Jump to content

హరవిలాసము (1931)/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము


శ్రీపర్వతసోపాన
స్థాపక వేమక్షితీశసామ్రాజ్యశ్రీ
వ్యాపారిముఖ్య యన్వయ
దీపక యలకాధిరాజ దేవయతిప్పా! 1

వ. ద్వితీయవిలాసం బైన గౌరీకల్యాణం బాకర్ణింపుము. 2

ఉ. తారకుఁడన్ మహాసురుఁడు తామరసాసనదత్త మైనదు
ర్వారవరానుభావమున వ్రాలి త్రిలోకము నేలుచుండు ని
ష్కారణతీవ్రబాధ ననిశంబును ముప్పదిమూఁడుకోట్లబృం
దారకులన్ మహర్షులఁ బ్రతాపగుణంబున నెచ్చి పాఁతుచున్. 3

తే. నిరపరాధబాధితు లగు నిర్జరులకు, బంధమోక్షంబుఁ గావించు గంధవహుఁడు
సతులపయ్యెద వెడలించి చన్నుఁగవకుఁ, దప్పు సేసియు దైత్యుచిత్తంబు వడసి. 4

మ. ప్రకటస్నేహదశాధురంధరత పర్వంగా నిశీధంబులన్
సకలాంగంబులు నిక్కి దీపకలికాస్తంభంబులై యుంద్రు పా
యకచూడామణు లొప్ప రాక్షసునిశుద్దాంతంబులన్ శేషవా
సుకికర్కోటకతక్షకప్రముఖచక్షుశ్శ్రోత్రబృందారకుల్. 5

తే. దానవునివీటిలోన మార్తాండుఁ డెండ, యంతమాత్రంబ కాని కాయంగ వెఱచు
నెంతమాత్రము కాసిన నెలమిఁ బొందు, గేళిదీర్ఘికలందుఁ బంకేరుహములు. 6

మ. పటుదిగ్వారణగండమండలలసత్ప్రత్యగ్రదానచ్చటా
కటుగంధం బగునీరు చిక్కనివియద్గంగాప్రవాహంబులో
పటిహైమాంబుజనాళముల్ పెఱికి యూడ్వం జేయు దేవాళిచే
నిటు దైతేయుఁడు గేళిదీర్ఘికలలో నిచ్ఛావినోదంబుగన్. 7

తే. ఐంద్రమాసుర మాగ్నేయ మైలబిలము, వాయవీయ మైశానంబు వారుణంబు
యామ్యమును మున్నుగాఁ గలయష్టదిశలు, తాన కైకొని కైకోఁ డతండు సురల. 8

వ. ఇవ్విధంబునఁ దారకాసురుండు కాసరాక్ష తామ్రాక్ష ధూమ్రాక్ష చతురోదగ్ర ఖడ్గరోమ బాలబిడాల కాలనేమి ప్రధాన నానాబంధుసహాయుండై పాకశాసన పావక పరేతరాజ పలలాశి పాశి పవన పౌలస్త్య పన్నగాభరణులఁ బరిభవించి నిర్జరులం దర్జించి కిన్నరుల వెన్నుసూచి కింపురుషులఁ జంపి గరుడులఁ బడలుపఱచి గంధర్వుల బంధించి గుహ్యకుల సంహరించి యక్షుల నధిక్షేపించి ఖేచరుల గీటడంచి యచ్చరల హెచ్చు గుందాడి సిద్ధులకు బుద్ధి చెప్పి సాధ్యుల సాధించి మహారాజికుల రాజసం బుడిపి విద్యాధరుల నధగికరించి మహాఋషుల నదలించి పితరులఁ బ్రతిబంధించి వసువులఁ బరిమార్చి రుద్రుల కుపద్రవం బాపాదించి విశ్వేదేవతల కనాశ్వాసంబు సేసి యనశ్వరం బగునైశ్వర్యంబున నప్రతీపం బగుప్రతాపంబున నవార్యం బగువీర్యంబున నవక్రం బగుపరాక్రమంబున నస్తోకం బగువివేకంబున నేకాతపత్రంబుగాఁ ద్రిలోకంబు లేలుచున్న కొంతకాలంబునకు. 9

సీ, అనువు దప్పిరి నొచ్చి రలసి రాపద నొంది రదవద లైరి చీకాకుపడిరి
యంగలార్చిరి విచ్చి రారడిఁ బొందిరి బ్రమసిరి పాఱిరి పల్లటిలిరి
బెగ్గడిల్లిరి పికాపిక లైరి సొలసిరి కులకులఁ గూసిరి కుతిలపడిరి
గగ్గులకా డైరి కలఁగి రోటాఱిరి వెలవెల్ల నైరి నివ్వెఱఁగుపడిరి
లే. యసవుసవు లైరి గుజగుజ యైరి డస్సి, రొల్లఁబోయిరి వెగ్గిరి తల్లడిలిరి
సిగ్గుపడి రొచ్ఛవడిరి యిస్సియిసి యైరి, తారకునిచేత మునులు బృందారకులును. 10

ఉ. ఇట్టి విధంబునన్ విబుధు లెప్పుడునుం గనుఁగాపులట్లు ము
ప్పెట్టియుఁ జేసిచేసియును వేసరి యింద్రుఁడు మున్నుగాఁగ ది
క్కెట్టిటు లున్న మా కనుచు నేగిరి పద్మజుఁ గూర్చి యేగి కూ
పెట్టిరి హస్తముల్ మొగిచి పెద్దయెలుంగునఁ దద్గుణస్తుతుల్. 11

వ. జయ జయ జగన్నాథ! జగజ్జననస్థితిసంహారకర! జంభారిప్రముఖనిఖిలబర్హిర్ముఖశిఖామణీమయూఖమంజరీరంజితపాదపీఠ! జలజాసర! జాహ్నవీప్రముఖసకలతీర్థతీర్థసంపూర్ణస్వర్ణకమండలుధర! జపతపోనిష్ఠాగరిష్ఠమనోధిష్ఠానఋగ్యజుస్సామాధర్వణమయనానానిశ్వాస! హిరణ్యగర్భ! భూర్భువస్సువస్త్రయీశుకీపంజర! నిరంజన! భారతీవిహారసౌధాయమానచతుర్వదన! సనాతన! సనత్కుమారజనక! శతానంద! శాశ్వత! విశ్వతోముఖ! నిర్వికల్ప! నిరీహ! నిరాకార! ఓంకారగమ్య! అదిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయ! ఆదిమధ్యాంతశూన్య! అవ్యయ! అవాప్తసకలకామ్య! అనంత! అద్వితీయ! నిరస్తసమస్తోపాధికసచ్చిదానందస్వరూప! నమస్తే నమస్తే నమః. 12

తే. నీదునిట్టూర్పుగాడ్పులు నిగమపఙ్క్తి, ప్రణవమంత్రాక్షరము నీకు భద్రపీఠి
విలయకాలంబు నీనిద్ర విశ్వమునకు, నీప్రబోధంబ యుదయంబు నిఖిలమునకు. 13



తే. అవధరింపుము విన్నపం బాదిపురుష!, యవధరింపుము మము లోకాధినాథ!
తడవు సేయక రక్షింపు తమ్మిచూలి!, తారకుఁడు మము పెక్కు దుర్దశలఁ బెట్టు. 14

చ. పడితిమి కుక్కలంబడిన పాటులు దుర్భర మైనవృత్తి వె
న్బడితిమి గర్భయాచకులభంగి దరిద్రత నట్టుకొంచు లో
పడితిమి పాలలోఁ బడిన బల్లుల కైవడి నెల్లవెంటలం
జెడితిమి వేయు నేల సరసీరుహసంభవ! దుష్టదైత్యుచేన్. 15

తే. తారకుం డెవ్విధంబున ధ్వంస మొందు, నెట్టు బ్రదుకుదు మేము మా కేది దిక్కు
చిత్తగింపుము దేవ! సంశ్రితజవార్తి, హరణపారీణ! కరుణారసార్ద్రహృదయ! 16

వ. అని కరుణంబుగా విన్నవించిన హిరణ్యగర్భుండు ప్రసన్నుండై బృందారకులను మహర్షులనుం గనుంగొని యి ట్లనియె. 17

సీ. వెఱవకుం డింద్రాదివిబుధపుంగవులును శాండిల్యభృగ్వాదిసంయములును
నస్మద్వరప్రభావానుభావంబున వాఁ డింతవాఁ డయ్యె వాఁడి మిగిలి
విషవృక్ష మేసియు వృద్ధిఁ బొందఁగఁ జేసి తనకుఁ గాఁ బెఱుకుట తగవు గాదు
పార్వతీదేవికి భవున కుద్భవ మైన తేజంబు వాని మర్దింపఁగలదు
తే. తండ్రి యగుదక్షుమీఁది క్రోధంబువలన, యోగనిరుక్తదేహ యై యుద్భవించి
పెరుఁగుచున్నది హిమభూమిధరగృహమున, నమ్మహాదేవు శివుఁ గూర్పుఁ డను వెఱింగి. 18

వ. ఇంతనుండియు మీకు మేలయ్యెడుఁ బొండని పురందరాది బృందారకుల వీడుకొల్పి శతానందుండు యథోచితవ్యాపారంబులం బ్రవర్తిల్లుచుండె నిట్లు దేవతలు భావిశుభసూచకంబు లగుగంధవాహాదినానానిమిత్తంబు లనుసంథించుచు నిజస్థానంబుల కరిగిరి యనంతరంబున. 19

సీ. అటమున్న దక్షకన్యక తండ్రితో నల్గి యోగమార్గమున మే నుజ్జగించి
యపరజన్మంబున నజ్ఞాతియోని యై యోషధులకు నెల్ల నున్కిపట్టు
మేరుమందరవింధ్యపారియాత్రాదిసుప్రథితాద్రిసంబంధబాంధవంబు
నైననీహారశైలాధినాథునకును బితృదేవతలకన్నబిడ్డ యైన
తే. మేనకాదేవి కుదయించె మేలు వేడ్క, నబ్ధిచెలికాఁడు మైనాకుఁ డన్న గాఁగ
నభిజనాఖ్య పార్వతి యన నఖలజనని, యాదిశక్తి పురారియర్థాంగలక్ష్మి. 20

క. పావనజంగమభువనశు, భావహ మై విశదదశదిశాంతర మై యీ
దేవి యుదయంబు నొందిన, యావేళం గుసుమవర్ష మంతటఁ గురిసెన్. 21

తే. జనని విద్యుల్లతాభ మౌచాయ గలిగి, కొత్త యుదయించినట్టియాకూఁతువలనఁ
గారుకాలంబుమణిశలాకయును బోలె, నొప్పెడువిదూరభామిని యుద్ది యయ్యె.



వ. అనంతరంబ ప్రతిదినవర్ధమాన యై లబ్ధోదయ యగుచంద్రరేఖయుం బోలె బంధుజనంబులకుఁ బ్రమోదంబు నందించుచు మందాకినీసైకతవేదికాస్థలంబులఁ గంచుకక్రీడ సల్పుచు నుపదేశకాలంబుల విద్యలు నేర్పుచు బాల్యంబుఁ గడపి నేత్రోన్మీలనంబు సేసిన చిత్రంబునంబోలె యౌవనవిభక్తం బై యభ్యుదయం బై యభ్యున్నతాంగుష్టనఖప్రభావిక్షేపంబున రాగంబు వెడలు గ్రక్కునవియుం బోనిచరణప్రవాళంబులు వృత్తానుపూర్వంబు లై యనతిదీర్ఘంబు లగుజంఘాప్రకాండంబులును వేదండశుండాదండంబులకు వైదండికంబు లై యొప్పారునూరువులును మేఖలాకలాపమధ్యకీలితమహేంద్రనీలమాణిక్యకిరణరేఖయుంబోలె నాభిరంధ్రంబునం బుట్టి మీఁదికి నిగుడ రాజిల్లు రోమరాజియును నవయౌవనారోహణార్థంబు మన్మథుం డొనర్చిన మణిసోపానంబులంబోని వల్లీవిభంగంబులును గుదుళ్ళు నిండఁ బలుకం బండిన మారేడుపండ్ల గారాముఁ జెఱుచు గబ్బిగుబ్బలబెడంగులును నభినవశిరీషకుసుమసుకుమారంబు లగుబాహువులును ధర్మబంధురం బగుకంధరంబును సంపూర్ణపూర్ణిమాచంద్రబింబంబుడంబు విడంబింపం జూచునాననంబును గావియగు మోవియును నూఁబూవువంటి నాసికయు నిద్దంపుటద్దమ్ములకుఁ దోడిముద్దు లగుముద్దుచెక్కులును సుమకోదండపల్లీమతల్లు లగుకఱివంక బొమలును విదియనాఁటిచందురునకుం గదిసి చుట్టం బగులలాటపట్టంబును గొదమతుమ్మెదనాలుఁ బురుడింపం జాలునీలాలకంబులును నొప్ప సర్వోపమాద్రవ్యసముచ్చయం బగుసౌందర్యంబు నేకత్రావస్థానదిదృక్షచే విరించి సూక్ష్మీకరించి యథాప్రదేశనివేశితంబుగ నొనర్చెనో యనం దల్లిదండ్రులకు నామోదంబు నాపాదించుచుండ నొక్కనాఁడు నారదుండు సనుదెంచి. 23

క. త్రిభువన మోహన యగున, య్యిభగమనం జూచి పర్వతేశ్వరునిమహా
సభలో నిట్లని పలికెను, శుభవచనప్రౌఢి మెఱయ సురముని యెలమిన్. 24

సీ. ఈ నీరజాతాక్షి మేనిలో సగపాలు గణుతింప మగపాలు గాఁగ నున్న
దీపల్లవాధర శ్రీపాదపద్మంబు నొరయు నొక్కొక్కమా టుడుగణేశుఁ
డీకాంతతోడ మందాకినీవాహినీ సవతి గాఁ గల దేమిచందమునను
నీలతాతన్వికి నీరేడులోకంబు లభిరామకేళివార్యంబు లగును
తే. నిండువేడుకఁ గాంచు నీనీలవేణి, కొమ్ముటేనుంగుమొగ మైన కొడుకుఁగుఱ్ఱ
నత్తయును మామయును లేనిరిత్తయింట, మనువు మనిపెడు నీయింతి మగనితోడ. 25

ఉ. మాటలు వేయు నేమిటికి మంగళలక్షణలక్ష్మి యైనయీ
జోటికి భర్త కాఁ గలఁడు సోమకిరీటుఁడు సర్వదేవతా
కోటికిరీటకోటిపరికుంచితదివ్యమణిద్యుతిచ్ఛటా
పాటలపాదపీఠుఁ డగుపట్టి కృతార్థుఁడ వైతి భూధరా. 26

వ. అని చెప్పి నారదుండు సనియె నంతనుండి హిమవంతుండు నివృత్తాన్యవరాభిలాషుండై యయ్యోషారత్నంబు శేషభూషణునకు నీ నిశ్చయించియు నభ్యర్థనాభంగభయంబునం జేసి. 27

క. త న్నడుగ రానిశివునకుఁ, గన్నియ నె ట్లిత్తు నతనికారుణ్యము నా
కెన్నఁడు సిద్ధించునొ యని, యన్నగపతి యాత్మఁ దలఁచె నౌత్సుక్యంబున్. 28

వ. అంత విరూపాక్షుండు దక్షరోషంబు కారణంబు గా దాక్షాయణి శరీరమోక్షంబుఁ
జేసినది మొదలు గా సర్వసంగపరిత్యాగంబుఁ గావించి యపరిగ్రహుండై. 29

సీ. గంగాప్రవాహసంక్షాళితాభ్యున్నత రుద్రాక్షదేవదారుద్రుమంబుఁ
గస్తూరికాకురంగజనాభిపరిమళ శ్లాఘ్యేందుకాంతపాషాణతలముఁ
గిన్నరద్వంద్వసంభిన్నపంచమరాగ నిర్యన్మహావేగనిర్ఘరాంబు
పతితప్రతిధ్వానభంగోరుఘుమఘుమ ఘుమఘుమాయతదిశాగోళకంబు
తే. నైనహిమశైల పాదంబునందు నియతిఁ, దపము సేయంగ మదిలోనఁ దలఁచి విడిసెఁ
బ్రమథవర్గంబుఁ దానును బసవ డపుడు, కృత్తివాసుండు విషయనివృత్తుఁ డగుచు. 30

తే. ప్రమథు లెల్లరు విడిసి రప్పర్వతమునఁ, జంద్రకాంతశిలామణిస్థలములందు
నమరియుండునమేరువృక్షములనీడ, భూర్జతరుచర్మపరిధానములు ధరించి. 31

చ. బసవఁడు ఱంకె వైచి హిమపర్వతసారువనాంతరంబులం
బసిరిక మేసి నిర్ఝరులఁ బాఱెడుతియ్యనినీరు గ్రోలి క్రొ
వ్వొసఁగ ఘనాఘనధ్వనుల నుల్లస మాడెడుఁ దత్పురంబునన్
బ్రసభగతిన్ మృగేంద్రములు భద్రగజంబులు భీతిఁ జెందఁగన్. 32

తే. ఆత్మమూర్త్యంతరం బైనయగ్నిదేవు, నర్చనముఁ నేసి నియతి నయ్యష్టమూర్తి
బహుతపోవ్రతనియమైకఫలవిధాత, తపముఁ జేసెను మది నొక్క తలఁపుఁ జేసి. 33

తే. అపుడు హిమవన్నగేంద్రుఁ డత్యాదరమున, నతిథియై యున్న శంభున కర్చ లిచ్చి
తత్సమారాధనక్రియార్థమునఁ బంచె, నిజతనూజ నజినసమన్వితము గాఁగ. 34

క. రమణి తపోవ్రతచర్యా, సమధికవిఘ్నంబ యనుచుఁ దలపోసియు శీ
ఘ్రము గైకొనె శివుఁడు వికా, రము లేక మదిం దపంబు రమణీమణియున్. 35

సీ. పాటించుఁ బువ్వులు పల్లవంబులు గోయుఁ గుశపవిత్రంబులుఁ గూడఁబెట్టు
నాపగ రహి మీఱు నర్ఘ్యోదకములును నుపకరణంబులు నొయ్యఁ జేర్చు
వేదికాసమ్మార్జవిధి నివర్తించును లీలమై రంగవల్లిక లొనర్చుఁ
గల్పించు లెస్సగా గంధాక్షతంబు లుత్పాదించు ధూపదీపాదికములు
తే. ప్రత్యహంబును హిమధరరాజతనయ, భవునిపదపద్మములమీఁద భక్తి గలిగి
తచ్ఛిరశ్చంద్రచంద్రికాస్తబకశైత్య, శాంతపర్యటనక్రియాశాంతి యగుచు. 36



వ. అక్కాలంబునం దొక్కనాఁడు స్వర్గలోకంబునఁ బాకశాసనుండు కల్పానోకహంబులనీడలఁ జింతామణి వేదికాస్థలంబులందు బృందారకులు పరివేష్టింపఁ బేరోలగం బుండి దివిజకార్యార్థసంసిద్ధిఁ బొంద మనంబునందుఁ గందర్పునిం దలంచిన. 37

సీ. కాంతాజనంబుల కఱివంక బొమలతోఁ బ్రతివచ్చు పుష్పచాపంబుతోడఁ
గోకిలవ్రాతంబు గ్రుక్కిళ్లు మ్రింగించు క్రొమ్మావిచిగురాకుగొడుగుతోడఁ
రతిదేవినిడుసోగఁ గ్రాలుకన్నులడాలుఁ దలపించు మీనకేతనముతోడ
భుజగలీలావతీభుక్తశేషము లైన గంధవాహకిశోరకములతోడఁ
తే. జందురునితో వసంతమాసంబుతోడ, రాజకీరరథం బెక్కి ప్రాభవమున
వచ్చె వలరాజు చిత్రానువర్తనముగ, సంభ్రమముతో మహేంద్రు నాస్థానమునకు. 38

ఉ. పక్షము పెంపునం గుసుమబాణుని మీఁదనె వ్రాలె దేవతా
ధ్యక్షుని వేయికన్నులును దక్కిన వేల్పుల నుజ్జగించి సూ
క్ష్మేక్షికఁ జూడఁ గార్యగతి యిట్టిదయౌ ప్రభువుల్ ప్రయోజనా
పేక్ష నొకప్పు డాశ్రితులపేర సమంచితగౌరవోన్నతుల్?.39

క. రా యిటు రమ్మని చేతికిఁ, జే యిచ్చి ప్రమోదరేఖ చిగురొత్త మరు
న్నాయకుఁడు నిల్పె సుమన, స్సాయకు సరిగద్దెమీఁద సౌహార్దమునన్. 40

వ. అప్పుడు. 41

తే. పతిప్రసాదంబుఁ దనమౌళిపై ధరించి, మహితవినయావనమ్రుఁడై మన్మథుండు
సంగతంబుగ హస్తాంబుజములు మోడ్చి, విస్ఫురోక్తుల నిట్లని విన్నవించె. 42

వ. దేవర నన్నుఁ దలంపున నవధరించిన కారణం బేమి యానతిమ్ము. 43

సీ. ఎవ్వండు నీపదం బెలమి నుద్దేశించి యతిఘోర మగుతపం బాచరించె
నెవ్వండు నీచిత్త మెరియించుచున్నాఁడు కైవల్యపదవికైఁ కాలుసాఁచి
యెవ్వండు గురునీతి కేపాకమును బొంద కుద్దండరీతి మాఱొడ్డి నిలిచె
నెవ్వండు దంభోళిహేతినిర్ఝరధారఁ దలఁచె నీలోత్పలధారఁ గాఁగ
తే. వాని భంజింతు నాతనిమాన మడఁతు, నతని నిర్జింతు నాతని నతకరింతు
నానతిమ్ము మహేంద్ర నాయట్టిహితుఁడు, నీకుఁ గలుగ నసాధ్యంబు నెగడు నెందు. 44

తే. ఏకభర్తృవ్రతస్థ యై యేలతాంగి, నీకుఁ జేయాడుధర్మంబు నిలువరించె
నది వినిర్ముక్తలజ్జ యై యమరరాజుఁ, జేయుఁ గాత స్వయంగ్రహాశ్లేషణంబు. 45

తే. ప్రణయకోపప్రశాంతికై పాదపతితు, నిన్ను నేపువుఁబోఁడి మన్నింప దయ్యె
నాలతాంగిఁ బ్రవాళశయ్యాశరణ్య, దేహఁ గావింతు విడువు సందేహ మింద్ర. 46

క. నీవజ్రము సుఖముండుం, గావుత దివ్యాస్త్రశాలికామధ్యమునన్
దేవేంద్ర చెఱకువింటం, బూవులు శరములుగ నే రిపుల నిర్జింతున్. 47

వ. నీప్రసాదంబున మలయానిలంబు ప్రాపును వసంతంబుసహాయంబును నిండువెన్నెల చెలిమియుం గలుగఁ బినాకపాణి యగుహరు నైన జయింపం జాలుదు నని తలంతుం దక్కినవారు నాకెవ్వరు నెంత యని యుత్సాహంబునం బల్కినం బురందరుండు సంకల్పితార్థంబు సఫలం బయ్యెనని యంతరంగంబున సంతోషించుచుఁ గంతున కి ట్లనియె. 48

సీ. సంకల్పసంభవ సమకూర్తు వట్లనే యరుగంగ నీ కసాధ్యంబు గలదె
యటుకాన కానిమహాకార్యభరమునం దేము నియోగింతు మిపుడు నిన్ను
ధరణిభారధురీణతాప్రౌఢి కని కదా తను మోఁచు శేషునిఁ బనిచెను హరి
విబుధకార్యార్థంబు విశ్వేశ్వరు గుఱించి యరుగంగవలయు నీ వధికభక్తి
తే. కుధరకన్యను శశిమౌళిఁ గూర్పవలయుఁ, బార్వతీపరమేశ్వర ప్రభవ మైన
దివ్యతేజంబు సేనాపతిత్వ మొంది, జయముఁ గావించు నని చెప్పె జలజభవుఁడు. 49

వ. హిమాద్రిపాదంబున దేవదారువనంబున నియతాత్ముఁ డై పరబ్రహ్మానుసంధానంబు సేయుచు నంధకారాతి తపంబు సేయుచున్నవాఁడు పార్వతియు హిమవన్నియోగంబున నీశ్వరునకుం బాయక పరిచర్య సేయుచున్నయది యీవార్త సకలలోకవృత్తాంతవిజ్ఞానార్థంబు పంపిన యప్సరస్త్రీవర్గంబువలన వింటి నిది కార్య క్రమంబు. 50

తే. ఇది యనన్య సాధారణ మిది యవశ్య, మిది పరోపకృతిక్రియాభ్యుదయశాలి
చేయు మిప్పని సంకల్పసిద్ధి గాఁగ, బాహువిక్రమపారీణ పంచబాణ. 51

తే. కోరి యభ్యర్థనము సేయువారు సురలు, కార్య మూహింప మూఁడులోకమ్ములకును
నతిశుభము కృత్యమో యల్ప మైనఁ గాదు, కామసంస్పృహణీయవిక్రముఁడ వీవు. 52

వ. హుతాశనునకు సమీరంబుంబలె మధుమాసంబు సహాయం బగుం గాత మర్థలాభంబును సేమంబును బునర్దర్శనంబు నయ్యెడు మని దీవించిన దేవేంద్రునియానతి ముత్యాలసేసబోలె శిరంబునఁ దాల్చి యైరావణకుంభికుంభాస్ఫాలనకర్కశం బగు కరంబున వాస్తోష్పతి తన్ను సంస్పర్శించి గౌరవించిన మన్మథుండు మధుసహాయుండై హిమవత్పర్వతంబు సేరం జనియు నాసమయంబునందు. 53

చ. సకలవనంబులందుఁ గలసంయమికోటి తపస్సమాధిని
స్ఠకుఁ బ్రతికూలవర్తి యయి షట్పదకోకిలరాజకీరజా
లకములతోడఁ గూడ ఝషలాంఛను నెచ్చెలికాఁడు వచ్చె వా
రక మధుమాసరాజు నవరాగసమంచితపల్లవాస్త్రుఁడై. 54

తే. ఉత్తరాభిముఖుం డైనయుష్ణరశ్మి, చంద మీక్షించి దక్షిణాశాపురంధ్రి
గంధవాహంబు దీర్ఘదీర్ఘంబు గాఁగఁ, జాఁగ విడిచెను విరహనిశ్శ్వాసధార. 55

శా. ఆమూలాగ్రమశోకపాదపము ప్రత్యగ్రప్రవాళావళి
వ్యామిశ్రంబుగఁ బూచె నప్పు డటు నీహారాద్రికుంజంబునన్
భామాకోమలపాదపంకరుహసంపర్కం బపేక్షింప కు
ద్దామం బైనవసంతజృంభణము సత్త్వం బొప్ప దీపింపఁగన్. 56

తే. చివురుగఱితోడ లేమావిపువులు శరముఁ, జేసి మధుమాసకాలంబు చిత్తజునకు
నళికులంబుల పేర నామాక్షరములు, వరుసతో నిల్పె ననఁ బొల్చె వానియందు. 57

క. నవకము లగుములుమోదువుఁ, బువు మొగ్గలు విపినవీథిఁ బొల్పెసలారెన్
దివుట వసంతుం డను ప, ల్లవుఁ డిడిన నఖక్షతంబులకు సరి యగుచున్. 58

తే. చెమట కింపురుషస్త్రీలచెక్కులందుఁ, గ్రమ్మి మృగనాభిపత్రభంగంబుఁ గరచెఁ
జందనద్రవ మిం పయ్యెఁ జన్నుఁగవకు, నలరుఁబన్నీటితో గుహ్యకాంగనలకు. 59

వ. అప్పుడు వనౌకసు లగుతాపసు లతి ప్రయత్నసంస్తంభితక్రియారంభులును మదనుండు సమారోపితపుష్పచాపుండును మధుకరంబులు కుసుమపాత్రపరిపూర్ణమధురసగండూషసముపలాలితప్రియాసందోహంబులును మృగంబులు మృగీకండూయనపరాయణంబులును నైయుండిరి వెండియు. 60

ఉ. పంకజరేణుగంధి యగుపల్వలవారిఁ గరేణు విచ్చె ని
శ్శంకమదావళంబునకు గంధగజంబును బద్మినీమృణా
లాంకురమర్ధభుక్తము నిజాంగనకుం బ్రియమార నిచ్చె నా
వంకఁ దపోధనుల్ హృదయవత్సలతన్ బ్రియ మంది చూడఁగన్. 61

ఉ. దేసికగానమార్గములఁ దిన్ననిరీతులఁ బాడిపాడి యా
శ్వాసము నొంది సోలి యరవాడినయంగన మోముఁదమ్మిఁ బు
ష్పాసవఘూర్ణితేక్షణము లల్లనఁ జుంబన మాచరించి యు
ల్లాస మొనర్చెఁ గిన్నరవిలాసి హిమాచలకందరంబునన్. 62

తే. అచ్చరలు పాడుహిందోళ మాలకించి, యిందుమౌళి ప్రసంఖ్యాన మెడలఁడయ్యె
నిర్జితేంద్రియు లైనట్టినియమపరుల, నంతరాయంబు లేమి సేయంగఁ గలవు. 63

వ. అప్పుడు వామప్రకోష్ఠార్పితహైమవేత్రకుం డగునందికేశ్వరుం డభినవవసంతసమయారంభసంభూతమనోవికారంబు లగు ప్రమథవీరులభావంబులు భావించి హుంకారంబు సేసి మాను మని యదల్చిన నాశిలానందనుదివ్యశాసనంబునఁ గాననం బెల్ల నిష్కంపవృక్షంబును నిభృశద్విరేఫంబును మూకాండజంబును బ్రశాంతమృగభారంబునై చిత్రార్పితావస్థానంబునుంబోలె నుండె నేనియు మనోభవుండు ముక్కంటి యెదురుఁ జక్కటిగాని యెకపక్కియఁగాఁ బురశ్శుక్రంబు నడచువాఁడునుంబోలె మనంబునం జంకుచు నెట్టకేలకు నాజగజెట్టి తపంబు సేయు చలికొండచట్టుపట్టునకుం

జనుదెంచి చుట్టునుం దిరిగియున్న సురపొన్నమోకల నీడనిల్చి యచ్చోట శార్దూలచర్మంబునం బర్యంకబంధురితపూర్వకాయుండును నుత్తానపాణియుఁ బ్రాణాయామపరుండును నగు నమ్మహాదేవునిపార్శ్వంబునం పుష్పాంజలి వట్టి ధ్యానావసానావసరముం బ్రతీక్షించుచుఁ గించిద్విలంబమానకేసరఛదాభిరామకాంచీకలాపయుఁ గర్ణికారకుసుమతాటంకయుఁ బల్లవావతంసయు నగు పార్వతిం గనుంగొని యిదియ నా కవసరం బని యధిజ్యశరాసనుం డై.64

సీ. వలుద కెంజడ కొప్పు వదలి వీడక యుండఁ
బెనుపాఁప తలపాగ బిగియఁ జుట్టి
మెడకప్పుతోఁ గూడి మిక్కిలి నలుపైన
కమనీయకృష్ణాజినము ధరించి
భ్రూవికారములేని పొడవుఱెప్పలలోని
ఘనదృష్టి నాసికాగ్రమున నిల్పి
యోగపట్టికఁ జెంది యొఱపైన నిలుకడ
నాసనస్థితబంధ మనువుపఱచి
తే. నిస్తరంగకమైన మున్నీరువోలె
గర్జితము లేని ఘనఘనాఘనమువోలె
ధ్యాననిశ్చలుఁడగు నిందుధరుని జూచి
ప్రసవనారాచుఁ డతిభయభ్రాంతుఁ డగుచు. 65

ఉ. ఒయ్యన డాయఁగాఁ జనియె నుగ్రవిలోచనుపార్శ్వభూమికిం
దయ్యముఱేఁడు నెచ్చెలి యెదన్ భయకంపము నుప్పతిల్లఁగా
దియ్యనివిల్లుఁ బుష్పములఁ దీర్చినయమ్ములు శౌర్యసంపదల్
వయ్యము గాఁగ భూమిఁ బడ వైచె నిలింపులు చూచి బెగ్గిలన్. 66

క. స్థావరరాజతనూభవ, యా వేళన డాయ వచ్చె నభవునిసేవా
హేవాకప్రౌఢిని వన, దేవత లెంతయు గభీరగతిఁ దనుఁ గొలువన్. 67

తే. పద్మరాగవిభూషణప్రతతి మాఱు, లలి నశోకలతాప్రవాళములు దాల్చి
సింధువారప్రసూనరాజీవరాజిఁ, గమ్రమౌక్తికరత్నశృంగార యగుచు. 68

చ. చనుఁగవ వ్రేగునన్ మిగులసన్నపుఁగౌ నసియాడఁ గెంపు మీ
ఱిన నునుఁబట్టుఁజేలఁ గటి ఱింగులు వాఱఁగఁ గట్టి భూమిభృ
త్తనయ ప్రసూనగుచ్ఛములు దాలిచి లేఁజిగురుల్ ధరించి వ
చ్చిన నడదీవవోలె నిలిచెం దరుణేందుకిరీటుసన్నిధిన్. 69

తే. తరుణి యందందఁ గేసరదామ కాంచి, జఘనపులినంబు నందుండి జాఱిపడఁగ
మాటిమాటికి హస్తపదముల నెత్తు, చపలభావంబుతో నుండె నభవుమ్రోల. 70

ఉ. కమ్మనియూర్పుగాడుపులగందముఁ గ్రోలఁగ వచ్చి యోష్ణబిం
బమ్ము సమీపదేశమునఁ బాయక యాడెడు తేఁటిఁ గేళిప
ద్మమ్మున మాటిమాటికి సమంచితవిభ్రమలోలదృష్టి యై
యమ్మదిరాక్షి చిమ్ము దరహాసవికస్వరగండపాళి యై. 71



తే. అఖిలలక్షణసంపూర్ణ యైనయట్టి, యాలతాతన్విఁ జూచి పుష్పాయుధుండు
రమణ దాఁ బూను దేవతారాధనంబు, సఫలతం జెందె నని చాల సంతసిల్లె. 72

ఉ. అప్పుడు డాయ వచ్చెఁ దరుణాబ్దకళాధరు గౌరి భక్తితో
నప్పుడు డాసె నీశ్వరుఁడు నంచితయోగసమాధినిష్టమైఁ
దప్పక బాహ్యసీమఁ బ్రమదం బెసఁగం బరమంబు సోహమై
యొప్పెడుదివ్యతేజము సముజ్జ్వలకోటితటిత్ప్రకాశమున్. 73

క. అసమభయభక్తు లలరఁగఁ, గుసుమంబులు దోయిలించి కోమలి నించెం
గిసలయ భంగంబులతో, నసదునడుము వణఁక మృడునియడుగులమీఁదన్. 74

ఉ. పల్లవపుష్పభంగములు పాదసరోరుహయుగ్మకంబు పైఁ
జల్లి శ్రవోవతంస మగుసంపగిమొగ్గ యొకింత జాఱఁగా
నల్లన మ్రొక్కె బార్వతి భయంబును భక్తియుఁ సంభ్రమంబు సం
ధిల్లఁగ భర్తకున్ ఘనఫణిప్రభుహారున కంధకారికిన్. 75

క. సరి లేని మగనిఁ బడయుము, తరుణీ యని పల్కె శివుఁడు తథ్యమ యిది యీ
శ్వరభాషితమునకుం దర, తరములయం దైన నన్యథాత్వము గలదే. 76

ఉ. పంచశరుండుఁ దత్పరత బాణవిమోక్షణకాలముం బ్రతీ
క్షించుచు గౌరి శంకరునిఁ జేరినయప్పటినుండి యెప్పుడున్
నించునొకో హరుండు తరుణీమణి నంచును వింట నారి సా
రించుచు నుండెఁ జెంత సురరీకృతదైవతకార్యధుర్యుఁడై. 77

తే. ప్రియము శోభిల్లఁగా సమర్పించె గౌరి, పసని పయ్యెద జాఱ దోఃపల్లవమున
భానుదీప్తులు నీటారి ప్రన్ననైన, పృథులమందాకినీపద్మబీజమాల. 78

తే. అంబుజాక్షి సమర్పింప నాదరమున, నక్షమాల్యంబు నిటలాక్షుఁ డందుకొనియెఁ
బంచబాణుండు సంధించె నించువిట, నస్త్రరాజంబు సన్మోహనాశుగంబు. 79

మ. శమనారాతి నివృత్తధైర్యుఁ డగుచుం జంద్రోదయారంభకా
లమునం బొంగిన దుగ్ధసాగరములీలం బక్వబింబాధరో
ష్ఠముఁ గర్ణాంతవిలాసనేత్రము నతిస్వచ్ఛంబునై యొప్పు గౌ
రిముఖాంభోజమునందు నిల్పె సరసప్రేమంబునం జూడ్కులన్. 80

తే. శైలసుతయును భావంబుకీలు దెలిసి, యంగకంబుల బులకంబు లంకురింప
వ్రాల్చె నెమ్మోము లజ్జాభరంబు పేర్మిఁ, గేకరాలోకనంబులఁ గెల్లుమలఁగి. 81

వ. అనంతరం బంతకమధనుం డతర్కితం బైన యింద్రియక్షోభంబు బలాత్కారంబుగా గుదియించి, చేతోవికారంబునకుం గారణంబుఁ దెలియం దలంచి దిశాంచలంబు

లకుం జూపు వఱపునప్పుడు కట్టెదుర దక్షిణాపాంగనివిష్టముష్టియు నాతతాంగుండును నాకుంచితసవ్యపాదుండునుం జక్రీకృతకార్ముకుండును బ్రహతోద్యుక్తుండును నైన మన్మథునిం గనుంగొని తపఃపరామర్శవివృద్ధక్రోధుండయ్యె నవ్వేళ భ్రూభంగదుష్ప్రేక్షం బగు విరూపాక్షునిలలాటేక్షణంబునం జనియించిన సముజ్జ్వలజ్జ్వాలాజాలం బైన కృపీటయోని భువనంబు లెల్ల భయభ్రాంతంబులై హాహాకారంబులు నేయ నమ్మీనకేతను శరశరాసనతూణీరంబులతోడంగూడ భస్మంబు చేసిన. 82

సీ. నాకభూషణుఫాలనయనానలముచేతఁ బంచబాణుఁడు బిట్టు భస్మమయ్యె
బ్రబలాభిషంగసంప్రభవమోహంబునఁ గేళిని యవశ యై వ్రాలె ధరణి
యువతిసంసర్గంబు యోగవిఘ్నం బని యభవుఁ డంతర్ధాన మాచరించెఁ
జెలికాఁడు తన మ్రోల నొనికి బూడిద యైన నామని యేడ్చె నా వఱచినట్లు
తే. గౌరి తన చారుసౌభాగ్యగౌరవంబు, విలువ పోయిన చెలువున విన్నవోయెఁ
బర్వతేంద్రుడు నిర్విణ్ణభావ యైన, కూర్మినందన నింటికిఁ గొంచుఁబోయె. 83

వ. ఆనంతరంబ రతీదేవి మోహాంధోన్మీలితంబు లైనలోచనంబుల నత్యంతప్రియదర్శనుం డగు ప్రియుం గానక పురుషాకారంబున భూమిం బడియున్న భస్మంబుం గని యిట్లని ప్రలాపింపం దొడంగె. 84

ఉ. చక్కనివారిలోన నెఱజాణలలో విటరాజకోటిలో
జిక్కనివారిలోఁ గడుఁబ్రసిద్ధివహించిన నీవు ప్రాణముం
దక్కినచోట నీమనసు ధైర్యమున న్మిసిమింతురాలు గా
నక్కట! పుష్పసాయక మహాకఠినాత్మలువో మృగేక్షణల్. 85

మ. ప్రతికూలాచరితంబు నావలన నల్పం బైననుం గాంచితే
ప్రతికూలాచరితంబు నీవలన నల్పం బైన నేఁ గంటినే
కృత మెన్నండును లేనిచంద మిది లక్ష్మీపుత్ర! నీయందు న
న్నతిదుఃఖాన్విత డించి పోవఁ దగవా యధ్వానపుంబట్టునన్. 86

క. తలఁతే మన్మథ! గోత్ర
స్ఖలితంబుంజఘనసూత్రకరబంధంబుల్
కలఁతే మఱియు వసంతో
త్పలకలికారాధనంబుఁ దత్సమయమునన్. 87

క. మెఱయంగ ముసురఁ గురియఁగ, నుఱుమం బురవీథులం బయోధరవేళం
దెఱవల రమణులయొద్దకు, నిఱుఁజీఁకటిదిశల నింక నెవ్వం డనుఫున్. 88

సీ. మదిరారసాస్వాదమదవికారంబులు బింబాధరలకు విడంబనములు
ప్రియవియోగంబున బెదరించువాఁ డయ్యు నుడువల్లభుఁడు నిష్ఫలోదయుండు
కోయిలనోరూరు క్రొతమామిడిమోక నవపల్లవంబు బాణత్వ ముడిగె
శుకశారికలు గూడి శోకస్వరంబులఁ బలవింపఁ దొడఁగెఁ దాపంబు గదిరి



తే. మాసములు దుఃఖపడె మధుమాధవములుఁ, జిన్నిమలయానిలంబులఁ జిన్నవోయె
మాట లేటికి వేయు నోమగలరాజ, విశ్వమున నీవు లేకున్న వెలితి వడియె. 89

తే. హృదయమున నుండి యెప్పుడు హృదయనాథ
ప్రియముఁ జెప్పెద ననుటెల్ల భేషజంబు
హృదయమున నుంట నిజమేని మదన యెట్లు
భస్మ మైతివి నే నెట్లు బ్రదుకుఁ గంటి. 90

వ. మన్మథ! మధురాలాపనిసర్గపండితంబు లగుగండుంగోయిలల నేలొకో భువనంబులకు రాయబారంబు పంపవు? ప్రణిపాతయాచితంబు లగుగాఢోపగూహనంబులు మఱచితే? యార్తవం బగుకుసుమప్రధానంబు నాయంగంబులం దిది నీవు రచియించినది కదా? దక్షిణేతరం బగుమదీయచరణంబు లాక్షారాగపరికర్మంబునకుం దగదొకో! పతంగమార్గంబున నింగలంబునం బడి భవదంకం బాశ్రయించెదఁగాక మదనుండు లేక రతీదేవి జీవించు ననునపవాదంబు లోర్వవచ్చునే? నీసుహృదీశ్వరుం డయినవసంతుం డెచ్చట నున్నవాఁడు? పటుక్రోధరేఖావటద్భ్రూభంగభీషణముఖుం డగులలాటలోచనులోచనంబు చిచ్చున నతండును వెచ్చి నిన్నుం గూడెనే యని యనేకప్రకారంబులం బలవింపఁ దత్పరిదేవనాక్షరంబులు బాణపాతంబులం బోలి తూఱనాటుటయు నెంతయు నొచ్చి యమ్మధుమాసం బక్కిసలయకోమలికిం బుట్టిన మహావ్యసనం బూరార్పం జేరవచ్చుటయు. 91

సీ. క్రొమ్మిడి కై పెక్కి కుసుమంబు లుమియుచు నవటుప్రదేశంబునందుఁ బొరల
జేవురించిన లేఁతచెక్కుటద్దంబులఁ దాటంకయుగళంబు తన్నియాడ
నాక్రోశపరిదేవనాక్షరవ్రాతంబు కంఠగద్గదికచేఁ గ్రక్కుపడఁగ
హరినీలములచాయ నక్షిగోళమ్ముల సొబగుగాఁ గన్నీటిసోన గురియ
తే. ముత్తియంబులు పేరులు ములిసిపడఁగ
హస్తముల వీఁగుఁ జనుదోయి యడఁచుకొనుచు
సంబెరం బిచ్చె రతిదేవి శంబరారి
కమలిన వసంతు నెదుట దుఃఖార్త యగుచు. 92

వ. ఇవ్విధంబున నారామ పేరామనియెదుట నెమ్మనంబునఁ బేరామనియై వర్తిల్లునార్తి సంబెరంబిచ్చి సొమ్మసిలంబోయి లేచి వసంతునిం గనుంగొని మాధవ! నీ చెలికానిం జూడు కపోతకర్బురం బైన భస్మం బైనవాఁడు! నీవు వచ్చుట యెఱుంగండు సుమ్మీ! ససురాసురం బైనజంబు బిసతంతుగుణం బైనశోదండంబునం గలగుండ్లు వెట్టు నిట్టి జగజెట్టియుం గలండే? యతిపరుషపవనసంపాతాహతం బైనదీపంబు నుంబోలె నీపరమమిత్రుండు క్రమ్మఱిలండు సుమ్మీ! నాపాపంబునం జేసి విధి వెలిగాఁ గ్రొన్ననవిలుకానిం గొనిపోయె. నీవును బరమమిత్రుండవు గావున నన్నును నగ్నిముఖంబున నీసఖుం గూర్పం బాడి. “శశితోడంగూడఁ గౌముదియు మేఘంబుతోడంగూడ మెఱుంగు” ననుట సకలసమ్మతంబు. కుసుమశరుశరీరభసితచూర్ణంబు శరీరంబునందాల్చి నామేను విభావసునందు వ్రేల్చెదం గిసలయతల్పంబులకు నిట మున్ను సహాయుండ వగు నీకుఁ జితి పేర్పంజాలవచ్చెనే యని పల్కి శోకావేశంబున వెండియు. 93

సీ. హస్తయుగ్మము మోడ్చి ప్రార్థించి పలికెదఁ దమ్ముఁడా నా కిమ్ముఁ దగఁ జితాగ్ని
మందమందంబుగా మలయానిలంబులు వెరవుతో మండంగ విసరుఁగాతఁ
బరలోకతృప్తికై బంధు లిద్దఱకును ధర్మోదకం బిండు తమ్మితేనె
సహకారమంజరీచరుపిండకబళంబు పెట్టుడు మాకునై పికము ముట్టఁ
తే. దేనె పెట్టుండు కస్తూరి దీర్చి యచటఁ, జేర గొజ్జంగపూనీటఁ జెంబు లిడుఁడు
నన్ను వలరాజుఁ దలఁచి మన్ననఁ దలిర్పఁ, దగ సమర్పణ చేయుఁడు దంపతులకు. 94

వ. అని తెంపు సేసి యగ్నిప్రవేశంబున కాయితంబై యున్నసమయంబున రతి నుద్దేశించి యాకాశవాణి యోమన్మథపత్నీ! సాహసంబు వలవ దుడుగుము. నీకుం జేరువన మేలు గాఁగలయది నీ మగఁడు కందర్పుండు భుజాదర్పంబునం గన్నుం గానక కనకగర్భుని సమావిర్భూతమనోవికారునిం జేసి తనకుమారిక యం దతనికిఁ గాఁగాని తలంపుఁ బుట్టించె. కన్నియం గవసిన తనయన్యాయంబునకుం దాన రోసి సరసీరుహాసనుం డీసునం బుట్టించినవాఁడు కుసుమశరుండుకదా! యద్దురాత్ముండు హరకోపానలంబున భస్మం బగుం గావుత మని శపించిన నది కారణంబుగాఁ బద్యుమ్నున కిద్దురవస్థ తటస్థించె. 95

ఉ. ఎప్పుడు పెండ్లియాడుఁ బరమేశ్వరుఁ డద్రితనూజ వేడ్కతో
నప్పుడు లబ్ధసౌఖ్యుఁ డయి యంబికప్రార్థన నాసదాశివుం
డెప్పటియట్ల సర్వభువనైకధనుర్ధరునిం బ్రియుం బ్రియం
బొప్పఁగ నిచ్చు నీకు మది నొండు తలుపకు నమ్ము మాత్మలోన్. 96

వ. అని యదృశ్యరూపం బైనభూతంబు రతీదేవిమరణవ్యవసాయబుద్ది మందీభవింపం జేసెఁ గుసుమాయుధబంధుం డగువసంతుండును నావృత్తాంతంబునకు సంతసించి యక్కాంత నూరార్చె నాశాపాంతం బవలంబించి శంబరారిపత్నియు గౌరీకళ్యాణకాలమ్ముం బ్రతీక్షించుచు విరహక్షీణం బైనశరీరంబు రక్షించుకొనుచుండె నంత. 97

ఆశ్వాసాంతము

ఉ. మంకణమౌనివంశమణిమండన! కాంచిపురీనివాస! యే
గాంణాంకకిరీటదివ్యచరణాంబుజసేవక! వైరిభద్రనా
గాంకుళశ! హారహీరదరహాసవిపాండురకీర్తిచంద్రికా
లంకృతదిగ్విభాగ! శుభలక్షణ! వారిరుహాయతేక్షణా! 98

క. కరదీపదానశోభిత, బిరుదాంకిత! యంబునిధిగభీరసుహృదయా!
హరచరణకమలపూజా, పరతంత్రస్వాంత! వంశపావనచరితా! 99

మాలిని. మాచమాంబాసుతా! మానదుర్యోధనా, యాచకాభీప్సితత్యాగచింతామణీ!
ధీచతుర్వర్గ యాస్తిక్యసంపన్నిధీ! లోచనాంభోరుహాలోలలక్ష్మీకళా! 100

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర వినయవిధేయ శ్రీనాథ

నామధేయప్రణీతం బయినహరవిలాసం బనుమహాప్రబంధంబునందుఁ

దృతీయాశ్వాసము.