హరవిలాసము (1931)/ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసము.
శ్రీరాజరాజకీలిత
భారతరామాయణాదిభవ్యపురాణా!
యారాధితపరమేశ్వర!
ధీరగుణాభరణ! యవచిదేవయతిప్పా! 1
వ. అవధరింపు మనంతరంబ పార్వతితోఁ బరమేశ్వరుం డిట్లు చెప్పందొడంగె. 2
తే. దీవులందెల్ల నేరెటిదీవి లెస్స
భరతఖండంబు మేల్తదంతరమునందు
ద్రవిడదేశంబు గడు నొప్పు దానియందుఁ
గాంచికామండలంబందుఁ గాంచిపురము. 3
శా. ఆకాంచీనగరంబునందు శివభక్త్యాచారసామ్రాజ్యల
క్ష్మీకంఠాభరణంబు నిర్మలవణిక్శ్రేష్ఠాన్వయాంభోధికిన్
రాకాపూర్ణనిశాకరుండు చిఱుతొండశ్రేష్ఠుఁ డయ్యుత్తముం
డేకాలంబును బాయకుండు గిరిపుత్త్రీశానపూజావిధుల్. 4
ఉ. ఎందఱు జంగమప్రమథు లెత్తఱి నేమిపదార్థ మెంత యే
కందువ వేఁడినం దిరముగా నతఁ డందఱి కాపదార్థ మా
కందువ యేపు ప్రాణ మెడగా నిడియైన ఘటించి పెట్టుఁ బూ
ర్ణేందునిభాస్య వానిసరి యెవ్వఁడు లేఁడు వసుంధరాస్థలిన్. 5
తే. కలియుగంబునఁ గళ్యాణకటకనగరి
నాకు భక్తుండు బసువరనాథుఁ డొకఁడు
కాంచినగరంబులో వణిగ్వంశకరుఁడు
నాదుభక్తుండు చిఱుతొండనంబి యొకఁడు. 6
శా. అయ్యూరూద్భవవంశసంభవుని నేకామ్రాధినాథాంబికా
శయ్యామందిరనిర్మలాత్మకుని భిక్షావృత్తి జంగం బొకం
డొయ్యం జేరఁగ వచ్చి మాశివుని నేఁ డోలార్చెదం గానఁ దే
వయ్యా యిక్షురసంబు తూమెఁ డనుచుం బ్రార్థించి నేమించినన్. 7
శా. అట్టే కా కని భూతి యందుకొని శైవాచారసంపన్నుఁ డా
సెట్టిశ్రేష్ఠుఁడు తోఁటకుం జని రసశ్రీమాధురీలక్ష్మికిన్
బట్టౌయిమ్ముల మంచినల్లచెఱకుల్ భారంబుగా విర్చి వే
కట్టెన్మోపు వనీకఠోరలతికాకాండప్రకాండంబులన్. 8
క. తూమెఁడురసమునకుం దగఁ, బ్రామెడుపుండ్రేక్షులతలు వట్రువగ లతా
దామములఁ గట్టిపెట్టిన, యామోపుఁ గదల్పలేక యవశుం డయ్యెన్. 9
క. పరఁటెడురసంబు గలుగం, గరయంత్రం బాడ నెన్నిఘటలు వలయు న
న్నిరసాలకాండకంబు, ల్సిరియాలునితండ్రి యెత్తలేకున్నయెడన్. 10
తే. ఏ నొకఁడఁ బోయి యొకవంక నెత్తికొంటి
నాతఁ డొకవంక నెత్తె మో పద్రితనయ
భారమున డస్సి యవ్వణికృతి సెమర్చె
నేను నపుడు నెమర్చితి నేమి చెప్ప. 11
క. ఆచెమరించుట సుమ్మీ, యీచెమరించుట భవాని యిది యన్యముగా
నీచిత్తమునఁ దలంపకు, మీచనవులు భక్తకోటి నేను ఘటింతున్. 12
తే. వలతు నే భక్తకోటికి వారిజాక్షి, లలన యాభక్తకోటికి వలచు నాకు
“భక్తిమతి లింగపతి” యను ప్రాఁతమాట, నేఁడుగాఁ గల్గెనే యలినీలవేణి. 13
వ. అనినం బార్వతి యాశ్చర్యం బంది యాసర్వజ్ఞుతోడ దేవా యవ్వీరమహేశ్వరు నాకు జూడవలయుఁ గంచికిం దోడ్కొని పోవే యని ప్రార్థించిన నప్పంచవదనుండు సమీపంబునం గాంచియున్న పాకశాసనుం గాంచి యిట్లని యానతిచ్చె. 14
సీ. పాకశాసన కంచిపట్టణంబునయందు నాల్గుదిక్కుల యోజనములు మూఁడు
ముయ్యేడువాసరంబు లకాలవర్షంబు గురియింపఁ బంపు మొగుళ్ళగములఁ
పగళులు రేలు కుంభద్రోణములు గాఁగఁ గలదు మాకు రహస్యకార్య మొకటి
యనిన దత్క్షణమాత్ర నైరావతము నెక్కి యమరావతికి నేగి యమరవిభుఁడు
తే. పుష్కలావర్తకాదికాంభోధరముల, సంకిలియ లూడ్చి తెప్పించి సత్వరమునఁ
బంచెఁ గాంచీపురంబునఁ బదియఁ బదునొ, కొండుదినములు వర్షించుచుండుఁ డనుచు. 15
తే. పశ్చిమంబున నింద్రచాపంబు వొడిచె, నిండునేలఁ జుట్టెఁ బరివేషమండలంబు
గగనమార్గంబునందు నాగడప లెగసె, నంబుధరమాలికలు దక్షిణంబు నడచె. 16
క. ఉఱు ముఱిమి మూలగాడ్పులు, చెఱచి విసరఁజొచ్చె మదనసంహరుదెసఁ గ్రొ
మ్మెఱుఁ గుద్భవించెఁ గప్పలు, గఱరవరట్కురరవరరగ ట్టని యఱచెన్. 17
ఉ. తూనిఁగ లాడఁజొచ్చెఁ దివి దూఁటి భ్రమింపఁగఁ జొచ్చెఁ బిచ్చుకల్
మానక యుబ్బి గబ్బులుఁగు మాటికిమాటికిఁ గొల్చెఁ గొమ్మపై
వాన యవశ్య మింక బహువాసరముల్ జడి వట్టునం చొగిన్
వానికి వాని కాడిరి యవారణఁ బౌరులు గంచిలోపలన్. 18
మ. గ్రహసిద్ధాంతకళావిదుల్ సలిలనక్షత్రంబు నీహారరు
క్సహవాసంబును నభ్రవీథిఁ బరివేషస్థాయియై యుండుటన్
బహుబాధల్ వడఁ గల్గు నంచుఁ దమలో భాషింపఁగాఁ గంచిలో
గృహమేధుల్ భయ మంది రింధనతృణక్లేశంబు చింతించుచున్. 19
వ. అనంతరంబ విగళితశృంఖలాబంధంబులై పుంఖానుపుంఖంబులం బుష్కరావర్తకాదికంధరంబులు కబంధంబులు పారణలు సేసి కారుకొని చటులతటిద్దండతాడనంబులం జేసి యోసరేసినయవియుంబోలె గర్జిల్లుచుఁ బర్జన్యశిఖాడంబరంబున నంబరంబుఁ దోరకట్టుచుఁ గొక్కెరలు కెరలి యిరుచక్కియన నుక్కడంబు నడువం బౌరస్త్యంబులై ధారాకదంబంబులఁ గోరగింపఁజేయఁ దలతలం దొరఁగుచినుకులం బుట్టుకట్టావితోడం గూడి పుడమిం బొడముకమ్మనినెత్తావి చిత్తంబుల కాహ్లాదం బాపాదింప విద్యున్నటీనటనారంభసంభ్రమోచితంబులగు పుష్పాంజలివిక్షేపంబులం బురుడించుచుండ డీలుకొనంబడు వడగండ్లగములు గిరికటకశిలావిటంకంబులం గ్రేంకారంబు లంకురింప నొండొండ మెండుకొన ఖండపరశుకంఠమూలకఠోరకాలకూటమషీకలంకపంకచ్ఛాయాచ్ఛటాపటలంబుభంగి నంగీకరించుచు నిశ్శేషశిలీంధ్రభాంధవంబును నిర్భిన్నపథికమార్గంబును నిరవధికలాంగలీప్రసూనధూళిధూసరదిశాముఖంబును నిరుజ్ఝితగిరినిర్ఝరప్రవాహంబును నిబిరీసకుసుమకేసరకరికరాభధారాకదంబడంబరంబునునై వర్షారంభంబు విజృంభించి కుంభద్రోణంబులుగ విశ్వంభరామండలం బేకార్ణవంబుగా ధారాపాతంబు గురియం దొడంగె వెండియు. 20
చ. తటిదభిఘాతవేగమున ధారలు జోరున జాఱుచుండఁగాఁ
బిటిలు పిటిల్లనం బ్రిదిలి ప్రేలిపడం దొడఁగెం జతుర్దిశా
తటముల మండుచుం బిడుగుతండము కాంచిపురీజనంబు హృ
త్పుటములు జల్లన న్మఘవపుత్రునిపేళ్ళు పదిం జపింపఁగన్. 21
తే. ఊల వడఁజొచ్చెఁ గామాక్షి నొత్తరించి, నగరితోఁ గూడ నేకామ్రనాథు ముంచె
హస్తిగిరినాథు శ్రీపాద మప్పళించెఁ, గంచిఁ దెప్పలఁ దేల్చె నకాలవృష్టి. 22
వ. ఇవ్విధంబున నిరువదియొక్కవాసరంబులు నిలుపులేక పామువ్రేలం గట్టినభంగి నింగి యవిసి కాఱినచందంబున సముద్రంబు వెల్లివిరిసినలీలం బిలంబు తెఱచినవడువునఁ బురందరకీటకాటోపంబును గండూపదవిహారారంభసంరంభంబును మండూకప్రకాండడిండిమధ్వానచండిమంబును గచ్ఛపోత్సేకహేవాకంబును మీనమానసోల్లాసంబును నక్రప్రక్రీడనంబును గర్కటకనటనపరిధాటీపాటవంబును ఘటియిల్ల మిఱ్ఱుపల్లంబులు సరిగా నంపజాలంబుపగిదిఁ గురిసి యిరువదిరెండవదినంబునందు. 23
ఉ. ఒయ్యన వేల్పు సూపె జడి నుబ్బరవోయెడుప్రాణికోటికిన్
దయ్యమునెత్తికోలు తుది దాఁకఁగఁ దూరుపు తెల్లవాఱి తె
ల్పయ్యెను నీరు వీథిఁ బడి యంబుధి కేగె నదీముఖంబునం
బయ్యర వట్టె మేఘములు నచ్చుగఁ బాఱె నుదఙ్ముఖంబులై. 24
మ. ఎడవె ల్పైనను లేక పెక్కుదినముల్ హేరాళమై వర్షముల్
జడిగాఁ బట్టి తటా లనంగ వెలిసెన్ జంఝాసమీరంబుతో
నుడుమార్గం బఖిలంబు నున్ననయి శాణోత్తేజనం బొంది పు
ల్కడుగంబడ్డ నిశాతఖడ్గముక్రియం గన్పట్టె నప్పట్టునన్. 25
తే. కడు మహోత్పాత మగుచు నకాలవృష్టి, కంచి ముయ్యేడునాళ్ళు వర్షించినపుడు
వెలిసినప్పుడె యీవీడు విడుచువార, మనుచుఁ బట్టిరి ప్రతిన బౌద్ధాదిజనులు. 26
వ. బౌద్ధ జైన పాషండ లోకాయతిక చార్వాక కాపాలి కాహితుండిక వానప్రస్థ పాశుపత జంగమయోగి ప్రముఖులగు వైదేశికులలోఁ బట్టణంబునం గాపురంబున్న వారందఱుం దక్కఁ దక్కినవారందఱు గుంపులు గట్టి కోలం గొట్టిన తెఱంగున జలోపద్రవంబు దిట్టువారై మూఁడామడమేర యంతయు బుక్కిటిబంటియైనఁ దత్ప్రదేశంబు వెడలి గండంబులం గడచితి మని గుండియలు నిగిడికొనుచుం జనిరి. 27
శా. ఆముయ్యేడుదినంబులందు శివభక్త్యాచారసంపత్తికిన్
సీమాభూమి యనం బ్రసిద్ధుఁడగు నాచిర్తొండనంబీశ్వరుం
డేమీ కొంకక పెట్టు జంగములకున్ హేరాల మిష్టాన్నముల్
సేమం బొప్పఁగ రేలునుం బగలునున్ విశ్వాసపూర్వంబుగన్. 28
చ. అనిన మునుం గుమారసిరియాళుఁడు నాతనినాదియైన చం
దనికయు ధన్యు లప్పరమదంపతులున్ శివభక్తకోటికై
యనుపమవృష్టి వేగ కొనియాడుదు రెన్నియునుం దెఱంగులన్
దినములు రేబవల్ దధిమధుప్రచురాన్నసమర్పణంబునన్. 29
తే. వంటచెఱకులు లేకున్న వ్రాములైన, వస్త్రములు తైలమున ముంచి వహ్నిఁ గూర్చి
వంటకంబులు వండి యవ్వారి గాఁగఁ, బెట్టు శివభక్తతతికి నంబిప్రభుండు. 30
ఉ. జోరును వర్షము ల్గురియ సువ్రతుఁ డాచిఱుతొండనంబి దై
వాఱెడుభక్తిఁ బెట్టు శివభక్తుల కర్థిఁ జతుర్విధాన్నముల్
తారనియొల్పుఁబప్పును ఘృతంబును దియ్యని పాయసంబులుం
జాఱలు బిండివంటలును శర్కరయున్ దధియున్ యథేచ్ఛగన్. 31
క. కఱకంఠునిభక్తులకుం, జిఱుతొండఁడు మిగులభక్తి సేయుచును గడున్
దఱచగుపెనువానలలో, నుఱవగుకూటముల మడుఁగు లోరెము లిడుచున్. 32
వ. శతైకవృద్ధిలబ్ధంబులైన ధనంబులఁ గోటికిం బడగ యెత్తిన యక్కిరాటవంశకిరీటాలంకారంబు వీరశైవాచారం బాధారంబుగా శరీరార్థప్రాణవంచనంబు సేయక జంగమప్రమథుల నారాధించుచుఁ గల్పాంతకాలకల్పంబులైన యాదుర్దినంబుల నియమం బుపద్రవంబు నొందకుండం గాపాడుకొనుచు నుండె నిట్లుండ నవ్వాన వెలియుదినంబు సంప్రాప్తించె. 33
తే. ప్రతిదినంబును జంగమప్రమథముఖ్యు
డొకఁడు మొదలుగ మఱి యెంద ఱొదవకున్న
నారగింపనిబాసవాఁ డగుటఁ జేసి
నాఁడు పుణ్యుండు చిఱుతొండనంబివిభుఁడు. 34
వ. మధ్యాహ్నకాలంబున వీరమాహేశ్వరసమయసిద్ధాంతమార్గానుసారంబున. 35
ఉ. ధీనిధి సెట్టితంబి తనదేహమునిండ విభూతి మంగళ
స్నానముఁ జేసి ధౌతపరిధానముఁ గట్టి త్రిపుండ్రధారియై
చే నమృతాశుమౌళిని వశీకృతభక్తు ధరించి సంతత
ధ్యానముఁ జేసి యెంతయును దత్పరభావము ప్రస్ఫుటంబుగన్. 36
సీ. జలక మార్చె నవీనచంద్రార్ధమౌళికిఁ దడి యొత్తె భక్తమందారమునకుఁ
జందనం బర్పించె జగదేకభర్తకుఁ బుష్పమాలిక లిచ్చె భూతపతికి
ధూపంబు సంధించె దురితసంహరునకు దీప మిచ్చెను మహాదేవునకును
దాంబూల మొనరించె నంబికాధవునకుఁ బ్రణమిల్లె జగదైత్యభంజనునకు
తే. జంగమారాధనక్రియాసమయమునను, గాని యుపహార మీరానికారణమున
దేవదేవుని విరిసెజ్జఁ దిరము సేసి, వాకిటికి వచ్చె శివయోగివరుల నరయ. 37
క. ఏవేళఁ జూచినం దన, శ్రీవాకిటఁ బగటివేళ శివయోగివరుల్
వేవేలసంఖ్య లుండెద, రావేళ నొకళ్ళు లేమి యద్భుత మయ్యెన్. 38
తే. అప్పు డాశ్చర్య మంది వైశ్యప్రభుండు, మగుడి లోనికిఁ జనుదెంచి మంద్రఫణితి
నోలతాతన్వి శివయోగి యొకఁడు లేఁడు, నేఁడు మొగసాల నిది యేమి మూఁడె నొక్కొ. 39
చ. ముసురుదినంబులందు మనమోసలఁ బంచటరుంగుమీఁదటన్
భసితవిభూషణుల్ పరమపావనమూర్తులు శైవసంహితా
భ్యసనపరాయణుల్ గిరిశభక్తు లనేకులు నిండియుంద్రు నేఁ
డసితసరోరుహాక్షి యొకఁ డైనను లేఁ డిది యేమి చోద్యమో. 40
తే. వీథికై యేగి వత్తునా వేగవేగ, నేఁడుమాత్రము కొందఱు నియమపరులు
పాదసరసిజయుగళప్రసాదమాత్ర, మబ్బెదరు గాక మనభాగ్య మల్ప మగునె. 41
వ. అని పల్కి తిరువెంగనాచితో నేను జంగమప్రమథులం బురంబువీథుల వెదకి తేరం బోవుదుఁ గాన లింగార్చనములకుం దగినపదార్థంబు కూడం గూర్చుకొని యుండుమా యని చందనంబును భూతియుఁ జెందిరయుఁ బుచ్చికొని దుప్ప టంబు ధరియించి చిఱుతొండనంబి నిజగృహంబు వెలువడి యక్కాంచీనగరమ్మునందు. 42
ఉ. అంగడి వేల్పుటిండుల సురావసధంబుల రచ్చపట్టులన్
జంగిలిసాలలం గణకశాలల వేశ్యలవాసవాటికా
ప్రాంగణభూములందు శివభక్తిపరాయణుఁ డర్థితోడుతన్
జంగమముఖ్యులన్ వెదకు సంభ్రమముం భయముం దలిర్పఁగన్. 43
తే. బ్రెమసి తప్పినపసరంబు వెదకినట్లు, బెరసి చేఁదప్పిపడ్డసొ మ్మరసినట్లు
పురములో వాడవాడలఁ దిరుగఁజొచ్చె, జంగమాన్వేషణార్థియై శైవవరుఁడు. 44
క. వచ్చినవాడకు వచ్చుం, జొచ్చినవాసంబుఁ జొచ్చుఁ జొచ్చినచోటే
యచ్చుగఁ గ్రమ్మఱఁ జొచ్చుం, బచ్చు శివార్చనకు శంభుభక్తుల వెదకన్. 45
వ. ఇవ్విధంబునఁ గంచియెల్లనుం బరికించి యెందునుం గానక కోట వదలి యక్కిరాటకులశ్రేష్ఠుండు తప్పుగా నరిగి బాహ్యాళిప్రదేశంబునఁ బువ్వుందోఁటచేరుద నొక్కపాడుగుడిగర్భమంటపంబున శతవర్షదేశీయుండును జరాజర్ఝరితదేహుండును బలితపొండుజటామండలుండును రుద్రాక్షమాలికాభసితత్రిపుండ్రాలంకృతుండునై నిజవయోనురూపయగు గ్రుడ్డియవ్వ పాదంబు లొత్తుచుండ బలికలాసంబుమీఁదం బవళించి యున్న యయ్యవారికి శరణార్థి యగుచు మ్రొక్కె. 46
ఉ. మ్రొక్కి కరాంబుజద్వయము మోడ్చి లలాటమునన్ ఘటించి మా
యక్కడ మీరు నీముసలియవ్వయు నేఁడు శివార్చనంబు స
మ్యక్కృతిఁ జేసి నన్నుఁ జరితార్థునిఁ జేయుట యుక్త మంచు నా
టక్కరిమాయజోగికిఁ దటాలు మనం బ్రణమిల్లినంతటన్. 47
తే. నరసి వ్రాలినబొమ లెత్తి పరమవృద్ధు, తల వడంకఁగ నొయ్య నీ రెలుఁగుపడుచు
నంబినెమ్మోము దేరకొనంగఁ జూచి, శివుని కారుణ్య మనుచు నాశీర్వదించె. 48
క. దీవించి యతనివదనముఁ, జేవెలుఁ గిడి చూచి యేమి చెప్పెదు చెపుమా
యే వీనుల వినఁ గావున, నీ వొత్తుచుఁ జెప్పు చెప్పె దేని మహాత్మా. 49
వ. అనినం జిఱుతొండఁడు కృతాంజలియై యుచ్చైస్స్వరంబున దేవా మాయింటికి శివార్చనంబు సేయ దేవియు నీవును విజయము చేసి మమ్ముం గృతార్థులఁ జేయఁ విభూతి యందు మనుటయు. 50
సీ. నీవంశ మెయ్యది నీనామ మెఱిఁగింపు శివభక్తిసమయదీక్షితుఁడ వౌదె
పెండ్లాము నీకుఁ జెప్పినయట్లు సేయునే కులము సంతానంబు గలిగి యున్నె
కూడు సీరకు నింటఁ గొద లేకయుండునె యడిగినయర్థ మీ ననువుపడునె
యెదిరివా ఖండించు టిది దెప్పరము సుమ్ము జలగజంపులు జోగిజంగకొలము
తే. లడిగితిమి గాని యెవ్వండ వైననేమి, యొక్కభిక్షకుగా నిన్ను నొరయనేల
శైవవీరవ్రతాచారసాహసుండు, తనయుఁ డొక్కఁడు గల్గ నాపనికిఁ జాలు. 51
వ. ఈవృథాలాపంబులఁ బనియేమి నామనోరథంబు వినుము. 52
సీ. ఏడుగాలం బయ్యె నేను నిరాహార ఘోరవ్రతంబుఁ గైకొన్నవాఁడ
హరుని నుద్దేశించి యమ్మహావ్రతమున కుద్యాపనంబు పశూపహార
మయ్యాగపశువు నన్యం బేదియును గాదు నరుఁడు కావలయు నన్నరుఁడు బ్రాహ్మ
ణక్షత్రవైశ్యసంతతులలో నొక్కఁడౌ వాఁడును గడుఁ బిన్నవయసువాఁడు
తే. రోగశంకావిహీనుండు రూపసియును
వానితల్లియుఁ దండ్రియు వడుగు సేసి
పాక మొనరించి వడ్డింప భవున కొసఁగి
కుడుతు నాపఙ్క్తి నీవు నీకొడుకుఁ గుడువ. 53
వ. అనినం జిఱుతొండనంబి మహాప్రసాదం బయిన వైశ్యకులసంభవుండ తిరుకచ్చినంబి సంబంధబాంధవుండ నాపేరు చిఱుతొండనంబి యండ్రు శివభక్తులకుం బాదచర్య సేయుచుందు. 54
ఆ. భక్తుఁ డేవ్రతంబు పట్టె నావ్రతము పా, రంబుఁ బొందఁ జేయువ్రతము నాది
యీవ్రతంబు నాకు నెప్పు డొడఁగూడ, దప్పుడు తిరుబాస యనఘచరిత. 55
వ. నీ యానతిచ్చినప్రకారంబున నయ్యపహారంబు సేయించెద విభూతి యందుకొనుము మాయింటికి విచ్చేయు మభ్యంజనస్నానం బవధరించిన యంతలోన వంటకంబు లాయితంబు లగునని ప్రార్థించిన. 56
శా. మో మడ్డంబుఁ గదల్చి మోరకుఁడునుంబోలెన్ శివారాధకుం
డామానాధికుతోడ ని ట్లనియె నయ్యా వృద్ధ నే నీవచః
ప్రామాణ్యంబులు విశ్వసింప నతిదూరం బానతీవచ్చె నీ
రాదూరత్నము కాదు కూడ దనినన్ రాఁ జాల నీచోటికిన్. 57
చ. ఉదరమునన్ భరించి ప్రసవోద్భవవేదనఁ బొంది పిమ్మటన్
ముదిముది యైనసీతఁ బడి మూత్రమునం బడి లజ్జ పండుగా
నదవద యైనతల్లికిఁ బ్రియంబొ సుతుండు వృథాభిమానదు
దుర్మదుఁడగు తండ్రికిం బ్రియుఁడొ మానసవీథిఁ దలంచి చూడుమా. 58
వ. ఇంతకుఁ గతం బింతలేసి వీరమాహేశ్వరఘోరవ్రతంబులు నీవు చేసినయవి లేవు పుత్రస్నేహంబు సామాన్యంబు కాదు నీవును నీభార్యయును విచారించుకొనునది యిక్కార్యంబు మీకిద్దఱకును సమ్మతం బగు నేని. 59
తే. అందు నది భూతిఁ దొలుత నీయనుఁగుభార్య, యందుకొనువాఁడ వీవు ననంతరమున
నాలు మగఁడును నొకకుత్తు కైనఁ గాక, యిట్టిధర్మంబు మిన్నక యేల కలుగు. 60
వ. మీ రిద్దఱు సమ్మతించితిర యేనియు హంతవ్యుం డగునక్కుమారుం డిక్కార్యంబునకు నెవ్విధంబున నొడంబడువాఁడు. 61
తే. నీకుఁ జంపఁగవచ్చుఁ బో నియమనిష్ఠఁ, దల్లి కోర్వంగవచ్చుఁ బో ధైర్యగరిమ
మాకు భుజియింపవచ్చుఁ బో మనసుతివుటఁ, జిఱుతవానికిఁ జావు దుస్తరముగాని. 62
ఉ. పా డయినట్టిచిత్త మొకపాటున నిల్పఁగ మాటిమాటి క
ట్టాడును నుండుఁగాన దనయాత్మయునుం దన కిట్టి దౌ ననం
గూడునొ కూడదో యెదిరికోర్కి యెఱుంగుట యెట్టు కుట్టియా
చూడఁగ దోసకాయలె విశుద్ధయశోధన యన్యచిత్తముల్. 63
క. శివభక్తుఁడ యిదికొని య, య్యువిదకును విభూతి యీప్రయోజనమునకై
యవుఁగాక టెంకి కేగు మ, నవలంతియె కంచి నీకు నడుగామడయే. 64
వ. అనినం జిఱుతొండండు నిజాంతర్గతంబునం దనభార్యకుం గలశివభక్తివిశ్వాసంబులును జంగమారాధననియమనిష్ఠయుఁ దనయానతి దాఁటమియునుం గుమారసిరియాళుండు నట్టివాఁ డగుటయు నెఱింగియు నాశివయోగితో నవుఁగా దని యుత్తరప్రత్యుత్తరంబులకు నెట్టుకొనంజాలక ఛందోనువర్తనంబ మహాప్రసాదం బని యతం డిచ్చు విభూతి యందుకొని నిజమందిరమునకు వచ్చినంత. 65
తే. ఇంటిలోనుండి వెలుపలి కేగుదెంచి, యంగనారత్న మగుతిరువెంగనాంచి
భర్తముఖరాగ మీక్షించి ప్రమద మొందెఁ, గాలమున నెందు శివయోగి గలిగెననుచు. 66
వ. చిఱుతొండనంబియు నాబింబాధరకు శివయోగి సంభ్రమించుటయుఁ దద్వ్రతచర్యాప్రకారంబును నాదిమధ్యావసానంబుఁ దెలియం జెప్పుటయు నయ్యింతి యింతయు మిసిమింతురాలు గాక ముసిముసినవ్వు నవ్వి మనశరీరార్థప్రాణంబులకుం గర్తలు శివయోగీశ్వరులే కాక మఱి యెవ్వరు వారిసొమ్ములు వారికే సమర్పించు టదియును నొకదొడ్డపనియే యెటు విశేషించి. 67
చ. వలచినయేని నబ్భువనవంద్యునకున్ శివయోగినేతకున్
బొలకయి గారవం బయినపుత్రకుఁ డొక్కఁడ యేల మాంసమున్
వలముగ మీరు నేను నగువారమె కామె విభూతిఁ దెం డిఁకం
బలుకులు వేయు నేటి కలభక్తునినేమము పార మొందుతన్. 68
వ. అనినఁ దదర్థంబు నిశ్చయించి చందనికకు నవ్వృత్తాంతం బంతయు నెఱింగించు మువ్వురు నేకోద్యోగంబున శివయోగికిం బరిచర్య సేయువారైరి. చిఱుతొండండును శివయోగిం దోడ్తేరం జనియె నటకుఁ బూర్వంబునందు. 69
చ. కపటపుమాయజోగి యగు శశాంకధరుండు వృద్ధవే
షపుఁ దనరూపు వీడి వెలిచక్కిన యుండఁగ నొండురూపుతో
నపగతదోషుఁడైన సిరియాళకుమారుకుఁ డొజ్జయింటిలో
లిపి పఠియింపఁగా మదిఁ జలింపఁగఁ జేయుకుతూహలంబునన్. 70
వ. వచ్చి చూచినంత. 71
ఉ. హస్తగృహీతపుస్తకమునందు లిఖించినయట్టి నీలకం
ఠస్తవమున్ బఠించుచు ఘనంబుగ ధీగుణవైభవోన్నతుల్
విస్తరిలంగ బాలకులు వేవురిలో సిరియాళుఁ డుండె న
భ్యస్తలిపిప్రపంచుఁడు గ్రహంబులలో నుడురాజుకైవడిన్. 72
తే. ఆజటాధారి చేరంగ నరుగుదెంచి, తనకు సాష్టాంగ మెరఁగి తాత్పర్య మెసఁగఁ
గేలుదమ్ములు మొగియించి కెలన నున్న, చిన్నిముద్దులసిరియాళసెట్టి కనియె. 73
శా. అన్నా యీచిఱుతొండనంబి యనుపాపాత్ముండు మీతండ్రియే
యన్నిర్భాగ్యుఁడు జోగి కొక్కరునికిన్ హాలమదోన్మాదికిన్
నిన్నుం జంపి మహేశహారముగ వండింపంగ నున్నాఁడు సం
పన్నస్నేహముతోడ నీకు నెఱిఁగింపన్ వచ్చితిం జెచ్చెరన్. 74
క. కడుపునఁ బుట్టినకూరిమి, కొడుకున్ సుకుమారమూర్తిఁ గులవర్ధనునిన్
మెడఁ గోసి చంపి నంజుడు, గుడుపులజోగులకుఁ బెట్టుక్రూరులు గలరే. 75
తే. దానవుఁడు గాకవాఁ డేటితండ్రి చెపుమ
చెక్కునిండినవస యొల్కు చిఱుతవాని
మత్తుఁ డొక్కఁడు మధుపానమత్తుఁ డగుచు
నిన్ను వేఁడినఁ జంపఁగ నిశ్చయించె. 76
వ. “జీవన్ భద్రాణి పశ్యతి” యను వేదవచనం బవలంబించి యెక్కడికేనిం బోయి యీబారి తప్పించుకొనుట నీకుం గర్తవ్యంబు. 77
చ. అనవుడునుం గుమారసిరియాళుఁడు వీనులు మూసికొంచు నో
యనఘచరిత్ర నీకు నిటులానతి యీఁ దగు నయ్య నీకుఁ గా
దని పలుకంగ నాకు భయ మయ్యెడు గాక పరార్థమై తనూ
ధనము వ్యయింపఁ గల్గుట కదా జననైకఫలం బెఱింగినన్. 78
తే. ఎఱుక చాలనివాఁ డందమే దధీచి, నల్పబుద్ధులె మేఘవాహనుఁడు శిబియు
ధరఁ “బరోపకారార్థ మిదం శరీర” మనెడు వాక్యంబు వినవె సంయమివరేణ్య. 79
తే. అధ్రువంబైన మలభాండమైన దేహ, మనఘ యన్యోపకారార్థమై వ్యయించి
ప్రవిమలంబుఁ గల్పాంతరధ్రువము నైన, కీర్తికాయంబుఁ గైకొంట కార్తియేల. 80
వ. అనిన జటాధారిజంగమప్రమథుండు వీఁడు చిఱుతొండనంబికంటె నధికుండు వొమ్మనుచు మరలి పోవువాఁడు వెండియు. 81
తే. కపటమాయామహానాటకప్రపంచ, సూత్రధారుండు చిఱుతొండసుతున కపుడు
మూర్ఛ రప్పించె హరుఁ డందు మోసపోయి, యక్షరాచార్యుఁడును భయమంద నలసి. 82
శా. నోర న్నుచ్చిలి గ్రమ్మ మై వడఁకఁ గన్ను ల్తారకాబింబసం
చారవ్యాప్తి నధఃకరింప హృదయస్థానంబు గంపింప గ్రీ
వారంధ్రంబున ఘర్ఘధ్వనులు తీవ్రస్ఫూర్తి వర్తింపఁగా
సీరాలుండు ధరిత్రిమీఁదఁ బడి మూర్ఛిల్లె న్నిరాలస్యతన్. 83
క. మోహాంధకారధారా, వ్యూహమున సిరాలుసెట్టి యుసు ఱుడుగుటయున్
హాహాకారధ్వనికో, లాహల మచ్చోట గురుకులంబునఁ జెలఁగన్. 84
తే. ప్రణుతపంచాక్షరీమంత్రపాఠశక్తి, ఫాలమున దేశికుఁడు భూతిఁ బ్రాముటయును
గ్రమ్మఱను మూర్ఛ దెలిసె సిరాలసెట్టి, భక్తులకు భస్మమే కదా ప్రాణరక్ష. 85
వ. అంత నక్కడ. 86
సీ. చిఱుతొండఁ డావృద్ధశివయోగిపుంగవుఁ బ్రబలకుష్ఠవ్యాధిబాధితాంగు
వీఁపుమీఁద ధరించి వెనువెంట గ్రుడ్డవ్వ కోలూఁదికొని రాఁగఁ గూర్చుకొనుచు
బూది బొక్కణ లాతమును కమండలువును బులికళాసముఁ గరంబున వహించి
శరణీయు లెదురుగా శరణార్థి సేయుచు నొయ్యొయ్య సందడి కోసరిలుచు
తే. చంద్రశేఖర భూతేశ శర్వ రుద్ర, పార్వతీనాథ శంకర భవ గిరీశ
కాలకంధర హర కాలకాల యనుచు, వచ్చె నింటికి జనకోటి యిచ్చగింప. 87
మ. మహి నూహింపఁగ నెంతభాగ్యమొకొ యామ్నాయాంతసిద్ధాంతవా
ఙ్మహిళాకుంతలమౌక్తికాభరణమున్ మందాకినీశేఖరుం
గుహనాభైరవు యోగిపుంగవుని భర్గున్ రాజమార్గంబునన్
వహియించెన్ దనవీపునం దిరముగా వైశ్యుం డనాలస్యతన్. 88
ఉ. ఇంటికిఁ దెచ్చి యోగిపరమేశునకున్ వణిజుండు తాను వా
ల్గంటియు భక్తియున్ భయము గౌరవమున్ వినయంబు నాత్మలో
నంటుకొనంగ నప్డు ముసలమ్మకు సైతము కమ్మనూనె మై
నంటి నలుంగుతో జలక మార్చి యొసంగిరి ధౌతవస్త్రముల్. 89
వ. అనంతరంబ యేకాంతగృహంబున సర్వోపచారసంభారభరితంబుగా దేవతార్చనకుం బెట్టిన నయ్యాదిమదంపతు లిరువురు శివపూజావ్యాపారంబునం బ్రవర్తిల్లుచుండి రప్పుడు శివాజ్ఞావశంబునం జేసి. 90
ఉ. పల్లియచోటనుండి యెలపాసెము నడ్కులు జక్కిలంబులున్
బెల్లపుటచ్చులున్ సెనగబేడలుఁ జిమ్మిలి నువ్వుటుండలున్
బెల్లుగ నంబివియ్యములు పెద్దఱికంబుఁ బ్రియంబు నొప్ప మే
నల్లునకుం గుమారశిరియాలునకుం గొనితెచ్చి రర్మిలిన్. 91
వ. అంత. 92
సీ. ఫాలపట్టికయందు భస్మత్రిపుండ్రంబుఁ గర్ణంబులను రాగికమ్మదోయి
కరమునం దిత్తడికంబంపుఁగంటెయు ఘనకుచంబులమీఁదఁ గావిగంత
కటిమండలంబునఁ గరకంచుఁబుట్టంబు మడఁచి కట్టిన మేలినడిమికట్టు
కేలుదామరయందుఁ గేదారవలయంబు గడకుచ్చుమీఁదఁ బచ్చడపుఁగండ
తే. సంతరించి పదాఱువర్షములవయసుఁ, బచ్చిబాలెంతరాలు తాపసపురంధ్రి
నంబిభామినిఁ దిరువెంగనాంచిఁ జేరి, పాలుపోయింపుఁ డమ్మ పాపనికి ననియె. 93
ఉ. మక్కువ రేఁగి నెయ్యపుఁగుమారునిఁ జంపుట కంతరాయమై
యక్కటికంబు పుట్టుటకు నల్లన వచ్చి భవాని యత్తఱిం
దక్కటిమాయజోగెతవిధంబున బిడ్డకుఁ బాలు వేఁడ నా
యక్కయుఁ బోసె నెల్లసమయంబులఁబోలె నిరాకులాత్మ యై. 94
తే. పాలువోయించుకొని యాకృపాళుమూర్తి
శూలివాంచారి పాలిండ్లచూచుకములు
పాలచేఁపున గిలిగింత వాఱుటయును
మెత్తమెత్తన నఱచేత నొత్తుకొనుచు. 95
వ. తిరువెంగనాంచితో నిట్లనియె. 96
మ. ప్రజలెల్లం బురిఁ గ్రంతక్రంతల మహాపాపంబుగాఁ బల్కెడున్
నిజమో కల్లయొ కాని మీ రఁట కడున్ నిస్త్రింశభావంబునన్
నిజపుత్రున్ సుకుమారుఁ జంపి యొక దుర్ణిర్వాణికిం జోగికి
న్భుజియింపంగ నొనర్చువార టిది యెందుం గల్గునే యిద్దరన్. 97
క. జోగులు కపటోపాయ, ప్రాగల్భ్యంబున నిధాననవసిద్ధులకై
యేగతుల నైనఁ దిరుగుదు, రోగిరముగ సుతునిఁ జంపు టుచితమె మీకున్. 98
తే. ఆవగింజంత భూతి మై నలఁదికొనిన, వెలఁది గుమ్మడికాయంత వెఱ్ఱి పుట్టుఁ
గటకటా యెట్లు తనబుద్ధి కాటఁ గలియ, నిసువుఁ జంపంగఁ దలఁచెనో నీమగండు.
క. కానండు గాక కన్నులు, దా నేమిటివాఁడు నీదుతనయునిఁ జంపన్
మానవతీ “మగవాఁడో, మానో” యనుమాట నేఁటిమాటయె చెపుమా. 100
వ. అనినం దిరువెంగనాంచి యక్కపటపుంజంగమదేవి మాటలు వినక నిర్వికారం బైన యాకారంబుతో నమ్మా శివుఁడన శివయోగి యన భేదంబు గలదే శరణార్థులయర్థ ప్రాణంబులు శివాధీనంబులు శివుండు కర్త శివుండు భోక్త యీయర్థంబునకుం జింతింప నేల నీకుం దడవయ్యెడు బాలెంతరాలవు చన్నులు చేఁపుచున్నవి బిడ్డ యింత కెంత యలమటం జెందునో పాలు చాలుగదా యెప్పుడు మాయింటికి వచ్చుచుం బోవుచుండునది నిండుకొని యుండు మని కేలుదోయి ఫాలంబునం గీలుకొల్పి సముచితవ్యాపారంబులం బ్రవర్తించుచుండం జంకు గానరాక పార్వతీదేవియు నట నుండి చని యంతర్ధానంబు సేసె నాసమయంబున. 101
తే. చేర నేతెంచి చిఱుతొండసెట్టి యంత, యింతి తిరువెంగనాంచితో నిట్టులనియె
నొజ్జలగృహంబునకుఁ బోయి యుత్పలాక్షి, వడుగు సేయఁగవలెఁ బిన్నవానిఁ దెమ్ము. 102
చ. చెలువ కుమారుని న్వడుగు సేసిన చేతడి యాఱకుండఁగా
బొలు పెసలారఁగా నిరుగుపొర్గులవారల భాగ్యసంపదల్
కుల మభివృద్ధిఁ జెంద మనకూరిమినందనుఁ బెండ్లిసేయఁగా
వలయు ననంతరక్షణమ వైభవ మొప్పఁగ ముక్తికన్యతోన్. 103
వ. అనిన నామెయు నట్ల కాక యని యాచార్యగృహంబున విద్యాభ్యాసముఁ జేయుచున్న కుమారునిం దోడ్కొని వచ్చినంత. 104
ఉ. మంచిగ మేనయత్తలు సమాదరణం బడరంగఁ బెట్టి పు
త్తెంచినమంచిభక్ష్యములు తేనియ నేతను ముంచి ముంచి భ
క్షించుచుఁ దల్లిఁ దండ్రి దన చిన్నికరాంగుళి వంచి వంచి యూ
రించుచు నిచ్చ మీఱఁగఁ జరించెఁ గుమారకుఁ డింటిముంగిటన్. 105
వ. అనంతరంబ. 106
సీ. జడలయల్లిక యూడ్చి సంపంగినూనియఁ, బిన్న కూఁకట్లఁ జొబ్బిలఁగ నంటి
గోప్య దేశంబు సంకుమదద్రవంబున నయమార నుద్వర్తనంబు సలిపి
గీసి గొజ్జఁగ నీరుపోసి నూఱిన క్రొత్త చిరుబంతి పసుపులో చేవ నలఁది
కస్తూరిఁ బొరపినగంధసారంబుతో సీకాయయెరువున జిడ్డు విడిచి
తే. తేటనులి వెచ్చనీరునఁ దీర్థ మాడి, వేణి యీటార్చి సురపొన్న విరులు ముడిచి
మడుఁగు కట్టి కాటుక యిడి తొడివి పూసి, భసితరేఖాత్రిపుండ్రంబు నొసటఁ దీర్చి. 107
వ. కయిసేసి కుమారునిం గనుఁగొని జననీజనకు లిట్లనిరి. 108
ఉ. భైరవయోగి కొక్కనికిఁ బాశుపతవ్రతచర్యతీరునం
బారణకై నినుం బలలపాకము గా నొనరించి పెట్టుచు
న్నారము భోజనంబు ప్రియనందన నీహృదయంబునందు సం
సారముఁ బాయఁజాలని విచారము లేదు గదా యొకింతయున్. 109
వ. అనినం గుమారసిరియాళుండు. 110
శా. సంసారభ్రమ మించుకేనియును మత్స్వాతంబున్ లేదు మీ
వంశం బీపరిపాటిదే యుడుగుఁడీ వైక్లబ్యసంభావనల్
మాంసాహారము లయ్యెదన్ శివునకున్ మాయామహాయోగికిన్
హింసాక్లేశము మానుఁడీ గురులు మీరే మిమ్ముఁ బ్రార్థించెదన్. 111
వ. అని పల్కె నప్పుడు. 112
ఆ. చావ నియ్యకొనినసత్పుత్రకునకును, జంప నియ్యకొనినదంపతులకుఁ
దారతమ్య మెద్ది వీరమాహేశ్వరా, చారసమయమార్గగౌరవమున. 113
వ. ఇవ్విధంబున మువ్వురును జందనికాపురస్సరంబుగా నేకనిశ్చయు లయిరి తదనంతరమున. 114
సీ. చన్నిచ్చులాగున జనయిత్రి తొడలపైఁ బసిబిడ్డ బవ్వళింపంగఁ బెట్టె
జందనిక తనహస్తప్రణాలంబులు క్రింద నంటుక సంతరించుకొనియెఁ
జిన్నిబుగ్గల లేఁతచిఱుతనవ్వు వెలర్ప శిరియాలుఁడు మొగిడ్చెఁ జేయిదోయి
చిఱుతొండనంబి క్రొమ్మెఱుఁ గార చురుకత్తి వాఁడిగా నూరుచు వంక దీర్చె
తే. నేకమై యట్లు మువ్వురిహృదయములును, గుంద కానందవారిధియందుఁ దేలె
గురులు మువ్వురునుఁ గుమారవరునితోడ, నేకవాక్యంబుగాఁ బ్రీతి నిట్టులనిరి. 115
మ. మది శంకింపకు మన్న మావలనిప్రేమస్నేహవాత్సల్యసం
పద వాటింపకు మన్న నాలుకతుదిక్ బంచాక్షరీమంత్రముం
బదిలం బొప్పఁ బఠింపు మన్న పరమబ్రహ్మార్థసంసిద్ధి యి
య్యది సుమ్మన్న యనుంగునందన శిరాలా వీరశైవవ్రతా. 116
ఉ. నంబి శివార్థము న్ననసునమ్మిక శంక యొకింతయేని చి
త్తంబునయందు లేక వనితామణియూరువుఁ దాపుఁ జేసి తీ
క్ష్ణం బగుకత్తి మోప మెడ గ్రక్కునఁ ద్రెవ్వి నమశ్శివాయమం
త్రంబుఁ బఠించుచుండెను శిరాలుశిరంబు వసుంధరాస్థలిన్. 117
ఉ. కందక గాజువాఱక వికారము దప్పక మందహాసని
ష్యందము చెక్కుటద్దముల జాఱక నెమ్మది నిద్రవోవున
ట్లందము నొందె ధాత్రి శిరియాలకుమారునివక్త్రచంద్రుఁ డా
నందము నొందె నప్పు డెలనాఁగమనంబును భర్తచిత్తమున్. 118
తే. పన్నిదం బాడి గెలిచిన భావ మొప్ప, నప్పు చక్కంగఁ దీర్చినయనువు మెఱయ
సతియుఁ బతియును గారంపుసుతు వధించి, వరుస నడపిరి వీరశైవవ్రతంబు. 119
చ. మిరియము నుల్లియున్ బసుపు మెంతియు నింగువ జీరకంబు శ
ర్కరయును జింతపండును గరాంబువు గమ్మని నేయి తెైలమున్
బెరుఁగును మేళవించి కడుఁ బెక్కువిధంబులఁ బాకశుద్ధి వం
డిరి శిరియాలునిం గటికిడెందమునం దరళాక్షు లిద్దఱున్. 120
సీ. కమ్మగాఁ గాఁచినకట్టునంజుళ్లను నీరు వెళ్లఁగ నొత్తి నేత వేఁచి
చక్కఁగాఁ దఱిగినసన్నమాంసంబులు పరిపాటిమై జుఱ్ఱుఁబదను వండి
మూల్గుటెమ్ములతోడ ముదక గాకుండఁగఁ జాదు సేసిననల్లచారు గాంచి
వలయుసంబారాలు వడియాలు బలియించి దళమైన కొవ్వుతోఁ దాలఁబోసి
తే. షడ్రసోపేతములు గాఁగఁ జతురభంగి, నమృతపాకంబులుగఁ జేసి రాక్షణంబ
సెట్టి శిరియాలు వంశాబ్ధిశీతకరుని సతులు తిరువెంగనాంచియుఁ జందనికయు. 121
క. నానావిధపాకములుగ, నానాలుగఁ జేసి యపుడు నాల్గువిధములన్
బోనాముదొంతిఁ జేర్చిరి, సూనాస్త్రసమానుఁ డైన సుతు శిరియాలున్. 122
సీ. నిగనిగంగాఁ దోమి నిండుబోనముదొంతి భోజనశాలలోఁ బొసఁగఁ జేర్చి
చెలువ గొజ్జఁగనీటిచేపట్టు గావించి పాటించి రత్నకంబళము పఱచి
దేవతార్చకు ధూపదీపాదు లొడఁగూర్చి కప్పురంబున మ్రుగ్గు గలయఁబెట్టి
యెడమదిక్కున రాగిపడిగెంబు ఘటియించి గరగతో విమలోదకములు డించి
తే. యతివ సర్వాయితం బయ్యె నయ్యగారి, కారగింపఁగ నవసరం బనుచుఁ బలుక
సెట్టి తోడ్తెచ్చె జంగమసిద్ధవృద్ధు, నంధురా లగుముదుసలియవ్వతోడ. 123
క. శ్రీపాదంబులు గడిగెను, శ్రీపాదోదకముఁ గొనియెఁ జెలువయుఁ దానున్
వ్యాపారిసార్వభౌముం, డాపరమతపస్వి నునిచి యర్చించెఁ దగన్. 124
వ. అనంతరంబ చిగురు ముదురునుం గాని నిడుపు వెడల్పుం గలకదళీపలాశంబు నడిమియీనియఁ బుచ్చి పఱచి యుదకంబునం బ్రక్షాళించి యుపస్తరించి పాయసాపూపసూపపుండ్రేక్షుద్రాక్షాగోక్షీరమధుశర్కరాఘృతదధిరసావళీశాకపాకశిఖరిపానకంబులతోడ గారాపుంగొడుకుపాల మేలోగిరంబుతోడం గూడ భరితభోజనంబుగా వడ్డించి గ్రుడ్డియవ్వకు సైత మట్లనే సమర్పించి దేవ! భక్తవత్సల! శివయోగీశ్వరరూప! విరూపాక్ష! యమృతాహారం బారగించి రక్షింపుమని చిఱుతొండఁడు భార్యయుం దానును భక్తితాత్పర్యవిశ్వాసపురస్సరంబుగా నమస్కరించిన. 125
ఉ. భైరవయోగిరాజు పసిపాపనినంజుడుఁగూరలందు లో
నారసి చూచి మస్తకమునందలి మాంసము లేమి గాంచి యీ
నీరసమాంస మేటికి వణిగ్వర! పుత్రునియుత్తమాంగముం
గూరలు సేయ వైతి వివిగో నిజపుత్రనిసర్గమోహముల్. 126
తే. కటకటా! మా వ్రతంబు భగ్నంబుఁ జెందె, నేటి పారణ మిది మాకు నేటి కింక
నుత్తమాంగపుమాంసము నుజ్జగించి, యేల యధమాంగమాంస మే నెటు భుజింతు. 127
వ. అనిన విని చిఱుతొండండు భయంపడి వెలవెలం బాఱుచుఁ దిరువెంగనాంచి వదనం బాలోకించి యింక నెట్లనినం జిట్టమిడుచు నంతఁ దలకాయపొల మేలోగిరంబు ముందటం బెట్టి చందనిక యిది యేను మొదలన బెడందకాండ్రగు యోగిబృందారకులచందం బెఱింగినదాన నగుటం జేసి పాకంబుఁ జేసికొనియున్న దానం దపస్వి చిత్తం బేపాకంబునుం బొందకుండ వడ్డించెదం గాకని యట్లు చేసిన నక్కుహనాభైరవుండు వెండియు. 128
తే. బంతి నీ వారగింపక పరమపుణ్య!, నాకుఁ జేయాడునే భోజనంబు సేయ
నొకఁడు భుజియించు టెన్నఁడు నొప్పదనెడు, వేదవాక్యార్థ మన్నది వినవె చెపుమ.129
వ. మఱియు నొక్క భోజననియమంబు కలదు పిన్నవాఁడు బంతిభోజనంబు సేయక కూడు నోటికిం బోదు మగబిడ్డండు లేని నిర్భాగ్యునింట భోజనంబు సేయఁగూడదు నీకుమారు నాబంతికి రప్పింపు మారగించెద మనవుడు. 130
మ. మొదలం దేవర యానతిచ్చితిర యేముం జిత్తమం దెంతు మ
య్యది నాకుం గొడు కింకను గలఁడె వాఁ డాడంగ వేంచేసెనే
చదువు బోయెనె పిల్వఁ బంతు నెటు నేజాడం బ్రతిక్షించు
నీ యదనం గూరలు చల్లనారవె మహాత్మా యోగిచూడామణీ! 131
వ. అనిన నత్తపోధనుఁ డిట్లనియె నీయుత్తమాంగన యెలుంగెత్తి నలుదిక్కులం బిలుచునది కుమారుండు వచ్చెనేని బంతిం బెట్టుకొని భుజింతము రాకుండెనేని నేమును నీ ముసలియవ్వయుం గుడుత మటు గాక యొఱగొడ్డెంబులు వలికి నీపడ్డపాటు గొడ్డేఱుఁగా జిడ్డుపఱపం గలవారమె యనినం బ్రసాదం బని పతియనుమతిం బురంధ్రీరత్నంబు. 132
సీ. రారా వణిగ్వంశవారాశీహిమభామ! రారా వికస్వరాంభోరుహాక్ష!
రారా మహాఘోరవీరశైవాచార! రారా ఘనౌదార్యరాజరాజ!
రారా కుమారకంఠీరవేంద్రకిశోర! రారా సమగ్ర ధీ రౌహిణేయ !
రారా మనోభహకారరూపవిలాస ! రారా యసారసంసారదూర!
తే. రార నావన్నెవడుగ! రారా తనూజ!, రార శిరియాల! రార నా ప్రాణపదమ!
రార నాకుఱ్ఱ! కాజియ్య! రార యనుచుఁ, జీరెఁ గారాపుఁగొడుకు రాజీవనయన. 133
శా. ఆ త్తన్వంగి సమస్తదిక్కులను పర్యాయ క్రమం బొప్పఁగా
నొత్తెం జిన్నికుమార రార యని యత్యుచ్చైశ్రుతిం జీరినం
జిత్తంబుం గనవచ్చె బాలుఁడు మహాశీఘ్రప్రచారంబునన్
దత్తద్వ్యంజనపాకగంధ్యవయవస్థానప్రతానంబుతోన్. 134
శా. రక్షాపాండుర మైనదేహము నహిగ్రైవేయముం గంధరా
కుక్షిం గప్పును బ్రస్ఫురద్ఘనజటాకోటిన్ శశాంకార్ధముం
జక్షుఃపద్మముతోడ ఫాలతలమున్ సంధిల్ల శంభుండు ప్ర
త్యక్షం బయ్యె శిరాలుతండ్రికి హృదాహ్లాదంబు సంధిల్లఁగన్. 135
వ. అప్పుడు భయభక్తితాత్పర్యంబులు మనంబున ముప్పిరిగొన నప్పరమమాహేశ్వరుం డిట్లని స్తుతియించె. 136
మ. జయ హాలాహలనీలకంధర మహేశా భక్తచింతామణీ
జయగంగాధర చంద్రశేఖర జగత్స్వామీ కృపాంభోనిధీ
జయ నీహారధరాధరేంద్రతనయాచారుస్తనద్వంద్వసం
శ్రయసంలగ్నపటీరకుంకుమరజస్సంపన్నబాహాంతరా. 137
వ. అని మఱియు ననేకప్రకారంబులం బ్రస్తుతించె నిట్లు ప్రత్యక్షం బైనవిరూపాక్షుండు చిఱుతొండనంబీ! నీవు తుంబురుండవు శిరియాళుండు కుమారస్వామి తిరువెంగనాంచి యచ్చర మీరిద్ద ఱొక్కకకారణంబుస మర్త్యయోనిం జనించితిరి మీమీస్థానంబులనుండి తొంటిచందంబున నన్నుం గొలువుఁడు శరీరంబుల తోడం గైలాసంబునకు రండని యనుగ్రహించిన. 138
సీ. వైశ్యాన్వయంబున వసుధ వర్ణన కెక్కి వేయిగోత్రంబుల వినుతిఁ గాంచి
వీరమాహేశ్వరాచారంబు వదలక యేడువాడలవార మేము గలసి
వర్తిల్లుదుము వాసి వట్ట మేమియు లేక యిట్టిబంధులఁ బాసి యే నొకండ
రా బుద్ది రాదు తారకరాజశేఖర యిందఱఁ గొనిపోయి తేని వత్తుఁ
తే. గూర్చుకొనిపోవు నీ కొడఁగూడెనేని, నట్లు గాకున్న విచ్చేయు మభవ మరలి
ప్రమథసన్నిధి కేమియు బాధ లేదు, కొలిచెదము నిన్ను మే మెల్లఁ గూడిమాడి. 139
వ. అనిన శంభుండు కరుణించి యేడువాడలుఁ గదలివచ్చునది నీకుం బ్రియం బగునివ్వరం బిచ్చితి నని యానతిచ్చిన తత్క్షణంబ. 140
తే. కంచిలో నేడువాడలఁ గలిగినట్టి, నాణెపుంగోమటులతోడ నంబిసెట్టి
యఖలజీవరాసులఁ గూడి యభ్రవీథి, భాసురస్ఫూర్తి నేగెఁ గైలాసమునకు. 141
వ. ఇది కావేరీవల్లభులును నుభయరావలులును కిష్కింధాచలక్రీడావినోదులు నయోధ్యాపురాధీశ్వరులును నగువైశ్యకులంబులవారలకుం గూటస్థుండయిన చిఱుతొండనంబియుపాఖ్యానము వినిననుం జదివినను వ్రాసినను బుత్రపౌత్రాభివృద్ధియును ధనకనకవస్తువాహనసమృద్ధియు నిష్టార్థసిద్ధియు నగును. 142
ఆశ్వాసాంతము
శా. చాముండాపరమేశ్వరీవరకృపాసంవర్ధితైశ్వర్యని
స్సీమప్రాభవలక్ష్మణాగ్రజసుధాసిక్తాక్షరాలాపయ
త్యామర్దార్జునవీరశైవసమయవ్యాపారపారీణతా
సామాన్యప్రతిభావనిర్వహణదీక్షా శక్వరాధీశ్వరా. 143
క. కర్పకటకాంఘ్రిసేవక, కర్పూరవసంతరాయ కావేరీశా
దర్పితరిపుగర్వతమో, హర్పతిసౌకర్యదక్ష యంబురుహాక్షా. 144
తోటకవృత్తము—
అలకాధిపతీ సుగుణాభిరతీ, మలయోద్భవచంద్రసమానయశా
కులపావనయూరుజగోత్రవరా, లలనాజన తాఝషలక్ష్మనిభా. 145
గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర వినయవిధేయ శ్రీనాథ
నామధేయప్రణీతం బయినహరవిలాసం బనుమహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.