హరవిలాసము (1931)/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి


చతుర్థాశ్వాసము

శ్రీ కావేరీవల్లభ!
లోకస్తవనీయ! సర్వలోకాశ్రయ! ద
ర్వీకరభూషణభక్త! సు
ధీకలితవివేక! యవచిదేవయతిప్పా!

వ. ద్వితీయవిలాసం బైన గౌరీకళ్యాణం బాకర్ణింపుము. 1

తే. ఆవ్విధంబునఁ దన మ్రోల నసమశరుఁడు
తనకుఁగా నీశ్వరునిచేత దగ్ధమైన
ధరణిధరకన్య నిందించెఁ దనదురూపుఁ
బతులు మెచ్చని చెలువు నిష్ఫలమ కాదె. 2

వ. అనంతరంబ వసుంధరాధరకన్య యవంధ్యప్రతిజ్ఞ యైఁ దపస్సమాధినియతత్వంబు వహియింప నిజాభిప్రాయంబు మేనకాదేవి కెఱిగించిన. 4

తే. గ్రుచ్చి కౌఁగిలించుకొని యమ్మహీధర
సార్వభౌముదేవి చతురభంగి
బుజ్జగించి కూర్మి పొంపిరివోవంగ
హితమితోక్తిఁ బుత్రి కిట్టు లనియె. 5

ఉ. ఎక్కడ లేరె వేల్పులు సమీప్సితదాతలు ముద్దుఁగూన నీ
వెక్కడ ఘోరవీరతప మెక్కడ యీపటుసాహసిక్యముల్
తక్కు శిరీషపుష్ప మవధానపరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగ మెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా. 6

తే. అని నివారించె గిరిపత్ని యనుఁగుఁగూఁతుఁ, బార్వతియుఁ దల్లిమాటఁ జేపట్ట దయ్యె
నీప్సితార్థంబునకుఁ జాఱుహృదయరుచియు, నిమ్నమున దోడిగిలునీరు నిలుపరాదు. 7

వ. అంత నాచంద్రానన సఖీముఖంబున నిజమనోరథంబుఁ దండ్రి కెఱింగించి యమ్మహానుభావుచేత నరణ్యనివాసమునకును ఫలోదయాంతం బైనతపస్సమాధికిని నానతి వడసి దృఢప్రతిజ్ఞానిర్వాహంబున. 8

ఉ. భూధరరాజకన్య మణిభూషణముల్ దిగఁద్రావి యీశ్వరా
రాధనకేళికౌతుకపరాయణ యై భరియించెఁ బాండుర

క్షాధృతిపూర్వకంబుగఁ బ్రగాఢపయోధరమండలీసము
చ్ఛేదవికీర్ణసంహతుల నేలుమహీధరవల్కలంబులన్. 9

తే. పాశుపతదివ్యదీక్షఁ జేపట్టి గౌరి, చంచరీకాంగనాగరుచ్ఛాయ నేలు
కుటిలకోమలతరదీర్ఘకుంతలములు, మడమ లంటఁగ నిడుపాటిజడలు గట్టె. 10

సీ. ముత్యాలమొలనూలు మురువుసూపెడునట్టి జఘనంబుపై మౌంజి నవధరించెఁ
గందుకక్రీడపై గారం బుపచరించు హస్తాబ్జములఁ బూనె నక్షమాల
కస్తూరికాంగరాగములతో విలసిల్లు తనువల్లి హత్తించె ధవళభూతి
బొమ్మపెండిలిపాటఁ బ్రొద్దుపుచ్చు నెలుంగు నీలకంఠస్తోత్రనియతిఁ గూర్చెఁ
తే. బసిఁడికమ్ములయందంపుఁబట్టుచేల, కొంగుచాటున వర్ధిల్లు కుచభరమున
గంతఁగా వైచెఁ బులితోలుకళవసంబుఁ, బరమకళ్యాణి గిరిసార్వభౌమతనయ. 11

తే. హంసతూలికపాన్పుపై నలరుమొగ్గ, యొత్తునునుమేను గల్గునీలోత్పలాక్షి
బాహువల్లి తలాఁడగాఁ బవ్వళించె, శైలపాషాణపట్టికాస్థండిలమున. 12

తే. పాశుపతదివ్యదీక్షావిభాసమాన, దివ్యతేజోనిశేషసందీపమూర్తి
కాలతాంగికి శతవృద్ధు లైనమునులు, ప్రణతు లగుదురు భావిప్రభావశక్తి. 18

వ. ఇవ్విధంబున ధరశిఖరంబులయందలి హరిణకిశోరంబులకు నరణ్యబీజాంజలినిధానంబునుం దరులతాకుంజంబులకు నిర్ఝరధారాసేకంబును నొనర్చుచుఁ గృష్ణాజినోత్తరాసంగవతియు సర్వాంగభసితాభ్యంగమంగళస్నానయునై కొంతకాలంబు గడపి కాంక్షితంబు కడఁగానక తెంపు సేసి మండువేసవిం గనగన మండు నగ్నిముఖంబునడుమన నిలిచి మధ్యాహ్నకాలంబున నర్కమండలం బాలోకించియు వర్షాకాలంబునఁ పక్ష్మపాళీక్షణస్థితంబులును దాడితాధరంబులును బయోధరోత్సేధనిపాతచూర్ణితంబులును ద్రివళీక్షణస్ఖలితంబులును నాభిగహ్వరప్రవిష్టంబులు నగుజలధరజలబిందుధారలం దోఁగియు శిశిరకాలంబున దివతాళించుకొలంకులలోనం బుక్కిటిబంటినీట నిశాసమయంబుల నిలిచియు నంబుచుళీకంబులును నుడుపతికరంబులును కరువలిండుల్లిన జీర్ణతరుపర్ణంబులును నాహారంబుగా దుష్కరం బైనతపంబు సేయుచుండ నొక్కనాఁడు. 14

మ. అజినాషాఢధరుండు ప్రౌఢతరభాషాతిప్రగల్బుండు నీ
రజబంధుప్రతిమానతేజుఁడు జటారాజిచ్ఛటాతామ్రమూ
ర్థజుఁ డేకాకి వటుండు బ్రాహ్మణుఁడు విశ్రామార్థముంబోలె నా
త్రిజగన్మోహనమూర్తిసన్నిధికి నేతెంచెన్ వసంతంబునన్. 15

తే. ఇవ్విధంబున నేతెంచి యెదుట నిలిచి, గౌరి నాశీర్వదించె నక్కపటవటుఁడు
కలితకోమలనవకుశగంధి యైన, యంగుళీపల్లవంబుల హస్త మెత్తి. 16

వ. పార్వతియు బహుమానపురస్సరంబుగా నయ్యుర్వీసురవటునకు నతిథిపూజ యొనర్చిన నతండును గొండరాచూలి సేయుసత్కారం బంగీకరించి ముహూర్తమాత్రంబు విశ్రమించి మేలువడిచూపునం జూచి ప్రస్తావనోచితంబుగా ని ట్లనియె. 17

సీ. సలిలంబు త్రిషవణస్నానక్షమం బౌనె యంభోజపత్రదీర్ఘాయతాక్షి!
కుసుమంబులును నిధ్మకుశపల్లవంబులు సులభంబులై యున్నె సుందరాంగి!
సత్త్వంబు లన్యోన్యజాతివైరముఁ దక్కి శాంతి గైకొని యున్నె చంద్రవదన!
యనుదినంబును దేహయాత్ర కాయిత మౌనె నీవారపాకాది పూవుఁబోణి!
తే. శక్తికొలఁదిఁ దపశ్చర్య సంఘటింతె, ఫలముపై నాస నాగ్రహబంధ ముడిగి
తామ్రబింబోష్ఠి ధర్మసాధనములందు, నాద్య మగుసాధనంబు దేహంబ కాదె. 18

క. మగువా! నీ పెంచినలత, చిగురున ముకుళంబు నుల్లసిల్లెనె చెపుమా
పగడపుఁగెమ్మోవిపయి, న్నగ వుదయించినవిధంబునం బ్రస్ఫుటమై. 19

క. పంకజలోచన! కరద, ర్భాంకురములు మేసినట్టి యపరాధమునన్
రంకుమదపోతకంబుల, జంకింపవుగా తపఃప్రశాంతి వెలితిగాన్. 20

తే. అభ్రవీథిపరిచ్యుతం బైనయట్టి, యమరతటినీజలప్రవాహమ్ముకంటె
ధరణిధరరాజు నీచరిత్రంబుకతనఁ, బరమపావనుఁ డయ్యె నోపద్మనయన! 21

వ. సంబంధంబు సాప్తపదీనంబు గావున నింతతడవు నీతోడఁ గదిసి పలుకుచునికిం జేసి యే నాప్తుండఁ గావున నొక్కమాట యడిగిన బ్రాహ్మణజాతిస్వభావసులభంబైన చాపలంబుఁ జూచి హెచ్చు గుందాడం బని లేదు. రహస్యంబు గాకుండెనేనిం జెప్పుము. 22

సీ. ప్రథమప్రజానాథపావనకులమున బ్రభవించి తబల! ప్రపంచసార
సౌందర్యసంపద సడిసన్నదానవు నశ్వరం బైశ్వర్యనైపుణంబు
సౌఖ్యంబు నిరవధి సర్వసామగ్రి నీ యఱిచేతిభాగ్య మత్యాయతంబు
భాగ్యంబు నీ కేమి భ్రాంతి యైనది మనోరథ మేమి చెప్పుమా రాజవదన
తే. దుష్కరం బైనతప మిట్లు దొడరి చేసి, మేను డయ్యించుకొనఁగ నేమిటికి వచ్చెఁ
జిత్తము విచారమార్గంబుఁ జేరఁ దెచ్చి, తత్త్వముఁ దెలియఁజెప్పు చూతము మృగాక్షి. 23

వ. పితృగేహంబున నవమానంబు పుట్టదు గదా! పన్నగఫణారత్నంబుమీఁదఁ జెయిసాచువాఁడు గలండే. నిండుజవ్వనంబునకుం దగినవిభూషణంబులు తొలంగంబెట్టి వార్ధకోచితంబు లగువల్కలంబు లెట్టులు ధరించితివి? దేవలోకనివాసంబున కాసపడెదేని నది వృథాశ్రమంబు! నీ పుట్టినిల్లు దేవభూమియకదా? తగినవరునిం గామించి సమాధి వహించితి వేని నదియు నీకుం దగదు రత్నం బొరునిచే నన్వేషింపఁబడుఁ గాని యొరు నన్వేషించునే? నిట్టూర్పుగాడ్పులచే దుర్లభజనానురాగంబు నీయందుఁ దేటపడుచున్నది. అట్టి కఠినహృదయుం డెవ్వండొ వాఁడెవ్వని నపేక్షించియేని నీవు తపంబు సేయుచుఁ గలమాగ్రపింగళం బగుజటాభారంబు ధరియింపఁ దగ దని యంత నిలువక యక్కపటవటుండు. 24

ఉ. ఏనును బ్రహ్మచారిఁ దరళేక్షణ! నీవును గన్య వెంతకా
లానకు నీకుఁ బెండ్లియ ఫలం బగునేని విచార మేల స
స్థానముతోడ నచ్చునను మాన్యు వివాహము గమ్ము లెమ్ము కా
దేనిఁ దపంబులోనిసగ మిచ్చెద మాను తపోభిమానమున్. 25

వ. అనినం బార్వతి యమ్మిథ్యావటునకుం దనమనోరథం బెఱిఁగింప నొల్లక వయస్యంగన్నుసన్న సేసిన నచ్చెలికత్తెయు నత్తపోధనకుమారునితో ని ట్లనియె. అయ్యా! నీకుఁ గుతూహలంబు గలదేని వినుము. కాలకంఠకఠోరకంఠహుంకారప్రవర్తకం బగుపుష్పచాపునిసమ్మోహనాస్త్రం బీకన్యహృదయంబున నాటిన నాఁటంగోలె లలాటచందనధూసరాలక యై తుహినసంఘాతతతశిలాతలం బగుజనకునింట ధృతిం జెందక మహేంద్రప్రభృతు లగుదిగీశుల నుజ్జగించి పినాకపాణిం బతిఁ గాఁ గోరి తపంబు సేయ సమకట్టె. సబాష్పకంఠస్ఖలితంబు లగుసంగీతాక్షరంబుల విరూపాక్షుచరిత్రంబు పాడుచు వనాంతసఖు లగుకిన్నరరాజకన్యకల వగపించుచుఁ ద్రిభాగశేషంబు లగునిశాసమయంబుల నించుకించుక నిద్రించుచుఁ గలఁ గాంచి నీలకంఠ! యెచ్చోటికిం జనియెద వని యసత్యకంఠార్పితబాహుబంధన యయ్యును విరహవ్యథాదుస్సహం బగుతపోభారంబున భర్గు వశీకరింపం దలంచి యున్నయది యనిపల్కిన. 26

చ. వికవిక నవ్వి యక్కపటవిప్రకుమారుఁడు మేలు లెస్స వా
నికి నయి రాగబంధమును నిల్పె మదిం దరళాయతాక్షి మీ
సకియ వివాహవేళఁ బురశాసనుపాణిఁ బరిగ్రహించుచో
మొకమున బుస్సుమంచు నహి మోగిన నెట్లు భయంబు చెందునో. 27

సీ. రాయంచ యంచుఁ జీరకు జోక యగుఁగాక పచ్చియేనికతోలుఁబచ్చడంబు
హరిచందనాస్పదం బగుచనుఁగవమీఁద బట్టుఁ జేకొనుఁ గాక భసితధూళి
కమనీయచరణలాక్షారాగలేఖచే ముద్రితం బగుఁ గాక రుద్రభూమి
కలితముక్తాఫలగ్రైవేయకంబుతోఁ దులదూఁగుఁ గాక పెంజిలువపేరు
తే. మనువు లెస్సయి యుండెఁ బో మానవతికి
నివ్విధం బన్న లోకంబు లెల్ల నగరె
యహహ! ముదిగొడ్డు నెక్కి బిక్షాటనంబుఁ
జేయఁబోవుట యదియు మేల్చాయ చువ్వె. 28



ఉ. పుట్టు వెఱుంగ నెవ్వరికిఁ బోలదు మూఁడవకన్నుఁ జూచి చే
పట్టఁడు వెఱ్ఱివాఁ డయినఁ బ్రాణహరుం డఁట జంతుకోటికిన్
గట్టిన తోలుచీర కలకల్మిప్రకాశము సేయుచున్న దె
ప్పట్టునఁ జూచినన్ శివుని బైసి యెఱుంగఁగరాదు భామినీ. 29

తే. మాట లేటికిఁ జాలింపుమా తపంబు, హరునిఁ గూర్చి సరోజపత్రాయతాక్షి!
వలదు తివియంగఁ బాఁతినవాఁడికొఱ్ఱు, యూపసత్క్రియకర్హమై యున్నె చెపుమ. 30

వ. అనిన నక్కపటవటునకు నవ్వధూటి యి ట్లనియె. 31

ఉ. చాలు వివాదము ల్పదిగ శంభునిగూరిచి యిట్టిపల్కు లీ
వాలము చేసి పల్కితివి యైనను నౌ విను చంద్రమఃకళా
నూళిపయి న్మదీయ మగుమానస మెంతయుఁ జిక్కె నింక నేఁ
జాలుదు నయ్య యెమ్మెయి భుజంగవిభూషణునిం దొరంగఁగన్. 32

వ. అని జయావిజయలం గనుంగొని యపాంగంబులఁ గెంపు గదుర నీ బ్రహ్మచారి శంకరుని గుఱించి యింకను వంకరకొంకరమాటలాడ నుంకించుచున్నవాఁ డితని మెడ వట్టి నూకుం డని పల్కి కోపావేశంబున. 33

చ. జిలుఁ గగువల్కలాంచలము చెన్నయి చన్నులమీఁద జాఱఁగా
నలుకఁ దుషారశైలసుత యవ్వలిమో మయి నాలుగేన్పదం
బులు సని భ్రూకుటీకుటిలముగ్ధలలాటముఖేందుబింబ యై
మలఁగి కనుంగొనెన్ భుజగమండను నక్కపటద్విజోత్తమున్. 34

శా. సాక్షాత్కారముఁ జెందె నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరా
ధ్యక్షాపత్యముఁ బ్రేమనిర్భరకటాక్షాలోకనప్రౌఢిమన్
వీక్షించెన్ దరళాక్షియు న్మనమున న్వ్రీడాప్రమోదక్షమా
దాక్షిణ్యంబులు సందడింప నిలిచెం దత్సన్నిధానంబునన్. 35

చ. అరు దగునీతపమ్మునకు నమ్ముడువోయితి నేలుకొమ్ము నీ
వరవుడ నంచు శూలి ప్రియవాక్యములం దగ గారవింపఁగా
ధరణిధరేంద్రనందన యుదగ్రతపోమహనీయవేదనా
భర మఖిలంబు వీడ్కొలిపి భావమునం బరితోష మందుచున్. 36

వ. జయవిజయ లనుప్రాణసఖులతోడం గూడ మాతండ్రి హిమవత్పర్వతేంద్రుండు దేవరకుఁ బ్రమాణీకరింపం బాత్రం బయ్యెను. కన్యకం బితృపరాధీన నగుట దేవరు చిత్తంబున నవధరింపవలయు నని విన్నపంబు సేయించిన. 37

తే. అమృతకరమౌళి యవుఁ గాక యనుచుఁ బలికి, వేడ్క గిరిరాజనందన వీడుకొలిపి
తారగిరి కేఁగి దివ్యచిత్తమునఁ దలఁచె, సప్తమునుల నరుంధతీసంయుతముగ. 38



శా. ఆసప్తర్షు లరుంధతీసహితు లై యాకాశమారంబునన్
భాసందోహము సూర్యచంద్రరుచులన్ భంజింపఁగా డిగ్గి కై
లాసస్థానముఁ జేరవచ్చి కని రుల్లాసంబునన్ హేమపీ
ఠాసీనుం డయి దేవత ల్గొలువ రాజైయున్న శ్రీకంఠునిన్. 39

మ. పదియార్వన్నె పసిండివల్కలమునన్ భాసిల్లు ముత్యాలజ
న్నిదముల్ రత్నమయాక్షతంబులును మాణిక్యంపుఁబాత్రంబునన్
జదు రొప్పన్ ధరియించి యల్పధరణీజాతంబుల౯ బోలెఁ గ
ట్టెదురన్ నిల్చినదివ్యసంయముల సంవీక్షించి సంభావనన్. 40

సీ. ఆకాశగంగలో నఘమర్షణస్నాన మహరహంబును జేయునట్టివారిఁ
బ్రస్థాపితాశ్వుచే భానుమంతునిచేత గురుభావమున మ్రొక్కుఁ గొనెడివారి
నంత్యకాలమ్మునయం దుర్వితోఁగూడ నుదధిలోపల మున్గకున్నవారి
సర్గశేషమునకై సాహాయ్య మొనరించి పరమేష్ఠిచే మెచ్చుఁ బడయువారి
తే. గగనమును లేడువురవారికట్టెదురన, పతిపదంబులపై దృష్టి భక్తినిడిన
దివ్యచరిత నరుంధతీ దేవిఁ జూచి, సమ్మదము నొందె కందర్పశాసనుండు. 41

తే. అంధకారి యరుంధతి నాదరించె, గౌరవంబున భేదంబు కలుగకుండఁ
బెద్దవారికి స్త్రీపుంవిభేద మేల, మాననీయంబు పుణ్యకర్మంబుగాక. 42

క. ఆఋషులఁ జూడ శివునకు, దారపరిగ్రహము వెంటఁ దద్దయుఁ దగిలెన్
దారపరిగ్రహమే కద, సారపుధర్మముల కెల్ల సాధన మరయన్. 43

ఉ. పర్వతసార్వభౌముసుతపై ననురాగము సంప్రరూఢమై
శర్వుని చిత్తవృత్తి కొనసాగుచు నుండుట కానవచ్చుటం
బూర్వపుఁదప్పుఁ జేసి వెఱఁ బొందుచు నున్నయనంగుఁ డెంతయున్
నిర్వృతిఁ జెందె నౌ తనదునీతి ఫలించి తపంబు పండినన్. 44

వ. ఆప్పుడు సప్తర్షులు హర్షవినయభక్తిశ్రద్ధావిశ్వాసతాత్పర్యంబులు మనంబునం బెనఁగొనంగఁ గేలుదోయి మొగిచి ఫాలభాగంబునం గీలించి కంటకితకపోలభాగులై దేవా! యింతకాలంబునకుం గదా మాతపోదానాధ్యయనయజ్ఞవ్రతాదిధర్మంబులు ఫలియించె భువనాధ్యక్షుండ వైననీవు మనోరథాగోచరం బైనమన్ననం జేసి మనోవిషయంబున మన్నించితి వింతకంటెను భాగ్యంబుగలదే యెవ్వానిచిత్తంబున నీవు వర్తింతువు వాఁడు కృతార్థుండు గదా నీచిత్తంబున వర్తించుమాకృతార్థత్వంబు వేఱె వర్ణింపనేల? భవత్పుంభావనావిశేషంబునయంద మాకు బహుమానంబు ప్రత్యయంబునయ్యె యుష్మదనుధ్యానసంభవం బగుప్రమోదభారంబు మాయంతరంగంబులయం దంగీకరించుటకు సకలభూతాంతర్యామి వగునీవ ప్రమాణంబు. మాటలు వేయు నేటికిఁ జింతితోపస్థితుల మైనమమ్ము నేపనిపంపునఁ దలంచితిరో యానతిం డనుటయు. 45

చ. లలితజటాకిరీటసదలంకృత మైనశశాంకరేఖ కో
మలరుచి దంతదీధితిసమాజముతోఁ బొదలంగఁ జేయుచున్
బలికె లలాటలోచనుఁడు ప్రస్ఫుటభంగి మునివ్రజంబుతోఁ
దొలకరిమేఘఘోషములతోఁ బురణించు సమంచితధ్వనిన్. 46

తే. ఎఱుఁగుదురు కాదె మీరు నాహృదయవృత్తి, నాకొఱకు నేన వర్తింతు నేకృతులను
మన్మహామూర్తు లెనిమిది మౌనులార, భువనరక్షాప్రయోజనంబునక కాదె. 47

తే. విప్రకృతు లైనయబ్బందివేల్పు లెల్ల, మనఁగఁ గోరిరి సేనాని మత్ప్రసూతి
ననఘులార తృష్ణాతురు లైనవారు, వారివాహంబు ఘనవృష్టిఁ గోరినట్లు. 48

వ. ఏతదర్థంబ పార్వతిని ధర్మపత్నిఁగా నపేక్షించు చున్నవాఁడ మాకొఱకు మీరు హిమాచలంబునకుం బోయి యక్కార్యంబు సంఘటింపవలయు యుష్మత్సంఘటితంబు
లైనసంబంధముల కెన్నండును వికారంబు పుట్టనేర దభ్యున్నతుండును స్థితిమంతుండును వసుంధరాభారధూర్వహుండును నగునద్ధరాధరసార్వభౌముండు సంబంధబాంధవార్హుండు కన్యార్థంబ యిటు ప్రవర్తింపుఁడు భవత్ప్రణిహితంబు లైనపురాణాగమాదులు గదా లోకవ్యవహారంబులకు నిదర్శనంబు లై యుండు నీయరుంధతీదేవియు నీకార్యంబునకు సహాయ కాఁగలదు విశ్లేషించి వివాహశోభనకార్యంబులయందుఁ బురంధ్రీజనంబులకుఁ జనవుచెల్లు నిది శుభముహూర్తం బిప్పుడ కదలి యోషధిప్రస్థపురంబునకుం జనుండు కైలాససానుప్రదేశంబులఁ బునస్సమాగమం బగుం గాత మని శంభుండు విస్రంభగంభీరంబుగా నానతి యిచ్చిన. 49

చ. అతఁడు సమస్తసంయమిజనాద్యుఁడు శైలసుతాపరిగ్రహా
యతుఁ డయి యుండఁగా సురమహర్షివరేణ్యులు ప్రాక్తనప్రజా
పతులు తదాదిగా హృదయపంకరుహంబులతోఁ బరిగ్రహ
వ్యతికరసంభవం బయినయచ్చపులజ్జ పరిత్యజించుచున్. 50

వ. మహాప్రసాదం బని యంబరమార్గబున హిమవంతంబు డాయం జని. 51

తే. గగనమున నుండి డిగ్గి సత్కారయుక్తి, వెలిఁగె హిమపర్వతాంతరస్థలమునందు
నిర్మలం బైననిధిలోని నీడఁ దోఁచు, నిందుబింబంబులను బోలి ఋషిగణంబు. 52

శా. పాదన్యాసములన్ ధరిత్రి పరికంపంబొంద నత్యంతస
మ్మోదంబున్ భయభక్తులున్ మనమునన్ ముట్టంగ శైలేంద్రుఁ డం
భోదాకారముతోడ డిగ్గి నమ్మహాపుణ్యాతులన్ సర్వలో
కాదిశ్రేష్ఠుల వే యెదుర్కొనియె నర్ఘ్యాపూర్ణహస్తాబ్జుఁడై. 53



తే. ధాతుతామ్రాధరుఁడు దేవదారుభుజుఁడు, సానువక్షస్థలుఁడు వటస్కంధుఁడైన
మంచుగుబ్బలిరాజు సంభ్రమముతోడ, ఋషిసమూహంబు నతిభక్తి నెదురుకొనియె. 54

సీ. విధిమార్గ మొక్కింత వీసరవోకుండ, నర్ఘ్యపాద్యాదిక్రియాకలాప
మాచరించి వినిర్మలాచారసంపన్ను లగునమ్మహర్షుల నాదరమున
నంతఃపురానకు నల్లఁ దోడ్కొ ని పోయి క్రమముగా నుచితాసనముల నునిచి
స్వాగతకుశలవార్తానుపూర్వకముగ నతిగభీరప్రస్ఫుటాక్షరముల
తే. వారితో నిట్టులనియె నమ్మేరుసఖుఁడు, గాఢవినయావనతపూర్వకాయుఁ డగుచు
హస్తయుగళంబు మొగిచి సంప్రార్థనమున, యావదర్థపదం బగునట్లు గాఁగ. 55

తే. అపపయోదసముద్భవం బైనవాన, యనధిగతపుష్పజాలకం బైనఫలము
పుణ్యనిధులార! నాగృహంబునకు మీరు, తలఁపుగానితలంపుగాఁ దారసిలుట. 56

క. రెంటను నేఁ బావనుఁడను, వింటిరె మునులార! మీపవిత్రాంఘ్రులు న
న్నంటుట మదీయమూర్ఖము, వెంటంగా నభ్రగంగ వెల్లివిరియుటన్. 57

సీ. స్థావరం బగుమేను పావనత్వముఁ జెందె భవదీయపాదసంస్పర్శనమునఁ
గడగంటి నాజన్మ కతికృతార్థతఁ బొందఁ గన్నులారఁగ మిమ్ముఁ గానఁబడసి
యువత్కృపాసమభ్యుదితసంతోషంబు నిండి దైవాఱె నా నెమ్మనమున
మీతేజమున నాదుమేనిలోఁ దహతహ కలుషాంబుపటలంబు గ్రాఁగి పోయె
తే. ననుఁ గృతార్థుని జేయఁ బావనుని జేయఁ, బరమపుణ్యునిఁ జేయ సంపన్నుఁ జేయఁ
దలఁచి యేతెంచితిరి గాని తక్కుగలదె, కార్య మానతి యిం డార్యవర్యులార! 58

మ. అని పర్జన్యకఠోరగర్జ కెనగా నాడంబరాటోపముం
జెనయం బల్కుగభీరనిస్వనమునన్ శీతాచలేంద్రుండు ప
ల్కిన నందందఁ బ్రతిధ్వను ల్మణిగుహాగేహంబులం దుండఁగా
నినుమార్పల్కినరీతిఁ దోఁచె నపు డూహింప మునిశ్రేణికిన్. 59

వ. అప్పు డంగిరసుం దందఱిమునులయనుమతి నప్పర్వతేంద్రున కిట్లనియె. 60

క. సర్వము సంపన్నంబగు, నుర్వీధరసార్వభౌమ యుల్లము నీకున్
సర్వోన్నతంబు గాదె య, ఖర్వము లగునీమహాశిఖరములభంగిన్. 61

వ. చరాచరభూతజాలంబులకు నాధారుండ వగునిన్నుం బురాణబ్రహ్మవాదులు విష్ణుం డని స్తుతింతురు. సప్తపాతాళభవనగోళమూలాధారంబ వగునీవు భూభువనంబు భరియింపనినాఁడు భుజంగమశేఖరుండు మృణాలపేశలం బగుఫణామండలంబున నిడి భరింప సమర్డుం డగునే? సత్పావనంబులును నాసేతుసముద్రావనిచిహ్నంబులు నగు నీసలిలప్రవాహంబులు భవత్కీర్తితీర్థంబులుంబోలి భువన పావనంబులు. తిర్య గూర్ధ్వాధరస్థానంబు లాక్రమించి త్రివిక్రమావతారంబున విరాడ్రూపంబు వహించినవిష్వక్సేను ననుకరించెదవు. నీకు నితరపర్వతంబులకును సాటియే. ఇది యిట్లుండనిమ్ము మేము వచ్చినకార్యంబు సావధానుండ వయి యాకర్ణింపుము. 62

సీ. ఏవేల్పులకు లేనియీశ్వరశబ్దంబుఁ దాల్చు నెవ్వఁడు సుధాధాముతోడ
నవనిప్రధానంబు లైనయంగంబుల సవరించు నెవ్వాఁడు సకలజగము
నేకతంబున వసియించి యెవ్వనిఁ గంద్రు యోగీశ్వరేశ్వరుల్ యోగదృష్టి
నెవ్వనిపదము సూక్ష్మేక్షబుధులు పునరావృత్తిశూన్యక మండ్రు తెలిసి
తే. యతఁడు శంభుండు విశ్వలోకైకసాక్షి, యడుఁగఁ బుత్తెంచినాఁడు నీయనుఁగుఁగూఁతు
నిమ్ము పెండిలిపెద్దల మేము మీకుఁ, దుహినగిరిరాజ! భాగ్యవంతుండ వైతి. 63

సీ. త్రైలోక్యమునకుఁ జంద్రకళాధరుఁడు తండ్రి తల్లి యాౌఁగాక యీతలిరుఁబోఁడి
హరునకు మ్రొక్కి యనంతరం బమరు లీకుటిలకుంతలకు మ్రొక్కుదురు గాక
యీతలోదరి నిచ్చి హితబాంధవంబున నగుదుగాక గురుండ వఖిలపతికి
నీరాజబింబాస్య కారణంబుగ నద్రికులము దేవకులంబుఁ గలియుఁగాక
తే. తగినవరునకుఁ గన్యకాదాన మిచ్చు, నంతకంటెను మతిభాగ్య మన్య మేది
తల్లిదండ్రుల కఖిలభూధరవరేణ్య!, సకలయజ్ఞాంగసముదాయజన్మభవన! 64

తే. దాతివఁట నీవు మేము సంధాతలమఁట, గారవపుఁ బెండ్లికూఁతురు గౌరియంట
శంభుడఁట పెండ్లికొడు కిది సంప్రదాయ, మభినుతింపఁగఁ దగుఁ బర్వతాగ్రగణ్య! 65

మ. అని దేవర్షి బహుప్రకారమధురవ్యాహారసందర్భముం
బసిగొంచుండఁగఁ దండ్రిపార్శ్వమున సద్భావంబు లజ్జాభరం
బును మౌగ్ధ్యంబును దోఁప నమ్రవదనాంభోజాత యై యల్లన
ల్లన లెక్కించుచు నుండెఁ బాణి నవలీలాపద్మపత్రంబులన్. 66

తే. భూమిధరరాజు సంపూర్ణకాముఁ డయ్యె
ముదముతో మేనకాదేవి మొగము సూచి
కన్యకాదానవేళలఁ గలదు చనవు
క్షితి గృహస్థులకంటె సద్గేహినులకు. 67

వ. అనంతరంబ తనకూర్మికన్యం జూచి హిమవంతుండు. 68

సీ. రావమ్మ తల్లి! సర్వజగచ్ఛరణ్యున కమృతాంశుమౌళికి నైతి భిక్ష
యర్థులై వచ్చినా రాదిమబ్రహ్మలు ఘనపుణ్యరాసులు గగనమునులు
పరమపతివ్రతాపరిషచ్ఛిరోమణి యదె యరుంధతి త్రిలోక్యేకవినుత
నీవు కారణముగ నెఱయంగ సిద్ధించె భాగ్యంబు గృహమేధి ఫలము నాకు

తే. ననుచు మొక్కించె ఋషులకు నందఱకును, నబ్జభవుకోడలికిఁ దుషారాద్రినాథుఁ
డవధరింపుఁడు శివునియర్ధాంగలక్ష్మి, ప్రణుతి యొనరించె మీ కని పల్కి నగుచు. 69

తే. ఈప్సితార్థక్రియాసముపేతుఁ డైన, శైలపతిమాట కందఱు సంతసిల్లి
ప్రణుతి యొనరించి యంజలిపాణి యైన, గౌరి నాశీర్వదించిరి గగనమునులు. 70

వ. అనంతరంబ యభిలషితవరసంప్రాప్తిసముపజాతకుతూహల యగునాహంసగమన నరుంధతి తనతొడలమీఁదఁ గూర్చుండఁబెట్టుకొనియె మునులును వినిశ్చితకార్యులై వివాహతిథి నేఁటికి నాలవనాఁ డని ముహూర్తనిశ్చయంబు సేసి సారుంధతీకులై హిమాచలంబు నామంత్రించి చని విశుద్ధం బైనకార్యార్థంబు విన్నవించి యమ్మహాదేవుం డనుప నిజస్థానంబుల కరిగిరి. పశుపతియు నెట్టకేలకు దివసత్రయంబు గడపుచుండె నట యోషధిప్రస్థపురంబునందు. 71

తే. ఓషధీనాథుఁ డభివృద్ధి నొందుచుండఁ, దిథికి జామిత్రగుణము సంధిల్లుచుండ
బర్వతేంద్రుండు సముపేతబాంధవుండు, పుత్రికోద్వాహకళ్యాణమునకుఁ దొడఁగె. 72

తే. నవశుభారంభసంవిధానముల నపుడు, కౌతుకవ్యగ్రకాంతానికాయ మగుచు
ననుపమస్ఫూర్తి సానుమంతునిపురంబు, సకలమును నొక్కయిలువోలె సంభ్రమించె. 73

సీ. సంతానకద్రుమచ్ఛాయాసమాకీర్ణ రాజవీథీపరివ్రాజితంబు
ధవళచీనాంశుకోత్తమసమాకల్పిత మహానీయతరకేతుమండనంబు
సమధికస్తంభకాంచనతోరణావళి మేళనోత్తేజితమిహిరదీప్తి
ప్రతిగృహద్వారపర్యంతసందానిత సుమగుచ్ఛమాలికాసుందరంబు
తే. గరుడగంధర్వకిన్నరఖచరయక్ష, సిద్ధవిద్యాధరాంగనాశ్రేణిభరిత
మఖిలలోకవిలోచనహర్షకరము, రాజితం బయ్యె నోషధిప్రస్థపురము. 74

వ. మైత్రీముహూర్తంబున నుత్తరిఫల్గునీనక్షత్రంబునకుం జంద్రయోగంబు గలుగుచుండఁ బతిపుత్రవంతు లగునమ్ముత్తైదువ లమ్మత్తకాశినికి శృంగారంబు సేసి రపుడు. 75

తే. గౌరసిద్ధార్థవినివేశకలిత మగుచుఁ, దరుణదూర్వాప్రవాళసంభరిత మగుచు
నాత్మరక్షాళిలీముఖం బగుచు నపుడు, బాల కభ్యంగనైపథ్యలీల యమరె. 76

క. బంగారుకంకపత్రముఁ, గెంగేల ధరించి యొప్పె గిరినందన య
భ్యంగముతఱి భాస్కరకర, సంగత యగువిదియనాఁటిశశికళవోలెన్. 77

సీ. కమనీయలోధ్రకల్కంబునలుంగున నభ్యంగతైలంబు నపనయించి
యాశ్యామ మైనకాలాగరుద్రవమున నంగరాగాలేప మాచరించి
కస్తూరి పునుఁగును గంధసారంబును సంపంగినూనెయు సంతరించి
యభిషేకవిధియోగ్య మగుమడుఁ గొల్లియ నిర్ణాభిబిలముగా నెఱికి గట్టి



తే. చలువనెల వైన ముత్యాలచవికెలోనఁ, బృథులమాణిక్యశశికాంతపీఠియందుఁ
బదియునార్వన్నెపసిఁడికుంభములనీట, జలక మార్చిరి గౌరికిఁ జంద్రముఖులు. 78

వ. మంగళస్నానవిశుద్ధగాత్రియు గృహీతప్రత్యుద్దమనీయయునై ప్రఫుల్లకాశయగుశరత్కాలవసుంధరయుంబోనిపార్వతిం దత్ప్రదేశంబులనుండి మణిస్తంభచతుష్టయాభిరామంబును వితానవంతంబును నగుకౌతుకవేదిమధ్యంబునకుం దెచ్చి నెచ్చెలు లలంకరింపం దొడంగి రప్పుడు. 79

తే. అగరుధూపంబు సంపూజితార్ద్రభావ, మంతరన్యస్తకుసుమమాల్యము తదీయ
మలిమనోజ్ఞంబు ధమ్మిల్ల మలరుఁబోడి, యిప్పపూదండఁ గైసేసె నెలమినోర్తు. 80

తే. కలితగోరోచనాపత్రకములతోడఁ, గరము విలసిల్లె నీహారగిరితనూజ
చక్రవాకపదాంకితసైకతములఁ, గరము విలసిల్లు నాకాశగంగ వోలె. 81

తే. తుమ్మెదలతోడఁ గూడిన తమివోలె, జలదరేఖాయుతం బైనచంద్రుపగిది
ఫాలమునఁ గుంతలంబు నేర్పఱచినపుడు, నెలవుగాఁ దోఁచె గిరికన్య నెమ్మొగంబు. 82

వ. మఱియు నొక్కసైరంధ్రి లోధ్రకషాయరూక్షంబును గోరోచనాక్షేపనితాంతగౌరంబు నగునీహారగిరికన్య కాలలామంబు కపోలభాగంబునం బరాగలాభంబు సంధిల్లఁ గర్ణావతంసంబుగాఁ గాయజప్రరోహణంబుఁ గీలించె. నొక్కచంచలాపాంగి మంచుంగొండరాచూలియధరప్రవాళంబు కించిన్మధూకచ్ఛవిస్పష్టరాగంబుఁ గావించె. నొక్కయిందుబింబానన యంబికచరణాంబుజంబులఁ కొత్తలత్తుక హత్తించె. నొకకిసలయపాణి చరణపల్లవంబుల ఫాలలోచనుకిరీటబాలేందుని ముట్టుమని నెట్టుకొని దీవించె. నొక్కశాతోదరి కళిందసుతాజాతనీలోత్పలపలాశకాంతిమంతంబు లైనహిమవంతుముద్దుంగూఁతునిద్దంపువెడందసోగకన్నులం గాలాంజనంబు మంగళార్థంబుగా రచియించె. నప్పుడు కుసుమంబులతోడ లతయును నక్షతగ్రహతారకంబులతోడ రాత్రియును గలహంససందోహంబుతోడ మందాకినియుం బోలె దివ్యాభరణంబులతోడం గూడి పార్వతి సర్వలోకనయనోత్సవకర యయ్యె నయ్యవసరంబున. 83

చ. ద్రవ మయి యున్న కొత్తహరితాళమనశ్శిలలం గరంగి ప
ల్లవమునఁ దోఁచి మేనక యలంకరణం బొనరించె గౌరికిన్
నవనవపత్రభంగరచనాకలనంబున మంగళార్థ మ
త్యవిహతలీల రత్నముకురామలకోమలగండమండలిన్. 81

తే. దంతతాటంకమండనోద్భాసి యైన, ముద్దుఁగన్నియయాననాంభోజ మెత్తి
తీర్చి రచియించె మేనకాదేవి రక్తి, మలయజంబునఁ గళ్యాణతిలకరేఖ. 83

వ. ప్రమదస్తనోద్భేదనం బాదిగా నెయ్యది ప్రతిదిన ప్రవర్ధితం బయ్యె నది మనోర గంబు ఫలియింప వివాహదీక్షాతిలకంబు లలాటంబునం దీర్చె యధిష్ఠానాంతరసన్నివేశంబై ధాత్రీప్రతిసార్యమాణం బైనపూర్ణకౌతుకహస్తసూత్రంబు బంధించి మేనకాదేవి బాష్పాకులలోచన యయ్యె నప్పుడు నవఫేనపుంజ యగుదుద్ధాబ్ధివీచి పోల్కిఁ బట్టుపుట్టంబు గట్టి చెలువారు నాసరోరుహాక్షి కులదేవతలకు మొక్కి ముత్తెదువల కభివాదనంబు సేసి కళ్యాణమండపమ్మునం దఖిలపరివారపరివృతయై సిహాసనంబుమీఁదం గూర్చుండి మహోక్షలాంఛనునాగమనంబుఁ బ్రతీక్షించుచునుండె నంత. 86

సీ. బ్రాహ్మి సంపాదించె భసితాం రాగంబు మాహేశి రుద్రాక్షమాలఁ గూర్చె
గౌమారి వెలయించె గజచర్మచేలంబు వైష్ణవి తోలుదువ్వలువ మడిఁచె
వారాహి కెంగేల గారాపువ్రేలికిఁ గైసేసె మణిమయకల్పపఙ్క్తి
నింద్రాణితోఁ గూడి హేరాళముగ గ్రుచ్చెఁ జాముండ హస్తభూషావ్రజంబు
తే. నాదికాలంబు సతిఁ బెండ్లియాడఁబోవు, నవసరంబున నెబ్భంగి సవదరించె
దివ్యశృంగార మబ్బంగి దేవదేవుఁ, డాదరించెను సమ్మోద మావహిల్ల. 87

సీ. భసితంబు కర్పూరపాళికస్తూరికాభరితాంగరాగసంపద వహించె
పచ్చియేనుఁగుతోలు పసిఁడికమ్ములపట్టుపచ్చడం బనెడివిభ్రమముఁ దాల్చె
భుజమధ్యమునఁ గ్రాలు భోగిభోగంబులు తారహారములచందంబు నొందె
జేగుఱించినకంటిచిగురుచాయలతీఱు సిందూరతిలకంబుచెలువు నించె
తే. దినమునందును వెన్నెల దీటుకొనఁగ, శైశవంబున విగతలాంఛనతఁ జెంది
చాల నొప్పారుసుకుమారచంద్రరేఖ, తనకుఁ దాన చూడామణిత్వము వహించె. 88

వ. ఇవ్విధంబున గంగాధరుండు సమాసన్నగణాపనీతం బైనఖడ్గంబున నీడఁజూచి నందిభుజావలంబియై శార్దూలచరపిహితపల్యాణబంధం బగువృషభంబును గైలాసశిఖరంబుంబోలె నారోహణంబు సేసి బ్రాహ్మి మొదలయిన మాతృకలును గపాలాభరణయైన భద్రకాళియు భృంగిరిటనికుంభధరభద్రకాళప్రముఖప్రమథపరివారంబునుం బరివేష్టింప భూతబేతాళశాకినీడాకినీగణంబులు మురాయింపం ద్వాత్రింశత్కోటిదేవతాసమూహుబులుఁ గొలువ సహస్రరశ్మిధవళాతపత్రంబు ధరియింప గంగాయమునలు వింజామర లిడ నుభయపార్శ్వంబుల నిజవాహనారూఢులై హరివిధాతలు వేత్రహస్తులై తలంగుండు పాయం దొలంగుం డనుచు సందడి నెడఁ గలుగఁజేయఁ గలహాశనతుంబురులును విశ్వావసువులును హాహాహూహువులును ద్రిపురవిజయాదివిద్యాధరులును ద్రిపురవిజయాదికంబు లుగ్గడించుచుండ సప్తర్షు లరుంధతీసహితంబుగా మంగళద్రవ్యంబులు సంతరించుకొని నడువ నాకాశమా రంబునం జామీకరకింకిణీక్వాణంబులు సెలంగ ముహూర్తంబునకు నగేంద్రగుప్తం బగునోషధిప్రస్థపురంబునకుం జని తదీయోపకంఠంబున డిగ్గిన. 89

మ. వనగంధద్విపరాజి నెక్కి యధికవ్యాయామవిష్ఫారసం
హననుల్ బంధులు మేదినీధరము లుద్యత్కీర్తితోఁ దోడు రా
మనమందుం బ్రమదంబు పొంగ దీవిషన్మాన్యుండు ధీరుం డెదు
ర్కొనె నీహారగిరీశ్వరుండు సుమనఃకోదండసంహారునిన్. 90

వ. ఇట్లెదుర్కొని తుషారగిరీశ్వరుండు మేనకాదేవి పసిండిపాత్రంబుల జలంబు వోయ సురాసురకిరీటమణిశాణోత్తేజితంబు లగుపురాసురాంతకునిపదంబులు గడిగి కన్యాదానం బొనరించె నంతం దుషారగిరికన్యకాశంకరులు సంకల్పసిద్ధి వడసిరి నిర్వృత్తపాణిగ్రహణమహోత్సవులై భవానీభర్గులు భక్తిభావనావశంవదులై బ్రహ్మాసనాసీనుం డగుపితామహునకుం బ్రణమిల్లిరి చతురంతవేదికామధ్యాధ్యాసీనులై పార్వతీసర్వజ్ఞులు లౌకికం బైనయార్ద్రాక్షతారోపణం బనుభవించి రంత. 91

సీ. అమృతబిందువులు పై నందంద చిలుకంగఁ బద్మాతపత్రంబుఁ బట్టెఁ గమల
కళ్యాణసమయార్హగద్యపద్యంబులఁ గైవార మొనరింపఁ గడఁగె వాణి
రంభోర్వశీముఖ్యజంభారివనితాళి తూర్యత్రయంబునఁ దోడు సూపె
మందాకినియును గాళిందియు నిఱుచక్కి రమణఁ బై వింజామరంబు లిడిరి
తే. వేళ యెఱిఁగి మహేంద్రాదివిబుధగణము, ముకుటముల హస్తపల్లవములు ఘటించి
వేఁడుకొనిరి మహాదేవు వినతు లగుచుఁ, జిత్తసంభవునకుఁ బునర్జీవనంబు. 92

సీ. సంబంధబాంధవసరదనుగ్రహముచే నచలాధిపతిఁ జరితార్థుఁ జేసి
కందర్పుఁ దొల్లింటికంటె నున్నతుఁ జేసి రతిదేవిహృదయవైరాగ్య ముడిపి
పెండ్లికి వచ్చిన బృందారకుల నెల్ల వివిధసంభావన వీడుకొలిపి
ప్రమథవర్గము నికుంభప్రధానమ్మును బేతాళడాకినీవితతి ననిచి
తే. కనకకలశాదిభక్త్యలంకారయుతము, నైనకౌతుకరత్నగేహంబు సొచ్చి
పార్వతియుఁ దాను నీహారభానుమాళి, పవ్వళించెను ముదమునఁ బాన్పుమీఁద. 98

వ. అనంతరంబ గంగాధరుండు భృంగిరిటవికారంబుల నిగూఢంబుగా నవ్వించియుఁ బాదసాంత్వనపరిగ్రహంబున మందమందాక్షసారంబుగా రచించియు గాఢాలింగనంబులును నీవీబంధస్పర్శనంబులును బింబాధరచుంబనంబులును నఖాంకురవ్యాపారంబులును దంతక్షతవేదనాప్రపంచితకిలికించితంబులును వెలయ బాహ్యాంతరోత్సవప్రదేశంబులు సంధించి మన్మథుం గృతార్థుం జేసి యనేక కాలంబు పరమానందంబుఁ జెంది శతానందముకుందపురందరాదులకు హితంబుగ సుతుం గాంచి యాంబికే యుండును గాంగేయుండును గార్తికేయుండును షాణ్మాతురుండును ననునక్కుమారునివలనఁ దారకాసురు వధియింపించి మహాదేవుండు లోకంబు లన్నియు రక్షించె నిది గౌరీకళ్యాణము. 94

క. ఈగౌరీకళ్యాణము, భోగీంద్రధరాపదానపుణ్యశ్రుతిధీ
ర్యాగము దీనిం జదివిన, భోగము మోక్షమును గలుగు భూజనములకున్. 95

ఆశ్వాసాంతము

చ. కొమరగిరిక్షమారమణకుంజరచారువసంతవైభవ
క్రమసముపార్జితాభినవగంధహిమాంబుకురంగనాభికుం
కుమఘనసారసంకుమదకుంభమనోహరగంధపాళికా
సముదయసార్వభౌమ! కవిసంఘమనోభవకల్పకద్రుమా! 96

క. కరదీపదానబిరుదా, భరణా! కావేరివల్లభా! సుగుణనిధీ!
శిరియాళవంశశేఖర!, హరచరణస్మరణపగిణతాంతఃకరణా. 97

పంచచామరము.—
హరాట్టహాసమల్లికాశశాంకశంకరాచలా
మరాపగాసరస్వతీసమానకీర్తిమండలా!
కురంగనాభిగంధసారకుంకుమాదివాసనా
పరంపరావితీర్ణశస్తభవ్యహస్తపల్లవా! 98

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర వినయవిధేయ శ్రీనాథ
నామధేయప్రణీతం బయినహరవిలాసం బనుమహాప్రబంధంబునందుఁ
జతుర్థాశ్వాసము.