Jump to content

హరవిలాసము (1931)/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము.


వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాచెప్పం బూనిన హరవిలాసం బనుప్రబంధంబునకుఁ బ్రథమవిలాసం బైనకృతినాయకునివాణిజ్యవంశంబునకుఁ గూటస్థుం డైన కిరాటకుల శ్రేష్ఠుం డగుచిఱుతొండనంబిచరిత్రంబుఁ జెప్పెద నది యెట్టిదనిన. 1

కథాప్రారంభము.

తే. బదరికాశ్రమభూమిఁ దాత్పర్యనిష్ఠఁ
దపము సేయుచునుండె శాంతత వహించి
క్రోధసంవర్ధమానతపోధనుండు
ఘనుఁడు దూర్వాసుఁ డను మహామునివరుండు. 2

వ. ఒకనాఁ డమ్మునీంద్రుండు మధ్యాహ్నకాలంబునఁ గృతస్నానుండై పితృతర్పణంబుఁ జేసి సంధ్యావందనం బొనర్చి వైశ్వదేవబలిహరణంబులు దీర్చి దేవతార్చనం బనుష్ఠించి పర్ణశాలవాకిట హవిశ్శేషంబైన హవిష్యనీవారపాయసాన్నం బల్లనల్లన లేడిపిల్లలకు మేఁపుచుండె నయ్యవసరంబున నంబరమార్గంబున దుంబురుండను ప్రమథుండు దననితంబినియుం దానును విమానం బెక్కి హేమకూటంబున నుండి గోకర్ణవాసియగు దృక్కర్ణభూషణు సేవింపం బోవువాఁ డయ్యాశ్రమంబునడుచక్కినుండి యమ్మునీంద్రుండు హరిణవత్సంబులకుం జేయు వాత్సల్యంబునకు నద్భుతంపడి యంగుళిస్ఫోటనంబు సేసె నచ్చిట్టమిడికి నాలేడిపిల్లలు బిట్టుబెదరి చెదరి చేయీక పఱచిన నిది యేమి చప్పుడొకో యని గగనమార్గంబునకు దృష్టి పఱపి యాదూర్వాసుండు. 3

శా. హుంకారం బొనరించి తుంబురునితో నోరీ దురాచార నా
జింక ల్భుక్తి గొనంగ నేమిటికిరా చేచిట్ట మ్రోయించి యా
తంకంబున్ ఘటియించి తిట్టియపరాథం బేను సైరింతునే
యింక న్మర్త్యుఁడవై జనింపు మహిలో నింకంగ నీగర్వమున్. 4

తే. అని శపించినఁ దుంబురుం డతిభయమున
డిగ్గనంగ విమానంబు డిగ్గ నుఱికి
యతనిపాదాబ్జములకు సాష్టాంగ మెఱఁగి
యెంతయును భక్తినమ్రుఁడై యిట్టు లనియె. 5

క. కరుణింపు శమాశ్రితభయ
హరణ సురాసురకిరీటహరిహయరత్న
స్ఫురణా మధుకరపరివృత

చరణా యత్యంతదాంతిశాంత్యాభరణా. 6

తే. హరిణవత్సంబులకు మీరు కరుణతోడఁ
బాయసాన్నంబు గుడిపింప భర్తఁ జూచి
సర్వభూతానుకంపకు సంతసిల్లి
చిట్ట మిడిచితి నిది నాకుఁ జెట్ట యయ్యె. 7

వ. నీవచనం బమోఘంబు గావున నాకు మర్త్యత్వం బవశ్యభోగ్యంబుగాఁ బురాకృతఫలం బనుభవింపక పోవచ్చునే నాయపరాధం బల్పంబ దీనికిం దగ శివభక్తగృహంబున జన్మించునట్టుగా ననుగ్రహించి శాపాంతంబు కృప సేయు నీకృపావిశేషంబునం గ్రమ్మరం బారిషపదవి కలుగునందాఁక మద్భార్య నీకుం గోడలు నీపాదచర్య సేయుచు నీయాశ్రమంబున నుండఁగలయది యని పల్కిన దాక్షిణ్యంబు వహించి యవ్విరూపాక్షదివ్యాంశభవుండగు దూర్వాసుండు. 8

ఉ. ఇద్దురవస్థ రాఁదగిన యింతటిత ప్పొనరించినాఁడ వే
ప్రొద్దుగుణంబున న్నెగులు వొందిన నేమి యనంగవచ్చు నీ
ముద్దియ నాదకోడ లిటముందట నావగ నెమ్మినుండ నీ
నిద్దుర మేలుకొన్నగతి నీవును గ్రమ్మరి రమ్ము పొమ్మిఁకన్. 9

వ. అనియె ననంతరంబ తుంబురుండు దూర్వాసశాపాక్షరంబులు ప్రేరేపఁ దత్క్షణంబ జంబూద్వీపంబున ద్రవిడభూమండలమండనాయమానంబును బంపాతరంగిణీప్రవాహనదీమాతృకాయమాన విశ్వంభరాభరితకలమశాలిశిరా ముఖషష్ఠికపతంగహాయనప్రముఖబహువిధవ్రీహిభేదసంపత్సంపన్నంబును బంకజాసనహయమేధయాగస్థానంబును హస్తిగిరిశిఖరశృంగాటకాఘాటగాటకఘటనావాసవరదరాజాభిధానవైకుంఠవిహారప్రదేశంబును గామాక్షీకౌతుకాగారంబును నేకామ్రనాథదేవదివ్యావసధంబునునైన కాంచీనగరంబున పణిగ్వంశంబున నుద్భవించి. 10

మ. చిఱుతొండండను పేర వైశ్యకుల మౌర్జిత్యంబునం బొంగఁగా
గఱకంఠుం దరుణేందుశేఖరుని షట్కాలంబు పూజించు నెం
దఱుభక్తు ల్దను వేఁడిన న్ప్రమదమున్ దాత్పర్యము న్భక్తియు
న్వెఱవుం గల్గి తదీప్సితార్థములు గావించు న్నిరాలస్యతన్. 11

వ. అతనిపురంధ్రి తిరువెంగనాంచి తుంబురునిభార్యయగు నప్సరోంగన నిజాంశంబునఁ గాంచీనగరంబునందు పణిగ్వంశంబునఁ గౌశికగోత్రంబున నవతరించి చిఱుతొండనంబికి భార్యయై సిరియాలుండను కుమారునిం గనియె నాపుణ్యదంపతు లిరువురు షట్కాలలింగార్చనంబులను సంతతజంగమారాధనంబులను గాలంబు గడపుచుండిరి. 12

తే. కంచిలో నేడువాడలు గలసియుంద్రు
ప్రకృతిబంధులు సంబంధబంధులునయి
పాఁడిపంటయు వైభవప్రాభవములు
తగవు ధర్మంబు గలిగి యుత్తమవణిజులు. 13

వ. చిఱుతొండండును బూర్వజన్మవాసనావిశేషంబునఁ దుషారగిరికన్యకాకరకమలకిణాంకితుం డగుటం జేసి వలయాంకుండనం బ్రసిద్ధి వహించి యేకామ్రనాథు నారాధించుచు శుద్ధవిరశైవాచారపరాయణుండై జంగమప్రమథులకుఁ దనమనోవంచనంబు లేక యేవేళ నేపదార్థంబు వేఁడిన లే దన కిచ్చుట వ్రతంబు గాఁ బట్టి పట్టిన వ్రతంబు చెల్లకుండినం దిరుబాసగా వర్తిల్లుచుండె నంత నొక్కనాఁడు. 14

చ. తమలముకెంపున న్మెఱుఁగుదాఁకినచెందిరకావికోఱలుం
దుమికిఫలంబుచందమున నున్ననియౌదలమీఁదిపచ్చిగం
దముఁ గరసంపుటంబున సదాశివలింగము నొప్పుమిండజం
గము చనుదెంచె నొక్కరుఁడు గర్వమునం జిఱుతొండనింటికిన్. 15

వ. వచ్చి యయ్యొసపరిమన్మథుండు మన్మథమథనసేవాహేవాకసావధానమానసుండైన యాజగజెట్టిసెట్టికి శివునికారుణ్యం బని దీవించి పాదార్చనాద్యుపచారంబులు గైకొని సుఖాసీనుండై యి ట్లనియె. 16

ఆ. కంచినగరిపాటిగట్టుతూమునఁ దూమెఁ
డిక్షురసము మాకు నిపుడు తెమ్ము
హరుని నేఁడు మాకు నభిషిక్తు నొనరింప
వలయు నిత్యమైన వ్రతము గాన. 17

క. చేఁగానుగాడుచెఱుకుం
దీఁగెరసంబునఁ బురారిఁ దేల్పక కుడువ
న్నాగురు వుపదేశించిన
యాగమమ మిది గాన నిన్ను నభ్యర్థింతున్. 18

వ. అని కక్షంబునం ధరియించిన యాసొఱపుంగాయలోని భస్మం బిచ్చిన వల్లె యని యందుకొని యావైశ్యబృందారకుండు పరమానందకందళితమందస్మితస్మేరవదనారవిందుండై యిందుధరుండు మనమందిరంబునకు విందుకు వచ్చినాఁడు గరగరగా వంటకమ్ములు గావలయు నని తిరువేంగనాచి కప్పగించి యప్పు డప్పరమభక్తునియందలి భక్తి చిత్తంబునం జొత్తిల్ల నత్యుత్తమవ్యవహారోదాత్తం బగువిత్తంబు చెఱంగున ముడుచుకొని పంపాతరంగిణీసేకసంవర్థితంబులైన చెఱకుగోలలు గొని. 19

సీ. కాంచిపురము పాటిగట్టు తూముఁ దూమెఁ డిక్షురసమ్మున కెన్నివలయుఁ
జేగానుఁగాడంగఁ జెఱకుదండము లని గుఱుతింపఁగా నూఱుకోల లైనఁ
జాలుఁ బొమ్మనుబుద్ధి సంభవించెను మదిఁ జిఱుతొండనంబికి సెట్టిపతికి
నన్నికోలలు చుట్టి యాడక కొసరక ద్రవిణంబుమూట వారలకు నిచ్చి
తే. ముదురుఁదీవెల బిగువుగా మోపు గట్టి, వాఁడిపండ్లు బిగించి చేవలఁతి యెగిరి
యెత్త మో పెత్తరాదయ్యె నెంతయేని, నెత్తవచ్చునె నూఱుపుండ్రేక్షుఘటలు. 20

ఉ. వెగ్గలమైన మోపుఁ గడువీఁకన యెత్తఁగఁబోయి ముందటన్
మ్రొగ్గతిలంబడెం జెమట మోమునఁ గ్రమ్మఁగ ద్రావిడోత్తముం

డగ్గణముఖ్యుతోడ నొకఁడై సరి నాచెఱకు ల్భరించి తా
దిగ్గన వచ్చె శంకరుఁడు దెప్పర మైనవడి జెమర్చుచున్. 21

ఆ. చెఱకుమోపు వైచి శ్రీమహాదేవుండు, చాయఁ జూచునంత మాయమయ్యె
నద్భుతంబుఁ జెంది యతఁడు చేజంత్రానఁ, జెఱకుఁగాల లాడి చేసె రసము. 22

తే. పాటితూమున రసము దైవాఱఁ గొలిచి, కొమరుజంగంబునకు నిచ్చెఁ గోర్కి దీఱ
నాతఁ డఱచేతనున్న చంద్రార్ధమౌళి, కారసంబున నభిషేక మాచరించె. 23

మ. ఇట వైశ్యోత్తముఁ గూడి మోచుకొని పుండ్రేక్షుప్రతానంబు దె
చ్చుట నప్పాటను వెండికొండపయి నస్తోకాప్సరోభామినీ
నటనాలోకనవేళ మై సెమరిచె న్మందాకినీమౌళికిన్
ఘటియిల్లె న్గిరిరాజనందనకుఁ దత్కాలంబ యీర్ష్యోద్ధతుల్. 24

చ. అమరవరేణ్య ప్రేంకణము లాడెడువేలుపులేమఁ జూచి యే
చెమరిచి తంచుఁ గేళిసరసీరుహ మెత్తి ప్రతాప మొప్పఁగా
హిమగిరిరాజనందన మహేశ్వరు మొత్తె మధూళికాపరా
గములు శశాంకశేఖరుని కన్నులమూఁటను జిందు నట్లుగన్. 25

వ. ఇట్లు లీలారవిందంబున హిమశైలనందనచేత వ్రేటువడి యిందుధరుండు సురసుందరీసందర్శనంబున నైన కందర్పవికారంబు గామి తేటవడ గోవిందశతానందపురందరాదులగు బృందారకులు వినుచుండ మందస్మితస్మేరవదనారవిందుండై మంద్రగంభీరస్వరంబున ని ట్లాన తిచ్చె. 26

సీ. కమలాక్షి యిది యేమిగాఁ దలంచితి విప్పు డర్ధదేహంబు నీయదియ కాదె
హృదయంబుపొరువున హృదయ ముండుటలేదె, యేకీభవించిన యిరువురకును
నేభావ మైన నీహృదయంబునకు దాఁప నేభంగి వచ్చు నాహృదయమునకు
నపరాధశంక యావంత యైనను లేదు నీచిత్తమున కెక్క నిక్కువంబు
తే. తప్పు లేకుండ నేల నెత్తమ్మిమొగడ, విసరి వక్షఃప్రదేశంబు వ్రేటుకొంటి
కేసరంబులరజముఁ బుష్పాసవంబు, నెఱసె నిదె చూడు కన్నుల నీరు గ్రమ్మె. 27

వ. నామై సెమర్చుటకుం గారణంబు సెప్పెద నాకర్ణింపుము. 28

ఆశ్వాసాంతము

ఉ. హాటకగోత్రధీర! సిరియాలకులోద్వహ! చంద్రమఃకలా
జూటపదారవిందపరిచుంబనమానస! ధర్మశీల! క
ర్ణాటవరాటఘూర్జరవిహార! కళింగకుళింగమండలా
ఘాటవిజృంభణామాణశశికాంతివినిర్మలకీర్తిపూరితా. 29

క. కొమరగిరి వసంతనృపా, గమకవివరగంధసారకస్తూరీకుం
కుమకర్పూరహిమాంభ, స్సముదంచితబహుసుగంధిశాలాధ్యక్షా. 30

మాలిని. తిరుమలవిభుచామాధీశ్వరైకాగ్రజన్మా
పరమగురుసపర్యాప్రౌఢరామానుజన్మా
చిరపరిచితలంకాసింహళద్వీపభూమీ
సరసిరుహభవోరుస్తంభగోత్రాగ్రగామీ. 31

గద్యము. ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర వినయవిధేయ శ్రీనాథ

నామధేయప్రణీతం బైనహరవిలాసంబునందుఁ బ్రథమాశ్వాసము.