగమత్రయయార్థసమృద్ధిఁ పార్వతీ
దేవి కుచంబులన్ బదను దీర్పని కస్తురిముద్రగా జగ
జ్జీవనకారణం బయిన శ్రీనిధి కంచిపురీశ్వరుండు మా
దేవయసెట్టి నందనుని దిప్పుఁ గృతార్థుని జేయుఁ గావుతన్.
సీ. ఏదేవి తుఱుముపై నేఁడుకాలము దాఁకఁ
గసుగందకుండుఁ జెంగలువ దండ;
యేదేవి సేవింతు రేకామ్రనాథుండుఁ
గరి గిరీశ్వరుఁడుఁ గింకరులు వోలె;
నే దేవి మణి దివ్యపాదుకాయుగళంబుఁ
బాతాళపతి మోచుఁ బడగ లందు;
నే దేవిఁ గొల్చి మత్స్యేంద్రనాథాదులు
యోగసంసిధ్ధికి నొడయు లైరి;
తే. యమ్మహాదేవి కామాక్షి యఖిలవంద్య,
దేవతాదిమశక్తి సందీప్తమూర్తి
యవచి దేవయ త్రిపురారి కర్థి నొసఁగు
భాగ్యసౌభాగ్యవైభవప్రాభవములు.
క. వాణికిఁ, జరణానత గీ
ర్వాణికి, నేణాంకశకలరత్నశలాకా
వేణికిఁ, బుస్తకవీణా
పాణికి, సద్భక్తితో నుపాస్తి యొనర్తున్.
సీ. కలితశుండాదండగండూషితోన్ముక్త
సప్తసాగరమహాజలభరములు
వప్రక్రియాకేళి వశవిశీర్ణసువర్ణ
మేదినీధరరత్నమేఖలములు
పక్వజంబూఫలప్రకటసంభావనా
చుంబితభూభృత్కదంబకములు
వికటకండూలగండకదేహమండలి
ఘట్టితబ్రహ్మాండకర్పరములు
తే. శాంభవీశంభులోచనోత్సవకరములు
వాసవాద్యమృతాశనవందితములు
విఘ్నరాజ మదోల్లాసవిభ్రమములు
మించి విఘ్నోపశాంతిఁ గావించుఁ గాత. 5
సీ. వేదండవదనశుండాదండగండూష
కాండసిక్తాప్సరోమండలములు
గంధర్వకన్యకాకనకసౌగంధిక
మాలికాలగ్నషాణ్మాతురములు
నందీశ్వరక్షిప్తనారంగఫలపాక
తరళవిద్యాధరీస్తనభరములు
గరుడలీలావతీకస్తూరికాపంక
పిహితనిశ్శేషాంగభృంగిరిటులు
తే. వీరభద్రవికీర్ణకర్పూరచూర్ణ
ధవళితాకాశచరవనితాముఖములు
శాంభవీశంభుమధుకేళిసంభ్రమములు
పొదలి వాసించుఁ గాత నా హృదయవీథి. 6
వ. అని ప్రార్థించి త్రిపురాంతకదేవదివ్యశ్రీపాదపద్మారాధకుండును, బరమసాధకుండును, గమలభవోరుప్రదేశసంభవవిమలవంశావతారుండును, ధర్మద్రావిడబిరుదాధారుండును, సుజనవిధేయుండును, గర్పూరవసంతరాయండును, గీర్తివనితావల్లభుండును, బ్రతిదినసమారాధితపరమేశ్వరుండును, మాణిక్యసింహాసనాధీశ్వరుండును, నంగీకృతభూసురాశీర్వాదుండును, దానధర్మపరాయణుండును, నిమ్మడి గరుడనారాయణుండును, నిజకీర్తిశాసనస్తంభాయమానదిగంతదంతావళదంతుండును, నుభయద్రావిళుండును, గిష్కింధాచలక్రీడావినోదుండును, వశీకృతనిఖిలభూభుజుండును, సతతత్యాగధ్వజుండును, వినిర్మలకులశీలుండును, బాండ్యరాయకందుకక్రీడావిలోలుండును, గవిజనస్తోత్రపాత్రుండును, గౌండిన్యగోత్రపవిత్రుండును, జతుష్షష్టివిద్యాజన్మభూమియు, నయోధ్యానగరస్వామియో యనఁ బరఁగి జంబూద్వీపభూభువనమండలీమకుటమండనాయమానం బగు కొండవీడుపురంబు రాజధానిగాఁ గీర్తిలతాధిష్ఠితాష్టాదశద్వీపాంతరాళుండగు కొమరగిరి వసంతనృపాలువలన నాందోళికాచ్ఛత్రచామరతురంగాది రాజచిహ్నములు వడసి యమ్మహారాజునకుం బ్రతివత్సరంబును సంవత్సరోత్సవంబునకుం దగిన కస్తూరీకుంకుమఘనసారసంకుమదహిమాంబుకాలాగురుగంధసారప్రభృతి సుగంధద్రవ్యంబు లొడఁగూర్చియుఁ, జీని సింహళ తవాయి హురుముంజి జోణంగి ప్రభృతి నానాద్వీపనగరాకరంబులగు ధనకనకవస్తువాహనమాణిక్యగాణిక్యంబులు తెప్పించియుఁ, గవి గమకి వాది వాంశిక వైతాళికాదులగు నర్థిజనంబులకు నర్థంబులు గుప్పించియు, ధీరుండును నుదారుండును గంభీరుండును సదాచారుండును నన విఖ్యాతి గాంచిన యవచి తిప్పప్రభుం డొక్కనాఁ డాస్థానమండపంబున సుఖోపవిష్టుండై. 7
సీ. కమలనాభుని పౌత్రుఁ, గవితామహారాజ్య
భద్రాసనారూఢుఁ, బరమపుణ్యుఁ,
బాత్రు, నాపస్తంబసూత్రు, భారద్వాజ
గోత్రు, సజ్జనమిత్రుఁ, గులపవిత్రు,
భీమాంబికామారనామాత్యనందను,
నఖిలపురాణవిద్యాప్రవీణు
నధ్వర్యు, వేదశాఖాధీతినిష్ణాతు,
నంధ్రభాషానైషధాబ్జభవుని,
తే. నుభయభాషాకవిత్వప్రయోగకుశలు,
బాలసఖు గారవించి, తాత్పర్య మొప్ప
నవచి త్రిపురాంతకుం డలకాధిరాజు
హితమతోక్తులు వెలయంగ నిట్టు లనియె. 8
క. కంటిని విశుద్ధసంతతి,
వింటిఁ బురాణములు పెక్కు, విశ్వము వొగడన్,
మంటి బహువత్సరంబులు,
గొంటి యశోధనము సుకవికోటులచేతన్. 9
సీ. కట్టించె నొకతాత కంచిహర్మ్యంబులు
హరిణాంకమౌళి కేకామ్రపతికి
బాలార్క మనియెడి పద్మరాగముఁ దాచె
నొకతాత కంచి నాయకుని నాభి
నొకతాత కట్టించె యోజనత్రయదీర్ఘ
తరతటాకాంబోధి తిరువళూరఁ
గావేరిఁ గట్టించెఁ గార్పాసరాసుల
నుబ్బి చోడఁడు మెచ్చ నొక్క తాత
తే. ప్రతిదినమ్మును గపురదీపములు వేయు
వ్రతముగా నొక్క తాత యీశ్వరున కొసఁగె
నిఖిలలోకప్రసిద్ధవాణిజ్యవంశ
ధరులు మా తాత లుభయగోత్రములయందు. 10
తే. శైవవైష్ణవసమయదీక్షావిశేష
ధన్యమానసు లుభయగోత్రములవారు
నాయభీష్టం బొకఁడు పిన్ననాఁట నుండి
పరమమాహేశ్వరాచారభక్తిపరత. 11
తే. ఆగమజ్ఞాననిధివి, తత్త్వార్ధఖనివి,
బహుపురాణజ్ఞుఁడవు, శుభభవ్యమతివి,
బాలసఖుఁడవు, శైవప్రబంధ మొకటి
యవధరింపుము నాపేర నంకితముగ. 12
వ. అనిన నేనును శుభముహూర్తమున నిజాంతరంగ మంగళాయత నాధిష్ఠిత కుమారాచల త్రిపురాంతకుం డవచి త్రిపురాంతకుండు కృతిస్వామిగా హరవిలాసం బను ప్రబంధంబు సెప్పం దొడంగి యమ్మహాప్రబంధముఖతిలకాయమానంబగు తదీయవంశం బభివర్ణించెద.
కృతిపతి వంశాభివర్ణనము
సీ. ముయ్యేడు వాసరంబు లకాలవర్షంబు
జడిపట్టి కురియఁ బర్జన్యుఁ బనిచి
తా నొక్కరుఁడు దక్కఁ దక్కొక్క శివయోగి
యూర లేకుండంగ మేర వెట్టి
కడవంగఁ బెట్టిన కొడుకు మాంసముతోడి
భోజనంబునకు విభూతి యొసఁగి
పుత్రుఁ బాకముఁ జేసి బోనము వెట్టినఁ
గుడువంగ నొల్లక పెడము వెట్టి
తే. వీరమాహేశ్వరాచారవీథియందు
నిజము గనిపించె నెవ్వాని నీలగళుఁడు
వాఁడు పాత్రుండు కాఁడె కైవారమునకు
దురితదూరుండు శ్రీ చిరుతొండనంబి. 14
సీ. అర్ధరాత్రంబున నల్లాడనాథుండు
దానె యెవ్వనికిఁ గైదండ యిచ్చెఁ
బదకంపుఁబచ్చను బై వేయవచ్చిన
దనుజారి నిల్పె నెవ్వని నిజంబు
అలిగి పోయిన వేంకటాచలంబున కేఁగి
కొనివచ్చె నెవ్వనిఁ గుధరధరుఁడు,
వైకుంఠనాథుఁ డెవ్వని సేవకును మెచ్చి
యాత్మసత్కారకల్యాణ మొసఁగె
తే. నతఁడు భాగవతోత్తముఁ, డతఁడు శుద్ధుఁ,
డతఁడు వైరాగ్యసంపన్నుఁ, డతఁడు ఘనుఁడు
పరమవైష్ణవసభ నుతింపంగఁ దగఁడె
కాంచినగరి కుటుంబి శ్రీ కంచినంబి.
వ. అందు. 16
తే. సింహవిక్రమపట్టణశ్రేష్ఠుఁడైన
సెట్టి జగజెట్టి పావాణిసెట్టివిభుఁడు
ఘనుఁడు నగరీశచంద్రశేఖరపదాబ్జ
వందనానందితాత్ముండు వంశకరుఁడు. 17
క. శ్రీపర్వతసోపాన
స్థాపకుఁడగు రెడ్డి వేమజగతీపతికిన్
బ్రాపైన యవచిదేవయ
యా పావాణికి జనించె నభ్యుదయముతోన్. 18
ఉ. విశ్వజగత్ప్రసిద్ధుని, వివేకనిరంజనరామనాథ యో
గీశ్వరపాదసేవకు నహీనదయాగుణశాలి వీరమా
హేశ్వరచక్రవర్తిఁ దరుణేందుకళాధరభక్తిభావనా
శాశ్వతచిత్తు మా యవచి సత్కులు దేవయ నెన్న శక్యమే. 19
ఉ. ఆతతభక్తిసంపద నహర్నిశమున్ ఘృతఖండశర్కరా
పాతముతో నపూపములు పాయసమున్ గదళీఫలంబులున్
స్ఫీతము గాఁగ నన్నములు పెట్టును శంకరభక్తకోటి కా
సేతుహిమాచలం బవచిసెట్టికి నెవ్వరు సాటి యిమ్మహిన్. 20
వ. ఆ యవచిదేవయకు మాచాంబయందుఁ ద్రిపురారియు తిరుమలసెట్టినాథుండు జామిసెట్టియు నను మువ్వురు తనయులు పుట్టి రందు. 21
మ. ఖుసి మీఱన్ సురధాణి నిండుకొలువై కూర్చున్నచో నీకరా
భ్యసనప్రౌఢి నుతించురా యవచితిప్పా! చంద్రసారంగనా
భిసముద్పాదితతాళవృంతపవనప్రేంఖోల్లనప్రక్రియా
వసరోదంచితసారసౌరభరసవ్యాలోలరోలంబముల్. 22
చ. హరిహరరాయ ఫేరోజసహా సురధాణ గజాధిపాదిభూ
వరులు నిజప్రభావ మభివర్ణన సేయఁ గుమారగి ర్యధీ
శ్వరుని వసంతవైభవము సర్వము నొక్కఁడ నిర్వహించు మా
తిరుమలనాథ సెట్టికిని ధీగుణభట్టికి నెవ్వఁ డీడగున్. 23
శా. చామున్, వైశ్యకులాబ్ధిసోము, విలసత్సౌందర్యలీలాకళా
కామున్, దానకళాభిరాము, సుమనఃకల్హారవాటీసుధా
ధామున్, గోమలయామినీశ్వరకళోత్తంసప్రశంసారుచి
శ్రీమన్మానలశైవయోగి విహితక్షేమున్ నుతింపం దగున్. 24
సీ. పంజాబు కర్పూరపాదపంబులు దెచ్చి జలనోగి బంగారుమొలక దెచ్చి
సింహళంబున గంధసింధురంబులు దెచ్చి హురుముంజి బలుతేజి హరులు దెచ్చి
గోవసంశుద్ధసంకుమదద్రవము దెచ్చి యాపగ నాణిముత్యాలు దెచ్చి
చోటంగిఁ గస్తూరికాటంకములు దెచ్చి చీనిచీనాంబరశ్రేణి దెచ్చి
తే. జగదగోపాల రాయవేశ్యాభుజంగ, పల్లవాదిత్య భూదాన పరశురామ
కొమరగిరి రాజదేవేంద్రు కూర్మి హితుఁడు, జాణ జగజెట్టి దేవయ చామిశెట్టి. 25
తే. తమ్ము లిద్దఱుఁ దనయాజ్ఞ దల ధరించి, యన్నిదీవులఁ దెచ్చు లాబార్థకోటి
యర్థులకు నిచ్చి గీర్తి బేహార మాడు, నవచి త్రిపురాంతకుండు వంశాబ్ధివిధుఁడు.
మ. తరుణాచీనితవాయిగోవరమణాస్థానంబులం జందనా
గరుకర్పూరహిమాంబుకుంకుమరజఃకస్తూరికాద్రవ్యముల్
శరధిం గప్పలి జోగులన్ విరివిగా సామాన్లఁ దెప్పించు నే
ర్పరియౌ వైశ్యకులోత్తముం డవచితిప్పం డల్పుఁడే యిమ్మహిన్. 27
తే. పండువాఢిల్లిరాఢాదిపట్టణముల, యధిపతులు మౌళిఁ దాల్చురత్నాంకురంబు
లవచిత్రిపురాంతకానీతయానపాత్ర, సింహళద్వీపమండితక్షేత్రజములు. 28
ఉ. పిన్నటనాఁడు సత్కరుణఁ బిల్లలమఱ్ఱిమహాప్రధాని పె
ద్దన్నగురూత్తముండు తగనక్షరశిక్షయు దైవమార్గ సం
పన్నతయున్ వివేకపరిపాటియునుం గృపసేసె నర్థి నే
యన్నకు నట్టిసెట్టి త్రిపురాంతకునిం దగుఁ బ్రస్తుతింపఁగన్. 29
ఉ. ధీచతురు ల్సహోదరులు తిర్మలసెట్టియు జామిసెట్టియున్
మాచన విశ్వనాథచినమల్లకుమారులు వీర లాత్మజుల్
శ్రీచెలువంబుఁ గైకొనిన చేడియ యన్నమదేవి భార్యగా
గోచరమే నుతింప నయకోవిదునిం ద్రిపురాంతకాధిపుల్. 30
షష్ఠ్యంతములు
క. ఆపుణ్యశ్లోకునకు ను, మాపతిపాదారవిందమధుకరమునకున్
ద్వీపాంతరమండలికా, భూపాలకమాననీయపురుషార్థునకున్. 31
క. సంధాభార్గవునకుఁ గి, ష్కింధాచలపతికి దానకేళీభరధౌ
రంధర్యనియతమతికి యు, గంధరచాణక్యనీతిగతినిపుణునకున్. 32
క. మాచాంబానందనునకు, వాచాగోచరవివేక వైయాత్యునకున్
వాచాలవిబుధగంగా, వీచీగంభీరవాక్యవిన్యాసునకున్. 33
క. వాణిజ్యచణున కంత, ర్వాణీసంస్తూయమానభాసురమతికిన్
వాణీనఖముఖముఖరిత, వీణానిక్వాణనిభకవిత్వఫణితికిన్. 34
క. త్రిపురాంతకదేవమనో, విపులగృపావర్ధితాభివద్ధికిఁ బాండ్యా
ధిపసఖున కవచిదేవయ, త్రిపురాంతకునకు వితీర్ణదీక్షానిధికిన్. 35